రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, సెప్టెంబర్ 2018, గురువారం

689 : స్క్రీన్ ప్లే సంగతులు



        స్క్రీన్ ప్లేలు వెంటనే కథ ప్రారంభిస్తే ఇంటర్వెల్ కల్లా కథ అయిపోవడం, ఇంటర్వెల్లో కథ ప్రారంభిస్తే ఆ లోపంతా నస పెట్టడం ఆనవాయితీగా మారడాన్ని ఇంకా గమనిస్తూనే వున్నాం. ఐడియా పరంగా తమ కథకి ఏఏ డిటెయిల్స్ అవసరమో సరైన విషయ పరిజ్ఞానం తమకే లేక, కేవలం అక్కడో మలుపు, ఇక్కడో మలుపు పెట్టుకుని, ఆ మలుపుల్లో మెరుపులు మెరిపించడమే తప్ప, వాన కురిపించక పోవడంతో, మలుపుకీ మలుపుకీ మధ్య కురవని కారు మబ్బులతో కథలు చీకట్లు ముసురుకుని ఈసురోమంటున్నాయి. ఉదాహరణకి ప్లాట్ పాయింట్ వన్ మలుపులో హీరోయిన్ కి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారనుకుందాం. అప్పుడు తను ప్రేమిస్తున్న హీరో ఫ్యామిలీతో మాట్లాడిస్తానని, మాట్లాడించకపోతే చెప్పిన సంబంధమే చేసుకుంటాననీ హీరోయిన్ అన్నదనుకుందాం. ఆ హీరో ఫ్యామిలీతో మాట్లాడించే ప్రయత్నం ఫలించక, పేరెంట్స్ చూసిన సంబంధమే ఒప్పుకుందనుకుందాం. అప్పుడా సెకెండ్ హీరోతో  పెళ్లిచూపులు, నిశ్చితార్ధం, పెళ్ళీ వగైరాలన్నీ వెంటవెంటనే వరుసగా జరిగిపోయాయనుకుందాం... అప్పుడింకేంటి? ఈ ప్లాట్ పాయింట్ వన్ తర్వాత, పది నిమిషాల్లో ఇవన్నీ జరిగిపోయాక, ఇంకా మిగిలింది ఇష్టం లేని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కష్టాల కథనాలేనా?

         
థనాలకీ కళ్ళెం వుంటుంది. ఎంత సేపంటే అంత సేపు ఒకే బీట్ (ఘట్టం) ని  పట్టుకుని కథనాలు చేయలేరు. కొంత సేపు చేశాక కథనం చచ్చిపోవడం మొదలెడుతుంది. ప్రేక్షకులకి విసుగు పుడుతుంది. బాక్సాఫీసు డింకీ కొడుతుంది. పై ఉదాహరణలో లాగా ఇంటర్వెల్ లోపు ప్లాట్ పాయింట్ వన్ పెట్టుకుని, తత్సంబంధ పెళ్లి తతంగాలు జరపడానికి ఒకటే హడావిడి పడిపోతే, ఇక మిగిలేది ఇంటర్వెల్ లోపు నుంచీ సెకండాఫ్ క్లయిమాక్స్ వరకూ గంటకి పైగా వుండే సుదీర్ఘ నిడివిని భర్తీ చేయాల్సిన  హీరోయిన్ గారి కష్టాల తాలూకు కథనమే. ఈ కథనం ఇంటర్వెల్ వరకే మహా ఎక్కువ. అక్కడితో విషయం తేలిపోయి కథ మిగలదు. ఇంటర్వెల్ కి కథ మిగల్లేదంటే స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అవడం, సెకండాఫ్ సిండ్రోం ఏర్పడడం, దాంతో ఇంకేదో కథనం అతికించడమూ జరిగిపోయినట్టే.
***
        పోనీ ఇలాటి ప్లాట్ పాయింట్ వన్ తో కథనం నిడివి తగ్గించడానికి ప్లాట్ పాయింట్ వన్ ని తీసికెళ్ళి ఇంటర్వెల్ దగ్గరే ఏర్పాటు చేశారనుకుందాం. ఆ లోపు ఫస్టాఫ్ నిడివంతా కథలేక నస పెడుతుంది. ఇక ఇదే ప్లాట్ పాయింట్ వన్ ని స్క్రీన్ ప్లే ప్రారంభమైన పది నిమిషాల్లోనే ఏర్పాటు చేసేస్తే చెప్పాల్సిన పనిలేదు. మరేం చేయాలి? ఫస్టాఫ్ లో కథా ప్రారంభ కేంద్రమైన ప్లాట్ పాయింట్ దగ్గర్నుంచీ, సెకండాఫ్ లో కథ ముగిసే కేంద్రమైన ప్లాట్ పాయింట్ టూ వరకూ, సుదీర్ఘ నిడివితో వుండే మిడిల్ విభాగపు కథనాన్ని నిలబెట్టుకోవడమెలా? 

          దీనికి ‘మన్ మర్జియా’ లో చక్కటి పరిష్కారం కన్పిస్తోంది. స్ట్రక్చర్ ఎప్పుడూ శాశ్వతమే, అది మారదు. మారేదీ మార్చగల్గేదీ స్ట్రక్చర్ లోపల కథనాల తీరునే. కథనాల తీరు క్రియేటివిటీని డిమాండ్ చేస్తుంది. క్రియేటివిటీల్ని ఒక చట్రంలో పడి చేసినంత కాలం శుష్క స్క్రీన్ ప్లేలే తయారవుతాయి. అసలు స్ట్రక్చరే శుష్కమైనదని చెప్పే వాళ్ళు, స్ట్రక్చర్ ని వదిలిపెట్టి క్రియేటివిటీలు చేసుకుంటామని చెప్పుకుని చేసేదీ మరీ, అవే చప్పిడి టెంప్లెట్ క్రియేటివిటీలే. క్రియేటివిటీకి ఏ టెంప్లెట్ లూ చట్రాలూ కొలమానాలూ లేవు. అయినా ఒకరు అది చేశారని ఇంకొకరు గుడ్డిగా ఫాలో అయిపోతూంటారు. దీంతో స్వేచ్ఛగా తిరుగాడాల్సిన క్రియేటివిటీలు కూడా టెంప్లెట్స్ లో, చట్రాల్లో, కొలమానాల్లో ఇరుక్కుని వూపిరాడక చచ్చిపోతున్నాయి. క్రియేటివిటీని అవధుల్లేని ఒక వైయక్తిక ఆర్టుగా చూడనంత కాలం ఇంతే. ఇప్పుడు కావాల్సింది ఇలాటి క్రియేటివిటీలు కాదు, కలెక్షన్స్ ని రాల్చగల స్థాయి క్రియార్టివిటీలు. క్రియార్టివిటీ తెలిస్తే స్ట్రక్చర్ ని ప్రేమిస్తారు. స్ట్రక్చర్ లేకుండా ఏ ఆర్టూ లేదని గ్రహిస్తారు. జరిగే క్రియార్టివిటీ అంతా స్ట్రక్చర్ లోపలే జరిగితే అర్ధంపర్ధం వుంటుందని కూడా తెలుసుకుంటారు.

          ‘మన్ మర్జియా’ స్క్రీన్ ప్లే దీనికి దారి చూపుతుంది. ప్లాట్ పాయింట్ వన్ ఎప్పుడో అరగంటకి కాదు, ఇంకెప్పుడో ఇంటర్వెల్ కి కూడా కాదు, ధైర్యం చేసి వెంఠనే పది నిమిషాల్లోపు ఏర్పాటు చేసేస్తే, అక్కడ్నించీ ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ అంతా, మళ్ళీ సెకండాఫ్ లో క్లయిమాక్స్ వరకూ చాలా చాలా సుదీర్ఘంగా వుండే మిడిల్ కథనాన్ని నిలబెట్టడమెలా కూడా ఇది తెలియజేస్తుంది. దీనికి ఒక్కటే మంత్రం. డిలే చేయడం, డిలే చేయడం, డిలే చేయడం...డిలే చేస్తూ ఆ సుదీర్ఘ డ్రామా అంతా నిలబెట్టడం. ప్లాట్ పాయింట్ వన్ అనే మొదటి మలుపు దగ్గర పాత్రకి ఒక సమస్యని  ఇచ్చి కథని ప్రారంభించినప్పుడు, ఒకటే హడావిడి పడిపోయి ఆ సమస్య తాలూకు తంతులన్నీ చకచకా  జరిపించెయ్యకుండా, డిలే చేస్తూ పోవడంవల్ల, ఆ సుదీర్ఘ డ్రామాని నిర్భయంగా నిర్వహించ వచ్చు.
***
     ‘మన్ మర్జియా’ స్క్రీన్ ప్లే ప్రారంభం, అంటే స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగం పది నిమిషాల్లోపే వుండి, చప్పున ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. తెల్లారే బాయ్ ఫ్రెండ్ విక్కీ (విక్కీ కౌశల్) డాబాలు దూకుతూ వచ్చి మిద్దె మీద రూమీ (తాప్సీ) గదిలో పడి ఆమెతో సెక్సు చేయడంతో మొదలవుతుంది బిగినింగ్ విభాగం. ఇలా ఒక రోజు రూమీ పేరెంట్స్ కి దొరికిపోతారు. అయినా మర్నాడూ అదే పని చేస్తారు. ఈసారి రూమీ తల్లికి కన్పించకుండా కొద్దిలో తప్పించుకుంటాడు. పేరెంట్స్ రూమీతో పెళ్లి విషయం ప్రస్తావిస్తారు. ఆమె విక్కీనే చేసుకుంటానంటుంది. వేరే మంచి సంబంధం చూస్తామంటారు. విక్కీ పేరెంట్స్ వచ్చి సంబంధం మాట్లాడక పోతే అప్పుడలాగే వేరే సంబంధం చేసుకుంటానంటుంది. ఈ సన్నివేశం ప్లాట్ పాయింట్ వన్. ఇక్కడితో సుమారు పది నిముషాలు పూర్తవుతాయి. 

         ఇప్పుడిలా చూద్దాం : ఈ పది నిమిషాల బిగింగ్ కథనాన్ని ముప్పావు గంట వరకో, ఇంటర్వెల్ వరకో సాగ లాగి అక్కడ ప్లాట్ పాయింట్ వన్ని ఏర్పాటు చేస్తే  అప్పుడెలా వుంటుంది? ఓస్, సినిమా కథలు  రాయడం చాలా చాలా సులభం కదా అన్పిస్తుంది. ఇది గమనించే  అఆ లు కూడా రాని వాళ్ళు డిస్కషన్స్ లో చెలరేగి పోతూంటారు. ఇంటర్వెల్ దగ్గరో మలుపు, క్లయిమాక్స్ దగ్గరో మలుపు, ఆ మలుపుల ముందూ తర్వాతా అంతా వ్యర్ధాలు నింపడమే సినిమా కథ రాయడమంటే నని అర్ధమైపోయింది కాబట్టే, బజారున పోయే వాడికి కూడా లోకువై పోయింది. వాడిదే నోరూ, రాజ్యమూ అయిపోయాయి. 

          సినిమా కథంటే మరేమీలేదు, ఇంటర్వెల్ ముందు వరకూ లవ్ ట్రాక్ లాగడం, అక్కడ లవ్ ని కాస్త సమస్యలో పడేసి ఇంటర్వెల్ వేయడం, సెకెండాఫ్ ఆ సమస్యతో కాలక్షేపం చేసి ముగింపుకి చేర్చడమే సినిమా కథ. ఏ సినిమా కెళ్ళినా ఫస్టాఫ్ అంతా అవే అవే లవ్ ట్రాకులు, అలాగే అలాగే రిపీటవుతూ మొదలైపోతాయి.  ఏ జానర్ కథైనా ఇంతే. ఈ టెంప్లెట్ లో వుండాల్సిందే. థోడాసా ప్యార్, జరాసా ప్రాబ్లం, పూరాసా మసాలా, ఏక్ దమ్ ఫ్లాప్! ఇంతే...

***
    పోనీ ఇలా కాకుండా ‘మన్ మర్జియా’ లోలాగా పదినిమిషాల్లోపే ప్రేమ పురాణం చెప్పేసి, కథలోకి వస్తూ ప్లాట్ పాయింట్ వన్ వేశారనుకుందాం. అప్పుడేం చేస్తారు? హీరోయిన్ పేరెంట్స్ కి మాటిచ్చిందా? అయితే వెళ్లి బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడేయాలి. పెళ్లి ఇష్టం లేని బాయ్ ఫ్రెండ్ వెంటనే పారిపోవాలి. హీరోయిన్ బిక్క మొహం వేసుకుని పేరెంట్స్ కి తలొంచాలి. ఫారిన్నుంచీ ఎన్నారై  హీరో దిగిపోవాలి. పెళ్లి చూపులూ పెళ్ళీ జరిగిపోవాలి. హీరోయిన్ కి సంఘర్షణ మొదలైపోవాలి... ఇలా పదిహేనవ నిమిషం కల్లా టకటకా సీన్లు పడేసి... ఇక హీరోయిన్ కష్టాల కడలిని సాగలాగి సాగలాగి ఈదలేక ఇంటర్వెల్ కల్లా జల సమాధి అయిపోయి, ప్రేక్షకులు నష్టపరిహారం కట్టాలనడం. స్వహస్తాలతో జలగండం రాసి పెట్టుకుంటే మాకేంటని రెండు మొట్టికాయలేసి ప్రేక్షకులు బాక్సాఫీసుని తప్పించుకుని  పరారవడం.

***
      ‘మన్ మర్జియా’ లో ఏం చేశారంటే, ప్లాట్ పాయింట్ వన్ తర్వాత కథనంలో ఒక్కో బీట్ ని (ఘట్టాన్ని) డిలే చేయడమే కాదు, డిటెయిలింగ్ కూడా చేశారు. డిలే -కం- డిటెయిలింగ్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. ఇందుకే, ఈ వ్యాస ప్రారంభంలో- ఐడియా పరంగా తమ కథకి ఏఏ డిటెయిల్స్ అవసరమో సరైన విషయ పరిజ్ఞానం తమకే లేక... అని ప్రస్తావించాల్సి వచ్చింది. మొత్తమంతా ఇందులోనే  వుంది : డిలే -కం- డిటెయిలింగ్. ‘మన్ మర్జియా’ ప్లాట్ పాయింట్ వన్ తర్వాత వచ్చే బీట్స్ (ఘట్టాలు) ఏమిటి? ప్లాట్ పాయింట్ వన్ మలుపులో, విక్కీ ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడిస్తానని రూమీ పేరెంట్స్ కి చెప్పి, వేరే సంబంధం చూస్తామంటున్న వాళ్ళ ప్రయత్నానికి బ్రేకేస్తుంది. 

          దీని తర్వాత వరసగా వచ్చే బీట్స్ ఇవి : 1. సంబంధం మాట్లాడి పెళ్లి చూపులు, 2. మెహందీ, 3. పెళ్ళీ.  
          ఈ మూడూ చకచకా కానిచ్చేశారా? ఇందాక పైన చెప్పుకున్నట్టు ఐదు నిమషాల్లో ఐదారు సీన్లతో ఇది ముగించేసి,  రెండో వాడితో హీరోయిన్ మెళ్ళో తాళి కట్టించి పారేసి,   మూల కూర్చోబెట్టేశారా ఏడ్వమనీ? ఎంత త్వరగా ఏడిస్తే అంత ఫ్యామిలీ సెంటిమెంటు సూచిక రివ్వున పైకి లేస్తుందనీ? రబీ, ఖరీఫ్, మెట్ట, మాగాణీ పంటలన్నీ ఒకేసారి యేసి పారేశారా పనైపోతుందనీ?

***
       ‘మన్ మర్జియా’ లో పై ఒక్కో బీట్ ని డిటెయిలింగ్ చేస్తూ, బీట్ కీ బీట్ కీ ఎడం పెంచి డిలే చేశారు. పైన చెప్పుకున్న మూడు బీట్స్ లో ముందుగా మొదటి బీట్ సంబంధం మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడాన్ని తీసుకున్నారు. దీన్ని ఇలా డిటెయిలింగ్ చేశారు :

          1. రూమీ వెళ్లి విక్కీకి పెళ్లి విషయం చెప్పి పేరెంట్స్ ని తీసుకు రమ్మంటుంది.
          2. వస్తాడని ఎదురు చూసి రాకపోతే వెళ్లి పట్టుకుని నిలదీస్తుంది, అయినా పెళ్ళే వద్దంటాడు విక్కీ.
          3. లండన్ నుంచి రాబీ (అభిషేక్ బచ్చన్) దిగుతాడు.
          4. విక్కీ రాకపోగా, వీధుల్లో రూమీని టీజ్ చేస్తూ పాటేసుకుంటాడు.
          5. రాబీకి అతడి పేరెంట్స్ అమ్మాయిల ఫోటోలు చూపిస్తూంటారు.
          6. రూమీ విక్కీ ప్రాణాలు తోడేస్తూంటుంది.
          7. మ్యారేజీ బ్యూరో వాడు రాబీకి డెంటిస్టు కూతుర్ని అంటగట్టాలని ప్రయత్నిస్తూంటాడు.
          8. పెళ్లి ఇష్టం లేకపోతే లేచిపోదామని విక్కీతో అంటుంది రూమీ.
          9. రూమీ ఫోటో చూసి ఈమే నచ్చిందంటాడు రాబీ. ఇది కళ్ళతోనే గుళ్ళు పేల్చే రకంలా వుందని అడ్డు పడుతుంది తల్లి. రాబీ నచ్చజెప్పి ఒప్పిస్తాడు.
          10. రూమీ విక్కీతో లేచిపోతుంది.
          11. లేచిపోయి ఎలా బతుకుతామని అడుగుతుంది రూమీ. తెల్లమొహం వేస్తాడు విక్కీ. లేపుకుపోవడం చేతగాకపోతే పెళ్లి చేసుకోమంటుంది. ఒప్పుకుంటాడు విక్కీ.
          12. ఒప్పుకున్న విక్కీతో సెక్సు చేస్తుంది రూమీ.
          13. మ్యారేజీ బ్యూరో వాడు రాబీ తండ్రిని తీసుకుని రూమీ వాళ్ళింటికి వస్తాడు.
 వెంటనే రూమీ విక్కీకి కాల్ చేస్తే పలకడు.
          14. వూళ్ళో ఓ పాటల కార్యక్రమంలో రూమీని రాబీకి చూపిస్తాడు అతడి తండ్రి.          
          15.  విక్కీ వాళ్ళు వస్తున్నారని రూమీ పెళ్లి చూపుల హడావిడీ చేస్తుంది. విక్కీ డుమ్మా కొడతాడు.
          16.  వెళ్లి విక్కీని పట్టుకోవడానికి పోతుంది రూమీ, ఎక్కడా దొరకడు.
          17.  మ్యారేజీ బ్యూరో వాడు ఇంకా డెంటిస్టు కూతుర్నే చేసుకోమని రాబీ వాళ్ళని కన్విన్స్ చేస్తూంటాడు.
          18.  రాబీ బజార్లో లస్సీ తాగుతూ, అటు జీపులో లస్సీ తాగుతూ విచిత్రంగా కన్పిస్తున్న విక్కీని చూసి చెయ్యూపి విష్ చేస్తాడు.
          19.  రూమీ డీలా పడి ఇంటికొచ్చి, వాళ్ళని పిలుచుకోండని అంటుంది.
          20.  రాబీతో రూమీకి పెళ్లి చూపులేర్పాటవుతాయి.
          ఇదీ మొదటి బీట్ అయిన ‘పెళ్లి చూపులు’ కి చేసిన డిటెయిలింగ్.

***
     ఇలా డిటెయిలింగ్ చేయడం వలన పాత్రచిత్రణలు మరింత జరగడానికి అవకాశమేర్పడింది. ఇంటర్వెల్ కల్లా కథ అవగొట్టుకునే ప్రమాదం తప్పింది. ఈ పెళ్లి చూపుల ఘట్టమే 35 నిమిషాల సమయమూ లాభదాయకంగా కవర్ చేసింది. అసలు ఈ పెళ్లి చూపుల మొదటి బీట్ ప్రారంభమే స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగానికి ఆరంభం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, రూమీ పేరెంట్స్ కి మాటివ్వడంతోనే బిగినింగ్ విభాగం ముగిసింది. బిగినింగ్ విభాగం ముగిసిన ఈ సన్నివేశంతో ఈ కథకి  ప్రధాన పాత్రగా రూమీకి,  విక్కీని పెళ్లి చూపులకి తీసుకురావాలన్న గోల్ ఏర్పడింది. ఈ గోల్ కోసం స్ట్రగుల్ మొదలయ్యింది.  మిడిల్ విభాగం బిజినెస్ అనగా సమస్యతో చేసే స్ట్రగులే అయినప్పుడు, ఇదేదో పెళ్లి చేసేసి చూపించ వచ్చుగా - అప్పుడు కూడా వుండేది స్ట్రగులేగా -  అన్పించొచ్చు.

          అది కథని చుట్టేయడానికి వాడే షార్ట్ కట్. దానివల్ల కథలో డిటెయిల్స్ ఏవీ తెలీవు.  పాత్రలు పూర్తిగా పరిచయం కావు. ‘మన్ మర్జియా’ లోని పాత్రలు ఒకప్పుడు సినిమాల్లో వర్కౌట్ అయిన ఫార్ములా పాత్రలు కావు. ఇప్పుడున్న సమాజంలోంచి వెండి తెరపైకి పొడుచుకొచ్చిన  రియలిస్టిక్ పాత్రలు. నేటి సమాజంలో ఈ పాత్రలెలా వున్నాయో, పోకడ లేమిటో చూపడం సమకాలీన కమర్షియల్ సినిమా బాధ్యత. అందునా అస్థిర మానసిక స్థితుల పాత్రలతో కథ అనుకున్నప్పుడు ఈ బీట్స్ తప్పని సరి. అందుకని ఏకంగా పెళ్ళికి వెళ్ళకుండా పెళ్లి చూపులు, మెహందీ, పెళ్ళీ అనే మూడు బీట్స్ తో కథా, దాని పాత్రల పూర్వరంగాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పోయారు.



***
           ఒకసారి వెనక్కెళ్ళి మళ్ళీ ముందు కెళదాం. బిగినింగ్ తో స్క్రీన్ ప్లే ప్రారంభాన్ని గమనిస్తే, చూసే వాళ్ళని బట్టి అది షాకింగ్ కావొచ్చు, సర్ప్రైజింగ్ కావొచ్చు- ఇప్పటి హాలీవుడ్ పద్ధతిలో ఓపెనింగ్ టీజర్ తో ప్రారంభించారు. అదేమిటంటే, ఉదయాన్నే విక్కీ డాబాలు దూకుతూ దూకుతూ వచ్చి రూమీతో సెక్సు కొట్టడం. ఇప్పటి స్క్రీన్ ప్లేల ఆరంభాలు ఆశ్చర్య పర్చే సంఘటనతో జరగాలంటే ఎవరికీ అర్ధం గావడం లేదు.  ముసలమ్మలా అదే స్పూన్ ఫీడింగ్ చేసుకుంటూ, అ - ఆ ల నుంచి ఎత్తుకుని, అం - అః అంటూ ముసలి నడక నడిచే కథనాలే చేస్తూంటారు. వర్ణమాల తిరగేసి ముందే అం - అః అనేస్తే, ఆ తర్వాత ఆ ఆ ఇ ఈ ల సంగతి చూసుకోవచ్చని ‘మన్ మర్జియా’ తోనైనా అర్ధం జేసుకుంటారని ఆశిద్దాం. ఇలా మొదటి సీనుతోనే పాదరసంలా జారుకునే ప్రేక్షకుల్ని కట్టేసి కూర్చోబెట్టేయాలి. వ్యాపారమన్నాక ఇంతే.

***
       బీట్ -1 అయిన ‘పెళ్లి చూపులు’ అనేది ఈ స్క్రీన్ ప్లేలో రెండో సీక్వెన్స్ అవుతుంది. ఏ బీట్ అయితే మొదలై కొలిక్కి వస్తుందో అదొక సీక్వెన్స్ అవుతుంది. బిగినింగ్ విభాగంలో మొదలైన సెక్సాయణం,  ప్లాట్ పాయింట్ వన్ తో కొలిక్కి వచ్చినట్టు గమనించాం. ఇదొక సీక్వెన్స్ అయింది. ఇక మిడిల్ తో ప్రారంభమైన పెళ్లి చూపులనే మొదటి బీట్ కూడా పెళ్లి చూపులతో కొలిక్కొచ్చి రెండో సీక్వెన్స్ అయిందని పైన డిటెయిలింగ్ లో గమనించాం. ఏ స్క్రీన్ ప్లేలోనైనా ఫస్టాఫ్ మూడు సీక్వెన్సులు, సెకండాఫ్ ఇంకో మూడు సీక్వెన్సులూ వుంటాయి. స్ట్రక్చర్ తో వుండే ఏ స్క్రీన్ ప్లేలోనైనా ఆరు సీక్వెన్సు లుంటాయి. బినినింగ్ విభాగంలో ఒకటి, ఇంటర్వెల్ లోపు మిడిల్ -1 లో రెండూ, ఇంటర్వెల్ తర్వాత మిడిల్ -2 లో ఇంకో రెండూ, ఎండ్ విభాగంలో ఒకటీ. మొత్తం ఆరు. ఇంతేగాక,  ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో స్ట్రక్చర్ వుంటుంది. మళ్ళీ ఈ సీక్వెన్సుల్లో వుండే ఒక్కో సీనులోనూ బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో స్ట్రక్చరే  వుంటుంది. ఇలా స్క్రీన్ ప్లే స్థూల స్థాయి నుంచీ సూక్ష్మ స్థాయివరకూ ఎందులో చూసినా బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల స్ట్రక్చరే వెంటాడుతూంటుంది. ఇదంతా ఎవరాలోచిస్తున్నారు?

***
        ఇప్పుడు మొదటి బీట్  ‘పెళ్లి చూపులు’ సీక్వెన్స్ స్ట్రక్చర్ ని చూస్తే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒక గోల్ తో ప్రధాన పాత్రగా అవతరించిన రూమీకి,  గోల్ కోసం సంఘర్షించడానికి ఒక ప్రత్యర్ధి వుండాలి. ఆ ప్రత్యర్ధి విక్కీ రూపంలో వుండనే వున్నాడు. వాణ్ణి మెడలు వంచి పెళ్ళికి వొప్పించడమే గోల్. లేకపోతే వేరే పెళ్లి చేసేస్తారు తనకి.           

          కనుక మిడిల్ సంఘర్షణ ప్రత్యర్ధి అయిన విక్కీతో ప్రారంభించింది. ఇదే సమయంలో భావి ప్రత్యర్ధి అయిన రాబీ లూప్ లో వున్నాడు. ఈ సీక్వెన్స్ ద్విముఖంగా వుంది. ఒక వైపు నుంచి విక్కీతో పెళ్లి చూపుల కోసం రూమీ నరుక్కొస్తూంటే, ఇంకో వైపు నుంచి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకోవాలని లండన్నుంచి వచ్చిన రాబీ నరుక్కొస్తున్నాడు. చివరికి విక్కీతో ఓడిపోయి రాబీతోనే పెళ్లి చూపులనే యాంటీ క్లయిమాక్స్ కి చిక్కింది రామీ. ఇలా లూప్ లో వున్న రాబీ, మెయిన్ లైన్ లో ప్రత్యర్ధి ఎప్పుడవుతాడంటే పెళ్ళయ్యాకే. ఇంటరెస్టింగ్ గా లేదూ ఈ సీక్వెన్స్?

          ఇప్పుడు బిగినింగ్ స్ట్రక్చర్ చూద్దాం.
          1. రూమీ వెళ్లి విక్కీకి పెళ్లి విషయం చెప్పి పేరెంట్స్ ని తీసుకు రమ్మంటుంది.
          2. వస్తాడని ఎదురు చూసి రాకపోతే వెళ్లి పట్టుకుని నిలదీస్తుంది, అయినా పెళ్ళే వద్దంటాడు విక్కీ.
          3. లండన్ నుంచి రాబీ (అభిషేక్ బచ్చన్) దిగుతాడు.
          4. విక్కీ రాకపోగా, వీధుల్లో రూమీని టీజ్ చేస్తూ పాటేసుకుంటాడు.
          5. రాబీకి అతడి పేరెంట్స్ అమ్మాయిల ఫోటోలు చూపిస్తూంటారు.
          6. రూమీ విక్కీ ప్రాణాలు తోడేస్తూంటుంది.
          7. మ్యారేజీ బ్యూరో వాడు రాబీకి డెంటిస్టు కూతుర్ని అంటగట్టాలని ప్రయత్నిస్తూంటాడు.
          8. పెళ్లి ఇష్టం లేకపోతే లేచిపోదామని విక్కీతో అంటుంది రూమీ.
          9. రూమీ ఫోటో చూసి ఈమే నచ్చిందంటాడు రాబీ. ఇది కళ్ళతోనే గుళ్ళు పేల్చే రకంలా వుందని అడ్డు పడుతుంది తల్లి. రాబీ నచ్చజెప్పి ఒప్పిస్తాడు.
          10. రూమీ విక్కీతో లేచిపోతుంది.
          ఇదీ బిగినింగ్ విభాగం. పదో సీన్లో ఈ సీక్వెన్స్ కి ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది. ఈ పది సీన్లలో బిగినింగ్ విభాగం బిజినెస్ ఇలా జరగాలి - 1. కథా నేపధ్యపు ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, 4. సమస్య స్థాపన.

          1. నేపధ్యంలో ఇది రోమాంటిక్ కథని తెలిసిపోతోంది, 2. రూమీ, విక్కీ, రాబీ, వీళ్ళ తల్లిదండ్రుల పాత్రలూ పరిచయమవుతూ ప్రధాన పాత్ర రూమీ అని తెలిసింది, 3. రూమీకి వేరే సంబంధం గండం తప్పించుకోవాలంటే విక్కీతో ఎలాగైనా పెళ్లి చూపులైపోవాలి. పెళ్ళంటే ఇష్టం లేని విక్కీతో ఈ ప్రయత్నాలేవీ సాగవు. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని 1, 2, 4, 6. 8, సీన్లతో చేసుకొచ్చారు, 4. ఇలా పరిస్థితి విషమించడంతో రూమీ విక్కీతో లేచిపోయి 10 వ సీనుతో  సీక్వెన్స్ కి సమస్యని స్థాపించింది.

          రూమీకి తెలీకుండా ప్రేక్షకులకి తెలుస్తూ, థ్రిల్ కలిగిస్తూ, రూమీ మెడకి చుట్టుకునే  ఇంకో ట్రాక్ నడుస్తోంది సమాంతరంగా ఈ బిగినింగ్ విభాగంలోనే. ఇది రాబీ ట్రాక్. ఈ ట్రాక్ తో బిగినింగ్ విభాగం బిజినెస్ ఇలా వుంది : 1. లండన్ నుంచి రాబీ వచ్చాడు, పేరెంట్స్ తో కలిపి పాత్రల పరిచయాలయ్యాయి (3 వ సీను), 2. కథా నేపధ్యం రోమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది, 3. ఇక సంబంధాలు చూస్తూ, బ్యూరోవాడి గోల భరిస్తూ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన 5, 7, 9 సీన్లతో చేశాడు, 4. కాదన్న తల్లిని కూడా ఒప్పించి రూమీ నచ్చిందని చెప్పేసి సమస్య (గోల్) స్థాపించాడు 9 వ సీన్లోనే. 

          ఒకే ఎజెండాతో రూమీ, రాబీల రెండు విడివిడి ట్రాకుల బిగినింగ్ విభాగమే ఈ సీక్వెన్సుని ఏంతో థ్రిల్లింగ్ గా మార్చేస్తోంది, సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది. ఎంతో క్రియేటివిటీనీ కనబరుస్తోంది. అసలు 1, 2 సీన్లలో రూమీ విక్కీని ఒప్పించడానికి పాట్లు పడుతోంటే, 3 వ సీన్లో రాబీ లండన్ నుంచి దిగడం ఎలాటి ఎత్తుగడ కథనానికి! 

          నోట్ : వచ్చిన వాడు నేరుగా రూమీ ఇంటికి రాలేదు. వేరేగా తన సంబంధాలు వెతుక్కునే బిజినెస్ లో తను వున్నాడు. దీన్నంటారు కథనాన్ని అల్లడమంటే. ఇలాకాక కథనాన్ని పేర్చుకుంటూ పోతే ఆ రెండు సీన్లలో విక్కీతో రూమీకి తేల్చేసి, మూడో సీన్లో వచ్చిన రాబీని రూమీ ఇంట్లోకి దింపడమే. అల్లినప్పుడు కథనానికి లాలిత్యం వస్తుంది, పేర్చినప్పుడు నాటు సరుకులా తయారవుతుంది. స్క్రీన్ ప్లే యాక్ థూ అన్పించుకుంటుంది.

                                          ***
            సీక్వెన్స్ లో మిడిల్ :
          11. లేచిపోయి ఎలా బతుకుతామని అడుగుతుంది రూమీ. తెల్లమొహం వేస్తాడు విక్కీ. లేపుకుపోవడం చేతగాకపోతే పెళ్లి చేసుకోమంటుంది. ఒప్పుకుంటాడు విక్కీ.
          12. ఒప్పుకున్న విక్కీతో సెక్సు చేస్తుంది రూమీ.
          13. మ్యారేజీ బ్యూరో వాడు రాబీ తండ్రిని తీసుకుని రూమీ వాళ్ళింటికి వస్తాడు.
 వెంటనే రూమీ విక్కీకి కాల్ చేస్తే పలకడు.
          14. వూళ్ళో ఓ పాటల కార్యక్రమంలో రూమీని రాబీకి చూపిస్తాడు అతడి తండ్రి.         
          15.  విక్కీ వాళ్ళు వస్తున్నారని రూమీ పెళ్లి చూపుల హడావిడీ చేస్తుంది. విక్కీ డుమ్మా కొడతాడు.

          16.  వెళ్లి విక్కీని పట్టుకోవడానికి పోతుంది రూమీ, ఎక్కడా దొరకడు.
          17.  మ్యారేజీ బ్యూరో వాడు ఇంకా డెంటిస్టు కూతుర్నే చేసుకోమని రాబీ వాళ్ళని కన్విన్స్ చేస్తూంటాడు.
          18.  రాబీ బజార్లో లస్సీ తాగుతూ, అటు జీపులో లస్సీ తాగుతూ విచిత్రంగా కన్పిస్తున్న విక్కీని చూసి చెయ్యూపి విష్ చేస్తాడు.
          19.  రూమీ డీలా పడి ఇంటికొచ్చి, వాళ్ళని పిలుచుకోండని అంటుంది.


          మిడిల్ అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడిన సమస్య లేదా గోల్ కోసం సంఘర్షణే కాబట్టి, విక్కీతో లేచిపోయిన రూమీ ఇప్పుడు ఈ సంఘర్షణాత్మక మిడిల్లోకి ఎంట రైంది. ఈ సంఘర్షణలో భాగంగా, లేచిపోయి ఎలా బతుకుతామని అడుగుతుంది. విక్కీ చెప్పలేకపోతే, లేపుకుపోవడం చేతగాక పోతే పెళ్లి చేసుకోమంటుంది. ఇహ తప్పక ఒప్పుకుంటాడు విక్కీ. ఒప్పుకున్న విక్కీతో సెక్సు చేస్తుంది రూమీ. ఇది కూడా సంఘర్షణలో భాగమే అతణ్ణి సంతోష పెట్టడానికి. ఇంతలో మ్యారేజీ బ్యూరో వాడు రాబీ తండ్రిని తీసుకుని రూమీ వాళ్ళింటికి వస్తే, ముంచుకొస్తున్న ప్రమాదం గ్రహిస్తుంది రూమీ. వెంటనే విక్కీకి కాల్ చేస్తే పలకడు. వెళ్లి పట్టుకుని క్లాసు పీకి ఒప్పిస్తుంది. ఇంటికి వచ్చి, విక్కీ వాళ్ళు వచ్చేస్తున్నారని పెళ్లి చూపుల హడావిడీ చేస్తుంది. విక్కీ డుమ్మా కొట్టేస్తాడు. వెతికితే ఎక్కడా దొరకడు. ఇక అయిపోయింది తన పని అనుకుని వచ్చి పేరెంట్స్ కి లొంగిపోతుంది రూమీ. 

          ఇవన్నీ 11,12, 13, 15, 16, 19 సీన్లలో చూపించారు. మిడిల్ విభాగం ముగింపు ప్లాట్ పాయింట్ టూతో వుంటుంది కాబట్టి, 19 వ సీను ప్లాట్ పాయింట్ టూ అయింది. ప్లాట్ పాయింట్ టూ అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర చెలరేగిన సమస్యకి పరిష్కార మార్గం లభించేది కాబట్టి, ఆ పరిష్కార మార్గం ప్రత్యర్థితో గెలుపునో ఓటమినో డిసైడ్ చేసేది కాబట్టి - రూమీ ప్రత్యర్ధి అయిన విక్కీతో అన్ని విధాలా ఓడిపోయానని గ్రహించి, పేరెంట్స్ తో రాజీ పడిపోవడమే పరిష్కారంగా ఇంటి కొచ్చేసింది. దీంతో మిడిల్ విభాగం ముగిసింది.

                                        ***

    మరో వైపు ఈ మిడిల్లో రాబీ సమాంతర ట్రాకు చూస్తే, రూమీ ట్రాకులోకి ఇది వచ్చి చేరిపోవడమనే ఆసక్తికర ఎత్తుగడతో మొదలయింది. ఈ మిడిల్ రూమీతో పెళ్లి చూపుల కోసం రాబీ గోల్ తో మొదలయింది. ఏకంగా మ్యారేజీ బ్యూరో వాడు రాబీ తండ్రిని తీసుకుని రూమీ వాళ్ళింటికి  వచ్చేస్తాడు. ఇంట్లోనే వుండి చూస్తూంటుంది రూమీ ఇదంతా. తర్వాత వూళ్ళో  పాటల కార్యక్రమంలో డాన్సు చేస్తున్న రూమీని రాబీకి చూపిస్తాడు అతడి తండ్రి. రాబీ హేపీ ఫీలవుతాడు. మధ్యలో మ్యారేజీ బ్యూరో వాడు ఇంకా డెంటిస్టు కూతుర్నే చేసుకోమని రాబీ వాళ్ళని కన్విన్స్ చేస్తూ రాబీ గోల్ కి అడ్డు తగులుతూంటాడు. గోల్ కోసం ఇదో సంఘర్షణ రాబీకి. తర్వాత రాబీ బజార్లో లస్సీ తాగుతూ, అటు జీపులో లస్సీ తాగుతూ విచిత్రంగా కన్పిస్తున్న విక్కీని చూసి చెయ్యూపి క్యాజువల్ గా విష్ చేస్తాడు.


         
     ఇవన్నీ 13, 14, 17, 18 సీన్లలో చూపించారు. రాబీ మిడిల్ ఓపెనింగ్ రూమీ ట్రాకుతో స్పర్శించే ఉత్కంఠ భరిత ఎత్తుగడతో వుండడం కథనాన్ని అల్లడం వల్లే వస్తుంది. పేర్చడంతో రాదు. సీక్వెన్సులో ఏ ప్రారంభాలు చూసినా ఇలా ఉత్కంఠ రేపే విధంగానే  వుండడాన్ని గమనించ వచ్చు. రూమీ ఫోటో చూసి రాబీ ఆమెని కోరుకున్నాడు, తర్వాత డాన్సులో ఆమెని ప్రత్యక్షంగా చూసి గోల్ పూర్తి చేసుకున్నాడు. ప్లాట్ పాయింట్ టూలో రాబీ గోల్ కి విజయం చేకూరితే, రూమీ గోల్ కి ఓటమి ఎదురయ్యింది. ఫలితంగా ఆమెకి విక్కీ పోయి, కొత్త ప్రత్యర్ధిగా రాబీ ఎంటరయ్యాడు. 


          ఈ మిడిల్ రాబీ ట్రాకులో ఇంకోటేమిటంటే, రూమీ డాన్సు చేస్తూంటే రాబీ ఆమెని చూసి ఓకే చేసుకున్నాడు. కానీ రాబీని రూమీ చూడలేదు. చూసినా  అతనెవరో తెలిసేది కాదు. బజార్లో రాబీ లస్సీ తాగుతూ ఎవడో  విచిత్రంగా వున్నాడని క్యాజువల్ గా విక్కీని విష్ చేశాడు. వీడే రూమీ లవర్ అని తెలీదు. ఇతనే తన రూమీని ఓకే చేసుకున్నాడనీ విక్కీకీ తెలీదు!

          ఇలాటి చిన్న చిన్న డైనమిక్స్ కూడా మిస్సవకుండా కథనం చేశారు.
          ఇక ఎండ్ కొస్తే, ఒకే సీనుతో రూమీ రాబీల పెళ్లి చూపులు
!
          ఈ పెళ్లి చూపుల్లో డాబా మీద ఇద్దరూ మాట్లాడుకుంటారు. రూమీ మూడాఫ్ అయి ఏమీ వుండదు, హుషారుగానే వుంటుంది. మీరేం చేస్తూంటారని అడిగి, బ్యాంకర్ అని చెప్పగానే - క్యాషియరా అనేస్తుంది చటుక్కున. పాత్ర స్వభావం కొద్దీ స్పందనలు. మీరు పెళ్ళికి రేడీయేనా అని అతనంటే, విక్కీగాడి నుంచి ఫోనొస్తుంది. కట్ చేస్తుంది. ఫర్వాలేదు ఎత్తమంటాడు అదెవరో తెలుసుకోకుండా. చివరికెలాగూ వాణ్ణి ఎత్తుకునేది ఆమెనే. మీకు లవ్ మ్యారేజీ ఇష్టమా, అరేంజుడు మ్యారేజీ ఇష్టమా అని అడుగుతాడు. ఏదైతేనేం గాడిదలా తెగడానికి – అంటుంది. గాడిదలు తెగవు, బకరాలు తెగుతాయి- అంటాడు, ఆ బకరా తనే అవుతున్నాడని తెలుసుకోకుండా. చివరికి ఇంకో కొంటె ప్రశ్న వేస్తుంది - మీకు టిండర్ ఎక్కౌంట్  వుందా అని. లేదని నవ్వి వూరుకుంటాడు. టిండర్ యాప్ హిట్ అండ్ క్విట్ కల్చర్ కి ప్లాట్ ఫాంలా పనిచేస్తోంది. సెక్సు కొట్టు, గుడ్ బై కొట్టు కల్చర్. ఒకవేళ ఇతను ఆ టైపేమో తెలుసుకోవడానికి తెలివిగా అలా అడిగిందన్న మాట. తను వర్జిన్ కాదని మాత్రం చెప్పడం లేదు. సెల్ఫిష్ క్యారెక్టర్.
          ఇలా మొదటి బీట్ ‘పెళ్లి చూపులు’ సీక్వెన్స్ ముగింపు కొస్తుంది.

                                      ***
           ఇక రెండో బీట్ – ‘మెహందీ’ సీక్వెన్స్ కొద్దాం :
          1. పబ్ లో ఒకడి సెల్లో రూమీ ఫోటో చూసి విక్కీ గొడవ, ఇది రాబీ చూసి ఆపుతాడు.
          2. ఇంటికి పోతూ రాబీ, రూమీకి లవరున్న విషయం గురించి ఫ్రెండ్స్ తో చర్చిస్తాడు.            3. విక్కీ వెళ్లి మ్యారేజి బ్యూరో వాడి ఇంటి మీద దాడి చేసి, రూమీకి సంబంధాలెందుకు చూస్తున్నావని గొడవ పెట్టుకుంటాడు.
          4. రూమీ విక్కీ ఇంటికెళ్ళి, తన పెళ్ళి చెడగొడితే తన్ని పోలీసులకి అప్పజెప్తానని హెచ్చరిస్తుంది.
          5. విక్కీ దారుణంగా ఏడుస్తూంటాడు.

          6. రూమీ మెహందీకి కూర్చుంటుంది.
          7 మెహందీ వేడుకల్లో విక్కీ వచ్చి, ఇంటి ముందు కాపు కాస్తాడు. రాత్రయ్యాక  రూమీ బయటి కొచ్చి తిడుతుంది. తప్పయింది, ఇక పెళ్లి చేసుకుంటానని  ఒకటే బతిమాలుకుంటాడు.
          8. రూమీ మనసు మార్చుకుని, నిజంగా విక్కీ బాధ పడుతున్నాడనీ, వాడితో వెళ్లి పోతాననీ చెల్లెలికి చెప్పేస్తుంది.
          9.  రూమీ రాబీ ఇంటికెళ్ళి, ఈ పెళ్లి వద్దని చెప్పేస్తుంది.
          10. రాబీ మ్యారేజీ బ్యూరో వాడికి ఫోన్ చేసి, విక్కీ వెధవలో ఏం చూసి ప్రేమిస్తోంది – ఆ వెధవకి పేరెంట్స్ తో క్లాసు పీకించమని చెప్తాడు.
          11. విక్కీ రూమీని లేపుకు పోవడానికి తయారవుతూంటే పేరెంట్స్ క్లాసు పీకుతారు. . 12. వస్తానన్న విక్కీకోసం సూట్ కేసు పట్టుకుని రాత్రంతా వీధిలో నిలబడి ఎదురు చూస్తూంటుంది రూమీ.

          పదకొండు సీన్లతో ఈ మెహందీ సీక్వెన్సు వుంది. పెళ్లి చూపులై పోయాయి ఇంకేమిటని ఈ సీక్వెన్స్ ని వెంటనే మెహందీతో ప్రారంభించలేదు. దీన్ని సీక్వెన్స్ మధ్యకి నెట్టేశారు. ఎందుకంటే పెళ్లి చూపుల పరిణామాల్ని ఇంకా చిత్రించాల్సి వుంది. ఈ పరిణామాల్ని క్లియర్ చేసుకున్నాకే రూమీ మెహందీకి సిద్ధపడాలి గనుక. ఇంకోటేమిటంటే ఇక్కడ రూమీ, రాబీ ట్రాకులు విడివిడిగా లేవు. గత పెళ్లి చూపుల సీక్వెన్సు లోనే మిడిల్ విభాగంలో రాబీ ట్రాకు వచ్చేసి రూమీ ట్రాకు తో స్పర్శించి, చివరికి పెళ్లి చూపులతో కలిసిపోయింది గనుక. 

          ఈ సీక్వెన్సులో 12 సీన్లున్నాయి. ట్రాకులు కలిసిపోయాయి గనుక- ప్రధాన పాత్ర రూమీకి  కాబోయే ఇంకో ప్రత్యర్థి పాత్ర రాబీ పరిచయమైంది గనుక, ఇక విడి విడి ట్రాకులకి స్థానం లేదు. ఈ 12 సీన్లలో మొదటి ఆరూ బిగినింగ్ విభాగం.

          బిగినింగ్ :
          1. పబ్ లో ఒకడి సెల్లో రూమీ ఫోటో చూసి విక్కీ గొడవ, ఇది రాబీ చూసి ఆపుతాడు.
          2. ఇంటికి పోతూ రాబీ, రూమీకి లవరున్న విషయం గురించి ఫ్రెండ్స్ తో చర్చిస్తాడు. 
          3. విక్కీ వెళ్లి మ్యారేజీ బ్యూరో వాడి ఇంటి మీద దాడి చేసి, రూమీకి సంబంధాలెందుకు చూస్తున్నావని గొడవ పెట్టుకుంటాడు.
          4. రూమీ విక్కీ ఇంటికెళ్ళి, తన పెళ్ళి చెడగొడితే తన్ని పోలీసులకి అప్పజెప్తానని హెచ్చరిస్తుంది.
          5. విక్కీ దారుణంగా ఏడుస్తూంటాడు.

          6. రూమీ మెహందీకి కూర్చుంటుంది.

          మిడిల్- 1 లో భాగమైన ఈ రెండో సీక్వెన్స్ లో ప్రధానపాత్ర రూమీ గోల్ ఇప్పుడు మెహందీకి కూర్చోవడం. దీనికి ప్రత్యర్థి అయిన విక్కీ తో కొత్త సమస్యలెదురయ్యాయి. గత సీక్వెన్సులో పెళ్ళే వద్దన్న విక్కీ ఇప్పుడు పెళ్లి గొడవ ప్రారంభించాడు. కథనం ఎక్కడేసిన గొంగళిలా వుండిపోకుండా వేగంగా పరిణామం చెందడాన్ని గమనించాలి. పాత్రల్లో మార్పు రాకపోతే కథనం పరిణామం చెందదు. ఈ సీక్వెన్స్ బిగినింగ్ విభాగంలోనే  అనూహ్యంగా విక్కీ పాత్రలో మార్పు వచ్చింది. దీంతో పరిస్థితి నిగడదన్నిన సంక్షోభం వైపుకి దారి తీస్తోంది. 

          పై ఆరు బిగినింగ్ సీన్లలో 1. కథా నేపధ్య పరిచయం, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య లేదా గోల్ ఏర్పాటు ఎలా జరిగాయో చూద్దాం.
          1. కథకి నేపధ్యమేమిటో తెలిసిందే.
          2. పాత్రల పరిచయం : ట్రయాంగిల్ లో రూమీ, రాబీ, విక్కీ పాత్రలు పరిచయమవుతున్నాయి. మొదటి రెండు సీన్లలో ఇది జరిగింది.
          3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన : ముగ్గురి మధ్య దీన్ని మొదటి సీను నుంచే కల్పించుకొస్తున్నారు. పబ్ లో ఒకడి సెల్లో విక్కీ రూమీ ఫోటో చూసి రెచ్చిపోవడం, అక్కడే వున్న రాబీ ఇది చూసి షాకవడం, బజార్లో లస్సీ తాగుతూ కన్పించిన వాడే ఇప్పుడు రూమీ బాయ్ ఫ్రెండ్ అని తెలియడం, ఆ గొడవని ఆపడం (సీన్ -1), రాబీ ఇంటికి  పోతూ రూమీ ఎఫైర్ గురించి ప్రెండ్స్ తో చర్చించడం (సీన్ -2), విక్కీ మ్యారేజీ బ్యూరో వాణ్ణి పట్టుకుని రూమీకి సంబంధాలు చూడవద్దని హెచ్చరించడం (సీన్ -3), రూమీకి  విక్కీ గొడవ తెలిసి, తన పెళ్ళి చెడగొడితే  పోలీసులకి అప్పజెప్తానని హెచ్చరించడం (సీన్ - 4), విక్కీ ఏడ్వడం (సీన్ -5)... ఇలా రూమీ మెహందీ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకొచ్చారు.

          ఇక రూమీ మెహందీకి కూర్చోవడంతో ప్లాట్ పాయింట్ - 1 ని ఏర్పాటు చేశారు. ఈ గోల్ ని ఆమె సాధిస్తుందా, వెనుక విక్కీతో ఇంత రచ్చ వుంటే? రాబీకిదంతా తెలిసిపోతే? 

          ఈ సీక్వెన్స్ బిగినింగ్ కూడా ఓపెనింగ్ టీజర్ తో ఉత్కంఠ రేపుతూ వుంది - పబ్ లో అనూహ్యంగా రూమీ ఫోటోని ప్లే చేయడం ద్వారా. 

          విజువల్ రైటింగ్ అంటే ఇదే. విజువల్ రైటింగ్ ఎప్పుడూ కథననాన్ని ఉజ్వలంగా వుంచుతుంది. విజువల్ రైటింగ్ లో కథనమెప్పుడూ యాక్షన్ లో వుంటుంది. యాక్షన్ సంఘటన ద్వారా వస్తుంది. పబ్ లో రూమీ ఫోటో ప్లే చేయడమనే సంఘటనే లేకపోతే యాక్షన్ లేదు, విజువల్ రైటింగూ లేదు. ఉత్కంఠా లేదు. సంఘటనలతో కథనాల్ని అల్లండ్రా బాబూ అంటే ఎవరూ విన్పించుకునేది లేదు. డైలాగుల పైత్యం ఒకటి పెట్టుకుని, ఏవేవో  డైలగులకి ఆనందిస్తూ, డస్ట్ బిన్ దస్త్రాలు తయారు చేసుకుని తిరగడం. ఢిల్లీ ఔర్ బహుత్ దూర్ హై యార్...

                                          ***

మిడిల్ : 
          7. మెహందీ వేడుకల్లో విక్కీ వచ్చి, ఇంటి ముందు కాపు కాస్తాడు. రాత్రయ్యాక  రూమీ బయటి కొచ్చి తిడుతుంది. తప్పయింది, ఇక పెళ్లి చేసుకుంటానని  ఒకటే బతిమాలుకుంటాడు.
          8. రూమీ మనసు మార్చుకుని, నిజంగా విక్కీ బాధ పడుతున్నాడనీ, వాడితో వెళ్లి పోతాననీ చెల్లెలికి చెప్పేస్తుంది.
          9. రూమీ రాబీ ఇంటికెళ్ళి, ఈ పెళ్లి వద్దని చెప్పేస్తుంది.
          10. రాబీ మ్యారేజీ బ్యూరో వాడికి ఫోన్ చేసి, విక్కీ వెధవలో ఏం చూసి ప్రేమిస్తోంది – ఆ వెధవకి పేరెంట్స్ తో క్లాసు పీకించమని చెప్తాడు.
          11. విక్కీ రూమీని లేపుకు పోవడానికి తయారవుతూంటే పేరెంట్స్ క్లాసు పీకుతారు. . 12. వస్తానన్న విక్కీకోసం సూట్ కేసు పట్టుకుని రాత్రంతా వీధిలో నిలబడి ఎదురు చూస్తూంటుంది రూమీ

          ఏకంగా మెహందీ కే వచ్చేసిన విక్కీతో రూమీకి మిడిల్ విభాగపు బిజినెస్ ననుసరించి స్ట్రగుల్ మొదలైంది. ఆమె వెళ్ళగొట్టినా వెళ్ళిపోడు. తప్పయిపోయింది, ఇక  పెళ్లి చేసుకుంటానని బతిమాలుకుంటాడు. ఇప్పుడు మించి పోయిందన్నా విన్పించుకోడు. అతనేమీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు. తనతో పడుకున్న వీడియోల్ని వైరల్ చేస్తాననడం లేదు. అలాటి వీడియోలే తీయలేదు. పోనీ రాబీకి చెప్పేసి పెళ్లి చెడగొట్టే ఉద్దేశం కూడా లేదు. నిజాయితీగా ప్రేమించే వాడు ఇలాటి పన్లు చెయ్యడు. ఈ పాత్ర మీద సానుభూతి ఏర్పడాలంటే ఇలాగే వుండాలి. పైగా తర్వాతి  సీన్లో రూమీ మనసు మారాలంటే అతను మంచోడై వుండాలి. అందుకనే ఈ తర్వాతి సీన్లో చెల్లెలికి చెప్పేస్తుంది విక్కీతో లేచిపోతానని. 


         అటు విక్కీ రూమీని లేపుకుపోవడానికి తయారవుతూంటే పేరెంట్స్ కాసు పీకుతారు. ఫైనల్ గా రూమీ తన సమస్యకి లేచిపోవడమే పరిష్కారమని నిర్ణయించుకుంటుంది. 


          ఇక ప్లాట్ పాయింట్ టూ అంటే  మిడిల్ కి పరిష్కారమే కాబట్టి, 12 వ సీన్లో  రూమీ అలా విక్కీ కోసం సూట్ కేసు పట్టుకుని వీధిలో ఎదురు చూస్తూ నిలబడిందన్న మాట రాత్రంతా. విక్కీ వచ్చినట్టే వచ్చి ఆమె చూడకుండా వెనక్కి తిరిగి వెళ్లి పోతాడు. 

          ప్లాట్ పాయింట్ టూలో పెళ్లి చూపుల సీక్వెన్స్ లోలాగే, ఇక్కడ కూడా రూమీకి విక్కీతో పరాజయమే. అప్పటి పరాజయంతో రాబీతో పెళ్లి చూపులయ్యాయి,ఇప్పుడు పెళ్లి.

                                     ***
          ఇక మూడో బీట్ ‘పెళ్లి’ 
          పెళ్లిని ఇంకో సీక్వెన్స్ చేయలేదు. ఫస్టాఫ్ లోనైనా, సెకండాఫ్ లోనైనా మూడేసి సీక్వెన్సులకి మించి వుండవని పైన చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఫస్టాఫ్ కథనంలో బిగినింగ్ విభాగంలో ఒక సీక్వెన్స్ చూశాం. మిడిల్ - 1 విభాగంలో రెండు సీక్వెన్సులు చూశాం. మొత్తం మూడు అయిపోయాయి. కాబట్టి బీట్స్ లో మూడోదైన పెళ్లి బీట్ ని పై రెండో సీక్వెన్స్ ఎండ్ విభాగంలో కలిపారు. పై రెండో సీక్వెన్సులో ఎండ్ విభాగం లేదని గమనించాలి. కాబట్టి మూడో బీట్ పెళ్లి, ఈ ఎండ్ విభాగంలో కుదురుకుని మిడిల్ – 1 స్ట్రక్చర్ కి చక్కగా న్యాయం చేస్తోంది. 

          ఎండ్ విభాగం : ఒకే సీనులో ఇరు బంధువర్గాల పరివారమంతా వధూవరులతో స్వర్ణ దేవాలయానికి వెళ్లినట్టు చూపించడం ద్వారా పెళ్లి జరిగిపోయినట్టు సూచించారు.
          ఐతే దీని తర్వాత వచ్చే ఇంటర్వెల్ కి ఒక క్లోజింగ్ ఇమేజితో ప్రేక్షకుల హృదయాలు తరుక్కుపోఎలా చేస్తారు. ఆ క్లోజింగ్ ఇమేజి,  రాత్రి పూట రూమీ సూట్ కేసు పట్టుకుని విక్కీ కోసం ఎదురు చూస్తూ నిలబడి వుండే మాంటేజీ. 

          అంటే
, పెళ్లయినప్పటికీ  ఆమె ప్రాణమింకా  విక్కీ కోసమే కొట్టుకుంటోందని సెకండాఫ్ కథకి లీడ్ ఇచ్చారు. పెళ్ళి దృశ్యాలతోనే  గనుక ఇంటర్వెల్ వేసి వుంటే కథ అక్కడితో శుభం అన్నట్టు అన్పించేది. కథ అక్కడితో ఆపేసినట్టుండేది. సెకండాఫ్ గురించి ఏ హింటూ లేక డ్రైగా వుండేది. అందుకని కథ మనుగడలో వుందన్న భావంకోసం ఇలా చేశారు - పెళ్లయినట్టు దృశ్యాలు చూపించి, ‘రీలు’ వెనక్కి తిప్పి, మళ్ళీ ఆమె సూట్ కేసుతో విక్కీ కోసం ఎదురు చూస్తున్న షాటే వేశారంటే, సెకండాఫ్ కథ గురించి ఇంటర్వెల్లో  లీడ్ ఇస్తూ క్లోజింగ్ ఇమేజి లేదా టీజర్ వేసినట్టే. కొత్త ట్రెండ్ లో సినిమాలకి ఓపెనింగ్ టీజర్ వుంటోందే గానీ, ఇలా ఇంటర్వెల్లో క్లోజింగ్ టీజర్ లేదు. కానీ ఈ క్లోజింగ్ టీజర్ సెకండాఫ్ కి ఓపెనింగ్ టీజరే... ఫస్టాఫ్ ఓపెనింగ్ టీజర్ ని ఫస్టాఫ్ తొలి దృశ్యంతో వేసినట్టు, సెకండాఫ్ ఓపెనింగ్ టీజర్ ని సెకండాఫ్ ఓపెనింగ్ లో వేస్తే శిల్పం చెడుతుంది. అందుకని ఇంటర్వెల్లో వేసి ఉత్కంఠ రేపడం ఉత్తమం.  
                                                                                ***
   ఇదీ పెళ్లి చూపులు, మెహందీ, పెళ్ళీ వేడుకలు మూడింటినీ పక్కపక్కనే మూడు సీన్లతో అవగొట్టి – ఫస్టాఫ్ లో వెంటనే బాధామయ పెళ్లి కథ ఎత్తుకోకుండా నిగ్రహించుకుని, వాటిని మూడు బీట్స్ గా విడగొట్టి, బీట్ కీ బీట్ కీ ఎడం పెంచి,  వాటిని డిటెయిలింగ్ చేస్తూ, సవివర కథనం చేశారు. దీనివల్ల ఫస్టాఫ్ ఎంతో కథ లభించి లాభపడింది. పాత్రలు కూడా ప్రేక్షకులకి లోతుగా తెలుస్తాయి. మరొకటి, ఇష్టం లేని పెళ్లి తర్వాత కష్టాల కథ ఇప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ కాదు. యూత్ అప్పీల్ కూడా కాదు. అందుకని ఈ కష్టాల కథని వీలయినంత కుదిస్తూ, సెకండాఫ్ కి నెట్టేసి, ఫస్టాఫ్ మూడు బీట్లతో పూర్తి ఎంటర్ టైనింగ్ కథనం చేశారు. ఈ ఎంటర్ టైనింగ్ కథనం ఫస్టాఫ్ కాలం గడిపే దృష్టితో గాక, సెకండాఫ్ కష్టాల కథకి అపారమైన బ్యాక్ గ్రౌండ్ ని సమకూర్చి పెట్టడానికి చేసినట్టయింది.                                   

              స్ట్రక్చర్ లోపల ఇంత వైవిధ్యభరిత క్రియేటివిటీకి పాల్పడడం వల్లే స్క్రీన్ ప్లేకి ఇంత బలం వచ్చింది. క్రియేటివిటీ అంటే టెంప్లెట్ కాదు, మూస కాదు, చట్రం కాదు, కొలమానం కాదు - ప్లానింగ్. ఎన్నో ఎలిమెంట్స్ కలగలిసిన ప్లానింగ్. మార్కెట్ యాస్పెక్ట్ కాడ్నించీ, యూత్ అప్పీల్ కాడ్నించీ, రైటింగ్ టెక్నిక్స్ కాడ్నించీ, ప్లాటింగ్ వ్యూహం కాడ్నించీ, కథనపు అల్లిక కాడ్నించీ మొదలయ్యే స్క్రిప్ట్ మేనేజిమెంట్. ఏ కథకా కథగా  టెక్నిక్స్ మార్చుకునే అభ్యాసం. క్రియేటివిటీ అంటే రీసెర్చి కూడా. సబ్జెక్ట్ డిజైనింగ్ కోసం రీసెర్చి చేయని వాడు క్రియేటర్ కాదు, క్రియేచర్.

         ***
          మిడిల్ -2 సెకండాఫ్ కథ కుంటుపడక పోలేదు. ఇష్టం లేని పెళ్ళయాక ఎడ మొహం – పెడ మొహం బాపతు తప్పనిసరి తద్దినపు కథనంతో కుంటుపడక తప్పదు. ఐతే ఇది ఒక ఇరవై నిమిషాల సేపు వుంటుంది. తర్వాత యూత్ అప్పీల్ అందుకుంటుంది. ఎలా? రూమీ గడిచిపోయిన కాలపు హీరోయిన్లానే పాసివ్ గా – ఇక నువ్వే తేల్చూ -  అన్నట్టుగా భర్త రాబీ వీపుకి బాధ్యతల మూట కట్టి  మూల కూర్చోకుండా, యాక్టివ్ గా మారిపోతుంది. ఇలాటి కథల్లో ఎరక్కపోయి ఇరుక్కున్న భర్త, భార్యని కోరుకున్న ప్రియుడితో తిరిగి కలిపే సంధానకర్త సన్యాసి బాధ్యత మీదేసుకోవడం కద్దు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో అజయ్ దేవగణ్, ‘ధడ్కన్’ లో సునీల్ శెట్టిలు ఇందుకు ప్రసిద్ధులయారు. ఇంకా ఇలాటిదే కథ ఎందుకు? ఇన్నోవేషన్ కావాలి. ఇలాటి అరిగిపోయిన కథకి కొత్త ఇంజెక్షన్ ఇచ్చి లేపాలి. అందుకని, ఈ కథని రొటీన్ శోక రసానికి దూరంగా, యూత్ అప్పీల్ తో అద్భుత రసం ఇంజెక్షనిస్తూ రూమీని లేపి పరుగెత్తించారు. జెనెటికల్ గా రూమీ మొదట్నించీ ఏం చేస్తోందో అదే మళ్ళీ ఎత్తుకుని విక్కీతో చేయడం – సెక్స్ కొట్టడం!


          రూల్స్ ని బ్రేక్ చేయడమంటే ఇదే – మూస కథలతో రూల్స్ ని బ్రేక్ చేయాలి, స్ట్రక్చర్ తో కాదు. రూమీ దేన్నీ కేర్ చేయని అడ్వెంచరస్ గర్ల్. ఆమె నేచర్ కి కళ్ళెం వేసి మూల కూర్చోబెట్టలేరు. మూస కథల కళ్ళేల్నే తెగ్గొట్టేయాలి. 

          ‘మన్ మర్జియా’ సెకండాఫ్ స్క్రీన్ ప్లే సంగతుల జోలికి పోవడం లేదు. అవసరం లేదు, అర్ధమైపోతుంది. సంక్లిష్టంగా 
వున్న ఫస్టాఫ్ కథకే అవసరమని దానికి మాత్రమే స్క్రీన్ ప్లే సంగతులు చేశాం. దీని పీడీఎఫ్ కాపీ రేపు బ్లాగు సైడ్ బార్ లో అందుబాటులో వుంచుతాం, డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సికిందర్