రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, December 23, 2025

1406 : స్క్రీన్ ప్లే సంగతులు -2

 ఆంధ్రా కింగ్ తాలూకాస్క్రీన్ ప్లే సంగతులు మొదటి భాగానికి వస్తున్న రెస్పాన్స్ లో - ఇంటర్వెల్ సీనులో హీరో  సాగర్ డైలాగులతో చేసే పాతకాలపు ఛాలెంజిని క్యాన్సిల్ చేసిసైంటిఫిక్ మెథడ్ లో విజువల్ గా ఎండ్ పిక్చర్ చూపిస్తే, అది ప్రేక్షకుల సబ్ కాన్షస్ మైండ్ ని ఎలా ప్రభావితం  చేస్తుందో ఇచ్చిన వివరణకి ఎక్కువ ఇన్స్ స్పైర్ అయ్యారు రీడర్స్.  మానసిక శాస్త్రం, స్క్రీన్ ప్లే శాస్త్రం ఒకటే. రెండిటి స్ట్రక్చర్ ఒకటే. రాసే స్క్రీన్ ప్లేలో మానసిక శాస్త్రం కనిపిస్తే కథకి సోల్ పుడుతుంది. వెండి తెర మీద ఈ సోల్ ఫీలయితే కథకి అతుక్కుని పోతారు ప్రేక్షకులు. కాకపోతే కథా కథనాలు, పాత్ర చిత్రణలు అంతే శాస్త్రీయంగా వుండాలి. ఇదంతా స్ట్రక్చర్ స్కూలు తెలిస్తే సాధ్యమవుతుంది. కేవలం క్రియేటివ్ స్కూల్ వల్ల ఆశాభంగాలే ఎదురవుతాయి. కానీ సినిమా కథలన్నీ తయారయ్యేవి క్రియేటివ్ స్కూల్లోనే. ఇదే సక్సెస్ శాతాన్ని (8%) పెరగకుండా చేస్తోంది.  

 రే, ఇప్పుడు సెకండాఫ్ కొస్తే, ముందు దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో, అంటే క్రియేటివ్ స్కూల్లోనే, కథ ఇంకెలా కొనసాగిందో చూసేసి, ఈ పాయింటాఫ్ వ్యూ తో సమస్యలేంటో చివర గుర్తు చేద్దాం...

B (2) : సాగర్ సైకో ఎనాలిస్ -2  

మహాలక్ష్మి వేరే పెళ్ళికి సిద్దమైపోయినట్టూ సెకండాఫ్ ని ప్రారంభించడం కంగారు పుట్టించే మంచి ఎత్తుగడే. సాగర్ మోసం చేశాడు కనుక ఈ పెళ్ళి చేసుకుంటున్నానని తన దగ్గరికి వచ్చిన సూపర్ స్టార్ సూర్యకి ఆమె చెబితే, తలెత్తే ప్రశ్నలు : ఎందుకు మోసం చేశాడు? ఎలా చేశాడు? ఇలా ఆసక్తి రేకెత్తిస్తూ ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళాక- ఏముంది, ఇంటర్వెల్లో సాగర్  చేసిన వెర్బల్ ఛాలెంజితో టెంప్లెట్ కథే. ఈ ఛాలెంజీని కూడా సరీగ్గా సెటప్ చేయలేదు. దీంతో సెకండాఫ్ లో దీని పే ఆఫే కాదు సరికదా, మొత్తం సెకండాఫ్ కథే ఎందుకూ పనికి రాకుండా పోయింది!

ఏంటీ ఛాలెంజీ అనే సెటప్ లో జరిగిన పెద్ద లోపం? అసలీ ఛాలెంజీకి ఏమాత్రం అవకాశం లేని ఇంకో సంఘటన జరిగిందక్కడ. దీన్ని తర్వాత చూద్దాం. ముందుగా ఛాలెంజీ సంగతి చూస్తే ... చేసిన ఛాలెంజీ ప్రకారం సాగర్ ఫలానా ఇంత కాలంలో థియేటర్ కట్టి చూపిస్తానని డెడ్ లైన్ ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఆ డెడ్ లైన్ అవసరం లేదు పురుషోత్తంకి. పది రోజుల్లో కట్టుకుంటావో, పదేళ్ళకి కట్టుకుంటావో కట్టుకో- నా  కేంటి? నా కూతురి పెళ్ళి నేను చేసేస్తా - అనేసి పెళ్ళి చేసేస్తూంటే ఏం చేస్తాడు సాగర్? సాగర్ ఏక పక్షంగా ఛాలెంజి చేశాడే తప్ప, ఇద్దరి మధ్య ఒప్పందం ఏదీ పురుషోత్తం కట్టుబడి వుండడానికి? ఇదన్న మాట. ఈ లోపం మొత్తం సెకండాఫ్ నే ఎలా దెబ్బ తీసిందో తర్వాత చూద్దాం
***
ముందుగా అసలీ  ఛాలెంజీ చేయడానికి  ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఏమిటంటే, ఈ ఛాలెంజీ చేసిన ఈ ఇంటర్వెల్ సీన్లోనే ముందుగా సాగర్ తో కలిసి సినిమా చూస్తున్న మహాలక్ష్మి,  అతడితో లిప్ లాక్ ట్రై  చేస్తూంటే వాళ్ళిద్దరి నీడలు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి వెండితెర మీద కన్పించి గగ్గోలు పుడుతుంది. అప్పుడే వచ్చిన పురుషోత్తం ఈ దృశ్యం కళ్ళారా చూస్తాడు. సాగర్ - మహాలక్ష్మిల లిప్ లాక్ ఎపిక్ సీను. దీంతో పురుషోత్తం రెచ్చిపోయి సాగర్ ని ఎడాపెడా కొడతాడు. అప్పుడు సాగర్ ఆ ఛాలెంజీ చేస్తాడన్న మాట,

ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కి లిప్ లాక్ సీనే వేశాక, కాన్ఫ్లిక్ట్ కి ఇంకా వేరే ఛాలెంజీ అవసరమేముంది? కథకి రెండు కాన్ఫ్లిక్టులు ఎలా సృష్టిస్తారు? లిప్ లాక్ అప్పుడే సాగర్ ఇలా అనొచ్చు- ‘మా ఇద్దరి లిప్ లాక్ సీను థియేటర్ లో అందరూ చూశారు. ఊరంతా టాం టాం అయిపోతుంది. నీ కూతుర్ని ఇంకెవరు పెళ్ళి చేసుకుంటారు? కాబట్టి నాకిచ్చి  పెళ్ళి చెయ్’  అంటే ఏం చేస్తాడు పురుషోత్తం? సాగర్ కి సింపుల్ గా గెలుపే కదా? దీన్ని పక్కనబెట్టి కాన్ఫ్లిక్ట్ కి వేరే ఛాలెంజీ ఏమిటి? అంటే మొదటిదే (లిప్ లాక్) కాన్ఫ్లిక్ట్ అని గుర్తించలేదు దర్శకుడూ, ఈ కథ ఓకే చేసిన ఇతరులూ!

ఇంకోటేమిటంటే, సాగర్ తో లిప్ లాక్ తో అలా ప్రేమలో ముందుకు ప్రొసీడైపోయిన మహాలక్ష్మి, ఈ గలభా జరుగుతునప్పుడు సీనులో కనిపించదు! సీనుకి అడ్డమని తప్పించేసినట్టుంది. ప్రేమ కథలో ముఖ్యమైన ఘట్టంలో తను కూడా స్టేక్ హోల్డరైన పాత్రని (ఇక్కడ మహాలక్ష్మిని) సీనుకి అడ్డమని తప్పించేయడం ఏ సినిమాలోనైనా జరిగిందా? స్టేక్ హోల్డర్ కాకుండా రోమాన్సుకి, పాటలకీ పరిమితమైతే ఆ హీరోయిన్ని సెకండాఫ్ వచ్చేసరికి కట్ చేసి పారేసే సినిమాలున్నాయి.  ఇది వేరు. స్టేక్ హోల్డర్ ని కట్ చేయడమేమిటి? సీనులో మహాలక్ష్మి కూడా వుంటే ఆమె తండ్రిని వ్యతిరేకించి అప్పటికప్పుడే సాగర్ తో వెళ్ళి పోతుందనా? అప్పుడీ కథకి ప్రధాన పాయింటుగా పెట్టుకున్న, సాగర్ థియేటర్ కట్టి చూపించే  ఛాలెంజీకి ఛాన్సు వుండదనా? అలాంటప్పుడు అసలా లిప్ లాక్ సీనే ఆలోచించకూడదు. ఇన్ని తప్పిదాలు చేస్తూ పోతే ప్రేక్షకులు ఈజీగా తీసుకుని చూస్తారా? ‘రాపో’ రామ్ గనుక ఇలా స్టోరీలు ఓకే చేస్తూ పోతే (ఇది వరసగా ఆరో ఫ్లాప్!) అతడి స్టార్ డమ్ మీద విశ్వసనీయత నశించి, అతడి సినిమాలు చూడాలంటే జంకుతారు ప్రేక్షకులు.
***
అసలు ఈ కథ జరుగుతున్న 2002 లో లిప్ లాకులున్నాయా? ఉంటే అప్పటి సినిమాల్లో చూపించారా? ఫస్టాఫ్ లో సాగర్ థియేటర్ అద్దాలు పగులగొట్టడం, అప్పుడు లోపలున్న మహాలక్ష్మి కనిపించి ప్రేమలో పడ్డం వంటి రెండు పరస్పర విరుద్ధ ఆలోచనలతో ఆ సీను ఎలా విఫలమయ్యిందో గమనించాం. అలాగే ఇప్పుడు ఈ లిప్ లాక్ సీను -  ఛాలెంజీ సీను అనే పరస్పర విరుద్దంగా పనిచేసే పరిణామాలు ఇంటర్వెల్ సీనులో వున్నాయి. ఇలా ప్లాట్ పాయింట్ వన్ సీను, ఇంటర్వెల్ సీనూ అనే రెండు మలుపులూ ఇంత కన్ఫ్యూజింగ్ గా వుంటే ఇక కథ ఎక్కుడుంటుంది. ఇన్ని  చిక్కులుముడులన్నీ విడదీసి స్క్రీన్ ప్లే సంగతులు రాయడమంటే పెద్ద పరీక్షే!

B (2) : సాగర్ సైకో ఎనాలిస్ -2 కంటిన్యూ


సరే, ఛాలెంజీకి అడ్డమొస్తున్న లిప్ లాక్ సీనుని ని ఈజీగానే తీసుకుని పక్కన బెట్టి, అలాగే ఈ కీలక సీనులోంచి మహాలక్ష్మిని తప్పించేయడాన్నీ కూడా దర్శకుడ్ని క్షమించి ఈజీగానే తీసుకుని చూసినా, ఈ  ఛాలెంజీ కూడా ఎలా అర్ధం పర్ధం లేకుండానే తయారయ్యిందో పైన చూశాం.

ఇలా ఒక డెడ్ లైన్, ఓ ఒప్పందమూ లేని ఉత్తుత్తి ఛాలెంజీని పట్టుకుని సాగర్ గుడ్డిగా థియేటర్ కట్టేందుకు చేసే ప్రయత్నాలు టెంప్లెట్ లో ఈజీగా జరిగిపోతూంటాయి. ఛాలెంజీకి ప్రేక్షకుల నిజ జీవితం ఒప్పుకోని మూస ఫార్ములా టెంప్లెట్ లో విజయాలు చూపడం ఇంకా వర్కౌటవుతాయా?  బ్యాంకు లోను కోసం చేసే ప్రయత్నం కామెడీ సీనుగా చేసి చూపించినప్పుడే ప్రేక్షకుల్ని ఎంత ఈజీగా తీసుకుంటున్నారో అర్ధమైపోతోంది.

టూరింగ్ టాకీస్ పెట్టడం, దాన్ని రంగా కాల్చేస్తే ఇసుక అమ్మకాలు మొదలెట్టడం - ఈ ప్రాసెస్ కూడా బడ్జెట్ కి వేస్టుగానే వుంది.  అసలు రంగా టూరింగ్ టాకీసు తగులబెట్టడం ఎందుకు- వెళ్ళిపోయి చెల్లెలి పెళ్ళేదో చేసేస్తే సరిపోయేదానికి - సాగర్ తో ఏ ఒప్పందమూ లేనప్పుడు? కాబట్టి ఈ టూరింగ్ టాకీసు సెట్ ని నిర్మించే, తగులబెట్టే ఖర్చుకూడా వేస్టే అయిందేమో

రెండోది, అసలా లంకలో ఏముందని, ఎవరొస్తారని అంత పెద్ద థియేటర్ కడతాడు? సరే, కట్టాక అటు సూర్య సినిమా ఆగిపోయి 3 కోట్లు అవసరపడితే, పురుషోత్తంకే థియేటర్ ని అమ్మకానికి పెట్టి, బదులుగా మహాలక్ష్మిని వదులుకుంటానని  త్యాగం చేయబోవడం అర్ధవంతమైన సీనేనా? పురుషోత్తం ఆ థియేటర్ ని ఎందుకు కొంటాడు? సాగర్ కూతుర్ని వదులుకుంటాడనా? సాగర్ తో ఏ ఒప్పందమూ లేకపోయినా అసలు కూతుర్ని పెట్టుకుని ఇంత కాలం ఎందుకున్నాడు పురుషోత్తం, వేరే సంబంధం చేసెయ్యక? సాగర్ ఛాలెంజీ పూర్తి చేసుకుని వస్తే అతడికే ఇచ్చి చేద్దామనా? ఒకవేళ సాగర్ థియేటర్ కట్టి ప్రయోజకుడైతే అప్పుడు పెళ్ళి చేద్దామని ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ సీను దగ్గర్నుంచీ ఇందుకే మౌనంగా వున్నాడా? మంచిదే, ప్రేమికుల్ని విడదీయకూడదన్న ఆలోచన మంచిదే. కానీ అతడికి ఈ ఆలోచన వున్నట్టు ఎక్కడా వెల్లడి చేయలేదే?

మరెందుకు సాగర్ ఇప్పుడొచ్చి కూతుర్ని వదులుకుంటానంటే పురుషోత్తం థియేటర్ కొనడానికి సిద్ధమయ్యాడు? కూతురేమైనా సాగర్ ఆధీనంలో వుందా డబ్బు కట్టి విడిపించు కోవడానికి? సరే, సాగర్ థియేటర్ కట్టి ప్రయోజకుడైతే అప్పుడు కూతుర్ని ఇద్దామని ఆగాడే అనుకుందాం. ఇప్పుడు సాగర్ డబ్బు అవసరపడి థియేటర్ అమ్మకానికి పెడితే- వద్దు, నువ్వు థియేటర్ కట్టి ప్రయోజకుడ వయ్యావ్, నీకిప్పుడు అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తా, సూర్య కవసరమున్న 3 కోట్లూ నేనే సర్దుతా’- అని చెప్పినా ఒక అందం చందం. అసలు వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్  ఇంత కన్ఫ్యూజింగ్ గా వుంటే, ఇప్పుడు  ప్రేమలో సాగర్ చేసే త్యాగం అనే బిల్డప్ సీను ఎలా పండుతుంది. అందుకని త్యాగం లేదు ఏం లేదు, ద ర్శకుడు మాయలో పడి అలా ఫీలైపోయి, ప్రేక్షకుల్ని మాయ చేయడం తప్ప.  ఇందుకే ఈ సీను ఫ్లాపయ్యింది- ఇలా ఇంటర్వెల్లో ఛాలెంజీని  సరిగ్గా సెటప్ చేయకపోవడంతో, ఇప్పుడు ఇదే ఫ్లాపైన త్యాగమనే పే ఆఫ్ తో, క్లయిమాక్స్ లో సూర్య - సాగర్ ల మధ్య కథకి పతాక సన్నివేశంలో  ఎమోషనల్ సీను కూడా ఫ్లాపయ్యింది!

B (2) : సాగర్ సైకో ఎనాలిస్ -2 కంటిన్యూ (క్లయిమాక్స్)

సరే, ఛాలెంజీకి అడ్డమొస్తున్న లిప్ లాక్ సీనుని ని ఈజీగానే తీసుకుని పక్కన బెట్టి, అలాగే ఈ కీలక సీనులోంచి మహాలక్ష్మిని తప్పించేయడాన్నీ కూడా దర్శకుడ్ని క్షమించి ఈజీగానే తీసుకుని చూసినా, ఈ  ఛాలెంజీ కూడా ఎలా అర్ధం పర్ధం లేకుండానే తయారయ్యిందో పైన చూశాం. 

చివరికి సూర్య భారీ తుఫాను వర్షంలో సాగర్ ని కలుసుకోవడానికి థియేటర్ కి చేరుకుంటాడు. ఈ వర్షం అనేది పగలు సూర్య ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచీ వుంటుంది. ఈ  క్లయిమాక్స్ సీనుకి  భారీ తూఫాను వర్షం అవసరమనుకుని మొదట్నుంచీ వర్షాన్ని చూపించుకుంటూ వచ్చారు. అయితే ఈ వర్షం అనేది కథకి దేనికవసరంలంక  మునిగిపోయి ఆ ప్రజలు థియేటర్ లో ఆశ్రయం పొందాలనాఇది కథకే విధంగా ఉపయోగ పడిందిథియేటర్ లో క్రిక్కిరిసి తల దాచుకున్న లంక వాసుల కష్టం  చూసి ఈ క్లయిమాక్స్ లో సూర్య గానీలేదా సాగర్ గానీ స్పందించి థియేటర్ ని లంక వాసుల పునరావాస కేంద్రంగా అంకితం చేసే అవకాశం లేదుగాథియేటర్ కొనుక్కున్నది పురుషోత్తం. అతను కూడా ప్రకటన చేయలేదు. కేవలం క్లయిమాక్స్ లో సూర్య- సాగర్ ల మధ్య ఎమోషనల్ సీను లంక వాసుల మధ్య ప్రదర్శనగాగంభీరంగా వుండాలన్నట్టు మాత్రమే భారీ వర్షం కురిపిస్తూ వచ్చినట్టుంది. చివరికి ఇది కూడా బడ్జెట్ కి…??  అనుక్షణం  ఎలర్ట్ గా వుంటూ స్క్రిప్టు చేయకపోతే, బడ్జెట్ ఎన్నిసార్లు వృధాగా జేబులు ఖాళీ చేయిస్తుందో పదేపదే ఈ సినిమా హెచ్చరిస్తోంది. 

***

సరే, ఇలా ఈ థియేటర్ లో మొదటిసారి ఎదురెదురు పడ్డ సూర్య-సాగర్ ల మధ్య  భావోద్వేగాలు పెల్లుబికే సీను చూస్తే  - కథని ముగింపుకి తెస్తూ సాగర్ చేసిన త్యాగం ఆధారంగా నడిచే ఈ సీను - వెనుకటి సీన్లో త్యాగానికే అర్ధం లేదని తేలిపోయాక, దాంతో ఇప్పుడు ఈ సీనూ సహజంగానే కోస్తా తూఫానులో బెంగాల్ దాకా కొట్టుకుపోయింది! బెంగాలీ ప్రేక్షకులు ఇదేమిటా అని చూస్తూంటారు దాన్ని పట్టుకుని- ‘ది గాడ్స్ మస్ట్ బీ క్రేజీ’ లో ఆకాశంలోంచి వచ్చి పడిన ఖాళీ కోక్ బాటిల్ ని ఇదేమిటా అని చూసే అమాయక  గిరిజనుడిలా!
***
అసలు ఈ సీను ప్రారంభమే ఫ్లాపయ్యింది. ఎలాగంటే, అనుకోకుండా థియేటర్లోకి వచ్చేసిన సూర్యని చూసిన వెంటనే సాగర్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటని ప్రేక్షకులు ఆశిస్తారు? వయసులో చిన్నవాడైన సాగర్ వెళ్ళి సూర్య  పాదాలకి నమస్కరించాలని - ఈ కనీస సంస్కారాన్ని ఆశిస్తారు. కానీ అతను పాదాలకి నమస్కరించక పోవడంతో ఈ సీను ఫాలో అవడానికి అఫెండింగ్ గా వుంటుంది. చిన్నప్పుడు  నత్తితో తన దిక్కు తోచని జీవితానికి ఓ గేయంతో దారీ తెన్నూ కల్పించిన దేవుడతను. తర్వాత  తన అభిమాన సూపర్ స్టార్ అతను. ఇప్పుడు అతడి ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ తను. మనసులో ఎంత గౌరవం లేకపోతే  3 కోట్లు త్యాగం చేశాడు. అలాటి గాడ్ తన ముందు తొలిసారిగా ప్రత్యక్షమైతే  అమాంతం వెళ్ళి కాళ్ళ మీద పడడా? అసలీ కథలో ఏ పాత్రా ఏ పాత్రకీ విలువే  ఇవ్వడం  లేదు. పాత్రల మధ్యే ఫీల్ గుడ్ ఆలోచనల్లేవు, ఇక సినిమా ఎలా ఫీల్ గుడ్ మూవీ అవుతుంది?
***
రామ్ ఉపేంద్రకి గనుక పాద నమస్కారం చేసి వుంటే బాక్సాఫీసుకి రెండు లాభాలుంటాయి : ఒకటి, ఉపేంద్ర మీద ప్రేక్షకుల అభిమానం పెరుగుతుంది. మరింత అనురాగంతో అతడ్ని చూస్తారు. రెండు, అదే సమయంలో రామ్ మీద అభిమానం, గౌరవం పెరుగుతాయి- ఇలా ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లే సన్నివేశం సినిమాకే ప్లస్ అవుతుంది.

కాకుండా సాగర్ సూర్య ఎవరో అపరిచితుడైనట్టు, నేను నీకు 3 కోట్లు ఇచ్చాను అన్నట్టు  బింకంగా మాట్లాడతాడు. సాగర్ ప్రేమని వదులుకుని, థియేటర్ నీ అమ్ముకుని, ఎంతో త్యాగం చేశాడని సూర్య కదిలిపోయి- సూర్య నుంచి తనేం నేర్చుకున్నాడో చెప్తాడు. తన సినిమా ఆగిపోవడంతో ఇల్లమ్ముకోవడానికి జంకాడు తను, అదే సాగర్ చూస్తే తన కోసం అన్నీ వదులుకున్నాడుఇదీ సూర్యకి కలిగిన అవగాహన. కానీ ఇంటర్వెల్లో సాగర్ చేసిన తప్పుడు ఛాలెంజీ గురించి తెలుసుకుని వుంటేనీ త్యాగం తగిలెయ్య అని నాల్గు దులిపి వెళ్ళిపోయేవాడు!

ఈ కథ దర్శకుడే కాదు, ఆ పైన ఎందరెందరో విని ఇలా ఓకే చేసి వుంటారు. వాళ్ళందరికీ నమస్కారాలు!
***
ఇక సూర్య తిరిగి నగరానికి వెళ్ళిపోయి-ఇల్లు అమ్మకానికి పెట్టి సినిమాని పూర్తి చేద్దామని మేనేజర్ కి చెప్పేస్తాడు. మళ్ళీ జీరో నుంచీ స్టార్ట్ అవుతానంటాడు- అంటే అక్కడ సాగర్ ఎక్కౌంట్ లో వేసిన 3 కోట్లు సాగర్ కే పంపేశాడన్న మాట. ఇక జీవితంలో ఎంతో సాధించిన సాగర్ ఆ థియేటర్ తో, మహాలక్ష్మితో హేపీగా సెటిలవొచ్చు.

ఇలా ఇంటర్వెల్ లో చెల్లుబాటు కాని ఛాలెంజీ ఆధారంగా లోపభూయిష్టంగా నడిచే సెకండాఫ్, ఈ సినిమాకి చాలా పెద్ద సమస్యని సృష్టించి పెట్టింది. ఎక్కడా లాజిక్ అనేది లేకుండా, కథా కథనాలతో, పాత్ర చిత్రణలతో కూడా, ప్రేక్షకుల్ని ఈజీగా తీసుకుని చేస్తే, ఇలా పైపైన రాసేసి పైపైన తీసేసే సినిమానే తయారవుతుంది తప్పక.

కథకి ప్రధాన పాత్రయిన సాగర్ మెంటల్ మేకప్ / సైకో ఎనాలిసిస్ ఇంత అయోమయంగా వుంటే, ఫీల్ గుడ్ ఫీలింగ్ ఈ అయోమయంలోంచి వస్తుందా? ఈ సైకో ఎనాలిసిస్ ఇంకేదో అద్భుత కళాఖండపు సినిమాకి చేసినట్టు అన్నిపండిత కొలమానాల అస్త్రశస్త్రాలు అన్వయించి చేసింది కాదు- ఓ మామూలు కమర్షియల్ సినిమా కోరుకునే కనీసపు కామన్ సెన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. కామన్ సెన్సు కూడా లేకుండా ప్రేక్షకుల్ని ఈజీగా తీసుకుని, పెద్ద బడ్జెట్ సినిమాలని చిన్నా చితక సినిమాల స్థాయికి పడిపోయిన ప్రమాణాలతో తీయకూదడనే విజ్ఞప్తి.

సమస్యంతా మొదట  కాన్సెప్ట్ తో, ఆ తర్వాత ఫీల్ గుడ్- మాస్ జానర్ల కలబోతతోనే కాకుండా, దర్శకుడే చెప్పినట్టు, ఈ కథని ఒక బయోపిక్ గా చూసిన దృష్టితోనూ వుంది!  ఈ మూల ధాతువుల పాయింటాఫ్ వ్యూతో చూసినందుకే కథ దేనికీ చెందకుండా ఇలా తయారైంది. కాబట్టి  చివరిగా యింటాఫ్ వ్యూని పోస్ట్ మార్టం చేయాల్సుంటుంది...

C : దర్శకుడి పాయింటాఫ్ వ్యూ  సంగతులు :

ఇద్దరు ప్రముఖ స్టార్స్ క్రియేట్ చేయగల మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ ఎలా వుండాలి? దర్శకుడి పాయింటాఫ్ వ్యూ ఎలా వుంది? దర్శకుడి పాయింటాఫ్ వ్యూకి ప్రాతిపదిక ఏమిటి? ఏ కొలమానాలతో పాయింటాఫ్ వ్యూ ఏర్పడింది? ఈ సినిమా కథా కథనాలకి సమస్యంతా ఇక్కడే వుంది. దర్శకుడు తానేర్పర్చుకున్న పాయింటాఫ్ లో చూసినప్పుడు ముగింపు హృద్యంగా కన్పించింది. ఎంత హృద్యంగా వుందో పైన చూశాం. కమర్షియల్ మాస్ సినిమాని ఫీల్ గుడ్ మూవీగా కూడా అందించవచ్చన్న ఒక ఇన్నోవేషన్ కి ప్రయత్నించి -సఫలమో విఫలమో -ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాడనుకున్నాం. ఇది కూడా ఎలా వుందో చూశాం. కథకి పదేళ్ళ క్రితం తను ప్లాన్ చేసిన విధంగా, సాగర్ పాత్ర జీవితంగా, అనుకున్న ఫీల్ గుడ్ మూడ్ తో, అనుకున్న బయోపిక్ గా, తన పాయింటాఫ్ వ్యూ పెట్టుకుని, అందుకనుగుణంగా జాగ్రత్తగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడనుకున్నాం. ఇంకా  సాగర్ కథని ముగింపు తప్ప, ఫ్లాష్ బ్యాక్స్ తో చెప్పుకొచ్చి, భావోద్వేగాలతో బలమైన క్లయిమాక్స్ కి చేర్చాడనుకున్నాం. ఇంకా చాలా అనుకున్నాం. ఇవన్నీ స్టోరీ సిట్టింగ్స్ లో సాధారణ కంటికి పైపైన కనిపించే మంచి గుణాలే. ఈ ముసుగు తీసి చూస్తే సినిమా ఆశించిన విజయానికి సుదూరంగా వుండిపోయిన కారణాలన్నీ క్యూ కడతాయి.
***
ఈ కథని ఫీల్ గుడ్ - మాస్ జానర్ల బెండర్ గా, బయోపిక్ గా ప్రయోగాత్మకంగా తీయాలనుకున్నారు. జానర్ బెండర్ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఈ బయోపిక్ ఏమిటి? కల్పిత పాత్రతో బయోపిక్ వుంటుందా? సాగర్ ఎవరు, అతడి జీవిత కథని బయోపిక్ గా తీయడానికి? అతను ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి లాంటి రియల్ లైఫ్ క్యారక్టరా అతడి గురించి ప్రేక్షకులు విని వుండడానికి? ఆ ఆసక్తితో సినిమా చూసేందుకు రావడానికి? సాగర్ పూర్తిగా దర్శకుడి కల్పిత పాత్ర. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి?
బయోపిక్ నిజంగా సమాజంలో జీవించిన వ్యక్తులతో వుంటుందా, లేక రచయిత  సృష్టించే కల్పిత పాత్రతో వుంటుందా?

2019 లో ఇలాగే కల్పిత పాత్రతో బయోపిక్ అంటూ ‘నువ్వు తోపురా’ తీశారు. కోమాకుల సుధాకర్ హీరో. దీన్ని కామన్ మాన్ బయోపిక్ అని నిర్మాత అన్నారంటే, ఏదో ఆ బయోపిక్ ల ట్రెండ్ లో బిజినెస్ కోసం అన్నారులే అనుకున్నారు. కానీ నిజంగానే బయోపిక్ లాగే  తీయబోయారు. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి, బయోపిక్ అంటే నిజంగా జీవించిన మనిషి కథతో కదా వుండాలి - అన్న హద్దుల్ని కూడా చెరిపేయదల్చుకున్నారు. అలా బయోపిక్ గా తీస్తూ వాస్తవికతతో వుండాలని కమర్షియల్ ఎలిమెంట్సే లేకుండా ఆర్ట్ సినిమాలా తీసేశారు- సూపర్ ఫ్లాపయింది!

ఆంధ్రాకింగ్ బయోపిక్ విజన్ కూడా ఇంతే. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఆర్ట్ సినిమా పోకడ. ఈ బయోపిక్ ప్రధానంగా సాగర్ ప్రేమ జీవితం గురించే.  బయోపిక్ పాత్రగా సాగర్ క్యారక్టరైజేషన్ ఎంత అయోమయాంగా వుందో సైకో ఎనాలిసిస్ లో చూశాం. ఆర్ట్ సినిమా పోకడ అనడానికి ఒక్క ఉదాహరణ - సాగర్  పురుషోత్తం ఇంటికెళ్ళి తిరునాళ్ళకి ఆహ్వానించాక ఓపెన్ చేస్తే, తిరునాళ్ళ  సీను ఒక బ్యాంగ్ తో, తగిన బిజీఎమ్ తో, మల్టీపుల్  షాట్స్ తో కోలాహలంగా ఒక పంచ్ తో వుండాల్సింది పోయి- లాంగ్ షాట్ లో, సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా, అక్కడక్కడా కొందరే జనంతో, పేలవంగా నీరసంగా కనిపిస్తుంది. ఆర్ట్ సినిమా పోకడ!

ఈ సినిమాలో రామ్ తో బాటు ఇంకో స్టార్ ఉపేంద్ర వున్నప్పటికీ ఇది వీళ్ళిద్దరి కథ, లేదా సినిమా కాకుండా, కేవలం సాగర్ ప్రేమ కథే ఎందుకయిందంటే, ప్లాట్ పాయింట్స్ అన్నీ ప్రేమ కథతోనే వున్నాయి. ఫస్టాఫ్ లో సాగర్ థియేటర్ అద్దాలు పగులగొట్టి మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడే వరకూ బిగినింగ్ అయితేఅక్కడ ప్లాట్ పాయింట్ -1 ఏర్పడి, అక్కడ్నుంచీ  ఇంటర్వెల్ వరకూ మిడిల్ -1 సాగి, ఇక్కడ ప్రేమ విషయంలోనే ఛాలెంజీతో కాన్ఫ్లిక్ట్ పుట్టి, ఇక్కడ్నుంచీ సెకండాఫ్ లో సాగర్ థియేటర్ ని పురుషోత్త కి అమ్మేయడం వరకూ మిడిల్ 2 సాగి, త్యాగంతో ప్లాట్ పాయింట్ -2 ఏర్పాటయింది. అయితే ఈ ప్లాట్ పాయింట్స్ కూడా ఎన్ని లొసుగులతో వున్నాయో చూశాం.  ఇలా ప్రేమ కథకూడా విఫలమైంది!
***
మరింకేం మిగిలింది? సాగర్ చేసిన త్యాగంతో, సూర్యకి కనివిప్పు కలిగిన ముగింపు మాత్రమే! ఇది కూడా ఎలా విఫలమైందో చూశాం. మరి ఈ కథకి కొనవూపిరిగా మిగిలిందేమిటి? మూడు రోజుల బాక్సాఫీసు, తర్వాత ఓటీటీ బిజినెస్సు. ఓటీటీలో సూపర్ హిట్ చేస్తారు ప్రేక్షకులు. ప్రేక్షకులు రెండు రకాలు : సీరియస్ థియేటర్ ప్రేక్షకులు, నాన్ సీరియస్ ఓటీటీ ప్రేక్షకులు. థియేటర్ లో సీరియస్ ప్రేక్షకులు తిప్పి కొట్టిన సినిమాల్ని ఇంట్లో హిట్ చేసేస్తారు- థియేటర్ కెళ్ళకుండా ఓటీటీలో ఎప్పుడొస్తుందాని ఎదురు చూసే నాన్ సీరియస్ ప్రేక్షకులు. థియేటర్ లో ఏకబిగిన మూడు గంటలు కూర్చుని చూడడంలో, ఓటీటీలో ఆపి ఆపి పనులు చూసుకుంటూ చూడడంలో తేడా వుంది. రెండోది, స్మాల్ స్క్రీన్ మీద చిక్కగా కనిపించే ఫ్లాపయిన సినిమాలే, బిగ్ స్క్రీన్ మీద డొల్లగా కనిపిస్తాయి.

***
ఇక దర్శకుడి పాయింటాఫ్ లో ఫీల్ గుడ్ -మాస్ జానర్ బెండర్ సంగతి. ఇది పూర్తిగా సాగర్ కథ కావడంతో, దాన్ని చెప్పడంలో ఫీల్ గుడ్డే ఎక్కువ ఫీలయ్యి, మాస్ ని మర్చిపోవడానికి కారణం కాన్సెప్ట్ నే తప్పుగా ప్లాన్ చేయడం. మొత్తం సాగర్ కథంతా ఫీల్ గుడ్ గా చెప్పేసి, చివర్లో సూర్యతో అతడ్ని కలపాలన్న ప్లానింగే రాంగ్ బాక్సాఫీసు మైండ్ సెట్ కి. రామ్ –ఉపేంద్ర లాంటి ఇద్దరు కమర్షియల్ స్టార్స్ తో పూర్తీ నిడివి ఎంటర్ టైనర్ ని ఆశిస్తుంది బాక్సాఫీసు మైండ్ సెట్. ఉపెంద్రని గెస్ట్ రోల్ కి కుదించి చివర్లో రామ్ తో ఒకేఒక్క సీన్లో చూపించి సరిపెట్టడం కాదు!

సినిమా ప్రారంభం నుంచీ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తూంటే, చివరికి ఎదురయ్యేదేమిటి- ఆ కలిసే ఒక్క సీనుతో తీవ్ర ఆశాభంగం! వీళ్ళిద్దరితో  ఒక్క సీను కోసం సినిమా చూస్తారా? కనీసం ఇంటర్వెల్లో నైనా ఇద్దర్నీ కలిపేసి - ఆ స్టార్ కీ, అతడి ఫ్యాన్ కీ మధ్య హిలేరియస్  కాన్ఫ్లిక్ట్ ని సృష్టించి, కమర్షియల్ హంగులతో మాస్ ఎంటర్ టైనర్ చేసి వుంటే - ఏదున్నాలేకున్నా  ముందు మల్టీ స్టారర్ లక్షణంతో వుండేది. సాగర్ బయోపిక్ ప్రేమ కథ ఎవరిక్కావాలి? స్టార్ కీ ఫ్యాన్ కీ మధ్య పూర్తి స్థాయి స్టోరీ కావాలి.

ఇక జానర్ బెండర్ సంగతి. ఇప్పుడు ఫీల్ గుడ్ లో మాస్ ని కలపాలా, లేక మాస్ లో ఫీల్ గుడ్ ని కలపాలా? బాపు తీసిన ‘ముత్యాల ముగ్గు’లో శోక రసానికి అద్భుత రసం కలిపారా, లేక అద్భుత రసానికి శోక రసం కలిపారా? దేన్ని  ప్రధాన రసం చేయాలి? కమర్షియల్ సినిమాకి పనికొచ్చే, ఎంటర్ టైన్ చేసే, అద్భుత రసమే ప్రధాన రసం కావాలి.  అంటే అద్భుత రసంలో అంతర్లీనంగా శోక రసం వుండాలి. వుంది కూడా, అందుకే అంత హిట్టయ్యింది.

ఆంధ్రాకింగ్ లో ప్రధాన రసం ఫీల్ గుడ్ చేసి, దాంట్లో మాస్ ఎలిమెంట్స్ కలపడానికి ఉపేంద్ర గెస్ట్ పాత్ర తోడ్పడక, సాగర్ పాత్రనే మాస్ పాత్రగా ఫీలయ్యి ఇది ఫీల్ గుడ్- మాస్ బెండర్ అనేశారు. నిజానికి ఇద్దరు స్టార్స్ తో మాస్ కథని ప్రధానం చేసి అక్కడక్కడా ఫీల్ గుడ్ జానర్ మర్యాదల్ని కపుపు పోవాల్సింది. అంటే మాస్ లో ఫీల్ గుడ్ కలపాలి, ఫీల్ గుడ్ లో మాస్ కాదు. ఎందుకంటే ఫీల్ గుడ్ కంటే మాస్ కి బాక్సాఫీసు బలమెక్కువ.
***
అప్పుడు హై-ఆక్టేన్ యాక్షన్
, గొప్ప నిర్మాణ విలువలు,  వీటికి హీరోయిజం ద్వారా విస్తృత ప్రేక్షకుల్ని ఆకర్షించే వినోదాత్మక కథా కథనాల జోడింపూ జరిగితే, అది  మాస్ మూవీ.  దీనికి కుటుంబం, సమాజం, వ్యక్తిగత సంబంధాలు, రోజువారీ కష్టాలపై విజయం, ఆరోగ్యకర భావోద్వేగ సంబంధాలూ వంటి ఉత్తేజకర ఎలిమెంట్స్ తో బాటూ,  హాస్యం, హృదయాల్ని కదిలించే పాజిటివ్ ఫీలింగ్స్  వంటి  ఫీల్ గుడ్ మూవీ జానర్ ఎలిమెంట్స్ ని జోడిస్తే, ఫీల్ గుడ్ మాసై పోతుంది! 
ముఖ్యంగా
, మాస్ అంశాలు  ఉత్సాహాన్ని అందిస్తాయి, అయితే ఫీల్-గుడ్అంశాలు హృదయాల్ని కదిలిస్తూ సానుకూల సందేశాన్ని అందిస్తాయి. ఈ హైబ్రిడ్ విధానం వినోదాత్మకంగా, ఉత్సాహంగా వుండే ఒక ప్రత్యేక  సినిమాటిక్ అనుభవాన్ని సృష్టిస్తాయి.

ఫీల్ గుడ్ - మాస్ జానర్ బెండర్ ఇవ్వాళ కొత్తేం కాదు, 1980- 90 లలో వచ్చిన కమర్షియల్ సినిమాలివే. అప్పటి కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాలు, చిరంజీవి సినిమాలు చూస్తే అర్ధమైపోతుంది. తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు నరుక్కునే కుటుంబాల కథలుగా రావడంతో నాటి ఫీల్ గుడ్ జానర్ మర్యాదలకి చోటు లేకుండా పోయింది.

-సికిందర్