రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, మే 2019, మంగళవారం

828 : సందేహాలు - సమాధానాలు



Q : ఎప్పుడూ అప్డేట్ అవ్వాలని చెప్పే మీరే వీడియో రివ్యూస్ గురించి ఆలోచించడం లేదు. వీడియో రివ్యూస్ వల్ల మన స్పాన్ పెరగడమేగాక ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా అభిప్రాయం. దీని గురించి ఆలోచించగలరు. ఇక ఓల్డ్ మూవీస్ కి స్క్రీన్ ప్లే విశ్లేషణలు రాయడం బెటర్ అన్నారు. ఇది మంచి అయిడియా. తప్పకుండా రాస్తారని ఆశిస్తాను. అలాగే ప్రతీ నెలా ఇతర భాషలకి చెందిన ఒక మూవీ ఎనాలిసిస్ కూడా ఇస్తే బావుంటుందని నా ఉద్దేశం.
రవి, AD
         
A : బ్లాగులో వస్తున్న కంటెంట్ ని ఫేస్బుక్, వాట్సాప్ లలోనే షేర్ చేయడం లేదని గమనించగలరు. బ్లాగు కంటెంట్ కి సెలెక్ట్ రీడర్స్ వుంటారు. అందుకని సోషల్ మీడియాలో అందరి మీదా దీన్ని తీసికెళ్ళి బలవంతంగా రుద్దడం లేదు. అలాంటప్పుడు వీడియో రివ్యూలతో ఊరూ వాడా చేసుకునే ఆలోచనే వుండదు. ఈ టెక్నికల్ కంటెంట్ పట్ల ఆసక్తి వున్న మీలాంటి సెలెక్ట్ రీడర్స్  బ్లాగు కొచ్చి చదువుకుంటున్నారు, అంతవరకే. ఇక ఒక వెబ్సైట్ లో రివ్యూలు రాస్తున్నాంగా, ఇంకా వీడియో రివ్యూలెందుకు? మీరు ప్రస్తావించిన ఇంగ్లీషులో చెప్పే హిందీ సినిమా వీడియో రివ్యూలు వేరు, తెలుగులో చెప్పే తెలుగు సినిమా వీడియో రివ్యూలు వేరు. వీడియోల ద్వారా ఇవి తెలుగు ప్రేక్షకుల్లోకి నేరుగా వెళ్లిపోయి సినిమాల్నిఎక్కువ డ్యామేజి చేస్తాయి. చాలా పూర్వం రెండు ఛానెల్స్ వాళ్ళు అడిగితే ఇదే చెప్పి తప్పించుకున్నాం. అందుకని కూత రివ్యూల కంటే రాత రివ్యూలు నయం. వీటిని వెబ్సైట్స్ కొచ్చి చదివేది నెటిజనులే, అందరు నెటిజనులు కూడా కాదు. ఇక ఒక సినిమా విడుదలైతే ఓరుగల్లు నుంచి ఓవర్సీస్ దాకా సోషల్ మీడియాలో నెటిజనులైన ప్రేక్షకులే ట్విట్టర్ లో స్పాట్ రివ్యూలు పెట్టేస్తున్నారు. సినిమా చూస్తూనే లైవ్ అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు. గంటసేపు కూడా సినిమాల్ని బతకనీయడం లేదు. సినిమా రివ్యూల అర్ధమే మారిపోయింది.  

         
వీడియో రివ్యూలైతే స్టార్స్ చూసి ఆలోచిస్తారన్నారు మీరు. స్టార్స్ కి మనమేదో చెప్పాలన్న ఆరాటం దేనికి? ఈ రివ్యూలు, విశ్లేషణలు దర్శకుల కోసం, రచయితల కోసం, మీలాంటి అసిస్టెంట్స్ కోసం. వాళ్ళకి రీచ్ అవుతున్నాయి  చాలు.  ఇకపోతే, మనం క్రిటిక్ (సినిమా విమర్శకుడు) గా ఎప్పుడూ భావించుకుని పరంగా వ్యాపకాలు పెంచుకోలేదు. ఎప్పుడో పూర్వాశ్రమంలో శవ సాహిత్యం రాసి, ఫర్వాలేదు మనం కూడా మాదిరి రైటరే అన్పించాక, రైటర్ ని చంపుకోలేక, రైటర్ కళ్ళతో సినిమాల్ని చూసి, స్క్రీన్ ప్లే శాస్త్రాలేవో కాస్త వొంట బట్టించుకుని, స్క్రీన్ ప్లే విశ్లేషణలు రాస్తున్నాం. క్రిటిక్ అయివుంటే ఈ విశ్లేషణలుండవని గమనించగలరు. రివ్యూలు, విశ్లేషణలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. చేస్తున్న పనులు వేరే వున్నాయి. మీలాటి వారికి అడిగితే స్క్రిప్టు బాగోగుల వైద్య పరీక్షలు

         
ఇక మీరడిగిన పుస్తకం వేయడం గురించి. రివ్యూలకి, విశ్లేషణలకి పుస్తకాలు బావుండవు. హాలీవుడ్ వెబ్సైట్స్ లో బోలెడన్ని రివ్యూలు, విశ్లేషణలు, ఇంకేవేవో చాలా వస్తూంటాయి. అవి పుస్తకాలుగా వస్తున్నాయా? పుస్తకంగా తీసుకువచ్చే ఆలోచన ఒక్క తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్విషయంలో వుంటే వుండొచ్చు. ఈ కంటెంట్ అంతా కూడా బ్లాగులోనే వుంది. దీన్నింకా మెరుగు పర్చాల్సి  వుంది.

         
ఇక మీరన్నట్టు నెలకొక ఇతర భాషలకి చెందిన మూవీ ఎనాలిసిస్ తప్పక ఇద్దాం. అయితే సమస్యేమిటంటే, మనకి తెలుగు హిందీ ఇంగ్లీషు తప్ప భాషలు అర్ధంకావు. ఎప్పుడో నేర్చుకున్న తమిళం కాస్త అర్ధమవుతుంది. సబ్ టైటిల్స్ వున్నవి దొరికితే రాద్దాం. మధ్య సంచిక డాట్ కాంలో ప్రాంతీయ భాషల సినిమాలు రాస్తూంటే - డోగ్రీ, హర్యాన్వీ, గుజరాతీ, పంజాబీ, సంథాలీ, కోసలీ, భోజ్ పురి, నాగపురీ మొదలైన భాషలతో ఇబ్బంది రాలేదు. ఇవి వివిధ హిందీ మాండలికాలే కాబట్టి. 

         
చివరిగా, మీరు వేరే ఉత్తరంలో రాసిన విషయం గురించి మీరే ఆలోచించండి. పనిచేసే చోట క్రియేటివ్ యుద్ధాలు డిస్కషన్స్ లో ఎలాగూ తప్పవు. అదివేరు. పనిగట్టుకుని ఇంకొకరి సినిమా తప్పని ఏవో ఆధారాలు తీసుకెళ్ళి ప్రూవ్ చేయాలనుకోవడం మంచిదేనా? క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళు పోరాట కార్యకర్తలుగా మారితే క్రియేటివ్ వర్క్ చేసుకోలేరు. క్రిటిక్ గా మారకుండా క్రియేటర్ అవడం మీద దృష్టి పెడితే బావుంటుందేమో ఆలోచించండి.

        Q : రివెంజ్ జానర్ కథా కథనాలు, జానర్ లక్షణాలు, డైనమిక్స్ తెలుసుకోవాలనుంది.
శ్రీహర్ష, AD
        A :  రివెంజి కథ అనేది యాక్షన్ జానర్ లో సబ్ జానర్. యాక్షన్ జానర్ డైనమిక్సే దీనికీ వర్తిస్తాయి. కాకపోతే రివెంజి అనే పాయింటు మీద. ఈ రివెంజి కథలు ప్రేక్షకులకి సమాజం మీద కోపం వున్న కాలంలో సాగాయి. ఇప్పుడు సమాజం మీద ఎవరికి కోపం వుంది? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో బిజీ అయిపోయారు. పగా ప్రతీకారాలు తీర్చుకునే ఆలోచనలు చేయడానికి గ్లోబలైజేషన్ ఖాళీ టైమునివ్వడం లేదు. మరో వైపు మత మౌఢ్యం ప్రబలాక నిరుద్యోగం, పేదరికం, సంక్షేమం, అవినీతి, అత్యాచారాలు, ఆర్ధికాభివృద్ధి మొదలైన వాటి మీద కోపాలు రావడం లేదు. టీవీలో కొందరు నిరుద్యోగుల్ని ఉపాధి సమస్యల  గురించి అడిగితే, ‘అవన్నీ అలా వుంటాయిలెండి’ అని కొట్టి పారేశారు మతానికే థమ్సప్ చూపిస్తూ. కాబట్టి ముందు మార్కెట్ యాస్పెక్ట్ ని చూసి రివెంజి కథ మీద నిర్ణయం తీసుకోవాలి. జానర్ ఏదైనా స్ట్రక్చర్ ఒకటే. ఆ జానర్ కథని బట్టి కథనాలు వుంటాయి. ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ కోసం ఇతర రివెంజి సినిమాలు చూడాలి. వాటి కథనాల్లోంచి మీరేం కనిపెట్టి డిఫరెంట్ గా చేయగలరో ఆలోచించాలి. ’ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో అది రివెంజి అని చివరి దాకా తెలియనివ్వడు హీరో. ఇలా మీరింకేం చేయగలరో క్రియేటివ్ గా ఆలోచించాలి. స్క్రిప్టు రాయడమంటే 90% రీసెర్చి, 10% రైటింగ్ అనుకోవాలి. రీసెర్చి అంటే కాపీ కొట్టే శుభకార్యం కాదు.

        Q : మహర్షి కలెక్షన్స్ రెండో రోజే డ్రాప్ అయ్యాయట, నిజమేనా? ఎందుకు?
 
హెచ్. ఎస్. రెడ్డి, పాఠకుడు
         
A :  కలెక్షన్స్ సమాచారం స్పెక్యులేషన్. దాని జోలికి పోనవసరం లేదు. సినిమా బావుందని టాక్ వస్తే వెళ్లి చూసేయడమే. నూర్రూపాయలే ఇచ్చి నూరు కోట్ల సినిమా అప్పనంగా చూస్తూ కలెక్షన్లు వచ్చాయా లేదా ఆరాలెందుకు? రాకపోతే ఇస్తారా? వంద కోట్ల సినిమా ఏంతో త్యాగం చేసి, ఏసీ కూడా వేసి, వందకే చూపిస్తున్నప్పుడు బీహేపీ! ఇతకంటే అదృష్టజాతకులైన వినియోగదార్లు లేరు.  బస్టాండు ఏసీ రూముల్లో కూర్చుంటే టీవీ చూపిస్తూ డబ్బులు లాగేస్తారు.

         
Q : మహర్షి స్కీన్ ప్లే సంగతులు సెకండాఫ్ పూర్తి చేయకుండానే ఆపేశారు. మీరే విశ్లేషిం చలేకపోతే మేమెక్కడికి పోవాలి?
వికేఎన్, Asso Dir
         
A :  చాలా మంది ఆపేయడం గురించి అడుగుతున్నారు. అదెలా రాయాలో అర్ధంగాక ఆపేశాం. జీవితంలో ఇలాటి సినిమా ఒకటి ఎదురవుతుందని తెలిస్తే ఈ బ్లాగు ప్రారంభమయ్యేది కాదు. విశేషమేమిటంటే, మహేష్ బాబు ‘1 : నేనొక్కడినే’ అనే కళాఖండం రివ్యూ - స్క్రీన్ ప్లే సంగతులతోనే ఈ బ్లాగు ప్రారంభమైంది. ‘మహర్షి’ దెబ్బకి బ్లాగు మూతపడే పరిస్థితి. గొప్ప సినిమాలకి విశ్లేషణ రాయడం మామూలు మాట కాదు. కథగా ప్లాట్ పాయింట్స్ పెడుతూ, గాథగా కథ నడుపుతూంటే, ఎక్కడికక్కడ ఈ చిక్కు ముడులు విప్పుతూ వివరించాలంటే మతిపోయేట్టుంది. ఈ స్క్రిప్టు రచన చేసిన అద్భుత మేధావుల స్థాయిని అందుకునే పరిస్థితి లేదు. ‘నీ కన్నీటి రెప్పలంచున మనసు నిండి పొంగునా ... ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద...’ అని పాడుకోవడమే.

          Q : గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు తెలిసినంతవరకు, గాస్ పైప్ లైన్ వెయ్యటానికి ఊళ్ళు ఖాళీ చెయ్యక్కర్లేదు, ఇళ్ళు పడగొట్టక్కర్లేదు. వ్యవసాయం మానుకోనక్కర్లేదు. అవన్నీ అండర్ గ్రౌండ్ లో పొలాల కింద వేస్తారు. నిర్వహణ కోసం అక్కడక్కడ కొన్ని స్టేషన్లు ఉంటాయి. ఒకోసారి ఏదైనా పైప్ లైన్ లీకైతే గాస్ బయటకి వస్తుంది. డ్రిల్లింగ్ రిగ్ వద్ద సమస్య వస్తే బ్లో అవుట్ అవుతుంది. కాని సినిమాలో అందుకు విరుద్ధంగా చూపించారు.
 
బోనగిరి, పాఠకుడు
         
A :  ఏ మాత్రం విషయ సేకరణ చేయకుండా సమాజం మీద సినిమాలు తీస్తే ఇలాగే వుంటుంది. ఒకవేళ మీరు చెప్పినట్టు గాక, పైప్ లైను కోసం ఊళ్ళు ఖాళీ చేయించాలని కొత్త సిద్ధాంతం చెప్తున్నారేమో?  అమెరికన్ గూఢచార సంస్థ సీఐఏ కొన్ని సమస్యలకి పరిష్కారాల కోసం హాలీవుడ్ ని సంప్రదిస్తూ వుంటుంది. హాలీవుడ్ తీసే సినిమాలు అలాటి పరిగణించదగ్గ పరిష్కారాలతో వుంటాయని సీఐఏ నమ్మకం. ఈ ఉద్దేశం పెట్టుకుని మహర్షిని ఇలా తీశారేమో.

సికిందర్