రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జూన్ 2017, శుక్రవారం

రివ్యూ!

రచన – దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం :  వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవరాల, అడవి శేష్‌., ఈషా, అదితి, శ్యామలా దేవి, నికెళ్ల ణి దితరులు
సంగీతం:  ణిశర్మ , ఛాయాగ్రణం:  పీజీ విందా 
బ్యానర్ :  గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ 
నిర్మాతలు :  కె.సి. సింహారావు, వినయ్
విడుద :  జూన్ 9, 2017
***
          ‘అష్టాచెమ్మ’  తో దర్శకుడుగా రంగ ప్రవేశం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ, ‘అమీతుమీ’ తో ఇంకోసారి తన శైలిలో కామెడీని అందించాలనుకున్నారు. రచనా చమత్కృతులతో ఆధునిక జంధ్యాలలా కన్పించే ఇంద్రగంటి, తన జంధ్యాల షేడ్స్ తో సంబంధం లేని  ‘బందిపోటు’,  ‘జంటిల్ మేన్’ లాంటి యాక్షన్ సినిమాలు కూడా తీశారు. కానీ యాక్షన్ సినిమాలకంటూ తనదైన ఒక శైలిని సృష్టించుకోలేకపోయారు. ఇప్పుడు ‘అమీ తుమీ’ తో మాత్రం  తిరిగి తన స్వచ్ఛమైన సహజశైలి హాస్యధోరణిలో కొచ్చేశారు. నాటు మోటు కామెడీలతో కలుషితమైన క్రియేటివ్ రంగంలో ఆరోగ్యకర హాస్యాన్ని  నిలబెట్టాలంటే చాలా  క్రియేటివ్ పవర్ వుండాలి. దీన్ని ఎలా వాడుకున్నారు, ఏం చేసి అమీతుమీ తేల్చుకున్నారు ఈ కింద చూద్దాం. 

కథ 

         జనార్ధన్ (తనికెళ్ళ భరణి) అనే వొక మనీ పవర్ వున్నవాడి కూతురు దీపిక (ఈషా), కొడుకు విజయ్ (అవరాల శ్రీనివాస్) ల ప్రేమవ్యవహరాలు గిట్టవు.  దీపిక డబ్బులేని అనంత్ (అడవి శేష్) ని ప్రేమిస్తే, విజయ్ డబ్బున్న మాయ (అదితి) ని ప్రేమిస్తూంటాడు. ఈమె  తండ్రి గంగాధర్ తో జనార్ధన్ కి వైరం వుంటుంది. కాబట్టి కొడుకు పెళ్ళికి ఒప్పుకోడు జనార్ధన్. కూతురు దీపిక పెళ్లి వైజాగ్ లో డబ్బున్న శ్రీ చిలిపి ( వెన్నెల కిషోర్) తో జరపాలని ఆమెని గదిలో బంధించి,  శ్రీ చిలిపిని  పెళ్లి చూపులకి రమ్మంటాడు. అడ్డుగా వున్న కొడుకు విజయ్ ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. పెళ్లి చూపులకి  శ్రీ చిలిపి వచ్చేలోగా పనిమనిషి కుమారి ( శ్యామలా దేవి) సాయంతో దీపిక పారిపోతుంది. ఈ విషయం జనార్ధన్ కి తెలీదు. అటు విజయ్ ప్రేమిస్తున్న మాయ కూడా  సవతి తల్లి పోరుతో ఇంట్లోంచి పారిపోతుంది. ఇప్పడు దీపికతో పెళ్లి చూపులకి శ్రీచిలిపి దిగుతాడు. దీపిక లేని ఇంట్లో దీపిక అనుకుంటూ ఇతడికి పెళ్లి చూపులు ఎవరితో  జరిగాయి, ఆ పెళ్లి చూపులతో ఆమెని లేపుకెళ్ళి  తను కూడా ఏం చేశాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       రెండు జంటల మధ్య ఇంకొకడు వచ్చి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ని సృష్టించే రొటీన్ కథే ఇది. అయితే ఇది మూస కథనాన్ని వదిలించుకుని కాస్త నటనలతో, మాటలతో కొత్త పుంతలు తొక్కడంతో ఒక అరుదైన రోమాంటిక్ కామెడీగా మారింది. అరుదైన రోమాంటిక్ కామెడీ అనడం ఎందుకంటే, తెలుగులో విజయవంతమైన రోమాంటిక్ కామెడీలు రావడం ఎప్పుడో మానేశాయి. జానర్ మర్యాద తప్పి రోమాంటిక్ కామెడీలు  సగం కథనుంచి రోమాంటిక్  డ్రామాలుగా ప్లేటు ఫిరాయిస్తూ వుండడంతో, ఇంతవరకూ అవి అపజయాల్నే మూట గట్టుకున్నాయి. ‘అమీ తుమీ’ అలా కాదు- రోమాంటిక్ కామెడీ జానర్ మర్యాదని ఆద్యంతం కాపాడుకుంటూ, మోస్ట్ ఫన్నీ ఎంటర్ టైనర్ గా తయారయ్యింది.  రెండు గంటల సేపు సత్కాలక్షేపాన్నిచ్చే  క్లీన్ కామెడీగా నిలబడింది. ఈ కథకి రచనా బలం, నటనా బలం ఇవే వెన్నుదన్నుగా నిలిచాయి. 

ఎవరెలా చేశారు 
      అడివి శేష్,  అవసరాల శ్రీనివాస్ లు ఇందులో హీరోలుగా కన్పిస్తున్నా మొత్తమంతా మోసింది వెన్నెల కిషోరే.  బహుశా ఒక కమెడియన్ పుల్ లెంత్ పాత్రతో ఆద్యంతం రక్తికట్టించగల్గడం ఇదే. కిషోర్  చాలా సంయమనంతో కామెడీ అదుపుతప్పి ఒవరాక్షన్ తో సర్వనాశనం చేయకుండా, ‘రిచ్’  గా నటించాడనే చెప్పాలి.  కామెడీ అభినయం ‘రిచ్’ గా వుంటే ఎంత రుచిగా వుంటుందో పూర్తి స్థాయిలో ప్రయోగం చేసి చూపించే అవకాశం అతడికి లభించింది.  శ్రీ చిలిపి క్యారక్టర్ ని తన కెరీర్ లో మరపురాని పాత్రగా మల్చుకున్నాడు. ఎంత సేపు హంగామా చేసినా ఒక్క క్షణం బోరుకొట్టకుండా కామెడీని నిభాయించడం అతడికే చెల్లిందని చెప్పుకోవచ్చు. ఈ కథంతా స్పీడుగా పరుగెత్తే కామెడీయే. ఈ స్పీడులో టైమింగ్ తో అతను  ఫాస్టుగా చెప్పేసే తెలుగింగ్లీషు డైలాగులు కూడా యాక్షన్ ప్రవాహంలో కలిసి సాగిపోతాయే తప్ప అడ్డుపడవు, ఒడ్డున పడవు. పూర్తిగా ఈ కామెడీ  వెన్నెల కిషోర్ షో. ఈ షోలో  అతను కన్పించడు, పాత్రే కన్పిస్తుంది.

          అడివి శేష్ లవర్ బాయ్ పాత్ర. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ తో కాంబినేషన్లో కొచ్చాకే తన కామెడీ చూపిస్తాడు. అలాగే అవసరాల పాత్ర నిడివి అడివి శేష్ కంటే తక్కువే. తను సపోర్టింగ్ కామెడీ నందిస్తాడు. తెలంగాణా పాత్రలో ఎంతవరకు ఒదిగాడనేది చెప్పడం కష్టమే. ఫస్ట్ హీరోయిన్ ఈషా తెలంగాణా పాత్ర, పాత్ర తాలూకు మొరటుతనం ఆమెకి ప్లస్ అవుతాయి. పనిమనిషి కుమారి పాత్రలో శ్యామలా దేవి  పూర్తి  నిడివి తెలంగాణా కామెడీ పాత్ర ఇంద్రగంటి పర్యవేక్షణలో  ఇంకో ఎస్సెట్ సినిమాకి.

          ఇక తొండి తెలంగాణా పాత్రలో తనికెళ్ళ భరణి చెప్పనవసరం లేదు. అయితే ఎక్కువసార్లు తనది లౌడ్ కామెడీయే. అలాగే రెండో హీరోయిన్ అదితి మైనస్. 

          పిజి విందా ఛాయాగ్రహణంతో మంచి ప్రొడక్షన్ విలువలున్న ఈ రోమాంటిక్ కామెడీలో రెండే పాటలున్నా (సెకండాఫ్ లోనే) మణిశర్మ తన పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టారు. రెండూ సిట్యుయేషనల్ సాంగ్సే . సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. మార్తాండ్ వెం కటేష్  షార్ప్ ఎడిటింగ్ తో కథనం స్పీడు పెరిగింది. అయితే ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్- శ్యామలా దేవిల మొదటి సీను కేవలం డైలాగులతో సుదీర్ఘంగా సాగి సహనాన్ని పరీక్షించకుండా షార్ప్ చేయాల్సింది.

చివరికేమిటి 
        రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ  రోమాంటిక్ కామెడీని రోమాంటిక్ కామెడీ దారిలో పెట్టారు. నటనలు, మాటలు రెండే ఈ రొటీన్ రోమాంటిక్ కామెడీని నిలబెడ తాయని నమ్మినట్టుంది. ఆనాడు హిట్టయిన రోమాంటిక్ కామెడీ ‘నువ్వేకావాలి’ నటనలు, మాటలే, ఇటీవల హిట్టయిన రోమాంటిక్ కామెడీ ‘హేపీ భాగ్ జాయేగీ’  నటనలు, మాటలే. ఈ ప్రయత్నంతో  స్క్రిప్టంతా మాటలతో నింపేశారు. సీన్లు తక్కువే, మాటల  ప్రవాహంవల్ల వాటి నిడివి  ఎక్కువ. ఈ మాటల  రచన అత్యున్నత స్థాయి క్రియేటివిటీ. ప్రపంచ పోకడలని, పరిణామాలనీ గమనించి సినిమాటిక్ గా  విసిరిన అక్షర తూణీరాలు. లేకపోతే  తాటి కల్లుని ఆర్గానిక్ స్కాచ్ అనడమేమిటి? పెళ్లి చూపుల్ని సర్జికల్ స్ట్రైక్ అనడమేమిటి? ఇక సినిమాల్లో తెలంగాణా యాసకి కూడా కొత్త టచ్ ఇచ్చారు. ధారాళంగా ఉర్దూ పదాలు కలిసిన యాసతో నేటివిటీకి దగ్గరగా తీసికెళ్ళే ప్రయత్నం చేశారు. కొన్ని తెలంగాణా తెలుగు పదాలు కూడా ఇంతవరకు  సినిమాల్లో వాడనివే.  ఆయన క్లాస్, మాస్ అనుకుంటూ- ఆంధ్రా, తెలంగాణా ప్రేక్షకులనుకుంటూ, గిరిగీసుకుని కూర్చోలేదు. ఫ్రీ స్టైల్ మూవీ మేకింగ్ చేశారు. ఆంధ్రా తెలంగాణా ముఖ్యపాత్రలతో దీన్నొక  ప్రప్రథమ మోడల్  ‘అంతర్రాష్ట్ర’ మూవీగా తీర్చి దిద్దారు. పాత్రలు  ప్రాంతాల్ని ప్రస్తావించుకోకుండానే అంతా  ఒకటే అన్నట్టు వుంటాయి. 

          ఐతే రెండే బలహీనతలు వున్నాయి. ఎత్తుగడ, విశ్రాంతి ఘట్టం. ప్రారంభం చాలా  స్లోగా, అనాసక్తి కరంగా భయపెడుతూ ప్రారంభమవుతుంది- అడివి శేష్, ఈషాల దొంగ చాటు ప్రేమల తో...అవసరాల, అదితి ల దొంగచాటు ప్రేమలతో మరికొన్ని సీన్లు- తనికెళ్ళ అరుపులు – వీటన్నిటితో  అరగంట పాటు ఇంద్రగంటి ప్రశ్నార్ధక మవుతారు. అరగంట తర్వాత వెన్నెల కిషోర్ వచ్చాకే రచనతో, దర్శకత్వంతో ఇంద్రగంటి బిజీగా మారిపోతారు.  ఇక్కడ్నించీ అందరి నటనలూ వూపందుకుంటాయి. స్ట్రక్చర్ మీద అంతగా దృష్టి పెట్టకుండా కొత్త  డైలాగుల్ని కనుగోనడంలోనే సర్వశక్తులూ ఒడ్డడం వల్ల – ఎత్తుగడతో బాటు ఇంటర్వల్ సీను కూడా మూగబోయింది. ఈ పేలవమైన సీను ని తనికెళ్ళ పాత్రచేత ఆహా ఓహో ఇంటర్వెల్  సీను అని పొగిడించుకోవడంతో  బాగా అభాసయ్యింది. సెకండాఫ్ ప్రారంభంలో కూడా  స్క్రీన్ ప్లేని వెన్నెల పక్క పాత్ర చేత పొగిడించుకున్నారు ఇంద్రగంటి.  ఇలా మాస్ రైటర్ పనులు కూడా చేశారు. 

          ఓడ్ హౌస్ నవలల్లో లాగానో, ముళ్ళపూడి కథల్లో లాగానో సినిమాల్లో అందమైన కథా  ప్రపంచాలు అరుదుగా వుంటాయి. ఇంద్రగంటి కామెడీ తీస్తే అది ఓడ్ హౌస్ కథా లోకమో, ముళ్ళపూడి కథా లోకమో అన్నట్టుగా వుంటుంది-  కానీ కాలం చెల్లినట్టుగా వుండదు.  ‘అమీతుమీ’ ని అలాటి వొక తాము ఇరుక్కున్న కామిక్ రొంపి లోంచి బయటపడేందుకు మరిన్ని హస్య ప్రహసనాలు సృష్టించుకునే ‘అమాయక’ పాత్రల స్ట్రగుల్ గా చూపించారు. అంతే పకడ్బందీగా నటింపజేశారు. స్పీడుకి పెద్ద పీట వేశారు.


-సికిందర్
http://www.cinemabazaar.in