రచన, దర్శకత్వం : అన్వితా దత్తా
తారాగణం: తృప్తీ దిమ్రీ, అవినాష్ తివారీ, పావలీ దామ్, రాహుల్ బోస్, పరమబ్రత ఛటర్జీ
సంగీతం: అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ దివాన్
బ్యానర్: క్లీన్ స్లేట్ ఫిలిమ్స్
నిర్మాతలు: అనూష్కా శర్మ, కర్ణేష్ శర్మ
విడుదల: నెట్ ఫ్లిక్స్
‘ఎన్ హెచ్ -10’, ‘పరీ’ వంటి సినిమాలు, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్ నిర్మించిన బాలీవుడ్ స్టార్ అనూష్కా శర్మ, తాజాగా ‘బుల్బుల్’ అనే సూపర్ నేచురల్ హార్రర్ తో ఓటీటీ ప్రవేశం చేసింది. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. రచయిత్రి అన్వితా దత్ దర్శకురాలిగా పరిచయమైంది. 19 వ శతాబ్దపు నేపథ్యంతో ‘డ్రాక్యులా’ ని తలపించే ఫీల్ తో, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దృశ్య వైభవంతో, పిశాచ కథని కవితాత్మకంగా తెరకెక్కించింది. ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్నూ’ అనే రెండు సినిమాల హీరోయిన్ తృప్తీ ధిమ్రీ టైటిల్ పాత్ర నటించింది. రాహుల్ బోస్ ద్విపాత్రాభినయం చేశాడు. అమిత్ త్రివేదీ సంగీతం చేశాడు. ఇలా ఓ జమీందారీ కుటుంబంలో అంతఃపురపు కుట్రల్ని వెల్లడించే ఈ కథేమిటో ఒకసారి చూద్దాం...
కథ
1880 లో బెంగాల్లో ఐదేళ్ళ బుల్బుల్ కి పెళ్ళవుతుంది. తన తోటి బాలుడు సత్యతో పెళ్లి
చేస్తున్నారని అనుకుంటే, సత్య అన్న ఇంద్రనీల్ (రాహుల్ బోస్) తో పెళ్లయి పోతుంది. ఐదేళ్ళ
బుల్బుల్ ని పెళ్ళిచేసుకున్న పెద్ద జమీందారు ఠాకూర్ ఇంద్రనీల్ కి తనలాగే వున్న కవల
సోదరుడు మహేంద్ర (రాహుల్ బోస్) వుంటాడు. ఇతడికి మతిస్థిమితం వుండదు. ఇంకో ఏడేళ్ళ
తమ్ముడు, బుల్బుల్ తో కలిసి ఆడుకున్న సత్య వుంటాడు. ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు
లండన్లో చదువు పూర్తి చేసుకున్న సత్య (అవినాష్ తివారీ) తిరిగొస్తాడు. వచ్చేసరికి
చాలా మార్పులు జరిగివుంటాయి. పెద్దన్న ఇంద్రనీల్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు,
చిన్నన్న చనిపోయాడు. చిన్న వదిన బినోదిని (పావలీ దామ్) వితంతువుగా శిరోముండనం చేయించుకుని
తెల్ల చీరలో వుంది. పెద్దన్న భార్య బుల్బుల్ (తృప్తీ ధిమ్రీ) దొరసానిలా జమీందారీ
బాధ్యతలు చేపట్టింది. బుల్బుల్ కి చిన్నప్పుడు సత్యతో పెళ్లి కాలేదన్న బాధ వుంటుంది. సత్య ఆమెని వదినలాగే చూస్తూంటాడు. అయితే చుట్టు పక్కల ఒక పిశాచి సంచరిస్తోందనీ, అది మనుషుల్ని చంపేస్తోందనీ అందరూ అంటూంటే వింటాడు. చిన్నన్న మహేంద్రని కూడా పిశాచి చంపేసిందని అంటారు. ఇలా వుండగా ఇప్పుడు అడవిలో వేట కెళ్తే తన కళ్ళ ముందే పోలీసు కొత్వాల్ శవవుతాడు. దీంతో ఈ చావుల రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు సత్య.
ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా పిశాచి చంపుతోందా? ఎందుకు చంపుతోంది? చిన్నన్నని పిశాచియే చంపిందా? పెద్దన్న ఎక్కడికెళ్ళి పోయాడు? ఈ మొత్తం పరిణామాల్లో డాక్టర్ సుదీప్ (పరమబ్రత ఛటర్జీ) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.
నటనలు- సాంకేతికాలు
నటిగా తృప్తీ ధిమ్రీ హైలైట్ అయిన
సినిమా ఇది. తియ్యగా నవ్వుతూ, ఇంకా తియ్య తియ్యగా మాట్లాడుతూ, స్నేహభావంతో
మెలగుతూ, హవేలీ బాధ్యతలు చూసుకునే యువ జమీందారిణీగా ఒక చెరగని ముద్ర వేస్తుంది.
అంతఃపుర రహస్యాలుంటాయి. అవి బాధైనా, మరోటైనా భరించే జమీందారిణీ హూందాతనంతో వుండే
పాత్రగా అర్ధంజేసుకుని ఒదిగిపోయింది. చిన్న వయసులో (26 ఏళ్ళు), రెండు సినిమాల
అనుభవంతో, ఈ బరువైన క్లిష్ట పాత్ర పోషించే అవకాశం రావడం ఆమెకి గొప్ప.
రాహుల్ బోస్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేశాడు. గృహ హింస వెలగబెట్టే మగ రాయుళ్ళ పాత్రలు. ఒకటి మతి చెడిన తమ్ముడి పాత్ర. చాలా శాంతంగా, తక్కువ మాట్లాడే పాత్రలు. చేపట్టేవి క్రూరమైన చర్యలు. అనుభవించేది దారుణమైన శిక్షలు. ఈ డార్క్ షేడ్ పాత్రల్లో రాహుల్ బోస్ ఒకలాటి మత్తైన వాతావరాణాన్ని క్రియేట్ చేస్తాడు నటనతో.
వితంతువు
బినోదినిగా పావలీ దామ్, ఆ నాటి వితంతువుల జీవితాలకి అద్దం పడుతుంది. డాక్టర్ సుదీప్
గా పరమబ్రత ఛటర్జీ ఇంకో ఫర్వాలేదనిపించే నటన. ఇక హీరోగా అవినాష్ త్రివేదీ లోకల్
షెర్లాక్ హోమ్స్ గా ఆసక్తి కల్గిస్తాడు. ఇంగ్లీషు ప్రభావంతో అతడి లుక్స్, మాటలు
ప్రత్యేకంగా వుంటాయి.
నటీనటులందరూ 1880 -1900 నాటి మనుషుల పోకడలతో, ముఖ్యంగా నాటి బెంగాలీ నేటివిటీతో, భాషతో, దృశ్యపరమైన సౌందర్యాన్నిపరిపుష్టం చేశారు. హవేలీ వైభవం, వర్ణ చిత్రాలు, పట్టు పరదాలు, వస్త్రా లంకరణ, వస్తు సామగ్రి, గుడ్డి నూనె దీపాల నుంచీ కాలక్రమంలో విద్యుత్ దీపాల కాంతులూ, గుర్రబ్బగ్గీలూ, ఇవన్నీ క్లాసిక్ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆ కాలం లోకి లాక్కెళతాయి.
రిచ్ కలర్స్, లైటింగ్ స్కీమ్, పిశాచి దాడి చేసేప్పుడు దృశ్యాలకి వాడిన కాషాయ కలర్స్ హార్రర్ ని కూడా ఒక దృశ్య కావ్యంలా మారుస్తాయి. కాషాయం ఎందుకంటే పిశాచి కాళికా దేవీ అని నమ్ముతారు అక్కడి ప్రజలు. పిశాచి వయొలెంట్ జస్టిస్ కి పాల్పడుతోంది. మేల్ వయొలెన్స్ కి వయొలెంట్ జస్టిస్సే సమాధానం అన్నట్టు వుంటుంది.
లైటింగ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. సత్యజిత్ రే తీసిన ‘దేవి’ పోస్టర్ కి ప్రభావితుడై ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సృష్టించానన్నాడు కెమెరా మాన్ సిద్ధార్థ్ దివాన్. అమిత్ త్రివేదీ సంగీతం స్వరాలు సుతిమెత్తగా పలుకుతాయి. ఎడిటింగ్ కొంతవరకు కథకి ఉత్తేజం తీసుకొచ్చేలా వుంది. ఎడిటింగ్ కి కథ తోడ్పడకపోతే ఎడిటింగ్ కూడా బోరే కొడుతుంది. కొన్ని చోట్ల ఎడిటర్ రామేశ్వర్ భగత్, ఏ షాట్ ముందు వేసి ఏ షాట్ వెనుక వేస్తే కిక్ వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఇంత విజువల్ అద్భుతాన్ని సృష్టించింది అన్వితా దత్తా. ఇంత దర్శకత్వం ఏ దర్శకులూ చేయరు బహుశా. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి బీభత్స సూపర్ నేచురల్ వెర్షన్ ని సృష్టించి పెట్టినట్టుంది తను.
కథాకథనాలు
19
వ శతాబ్దం, ఇంకా ఆ పూర్వపు కాలాల హార్రర్ కథల్ని గోథిక్ హార్రర్ జానర్ అంటారు. ‘ఫ్రాంకెస్టీన్’,
‘డ్రాక్యులా’ వంటి ప్రసిద్ధ నవలలు వచ్చాయి. ఇవొక ఫాంటసికల్ వాతవరణ నేపథ్యంతో
వుంటాయి. ‘బుల్బుల్’ కథ ఈ కోవకే చెందింది. ఈ కథ రబీంద్ర నాథ్ టాగూర్ నవలిక
ప్రభావంతో రాశానంది దర్శకురాలు. 1901 లో టాగూర్ రాసిన ‘నష్టనిర్’ (చెదిరిన గూడు)
నవలిక లోని పాత్రల్ని హార్రర్ లోకి మార్చి తీశానంది. గృహ హింస ఆనాడు ఎంతుందో ఈనాడూ
అంతే వుందంది. నవలికలో వున్న పాత్రలు టాగూర్ నిజ జీవితంలో అన్న దమ్ముల పాత్రలే.
బినోదిని పేరుతో పాత్రకూడా నవలికలో వుంది. ఈ నవలిక ఆధారంగా సత్యజిత్ రే ‘చారులత’
తీశారు.
దర్శకురాలు అన్విత గీత రచయిత్రిగా బాలీవుడ్ పాటలు రాసింది. మాటల రచయిత్రిగా దోస్తానా, కంబఖ్త్ ఇష్క్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, క్వీన్ వంటి 27 సినిమాలకి రాసింది. ఈ రెండు వృత్తులూ ఓకే. కథా రచయిత్రిగా వచ్చేసరికి విఫలమైంది. దర్శకురాలిగా ఎంతో అద్భుతం చేసింది. లేని కథని అద్భుతంగా తీసినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా వుండవు. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దింది. వాటికి కథే లేదు. ఐతే తనేం కథ చేస్తోందో అది మాత్రం తెలుసని చెప్పింది. రెగ్యులర్ గా తీసే ఎవరు చేశారు? - అనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ గాక, ఎలా చేశారు?- అన్న యాక్షన్ కే పరిమితం చేసినట్టు చెప్పింది. ఇదెంతో రిలీఫ్ నిచ్చే మాట. మర్డర్ ఇన్వెస్టిగేషన్, హంతకుణ్ణి పట్టుకోవడాలు వగైరా ఇంకా ఎవరిక్కావాలి? హంతకుడు ఎలా హత్య చేశాడు, ఎందుకు చేశాడనే ఆసక్తి చుట్టూ కథ వుంటే చాలు. పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత - నేటి శిక్షలు పడే ప్రహసనాలూ కాలయాపనలూ చూస్తున్నాక.
అయితే తను తెలుసుకోని దేమిటంటే, సినిమాని అడ్డంగా కుప్ప కూల్చే ఎండ్ సస్పెన్స్ అనే మాయదారి జాతికి చెందిన కథ ఇదని. దీంతో ఈ గంటన్నర సినిమా కూడా వృధా అయిపోయింది. గంటన్నరలో గంటా 10 నిమిషాల వరకూ కథ అంతుబట్టక, అసలు కథే అర్ధం గాక, పట్టపగలు కూడా నిద్ర ముంచుకొచ్చే పరిస్థితి. ఆ తర్వాతి ఇరవై నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాకుల వల్ల కథ తెలిసి ముగింపు కొస్తుంది. బుల్బుల్ కి అసలేం జరిగిందో ఈ ఇరవై నిమిషాల్లోనే తెలిసి -తెలిశాక ఇంకేం జరుగుతుందో తెలిసిపోయి- చప్పగా ముగుస్తుంది.
మరి ఫస్టాఫ్ అంతా ఏముంది? బుల్బుల్ చిన్నతనంలో పెళ్లి, తర్వాత ఇరవై ఏళ్ళు టైం లాప్స్ తో సత్య ఇంటికి రావడం, అన్నలేమయ్యారో ఆ ఫ్లాష్ బ్యాకులు అసంపూర్ణంగా తెలుసుకోవడం, చావుల దర్యాప్తు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రధాన పాత్ర బుల్బుల్ జమీందారిణీగా ఏమీ చెయ్యకుండా నవ్వులు చిందిస్తూ వుండడం, ఎంతకీ కథనం ముందుకు కదలక పోవడం, విషయం తెలియక పోవడం, ఇంతే. మూసి పెట్టిన విషయం తో ఎండ్ సస్పెన్స్ పెట్టే సహన పరీక్ష ఇలా వుంటుందని ఈ సినిమాతో వెయ్యో సారి రుజువైంది.
అనుమానిత పాత్ర లేకపోవడం ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా ఒక లోపం. బుల్బుల్ ని అనుమానిత పాత్రగా ఎస్టాబ్లిష్ చేసివుంటే కథలో చాలా సమస్యలు తీరేవి. మాటలు కవితాత్మకంగా రాసినట్టు, కథకూడా కవిత రాసినట్టు రాయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గృహ హింస తాలూకు రెండు దృశ్యాలు వయొలెంట్ గా వుంటే సరిపోలేదు. ఆ గాభరా, సస్పెన్స్ మిగతా కథలో కూడా వుండాలి. కథేమిటో ఓపెనై పాత్ర సమస్యేమిటో తెలియాలి. సమస్యేమిటంటే- అటు బుల్బుల్, ఇటు సత్య ఏదీ ప్రధాన పాత్ర కాకుండా పోయాయి. టాగూర్ నవలిక, దాంతో సత్యజిత్ సినిమా సామాజికాలు కాబట్టి సరిపోయాయి. వాటిని హార్రర్ గా మార్చాలంటే అసలు స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుండడం అవసరం.
ఈ కథలో మోస్ట్ టెర్రిఫిక్ డైలాగు, బుల్బుల్ తో బినోదిని ‘చుప్ రహెనా’ (సైలెంట్ గా వుండిపో) అనడం. అలాగని కథ కూడా సైలెంట్ గా వుండిపోతే ఎలా?
―సికిందర్