రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, February 24, 2022

1135 : ఆర్టికల్


 

        దేశంలో పానిండియా సినిమాల ట్రెండ్ 2015లో విడుదలైన ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్‌ తో ప్రారంభమైంది. దీని హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని తర్వాత దీని సీక్వెల్ బాహుబలి 2: ది కన్‌క్లూజన్ పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ ని ఎస్టాబ్లిష్  చేసింది, 2.0’, ‘సాహో’, కేజీఎఫ్ : చాప్టర్ 1 వంటి మరిన్ని హిట్‌లతో ఉత్సాహం వచ్చేసి దక్షిణ భారత సినిమాలని  పాన్-ఇండియా సినిమాలుగా విడుదల చేయడం ప్రారంభించారు. ఈ సినిమాలు వాటి హిందీ/డబ్బింగ్ వెర్షన్‌లలో బాగా వర్కౌట్ అయ్యాయి. అలా విడుదలై విజయం సాధించిన తర్వాత, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్‌ ని  ఎలా కైవసం చేసుకుంది-న్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

        అంతే కాకుండా, తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ హిందీలో ఘన విజయం సాధించడం, అదే సమయంలో రణవీర్ సింగ్ నటించిన 83 భారీ పరాజయం చెందడంతో హాట్ టాపిక్ కి మరింత బలం చేకూరింది.

        సరే, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్‌ ని  ఆక్రమించేసిందని, ప్రేక్షకులు హిందీ సినిమాల కంటే తెలుగు, తమిళం, కన్నడ లేదా మలయాళ సినిమాలని ఎక్కువ ఇష్టపడుతున్నారని ఒక అభిప్రాయం బలపడింది. ఇది నిజమేనా? నిజం కాదనీ, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి  పాన్-ఇండియా విడుదలల వెనుక వున్న వాస్తవం వేరనీ, వాటిలో చాలా వరకు హిందీలో పేలవంగా తేలాయనీ కౌంటర్ అభిప్రాయం బలపడింది.

        గత 7 సంవత్సరాలుగా హిందీలో బాక్సాఫీసు సక్సెస్ అయిన పాన్-ఇండియా విడుదలల్లో బాహుబలి రెండు భాగాలు, తర్వాత 2.0’, ‘సాహో’, కేజీఎఫ్ : చాప్టర్ 1 ఇంతే. ఇప్పుడు పుష్ప: ది రైజ్ ని మాత్రమే ఈ ఆరింటితో కలుపుకోవాలి. తాజాగా రవితేజ ఖిలాడీ సహా మిగిలినవన్నీ ఫ్లాపులే, భారీ ఫ్లాపులే. ఈగ’, ‘సైరా నరసింహా రెడ్డి’, ‘పైల్వాన్’, ‘పులి’, ‘దర్బార్’, ‘కాలా’, ‘మాస్టర్’, ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’, ‘మామాంగం’, ‘మోసగాళ్ళు, ‘పెట్ట’, ‘అరణ్య’, ‘సర్దార్ గబ్బర్ సింగ్ భారీ ఇవన్నీ ఫ్లాపులుగా నమోదయ్యాయి.

        ఇన్ని ఫ్లాపుల నేపథ్యంలో, ఇక ఈవారం పవన్ కళ్యాణ్ నటించిన  భీమ్లా నాయక్’, అజిత్ నటించిన వాలిమై సహా, రానున్న వారాల్లో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్’, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్’, యష్ నటించిన కేజీఎఫ్ : చాప్టర్ 2 మొదలైన అనేక పాన్-ఇండియా విడుదలలున్నాయి. వీటి ఫలితాలు వెచ్చి చూడాలి. కానీ గత 7 సంవత్సరాల్లో  కేవలం 6 విజయాలే వచ్చినప్పుడు బాలీవుడ్ పని అయిపోయిందనీ, దక్షిణ భారత సినిమా ఆక్రమించేసిందనీ ప్రచారం చేయడం మోసం చేసుకోవడమే అవుతుంది.

        ఈ ప్రచారం ఆపి, ఎందువల్ల పానిండియా స్థాయిలో భారీగా సినిమాలు ఫ్లాపవుతున్నాయో విశ్లేషించుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టి పానిండియా సినిమాల నిర్మాణం జరుపుకోవడం ఉత్తమం,

***