రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 17, 2018

688 : రివ్యూ






దర్శకత్వం : అనురాగ్ కశ్యప్
తారాగణం : తాప్సీ, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, ఆష్నూర్ కౌర్ తదితరులు
రచన : కణికా ధిల్లాన్, సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : సిల్వెస్టర్ ఫొనెస్కా
 బ్యానర్స్ : కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, ఫాంటమ్ ఫిలిమ్స్
నిర్మాతలు : ఆనంద్ ఎల్ రాయ్, వికాస్ భల్
విడుదల : సెప్టెంబర్ 14, 2018



       వివిధ నేర ప్రవృత్తుల్ని విజయవంతంగా తెర కెక్కిస్తూ వస్తున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రేమ ప్రవృత్తిని చేపట్టాడు. గతంలో ‘దేవ్ –డీ’ అనే ఒక ప్రేమ ప్రవృత్తిని ఆల్రెడీ పరిచయం చేశాడు. ఫార్ములా ప్రేమలకి దూరంగా ప్రేమల్లో చీకటి కోణాల్ని చూపే వాస్తవికతని మరోసారి ‘మన్ మర్జియా’ (మనోభీష్టాలు) గా చేసి దృశ్యీకరించాడు. ప్రయోగాత్మక పాత్రల బాట పట్టిన ‘పింక్’ ఫేమ్ హీరోయిన్ తాప్సీ (తాపసీ పేరు కాస్తా ఇంగ్లీష్ స్పెల్లింగు చూసి తెలుగులో తాప్సీ అయిపోయింది, ఆరతీ అగర్వాల్ ఆర్తీ అగర్వాల్ అయినట్టు...తాప్సీ, ఆర్తీ, భార్తీ (భారతి) లు హిందీ ఉచ్ఛారణలు మాత్రమే, తెలుగు ఉచ్ఛారణలు కాదు) ఈసారి ఇంకో డార్క్ పాత్ర పోషించింది. మరి వీళ్ళిద్దరి తొలి కాంబినేషన్ లో అభిషేక్ బచ్చన్ ఏం చేస్తున్నట్టు. ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ గారు తాప్సీ ని కాపాడేరు. కుమారుడు ఇప్పుడు డార్క్ షేడ్ తాప్సీతో ఏం చేశారు? దారిలో పెట్టారా? దగా చేశారా?...ఓసారి చూసి తెలుసుకుందాం...

కథ 
      పంజాబ్ లోని అమృత్ సర్. అక్కడ తల్లి, తండ్రీ, ఓ చెల్లెలూ వున్న రూమీ (తాప్సీ) సిగరెట్లు, మందు, సెక్స్ కొట్టే మధ్యతరగతి అమ్మాయి. డీజే అయిన విక్కీ (విక్కీ కౌశల్) అనే బాయ్ ఫ్రెండ్ తో ఇంట్లోనే డాబా మీద గదిలో పట్టపగలు చాటుమాటుగా అదే పనిగా సెక్స్ కొడుతూ ఒకరోజు దొరికిపోతుంది. ఇక పెళ్లి చేసేస్తామంటారు తల్లిదండ్రులు. ఒక లండన్ సంబంధం వుందంటారు. విక్కీని తప్ప ఎవర్నీ చేసుకోనంటుంది. రేపు విక్కీని తెచ్చి మాట్లాడిస్తానంటుంది. మాట్లాడించకపోతే లండన్ సంబంధం చేసుకోవాలంటారు. కానీ విక్కీ రావడానికి ఒప్పుకోడు. అతడికి ప్రేమా సెక్సూ ఓకే గానీ, పెళ్ళంటే భయం. ఐతే లేచిపోదామంటుంది. ఆ ప్రయత్నం కూడా సాగదు. ఇక తప్పనిసరై లండన్ సంబంధం ఒప్పుకుంటుంది. లండన్ పెళ్లి కొడుకు ఎన్నారై రాబీ (అభిషేక్ బచ్చన్) కి విక్కీ గురించి తెలుస్తుంది. వాడితో తిరిగిన ఇది నాతో పెళ్ళికి ఎందుకు రెడీ అయిందీ చూద్దామని పెళ్లి చేసుకుంటాడు. విక్కీని మర్చిపోదామనుకుని రాబీని చేసుకున్న రూమీ, అదే తన మన్ మర్జియాలతో ఇరకాటంలో పడుతుంది. మనసూ తనువూ రాబీకి ఇవ్వలేక ఇబ్బందుల్లో పడిపోతుంది. రాబీ ఇంటరెస్టింగ్ గా ఇదంతా గమనిస్తూంటాడు...దీనికి పరిష్కారమేమిటి? విడాకులేనా? విడాకులతో సమస్య తీరిందా?...ఇదీ కథ.

ఎలావుంది కథ 
     కథకి ‘మన్ మర్జియా’ అనే టైటిలే ఒక మంచి ఆకర్షణ. గతంలో ‘మన్’, ‘మన్ పసంద్’, ‘మనోరంజన్’ లాంటి టైటిల్స్ తో సినిమా లొచ్చాయి గానీ, ఈ టైటిల్ అంత మనోరంజకంగా అన్పించవు. ‘మన్ మర్జియా’ మనసు పులకించే అద్భుతమైన వాక్యం. కవిత్వంలో ఇంత వరకూ కన్పించని హిందీ - ఉర్దూల ఈ పదబంధమే ఒక మనోహరమైన ప్రయోగం. మ్లానమైన మనసుని కడిగిపారేసే, ఈ పాజిటివ్ ఫీలింగునిచ్చే టైటిల్ నిజానికి ఈ కథా వస్తువుకి  విరుద్ధమైనది. కథ వచ్చేసి మనసు చీకటి కోణాల్ని చూపెడుతుంది, విరుద్ధంగా టైటిల్ అందమైన అనుభూతుల్ని ప్రేరేపిస్తుంది. అంటే డార్క్ మూడ్ లో పాత్రలుంటాయే తప్ప ఆ డార్క్ మూడ్ లోకి ప్రేక్షకులు ఏ మాత్రం వెళ్లరు. ఇంతవరకూ వచ్చిన డార్క్ మూడ్ కథలతో సినిమాల్లోనైతే  ప్రేక్షకుల్ని కూడా డార్క్ మూడ్ లోనే ముంచేసేవిగా వున్నాయి. 

          కథ ముక్కోణ ప్రేమ కథే అయినా రొటీన్ గా మరో ఏడ్పుల ముక్కోణ ప్రేమ అయిపోలేదు. ‘మౌన రాగం’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘ధడ్కన్’ లాంటి ముక్కోణ కథలకి ఇక్కడ సెక్స్ ని జోడిస్తే కొత్త ముక్కోణమై పోయింది. ఒక హీరోయిన్ - ఇద్దరు హీరోల ట్రయాంగిల్ లో రెండో హీరోని పెళ్లి చేసుకున్న హీరోయిన్,  ప్రేమించిన మొదటి హీరోని మర్చిపోలేక పోవడమనే పాత ఫార్ములా కథకి,  సెక్స్ ని కలపడంతో ముక్కోణ ప్రేమ కథ అప్డేట్ అయిపోయింది. ఈ ఇన్నోవేట్ చేసిన ఐడియాకే ముందు మార్కులేయాలి. పెళ్ళయిన హీరోయిన్ మొదటి హీరోతో రంకు సాగించడమనే బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాల కథని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చారు. సొసైటీలో పెళ్లయినా, కాకపోయినా రంకులెన్నో- కొన్ని మర్డర్లతో – పరువుతీసి సంచలనం సృష్టిస్తూ వుంటాయి. ఇలాటి ఒక రంకు (రిలేషన్ షిప్ అనే గొప్ప పేరు దీనికి) కథే ఈ మనసు ఇష్టాయిష్టాల కొత్త ప్రేమల కథ. 

         యూత్ ప్రేమ కథలు చెప్తున్నప్పుడు, కథంతా బాక్సాఫీసు అప్పీల్ కోసం హీరోహీరోయిన్ల చేతుల్లోనే వుండాలన్న ఈ కాలపు రోమాంటిక్ జానర్ మర్యాదని పూర్తిగా పాటించడం ఇక్కడ కన్పిస్తుంది. హీరోహీరోయిన్లు కలగాపులగం చేసుకున్న వాళ్ళ ప్రేమలతో చేతులెత్తేస్తే, ఎందుకో ఘోరంగా మనోభావాల్ని దెబ్బతీసుకున్న పెద్ద వయసు పాత్రలు జోక్యంచేసుకుని, విలువలూ నీతులూ తలంటుపోసి, తిరిగి సాంప్రదాయ చట్రంలోనే బిగించి పారేసే నాన్సెన్స్ ఇక్కడ లేదు. మనోభావాల్ని కనిపెట్టిన వాడెవడో వాడు జీవితంలో ఎడా పెడా ఓడిపోయిన వాడై వుంటాడు. ఇది ప్రేమ సినిమాలకొచ్చిన చావైంది. ప్రేమల్లో యూత్ తాము సృష్టించుకునే సమస్యల్నితామే పరిష్కరించుకునే స్వావలంబనని, సృజనాత్మకతనీ పెంపొందించుకునే దృష్టితో వుండేవే నేటి నిజమైన, ప్రాక్టికాలిటీ గల, రోమాంటిక్ జానర్ కథలు. ఇలాటిదే ఈ కథ.   

ఎవరెలా చేశారు
      గత నెల విడుదలైన ‘నీవెవరో’ తర్వాత మరో యాంటీ హీరోయిన్ పాత్ర డేరింగ్ గా నటించింది తాప్సీ. స్వార్ధం, అయోమయం, పంతం, పిరికితనం అన్ని అవలక్షణాల పుట్ట ఈ పాత్ర. చాలా సంకీర్ణ భావోద్వేగాల పాత్ర. నెగెటివ్ నుంచి పాజిటివ్ లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ నెగెటివ్ లోకే వెళ్ళిపోతూంటుంది పదేపదే. తల్లిదండ్రులతో మాట్లాడడానికి రానన్న బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ తో ఎరవేసి మరీ మోసపోతుంది. వాణ్ణి ఎందుకు నమ్ముతుందో అర్ధంగాని అయోమయం. ఒక్క లేచిపోదామని తను చెప్పినప్పుడు మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. లేచిపోయి ఎక్కడుంటాం, అద్దె ఎలా కడతాం, ఏంచేసి బతుకుతాం అన్న ప్రశ్నలకి బాయ్ ఫ్రెండ్ తెల్లమొహం వేయడంతో ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. మళ్ళీ మామూలే, వాడే కావాలి.

          అభిషేక్ పాత్రతో పెళ్ళయాక, హానీమూన్లో తన పరిస్థితికి కాశ్మీర్ మంచు పర్వతాల మధ్య గుండెలు పగులగొట్టుకుని ఏడ్చేస్తుంది. ఈ ఏడ్పుని కూడా దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనదైన స్టయిల్ లో మర్చిపోలేని  విధంగా ఔట్ డోర్లో ఏకాంత సన్నివేశంగా  చిత్రీకరించాడు. మళ్ళీ మామూలే, సిగరెట్ దమ్ము కొట్టి ఏడ్పంతా మర్చిపోతుంది. హనీమూన్లోనే క్యాజువల్ గా చెప్తుంది, తను వర్జిన్ కాదని. తను కూడా వర్జిన్ కాదంటాడు. ఫస్ట్ నైట్ మాత్రం ఆమె వల్ల యింకా జరగదు. ఇది ఇలాటి కథల్లో మామూలే. ఎందుకంటే హీరోయిన్ని పవిత్రంగా మొదటి హీరోకి అప్పజెప్పాలి. అందుకని హీరోయిన్ ముభావంగా, పాసివ్ గా వుండిపోతుంది. ఇక్కడ తాప్సీ పాత్రకి ఈ సెంటిమెంట్స్ ని కాపాడే ఫార్ములా లేదు.  భర్త సమక్షంలోనే రహస్యంగా బాయ్ ఫ్రెండ్ తో మెసేజీలు, మంతనాలు. హనీ మూన్ ఎలావుంది, మజా వస్తోందా అని ఇంటి దగ్గర్నుంచి ఫోన్ వస్తే – ఆసలేమైందంటే లాస్ట్ మూమెంట్ లో కండోం వేసుకోలేదని ఆయనకి గుర్తొచ్చింది... ఆయన కండోం తెచ్చుకునే వరకూ హనీమూనూ ... అని కసికసిగా అనేస్తుంది. 

      నగర జీవితాల్లో ఉన్నత కుటుంబాల్లో ఇలాటి పాత్రల్ని చూపించేవారు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో నిర్మొహమాటంగా చూపిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో కొందరు స్త్రీలు ఎందుకిలా మారుతున్నారో ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ లో దర్శకురాలు అలంకృతా శ్రీవాస్తవ చక్కగా విశ్లేషించింది. 

          తాప్సీ ఎలాటి సన్నివేశంలోనూ నటనలో విఫలం కాదు. ఆమెని చూస్తున్న కొద్దీ ఆసక్తే.
          ఇక అభిషేక్ బచ్చన్. ఇతడిదో చిత్రమైన పాత్ర. విక్కీ గురించి తెలిసీ నన్నెందుకు చేసుకున్నావ్, మంచమ్మాయనా? హాట్ గా వున్నాననా?...అని ఆమె అడిగితే, మంచమ్మాయో కాదో ఆలోచించలేదంటాడు, హాట్ గా వున్నావని చేసుకున్నానంటాడు. ఆమె ఎప్పటికై నా విక్కీని మర్చిపోతుందని నమ్మి మౌనంగా ఆమె చేష్టల్ని భరిస్తాడు. ఎప్పుడైతే ఆమె దొంగ చాటుగా వెళ్లి విక్కీతో సెక్స్ కొట్టించుకుంటుందో అప్పుడుగానీ కళ్ళు తెర్చుకోవు. ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కూల్ గా వుంటూనే సమస్యని ఓ కొలిక్కి తెచ్చే పాత్రని అభిషేక్ నీటుగా పోషించాడు. 

          విక్కీ కౌశల్ బాయ్ ఫ్రెండ్ పాత్ర కామిక్ రిలీఫ్. తను డీజే నంటాడు, డాన్సు లేస్తాడు, సెక్స్ చేస్తాడు, పెళ్ళనే సరికి పిల్లిలా పారిపోతాడు. మళ్ళీ ఆమెని కోరుకుంటాడు. అస్థిర మనస్తత్వంతో చిక్కడు దొరకడుగా వుంటాడు. 

          పూర్తిగా మనసులోని చీకటి కోణాలతో, వాటి తాలూకు మానసిక సంఘర్షణలతో, సంఘటనలతో సాగే ఈ నియో కమర్షియల్ మూవీ – మ్యూజికల్ గా ఒక క్రియేటివిటీతో డార్క్ మూడ్ ని పోగొట్టేసి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ పోతుంది. వ్యూహాత్మకంగా మొత్తం పన్నెండు పాటలతో మూడ్ ని ఎలివేట్ చేస్తూ ఈ అసహజ పాత్రల పచ్చి కథకి షుగర్ కోటింగ్ ఇస్తూ పోయారు. ఇలా చేసి వుండకపోతే ఈ తరహా కథని భరించడం కష్టమయ్యేది. ఇంతేగాక హిందీలో అపూర్వంగా ఒక రోమాంటిక్ మూవీని ఇన్నేసి పాటలతో బ్రాడ్వే మ్యూజికల్ లా చూస్తున్న ఫీల్ కల్గించారు. ఆస్కార్ అవార్డు హాలీవుడ్ ‘చికాగో’ అనే బ్రాడ్వే మ్యూజికల్ పాటలతోనే కథ చెప్తూ పోయినట్టు, ఇక్కడ ఒక కీలక సన్నివేశం వచ్చి నప్పుడల్లా నేపధ్య సంగీతం బదులు హుషారయిన పాట మొదలైపోతుంది. విషాద పాటొకటి చివర్లో అభిషేక్ నిజం తెలుసుకున్నప్పుడు వస్తుంది. 

     పంజాబీ అయిన రచయిత్రి కణికా ధిల్లాన్ పంజాబ్ నేటివిటీలో, పంజాబీ పాత్రలతో సహజంగా రాయగల్గింది. ఆమె రాతే ఆయువుపట్టు ఈ రెబల్ ట్రయాంగులర్ కి. ఇక్కడామె స్త్రీ పక్షపాతం చూపించకుండా, ఏ భావజాలం జోలికీ పోకుండా, సృష్టించిన పాత్రల మనో విశ్లేషణలతోనే ప్రాక్టికల్గా, లాజికల్ గా రాసుకొచ్చింది. రైటింగ్ బావున్నప్పుడు మేకింగ్ లో మిగతా అన్ని శాఖలూ సార్ధకమవుతాయి. 

          దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రేమల మూలాల్లోంచి పాత్రల్ని వొలిచి భావోద్వేగాల్ని చూపించాడు. ప్రేమల మూలాలు సెక్సే ఫ్రాయిడ్ ప్రకారం. టెక్నికల్ గా ఎలాటి హంగామా లేకుండా దృశ్యాల్ని సహజత్వం ఉట్టిపడేలా తీశాడు. ముగింపులో చాలా లాంగ్ ట్రాకింగ్ షాట్ వుంటుంది. వీధుల్లో అభిషేక్, తాప్సీలు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతూనే చాలాసే పు మాట్లాడుకునే షాట్. వీళ్ళు లైఫ్ పార్టనర్స్ గా కలిసి నడవలేదు, విడిపోతున్నప్పుడైనా కలిసి నడవాలనేమో... ఈ లాంగ్ వాకింగ్ లో మాటలతోనే ముగింపు వచ్చేస్తుంది కథకి ఒక ఫినిషింగ్ టచ్ తో. ఒక సస్పన్స్ తో ముగింపుని ఆపేస్తూ కూడా.

          దీనికి ముందు అభిషేక్ ఇంకో అమ్మాయిని పెళ్లి చూపులు చూసినప్పుడు, ఆమె ఒక మాట అడుగుతుంది. తన పేరేంటో చెప్పమని. చెప్పలేకపోతాడు. ఫర్వాలేదు టైం తీసుకుని చెప్పమని వెళ్ళిపోతుంది. ఆమె పేరుకూడా చెప్పలేని మతిమరుపు వుందంటే,  అతడి మనసులో ఇంకా తాప్సీ పాత్ర వున్నట్టే.  ఇదే మాట తను ఒకప్పుడు తాప్సీతో అంటాడు - నీ మనసులో వాడున్నాడా నేనున్నానా చెప్పమని. ఆమె చెప్పలేకపోతే, ఫర్వాలేదు టైం తీసుకుని చెప్పమంటాడు. ఇదే మాట ఇప్పుడు తనకి ఎదురైంది. ఇలా చిన్న చిన్న మాటల్లో నిగూఢా ర్థాలతో  బలమైన సన్నివేశాలు తీశాడు అనురాగ్. 

చివరికేమిటి 
       ప్రేమలు ఎంత గజిబిజిగా వుంటున్నాయో ప్రాక్టికల్ గా చూసి తీసినప్పుడు మూస ఫార్ములాలు తీసే అగత్యం ఏర్పడదు. చాలా పూర్వం వేశ్యతో ప్రేమ కథలుగా ‘దస్తక్’, ‘జరూరత్’ లాంటి ఏ – సర్టిఫికేట్ ‘పెద్దలకు మాత్రమే’ సినిమా లొచ్చేవి. ఇప్పుడా అగత్యం, వేర్పాటూ లేవు. ‘రిలేషన్ షిప్’ లో ఎవర్నైనా బోల్డ్ గా చూపించొచ్చు. అప్పుడే సినిమాలు చరిత్ర క్రమాన్ని నమోదు చేస్తూ కాలపరీక్షకి నిలబడతాయి. దీనికి మనస్తత్వాల లోతైన అవగాహన అవసరం. లోతుపాతుల్లేకుండా రాత్రికి రాత్రి ఏదీ సృష్టి జరగదు. అలవాటుగా రాసి తీసే దర్శకుడు ఈసారి రాయకుండా, రాసిన రచయిత్రి కాన్సెప్ట్ చెడకుండా తీసి, బాలీవుడ్ కమర్షియల్ సినిమాని అర్ధవంతమైన నియో - కమర్షియల్ వైపుకి నడిపించాడు. ‘మన్ మర్జియా’ ప్రేమల మీద వేసిన కొత్త సెర్చిలైట్.


సికిందర్