రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జూన్ 2018, శుక్రవారం

658 : స్క్రీన్ ప్లే సంగతులు

(జరిగిన కథ : జూహీ తల్లి డైరీలో  జూన్ హా ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక, తిరిగి మొదలైన చోటికొస్తుంది ప్రధాన ఫ్లాష్ బ్యాక్. జూన్ హా ఫ్రెండ్ టీసూ, జూహీకి ప్రేమలేఖ  రాయమని పురమాయించిన సన్నివేశం దగ్గరికి. ఇప్పుడు జూన్ హా, జూహీతో ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ పూర్తి చేసుకుని, ప్రధాన ఫ్లాష్ బ్యాక్ లో  కళ్ళు మూసుకుని ఆనందంగా వుండి పోవడంతో, ప్రధాన ఫ్లాష్ బ్యాక్ పాజ్ అయి, వర్తమానంలో ప్రధాన కథలో డైరీ చదువుతున్న జీహా కూడా కళ్ళు మూసుకుని అనుభూతి చెందుతున్న మ్యాచ్ కట్ తో డైరీ పఠనానికి విరామం...ఇక్కడ్నించి వర్తమాన కాలంలో తిరిగి ప్రధాన కథ ప్రారంభం...)
సీన్ : లైబ్రరీ భవనం ఇంటీరియర్ –  ఈ ప్రధాన కథలో ప్రధాన పాత్ర జీహై లోపలికొస్తూంటే, టిల్ట్ అప్ లాంగ్ షాట్. టిల్ట్ అప్ లో పై అంతస్తులో జీహైని అనుసరిస్తూ ఆమె కూర్చునే వరకూ పానింగ్. డైరీ టేబుల్ మీద పెడుతున్న చేతులతో కలిపి క్లోజప్. ప్రొఫైల్ లో ఆమె డైరీ పేజీలు  తిరగేయడం...క్లోజప్ లో డైరీ చదవడం...
పాయింట్ :  ఈ సీనులో ఎక్కడా ఆర్ ఆర్ వుండదు. పైన చెప్పుకున్న ఐదు షాట్లతో,  కేవలం  ఈ ప్రధాన ఫ్లాష్ బ్యాకుకి ఇదొక లీడ్  సీను.
సీన్ : 
     ప్రధాన ఫ్లాష్ బ్యాక్ పునః ప్రారంభం. లైబ్రరీలో కూర్చుని ప్రేమలేఖ రాస్తూంటాడు జూన్ హా. అదే టేబుల్ మీద కాళ్ళు బార జాపుకుని,  నెత్తి  మీద చేతులు పెట్టుకుని,  పైకెటో చూస్తూంటాడు జూహీకి ప్రేమ లేఖ రాయించుకుంటున్న ఫ్రెండ్ టీసూ. నెత్తిమీద ఇప్పుడు రెండు పాయల జుట్టు వుండదు. దాదాపు గుండు కొట్టించుకున్నట్టు వుంటాడు. కిటికీ అవతల ఎవరో పోవడం చూసి చటుక్కున టేబుల్ మీద నుంచి కాళ్ళు తీసేసి  తిన్నగా కూర్చుంటాడు. మళ్ళీ  టేబుల్ మీద కాళ్ళు పెడతాడు. రాయడం పూర్తి చేసిస్తాడు జూన్ హా. వెంటనే చక్కగా కూర్చుని ఉత్తరం మీద వంగిపోయి, అక్షరమక్షరం పట్టిపట్టి చూస్తాడు టీసూ. వీడి కోసం ఉత్తరాలు రాయడం బాధాకరంగా వుందనీ, అయినా జూహీకి ఇలా తను చెప్పుకోవాల్సింది చాలా   వుందనీ సర్ది చెప్పుకుంటాడు మనసులో జూన్ హా. లెటర్ గ్రేట్ గా వుందంటాడు టీసూ తైతక్క లాడుతూ. తన స్పెషాలిటీ చూపించి థాంక్స్ చెప్తానంటాడు. దగ్గరి కొచ్చి మూతి బిగించుకుని కూర్చున్న జూన్ హా భుజాల మీద చేతులేసి, ‘నువ్వు నోరు తెరవాలి. నోర్మూసుకుంటే నమ్మరు మనల్ని జనాలు’ అంటాడు. దూరం జరిగి తన స్పెషాలిటీ చూపిస్తాడు. నడుం వూపుతూ వంకర టింకర నాట్యం చేస్తూ, ఏవో అరుపులు అరిచి, ఇదేం పాటంటాడు. ఏదో పాట అంటాడు  జూన్ హా. జాలిగా చూస్తాడు టీసూ. ఇంతలో లైబ్రరీ సూపర్ వైజర్ కేకలేస్తూ రావడంతో ఇద్దరూ గబుక్కున లేచిపోయి పక్కనున్న బకెట్లూ మాపర్లూ ఎత్తుకుని పరిగెత్తుతారు. సూపర్ వైజర్ బూతులు తిడుతూ శుభ్రంగా క్లీన్ చేయాలంటాడు. ఇక్కడేదో వాసనొస్తోంది...ఎవడ్రా కంపు కంపు చేసిందీ.....అని అరుస్తాడు.

పాయింట్ : ఇది జూన్ హా, టీసూలు చదువుతున్న విద్యా సంస్థలో లైబ్రరీ. విద్యాసంస్థ రెసిడెన్షియల్ కావొచ్చు. విద్యార్ధులే శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. ఈ సీను ముగిసిన చోట నుంచీ ప్రారంభమయింది. అంటే బకెట్లు మాపర్లతో ఫ్లోర్ క్లీన్ చేయాలనీ వచ్చి, వాటిని పక్కన పడేసి ప్రేమలేఖ రాయడంలో పడ్డారన్న మాట. ఇలా ఉత్తరం రాసే ఈ ఫ్లాష్ బ్యాక్ సీను లైబ్రరీలో పెట్టారు. వెనుక జీహై డైరీ చదివే ప్రధాన కథ సీను కూడా లైబ్రరీలో పెట్టారు. లైబ్రరీ అంటే పుస్తకాలు. పుస్తకాలు ఈ కథలో జీహై తల్లి జీవితానికి సింబాలిజాలని  ఈ మూవీ ప్రారంభ సీన్లోనే గుర్తించి చెప్పుకున్నాం. ఈ విధంగా తల్లి జీవితంతో ముడిపడి వున్న ఈ రెండు సీన్లనీ  లైబ్రరీలో పుస్తకాల మధ్య థీమాటికల్ గా నడిపారు.  

     ఇక ఈ సీనులో టీసూ కూర్చున్న విధానం పరోక్షంగా కథ చెప్తోంది. ఇదే  ప్రధాన ఫ్లాష్ బ్యాకు ప్రారంభ సీనులో   వున్నట్టు రెండు పాయల జుట్టుతో లేడు. దాదాపు గుండు కొట్టించుకున్నాడు.  ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో  చూశాం - జూహీతో జూన్ హా ఎపిసోడ్ అంతా. అంటే జూహీని ప్రేమిస్తున్న టీసూ పని ఇప్పుడు గుండు సున్నాతో సమానం కాబోతోందన్న మాట. గుండు మీద చేతులు పెట్టుకుని కూర్చున్న విధానం ఇది తెలుపుతోంది. అతను తెలియకే గుండు కొట్టించుకుని వుండొచ్చు, తెలియకే అలా కూర్చుని వుండొచ్చు, కానీ మనసులో మాత్రం జూహీ గురించిన ఆలోచనలతోనే వుంటాడు. 

          ప్రతీ సీనూ మాటా చేతా ఆలోచనా కథా లోకాన్నే ప్రతిబింబిస్తున్నాయి. మనల్ని పాసివ్ గా, రోతగా కూర్చుని చూడనివ్వకుండా, పాలు పంచుకుంటూ యాక్టివ్ గా చూసేలా చేస్తున్నాయి సీన్లు.ఈ కొరియన్ మూవీలోనే కాదు, ఈ విధానం హాలీవుడ్ లో ఎప్పట్నుంచో వుంది. టాలీవుడ్ లో కన్పించదు. ఇది విజువల్ రైటింగ్, లేదా లైవ్ రైటింగ్, లేదా ఇంటలిజెంట్ రైటింగ్ - ఏదైనా కావొచ్చు. ఉత్త డైలాగులతో సీన్లు నడిపిస్తే ఈ మూడూ వుండవు. జస్ట్ వెనుక సీన్లోనే జుట్టుతో వున్న వాడు ఇప్పుడు గుండుతో ఎలా వుంటాడని వాదిస్తే లాభంలేదు. ఒక్కటే గుర్తు – కథ రాయాలంటే మైండ్ పెట్టి రాస్తే వెలవెలబోయే పాసివ్ కథనాలొస్తాయి. ఇంటలెక్ట్ తో రాస్తే కళకళ లాడే యాక్టివ్ కథనాలొస్తాయి. సినిమా బిజినెస్ లో కథకుడికి సగటు ప్రేక్షకుడి మైండ్ కంటే, ఇంటలెక్ట్ చాలా అవసరం. 

          కాబట్టి మైండ్ స్థాయిలో వుండిపోతే  అసలు టెక్నిక్ అర్ధంగాక వాదనలే మిన్నంటుతాయి. కానీ టీసూ పాత్ర స్వభావం ప్రకారం ఏమైనా చేస్తాడు. ఇప్పటికిప్పుడు ఇక్కడే కూర్చుని గుండు కొట్టించుకుంటాడు. ఎవరికి అభ్యంతరం? టీసూ ఇప్పుడు ప్రేమలేఖ రాయించుకుంటున్నాడు కాబట్టి, రోమాంటిక్ గా కూర్చుని వుండాలనుకుంటే అది పైపైన మైండ్ కథనమే అవుతుంది.  అది ప్రేక్షకుల మైండ్ కే అందుతుంది గానీ, మనసుకి పట్టదు. మనసుకి పట్టాలంటే ఇంటలెక్ట్ గా లోతులాలోచించాలి.  ఇంతకి ముందే చూపించిన ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ ప్రకారం ఉత్తరం రాయించుకుంటున్న టీసూ ఇక ఆటలో అరటి పండని ప్రేక్షకులకి ఇప్పుడు అర్ధమయ్యే పోయింది. ఈ  అర్ధమైపోయిందాన్నే ఇక్కడ చిత్రిస్తే మనసుకి పట్టించుకుని ఇన్వాల్వ్ అవుతారు. ప్రేక్షకులకి అర్ధమైపోయిందాన్ని పక్కనబెట్టి, టీసూని రోమాంటిక్ గా కూర్చోబెడితే, కథకుడు ప్రేక్షకుల నుంచి విడిపోయి నిర్మాతని ముంచుతున్నట్టే. సినిమా కథకుడు మంచి సినిమా వ్యాపారవేత్త కూడా అయ్యుండాల్సి వుంటుంది. ప్రేక్షకుల్ని వదిలేసి రాసుకుంటే సినిమా వ్యాపారంగా కాక,  వ్యభిచారంగా వినుతి కెక్కుతుంది. తనతో తానే వ్యభిచరించుకోవడం. 

     ఆ తర్వాత - జూన్ హా ఉత్తరం రాసిచ్చాక, టీసూ ఆబగా పట్టి పట్టి చదువుకుంటాడు. వీడి లవ్వే బువ్వ లేనిదై పోతూంటే వీడి కొవ్విలా పెరిగిపోవడం చూసి మనకి నవ్వొస్తుంది. జూన్ హా మాత్రం ఈ ఉత్తరాల వంకన జూహీ పట్ల తన మనోభావాలు వెల్లడించుకునే అవకాశం లభిస్తున్నందుకు సంతృప్తి పడ్డాడు. 

          ఈ సీనులో ప్రతీ డైలాగునీ  జాగ్రత్తగా గమనిస్తే,  అవన్నీ ఈ కథాలోకం ఆధారంగా రాలిపడుతున్న స్వాతివాన లాగే వుంటాయి. ఈ సీనే కాదు,  ప్రతీసీనూ ఇంతే. సీన్ అంటే మామూలుగా పాత్ర గురించి ఇంకో కొత్త విషయం చెప్పేదో, లేదా కథ ముందుకు నడవడానికి లీడ్ ఇచ్చేదోనని నిర్వచనముంది. ఇక్కడ చూస్తే,  సీన్ అంటే డైలాగుల్లో కూడా నడుస్తున్న కథ లైవ్ గా ఉట్టి పడేది కూడానని అర్ధంజేసుకోవాలి. ఇది పాత్రలకి తెలియకపోవచ్చు. అవి సందర్భానుసారంగా సహజంగానే మాట్లాడుకోవచ్చు. కానీ ఆ మాటల్లో మనకి వేరే అర్ధాలు తోస్తాయి- ఆ అర్ధాలు  కథ గురించి కావొచ్చు, పాత్ర గురించీ కావొచ్చు. 

          ఇప్పుడు ఉత్తరం గొప్పగా వుందన్న టీసూ,  తన స్పెషాలిటీ ద్వారా కృతజ్ఞతలు చెప్తానంటాడు. నోర్మూసుకుని కూర్చున్న జూన్ హాని నోరు తెరవమంటాడు...అంటే ఇప్పుడున్న ముక్కోణ ప్రేమకథలో జూన్ హా మూగ ప్రేమికుడన్నట్టే కదా? ఇది నోర్మూసు
కుని కూర్చోవడం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇతడి పరిస్థితేంటో తెలీని  టీసూ ఆ నోరు తెరవమంటున్నాడు. తెలియక అన్నా ఇది సరైన మాటే. లేకపోతే ఈ సమస్యెలా తేలుతుంది? కాబట్టి మున్ముందు జూన్ హా నోరు తెరవడం ద్వారానే ఈ ముక్కోణ సంక్షోభానికి తెర పడవచ్చని ఒక ఆలోచన ఇస్తున్నాడు  దర్శకుడు. 

          దీనితర్వాత టీసూ వంకర టింకర డాన్సు చేసి కృతజ్ఞత చెప్పుకుంటాడు. వాడి ప్రేమకథే ఇంత కదా? ఇక సూపర్ వైజర్ వచ్చి బూతులు తిట్టి వెళ్ళగొడతాడు. అప్పుడు బయటపడుతుంది అసలు సంగతి. లైబ్రరీ తుడిచే ఈ చెత్త బ్యాచి ఇప్పటి వరకూ ఇక్కడ కూర్చుని గొప్పాలోచనలు చేస్తున్నారన్న మాట. అప్పటి వరకూ షాట్స్ లో రివీల్ చెయ్యని బకెట్లూ మాపర్లూ తీసుకుని పరిగెత్తుతారు. మంచి ఫినిషింగ్ టచ్చిది సీనుకి. 

          సూపర్ వైజర్ వాసనేదో పసిగట్టి కంపు కంపు చేసిందెవడ్రా అనడమంటే – ఆ వాసన ప్రేమకథే. దాన్ని వీళ్ళు కంపు కంపు చేయబోతున్నారేమో. ఇలా కథాలోకంలోంచే – కథా లోకాన్ని దృష్టిలో పెట్టుకునే మాటలు ఉట్టి పడడంతో అవి బలంగా తోస్తున్నాయి. డైలాగులకి కథా లోకమే రిఫరెన్సు అన్న వ్యూహాన్ని అమలుపరుస్తున్నాడు.

సీన్ :
      లైబ్రరీ లోకి గట్టిగా జూన్ హాని పిలుస్తూ పరుగెత్తుకొస్తాడు టీసూ కార్డు వూపుకుంటూ. లైబ్రరీలో చదువులో నిమగ్నమై వున్న వాళ్ళందరూ తలెత్తి కోపంగా చూస్తారు. జూన్ హా ఠారెత్తిపోయి చూసి -  నీకేమైనా పిచ్చా, ఇక్కడ కేకలేస్తావ్?’ అని గొంతు తగ్గించి అంటాడు టీసూ దగ్గరికెళ్తూ. ఇన్విటేషన్ వచ్చిందంటాడు టీసూ కార్డు చూపిస్తూ. జూన్ హా భుజాల మీద  చెయ్యేసి తీసికెళ్ళిపోతూ, వెనక్కి వాళ్ళందరి కేసీ చూసి – ఇక్కడ మీరంతా జూన్ హాలా? – అంటాడు వ్యంగ్యంగా. 

పాయింట్ :  వరసగా ఇది మూడో లైబ్రరీ సీను. అంటే ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ అయిన జీహై తల్లి  జూహీ కలిసేదాకా థీమాటిక్ కంటిన్యుటీని కొనసాగిస్తున్నాడు. లైబ్రరీ లోకి జూన్ హాని గట్టిగా పిలుస్తూ, కార్డు వూపుకుంటూ టీసూ రావడం – వెనువెంటనే వెనక సీను ఇంకో కొత్త మలుపు తీసుకునే – కథని పురోగతి బాట పట్టించే – డైనమిక్స్ అన్నమాట.  పునరుక్తులు, చర్వితచరణాలూ దొర్లకుండా జగ్రత్తపడుతున్నట్టు వున్నాడు. ఏ సీనుకా సీను తాజా విషయం వ్యక్తమయ్యేట్టు కథా పథకం పెట్టుకున్నాడు. వెనుక సీను ప్రేమలేఖ రాశారు. ఇప్పుడు టీసూ ఇలా వస్తున్నాడంటే ఆ లేఖకి జూహీ జవాబుతోనే రావాలని మనమనుకుంటే మనమెక్కడో పాతాళంలో పడకేసినట్టే. కార్డు వూపుకుంటూ ఇన్విటేషన్ అంటూ వచ్చాడు. కొత్త మలుపు. ఇన్విటేషన్ ఏమిటన్న దానితో కొత్త సస్పెన్స్. ప్రేమ కథని మినప్పప్పులా నానబెట్టకుండా, వూరగాయ వేయకుండా, నాన్ వెజ్ లా మారినేట్ చేసి ఫ్రిజ్జిలో  పెట్టేయకుండా, ఇంకేదో చేయకుండా, నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళడం. కథనంలో ఏ క్షణాన్నీ వదిలిపెట్టడం లేదు. వెండితెర మీద ప్రతీక్షణమూ ఏంతో విలువైనదనే గుర్తించి-  క్షణాల్ని సంచలనం చేస్తున్నాడు. 

          క్షణాల్ని సంచలనం చేసేవాడు సినిమాకి నిజమైన డబ్బులు రాబట్టే కథకుడు / దర్శకుడు. అర్ధం జేసుకోలేని, అప్డేట్ అవ్వాలనుకోని సోమరులు ఈ సినేరియాలో ఇమడరు.  చివరికి జూన్ హాతో టీసూ వెళ్ళిపోతూ – అక్కడున్నవాళ్లకే క్లాసు పీకుతాడు - ఇక్కడ మీరంతా జూన్ హాలా? – అని. అంటే,  ‘నేను పిలిచింది జూన్ హానైతే, మీరంతా ఎందుకు తలలెత్తి చూస్తున్నారు?’ అనడమన్న మాట.  లైబ్రరీలో అసలు వాళ్ళెందుకు తలలెత్తి కోపంగా చూశారో మనవాడికి అర్ధంజేసుకునే బుర్ర వుంటేగా?

సికిందర్