రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మార్చి 2023, బుధవారం

1310 : సందేహాలు- సమాధానాలు

 

        Q :మోనోమిథ్ తో ఏం చేయాలి అనే ఆర్టికల్లో జోసెఫ్ క్యాంప్ బెల్ లో పాత్ర ఆధారంగా స్ట్రక్చర్ వుంటేసిడ్ ఫీల్డ్ లో స్ట్రక్చర్ ఆధారంగా పాత్ర వుంటుంది అన్నారు. అంటే స్ట్రక్చర్ ఆధారంగా పాత్ర వుంటే పాసివ్ పాత్ర అవుతుంది కదా? దీనికేం చెప్తారు.
—దర్శకుడు
        A : ఆర్టికల్లో ఈ వాక్యం రాస్తున్నప్పుడు ఈ ప్రశ్న వస్తుందని తెలుసు. అయితే వివరించేందుకు ఈ ఆర్టికల్ సందర్భం కాదనిపించి ఆగాం. ఇప్పుడు మీరడిగారు కాబట్టి వివరాల్లోకి వెళ్దాం. స్ట్రక్చర్ వేరు, కథనం వేరు. కథనం ఆధారంగా పాత్ర వుంటే పాసివ్ అవుతుంది, స్ట్రక్చర్ ఆధారంగా వుంటే అవదు. స్ట్రక్చర్లో త్రీయాక్ట్స్ వుంటాయి. త్రీ యాక్ట్స్ లో ప్లాట్ పాయింట్స్ వుంటాయి. వీటి ప్రకారం పాత్ర నడుచుకుంటుంది. అంటే స్ట్రక్చర్ నియమాలకి లోబడి పాత్ర తన కథనం తాను చేసుకుంటూ కథ నడుపుకుంటుంది. పాత్రకి తన గోల్ ఏమిటో, అవసరాలేమిటో, సంఘర్షణేమిటో తన అంతరంగానికే బాగా తెలుసు కాబట్టి తన కథనం తానే నడుపుకుంటుంది. ఇలా యాక్టివ్ పాత్రగా వుంటుంది.

        ఇలాగాక కథకుడు జోక్యం చేసుకుని తానే కథనం చేస్తూ, స్ట్రక్చర్ లోనే వుంచుతూ పాత్రని నడిపినా పాసివ్ పాత్రవుతుంది. సిడ్ ఫీల్డ్ లో స్ట్రక్చర్ ఆధారంగా పాత్ర వుంటుందనడంలో అర్ధమేమిటంటే, ఇది పాత్ర భౌతిక కథా ప్రయాణం కాబట్టి, స్ట్రక్చర్ నియమాలకి లోబడి పాత్ర వుంటుందని. అదే జోసెఫ్ క్యాంప్ బెల్ లో పాత్ర ఆధారంగా స్ట్రక్చర్ వుంటుందనడంలో అర్ధమేమిటంటే, ఇది పాత్ర మానసిక ప్రయాణం కాబట్టి, దీని ఇష్టానుసారం తీరుబడిగా స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకుంటూ పోతుంది. అంటే, ఫస్ట్ యాక్ట్  ఇంటర్వెల్ దాకా సాగవచ్చు. లేదా ప్లాట్ పాయింట్ వన్ సెకండాఫ్ లో రావచ్చు. ఇది గాథలకి వర్తిస్తుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ మోనోమిథ్ స్ట్రక్చర్ పురాణాల ఆధారంగా ఏర్పాటయిందే కదా. పురాణాలు గాథలు. పురాణాలన్నీ మానసిక ప్రయాణాలే.

—సికిందర్