రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, మార్చి 2024, మంగళవారం

1408 : రివ్యూ

 

రచన –దర్శకత్వం : టి.జి. కీర్తి కుమార్
తారాగణం : వెన్నెల కిషోర్, సంయుక్తా  విశ్వనాథన్, మురళీ శర్మ, సత్యా, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం : సైమన్ కె కింగ్, ఛాయాగ్రహణం : రిచర్డ్ కెవిన్ ఎ
నిర్మాత: అదితీ సోని
విడుదల  : మార్చి 1, 2024
***
        పాపులర్ కమెడియన్  వెన్నెల కిషోర్ గతంలో హీరోగా చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాక కమెడియన్ గానే కొనసాగాడు. 100 కి పైగా సినిమాల్లో నటించాడు. మళ్ళీ తిరిగి ఇంకోసారి హీరోగా ప్రయత్నిస్తూ చారి 111 లో నటించాడు. గూఢచారి పాత్రని కామెడీగా పోషించి నవ్వించాలని ఉద్దేశం. దీనికి కావలసిన సరంజామా దర్శకుడు కీర్తి కుమార్ సమకూర్చాడు. మరి వెన్నెల కిషోర్ సినిమా మొత్తాన్నీ తన భుజాన మోస్తూ నినిలబెట్టాడా అన్నది ప్రశ్న. ఈ గూఢచారి సినిమాలో అసలేముంది? ఉన్న విషయమైనా సక్రమంగా వుందా? కామెడీ పేరుతో కామెడీ కూడా చేయలేక వెన్నెల కిషోర్ చతికిలబడిన దృశ్యం కనిస్తుంది ఇందులో. ఎందుకంటే ఈ కథే ఓ పిచ్చి కథ.

కథలో రిటైర్డ్ మేజర్ ప్రసాద రావు (మురళీ శర్మ) సీఏం కోరికపై రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్స్ టీంని నడిపిస్తూంటాడు. దేశ భద్రత కోసం ఈ టీం సీక్రెట్‌గా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆత్మాహుతి దాడి జరుగుతుంది. ఈ దాడి జరిపిన మృతుడి వొంటి పై బాంబు అమర్చినట్టు వుండదు.  బాంబు లేకుండా ఎలా దాడి చేశాడు? ఈ మిస్టరీని ఛేదించడానికి కేసుని సీఎం, ప్రసాదరావుకి అప్పజెప్తాడు. ప్రసాదరావు ఏజెంట్ చారి 111 (వెన్నెల కిషోర్) ని రంగంలోకి దింపుతాడు. ఏజెంట్ చారి ఏ కేసు కూడా సీరియస్ గా తీసుకోడు. పిల్లకాయ చేష్టతలతో పిచ్చి పిచ్చిగా పరిశోధిస్తాడు.

ఈ పరిశోధనలో కెమికల్ పిల్ ని కడుపులో దాచి పేల్చుకున్నట్టు తేలుతుంది. ఏమిటా కెమికల్ పిల్? ఎవరు తయారు చేస్తున్నారు, వాళ్ళని చారి ఎలా పట్టుకున్నాడ న్నది మిగతా కథ.

ఈ కథ పిల్లకాయ చేష్టగానే వుంటుంది. కామెడీ పేరుతో అర్ధం పర్ధం లేని సీన్లతో నింపేశారు. ఫస్టాఫ్ కథ  కథ లేకుండానే వెన్నెల కిషోర్, అతడి టీం తెలివితక్కువ కామెడీ సీన్లతో ఓపికని పరీక్షిస్తూ సాగుతుంది. లాజిక్ లేని సిల్లీ కామెడీలతో నవ్వించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ కామెడీ ఇటు ఆబ్సర్డ్ కామెడీ కాకుండా, అటు మైండ్ లెస్ కామెడీ కూడా గాకుండా పోయింది. ఈ అర్ధం పర్ధం  లేని కామెడీ ఎక్కువగా డైలాగ్-ఓరియెంటెడ్ గానే వుంటుంది. ఈ డైలాగులకి కూడా నవ్వురాదు.

వెన్నెల కిషోర్ దర్యాప్తు మానవ ప్రేగులలో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనాల్ని పేలుడు పదార్థాలుగా మార్చే  శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందానికి దారి తీస్తుంది. మేజర్ ప్రసాద రావుకి  ఫ్లాష్ బ్యాక్ ఒకటి వుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కాశ్మీరీ ఆవిడ పాత్ర అనుమానాస్పదంగా వుంటుంది. ఇలా సరైన లింకులు లేకుండా ఏవేవో మలుపులు తిరుగుతూ పోతూంటుంది కథ.కిషోర్ చేపట్టే కేసులో  ఏజెంట్లుగా సంయుక్తా విశ్వనాథన్, తాగుబోతు రమేష్ కనిపిస్తారు.  ఇంకో కమెడియన్ సత్య క్యూ అనే ఇంకో పిచ్చి పాత్ర పోషించాడు

విచిత్రమేమిటంటే, ఫస్టాఫ్ పిచ్చికామెడీ చేసి, సెకండాఫ్ యమ సీరియస్ గా నడిపించడం. ఇక్కడ కూడా లాజిక్ లేకపోవడంతో సినిమా పూర్తిగా బెడిసికొట్టింది. సెకండ్ హాఫ్ కూడా సిల్లీ కామెడీతోనే నడిపివుంటే సరిపోయేది.
        
విషయం పేలవంగా వుండడంతో వెన్నెల కిషోర్ ఎంత కామెడీ చేసినా సినిమాని మోయలేక పోయాడు. హీరోగా ఇది మూడో వైఫల్యం. మళ్ళీ ఇలాటి ప్రయత్నాలు చేయకుండా వుంటే బావుంటుంది.

—సికిందర్