రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, February 24, 2022

1136 : రివ్యూ

రచన-దర్శకత్వం : హెచ్ వినోద్
తారాగణం : అజిత్
, హుమా ఖురేషీ, కార్తికేయ, గుర్బనీ, సుమిత్ర, యోగిబాబు తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా
, జిబ్రాన్; సాహిత్యం : రాజశ్రీ సుధాకర్ (తెలుగు), ఛాయాగ్రహణం : నీరవ్ షా, కూర్పు : విజయ్ వేలుకుట్టి, కళ : కదిర్, వస్త్రాలంకరణ : అనూ వర్ధన్, దృశ్య ఫలితాలు ; దేబాశీష్ సిన్హా, శబ్ద ఫలితాలు : సూరజ్ బర్డియా, దిలుక్షన్, పోరాటాలు : సర్జీ గోలోవ్కిన్- దిలీప్ సుబ్బరాయన్
బ్యానర్ : జీ స్టూడియోస్
, బెబేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి.
విడుదల : ఫిబ్రవరి 24
, 2022

***

            హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా వలిమై తో అజిత్ కుమార్ పానిండియా ఎంట్రీ బిగ్ న్యూస్ అయింది. ఇటు సౌత్ లో పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్’, అటు నార్త్ లో సంజయ్ లీలా భన్సాలీ - ఆలియా భట్ లతో గంగూ బాయి ఖటియావాడీ తోనూ తలపడేందుకు రంగంలోకి దూకేశాడు. దర్శకుడు హెచ్. వినోద్ తో హిందీ పింక్ తమిళ రీమేక్ లో నటించిన అజిత్, తిరిగి ఇదే దర్శకుడితో వలిమై లో నటిస్తూ, బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీతో వచ్చేశాడు. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆరో 11.1 సరౌండ్ టెక్నాలజీతో శబ్ద ఫలితాలు వినిపించడం ఓ ప్రత్యేకత. అందుకని ఈ మూవీని థియేటర్లో బిగ్ స్క్రీన్ పైనే చూడాలంటున్నారు. రష్యాలో క్లయిమాక్స్ చిత్రీకరణ ఇంకో ప్రత్యేకత. అజిత్ పాత్రకీ నిజ జీవితపు రిఫరెన్స్ మరింకో ప్రత్యేకత.

        క తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటించడం ఇంకో ప్రత్యేకత. మోటార్ బైక్ గ్యాంగ్ నేపథ్యం మరో ప్రత్యేకత. ఆఖరికి నాటి దివంగత తమిళ స్టార్ జయశంకర్ దండేసిన ఫోటో సీను కూడా ప్రత్యేకతే నంటూ తమిళ అభిమానాన్ని కూమ్ రివర్ లా పారిస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతల శ్రేణి తో సినిమా ఏ సరళిలో వుంది? అజిత్ కుమార్ బాక్సాఫీసుకి ఎంత వలిమై (బలం) చేకూర్చాడు? కథలో ఏ సమస్యని పరిష్కరించాడు? పీపుల్స్ పోలీసుగా ఏం న్యాయం చేశాడు? ఇవి తెలుసుకుందాం...

కథ

    కొలంబియా నుంచి సముద్ర మార్గంలో వైజాగ్ వచ్చే వేరే ముఠా మాదక ద్రవ్యాల్ని ఓ బైక్ గ్యాంగ్ హైజాక్ చేసి అమ్ముకుంటూ వుంటారు. ఇదేగాకుండా విచ్చలవిడిగా చైన్ స్నాచింగులు, హత్యాలూ చేస్తూ పోలీసులకి సవాలుగా మారతారు. ఈ సంఘటనలతో ప్రజలు అల్లాడి పోతారు.  ఈ గ్యాంగ్ ని పట్టుకోవాలంటే ఓ సూపర్ కాప్- పీపుల్స్ పోలీస్ అవసరమని కమీషనర్ భావిస్తూంటాడు. ఇలా వుండగా, విజయవాడలో ఒక్ ఆలయ ఊరేగింపులో హత్యా పథకమేస్తారు వేరే దుండగులు. ఇందులోకి ఏసీపీ అర్జున్ (అజిత్ కుమార్) ఎంట్రీ ఇచ్చి హత్యా పథకాన్ని తిప్పి కొడతాడు.

        దీంతో అతడికి వైజాగ్ లో పోస్టింగ్ పడి, అక్కడో ఆత్మహత్య కేసుని దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ కేసుకి మోటార్ బైక్ గ్యాంగుతో సంబంధముందని తేలాక, అతడ్ని బైక్ గ్యాంగ్ ని పట్టుకునే కేసు అప్పజెప్తాడు కమీషనర్. అప్పుడు అర్జున్ కి అసిస్టెంట్ గా సోఫియా (హుమా ఖురేషీ) వస్తుంది. ఇంకో వైపు అర్జున్ కి పని చేయని అన్నతో, నిరుద్యోగి అయిన తమ్ముడితో సమస్యలుంటాయి. ఈ సమస్యలతో తల్లి (సుమిత్ర) బాధ పడడాన్ని చూడలేక పోతాడు.

        కేసు దర్యాప్తులో ఏసీపీ అర్జున్ కి, కొందరు నిరుద్యోగ యువకుల్ని కూడేసుకుని, సాతాన్స్ స్లేవ్స్ (సైతాను బానిసలు) అనే టెక్కీ ముఠాగా ఏర్పడి కార్తికేయ (కార్తికేయ) అనేవాడు అకృత్యాలకి పాల్పడుతున్నాడని తెలుస్తుంది. ఎవరీ కార్తికేయ? నిరుద్యోగుల్నిబానిసలుగా చేసుకుని ఎందుకీ పనులు చేస్తున్నాడు? పట్టుకోబోయిన అర్జున్ తమ్ముడ్ని కేసులో ఎలా ఇరికించి తప్పించుకుందామని చూశాడు? ఇదీ తెలుసుకోవాల్సిన మిగతా కథ.

ఎలావుంది కథ

    ఈ కథ చట్టవిరుద్ధ మోటార్‌ సైకిల్ క్లబ్ సబ్ కల్చర్ నేపథ్యంగా వుంది. సాతాన్స్ స్లేవ్స్ మోటార్‌ సైకిల్ క్లబ్‌ అనే దాని కార్యకలాపాల ఆధారంగా కథ చేశామని దర్శకుడు వినోద్ చెప్పాడు. ఈ క్లబ్ స్థాపన 1960 లలో బ్రిటన్ లోని షిప్లీలో జరిగింది. తర్వాత జర్మనీ సహా వివిధ దేశాలకి వ్యాపించింది. ఉత్తర అమెరికా, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం, దొంగిలించిన వస్తువుల రవాణా, ఆయుధాల అక్రమ రవాణా, ఇంకా దోపిడీలూ వ్యభిచారం వంటి హేయమైన కార్యకలాపాలకి ఈ ముఠా ప్రసిద్ధి. సన్స్ ఆఫ్ అనార్కీ అనే పేరుతో చట్టవ్యతిరేక పనులు చేశారు.

        దీన్ని చైన్ స్నాచింగులతో స్త్రీల మీద క్రూరమైన నేరాలకి పాల్పడే చట్టవిరుద్ధ బైకర్ల సమూహాన్ని ట్రాక్ చేసి అంతమొందించే కథగా నేటివిటీకి మార్చారు. దీనికి మాదకద్రవ్యాల కోణాన్ని జోడించారు. ఇందులో అజిత్ పాత్రని నిజజీవితం లోంచి తీసుకున్నారు. పురుచ్చి తలైవి జె. జయలలిత ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, బైక్ రేసర్‌ ని నేరుగా ఎస్‌ఐగా నియమించారు. మాజీ రేసింగ్ ప్రొఫెషనల్‌గా మారిన ఆ నిజ జీవిత పోలీస్ అధికారిని అజిత్ పాత్రకి స్ఫూర్తిగా తీసుకుని రూపకల్పన చేశారు.

నేపథ్యం ఆధునికంగా, ఫ్రెష్ గా వుంది; నేపథ్యానికి తగ్గ పాత్ర వుంది. నిరుద్యోగుల మనస్సుల్లో విషాన్ని నింపి, బానిసలుగా చేసుకుని, వాళ్ళతో సమాజం మీద పగ దీర్చుకుంటున్న దుష్టుడ్ని కడదేర్చి, నిరుద్యోగుల్ని కాపాడడంగా సాగే ఈ కథ, దారితప్పి కేవల కుటుంబ కథగా మారిపోవడాన్ని గమనించ వచ్చు.

        ఏసీపీ అర్జున్ విలువలున్న అధికారి అయినప్పుడు- ఆ విలువల్ని నేరస్థుల పట్ల కూడా ప్రదర్శిస్తూ, శిక్షలు కాదు సంస్కరణ అవసరమేనే పంథాలో తను సాగిపోతున్నప్పుడు, దుష్టుడి చేతిలో బలైపోతున్న నిరుద్యోగులతో సామాజిక సమస్యగా కథ వుంటే- తన తమ్ముడ్ని ఆ నిరుద్యోగుల్లో చేర్చి కుటుంబ సెంటిమెంట్ల సంఘర్షణగా మార్చడంతో -కుదించడంతో - కాన్సెప్ట్ చెదిరిపోయింది. సామాజ శ్రేయస్సు కథ వ్యక్తిగత- కుటుంబ కథగా యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. 1979 నాటి బైక్ గ్యాంగ్ యాక్షన్ మ్యాడ్ మాక్స్ (తెలుగులో చిరంజీవితో యమకింకరుడు’- 1982) లైనులో కథ చేసుకున్నాఈ సమస్య వుండేది కాదు.

        ఇక వలిమై ని తెలుగులో డబ్బింగ్ సినిమా అనే ఫీల్ రాకుండా తమిళ టైటిల్ తోనే విడుదల చేశారట. తమిళంలో ఈ మూవీ టైటిల్ ని వలిమి అని పలకాలట. వలిమి అంటే తెలుగులో బలిమి. బాగానే వుంది - కానీ బలిమితో చెలిమి చేయని కథయింది మరి.

నటనలు - సాంకేతికాలు

తమిళ అభిమానులు తల (లీడర్) అని పిలుచుకునే, సికిందరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ కుమార్ వన్ మాన్ షో ఇది. సూపర్ స్టయిలిష్ లుక్ తో, బలిష్టమైన శరీరంతో, యూత్ సైతం ఈర్ష్య పడే గ్లామర్ తో అజిత్ ని బిగ్ స్క్రీన్ మీద చూడ్డం పండగే. డూప్ లేకుండా వూపిరి సలపని యాక్షన్ సీన్స్, బైక్ మీద సూపర్ ఫాస్ట్ ఏరియల్ స్టంట్స్ ఇవి చాలు కడుపు నిండిపోతుంది. పాత్ర చిత్రణ ఎలా ప్రారంభమై ఎలా నడిచిందో పక్కన బెడితే. స్టార్ అన్నాక లోకానికేదో చేయాలి హై కాన్సెప్ట్ మూవీలో, కుటుంబానికి కాదు.

        హీరోయిన్ హుమా అజిత్ కి అసిస్టెంట్ గా పక్క వాద్యంగానే సరిపోయింది- యస్సర్, నో సర్ డైలాగులతో. ఇలా వుంటున్నది కాస్తా ఇంటర్వెల్ ముందు మాత్రం బైక్ గ్యాంగ్ తో ఒంటరిగా సూపర్ యాక్షన్ చేసింది. సెకండాఫ్ లో మళ్ళీ పక్కకెళ్ళి పోయింది.

        పచ్చి విలన్ గా కార్తికేయ గుమ్మకొండ అజిత్ కి పోటాపోటీ ప్రత్యర్ధి. టాటూస్ బాడీతో, జిత్తులమారి తనంతో - బైక్ యాక్షన్ తో - నిరుద్యోగుల్ని సైతాను బానిసలుగా చేసుకున్న సైకోగా కొత్త విలన్ గా కనిపిస్తాడు. సమాజం మీద తిరుగుబాటుకి బానిసల చేత ప్రతిజ్ఞ చేయించే సీను హైలైట్. ఇతడి పక్కన వాంప్ గా సారా పాత్రలో గుర్బనీ వుంటుంది.

మేకింగ్ అల్ట్రా రిచ్. అజిత్ తర్వాత ఈ సినిమాకి హీరోలు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ సర్జీ గోలోవ్కిన్- దిలీప్ సుబ్బరాయన్ లు, డజన్ల మంది యాక్షన్ ఆర్టిస్టులు. ఈ సినిమా పూర్తిగా వీళ్ళదే. ఆకాశంలో యుద్దవిమానాలు పోరాడుకుంటాయి- ఇక్కడ ఆకాశంలో బైక్ లు పోరాడుకునే ఏరియల్ యాక్షన్ ఇంటర్వెల్ కి థ్రిల్ చేస్తుంది- ప్రేక్షకుల్ని సీట్లకి కట్టిపడేస్తుంది క్షణం క్షణం టెన్షన్ తో. సెకండాఫ్ ప్రారంభంలో హైవేమీద బైక్ గ్యాంగ్ బస్సుని వెంటాడి దాడి చేసే మ్యాడ్ మాక్స్ 2 టైపు ఇంకో థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్. ఈ సీను చివరి ఘట్టంలో అజిత్ బస్సు ఆపేస్తే ముఠా దాడి కూడా ఆగిపోతుంది. ఈ లాజిక్ ని దాటేసి సీన్ని నడిపారు. ఇక ఎంతకీ ముగియని క్లయిమాక్స్ యాక్షన్ సీను మాత్రం సహనానికి పరీక్ష. ఆడవాళ్ళ మెళ్ళో గొలుసులు లాక్కుని పారిపోయే బైక్ గ్యాంగు  సీన్లలో-  ఆడవాళ్ళు రోడ్ల మీద ఈడ్చివేతకి గురై చచ్చిపోయే భీకర దృశ్యాలు సామాజిక సమస్యగా మొదలైన కథకి తగ్గట్టుగానే  వుంటాయి.  

యువన్ శంకర్ రాజా పాటలు అంతంత మాత్రం. ఇందులో మళ్ళీ అమ్మ పాటొకటి. జిబ్రాన్ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆరో 11.1 సౌండ్ అన్నప్పుడు ఆ తేడా ఏమీ అన్పించదు. షోలే లో ఆర్డీ బర్మన్ సిక్స్ ట్రాక్ సౌండ్ ని దృష్టిలో పెట్టుకుని వాద్య పరికరాల్ని ఎంచుకుని పలికించినప్పుడు, ఆ వాద్య పరికరాలు ఒక్కో ట్రాకులో విడిపోయి శ్రవణానందాన్నికల్గించాయి.

చివరికేమిటి
ఫస్టాఫ్ క్షణం కూడా కళ్ళు తిప్పుకోనివ్వని కథా కథనాలతో వుంటున్నది కాస్తా, సెకండాఫ్ పూర్తిగా డీలాపడిపోయి కథ లేకుండా అయింది. మదర్ సెంటి మెంట్ల సీన్లు, పాట మరీ సెకండాఫ్ కి హాని చేశాయి. ఇంటర్వెల్లో అజిత్ కి దొరికిపోయే కార్తికేయ, సెకండాఫ్ లో జైలు నుంచి వచ్చి అజిత్ తమ్ముడ్ని టార్గెట్ చేయడంతో, మొదలెట్టిన సామాజిక కథ మారిపోయి కుటుంబ కథగా, కుటుంబ విషాదంగా మారిపోయింది. ఇదైనా సవ్యంగా లేదు.

        కార్తికేయ తను పాల్పడుతున్న సామాజిక పీడనకి అజిత్ అడ్డురాకుండా వుండడానికి అతడ్ని కుటుంబం వైపు మరల్చిన ఎత్తుగడగా వుండి వుంటే- కాసేపు కుటుంబ కథ నడిస్తే కూడా అభ్యంతర ముండదు. తర్వాత అజిత్ కార్తికేయ వ్యూహాన్ని పసిగట్టి- కార్తికేయ సామాజిక పీడన మీదికే పోరాటాన్ని మళ్ళించి కథకి న్యాయం చేసి వుండొచ్చు. చేయలేదు. పీపుల్స్ పోలీస్ కాస్తా ఫ్యామిలీ పోలీసై పోయాడు. ఫలితంగా సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది ఇంతటి మెగా మూవీ. కథ లేకుండా కేవలం భారీ యాక్షన్ బాక్సాఫీసుకి బలమవుతుందా? అన్ని ప్రత్యేకతల ప్రచారం నిలబడుతుందా?

—సికిందర్