రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 7, 2020

995 : రివ్యూ

 


 (అసలు పాజిటివ్ రివ్యూలు, నెగెటివ్ రివ్యూలు అని అనడమే తప్పు.  ఇలా అనడం సినిమా బావున్నా లేకపోయినా సినిమా రివ్యూ అనేది పాజిటివ్ గానే వుండాలని ఆశిస్తున్నట్టవుతుంది. రివ్యూ అంటే సమీక్ష అని తెలుగులో అర్ధం. అంటే సినిమాలో మంచి చెడ్డలు సమీక్షించి ఫలితం చెప్పడం. రివ్యూ రైటర్లెప్పుడూ నెగెటివులు కారు, 90% అట్టర్ ఫ్లాపులు తీస్తున్న వాళ్ళే సినిమా ఫీల్డుకి నెగెటివులు. ఈ మాట ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితమే చెప్పాం. రివ్యూలు లేకపోతే సినిమాలు హిట్టవుతాయనీ, వుంటే ఫ్లాపవుతాయనీ అనుకోవడం కూడా తప్పుడు వూహే. రివ్యూలు లేకపోయినా ఫ్లాపుల సంఖ్య అంతే వుంటుంది. ఇది గమనించి,  రివ్యూల నుంచి ఏమైనా తీసుకోవచ్చేమో ఆలోచిస్తే మంచిదేమో ఆలోచించుకోవాలి. రివ్యూ రైటర్లు సినిమాల బాగు కోసమే రాస్తారు, ఇంకో మాట లేదు. ఒక దర్శకుడి ప్రశ్నకి సమాధానం ఆదివారం)

రచన - దర్శకత్వం : నరేంద్ర నాథ్ 
తారాగణం :  కీర్తీ సురేష్, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా, రాజేంద్రప్రసాద్,  నరేష్, కమల్ కామరాజు తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : డానీ లోపెజ్, సుజిత్ వాసుదేవ్ 
బ్యానర్ : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ 
నిర్మాత : కోనేరు మహేష్ 
విడుదల : నెట్ ఫ్లిక్స్
***

                      Boss quote: “I want you to remember something, because a lot of times people get nice things and they start to think differently. We got here from hard work, patience and humility. So I want to tell you, don’t ever think that the world owes you anything, because it doesn’t. The world doesn’t owe you a thing.”

-from ‘Joy’ 2015
          
    దేమిటో గానీ ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు ఓటి కుండలవుతున్నాయి. మహానటి తో పేరు తెచ్చుకున్న కీర్తీ సురేష్ సినిమాలు కూడా. ఇటీవలే పెంగ్విన్ థ్రిల్లర్ వ్యవహారం చూశాం. ఇప్పుడు మిస్ ఇండియా బిజినెస్ వ్యవహారం. ఇది మరీ బిజినెస్ లేని వ్యవహారం. కాస్త స్క్రిప్టులు జాగ్రత్తగా చూసుకుని నటించవమ్మా అని ట్వీట్లతో అక్షింతలేస్తున్నారు. దర్శకుడు నరేంద్రనాథ్ ఈ స్టార్ మూవీని నిస్సారంగా తీసి కీర్తీ సురేష్  కీర్తిని నేలకి దింపాడు. మిస్ ఇండియా పేరుతో అమెరికాలో ఇండియన్ టీ ని పాపులర్ చేసే అసందర్భంతో బాటు, ఈ పేరు పెట్టి మిస్ ఇండియా నేషనల్ బ్యూటీ అవార్డుని కూడా అన్ పాపులర్ చేశాడు. మిస్ ఇండియా టీ ఏమిటి, చాయ్ భారత్ అనకుండా? సినిమాలు కొంత భాగం బావుండొచ్చు, కొంత భాగం బాగా లేక పోవచ్చు. మొత్తంగా అసలేమీ బావుండని సినిమా ఏదైనా వుందాంటే మిస్ ఇండియా నే చరిత్ర కెక్కుతుంది.
        
    ది ఇండియన్ టీ ని అమెరికాలో పరిచయం చేయాలనుకునే లంబ సింగి అమ్మాయి కథ. ఆంధ్రా ఊటీ లంబ సింగి మిడిల్ క్లాస్ బ్యూటీ, మిస్ మానసా సంయుక్త  (కీర్తీ సురేష్) అమెరికా చేరి ఇండియన్ టీ కల నిజం చేసుకోవాలనుకునే రాగ్స్ టు రిచెస్ టైపు కథ. అమెరికాలోనే ఎంబీయే చేసి ఇంట్లో వొత్తిడికి ఉద్యోగంలో చేరి, బిజినెస్ గోల్ వెంటాడుతూంటే, ఉద్యోగం వదిలేసి రోడ్డు మీద ఇండియన్ టీ అమ్మడం ప్రారంభిస్తుంది. అలాఅలా ఎదిగే ప్రయత్నాలతో  కైలాస్ (జగపతి బాబు) దగ్గరికి చేరుకుని ప్రతిపాదన పెడుతుంది. అతను తనకి పోటీ నచ్చక వెయ్యి డాలర్లు ఇచ్చి పొమ్మంటాడు. ఈ వెయ్యిడాలర్లతో చేసి చూపిస్తానంటుంది. ఇక ఆమె చేస్తూంటే కైలాస్ ఎలా అడ్డుకున్నాడో, అతడి మీద ఎలా గెలిచి మిస్ ఇండియా టీ బిజినెస్ ని కీర్తీసురేష్ సుస్థిరం చేసుకుందో అన్నది మిగతా కథ.

                                                                ***

       ముందుగా ఈ కథలో సినిమాకి కావాల్సిన ఎమోషనల్ అప్పీల్ అనేది లేదని చెప్పుకోవాలి. అమెరికన్లకి ఇండియన్ చాయ్ తెలియదన్నట్టు, కీర్తి సురేషే పరిచయం చేయడానికే  స్ట్రగుల్ చేస్తునట్టు చూపడం వాస్తవదూరంగా, అసందర్భంగా వుంది. అమెరికన్లు కాఫీ మాత్రమే తాగుతారనీ, టీ తాగరనీ కూడా చెప్పారు. అమెరికాలో కాఫీ చెయిన్లు మాత్రమే వుంటాయనీ, టీ సెంటర్లు లేవనీ కూడా పాత్రల చేత అన్పించి, కీర్తీసురేష్ పాత్రని నిరుత్సాహ పర్చే ఫాల్స్ డ్రామా సృష్టించారు. అమెరికాలో ఇండియన్ చాయ్ గురించి పూర్తిగా తప్పుడు సమాచారం ప్రేక్షకుల కిచ్చారు. దీంతో కథ సిల్లీగా, అమెచ్యూరిష్ గా కూడా తయారయ్యింది. పదుల కోట్లు రిస్కు చేసే సినిమా కథ ఇంత నిర్లక్ష్యంగా వుంటుందాని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. 

    వాస్తవమేమిటంటే అమెరికాలో 1990 ల నుంచీ చాయ్ కల్చర్ వూపందుకుంది (టీ కాదు, ఇంగ్లీషుతనం ఫీలవకుండా చాయ్ అనొచ్చు. అప్పుడే వొరిజినల్ భారతీయులు అన్పించుకుంటారు. అదనపు హంగు కావాలంటే దేశభక్తి కూడా వుందన్పించుకుంటారు. ఇండియన్ చాయ్ అనేది అన్ని విదేశీ టీల్లో కల్లా ప్రత్యేకమైనది, ప్రత్యేకించి మసాలా చాయ్, అర్ధమైంది కదా?). 1990 లలో అమెరికాలో ఇండియన్లు ప్రారంభించిన స్టార్ బక్స్, టీ వనా లాంటి చాయ్ షాప్స్ పాపులర్. పైగా అమెరికన్ల కాఫీ షాప్స్ లో కూడా ఇండియన్ చాయ్ ఎప్పట్నించో అమ్ముతున్నారు. అమెరికాలోనే కాదు, రష్యాలో కూడా చాయ్ కావచ్చు, టీ కావచ్చు బాగా తాగుతున్నారు. గ్లోబలైజేషన్ తో  ఒక దేశపు వస్తువులు మిగతా దేశాల కెప్పుడో వెళ్లి పోయాయి. కొత్తగా ఇంకెక్కడి మిస్ ఇండియా టీ ని పరిచయం చేసే ఎమోషనల్ అప్పీల్ లేని సినిమా!  
        
    కాబట్టి ఈ సినిమాలో చూపించింది ఇన్నోవేటివ్ కథ కాదు. మార్కెట్ యాస్పెక్ట్ ఏమాత్రం పట్టించుకోని కథ. పోనీ కీర్తీసురేష్ అమ్మింది మసాలా చాయా అంటే కాదు. మిస్ ఇండియా టీ అని చాయ్ కి ఇండియన్ ఐడెంటిటీని పోగొట్టి విదేశీ టీ లలో కలిపేసింది. ఏవమ్మా లంబ సింగిలో పుట్టి పెరిగావు, ఎప్పుడైనా మన మసాలా చాయ్ తాగి రుణం తీర్చుకున్నావా అనాలన్పిస్తుంది. ఆమె అమెరికాలో ఇండియన్ టీ అమ్మాలని అంత ఎమోషనల్ ఎందుకై పోతుందో కారణం కనిపించదు. పాత్రకి ఒక గోల్ ని కల్పించాలంటే, పాత్ర ప్రారంభమైన దగ్గర ఆ గోల్ తాలూకు అనుభవముండాలి. కనీసం టీ లవర్ గా చూపించాలి. లంబ సింగిలో ఆమె ఎప్పుడు ఇండియన్ టీ మన టీ అని గర్వించిందో చిత్రణ లేదు. అలాటిది అమెరికాలో ఎంబీఏ చేయగానే ఎకాఎకీన ఇండియన్ టీ ఇంట్రడ్యూస్ చేయాలనీ, ఇండియన్ టీ కి తానే అంబాసిడర్ అన్నట్టు వుండాలనీ ఎలా అనుకుంటుంది. ఇండియన్ టీ అమెరికాలో ఎప్పట్నుంచో వుంది. ఆమె ఈ సినిమాలో ఎక్కడైనా టీ తాగిందా అంటే అదికూడా ఎక్కడా తాగలేదు! లంబ సింగిలో ఇంట్లో కూడా సంసారపక్షంగా తాగలేదు. వాళ్ళమ్మకి టీ చేయడం రాదేమో. ఇలావుంది పాత్ర చిత్రణ కూడా. పైపైన ఏదో రాసేసి పైపైన తీసేసే సినిమాలుంటున్నాయి కదా, అలాటిదే ఇదీ. ఏదో రాసి తీసేసి, కీర్తీ సురేష్ భుజాల మీదేస్తే, స్టార్ ఇమేజితో ఆమె మోసుకెళ్లి పోతుందన్న ఈజీ మూవీ మేకింగ్ మెథడ్ ఆలోచనలు.

***

        ఇక ఆమె ఇండియన్ టీ తయారీ చూస్తే డిటో  భీమసేన నలమహారాజా గారి భీకర వంటకాలు. రాజావారు ఏం భీకరంగా వండుతున్నాడో, ఎలా వండుతున్నాడో వివరించకుండా ఏదో వండి పడేసినట్టు, కీర్తీసురేష్ టీ తయారీ వుంది. ఆమె కలిపే ముడి పదార్ధాలు చూస్తే, దాల్చిని, యాలకులు, సోపు, అల్లం వంటి ఇండియన్ దినుసులు, మరికొన్ని ముడిపదార్ధాలు వున్నాయా అనిపిస్తుంది. విదేశీ ముడి పదార్ధాల్లా వున్నాయవి! అసలు ఆమె వాడే టీ పొడి ఎక్కడిది? స్టార్ బక్స్ వంటి ఇండియన్ చాయ్ షాప్స్ అస్సాం, పశ్చిమ బెంగాల్, డార్జీలింగ్ ల నుంచి దేశీ తేయాకు తెప్పించుకుంటారు. కీర్తీ సురేష్ అంత గర్వకారణమైన ఇండియన్ టీ ఎలా తయారు చేస్తుందో ఒక్కసారి- ఒక్కసారైనా ఆ రెసిపీ వివరించి ఆకట్టుకోక పోతే ఇదేం టీ మీద కథ?

            చికెన్ ఖురానా (2012 -దీని రివ్యూ రాశాం) అనే ఫన్నీ హిందీ సినిమాలో చికెన్ కర్రీకి పేరున్న పంజాబీ ధాబా ఓనర్, దాని సీక్రెట్ చెప్పకుండా చనిపోతాడు. దాంతో ఆ టేస్టు రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఆ పెద్దాయన మత్తు పదార్ధం మారిజువానా కలిపేవాడని సీక్రెట్ బయట పడుతుంది. కానీ రకరకాల ప్రయోగాలతో నూరూరిస్తాడు దర్శకుడు సమీర్ శర్మ. కునాల్ కపూర్, హుమా ఖురేషీ నటించారు. ఫుడ్ మూవీ అంటే నోరూరిస్తూ వంటకాలు చూపించడమే.

***

        అసలు ఏది ఇండియన్ చాయ్ అన్నది పెద్ద ప్రశ్న. ఒక్కో ప్రాంతంలో కొన్ని రకాల చాయ్ లున్నాయి. ఇరానీ చాయ్ కూడా దేశమంతా ఒకేలాలేదు. హైదారాబాద్ లో ఒకలా వుంటే ముంబాయిలో ఒకలా వుంటుంది. ముంబాయిలోని కొలాబాలో ఇంకో వెరైటీ. హైదరాబాద్ లో ఇరానీ చాయ్ మీద ఒక వెబ్సైట్ కోసం ఇరవై ఏళ్లక్రితం ఈ వ్యాసకర్త రీసెర్చి చేసినప్పుడు, 20 రెస్టారెంట్ల ఒనర్లతో, కిచెన్లలో బావర్చీలతో భేటీ అయినప్పుడు, ఒక్కొక్కరిదీ ఒక్కో ఫార్ములా. హైదారాబాద్ లో 1932 లో ఇరానియన్లు ప్రారంభించిన మొట్టమొదటి ఇరానీ రెస్టారెంట్ ఆబిడ్స్ లోని గ్రాండ్ హోటల్, సికిందరాబాద్ లోని గార్డెన్ రెస్టారెంట్ తప్ప మిగిలినవన్నీ వివిధ స్థానిక నమూనాలే, మదీనా సహా. ఇప్పటికీ ఇరానియన్లు నడుపుతున్న గ్రాండ్ హోటల్, గార్డెన్ రెస్టారెంట్ నిర్వాహకులు ఇరాన్ నుంచి ముడిసరుకులు తెప్పిస్తారు. వాటిని కళాత్మకంగా మిశ్రమం చేసి ఇరానీ చాయ్ తయారు చేస్తారు. ఇదే ఒరిజినల్ ఇరానీ చాయ్. కాబట్టి ఇండియన్ చాయ్ కి ఇదమిత్ధమైన ఒక రూపం లేదు. గుండు గుత్తగా మసాలా చాయ్ అనేస్తున్నారు. దీంతోనే విదేశీయులకి కిక్కు. ఇదలా వుంచితే, ఆ మధ్య వైజాగ్ లో హైదారాబాద్ ఇరానీ చాయ్ అమ్మడం ప్రారంభించినప్పుడు ఆ కొత్త రుచికి ఉక్కిరిబిక్కిరై ఎగబడ్డారు జనం. వైజాగ్ జిల్లా లంబసింగి అమ్మాయికిది తెలిసే వుండాలి. జాడించి ఓ కప్పు లాగించడానికి బస్సెక్కే వుండాలి.

***

       ఎడ్యుకేటెడ్ హీరోయిన్ ఇలా పాత్రలు నటిస్తే అంతా గందరగోళమే. జగపతి బాబు పోషించిన బిగ్ షాట్ కైలాస్ పాత్ర కూడా ఆషామాషీగానే వుంది. ఒకమ్మాయి ఒక చోట టీ షాప్ ప్రారంభించుకుంటే, అది అమెరికా వ్యాప్తంగా వున్న తన కాఫీ షాప్ నెట్వర్క్ కి దెబ్బ అని పగబట్టడం సిల్లీగా వుంది. అసలు ఎంబీఏ టాపర్ అయిన కీర్తీ సురేష్ పాత్ర, టీ బిజినెస్ ప్రారంభించుకోవడానికి, అతడి పెట్టుబడి కోసం వెళ్లడం రాంగ్ బిజినెస్ అప్రోచ్. కాఫీ అమ్మేవాడికి అతడి కాఫీ బిజినెస్ కి ప్లస్సయ్యే ఐడియాలేమైనా చెప్పొచ్చుగానీ, పోటీగా తను టీ బిజినెస్ పెట్టుకుంటానంటే అతడెలా ఒప్పుకుంటాడు. అతను కాదని వెయ్యి డాలర్లు ఇచ్చి వెళ్ళమంటే, అది తీసుకోవడం ఇంకా తప్పు. పాత్ర దిగజారింది. తీసుకుంది గాక ఆ వెయ్యిడాలర్లతో టీ బిజినెస్ చేసి చూపిస్తానని సవాలు లాంటిది విసరడం ఇంకా తప్పు. అతణ్ణి రెచ్చ గొట్టడమే. తీసుకున్నాక బిజినెస్సేదో పెట్టుకుని నిలదొక్కుకుని వచ్చి, అతడి కాళ్ళకి నమస్కరిస్తే అదో సరైన బిజినెస్ నాలెడ్జి. హీరోయిన్ పాత్ర కావచ్చు, హీరో పాత్ర గావొచ్చు, లేకిగా ప్రవర్తిస్తే ఎలా నచ్చుతాయి. 
        
    కథలో సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) పుట్టించాలి కాబట్టి ఇలా అహజంగా ప్రత్యర్ధుల్ని చేసి వదిలాడు దర్శకుడు. బిజినెస్ జానర్ మూవీస్ లో కాన్ఫ్లిక్ట్ ఎలా పుడుతుందో బిజినెస్ జానర్ మూవీస్ ని పరిశీలించినట్టు లేదు. సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోతే డ్రామా లేదు, డ్రామా లేకపోతే పాత్రల్లేవు, పాత్రల్లేక కథే లేదు.

***

   కైలాస్ ని కలవడానికొచ్చినప్పుడు కూడా పాతకాలంలో లాంటి కామెడీయే. కైలాస్ ని చూసి ఎవరో అనుకుని ఆమె మాట్లాడ్డం, అతను ఆటలు పట్టించడం చాలా పూర్ క్రియేటివ్ థింకింగ్. బిగ్ షాట్ కైలాస్ ఎలా వుంటాడో కూడా కనీసం ఆన్ లైన్లో చెక్ చేసుకోకుండా వస్తుందా ఎంబీఏ టాపర్. అమెరికాలో టీ లేని లోటు గురించీ, అందులో వుండగల మంచి బిజినెస్ అవకాశం గురించీ కైలాస్ కి ఆమె ఇచ్చే ప్రెజెంటేషన్ అంతా నాన్సెన్స్. తప్పుడు నాలెడ్జి. లంబ సింగి దానివి, అమెరికాలో టీ గురించి నీకు తెలీదు, మా కాఫీ షాపుల్లో ఎప్పట్నించో అమ్ముతున్నాంలేమ్మా, వెళ్ళు -  అని అతను కూడా అనడు. అతడిక్కూడా తెలిస్తేగా. 

        ఇక దీనికి ముందు రోడ్డు పక్కన ఆమె చిన్న టీస్టాల్ పెట్టుకుంటే, అన్న చూసి, ఆ తర్వాత తల్లి చూసి అసహ్యించుకోవడం, పరువు తీసిందని మాటలనడం కూడా అవగాహనా రాహిత్యపు సీన్లే. ఇలా చూసి అమెరికన్లు గౌరవిస్తారు. అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికా వెళ్ళినా ఇండియన్ మనస్తత్వాలు మారవన్నట్టు చిత్రించడం కరెక్ట్ కాదు. ఆమె లంబ సింగి లోనే రోడ్డు పక్క టీ అమ్మిందనుకుందాం, తప్పేంటి?

***

       ఈ సినిమా ప్రారంభం మిస్ ఇండియా టీ బిజినెస్ లో అమెరికాలో రిచ్ గా సెటిలైన కీర్తీసురేష్, తన విజయానికి టీపాన మెట్లు గురించి ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకొస్తుంది... చిన్ననాటి నుంచీ బయోగ్రఫీ ఎత్తుకుంటుంది. లంబ సింగిలో అమ్మ (నదియా), నాన్న(నరేష్), తాత (రాజేంద్ర ప్రసాద్), అన్న(పెద్దయ్యాక కమల్ కామరాజు) ఓ చెల్లెలూ (పెద్దయ్యాక భానూ శ్రీ మెహ్రా) వుంటారు. నాన్న ఉద్యోగి, తాత ఆయుర్వేద వైద్యుడు. పచ్చగా వున్న కుటుంబ జీవితం. తాత చనిపోతాడు. నాన్నకి అల్జైమర్స్ వచ్చి ఉద్యోగం చేయలేక పోతాడు. కుటుంబ భారం అన్నమీద పడుతుంది. అన్నతో బాటు కీర్తీ సురేష్ ఎంబీయే చేయడానికి అమెరికా పోతుంది. 
        
    ఇంతవరకూ కథ చూస్తే, ఈ కథకి బాల్య పురాణంతో బాటు కుటుంబ బాధలు  అవసరమా. ఈ కథ ఫ్యామిలీ డ్రామానా, బిజినెస్ డ్రామానా. బాధలు వ్యూహాత్మకంగా టీ బిజినెస్ తో కదా ఫ్రెష్ గా కథ కవసరం. ఇప్పుడే అనవసర బాధలతో ప్రేక్షకులకి అలసట పెంచడమెందుకు. కథా కథనాలతో  ప్రేక్షకులకి ఎక్కడికక్కడ ఉత్సుకత కల్గించే ఒక కథా పథకమంటూ వుండదా. కమర్షియల్ సినిమా అంటే ప్రేక్షకులతో యుద్ధవ్యూహం పన్నడం కాదా. ఎవరికోసం సినిమా. సొంతంగా చూసుకుని మురిసి పోవడానికా. 

         ఇప్పుడే ఇన్ని బాధలు చెప్పు కొస్తూ, ఆమె ఎంబీయే పూర్తి చేసి, కథ పాయింటుకి రావడానికి 45 నిమిషాలు పట్టింది! ఈ కుటుంబ కథలో వూళ్ళో చెల్లెలు తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చిన గొడవతో ఇంకో పాత సినిమా టెంప్లెట్ ఒకటి. ఆయుర్వేదం తాత క్యారక్టర్ తో ఉపయోగమేంటో తెలీదు. ఆయన చనిపోవడం, దాని తాలూకు విషాదమొకటీ. తండ్రికి అల్జైమర్స్ వచ్చిన విషాద సీన్లోకటీ. అన్నాచెల్లెలు కలిసి ఎంబీయేకి అమెరికా వెళ్లడానికి తండ్రికి అనారోగ్యమే రావాలా. ప్రతీ మలుపు తీసుకునే ఘట్టానికీ సవ్యమైన కార్యకారణ సంబంధమే (కాజ్ అండ్ ఎఫెక్ట్) వుండదా. 

        ఈ 45 నిమిషాల సమయమంతా కథతో సంబంధం లేని ఉపోద్ఘాతంతో స్పేస్ ఫిల్లర్ గా మారింది. ఇలాటి నస పెట్టే దృశ్యాలు ముందుముందూ ఇంకా అసలు కథని సాగనివ్వని స్పీడ్ బ్రేకర్లుగా వున్నాయి. ఆమె టీ బిజినెస్ ఎలా పెట్టిందో, పెడితో ఏం జరిగిందో చప్పున చూపించే యాక్టివ్ స్టోరీ టెల్లింగ్ మానేసి, ప్రతీ చోటా ఏదోవొక చరిత్రతో, ఉపోద్ఘాతంతో, వృధాగా పాసివ్ స్టోరీ టెల్లింగ్ చేయడమే కన్పిస్తుంది. పైగా ప్రతీ డైలాగుకీ ఒక సూక్తి చెప్పడం, లెక్చర్లివ్వడం ధారాళంగా వుంది. 

        అమెరికాలో ఎంబీయే చేస్తున్నప్పుడు నవీన్ చంద్రతో ఇంకో టెంప్లెట్ లవ్ ట్రాక్ ఒకటి. కథకి అడ్డుపడుతూ పెళ్లి కోసం అతడి వొత్తిడి, చేసుకోమని ఇంట్లో అంటే చేసుకోననే డ్రామా, బాధ. ఆమె క్లాసులకి అటెండ్ అయినట్టు ఎక్కడా చూపలేదు గానీ, హఠాత్తుగా ఎంబీయే టాపర్ అని ప్రకటించడం! కాజ్ లేకుండా ఎఫెక్ట్. 

        45 వ నిమిషంలో హమ్మయ్యా అంటూ ఎంబీయే పూర్తి చేశాకైనా చేయాలనుకున్న బిజినెస్ కెళ్ళకుండా, ప్లాట్ పాయింట్ వన్ కి రాకూడా, ఇంకేదో ఉద్యోగంలో చేరడం, ఆ ఉద్యోగమిచ్చిన బాస్ నవీన్ చంద్రే కావడమనే పాత టెంప్లెట్ ఇంకొకటి. ఇలా ఇంకో పావు గంట గడిస్తే గానీ, అంటే పూర్తిగా గంట సేపటికి గానీ, ఆ ఉద్యోగం వదిలేసి అసలు బిజినెస్ కి రాదు. 45 వ నిమిషం తర్వాత ఎంబీఏ పూర్తయ్యాక, ఈ ప్రేమలు పెళ్లిళ్ల ఉద్యోగాల కథతో ఏం ప్రయోజనమో అర్ధం గాదు.  మొత్తానికి గంటపాటు పనికిరాని విషయాలతో కాలక్షేపం చేసిగానీ ప్లాట్ పాయింట్ వన్ కి రాలేదు. గంటా 9 నిమిషాలకి గానీ జగపతిబాబుతో కాన్ఫ్లిక్ట్ కి రాలేదు. కథ కోసం ఎదురు చూసి ఎదురు చూసి విసుగెత్తిపోవాలి ప్రేక్షకులు.  

***

       కాన్ఫ్లిక్ కి  వచ్చాక కూడా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ తో ముందు కెళ్ళ కుండా ఇంకో 12 నిమిషాలు టీ షాప్ పెట్టే ప్రయత్నాలతో ఇంకో నస. సెకండాఫ్ లో కూడా ఇంకా ప్రయత్నాల దగ్గరే వుంది కథ. ఫస్టాఫ్ లో వూళ్ళో కుటుంబ కష్టాలతో ప్రయత్నాలు, అమెరికాలో చదువు ప్రయత్నం, కథతో సంబంధం లేని ఉద్యోగ ప్రయత్నం, ప్రేమ ప్రయత్నం, పెళ్లి ప్రయత్నం, టీ స్టాల్ ప్రయత్నం, జగపతి బాబుతో కాన్ఫ్లిక్ట్ ప్రయత్నం, ఇప్పుడు సెకండాఫ్ లో టీ షాప్ పెట్టేందుకు వివిధ సమావేశాలతో వివిధ ప్రయత్నాలూ!!
     
    వార్నీయబ్బ, ఛస్తాడు మాస్ ప్రేక్షకుడు. మన సంగతి సరే. చరిత్రలు చెప్పకు, చప్పున కథ చెప్పవయ్యా బాబూ అంటే, ఎంతకీ చెప్పడు. ఇదంతా కథే కదా అనుకుంటున్నట్టుంది. ఈ నస అంతా అయ్యాక చివరి పావుగంటకో, ఇరవై నిమిషాలకో వస్తాడు సదరు  కాన్ఫ్లిక్ట్  తో పాయింటుకి. ఇప్పుడు గానీ మనకర్ధం గాదు -ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని. మిడిల్ మటాష్ ఇలా కూడా ముసుగేసుకుని వుంటుందనీ. 

        ఈ కాన్ఫ్లిక్ట్ లో జగపతి బాబు కూడా పోనీలే, ఒక టీ షాప్ పెట్టుకున్న మన తెలుగమ్మాయే కదా అనుకోకుండా, ఓవరాక్షన్ చేస్తూ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం టోటల్ గా సిల్లీ పాయింటు.

***

        ఈ మధ్య వచ్చిన బిజినెస్ జానర్ మూవీ జాయ్ (2015) లో హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ పాత్రకి బోలెడు సంసార భారం వుంటుంది. మధ్యతరగతి గృహిణిగా ఫ్లోర్ తుడిచే మాప్ ని కొత్తగా తయారు చేయాలనుకుంటుంది. ఆ ఆటోమేటిక్ మాప్ అమ్మకాలు పెరుగుతాయి. అదే సమయంలో కంపెనీలు కన్నెర్ర జేస్తాయి. ఆ కంపెనీలతో తలపడి టాప్ రేంజి కెళ్లి పోతుంది. పూర్తిగా బిజినెస్ మూవీ జనర్ మర్యాదలతో డైనమిక్ గా వుంటుంది. ఈ మాప్ వూరికే కల్పనా అంటే కాదు. నిజంగా జరిగింది. ఆ నిజ జీవిత కథా నాయకురాలు జాయ్ మాంగనో. ఈ పాత్ర నటించిన జెన్నిఫర్ ఉత్తమ నటిగా ఆస్కార్ కి నామినేట్ అయింది.

        అమెరికాలో ఇప్పుడేం కొత్త కాని ఇండియన్ టీతో, అభూత కల్పనల మిస్ ఇండియా ఒట్టొట్టి కథ సహజంగానే ఇలా అనేక అవకతవకలతో బెడిసి కొట్టింది. కీర్తీసురేష్ కి మార్కెట్ వుందని తలుగు తమిళ మలయాళ భాషలు మూడింట్లో మేకింగ్. కానీ కథకి మార్కెట్ యాస్పెక్ట్ ఏదీ? 

సికిందర్   

 (Error note : ఫోటోలు సరిగ్గా సెట్ కావడం లేదు)