రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 5, 2024

1409 : రివ్యూ

 

రచన –దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింగ్
తారాగణం : వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్, సంపత్ రాజ్ షతాఫ్ ఫిగర్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం తదితరులు
సంగీతం : విక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : హరి కె వేదాంతం
నిర్మాణం : సోనీ పిక్చర్స్, సందీప్ ఎం.
విడుదల ; మార్చి 1, 2024
***
        రుణ్ తేజ్ నటించిన ఘని’, గాండీవధారి అర్జున అనే  గత రెండు సినిమాలూ ఫ్లాపయిన తర్వాత, ఇంకో యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు. తెలుగులో వైమానిక దళ కథతో తొలి సినిమాగా తీసిన దీనికి ఫుల్వామా దాడి- ప్రతీకార దాడుల ఉదంతం ఆధారం. జనవరి 25నే ఇదే ఉదంతం మీద హిందీలో ఫైటర్ వచ్చింది. ఇలా ఒకే కథతో వెంటవెంటనే రెండు సినిమాలు రావడంతో ఏది బెటర్ అన్న ప్రశ్న వస్తుంది. అదేమిటో చూద్దాం...

కథ

వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్), భార్య రాడార్ అహనా గిల్ (మానుషీ చిల్లర్) ఆపరేషన్ వజ్ర పేరుతో టెస్ట్ ప్రాజెక్ట్ చేపడతారు. 20 మీటర్ల తక్కువ ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల రాడార్స్ కి చిక్కకుండా పైలట్స్ ప్రాణాలు కాపాడుకోవచ్చనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే ఈ టెస్టులో స్నేహితుడు (కబీర్) నవదీప్ చనిపోవడంతో అహనా అర్జున్ తో విభేదించి దూరంగా వుంటుంది. ఫ్రెండ్ మృతికి కారకుడైనందుకు అర్జున్ బాధలో వుండగా, ఫుల్వామాలో సైనికుల మీద ఉగ్రవాద దాడి జరిగి 40 మంది సైనికులు చనిపోతారు. దీంతో ఫ్రెండ్ మృతికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం అర్జున్ కి లభిస్తుంది. ఫుల్వామా దాడికి ప్రతీకారంగా వైమానిక దళం పాక్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రతీకార దాడిలో పాల్గొన్న అర్జున్ ఎలా విజయం సాధించాదనేది మిగతా కథ.

ఎలావుంది కథ

2019 ఫుల్వామా ఘటనకి ముందు 2016 లో యురీలో సైనిక స్థావరం మీద జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా యురీ - ది సర్జికల్ స్ట్రైక్  అనే సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ - యామీ గౌతమ్ నటించారు. ఇది 2019 జనవరి 11 న విడుదలైంది. వెంటనే ఫిబ్రవరి 14 న ఫుల్వామా దాడి జరిగింది. దీంతో ఈ సినిమాకి విపరీత ఆదరణ లభించింది. 44 కోట్ల బడ్జెట్ కి 342 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఈ మూవీ బలమైన కథతో, బలమైన చిత్రీకరణతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇందులో “హౌ ఈజ్ ది జోష్?” “హై సర్!” అన్న డైలాగు బాగా వైరల్ అయింది.
         

దీని తర్వాత 2024 జనవరి 25 న ఫుల్వామా దాడి మీద హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ విడుదలైంది. ఇందులో బలమైన కథా కథనాలు లేక యావరేజీగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ ఫుల్వామా మీద ఆపరేషన్ వాలంటైన్ వచ్చింది. ఇది కూడా బలమైన కథా కథనాల లోటుని ప్రదర్శించింది. కారణం, ఫుల్వామా కథకి ముందు ఏర్ ఫోర్సు జరిపే ఆపరేషన్ వజ్ర అనే టెస్టు, ఫుల్వామా కథ తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్ జరిపే ఆపరేషన్ నెహ్రూ పేర దాడి... ఇలా ఫుల్వమాకి ముందు ఒక కల్పిత కథ, తర్వాత ఇంకో కల్పిత కథ అతికించడంతో మధ్యలో ఫుల్వామా కథ బలి అయింది. ప్రేక్షకులు ఏ కథ ఫీలవ్వాలో అర్ధం కాని పదార్ధంగా తయారైంది. పూర్తి నిడివి ఫుల్వామా మీద వుండాల్సిన కథ లేకపోవడంతో భావోద్వేగాలు, డ్రామా, సంఘర్షణ అనే బాక్సాఫీసు ఎలిమెంట్లు  అదృశ్యమైపోయాయి. కేవలం యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమా చూడాలంతే.
          
ఫస్టాఫ్ ఆపరేషన్ వజ్ర టెస్టు తో, వరుణ్ తేజ్ -మానుషీ చిల్లర్ ఫ్లాష్ బ్యాక్స్ తో, ఇంకా బోలెడు ఏర్ ఫోర్స్ హడావిడితో సాగుతుంది. ఇదంతా ఏమిటో అర్ధం గాకుండానే ఇంటర్వెల్ ముందువరకూ సాగుతుంది. అప్పుడు ఫుల్వామా  మీద దాడి జరగడంతో అసలు కథలో కొస్తుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఏర్ ఫోర్స్ బాలకోట్ స్ట్రైక్ ప్లాన్ చేయడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
        
సెకండాఫ్ లో బాలకోట్ ఉగ్ర స్థావరాల మీద విజయవంతమైన దాడితో ఆ ఆపరేషన్ ముగుస్తుంది. దీంతో కథ అయిపోయినట్టే. కానీ దీనికి ప్రతీకారంగా మళ్ళీ పాక్ ఎదురుదాడి అనే కల్పిత కథతో పొడిగించారు. మళ్ళీ దీన్ని ఏర్ ఫోర్స్ తీపికొట్టిన విధానంతో ముగించారు.     
       
ఇలా కథ మూడు ముక్కలుగా వుండడంతో సినిమాని నిలబెట్టే భావోద్వేగాలు అనే ముఖ్యమైన ఎలిమెంట్ మిస్సయ్యింది. దీంతో విషయపరంగా
, పాత్రల పరంగా డొల్లగా, యాక్షన్ పరంగా జోరుగా తయారయ్యింది. ఇలా ఆపరేషన్ వాలంటైన్’, ఫైటర్ రెండూ ఒకటే అయ్యాయి.

నటనలు – సాంకేతికాలు

 కంచె అనే వార్ మూవీ తర్వాత వరుణ్ తేజ్ మరో సారి యుద్ధ వీరుడి పాత్రలో పర్ఫెక్ట్ గా కనిపిస్తాడు. ఇలాటి పాత్రలు అతడికి కొట్టిన పిండే అన్నట్టు వుంది. కాకపోతే కంచె లోలాంటి బలమైన పాత్రచిత్రణ కొరవడింది మూడు ముక్కల కథ వల్ల. ఇంకోటేమిటంటే హీరోయిన్ మానుషీ చిల్లర్ తో కెమిస్ట్రీ, సంఘర్షణ, ఫీల్ వంటివి ఏవీ లేకపోవడం. ఫ్రెండ్ మృతికి బాధ కూడా బలంగా లేకపోవడం. కేవలం లుక్స్ కి, యాక్షన్ కి ఒక మోడల్ గా కనిపించడం వరకూ చేశాడు వరుణ్ తేజ్. క్లయిమాక్స్ లో కాస్త దేశభక్తి ఎలిమెంట్ పోషించాడు.

        మానుషీ చిల్లర్ డిటో. ఈమెతో బాటు ఇతర పాత్రధారులకీ సరైన పాత్రచిత్రణలు లేవు. ఫస్టాఫ్ లో తీసుకున్న సమయమంతా పాత్రచిత్రణల్ని స్థాపించడానికి తీసుకున్నా బావుండేది. ఫైటర్ లో ఈ ప్రయత్నమే చేశారు- ఇంటర్వెల్ కి ముందు ఫుల్వామా దాడి జరిగే వరకూ. ఆ తర్వాత ఆ పాత్రచిత్రణలు ఎటు పోయాయనేది వేరే సంగతి.

        మిక్కీ జె మేయర్ సంగీతం ఓ మాదిరిగా వుంది. నిజానికి ఫుల్వామా లాంటి విషాద సంఘటన చుట్టూ కథకి  వెంటాడే సంగీతం వుండాలి. కానీ ఫుల్వామా కథ మధ్యలో ఓ ముక్క కాబట్టి సినిమా సాంతం ఒక వెంటాడే సంగీతానికి స్కోప్ లేకుండా పోయింది.

        హరి కె వేదాంతం కెమెరా వర్క్ మాత్రం ఉన్నతంగా వుంది. అలాగే ఏరియల్ యాక్షన్ దృశ్యాల విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ కి తగ్గట్టు వున్నాయి. ఈ విషయంలో ఫైటర్ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే గగనతలంలో జెట్ ఫైటర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉత్కంఠ భరితంగా వుంది. ఈ సినిమాలో కథా కథనాల కన్నా, పాత్రచిత్రణల కన్నా యాక్షన్ దృశ్యాలే హైలైట్.

        ఇలాటి హై కాన్సెప్ట్ సినిమాలకి ముఖ్యంగా కావాల్సింది భారతీయాత్మ. షోలే’, గదర్ వంటి యాక్షన్ సినిమాల్లో భారతీయాత్మని దండిగా సమకూర్చి పెట్టడం వల్లే మళ్ళీ మళ్ళీ విరగబడి చూశారు ప్రేక్షకులు. యుద్ధ సినిమాలో ఇదింకా చాలా ముఖ్యం. జేపీ దత్తా బోర్డర్ పెద్ద ఉదాహరణ. ఇలాటి సినిమాలు చూసి, తెలుసుకుని తీస్తే ఆపరేషన్ వాలంటైన్ లాంటివి రిపీట్ ఆడియెన్స్ తో నాలుగు రోజులు ఎక్కువ ఆడుతాయి.
—సికిందర్