రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 7, 2018

581 : స్పెషల్ ఆర్టికల్




            సినిమా ఎందుకు ఆడిందో, ఏది ఎందుకు ఆడలేదో శాస్త్రీయ దృష్టితో పరిశీలించేకంటే, కొన్ని స్థిరపడిపోయిన నమ్మకాలతో పై పైన అంచనాకొచ్చేయడమే సర్వసాధారణంగా జరిగే పని. ఈ పై పై అంచనాలతో అసలు స్క్రీన్ ప్లే సంగతులు మరుగున పడిపోయి, మళ్ళీ అవే పైపై అంచనాలతో  అవే సినిమాలు అలాగే పైపైన తీసేయడం జరుగుతోంది. అంతా పైపైనే వుంటుంది గానీ లోపలేమీ వుండదనుకోవడం పొరపాటు. లోపల ఎండ్ సస్పన్స్ వల్ల ఫ్లాపవచ్చుగానీ, పైన హీరో బాగా నటించక కాదు. లోపల స్ట్రక్చర్ బావుండి హిట్టవచ్చు గానీ,  పైన కామెడీ బావుండడం వల్లకాదు. లోపల పాసివ్ పాత్ర వల్ల సినిమా పోవచ్చు గానీ,  పైన పాత కథ వల్ల కాదు. హిట్టు ఫ్లాపులకి పైకి తోచే ఏవో మంచి చెడ్డలే కారణమైతే,  అవి సవరించుకుని తీస్తూ వుంటే సక్సెస్ రేటు పెరగాలి నిజానికి. కానీ ప్రతీ ఏటా 90 శాతం ఫ్లాపులే. ఇక ఈ అంచనాల, నమ్మకాల, సొంత అభిప్రాయాల మంత్రం ఎక్కడ పనిచేస్తున్నట్టు. పది శాతమే సక్సెస్ రేటు అనే శాశ్వతత్వం 2017 లో కూడా వదల్లేదు. విడుదలైన 161 పెద్దా చిన్నా సినిమాల్లో 17 మాత్రమే గట్టెక్కి, మిగిలిన 144 కూడా 144 సెక్షన్ విధించినట్టు కనిపించకుండా పోయాయి. ప్రతీఏటా ఇలా 144 సెక్షన్ విధించుకోవడానికే ఈ అంచనాలు, నమ్మకాలు, సెంటిమెంట్లూ పనికొస్తున్నాయన్నట్టుంది. థియేటర్లు 144 సెక్షన్ విధించినట్టే ప్రేక్షకుల్లేక వెలవెల బోతున్నాయి. ఈ సెక్షన్ 144 ని ఎప్పుడు ఎత్తి వేస్తారా అని ఆశతో చూడ్డం కూడా వృధా. నమ్మకాలంచనాల వంచనలు వదిలి పోనంత వరకూ ఇంతే. 

          హాలీవుడ్ సక్సెస్  రేటు 40 – 50 శాతం మధ్య వుంటోంది. 2017 లో 50 శాతం నమోదైంది. 743  సినిమాలు విడుదలైతే వాటిలో 84 సినిమాలు (11 %) బడ్జెట్ మీద రెట్టింపు కంటే ఎక్కువ  వసూళ్లు సాధించాయి. మరో 84 సినిమాలు (11%) బడ్జెట్ మీద వంద నుంచి 200 శాతం కలెక్షన్లు రాబట్టాయి. ఇంకో 207 సినిమాలు ( 28%) బడ్జెట్ మీద స్వల్ప లభాలార్జించాయి. 251 సినిమాలు (34%) బడ్జెట్ కి స్వల్ప నష్టాలతో వున్నాయి. 66 సినిమాలు (9 %)  పెట్టుబడి వందకి వంద శాతం నష్టపోయాయి. 51 (7%) పూర్తిగా నష్టపోవడమే గాక చేతినుంచి అదనంగా పడ్డాయి. ఇలా పూర్తిగా దెబ్బ కొట్టినవి  9 + 7 = 16 శాతమే. కానీ టాలీవుడ్ లో 90 శాతం!

          ఆడని సినిమాలకి ఇతరత్రా భర్తీ చేసుకుని,  నాట్ బ్యాడ్ సేఫ్ అనే సూత్రం ఒకటి అమలుచేస్తున్నారు. మళ్ళీ అలాటి సినిమా ఇచ్చిన ఆ దర్శకుడికి, కొన్నిసార్లు ఆ కొత్త దర్శకుడికీ మళ్ళీ తామే సినిమా ఇస్తున్నారు. సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిలయ్యాక ఫెయిలైనట్టే లెక్క. శాటిలైట్ హక్కులు, అమెజాన్ హక్కులు, డబ్బింగు హక్కులూ  తెచ్చుకుని నష్టాన్ని భర్తీ చేసుకుని, వీలయితే లాభమే తెచ్చుకుని,  నాట్ బ్యాడ్ సేఫ్ అని సినిమా పెర్ఫార్మెన్స్ కి ఆపాదించడం చెడ్డ సాంప్రదాయం. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల్ని రాబట్ట లేకపోయిన దర్శకుడు ఫ్లాప్ దర్శకుడే. అతను తీసిన ఫ్లాప్ ఇతరత్రా భర్తీ చేసింది కాబట్టి అతడి మీద  మమకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇతరత్రా భర్తీ అవుతుందన్న భరోసాతో, అలసత్వంతో మళ్ళీ ఫ్లాపే తీస్తాడు తప్ప తన టాలెంట్ ని మెరుగుపర్చుకునే ఆలోచన చెయ్యడు. గత రెండు నెలల్లో విడుదలైన రెండు సినిమాల విషయంలో ఇదే జరిగింది. నాట్ బ్యాడ్ సేఫ్ సూత్రంతో ఇద్దరు కొత్త ఫ్లాప్ దర్శకులకి కొత్త ప్రాజెక్టులు. ఇలా నాట్ బ్యాడ్ సేఫ్ డైరెక్టర్లు కూడా వస్తే ఇంకేం శాస్త్రం, అస్త్రం వుంటాయి.  అదే నమ్మకాలంచనాల వంచనల ముంచివేతలు ఇంకా పెరుగుతాయి. 

          హాలీవుడ్ లో 40 – 50 సక్సెస్ రేటు వుందంటే,  వాళ్ల దగ్గర నమ్మకాలంచనాల వంచనలు పనిచెయ్యవు. శాస్త్రం దగ్గరికి రావాల్సిందే. ఎంత పెద్ద స్టూడియో అయినా,  ఆ స్ట్రక్చర్ సంగతి చూసుకోమంటాయి. అదే ససమయంలో కొన్ని స్టూడియో నమ్మకాలు కూడా పెట్టమంటాయి. దీంతో ఢోకా వుండదు. కానీ – స్ట్రక్చరేంటో అర్ధంగాక, నమ్మకాలు పెడితే పెట్టండి, లేకపోతే పొమ్మంటేనే వస్తోంది సమస్య. దీంతో ఇందుకు తగ్గట్టే  రాసేవాళ్ళు, తీసేవాళ్ళూ తయారవుతారు. యుద్ధప్రాతిపదికన 90 శాతం ఫ్లాపులు తీస్తూంటారు. ఈ మృత శిశు జననాల జాడ్యాన్ని అరికట్టే డాక్టర్లు లేరా అంటే, మంచి పురుడు పోయాలనుకునే  స్క్రిప్టు డాక్టర్లున్నారుగానీ, సర్జన్లు లేరు. సర్జన్ అయితే సిజేరియన్  చేసైనా కాపాడి తీరాలనుకుంటాడు. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే,  పూర్తిగా నమ్మకాలూ పనిచెయ్యవు, పూర్తిగా శాస్త్రమూ పనిచెయ్యదు. ఈ రెండిటిని కలుపుకు పోవడం దగ్గర వచ్చింది సమస్య. హాలీవుడ్ లో కలుపుకుని పోతారు కాబట్టి ఆ సక్సెస్ రేటు. మనకి శాస్త్రాల్లేవు, వున్నవి నమ్మకాలే. శాస్త్రాల్ని హాలీవుడ్ నుంచి తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకున్నా వున్నదున్నట్టు అమలు చేయలేరు. చేస్తే తెలుగు సినిమాలు కాక, హాలీవుడ్ సినిమాలు తయారవుతాయి. ఆ స్క్రీన్ ప్లే శాస్త్రాలు అక్కడి సినిమాలకి, అక్కడి ఫిలిం స్కూళ్ళకి. ఆ శాస్త్రాలు చదివి, ఫిలిం స్కూళ్ళల్లో పాసై వచ్చినా,  మళ్ళీ స్థానిక నేటివిటీతో అంటుకట్టాల్సిందే. స్థానిక అభిరుచులకి తగ్గట్టుగా వాటిని మల్చుకుని,  కస్టమైజ్ చేసుకోవాల్సిందే. స్వతంత్రంగా ఆ శాస్త్రాలు, కోర్సులూ పనిచెయ్యవు. 

          హాలీవుడ్ లో శాస్త్రాలూ నమ్మకాలూ చెట్టపట్టాలేసుకోవడం సినిమాలు పుట్టినప్పట్నించే వుంది. నమ్మకాలనేవి కేవలం క్రియేటివిటీకి సంబంధించిన సాధనాలే  తప్ప వాటికవే నిర్మాణాలు, అంటే స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ వేరు, నమ్మకాలతో కూడిన క్రియేటివిటీ వేరు. కథనమే క్రియేటివిటీ అనుకోవడం వల్ల సినిమాలు గల్లంతవుతున్నాయి. కథనంలో ఓనమాలు తెలియకపో
యినా చేతిలో వున్న క్రియేటివిటీయే కథన చాతుర్యమనుకుని సినిమాలు తీసేస్తున్నారు. కథనమనేది సృజనాత్మక (క్రియేటివ్) ప్రక్రియ కాదు. అది స్ట్రక్చర్ సంగతి. ఈ స్ట్రక్చర్ కి కొన్ని నియమాలున్నాయి, క్రియేటివిటీకి నియమలుండవు (నమ్మకాలకేం నియమలు, ప్రమాణాలు వుంటాయి). దీని గురించి ఈ బ్లాగులో కొన్ని సార్లు వివరించుకున్నాం. కథకి ముందు ఒక స్ట్రక్చర్ తో కూడిన కథనం ఏర్పాటయ్యాకే,  ఎవరికి  తోచిన క్రియేటివిటీ (నమ్మకాలు, అంచనాలు, సొంత అభిరుచులు) తో వాళ్ళు నగిషీలు చెక్కుకోవచ్చు. 

          ఈ అవగాహన హాలీవుడ్ లో ముందు నుంచీ వుంది కాబట్టే స్ట్రక్చర్ కి అంతటి విలువ. ముందు నాటకాలని  గమనించారు. ఆ నాటకాలు అలా రక్తి కట్టడానికి వాళ్లేసిన మంత్రమేమిటని పరిశీలించారు. అరిస్టాటిల్ తేలాడు. రెండో శతాబ్దపు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పట్లో నాటక శాస్త్రాన్ని వివరిస్తూ రాసిన ‘పొయెటిక్స్’ గ్రంధం  నాటకాలకి ప్రామాణికమైందని  తెలుసుకున్నారు. దాన్నుంచీ అరిస్టాటిల్ చెప్పిన అంక విభజన సహిత కథా క్రమాన్ని సంగ్రహించి  హాలీవుడ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి వాడుకోసాగారు. కొంతకాలం గడిచాక జోసెఫ్ క్యాంప్ బెల్ రాసిన పరిశోధనాత్మక గ్రంధం  ‘హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ ని  స్క్రీన్ ప్లేల కుపయోగించుకోసాగారు. మరికొంత కాలం గడిచాక,  సిడ్ ఫీల్డ్ రాసిన ‘ది ఫౌండేషన్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్’ ని అనుసరిస్తూ స్క్రీన్ ప్లేలు రాసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతున్నారు. 

          ఇలా ఈ ముగ్గురు పండితులు హాలీవుడ్ స్క్రీన్ ప్లేల పితామహులుగా మూడు కాలాలు ప్రభావితం చేస్తూ వచ్చిన నేపధ్యంలో,  వీరిపైన ప్రత్యేక వ్యాసం రేపు చూడగలం.
సికిందర్