థాంక్యూ’ బిగినింగ్ విభాగంలో అభిరామ్ (నాగచైతన్య) పాత్రకి కథ నడపడానికి సంఘర్షణ
పుట్టే ప్రత్యర్ధి పాత్ర లేక పోవడంతో, ఇది ఎక్కువమంది
ప్రేక్షకులని రప్పించే కథ గాకుండా, తక్కువ మంది ప్రేక్షకులతో
సరిపెట్టుకునే గాథ అయిందని తెలుసుకున్నాం. రావు (ప్రకాష్ రాజ్) గారి మరణంతో
బిగినింగ్ ముగింపులో అభిరామ్ మనస్సాక్షి మేల్కొని ఉద్బోధ చేయడంతో, తను జీవితంలో పైకి రావడానికి కారకులైన వ్యక్తుల్ని ఇంతకాలం నిర్లక్ష్యం
చేసిన తప్పు తెలుసుకుని, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మొదటగా నారాయణపురం బయల్దేరతాడు. దీంతో
మిడిల్ విభాగం మొదలవుతుంది. బయల్దేరుతూ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు.
ఇప్పుడు
2003 లో నారాయణపురంలో తల్లి సరస్వతమ్మ (తులసి) తో వుంటున్న 18 ఏళ్ళ అభి (నాగచైతన్య
టీనేజీ లుక్) పడవల పోటీల్లో పాల్గొని గెలుస్తాడు. దీంతో వూరి పెద్ద నారాయణ రావు (సంపత్
రాజ్) అభి పై చదువులకి సాయం ప్రకటిస్తాడు. ఇదే ఘట్టంలో నారాయణ రావు కూతురు పార్వతి
(మాళవికా నాయర్) మీద మనసు పడతాడు అభి. ఆమె కూడా ప్రేమలో పడుతుంది. ఇది నారాయణరావుకి
తెలిసిపోయి, కొడుకుని తీసుకుని వూరొదిలి వెళ్ళి పోవాల్సిందిగా ఆదేశిస్తాడు
అభి తల్లిని.
అభి ఈ విషయం పార్వతికి
చెప్తే నీతో వచ్చేస్తానని రైల్వే స్టేషన్ కొచ్చేస్తుంది పార్వతి. వైజాగ్ వెళ్ళిపోదామనుకుంటారు. ఈ పరిస్థితుల్లో అభి చదువుకోలేనని, ఏదో పనిచేసుకుని తల్లిని, పార్వతినీ చూసుకుంటాననీ చెప్పడంతో, ఆలోచనలో పడుతుంది పార్వతి. చదువుకోనంటున్న ఈ అభి తను అనుకున్న అభిలా లేడని, బాధతో బై చెప్పేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.
ఈ ఫ్లాష్ బ్యాక్ లో- ఇది ఇద్దరూ
విధి వంచితులే అన్నట్టు వుంటారు. గాథల్లో ఇలాటి విధికి తలవంచే పాత్రలే వుంటాయి.
అందుకే, ‘చదువు మానేస్తే నీ కల?’ అని ఆమె అన్నప్పుడు, ‘అన్నీ మనం
అనుకున్నట్టు జరుగుతాయా?’ అంటాడు నిరాశగా. ఇలా విధికి తల
వంచారు. ఆమె బాధపడుతూ ఇంటి కెళ్ళిపోయింది, అతను రైలెక్కాడు.
ఇద్దరూ పాసివ్ క్యారక్టర్లు గాథ కుండే లక్షణం ప్రకారం.
చదువు మానేస్తానని అతననడం
ప్రేక్షకుల సానుభూతి కోసమైతే ప్రేక్షకులేమీ అయ్యో అని బాధపడరు. ‘నీ కోసం ఎన్ని బాధలైనా పడి చదువు పూర్తి చేస్తా. మీ నాన్న సాయం చేయక పోతే
నేనేం చేతకాని వాడ్నా?’ అనడం యూత్ అప్పీల్. సినిమా చూస్తూ
యువ ప్రేక్షకుడు ‘నాకేంటి?’
అనుకుంటాడు. ‘ప్రేమ కోసం నేనైతే ఏం చేస్తాను?’ అనుకుంటూ సినిమా చూస్తాడు. ప్రేమ కోసం యూత్ ఏం చేస్తారో అది చూపించాల్సి
వుంటుంది. లవ్ హార్మోన్ కోడె గిత్తలా వుంటుంది. లుంగ చుట్టుకుని పడుకునుండదు వాన
పాములా.
కానీ ఆరు నూరైనా అభి ప్రేమ కోసం లేడు.
పోతే పోయిందనుకున్నాడు. మిన్ను విరిగి మీద పడ్డా పార్వతి కూడా ప్రేమ కోసం లేదు. అతను
కూలి పనే చేసి తమని చూసుకుంటానంటే, తనూ కూలీయే చేస్తానని ఆమె
అనాలి. అనలేదు. తను ఆశించినట్టు లేడని వదిలేసింది.
ఇప్పుడు తన ఉన్నతికి మొదటి కారణం
ఆమే అని వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవడం కృత్రిమంగా
వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ప్రస్తుతానికొస్తే పార్వతి పెళ్ళయి వుంటుంది.
ఆ రోజు విడిపోవడం వల్లే తాననుకున్న గోల్ సాధించానని థాంక్స్ చెప్తాడు. ఇలా ఫ్రెండ్
కి చెప్పడం వేరు, గర్ల్ ఫ్రెండ్ కి చెప్పడం వేరు. గర్ల్ ఫ్రెండ్ ని, ఆమె ప్రేమనీ ఆమె ఖర్మానికి వదిలేసిపోయి, ఇప్పుడు తన
సక్సెస్ గురించి చెప్పుకోవడం తన బుద్ధి మారలేదనడానికి నిదర్శనంగా వుంది.
ఇలా ఆషామాషీగా వెళ్ళి పోతూంటాయి
సీన్లు. థాంక్స్ చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోతాడు. కేవలం థాంక్స్ చెప్పేసి వెళ్ళి
పోవడమేనా? ఆమెతో తిరిగి సంబంధాలు కలుపుకుని ఫ్యామిలీ ఫ్రెండ్
గా కంటిన్యూ చేయడం వుండదా? ఇలా పార్వతి దగ్గరి కొచ్చినప్పుడు
పరిస్థితి వ్యతిరేకంగా వుంటుందని ఆశిస్తాం. ఆమె అతడి కృతజ్నత స్వీకరించే మనసుతో
వుండదనుకుంటాం. తప్పు చేసి వెళ్ళాక వచ్చి సారీ చెప్పి ఒక మనిషిని కలుపుకోవాలంటే
చాలా స్ట్రగుల్, డ్రామా వుంటాయి. అదైనా ఇక్కడ వుండదు. అతను
థాంక్స్ చెప్పడం, ఆమె ఓకే అనడం,
వెళ్లిపోవడం. ఒక ఫోన్ కాల్ తో అయిపోయే పని.
ఇక సెకండాఫ్ వైజాగ్ ఫ్లాష్ బ్యాక్
40 నిమిషాలుంటుంది. కాలేజీ గొడవలతో ఈ ఫ్లాష్ బ్యాక్ పాత సినిమా పాత్రలు, సీన్లు చూస్తున్నట్టు వుంటాయి. ఇక్కడ శర్వా అనే స్టూడెంట్ తో పై చేయి కోసం
అభి పోరాటం. దీనికి హాకీ క్రీడ. శర్వాకో చెల్లెలు (ఆవికా గోర్). ఆమెతో అభికి
సిస్టర్ సెంటిమెంటు. విచిత్రమేమిటంటే, చదువు మానేసి ఏదో పని
చేసుకుంటానని పార్వతిని వదిలేసి వైజాగ్ వచ్చేసిన అభి ఇంజనీరింగ్ చదవడం!
మిడిల్ అంటే సంఘర్షణ. కానీ ఫస్టాఫ్
లో మొదలై సెకండాఫ్ వరకూ గంటకి పైగా సాగే మిడిల్లో సంఘర్షించడానికి అభి కేమీ లేదు.
మొదటి ఫ్లాష్ బ్యాక్ లో పార్వతితో, రెండో ఫ్లాష్ బ్యాక్ లో
శర్వా తో, సంఘర్షణ వుందిగా అన్పించవచ్చు. ఈ ఫ్లాష్ బ్యాక్స్
అనేవి మిడిల్ కథనం కాదు, బిగినింగ్ కి చెందిన కథనం. నాన్
లీనియర్ కథనం వల్ల ఫ్లాష్ బ్యాకులుగా మిడిల్ కొచ్చాయి. మిడిల్లో ఫ్లాష్ బ్యాక్స్
పూర్తయి, పార్వతికీ శర్వాకీ థాంక్స్ చెప్పుకునే ప్రస్తుత గాథ
ఏదైతే వుందో అంత వరకే మిడిల్. సంఘర్షణ లేని అతి స్వల్ప మిడిల్. అంటే సినిమా మొత్తం
చూస్తే దాదాపూ మిడిల్ లేనట్టే. మిడిల్ లేని స్క్రీన్ ప్లే.
పూర్తిగా నాగ చైతన్య అసహజ పాత్ర
చిత్రణ వల్ల స్వార్ధం- కృతజ్ఞత ఇతివృత్తంతో ఈ కథ గాథలా తయారయ్యింది. గాథలా
తయారయ్యాక చెప్పుకోవడానికి విషయముండదు. తెర ముందు ప్రేక్షకులుండరు.
—సికిందర్