రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఆగస్టు 2022, సోమవారం

1187 : మలయాళం రివ్యూ!


 రచన- దర్శకత్వం : ఇందూ వీఎస్

తారాగణం : నిత్యామీనన్, విజయ్ సేతుపతి, ఇంద్రజిత్ సుకుమారన్, ఇంద్రాన్స్ తదితరులు
సంగీతం : గోవింద్ వసంత, ఛాయాగ్రహణం : మహేష్ మాధవన్
నిర్మాతలు : ఆంటో జోసెఫ్, నీతా పింటో
విడుదల :  జులై  29, 2022, డిస్నీ + హాట్ స్టార్
***
        రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో అధికరణ 19 (1) (a) కింద వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛా దేశ పౌరు లందరికీ దఖలు పర్చారు రాజ్యాంగ నిర్మాతలు. తప్పకుండా మనకి  మాట్లాడే పూర్తి స్వేచ్ఛ నిచ్చింది రాజ్యాంగం, కానీ మాట్లాడింతర్వాత లేదు. కేసులు, తిట్లు పలకరిస్తాయి. మరో వైపు స్వేచ్ఛ దుర్వినియోగ మవుతున్న మాటలా వుంచి, ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు నీకు లేవు, నాకే వున్నాయని భౌతిక దాడులకి దిగే శక్తులెప్పుడూ వుంటున్నాయి. ఒక వైపు భావజాలాల పరంగా, ఇంకో వైపు మనోభావాల పరంగా. భౌతిక దాడులతో భావజాలం నశిస్తుందా?

      ప్రభుత్వ అణిచివేత మీద తీసిన హాలీవుడ్  వీ ఫర్ వెండెట్టా (2005) లో ఒక డైలాగు వుంటుంది- నా మాస్కు వెనకాల రక్త మాంసాలు మాత్రమే లేవు, భావజాలముంది. భావజాలాలు బుల్లెట్ ప్రూఫ్ అని. బుల్లెట్ తో భావజాలాన్ని చంపలేరు. హేతు వాదులైన గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్, ఎంఎం కల్బుర్గీ, గౌరీ లంకేష్ లని మతవాదులు తూటాలతో అంతమొందించిన విషయం తెలిసిందే. మాటలకి జవాబుగా  నువ్వు లాఠీని వాడతావ్. కానీ మాటలు వాటి శక్తినెప్పుడూ కోల్పోవు. మాటలు అర్ధాన్ని మోస్తాయి, వినాలనుకున్న వాళ్ళకి  సత్యాన్ని చేరవేస్తాయి  అని ఇంకో డైలాగు వీ ఫర్ వెండెట్టా లో.

        మన రాజ్యాంగ అధికరణ కిరువైపులా ఈ డ్రామా ఏదైతే వుందో ఇందులో ఎవరిది పై చేయి? తూటాకి రాజ్యం దన్నుగా వున్నప్పుడు పౌరులకి మాట్లాడే దమ్ముంటుందా? ఈ పాయింటు చెప్పాలనుకుంది మలయాళ కొత్త దర్శకురాలు ఇందూ వీఎస్. మరి చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పగల్గిందా లేదా అన్నది ప్రశ్న.

     జులై 29 నే నసీరుద్దీన్ షా నటించిన
ఏ హోలీ కాన్ స్పిరెసీ విడుదలైంది. ఇందులో హేతువాదియైన క్రైస్తవ టీచర్ మతంతో సంఘర్షిస్తాడు. స్కూల్లో బైబిల్ ప్రకారం సృష్టి గురించి చెప్పకుండా, డార్విన్ సిద్ధాంతం భోదించి చర్చి ఆగ్రహానికి గురవుతాడు. ఆ కోర్టు కేసులో రాజకీయ శక్తులు జొరబడి  ఎలా ఆడుకున్నాయో నిర్భయంగా, బలంగా చూపిస్తారు. మరి ఆర్టికల్ 19 తో దర్శకురాలు ఇంధూ వీఎస్ ఇంతే బలంగా, ధైర్యంగా చూపించిందా? ఇందులో ప్రాథమిక  హక్కుల సమస్యా చిత్రణ ద్విగుణీకృత మవడానికి పేరున్న స్టార్స్ అయిన నిత్యామీనన్, విజయ్ సేతుపతిలు ఏ మేరకు తోడ్పడ్డారు?

        చాలా చిన్న కథ. గంటా 47 నిమిషాలు నిడివి. ఇందులో నిత్యామీనన్ పాత్రకి పేరుండదు. చెప్పినట్టు వినే నోరులేని ఆడవాళ్ళకి ప్రతీక ఈమె పాత్ర. తల్లి మరణించడంతో తండ్రి దిగాలు పడి, ఏ పనీ చేయకుండా ఇంట్లో వుంటే, అతను నడిపే జెరాక్స్ షాపు నడుపుకుంటూ జీవిస్తూంటుంది ఆ చిన్న వూళ్ళో నిత్య. ఒక ఫ్రెండ్ ఫాతిమా (అతుల్యా ఆషాఢం) వుంటుంది.

        ఒక రోజు ఉదయం గౌరీ శంకర్ (విజయ్ సేతుపతి) అనే రచయిత నవల వ్రాతప్రతి జెరాక్స్ కాపీ తీయమని ఇచ్చిపోతాడు. పోతూ నైట్ తను వచ్చేవరకూ వుండమంటాడు. చాలా రాత్రి వరకూ అలాగే ఎదురు చూసి షాపులోనే నిద్రపోతుంది. ఆమె అపరిచితుల మాట కూడా జవదాటదు. ఎవరేం చెప్తే అది పాటిస్తుంది. గౌరీ శంకర్ ఆ రాత్రి రాడు. రాత్రి ఇద్దరు దుండగులు అతడ్ని కాల్చి చంపి వెళ్ళిపోయారు. ఈ వార్త ఉదయం టీవీలో చూసి కలవర పడుతుంది.

        గౌరీ శంకర్ అంబేద్కరిస్టు, హక్కుల కార్యకర్త. తన ప్రాణాలకి హాని వుందని తెలిసి కూడా రాసేది మానడు. తత్ఫలితంగా దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇవి తెలుసుకుని నిత్య ఆలోచనలో పడుతుంది. తను మౌనం అయితే, అతను గళం. ఇదీ విషయం. ఇంతేనా విషయం? విషయమింతే. ఇంతకి మించి ఏమీలేదు, ఇంకేమీ జరగదు. నిత్య గౌరీశంకర్ గురించి అడిగి తెలుసుకుంటూ తిరగడం తప్ప. తెలుసుకుని ఏం చేద్దామనో స్పష్టత వుండదు. ఆ నవల వ్రాతప్రతి దగ్గరుంచుకుంటుంది.

        నిజానికి ఈ కథ ఎలా చెప్పాలో దర్శకురాలికి కూడా స్పష్టత లేదేమో. అయితే ఐదు చోట్ల మాత్రం అద్భుతాలు చేసింది. ప్రారంభంలో రాత్రిపూట బైక్ సౌండ్, బైక్ మీద ఇద్దరు, గన్ షాట్. మధ్యలో విజయ్ సేతుపతి రాత్రిపూట టీస్టాల్ దగ్గర టీ తాగుతూంటే  బైక్ సౌండ్, బైక్ మీద ఇద్దరు, గన్ షాట్. తర్వాత రెండు సార్లు నిత్యా మీనన్ ఇమాజినేషన్లో  బ్లాంక్ స్క్రీన్ మీద బైక్ సౌండ్, గన్ షాట్. ముగింపులో నిత్యామీనన్ రాత్రిపూట షాపు మూశాక బ్లాంక్ స్క్రీన్ మీద బైక్ సౌండ్, గన్ షాట్.

        సౌండ్ ఎఫెక్ట్స్ ని ప్లాట్ డివైస్ గా చేసుకుని హెచ్చరిక చేస్తోంది భావ స్వేచ్ఛా పరులకి. ప్రారంభ సౌండ్- షాట్ విజయ్ సేతుపతిని టార్గెట్ చేసిందని తర్వాత అర్ధమైపోతుంది. చివరి బైక్ సౌండ్ తో బాటు షాటు? ఇప్పుడెవరు బలి అయ్యారు? అర్ధమైపోతుంది మనకి. చాలా డిస్టర్బింగ్ ముగింపు. వండర్ఫుల్ క్రియేషన్.

        ఈ ఐదు శబ్ద ఫలితాలతో, ఐదు ఘట్టాల్ని కలిపి చెప్తే, షార్ట్ ఫిలిమ్ గా ఓ పది నిమిషాల్లో అయిపోవాల్సిన కథ. ఈ 10 నిమిషాలు తీసేస్తే సినిమాలో ఇంకేమీ లేదు చెప్పడానికి. ఆ ఐదు ఘట్టాల ద్వారా ఆమె చెప్పిందేమిటంటే గళమనేది ఇక లేదు, మౌనమే వుందని. గళమెత్తితే చావుతప్పదని. రాజ్యాంగమిచ్చిన భావప్రకటనా స్వేచ్ఛ చచ్చిపోయిందని.

     ఇలా ఈ వాస్తవాన్ని నమోదు చేసి వదిలేసిందంతే. ఈ వాస్తవాన్ని ప్రశ్నించ దల్చుకో లేదు. భావ ప్రకటనా  స్వేచ్ఛ కోసం సంఘర్షించ దల్చుకో లేదు. సంఘర్షించక పోవడంతో ఎక్కువ మంది చూసే ప్రధాన స్రవంతి సినిమా కాలేకపోయింది. తక్కువ మంది చూసే సమాంతర (ఆర్ట్) సినిమా అయింది. అంటే గాథ అయింది.

   ప్రారంభ అరగంట జెరాక్స్ షాపుకి విజయ్ సేతుపతి వచ్చేవరకూ జరిగేదేమిటంటే, నిత్యా మీనన్ జెరాక్స్ షాపు తీయడం, సర్దుకోవడం (షాపుకి నల్గురు వచ్చినట్టు కూడా వుండదు), మార్కెట్ కెళ్ళి కూరలు కొనుక్కోవడం, ఇంటికెళ్ళడం, నైట్ టిఫిన్ బండి దగ్గర దోశె తినడం, మళ్ళీ ఉదయం షాపు ఓపెన్ చేయడం, సర్దుకోవడం, ఫాతిమా వస్తే ఆమెతో కలిసి తింటూ మాట్లాడుకోవడం, ఫాతిమా పనిచేసే బట్టల షాపు కెళ్ళి మాట్లాడడం, ఇంటికెళ్ళడం, మళ్ళీ ఉదయం వచ్చి షాపు షట్టర్ పైకి లేపడం (ఈ షట్టర్ లేపడం, దింపడం సినిమా మొత్తమ్మీద 20 సార్లు వుంటుందేమో), ఎవరెవరో తనతో మాట్లాడడం, టీ ఇవ్వడం (ఈ టీ తాగే సీన్లు 40 వుంటాయి), ఒకటి రెండుసార్లు తండ్రితో మాట్లాడడం, టూ వీలర్ మీద ఎక్కడెక్కడో తిరగడం (ఈ టూవీలర్ మీద ట్రావెల్ సీన్లు సినిమా మొత్తం మీద పావుగంట  వుండొచ్చు - నిడివిని భర్తీ చేయడానికన్నట్టు), ఇలా వీటన్నిటితో సాగదీస్తూ ఇది నిజమైన ఆర్ట్ సినిమా కదా అన్పించేట్టు చేసింది.

     ఈ మొదటి అరగంట విజయ్ సేతుపతి పాత భవనం మెట్లెక్కి రెండు సార్లు పైకి పోతాడు, రెండు సార్లు కిందికి దిగుతాడు. బస్సెక్కి పోతూ వుంటాడు, ఆటో ఎక్కి పోతూ వుంటాడు. టీ బండీ దగ్గర టీ తాగుతూ వుంటాడు. అప్పుడు దర్శకురాలు ఇచ్చిన అరగంట పూర్తి చేసుకుని, ఎట్టకేలకు నిత్యామీనన్ జెరాక్స్ షాపుకొస్తాడు. ఆ తర్వాత రాత్రి పూట హత్యకి గురవుతాడు.   

విజయ్ సేతుపతిది స్వల్ప పాత్ర. చనిపోయాక నిత్యామీనన్ అతడి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ లో అక్కడక్కడా అతడి జీవితం తెలుస్తుంది. అతడి అక్కని, కానిస్టేబుల్ని, పబ్లిషర్ని అడిగి తెలుసుకుంటుంది. తెలుసుకుంటున్నప్పుడు అతడి గురించి గొప్ప విషయాలేమీ తెలియవు, ఆమెకి ఏ భావావేశాలూ పుట్టవు. ఒక సీన్లో తన పక్కన అతను వచ్చి  కూర్చున్నట్టు వూహిస్తుంది. అతన్నే చూస్తుంది. ఆ చూపులో ఏ భావమూ వుండదు. ఇద్దరికీ ఇందులో నటించడానికి విషయమే లేదు. అసలే ఆర్టు సినిమా. దీనికి తగ్గట్టు ఈ స్టార్స్ ఇద్దరి కుదరని ఆట!

        చివరి పది నిమిషాలు తప్ప విషయం ముందుకు కదలదు. మొత్తం సినిమా అంతా కూడా బాగా స్లో. నిత్య అతడి గురించి తెలుసుకుని ఏం చేద్దామనుకుంటోందో ఆమెకే తెలియనట్టువుంటుంది. మధ్యలో ఫ్రెండ్ ఫాతిమా పెళ్ళి, పాట వొకటి అనవసరంగా. నిత్య ఎక్కడ చూసినా మనుషుల ముఖాల్లోకి అలా చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకే చలనం వుండదు.

        అసలీ మొత్తం కథనంతో సమస్యేమిటంటే, లాజిక్ అడ్డు పడుతూంటుంది. సేతుపతి గురించి ఆమె అలా తెలుసుకుంటూ తిరగడం డేంజరే. అతడ్ని ఎవరు, ఎందుకు చంపారో తెలిసిపోతూండగా, తను తల దూర్చడం తనకే ప్రమాదం. అతడి గురించి ఆమె  అడుగుతూంటే, నీకెందుకమ్మా గమ్మున వుండక అని ఎవరూ అనరు. పోనీ ఆమె అతడి పోరాటం తను చేయడానికి అతడి గళంగా మారబోతోందా అంటే అలాటిదేమీ లేదు. అతడి వ్రాతప్రతి కూడా తన దగ్గరుండడం డేంజరే, అది దుండగుల దృష్టిలో నిషిద్ధ సాహిత్యమవుతుంది. కొద్ది రోజుల క్రితం సేతుపతి ఇంటి కెళ్తే, ఇల్లంతా చిందరవందర చేసి వుంటుంది. వస్తులువులు తగులబెట్టేసి వుంటాయి. వెంటనే వెతికి ఒక చోట దాచిన వ్రాతప్రతిని తీస్తాడు.

ఆ వ్రాతప్రతిని భద్రత కోసమే నిత్య కిచ్చాడా జెరాక్స్ తీయమని? ఇదొక సమాధానం దొరకని ప్రశ్న. ఆ రాత్రే హాత్యకి గురయ్యాడు. వ్రాతప్రతి ఆమె దగ్గరుండి పోయింది భద్రంగా. అదంతా చదువుతుందామె. చదివి ఆఖర్న జెరాక్స్ కాపీలు తీసి తెలిసిన వాళ్ళకి పంచి పెడుతుంది!

     తెలిసిన వాళ్ళు కూడా అది తీసుకోవడానికి భయపడరు. ఆనందంగా తీసుకుంటారు. ఇలా 19 (1) (a)’ అన్న టైటిల్ తో ఈ ప్రాథమిక హక్కుల కథ, పాత్రలు  అర్ధం లేకుండా వున్నాయి. ఇక ఆఖర్ని ఆమె షాపు మూసేశాక- బైక్ సౌండ్ తో గన్ షాట్!

        హక్కుల సమస్య ఏర్పడ్డప్పుడు నిత్యామీనన్ మౌనం వీడి అతడి గళంగా మారి పొరాడి వుంటే ఉపసంహారం జస్టిఫై అయ్యేది. సినిమా నిలబడేది. దర్శకురాలికి ఏం చెప్పాలో తెలుసు, ఈ సబ్జెక్టు చెప్పే ధైర్యం కూడా వుంది.  కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. అదీ సమస్య.

—సికిందర్