రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, May 19, 2019

827 : 'పాలపిట్ట' ఆర్టికల్, విస్మృత సినిమాలు -6
          బాపూ రమణల ‘సీతాకళ్యాణం’ అవసరమున్న చోట వార్తలకెక్కకుండా రచ్చకెక్కి వార్తల్లో చేరింది. 1976 అక్టోబర్ 8 న తెలంగాణాంధ్ర రాష్ట్రమంతటా విడుదలై బాక్సాఫీసు ఇంట పూర్తి పరాజయాన్ని చవి చూశాక, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఘనమైన ప్రశంసలు పొందింది. ఇందుకే ఇది వార్తల్లో వుంటోంది. ఎవర్నయినా ‘సీతాకళ్యాణం’ చూశారా అనడిగితే సినిమా గురించి చెప్పరు (బహుశా చూసి వుండక), అది ఫలానా అంతర్జాతీయ ఖ్యాతి  పొందింది కదా అనే చెప్పి వూరుకుంటారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. లండన్, చికాగో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో;  శాన్ రెనో, డెన్వర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక, బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ కోర్సులో భాగమైంది ‘సీతాకళ్యాణం’. 

         
యప్రద అప్పటికి మూడు సినిమాల నటియే (భూమికోసం, మన్మథలీల, అంతులేని కథ). ఆమెని సీతగా బాపు తీసుకోవడం మంచి నిర్ణయమే. కానీ రాముడికి రవికుమార్ అనే కొత్త నటుణ్ణి తీసుకోవడమే నచ్చలేదు ప్రేక్షకులకి. పైగా రాముడు మాట్లాడకపోతే ఎలావుంటుంది? రవికుమార్ కి రెండో మూడో సంభాషణలున్నాయి. రవికుమార మహిమే  తప్ప ఇంకో కారణం లేకపోవచ్చు బాక్సాఫీసు మొరాయించడానికి. ఎన్టీఆర్ అంటే సరే, వయసు ఎక్కువయ్యింది. శోభన్ బాబు వున్నాడుగా? అప్పటికి బాపూయే తీసిన ‘సంపూర్ణరామాయణం’  అనే సూపర్  హిట్ తో? 

          అయితే విషయపరంగా చూస్తే ఇప్పటికీ బాలల కథల పుస్తకం చదువుకున్నంత సులభ శైలిలో కాలదోషం పట్టకుండా వుంటుంది ‘సీతాకల్యాణం’. ఇది ముళ్ళపూడి వెంకటరమణ రచనా మహిమే. చిన్న పిల్లలకి కూర్చోబెట్టి చూపిస్తే ఫుల్ ఖుష్ అయిపోతారు. రామాయణంలోని ఈ పదకొండు  ఘట్టాలూ సులభంగా అర్ధమైపోతాయి. పక్కన కూర్చుని వివరించాల్సిన పనుండదు.

          పదకొండు ఘట్టాలు : రావణుడి అకృత్యాలు, రామావతారం, సీతా జననం, విశ్వా మిత్రుడి యాగ రక్షణ,
అస్త్రోపదేశం, తాటకి సంహారం, అహల్యా శాప విమోచనం, గంగావతరణం, శివ ధనుర్భంగం, సీతారామ కళ్యాణం, పరశురామ గర్వ భంగం మొదలైనవి. ఈ పదకొండు ఘట్టాల్ని ఎలా చిత్రీకరించారో చూద్దాం...
***
      భూలోకంలో రావణుడు (సత్యనారాయణ) అరాచకాలు చేస్తూంటాడు. పంచ భూతాల్ని గుప్పిట పెట్టుకుని, అష్టదిక్పాలకుల్ని ఆటలాడిస్తూ, ప్రకృతి ధర్మాలకి  విఘాతం కల్గిస్తూ అలకల్లోలం సృష్టిస్తూంటాడు. ఆరుగురు పతివ్రతలని బంధించి వికటాట్టహాసం చేస్తాడు. భార్య మండోదరి (మమత) ఎంత వారించినా వినడు. ఆ పతివ్రతలు అగ్ని కన్పించి అందులో ఆత్మాహుతి చేసుకున్నారనీ, అగ్నిలో లంక దహనమైపోవాలని శపించారనీ, వాళ్ళ శాపాగ్నికి తిరుగులేదనీ అన్నా విన్పించుకోడు. “సర్వ దేవతా గణాలచే శరణు శరణు అన్పించా...ఆ గణాల అధినేత మహేంద్రుడి చేతే ఊడిగం చేయించా...అలాటి నన్నే అగ్ని దహిస్తాడా? వాడికంత గుండె ధైర్యమా?” అని విర్రవీగుతాడు. 

        రావణుడి ఈ ఘనకార్యాలు పై లోకాల్లో శ్రీ మహా విష్ణువు (రవికుమార్) కి చేరుతూనే వుంటాయి. దేవతలతో బాటు ధర్మపత్ని లక్ష్మీదేవి (జయప్రద) కూడా రావణుడి ఘోరకృత్యాలు విష్ణువుకి చేరవేస్తూనే వుంటుంది. నరులు వానరులు తనకంటే అల్పులన్న అహంకారంతో అథోపతనానికి దారి వేసుకుంటున్నాడని విష్ణువు అంటాడు. అతడి అహంకారమే అతడి వృత్తిని, విద్యని, తపస్సునీ దగ్ధం చేస్తున్నాయనీ విచారిస్తాడు. ఆరుగురు పతివ్రతల ఆత్మాహుతితో ఇక - “రావణాది రాక్షస సంహారానికి తరుణము ఆసన్నమైనద” ని తనే కలగజేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. దేవతల్ని వాళ్ళ అంశతో వానరుల్ని సృష్టించి, తమ శక్తియుక్తుల్ని వారిలో నింపమంటాడు. తను మానవుడయ్యి అవతరిస్తానంటాడు. ఆది శక్తులు, శంఖు చక్రాలు తన సోదరులై అనుసరిస్తారంటాడు. లక్ష్మీ దేవి నుద్దేశించి - “ధర్మసంస్థాపనోద్యమంలో ఇంతవరకూ నిన్ను విడిచి అనేక అవతారాలు ధరించాను, ఇప్పుడు ఈ మదోన్మత్తుని వధోజ్యోగంలో నీవూ కొంత భారం వహించాలి, సహకరించాలి” అని కోరుతాడు. 

          ఇటు భూలోకంలో దశరథ మహారాజు (గుమ్మడి) సంతానం కోసం తపిస్తూంటాడు. నారద మహర్షి (కాంతారావు) వచ్చి, పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తే సత్సంతతి కలుగుతుందని మహర్షులు చెబుతున్నారనీ సెలవిస్తాడు. అప్పుడు దశరథుడు ఋష్యశృంగ మహర్షి అధ్వర్యంలో ముగ్గురు భార్యలతో (కౌసల్యగా హేమలత, కైకేయిగా జమున, సుమిత్రగా పిఆర్ వరలక్ష్మి) పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తాడు. అటు దేవతలు విష్ణువాజ్ఞతో వానరులై అవతరిస్తారు. ఇటు యాగ ఫలితంగా దశరథుడికి విష్ణువు రాముడై జన్మిస్తాడు. రాముడి సోదరులుగా భరత లక్ష్మణ శతఘ్నులు జన్మిస్తారు. ఇంకా అటు లక్ష్మీదేవి వేదవతి (జయప్రద) గా అవనికి చేరుకుంటుంది. ఆమె విష్ణుమూర్తిని భర్తగా పొందేందుకు తపస్సు చేస్తూంటే అటుగా పోతున్న రావణుడు చూసి మోహిస్తాడు. జడ పట్టుకు లాగుతాడు. దీంతో వేదవతి కన్నెర్ర జేసి -  “అతివల్ని పరాభవించే నీకు పతనం ఆసన్నమైంది. నీ స్పర్శతో మలినమయ్యా. ఇక యోగాగ్నికి ఆహుతై అయోనిజగా జన్మిస్తా. నిన్ను వధించే మృత్యు రూపిణియై సకల లంకా వినాశం గావిస్తా” - అని శపిస్తుంది. 

          దశరథుడి నల్గురు కుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూంటారు. అటు దూరంగా రావణుడి రాజ్యం లంకలో రావణుడికి బంగారు కమలం కన్పిస్తుంది. దాన్ని  సొంతం చేసుకోబోతూంటే మండోదరి అది మాయా పుష్పమనీ, దాని దగ్గరికి వెళ్ళవద్దనీ వారిస్తుంది. వినకుండా దాన్ని తెచ్చుకుంటాడు. చూస్తే ఆ కాంచన కమలంలో ఆడ శిశువు కన్పించి వేదవతి పెట్టిన శాపం గుర్తుకొస్తుంది. వెంటనే దాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోతాడు. విభీషణుడు ఆ శిశువుని అక్కున జేర్చుకోబోతూంటే, కులగురువు శుక్రాచార్యుడు (పిజే శర్మ) వచ్చి వారిస్తాడు. ఆ దేవతా గణం తలపెట్టిన జగన్నాటకంలో ఇదొక భాగమనీ, ఈమె రావణ ప్రభువుకే కాదు, రాక్షస జాతికే అరిష్టం తలపెట్టగలదనీ, వెంటనే ఈ దశలోనే ఈ బిడ్డని నాశనం చేయడం క్షేమకరమనీ చెప్తాడు. లక్ష్మీదేవి అంశ అయిన ఈ బిడ్డ కన్నతండ్రి సముద్రుడు అయినందువల్ల, ఆ సముద్రుడికి సమర్పిద్దామని అంటాడు. దీంతో శిశువుని ఒక పెట్టెలో వుంచి సముద్రుడికి సమర్పిస్తాడు విభీషణుడు.

          సుదూరంగా మిథిలానగరంలో జనక మహారాజు (మిక్కిలినేని) యాగం చేస్తూ భూమిని దున్నుతూంటే,  నాగలికి పెట్టె తగులుతుంది. తీసి చూస్తే పసిబిడ్డ కన్పిస్తుంది. పరామానందభరితుడై చేతుల్లోకి తీసుకుంటాడు. నాగలి చాలుకు దొరికినందున బిడ్డకి సీత అని నామకరణం చేస్తాడు కులగురువు. 

          ఇక అటు రాముడు, ఇటు సీత పెరిగి పెద్దవాళ్ళవుతూంటారు. రాముడికీ అతడి సోదరులకీ వశిష్టుడు (ధూళిపాళ) విలువిద్యలో శిక్షణ ఇస్తాడు. బాలజానకితో బాల పరిచారికలు ఆటా పాటల్లో వుంటారు. జనకుడి మందిరంలో శివ ధనుస్సు వుంటుంది. దాని కథ చెప్పమంటుంది బాల జానకి గురువుని. ఆ కథ చెప్పడం మొదలెడతాడు గురువు. అటు అయోధ్యలో నవయువకుడిలా ఎదిగిన రాముడు (రవికుమార్) పురజనుల యోగక్షేమాలు తెలుసుకుంటూ పర్యటిస్తూంటాడు. ఇటు మిథిలా నగరంలో యవ్వనవతి సీత (జయప్రద) ఉండుండి శివధనుస్సు ఎత్తి పట్టుకోవడంతో సంభ్రమాశ్చర్యాలకి లోనవుతాడు జనకుడు. ఇంతవరకూ దాని బరువుని ఎత్తిన వాళ్ళు లేరు. సీత అవలీలగా ఎత్తుకోవడంతో, జనకుడికి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది. 
          ఏమిటా సమస్య? ఏమిటా పరిష్కారం?...ఇదీ ఇక్కడ్నించీ మిగతా కథ.
కాలదోషం పట్టని కథనం 

        రావణుడి అకృత్యాలు, రామావతారం, సీతా జననం అనే ఈ తొలి మూడు ఘట్టాలతో జరగబోయే సీతాకళ్యాణం తాలూకు పూర్వరంగాన్ని రసరమ్యంగా సృష్టించారు. కథలోకి వెళ్లేందుకు ఉపోద్ఘాతమన్న మాట. 40 నిమిషాల పాటు సాగే ఈ ఉపోద్ఘాతం చూస్తూండగానే గడిచిపోతుంది. పౌరాణికాలనగానే భారీ సన్నివేశాలతో, బరువుగా సాగే నడకతో వుండాలనేం లేదు. చకచక సాగిపోయే చిన్న చిన్న దృశ్యాలతో కూడా వుండొచ్చు. ఈ మొదటి మూడు ఘట్టాలలో చాలా దృశ్యాలున్నాయి. ఈ దృశ్యాలన్నీ ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతున్నాయనే కార్యకారణ సంబంధంతో, చర్యకి ప్రతి చర్య అనే ప్రేరక కథన ప్రక్రియతో కన్పిస్తాయి. ఇలా దృశ్యాలు ఒకదాన్నొకటి కలుపుకుంటూ శరవేగంగా సాగిపోతాయి.  ముందుగా రామావతారం అవసరమేమిటి? పాపాలు పండిన త్రిలోక కంటకుడు రావణుణ్ణి అంతమొందించడానికని. అందుకని ఉపోద్ఘాతం రావణుడి పాపాలతో ప్రారంభమవుతుంది. రావణుడి ఒక అరాచకం చూపించి వెంటనే విష్ణువుని చూపిస్తారు. లక్ష్మీ దేవిని చూపిస్తారు. అప్పుడు ఇంటర్ కట్ లో లక్ష్మీ దేవికి భూలోకంలో రావణుడు పతివ్రతల్ని చెరబట్టే దృశ్యం కంటబడినట్టు చూపిస్తారు. ఇది కట్ చేసి, లక్ష్మీదేవి విష్ణువుని మేల్కొల్పడాన్ని చూపిస్తారు. దేవతలందరితో కలిసి రావణుడి మీద ఫిర్యాదు చేయడాన్ని చూపించి, ఆ వెంటనే రావణుడి మీద దృశ్యం వేస్తారు. పతివ్రతల ఆత్మాహుతిని అతను ఆవహేళన చేయడాన్ని చూపిస్తారు. దీంతో రావణ సంహారానికి విష్ణువు ఉద్యుక్తుడైనట్టు సన్నివేశం వేస్తారు. ఇలా రామావతార ఘట్టానికి కారణమిదీ అని చూపించి - రామావతారం ఘట్టాన్ని ప్రారంభిస్తారు. 

          ప్రతీ ఘట్టం ఇలా వివరణతో వుంటుంది. ఈ వివరణలు చాలా నాటకీయంగా పద్యాలతో పాటలతో, నృత్యనాట్యాలతో  కూడా వుంటాయి. సర్వకళల సమ్మేళనంగా కథ చెప్తారు. అయినా కూడా బాపూ రమణలు పౌరాణికాలు తీస్తే అవి సామాన్యుల భాషే మాట్లాడతాయి. నేలక్లాసు వాడు కూడా నోరెళ్ళ బెట్టి చూస్తాడు. బాపు గీసే బొమ్మలు వడ్డాది పాపయ్య బొమ్మల్లాగా సంకీర్ణంగా వుండవు. సరళంగా, సింపుల్ గా వుంటాయి. సినిమాలూ అంతే. ‘సీతా కల్యాణం’ కంటే ముందు తీసిన ‘సంపూర్ణరామాయణం’ చూస్తే రామాయణం చదివినట్టే. సీతాకళ్యాణాన్ని కూడా అలాటి వొక విజ్ఞాన కోశంగా తయారు చేసి పెట్టారు. 

          ఇక ఇటు రాముడి పుట్టుక, అటు సీత పుట్టుక పరస్పర మ్యాచింగ్ సీన్స్ తో అటూ ఇటూ చూపించుకొస్తారు. అయోధ్యలో బాల రాముడి పెరుగుదల, మిథిలానగరంలో బాల జానకి ఎదుగుదల పరస్పరం చూపించుకొస్తూ, ప్రేక్షకుల్లో వాళ్ళ పట్ల ఒకరకమైన ఆత్మీయ బీజాలు తియ్యతియ్యగా నాటేస్తారు. ముందుగా ఆటు బాల రాముడి మీద పుత్రవాత్సల్యంతో  దశరథుడి మీద ‘అంతా రామమయం దశరథ ద్రుపదికి’ పాట. ఈ పాటలో కుటుంబ బాంధవ్యాలన్నీ చెప్పేస్తారు. ఆ పాటవగానే  అటు బాల జానకి మీద  ‘ఏదీ ఏదీ సీతమ్మా’ అని వెంటనే పాట. ఈ పాటలో బాల జానకి ఆసక్తులు చూపించేస్తారు. 

          ఇక అంతిమంగా సీతా రాములని జయప్రద, రవి కుమార్ లుగా దివ్యంగా ప్రత్యక్షం జేసి, ఒక పవిత్ర భక్తీ ఆధ్యాత్మికా రస ప్రవాహంలో ప్రేక్షకులు కొట్టుకుపోయేలా చేస్తారు. ఈ ఇతిహాస ప్రయోజనం దేనికోసమైతే వుందో ఆ ఆత్మిక దాహాన్ని తీర్చే మార్గం పట్టించారన్న మాట మొత్తానికి కథని. ఆత్మిక దాహాన్ని తీర్చడమే పౌరాణికాల పరమ లక్ష్యం. రాజకుమారి సీతాదేవి శివధనస్సుని అవలీలగా ఎత్తి పట్టుకోవడమే కథకి నాంది...దీంతో తండ్రి జనకుడిని వేధిస్తున్న సమస్యకి పరిష్కారమార్గం దొరికిపోయింది! ఏమిటా సమస్య?  ఈ కథా ప్రారంభాన్ని చూద్దాం... 

ఇప్పుడు కథ 
        “కొంత కాలంగా నన్ను కలవర పెడుతున్న ఒక పెద్ద సమస్యకు ఈనాడు ఈ ముహూర్తాన పరిష్కార మార్గం స్ఫురించింది. నా కుమార్తెగా భావించి పెంచే భాగ్యం కలిగించిన ఈ ఆదిలక్ష్మీ స్వరూపిణీ అయోనిజయైన సీతకు తగిన వరుణ్ణి అన్వేషించి నిర్ణయించడం నాకు సాధ్యమా అని మధనపడుతున్నాను... శివ చాపాన్ని అవలీలగా పైకెత్తగల ఈ చైతన్య స్వరూపను ఆ విల్లుని ఎత్తడమే కాదు, ఎక్కుపెట్టి నారి తొడిగే వీరునికే కన్యాదానం చేయ సంకల్పించాను...”  ఇదీ జనక మహారాజు సమస్య, దానికి దొరికిన పరిష్కారం. ఇక స్వయం వరానికి పిలుపివ్వమని కులగురువుకి చెప్పేస్తాడు. 

          ఇక శ్రీరాముడు ఎకాఎకీన బయల్దేరి వచ్చేయడమేనా స్వయంవరానికి? రాముడి పరిస్థితి చూస్తే దశరథుడి మాటల్లో ఇంకా పసివాడు, ఏ ఒక్కటీ సమగ్రంగా నేర్వని వాడు. ఎలా వెళ్తాడు షరతులతో కూడిన స్వయంవరానికి? 

          అసలు ఈ స్వయంవరం విషయమే తెలియక అటు అయోధ్యా పురంలో కీలక పరిణామం సంభవిస్తుంది. విశ్వామిత్రుడు విచ్చేస్తాడు దశరథ మహారాజు దగ్గరికి. వచ్చేసి తన యాగ రక్షణకు రాముణ్ణి పంపమంటాడు. ఒక ఫలసిద్ధి కోరి తను యాగం చేస్తూంటే మారీచ సుబాహువు రాక్షసులు పదేపదే విఘాతం కలిగిస్తున్నారనీ, అందుకని యాగ రక్షణకు రాముణ్ణి పంపమనీ అంటాడు.

          కథలకి సంబంధించి ఫోర్ షాడోయింగ్ అనే ప్రక్రియ ఒకటుంది. ముందు జరగబోయేది ముందే సూచనలందడం. అది పాత్రలకి తెలియకపోవడం. అదిక్కడ ఎంతో షాకింగ్ గా ప్రత్యక్షమవడాన్ని గమనించవచ్చు. యాగ రక్షణకు తనతో రాముణ్ణి పంపమని విశ్వామిత్రుడు అనగనే దశరథుడి పై ప్రాణాలు పైనే పోతాయి. “నా రాముడు కారడవులకు పోవడమా...”  అని దాదాపు విలపిస్తాడు. ఎంత ఐరనీ! ముందు కాలంలో తను స్వయంగా చేయబోయేది ఇదే. రాముణ్ణి అడవులకి పంపడం. మహా పురుషులతో కూడా విధి ఇలా ఆడుకుంటుందేమో. అంతేకాదు, “కంటికి రెప్ప దూరం కావచ్చేమో కానీ, రాముడికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేడు!” అని కూడా ఫోర్ షాడోయింగ్ డైలాగు చెప్పేస్తాడు. జీవితంలో జరగబోయేవి మన నోటినుంచే వచ్చేస్తాయి, మనం తెలుసుకోం. ఫోర్ షాడోయింగ్ మిస్టరీ. దీంతో అయిపోలేదు.  కైకేయి వచ్చి,  “మా ఇంటి దీపం, నా కంటి వెలుగు,  నా రామచంద్రుడ్ని కారడవికి పంపమనడం మీవంటి దయాశాలికి ధర్మమా?”  అని విశ్వా మిత్రుణ్ణి  ప్రశ్నించడం ఇంకా ఐరనీ! వాళ్ళూ వీళ్ళూ ఆని లేకుండా భూమ్మీద పడ్డ వాళ్ళందరూ ఆ ఆడించే వాడి చేతిలో ఆట బొమ్మలే.  

          ఉలిక్కిపడి చూసేలా చూసే ఈ దృశ్యం సినిమాకే హైలైట్. ఏడు నిమిషాల పాటు సాగే ఈ ఒక్క సీనుగురించి ఒక వ్యాసమే రాసేంత విషయముంది. క్లుప్తంగా చెప్పుకుంటే, ఈ దృశ్యం తన నల్గురు కుమారులకి దశరథుడు తమ వంశ చరిత్ర చెప్పడంతో ప్రారంభమవుతుంది. సగర, భగీరథ, హరిశ్చంద్రల గురించి కూడా చెప్పుకొస్తూంటాడు... ఇది నేపథ్య పరిచయ కార్యక్రమం. కథ ముందు కెళ్ళిపోయాక, మళ్ళీ వెనక్కి వెళ్లి ఉపోద్ఘాతం చెప్పడమేమిటి అసందర్భ ప్రేలాపనలా? ఇదేదో మొదట్లోనే చెప్పేయొచ్చుగా? 

          కొన్నిటిని ఎక్కడ చెప్పడం అవసరమో, చెబితే ఆ సన్నివేశానికి రాణింపు వస్తుందో, అందులోంచి కథ కూడా అందుకుని కొనసాగుతుంతో, దాన్ని అక్కడే అప్పుడే చెప్పినప్పుడు సందర్భవశాత్తుగానే వుంటుంది తప్ప, అసందర్భ ప్రేలాపన అన్పించుకోదు. నాటకీయతకిదో పునాది. దశరథుడు వంశ చరిత్ర చెప్పుకొస్తూ, హరిశ్చంద్ర చక్రవర్తి గురించి చెప్తున్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చేస్తూంటాడు! భలే నాటకీయత! బాపూ రమణలు మామూలోళ్ళు కాదు. రామాయణాన్ని ఎన్నిసార్లు ఎటుతిప్పి ఎలా చెప్పినా వాళ్ళే గుత్తే దార్లు. 

          కార్యకారణ సంబంధంతో ఈ డైనమిక్సే కథనాన్ని నిత్య చైతన్యవంతం చేస్తోంది, తాజాగా వుంచుతోంది. దశరథుడు విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపనంటే, “ఇదేమిటి, ఇప్పుడేగా సత్యవాక్పరిపాలన గురించి నీ కొడుకులకి ధర్మపన్నాలు చెప్తున్నావ్?” అని నిలదీస్తాడు విశ్వామిత్ర. ఇలా అసందర్భ ప్రస్తావనలా అన్పించే వంశ చరిత్ర ఈ సన్నివేశంలో సంఘర్షణని పుట్టిస్తూ కనెక్ట్ అయిపోతుంది. ఇలా ఆత్మరక్షణలో పడ్డ దశరథుడ్ని కైకేయి ఆదుకున్నాక, అసంతృప్తితో వశిష్టుణ్ణి అడుగుతాడు విశ్వామిత్ర. వశిష్టుడి జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది... యాగ రక్షణ ఒక నెపం మాత్రమేననీ, రాముణ్ణి సర్వసమర్ధుడు చేయడమే ఆయన ధ్యేయమనీ వివరిస్తాడు వశిష్టుడు. 

          ఇంత నాటకీయత, తాత్వికత పలుకుతున్నఈ సన్నివేశమంతా అసలెందుకని వున్నట్టు?  స్వయంవరంలో శివధనుస్సు నెత్తడానికి రాముణ్ణి సర్వ సమర్థుణ్ణి చేసే ఉద్దేశంతో వుంది. ఇది పాత్రలకీ, ప్రేక్షకులకీ తెలియకుండా యాదృచ్ఛికంగా జరిగిపోతోంది. విషయాన్ని అన్యాపదేశంగా చెప్పడమనే ఉత్తమ కథన లక్షణాన్ని ప్రదర్శిస్తోంది.

విశ్వామిత్రుడి వంతు 
      ఇక్కడ్నించీ విశ్వామిత్రుడి అధ్వర్యంలో మిగిలిన ఘట్టాలు సాగుతాయి. యాగరక్షణకు తనతో వచ్చిన రామ లక్ష్మణులకు తాటకిని చూపించి సంహరించమంటాడు. రాముడు బాణం వేసి తాటకిని చంపుతాడు. విశ్వామిత్రుడు ప్రశంసించి, తన అస్త్రాలన్నీ రామలక్ష్మణులకి ధారబోసి అస్త్రోపదేశం చేస్తాడు. గదలు, కత్తులు, త్రిశూల విష్ణు చక్రాలు సహా పంచభూతాల్ని ధారాదత్తం చేస్తాడు. ఇప్పుడు రాముడి పాత్రలో రవికుమార్ పలికే మొదటి డైలాగు వస్తుంది : “అస్త్రాధి దేవతలకు అభివందనాలు. అస్మద్గురు కటాక్ష లబ్దమైన మీ స్నేహం మాకు అమితానంద ప్రదాయకం. స్మరించినపుడు అవతరించి మాకు హితవు కూర్చండి” అని. 

          ఇప్పుడు విశ్వామిత్రుడు తన కథ చెప్పడం మొదలెడతాడు. వశిష్టుడితో ఏర్పడిన మాత్సర్యం వల్ల అహంకారంతో అరిషడ్వర్గాలని జయించలేకపోయిన తన దీన గాథని వర్ణిస్తాడు. ఇదంతా ఇప్పుడున్న రాజకీయాలకే అద్దం పడుతుంది. ఇప్పుడున్న రాజకీయుల్లో ఎవరెవరు వశిష్టులో, ఎవరెవరు బుద్ధి తెచ్చుకోలేని విశ్వామిత్రులో, ఎవరెవరు మేనకలో, 72 వేలతో ఎవరెవరు స్వర్గానికి పంపాలనుకుంటున్నారో, ఎవరెవరు త్రిశంకు స్వర్గాలు సృష్టించి అందులో ప్రజల్ని పడేస్తున్నారో, ఈ ఎన్నికల సీజనులో ఓటరు మహాశయుడికి సులభంగానే  అర్ధమైపోయేట్టు రాసి తీశారు రామాయణ స్పెషలిస్టులైన బాపూ రమణలు.  అసలైన ఎలక్షన్ సినిమా ఇదే. ఎన్టీఆర్ బయోపిక్స్ కాదు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదు, వైఎస్సార్ యాత్ర కూడా కాదు. 

          ఇక చెప్పడం పూర్తి చేసి, విశ్వామిత్రుడు యాగం ప్రారంభించినప్పుడు రాక్షసులు అల్లకల్లోలం సృష్టిస్తారు. రామలక్ష్మణులు అస్త్రాలతో యాగ ప్రాంగణం మీద అస్త్ర ఛత్రం ఏర్పరుస్తారు. ఇక పంచభూతాలని కూడా చేబూని రాక్షస నిర్మూలన గావించేస్తారు.

గంగావతరణమొక అద్భుతం 
      ఇక విజయవంతంగా యాగం ముగించుకున్న విశ్వామిత్రుడు వాళ్ళిద్దరినీ తీసుకుని గంగాతీరం వెంబడి పోతున్నపుడు గంగావతరణ గాథ చెప్పుకొస్తాడు. ప్రధానంగా  ఈ గంగావతరణ దృశ్యాల చిత్రీకరణకే ప్రసిద్ధి చెందింది ‘సీతాకళ్యాణం’. ఇదంతా కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుత ఫాంటసీగా వుంటుంది. నదుల మీద ఆనకట్టలు కట్టుకుని నీటిని మళ్లించుకోవాలన్న  సైన్సు కూడా ఇందులో వుందేమో. వరదలొస్తే తగిన డ్రైనేజీ వ్యవస్థ కూడా వుండాలన్న సూచనా ఇందులో వుందేమో. కరువు కాటకా లేర్పడితే నీటి యాజమాన్యం ఎలావుండాలన్నదానికి స్ఫూర్తినేమో. 

          ఇలా రామలక్ష్మణులకి భౌతిక, తాత్విక బోధలు చేసి మిథిలా నగరానికి తీసుకుపోతాడు విశ్వామిత్ర. పోతున్నప్పుడు అహల్యా శాపవిమోచనా ఘట్టం కూడా పూర్తవుతుంది. ఇక స్వయంవరం వేడుకలు ప్రారంభం…

మరో సింబాలిక్ దృశ్యం 
       స్వయంవరానికి విచ్చేసిన  వివిధ రాజ్యాల రాజకుమారుల్లో మొదటి ముగ్గురు శివ ధనుస్సు ఎత్తడంలో విఫలమవడంతో మిగిలిన రాకుమారులు భయపడి కుంటి  సాకులు చెప్పి తప్పించుకుంటారు. ఇంకెవరా అని చూస్తూంటే, మీసం తిప్పుకుంటూ వస్తాడు రావణబ్రహ్మ. దశరథుడు విచిత్రంగా చూస్తాడు. సీతాదేవి ఓరకంట చూసి తల తిప్పుకుంటుంది. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు ఆసక్తిగా చూస్తూంటారు. ముందుగా రావణుడు కొన్ని పగల్భాలు పలుకుతాడు. ఇక గద కింద పెట్టి ఒంటి చేత్తో ధనుస్సు ఎత్తబోతాడు. రాదు. రెండో చేత్తో ఎత్తబోతాడు. రాదు. రెండు చేతులతో ఎత్తబోయి రెండు చేతులూ ఇరుక్కుపోయి ఇరుక్కుని పోతాడు. చూస్తే ఇలా వుంది గానీ, ఇది రాముడు, సీత, రావణుల మధ్య సింబాలిక్ దృశ్యం. ఇక లాభం లేదని రాముడు ఒంటి చేత్తో శివచాపాన్ని లేపి, రావణుడ్ని కాపాడతాడు. 

          హర్షధ్వానాల మధ్య సీత రాముడికి పుష్పమాల వేసి స్వయంవరం పూర్తి చేస్తుంది. ఇది సాంకేతికంగా స్వయంవరం కాదనే వాదాలు వేరే వున్నాయి పక్కన బెడదాం. దీనితర్వాత  సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఈ కళ్యాణ ఘట్టంలో, కథకి పతాక సన్నివేశాన్ని సృష్టిస్తూ పరశురామడొచ్చేసి అడ్డుపడతాడు. స్వయంవరంలో రాముడు శివధనుస్సుని విరిచేసినందుకు అతడి కోపాగ్ని. ఇక పరశురామ గర్వ భంగం ఘట్టంతో పూర్తవుతుందీ పౌరాణిక ఇతిహాసం
.

          ఆద్యంతం ఒక పారలౌకిక అనుభవాన్నిచ్చే దృశ్య కావ్య సృష్టి చేశారు. ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చేట్టుగా  పౌరాణిక పాత్రచిత్రణలు  చేశారు. పౌరాణిక పాత్రలేస్తూ వుండిన ఆనాటి నటీనటులు ఎవరెవరైతే వున్నారో, వాళ్ళందరూ ఆ దేవుళ్ళే అన్నట్టు కన్పిస్తూ తమకిక ప్రత్యాన్మాయం లేదన్నంత శాశ్వత ముద్ర వేశారు. పౌరాణిక నటదురంధురులైన గుమ్మడి, కాంతారావు, సత్యనారాయణ, ధూళిపాళ, మిక్కిలినేని, ముక్కామల, త్యాగరాజు, జమున, హేమలత, పిఆర్ వరలక్ష్మి ల మధ్య కొత్తగా జయప్రద, రవికుమార్! చంద్రకళ తర్వాత మూడు సినిమాల నటి జయప్రద వచ్చేసి సీతనందుకుంది.   

          కథనానికి పాటలూ పద్యాలూ ప్రాణం పోశాయి. బాపూ రమణలతో  కేవీ మహదేవన్ బాగా రిపీటయ్యే కాంబినేషన్. ఇప్పుడు కూడా మహదేవన్ భక్తి పాటల్ని క్యాచీగా స్వరపర్చేశారు. ఇక రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ, కెఎస్ ప్రసాద్ ఛాయాగ్రహణం, వీటికి కుదరవల్లి కళా దర్శకత్వం. రాజభవనాల సెట్స్, ప్రతిమలు, బాపు గీసిన చిత్రపటాలు...ప్రతీదీ బాపు శైలిలో సంలీనమైపోతాయి తప్ప, ఆయన్ని ప్రేక్షకుడిగా చేసి తలా ఓ దారి పట్టి పోవు. ఇక ముళ్ళపూడి. బాగా రాస్తేనే ఎవరైనా బాగా తీయగలరు. బాలల స్థాయికి దిగి వచ్చి రాసినందువల్లే, అలా తీసినందు వల్లే సీతాకళ్యాణానికి కాలదోషం లేదు.

సికిందర్
('పాలపిట్ట’ మే ‘19 సంచిక )

No comments: