రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, May 19, 2019

826 : స్క్రీన్ ప్లే సంగతులు - 6


     ఇప్పుడు రిషికి తన విజయం వెనుక రవిశంకర్ త్యాగం ప్లస్ దాని ఫలితంగా తండ్రి మరణమనే ఘోర ట్రాజడీ వున్నాయని  అర్ధం లేకుండా రెండు పాయింట్లతో  కనువిప్పయాక, ఇంటర్వెల్ పాట వస్తుంది. ఈ పాట దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో ఇప్పుడుండడం కరెక్టే. రిషి ఇప్పుడు ప్రేక్షకులకి తెలిసిపోయిన పాత్ర కాబట్టి. ‘నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా’ అన్న ఈ కనువిప్పు పాటలో,  ఒక్కడుగా ఎవడూ విజయం సాధించడనే అర్ధంలో పంక్తులు పాత్ర ఇప్పుడున్న పరిస్థితికి వర్తిస్తున్నా, స్నేహితుడు రమ్మని పిలుస్తున్నాడా అనడం కూడా కథకి సరిపోతున్నా -‘నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలైఇందా’... ‘గెలుపై గెలుపై నీ పరుగే పూర్తయినా గమ్యం మిగిలే ఉందా’ ... ‘లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా నువు కోరే విజయం వేరే ఉందా’ ...లాంటి పంక్తులు కథని మార్చేస్తున్నాయి. రిషికి తన ఈ విజయం చాలా తప్పని ఇంత కనువిప్పయ్యాక కూడా వుండే కథ ఇంకేదో పయనం, గమ్యం, విజయం గురించి అయివుండదు. అవన్నీ బంద్ అయిపోయి నిష్కృతి గురించే వుంటుంది. నిష్కృతి కూడా పయనం, గమ్యం, విజయమైతే ఇక చెప్పేదేమీ లేదు. ఇంకా ఈ పాత్రకి సక్సెస్ పిచ్చి వదలనట్టే. ఎగ్జాం పేపర్ దొంగతనం నేరం తన మీదేసుకుని అన్యాయమైపోయిన  ఫ్రెండ్ రవిశంకర్ త్యాగం రిషి తెలుసుకోవాల్సిన పాపమే. దీనికే నిష్కృతి చేసుకుని ఈ పరుగు ఆపెయ్యాలి. ఇప్పుడింకా  విజయం గురించి మాట్లాడే, పాటలు పాడే  అర్హత వుండదు. మనుషుల్ని పట్టించుకోకుండా పరుగులు తీసి తను ఓడిపోయాడు. ఓటమికి కారణం తన విజయం కోసం మిత్రుడు చేసుకున్న ట్రాజడీ.  ఈ ట్రాజడీ లోంచి కూడా రిషి ఇంకేదో మహర్షి అవ్వాలన్న విజయాన్ని కాంక్షిస్తున్నాడంటే అతను మహర్షి కాలేడు, స్వార్ధ రాజకీయ నాయకుడవుతాడు.

          ఇందుకే ఈ వ్యాసాల్లో ఇది ‘ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్’ కథవుతుందని మొదట్నుంచీ చెప్తున్నది. రిషి సక్సెస్ కి, దానికోసం రవిశంకర్ నేరం తన మీద వేసుకుని చేసుకున్న త్యాగమనే ట్రాజడీని కథకుడు అడ్డమేశాక, ఇది త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో కేంద్ర బిందువుగా వుండే కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) పరిధిలో కొచ్చేస్తుంది. దీన్ని తప్పించుకోలేడు కథకుడు. ఈ కాన్ఫ్లిక్ట్ కి స్టేక్ హోల్డర్లయిన పాత్రల మధ్యే ఆర్గ్యుమెంట్ సహిత కథ నడపాలే తప్ప, ఒకే ఒక్క రిషి అనే పాత్రతో, కాన్ఫ్లిక్ట్ లేని స్టేట్ మెంట్ మాత్రపు ఏకపక్ష - ఏక గవాక్ష గాథగా సాగించలేడు. సాగించాలంటే మధ్యలో  కాన్ఫ్లిక్ట్ కి కారణమవుతున్న రవిశంకర్ ట్రాజడీ సహిత త్యాగాన్ని ఎత్తేయాలి.  

          తనకంటే ఇంటలిజెంట్ అయిన రవిశంకర్ ఎగ్జామ్స్ రాయకుండా వెళ్ళిపోతే, పోయాడు రాస్కెల్ అనుకుని, రిషి పట్టించుకోకుండా ముందు కెళ్ళి పోయి సక్సెస్ సాధిస్తే, అప్పుడు రవిశంకర్ గుర్తొచ్చి ఆరాతీస్తే... అప్పుడు తెలిసే విషయం రిషి సక్సెస్ నిర్వచనం మార్చుకునేలా చేస్తే ... అప్పుడు జర్నీ గాథ సవ్యంగా వుంటుంది. 

          భూముల వ్యవహారంలో తండ్రి చనిపోవడమే రవిశంకర్ ఎగ్జామ్స్ రాయకపోవడానికి కారణమనీ, ఇక చదువుకోలేక ఊళ్లోనే వుంటున్నాడనీ తెలిసి - రిషికి ఎక్కడో కలుక్కు మంటే, ఇప్పుడు తనతో అతణ్ణి పోల్చుకుని స్థిమితంగా వుండలేకపోతే, అతడితో సాగించిన మిత్రత్వమంతా గుర్తొస్తే, ఆ మిత్రుత్వంలో రవిశంకర్ తన పేదరికాన్ని దాచుకుని పెద్దపెద్ద సాయాలు చేయడం తలపుకొచ్చి కదిలిస్తే, ఇప్పుడు అతడికోసం తనేం చేయగలడో చూద్దామని వెళ్తే -  వెళ్లి అక్కడ రవిశంకర్ కళ్ళతో నిజమైన ప్రపంచాన్నిచూస్తే, దాంతో పోల్చుకుంటే తానొక్కడు విర్రవీగి మిడుకుతున్న ఈ విజయవంతమైన తన ఒంటరి ప్రపంచం ఛీ అన్పిస్తే, అప్పుడీ రిషి మహర్షి అయ్యే పరిణామ క్రమం తిన్నగా వుంటుంది.

          విజయమంటే తన కోసం తను నిర్మించుకుంది కాదనీ, విజయమంటే ప్రజలు కూడా సక్సెస్ కావడమని తెలుసుకుంటే, అప్పుడా రైతుల కోసం రవిశంకర్ తో కలిసి ప్రజా పోరాటాలకి దిగితే, రిషి మహర్షి అయ్యే మహాయానం ఓకే అవుతుంది. ఫ్రెండ్ త్యాగాన్ని అడ్డమేస్తేనే, రిషి మహర్షిగా మోక్షం పొందే పవిత్ర యాత్రకి ఫుల్ స్టాప్ అక్కడే పడుతుంది.

          ఇది స్ట్రక్చర్ లో వుంటూ కూడా లేకుండా వున్న స్క్రీన్ ప్లే అని కూడా గత వ్యాసం ఒకదాంట్లో  పేర్కొన్నాం. అసలు మహర్షికి ఉద్దేశించింది సాత్విక గాథే అయివుండొచ్చు. గాథకి స్ట్రక్చర్ అవసరం లేదు. కానీ ఈ గాథ అనే శాఖాహారానికి స్ట్రక్చర్ అనే మాంసాహారాన్ని కూడా కలిపేసి కథగా కూడా వండేశారు. కథ వేరు, గాథ వేరు. ఈ శాఖాహారంలాంటి గాథలోంచి మాంసాహారంలాంటి కథని విడదీసి - క్షీరనీర న్యాయం చేసి, ఈ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటేనే ఎండాకాలం మైండెండి పోతోంది. నరమాంస భక్షకుడయితే ఈజీగా రాసేస్తాడేమో. అటు మహేష్ బాబేమో ఎంచక్కా  కాలరెగరేస్తున్నారు. అవును, స్టార్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రేక్షకులు ఎమోషనల్ జీవులు కాబట్టి, వ్యక్తి పూజతో స్టార్ ని చూపిస్తూ ఎలా తీసినా ఒక్కోసారి సక్సెస్ అయిపోతాయి సినిమాలు.
***
      ఇంటర్వెల్ సీన్లోనే విమాన మెక్కి బయల్దేరతాడు ఫ్రెండ్ దగ్గరికి రిషి. అలా ఎలా బయల్దేరతాడు? తన సీఈవో పోస్టుకి రిజైన్ చేయడా?ఈ పోస్టు అలాటి ఫ్రెండ్ పెట్టిన భిక్ష కాదా? పాటే చెప్తోంది కదా? ఇది మరీ ఎక్కువ వూహించి రాస్తున్నట్టుందా? అలాగే వుంటుంది. పాత్ర నైతిక సామంజస్యాన్ని ప్రశ్నించాల్సిందే, తప్పదు. ముందు ఇది తేలాకే మిగతా కథ. ఇది తన సక్సెస్ కాదని తెలిసినప్పుడు, దీని వెనుక ఫ్రెండ్ తో తన అజ్ఞానమే వుందని తెలిసినప్పుడు తప్పకుండా అలాటి సీఈవో పోస్టుకి రిజైన్ చేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవతల తన వల్ల ఫ్రెండ్ జీవితమే పోయింది, ఈ పోస్టెంత? నైతిక ప్రాతిపదికన ఇలాటి నిర్ణయాలు తీసుకోని పాత్ర ఏం పాత్ర? వూరికే పాటలో నిజాయితీ వుంటే చాలదు, చేతల్లో కూడా కన్పించాలి. అది ఆశ్చర్య పర్చాలి – What is character, but the determination of incident. And  what is incident, but the illumination of character.” ―Henry James, The Art of Fiction. ఇంటర్వెల్లో గనుక రిషి లీవ్ పెట్టకుండా చేయాల్సిన రిజైన్ చేసేసి వుంటే, పాత్రగా ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. అపార సానుభూతిని మూట గట్టుకునే వాడు. 

        మహర్షి’ వెంటే విడుదలైన మలయాళ రీమేక్ ‘ఎబిసిడి’ లో నైతిక ప్రాతిపదిక చక్కగా  వుంటుంది. ఎన్నారై కొడుక్కి డబ్బు విలువ తెలియాలని డబ్బు లేకుండా ఇండియాలో పడేస్తే, డబ్బు కోసం కొన్ని వెధవ పనులు కూడా చేసి, అనుకోకుండా ప్రజా సమస్యల్లో తలదూర్చి పరిష్కరిస్తే, దీంతో ఆ ప్రజలు ఆకాశాని కెత్తేస్తూంటే, నిజం చెప్పేస్తాడు హీరో -  ప్రజలనుకుంటున్నటు తామిక్కడ గొప్ప పనులు చేయడానికి రాలేదనీ, ఇక్కడ ఇరుక్కున్న తాము ఇక్కడ్నుంచీ అమెరికా చేక్కేయాలనే  డబ్బుకోసం కొన్ని వెధవ పనులు చేశామనీ. ఇక్కడుండి మంచి చేయాలనీ ఎప్పుడూ అనుకొలేదనీ, పరిణామాలకి సిద్ధపడి నిజాయితీగా నిజం చెప్పేస్తాడు. దీంతో హీరో పాత్రతో మొదట్నించీ వున్న నైతిక సమస్యని హీరోనే జడ్జిమెంటుకి పెట్టేశాడు, పెట్టి తీరాలి. కమ్ క్లీన్ మిస్టర్ రిషీ, కమ్ క్లీన్. 

          రిషికి ఇందుకు మనస్కరించలేదు. తన వల్ల అన్యాయమైన ఫ్రెండ్ పుణ్యాన పొందిన  సీఈవో హోదాతోనే ఫ్రెండ్ దగ్గరికి బయల్దేరాడు.
***
          లైఫ్ జర్నీ అంటే పాత్ర తనలోకి తను చేసుకునే ప్రయాణం. విమానాల్లో, కార్లలో తిరగడం కాదు. రిషి యూఎస్ లో ఫ్లయిట్ ఎక్కాక, ఇంటర్వెల్ తర్వాత హైదరాబాద్ విమానాశ్రయంలో దిగడం, అక్కడ్నించి  కారెక్కి ఎక్కడో గోదావరి జిల్లాలో రామవరానికి బయల్దేరడం, రామవరం వూళ్ళో ఆగి, రవిశంకర్ గురించి ఆరా తీయడం... ఇదంతా  సినిమా నిడివి పెంచే నస. బలహీన కథనం. ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు మిడిల్ -2 లోకి ఎంటరైంది కథ. మిడిల్ -2 అంటే మిడిల్ -1 కంటే ఎక్కువ గాఢత్వాన్ని, బలాన్ని కలిగి వుండేది. మిడిల్ -1 అంటే కథ అనే మహా సముద్రంలో పైపైన ఈత కొట్టి జలాల్ని పరీక్షించడమైతే, మిడిల్ -2 ఆ సముద్ర గర్భంలోకి వెళ్లి సంగతి తేల్చుకోవడం.

          ఇంటర్వెల్లో ఒక పాయింటుతో ఏదేమిటో లీడ్ ఇచ్చేశాక, ఇంకెందుకు ఆలస్యం? ఆ లీడ్ నీ, ప్రేక్షకాసక్తినీ డైల్యూట్ చేయడం? ఇక్కడ ఫ్లయిట్ టేకాఫ్ తీసుకుంటే, ఇంటర్వెల్ తర్వాత డైరెక్టుగా  అక్కడ రామవరంలోకి కారు ఎంటరవుతూంటే, రవిశంకర్ ఎదురు పడ్డం -లీడ్ ఇచ్చిన పాయింటుని ఢీకొనడం, కథన వేగాన్ని పెంచే డైనమిక్స్ తోబాటు, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే ట్రిక్కే కదా?

          సరే, అలా రిషి రవిశంకర్ దగ్గరి కొచ్చాక సారీ చెప్పడు. తనతో పదమంటాడు యూఎస్ కి. రవిశంకర్ రానంటాడు. ఇంతే. ఎందుకు రాడంటే, ఇక్కడ గ్యాస్ కంపెనీ వల్ల  భూములూ ఊరూ పోతున్నాయి, దీన్ని అడ్డుకోవాలి కాబట్టి. అంటే, ఈ సమస్య లేకపోతే వెళ్ళిపోయే వాడా రిషి వెంట? ఇదేనా పాత్రంటే? ఎగ్జాం పేపర్ నేరంలో రిషి ఇరుక్కోకుండా కాపాడింది ఇందుకేనా? ప్రతిఫలం పొందడానికి? అప్పుడు ఇద్దర్లో తేడా ఏముంది, ఇద్దరూ స్వార్ధపరులే. 

          ‘సారీ భయ్యా, నీకు నేనేదో చేశానని నువ్వనుకుని నాకేదో చేయాలనుకోవడమేమిటి? నీకు నేనేం చేశానని? ఏమీ చేయలేదు. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ లా వుందామంటే వుందాం, ఇంతకి మించి నేను యాక్సెప్ట్ చెయ్యను’ అని రవిశంకర్ అనేసి వుండాలి. 

          ఇంటర్వెల్ పాటలో చెప్పిన కొత్తగా మొదలైన పయనం, గమ్యం, విజయం ఇదేనా? రిషి రవిశంకర్ని యూఎస్ తీసికెళ్ళిపోయి, తన సక్సెస్ లో భాగం చేయడం? లేకపోతే తనతో రమ్మని ఎందుకంటాడు? వస్తే ఈ ఫ్రెండ్ రుణభారం తీరిపోయి గొడవ వదిలిపోతుందన్నట్టు? వదిలిపోయి తను అదే ఇగోతో మజాగా కంటిన్యూ అవచ్చన్నట్టు? కట్ అండ్ పేస్ట్ సొల్యూషన్? ఇందుకోసం రిషి వచ్చుంటే అతడేం మారినట్టు? ఎందుకిలా పాత్రచిత్రణల్ని అర్ధంపర్ధం లేకుండా నిమిషానికో రకంగా మార్చేస్తూ కథా గమనాన్ని గజిబిజి చేస్తున్నారు? ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ కూడా భారీ ఎదుగుదలతో మదర్ నిరుపమా రాయ్ దగ్గరికెళ్ళి రమ్మంటే రాను పొమ్మంటుంది. ఎదుగుదలకి నైతిక ప్రాతిపదిక వుండాలి. రిషికి లేనిదిదే. కానీ అమితాబ్ మదర్ కున్న ఆత్మాభిమానం మాత్రం లేదు రవిశంకర్ కి.  

          కనీసం రిషి, ఎగ్జాం పేపర్ దొంగగా శాశ్వత ముద్రేసుకున్న రవిశంకర్ హృదయభారాన్నికూడా దింపాలనుకోడు. ఆ ఎంపీ కొడుకుని పట్టుకుని జైల్లో తోయించా నుకోడు. ఈ బేసిక్ ఇష్యూస్ ని క్లియర్ చేయకుండా ఏం ఉద్ధరిస్తాడు రవిశంకర్ని?
***
          ఇక రవిశంకర్ యూఎస్ కి రానంటే, అతడి భూముల్నీ, వూరునీ కాపాడుకోవాలన్న అభీష్టాన్ని తను తీర్చాలనుకుంటాడు రిషి. ఇది ప్రత్యుపకారం చేసే ఉద్దేశమే అవుతుంది తప్ప మరోటి కాదు. ఇలా ప్రత్యుపకారం చేసి మహర్షి అన్పించుకుంటే, ముందు చెప్పుకున్నట్టు అవకాశవాద రాజకీయ నాయకుడే. ముందు చెప్పుకున్నట్టు రవిశంకర్ త్యాగంతో కథలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. కానీ దీంతో కథ నడపాలనుకోలేదు. అందుకే కాన్ఫ్లిక్ట్ ని డైల్యూట్ చేసి, రవిశంకర్ని పాసివ్ పాత్రగా మార్చేసి, రిషిని మాత్రం మహర్షిగా మార్చే కథాకార్యక్రమం మొదలెట్టారు - పరిత్యాగంతో కాక ప్రత్యుపకారంతో మహర్షిగా! విచిత్రం కదూ? 

           మరి దీన్నేం చేయాలి? జపాన్ వాళ్ళు, చైనావాళ్ళు ఇలాటి కథల్ని ఎలా చేస్తారో చివర్లో తెలుసుకుందాం. మేరా జూతా హై జపానీ - అని జపాన్ వాడి బూట్లలో కాళ్ళు పెట్టడమే. లేకపోతే హిందీ చీనీ భాయ్ భాయ్ - అని చైనావాడి సెల్ ఫోన్లో పాడుకోవడమే.
***
          ఇక భూముల వ్యవహార మేమిటో తెలుసుకోవడానికి రిషి కలెక్టర్ ని కలవడం, తర్వాత మంత్రిని కలవడం, ఆతర్వాత విలన్ ని కలవడం సాగతీత నసే. కేవలం సమాచారమిచ్చే ఈ సీన్ల వల్ల పాత్రకి గానీ, కథకి గానీ ఒరిగిందేమీ లేదు. కలెక్టరేదో చెప్పాక మంత్రిని కలవడం, మంత్రేదో చెప్పాక విలన్ని కలవడం, రిషి పాత్రని పరమ పాసివ్ గా, అన్ ప్రొఫెషనల్ గా మార్చేయాయి. రిషి ఒక సీఈవో అని మర్చిపోయారేమో. అతను తలచుకుంటే చిటికెలో తెలుసుకుంటాడు. ప్రపంచ సీఈవోల్ని స్టడీ చేసి, ఒక టిమ్ కుక్ నో, సుందర్ పిచాయ్ నో, మార్క్ జుకర్ బెర్గ్ నో మోడల్ గా తీసుకుని, రిషి పాత్రని తీర్చి దిద్ది వుంటే ఆ వ్యవహార శైలియే భిన్నంగా, థ్రిల్లింగ్ గా వుండేది. 

          ఇక మంత్రి ఇచ్చిన సమాచారంతో ఈ  ప్రాజెక్టు వెనుక ముంబాయిలో వివేక్ మిట్టల్ (విలన్) వున్నాడని పాసివ్ గా తెలుసుకుని, అట్టహాసంగా ఛార్టెడ్ ఫ్లయిట్ ఎక్కి బయల్దేరతాడు రిషి. ఇలా రిచ్ కార్లలో, ఫ్లయిట్లలో అట్టహాసంగా చక్కర్లు కొట్టడమే రిషి మహర్షి అయ్యే జీవిత ప్రయాణంలాగా వుంది. భౌతికలోకంలో ప్రయాణాలు చేస్తాడే తప్ప, అసలింత సమస్య తెచ్చి పెట్టిన ఈ వెధవ మనస్సేంటని, దాంట్లోకి అస్సలు ప్రయాణించాలనుకోడు. 

          ఇప్పుడు విలన్ కోసం ముంబాయి వెళ్ళే సీనుంటే ఎమ్జీఆర్ ఇలా అంటాడు -  వాడెవడయ్యా వాడి దగ్గరికి నేనెళ్ళడం? వాడ్నే రమ్మను, లేకపోతే నేనే రప్పిస్తా! – అని డైరెక్టర్ తో చెప్పేసి కూర్చుంటాడు. ఆయనకి కమర్షియల్ లెక్కలన్నీ తెలుసు. తను విలన్ దగ్గరికి పోతే ఫ్యాన్స్ గొడవ చేస్తారనీ తెలుసు. మహేష్ బాబు ఫ్యాన్స్ గొడవ చెయ్యరు. 

          70 దేశాల్లో ఆపరేషన్స్ నిర్వహించే గ్లోబల్ కంపెనీ సీఈవో, బోడి కంపెనీ పెట్టుకున్న విలన్ దగ్గరకి పోవడమా? శవ్వ! శవ్వ!
  (కోట శ్రీనివాస రావు) 

         ఓకే, ఇక్కడితో ఆపేద్దాం. ఇంకా రాస్తే ఈ వ్యాసం మీద వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఏదెలా వున్నా అలా సినిమా చూసేయడమే, విశ్లేషణ జోలికి పోకుండా. చివర ‘ఇదే కదా నీ కథ’ పాటలో -  ‘నీ కన్నీటి రెప్పలంచున మనసు నిండి పొంగునా ...ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద...’ అనే పంక్తి వుంది. దీంతో ఈ ఉదాత్త గాథని సంతృప్తికరంగా ఫీలవుదాం.

          ఇక జపాన్లో, చైనాలో ఏం చేస్తారంరే, ఈ స్ట్రక్చర్ పేరు  ‘కిషారెన్ కాట్స్యూ’ (
kishōtenketsu) గ్యారంటీగా నోరుతిరగదు - దీనికి త్రీయాక్ట్ స్ట్రక్చర్, దాని బేస్ అయిన కాన్ఫ్లిక్ట్ వుండవు. 4 యాక్ట్స్ వుంటాయి. పాత్రల పరిచయం, అభివృద్ధి, ట్విస్టు, పరిష్కారం. ఈ నాలుగు అంకాల్లో మొదటి అంకంలో పాత్రల్ని పరిచయం చేశాక, రెండో అంకంలో ఆ పాత్రల్ని అభివృద్ధి చేస్తారు. మూడో అంకంలో అప్పటికి వచ్చి కథకి ట్విస్టు ఇస్తారు, నాల్గో అంకంలో ఆ ట్విస్టుని పరిష్కరిస్తారు. అంటే, మూడో అంకంలో ట్విస్టు వచ్చే వరకూ కథనంలో ఏమీ జరగదు. ట్విస్టు దగ్గరే కథ మొదలై ఆ వెంటనే పరిష్కారమై పోతుంది. ఇలా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఈ స్క్రీన్ ప్లే లుంటాయి. దీనికింకో పేరు పెడితే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. కాన్ఫ్లిక్ట్ ని ఎగేస్తే అంతే మరి.

సికిందర్