రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, మార్చి 2021, ఆదివారం

1032 : సందేహాలు - సమాధానాలు

Q : కథ సులభంగా రాసే పద్ధతేమైనా వుంటే వివరిస్తారా? ఎంత ట్రై చేసినా నేననుకున్న కథ రావడం లేదు.
శంభూ కుమార్ అనే మారు పేరుతో అసోసియేట్ పంపిన ప్రశ్న

A : సులభంగా కథ రాసే పద్ధతుంది. అయితే పాత్రతో ఆలోచిస్తే కథ రాదు. సంఘటనతో ఆలోచిస్తే వస్తుంది. ఈ టాపిక్ కదిపితే చాలా చెప్పుకు రావాలి. సంఘటనతో కథ ఎలా వస్తుందో చెప్పి వూరుకుంటే మీ కేమీ సరిపోదు. వెనక్కి వెళ్ళాలి. ఐడియా నుంచీ ఎత్తుకోవాలి. ఆ నియమాలకి మీ మనసు ఒప్పుకోవాలి. 99% ఇది జరగదని ఖచ్చితంగా చెప్పొచ్చు. 99% నియమాలా పాడా, నేనే ఒక నియమం అన్న నినాదమే వుంటుంది. అలాగే తీసే సినిమాలు కూడా ఏం తక్కువ తినకుండా, మేమే మీ నినాదానికి మించిన మంచి మంచి ఫ్లాపులం - అని వారానికి నాలుగేసి చెప్తాయి. అయినా సరే, చేపట్టిన నినాదమే ప్రధానం.

        నియమాల్ని కనిపెట్టిన వాడెవడో గానీ ముందు వాణ్ణి ఫ్లాప్ చేయాలి. విచిత్రమేమిటంటే, ఈ నియమాలనేవి హిట్టయిన సినిమాల్లోంచే వచ్చాయి. అయినా హిట్టయిన సినిమాల్నే ఒప్పుకోని అట్టర్ ఫ్లాపు నృత్య కేళీ కలాప నినాదాలన్న మాట. అంతిమంగా చిల్లు జేబులతో భామా కలాపం. తెల్లవారితే గురువారం సాయిబాబా పూజా కాదు, పరాజయ గండం. ఈ నియమాలూ, నేనే ఒక నియమం అన్న నినాదమూ - వీటి మధ్య ఈ సంఘర్షణా ఓ పక్క వుండగానే, 1% ఎక్కడ్నించో తొంగి చూసి, కథ రాసే సులభ పద్ధతి కోసం నియమాలు అడగడం. 1% కోసమే నియమాలనేది తెలిసిందే కాబట్టి, ఆ 1% కోసం ఈ బ్లాగు.
***

        ఎంత ట్రై చేసినా కథ రావడం లేదంటే, సరీగ్గా ట్రై చేయడం లేదనే అర్ధం. సరీగ్గా ట్రై చేసేందుకు ముందు మనస్సు ఒప్పుకోవాలి. ఒప్పుకోదు. కొందరు ఈజీగా వుంటుందని పాత్రని డిసైడ్ చేసుకుంటామంటారు. వెళ్ళి ఏమేమో ఆలోచిస్తారు. రెండు నెలల తర్వాత సరైన పాత్ర తట్టడం లేదంటారు. పాత్రకి ఏ కథ తీసుకోవాలో నిర్ణయానికి రాలేక పోతున్నామంటారు. ముందు సంఘటన ఆలోచించమని కొన్ని సంఘటనలు చెప్తే అస్సలు రుచించదు. నియమాలు రుచించవుగా. మళ్ళీ ఇంకేదో పాత్ర ఆలోచిస్తామని వెళ్ళి మళ్ళీ పాత్రే ఆలోచించడం మొదలెడతారు. చూసేవాళ్ళకి కథ మీద నెలల తరబడి బాగా కష్టపడుతున్నాడని అన్పిస్తుంది. ఎలా ఆలోచించి కష్టపడుతున్నాడో కనిపించదు.

        వార్తా విలేఖరి ఎవరి మీద ఏం రాయాలా అని ఆలోచిస్తూ కూర్చోడు. ఏం సంఘటనలు జరుగుతున్నాయో చూస్తాడు. మంత్రి ప్రెస్ మీట్ పెడితే అది సంఘటనే. ఆ సంఘటన గురించి వార్త రాస్తాడు. అంతే గానీ మంత్రిని ఆలోచించుకుని, మంత్రి మీద రాద్దామంటే ఏం రాస్తాడు. అక్షరమాల చూస్తూ కూర్చోవడమే. పాత్రతో కథ ఆలోచించడమంటే కూడా అక్షరమాల చూస్తూ కూర్చోవడమే. పాలుపోక అ ఆలు నేర్చుకుంటూ కూర్చోవడమే. రెండు నెలల తర్వాత తమిళ అక్షర మాల వేసుకుని మళ్ళీ అదే పని. 

        అక్షరాలతో కథ రాసే ట్రాప్ లో ఎలా పడతారంటే, ముందు పాత్ర అనుకుంటారు. ఆ పాత్రతో అక్షరాలు పట్టుకుని రాస్తూ పోతూంటారు. రాస్తూ రాస్తూ వుంటే ఎక్కడో ఏదో తగలక పోతుందాని అక్షర సేద్యం చేస్తూంటారు. పేజీలకి పేజీలు అక్షర భాండాగారం సృష్టిస్తారు. పాత్ర అనుకుంటే అక్షర భాండాగారమే మిగుల్తుంది. కథ వుండదు. పాత్ర అనుకుని దానికో సంఘటన అనుకున్నా సంఘటన రాదు, ముందు సంఘటన మెదిల్తేనే దాంతో పాత్ర వస్తుంది. ప్రెస్ మీట్ లేకపోతే అక్కడ మంత్రి లేడు. న్యూస్ లేదు.

        పాత్రకి సంఘటనతో ఏం సంబంధం? సినిమా కథంటేనే సంఘటన ప్రధానమైనది గనుక. ఒక్కడు లో మహేష్ బాబు, కర్నూలులో ప్రకాష్ రాజ్ బారి నుంచి భూమికని కాపాడి తీసుకొచ్చే సంఘటనే లేకపోతే మహేష్ బాబు పాత్ర లేదు. ఆ సంఘటన సృష్టించిన పరిణామాల్ని ఎదుర్కొనే పాత్ర ట్రావెల్ లేదు. అంటే  ఒక్కడు కథ లేదు. అలాగే శివ లో నాగార్జున సైకిలు చెయినుతో జేడీని కొట్టే సంఘటనే లేకపోతే నాగార్జున పాత్ర లేదు. ఆ సంఘటన సృష్టించిన పరిణామాల్ని ఎదుర్కొనే పాత్ర ట్రావెల్ లేదు. అంటే శివ కథ లేదు. 
 
        సంఘటన పాత్రని సృష్టిస్తుంది. కనుక సంఘటనల్ని చూడాలి. ఈ సంఘటన ప్లాట్ పాయింట్ వన్ మలుపే. దీన్నే కాన్ఫ్లిక్ట్ అంటారు. హాలీవుడ్ నిర్మాతలు ముందు కాన్ఫ్లిక్ట్ అడుగుతారు. ఇక్కడే కథ పుట్టి పాత్ర దాన్ని నడిపిస్తుంది గనుక. సంఘటనే జరగకపోతే, అందులోంచి కథే పుట్టక పోతే, పాత్రకి ఏ కథ పెట్టి నడిపిస్తారు. అందుకని వొట్టి పాత్రతో కథ ఆలోచించకుండా, సంఘటనతో కూడిన పాత్రతో కథ ఆలోచించాలనేది.

***
        ఇప్పుడుంది అసలు సంగతి. ఇందులోకి వెళ్ళామంటే పారిపోవాలన్పిస్తుంది. మనసు అస్సలు ఒప్పుకోదు. సంఘటన అంటేనే ఐడియా. ఐడియా అంటేనే నియమాలు. నియమాలంటేనే ఎక్కడా ఆనవాళ్ళు మిగలకుండా మనసు పుంజాలు తెంపుకుని పారిపోవడం. నో ప్రాబ్లం, మిగిలింది 1% అనుకున్నాం కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. 135 కోట్ల జనాభాలో మల్టీ మిలియనీర్స్ 3 శాతమే. చేరువలో వున్న 1% మంచి శాతమేనని ఆనందిద్దాం. స్ట్రక్చర్ మల్టీమిలియనీర్స్ గౌరవప్రదమైన 1 శాతమని తేలారు.    

సంఘటనంటే ఐడియానే అనుకున్నాం కాబట్టి, ఆ తట్టిన సంఘటన మీద వర్క్ చేసేప్పుడు స్ట్రక్చరాశ్యులు కూడా మనసుకి అడుగడుగునా కళ్ళెం వేసుకుంచుకోవాలి. ఐడియాని స్టడీ చేస్తున్నప్పుడు దాని మీదే వుండాలి. అప్పుడే లైనార్డర్ ఆలోచనలతో లైనార్డర్ మీదికి జంప్ చేయకూడదు. ఐడియా స్టడీలో భాగంగా మార్కెట్ యాస్పెక్ట్ + ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ = ఐడియా అనే సమీకరణని సాధించడానికి మనసు అంగీకరింఛాలి.     

ఇది చేస్తున్నప్పుడు కూడా లైనార్డర్ ఆలోచనలతో లైనార్డర్ మీదికి జంప్ చేయకూడదు. ఐడియాకీ లైనార్డర్ కీ మధ్య మరోటుంది. అది సినాప్సిస్. అలా స్టడీ చేసిన ఐడియాతో, మూల కథ కేర్పడ్డ చట్రంలో, కథా విస్తరణ చేస్తూ స్ట్రక్చర్ విభాగాలతో కూడిన సుస్పష్టమైన సినాప్సిస్ రాసేందుకు మనసు రాజీ పడాలి. ఇది చేస్తున్నప్పుడు కూడా లైనార్డర్ ఆలోచనలతో లైనార్డర్ మీదికి లాంగ్ జంప్ చేయకూడదు.   
      
        అప్పుడా తయారైన సినాప్సిస్ తో దృశ్యాల వారీగా, ఆయా స్ట్రక్చర్ విభాగాలు సూచించే బిజినెస్సులతో, లైనార్డర్ తయారు చేసుకుంనేందుకు మనసు సెటిల్ అవ్వాలి. ఇది చేస్తున్నప్పుడు కూడా ట్రీట్మెంట్ ఆలోచనలతో  ట్రీట్మెంట్ మీదికి హై జంప్ చేయకూడదు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడూ, డైలాగ్ వెర్షన్ ఆలోచనలతో డైలాగ్ వెర్షన్లోకి లాగిపెట్టి స్కూబా డైవింగ్ చేయకూడదు. ఇలా ఎక్కడికక్కడ మనస్సుని కట్టేసుకునే శక్తిని సముపార్జించుకోవాలి మొదట. శక్తి చాలా ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ప్లానింగ్ తో స్క్రిప్టు రాస్తే దానికదే కథ పకడ్బందీగా వస్తుంది.

Q : వచ్చిన ఐడియాని కథ రూపంలో రాసి, రాసినవి, రాసేవి అన్నీ అద్భుతాలే అనే భ్రమలో బ్రతికే నాకు మీబ్లాగు ఒక కనువిప్పు. అయితే రాసిన కథలో నిర్మాణాత్మక విలువలు ఉంటే దర్శకత్వం చేయడం కన్నా ఉత్తమ మార్గం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్నారు. కథ కరెక్ట్ డెవలప్మెంట్ చేసి ఎవరికి చెప్పుకోవాలి అనే రచయిత దర్శకత్వం చేయాలంటే ఏం చేయాలి?
మణి కుమార్

A :  గత వారం మీ ప్రశ్నకి సమాధానంగా, మీరు రైటర్ అవాలనుకుని స్క్రీన్ ప్లే పుస్తకాలు కొనుక్కున్నానన్నప్పుడు, రైటర్ అవాలనుకుంటే ముందు స్క్రీన్ ప్లే నేర్చుకోవడం మీదే దృష్టి పెట్టమన్నాం. మళ్ళీ కథల గురించే కాక, దర్శకత్వం గురించీ కూడా ప్రశ్నపంపారు. మీరు దేన్నయితే నేర్చుకోవాలనుకున్నారో దాని మీద దృష్టి పెట్టకుండా దాంతో వచ్చే ఫలితాల మీద దృష్టి పెడితే ఎన్నటికీ నేర్చుకోవాల్సింది నేర్చుకోలేరు.

(మిగిలిన ప్రశ్నలు వచ్చే ఆదివారం)

సికిందర్