రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 7, 2023

1309 : స్టోరీ సర్కిల్ సంగతులు

 

    స్ట్రక్చర్లు రెండు రకాలు : పాత్రతో స్ట్రక్చర్లు, కథతో స్ట్రక్చర్లు. జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణాల ఆధారంగా పాత్ర తో స్ట్రక్చర్ చేసి మోనోమిథ్ (హీరోస్ జర్నీ) అనే నమూనా ఇచ్చినప్పుడది పాత్ర దాని ప్రయాణంలో అది అనుభవించే స్థితిగతుల్ని వివరించడానికి పనికొచ్చింది. తర్వాత సిడ్ ఫీల్డ్ కథ తో స్ట్రక్చర్ చేసి ఒక పారడైం ఇచ్చినప్పుడా పాత్ర కథ స్థిరీకరించిన మలుపుల్ని స్పర్శించడం మొదలెట్టింది. అంటే జోసెఫ్ క్యాంప్ బెల్ లో పాత్ర ఆధారంగా స్ట్రక్చర్ వుంటే, సిడ్ ఫీల్డ్ లో స్ట్రక్చర్ ఆధారంగా పాత్ర వుంటుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ నిర్మాణం పాత్ర మానసిక ప్రయాణమైతే, సిడ్ ఫీల్డ్ నిర్మాణం పాత్ర భౌతిక ప్రయాణం. జోసెఫ్ క్యాంప్ బెల్ పాత్ర ప్రయాణంలో 17 మానసిక దశలుంటే, సిడ్ ఫీల్డ్ కథా ప్రయాణంలో 5 భౌతిక మలుపులుంటాయి. 17 దశల పాత్ర అనుభవాలతో జోసెఫ్ క్యాంప్ బెల్ ది నిదానంగా సాగే క్లాసిక్ నిర్మాణమైతే, 5 మలుపుల కథతో సిడ్ ఫీల్డ్ ది వేగంగా సాగే కమర్షియల్ నిర్మాణం. జోసెఫ్ క్యాంప్ బెల్ నిర్మాణం వృత్తంలా జీవితానికి దర్పణం పడితే, సిడ్ ఫీల్డ్ నిర్మాణం సరళ రేఖలా లోకానికి అద్దం పడుతుంది. రెండూ త్రీ యాక్ట్ స్ట్రక్చర్లే. సిడ్ ఫీల్డ్ ది మారిన కాలానికి కుదించిన త్రీ యాక్ట్ స్ట్రక్చర్. ఇది ఒక చరిత్ర.  

        రిత్రని మార్చే వాళ్ళు ఎప్పుడూ వుంటారు. క్రిస్టఫర్ వోగ్లర్ వచ్చేసి జోసెఫ్ క్యాంప్ బెల్ మోనోమిథ్ నిర్మాణంలోని పాత్ర మానసిక ప్రయాణంలో మార్పులు చేసి, 17 దశల్ని 12 కి కుదించి బరువు తగ్గించాడు. దీన్ని మిథిక్ స్ట్రక్చర్ అన్నాడు. ఇది కూడా వృత్తాకారమే. ఇందులో - ఫస్ట్ యాక్ట్ : 1. పాత్ర సాధారణ ప్రపంచం, 2. పోరాటానికి పిలుపు, 3. పిలుపుకి నో చెప్పడం, 4. సీనియర్ తో భేటీ, 5. సీనియర్ సలహాతో పోరాటానికి దిగడం; సెకండ్ యాక్ట్ : 6. పరీక్షలెదుర్కోవడం, శత్రువుల్ని, మిత్రుల్ని తెలుసుకోవడం, 7. పోరాటం తీవ్రం కావడం, 8. అగ్ని పరీక్ష నెదుర్కోవడం, జ్ఞానోదయమనే అస్త్రం లభించడం, 9. పాతాళంలోకి జారుకోవడం; థర్డ్ యాక్ట్ : 10. పైకి తేలి అంతిమ విజయం సాధించడం, 11. అనుభవాల నుంచి మారిన వ్యక్తిగా మారడం, 12. తిరిగి తన గూటికి చేరుకోవడం.
        
ఈ 12 దశలు మోనోమిథ్ లోనివే వుంటూ, మోనోమిథ్ లోని మరో 5 దశలు వుండవు. ఇక రచయిత, దర్శకుడు డాన్ హార్మన్ ఈ 12 దశల్ని కూడా 8 కి కుదించి బరువు ఇంకా తగ్గించాడు. ఇదిలా వుంది- 1. You, 2. Need, 3. Go, 4. Search, 5. Find, 6. Take, 7. Return, 8. Change.
        
వీటిలో You అనేది పాత్ర సాధారణ ప్రపంచం, Need అనేది పాత్ర కోరిక, Go అనేది అసాధారణ పరిస్థితినెదుర్కోవడం, Search అనేది అన్వేషించడం, Find అనేది కోరుకున్నది పొందడం,Take అనేది కోరుకున్నది పొందినందుకు భారీ మూల్యం చెల్లించుకోవడం, Return అనేది గూటికి చేరుకోవడం, Change అనేది మారిన వ్యక్తిగా సెటిలవడం.
        
మోనోమిథ్ లాగా ఈ నిర్మాణం కూడా వృత్తాకారమే. ఎందుకంటే మానవ జీవితం వృత్తంలోనే వుంటుంది. సిడ్ ఫీల్డ్ మానసిక మోనోమిథ్ 17 దశల్ని 5 మలుపులకి కుదించి భౌతికం చేస్తే, హార్మన్ మానసిక మోనోమిథ్ 17 దశల్ని 8 కి కుదించి మానసికంగానే వుంచాడు. ఇది కూడా వృత్తాకారమే. దీన్ని స్టోరీ సర్కిల్ అన్నాడు. అంటే కాలానుగుణంగా భారీ మోనోమిథ్ సులభ శైలిలో మిథిక్ స్ట్రక్చర్ గా మార్పు చెంది, మిథిక్ స్ట్రక్చర్ మరింత సులభ శైలిలో స్టోరీ సర్కిల్ గా రూపాంతరం చెందిందన్న మాట.
        
స్టోరీ సర్కిల్ లో ఎనిమిది దశల్ని త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ లో చూసినప్పుడు- ఫస్ట్ యాక్ట్ : 1. You- పాత్ర సాధారణ ప్రపంచం, 2.Need - పాత్ర కోరిక, సెకండ్ యాక్ట్ : 3. Go -అసాధారణ పరిస్థితినెదుర్కోవడం, 4. Search -అన్వేషించడం, 5. Find -కోరుకున్నది పొందడం, 6. Take - కోరుకున్నది పొందినందుకు భారీ మూల్యం చెల్లించుకోవడం, థర్డ్ యాక్ట్ : 7. Return - గూటికి చేరుకోవడం, 8. Change - మారిన వ్యక్తిగా సెటిలవడం.
        
అంటే క్రిస్టఫర్ వోగ్లర్ మిథిక్ స్ట్రక్చర్ ఫస్ట్ యాక్ట్ లో 5 దశలుంటే, హార్మన్ స్టోరీ సర్కిల్ లో రెండే వున్నాయి. మిథిక్ స్ట్రక్చర్ సెకండ్ యాక్ట్ లో 4 వుంటే, స్టోరీ సర్కిల్ లో కూడా 4 వున్నాయి. మిథిక్ స్ట్రక్చర్ థర్డ్ యాక్ట్ లో 3 దశలుంటే, స్టోరీ సర్కిల్ లో 2 వున్నాయి. అంటే హార్మన్ సర్కిల్లో నస తగ్గించాడు. హార్మన్ మానసికంగానే నస తగ్గిస్తే, సిడ్ ఫీల్డ్ మానసిక నస అంతా (క్యారక్టర్ డెవలప్ మెంట్) ఎత్తేసి 5 భౌతిక మలుపులు ఇచ్చాడు.
        
మరిప్పుడు తెలుగులో ఏం చేయాలి? కొందరు చరిత్ర తెలీక ఇంకా జోసెఫ్ క్యాంప్ బెల్ మీద మమకారంతో వుంటున్నారు. అంటే మానసిక ప్రయాణమైన మోనోమిథ్  తో కథ చేసుకునే ఉద్దేశం. చేసుకుంటున్న వాళ్ళు కూడా వుండొచ్చు. మోనోమిథ్ ఈ రోజుల్లో బాక్సాఫీసుకి ఆరోగ్యకరం కాదని చెబుతూ వచ్చాం. హాలీవుడ్ లోనే సిడ్ ఫీల్డ్ వచ్చాక మోనోమీథ్ ని పక్కన పెట్టేశారు. కాబట్టి మోనోమిథ్ కి ఆధునిక రూపమైన స్టోరీ సర్కిల్ నుపయోగించి కథ చేసుకోవచ్చేమో ఆలోచించుకోవచ్చు. దీని ఆధారంగా వచ్చిన హాలీవుడ్ సినిమాలున్నాయి. కథ ఎలా చేసుకోవచ్చో హాలీవుడ్ నుంచి ఇంటర్నెట్ లో అనేక వ్యాసాలున్నాయి. శుభాకాంక్షలు.
—సికిందర్