నిర్మాతలకి కథలు విన్పించే ముందు, ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని విన్పించక పోతే త్రిశంకు స్వర్గంలో పడతారు. ఏ నటీనటీనటులకో, టెక్నీషియన్లకో, మిత్రులకో విన్పించి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోదు. కథల మీద అవగాహన వుండే రచయితలకో, దర్శకులకో విన్పించుకోవాలి. సమస్య – దాని సాధన- పరిష్కారం నిర్దుష్టంగా వున్నాయని ధృవీకరించు కున్నాకే నిర్మాతలకి విన్పించేందుకు అడుగెయ్యాలి. నిర్మాతలతో మూడు జరగవచ్చు : కథ అసలు నచ్చక పోవచ్చు, నచ్చి కొన్ని మార్పులుసూచించ
వచ్చు, నచ్చిఉన్నదున్నట్టు ఓకే చేయవచ్చు. మొదటి రెండిటితో పేచీ లేదు. నచ్చకపోతే చేసేదేం లేదు, నచ్చి మార్పులు సూచిస్తే ఇష్టముంటే వాటికి అంగీకరించవచ్చు – లేకపోతే నో చెప్పేసి వెళ్లిపోవచ్చు. వీటితో సమస్య లేదు. సమస్యల్లా మూడో దాంతోనే.
సొంతంగా రాసేసి, ఏ
క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి, నిర్మాతకి
విన్పిస్తే – ఆ నిర్మాతకి ఉన్నదున్నట్టు ఆ కథ నచ్చేసి, ఓకే
చెప్పేశాక – అదే కథని ఇంకెవరికో విన్పించినప్పుడు, అందులో పెద్ద పెద్ద సుడిగుండాలు వున్నాయని క్రాస్ చెకింగ్ లో బయటపడితే, అప్పుడు సదరు రచయిత
పరిస్థితి / దర్శకుడి దుస్థితి ఏమిటి?
కుమారి
21 ఎఫ్ లో పాటలాగా – కథని సరిదిద్ది
నిర్మాతకి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెబితే మొదట చెప్పినప్పుడు కథతో కలిగిన
ఇంప్రెషన్ వుంటుందా పోతుందా? వుంటుందా
పోతుందా? ఛత్, వున్నదున్నట్టే తీయాలని ఆయనంటే హిట్టవుతుందా అవదా? హిట్ట వుతుందా అవదా? అసలు
నిర్మాత డిస్టర్బ్ అయి వుంటాడా వదులుకుంటాడా? వుంటాడా వదులుకుంటాడా? ఇలావుంటుంది
పరిస్థితి.
ఇలాటి కేసులు తరచూ తగుల్తున్నాయి ఈ వ్యాసకర్తకి. ఇలాంటప్పుడు చివరిదే జరిగే అవకాశా లెక్కువ వుంటాయి. నిర్మాత డిస్టర్బ్ అయి సెట్ అయిన ప్రాజెక్టు ఇక వుండకుండా పోతుంది. ఒకవేళ గుట్టు చెప్పకుండా ముందు చెప్పిన కథతో అలాగే ముందు కెళ్తే నిర్మాత డబ్బు నష్టపోవడంతోబాటు, సదరు దర్శకుడు లేదా రచయిత కేరీర్ ని కోల్పోతాడు. ఇలా చేయడం కూడా మనస్కరించదు. త్రిశంకు స్వర్గంలో వూగిసలాడుతూంటారు.
అందుకే ముందే క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదనేది. చాలా మందికి చెప్పి క్రాస్ చెక్ చేసుకున్నాం, వాళ్ళు బావుందన్నారు అంటే, ఎవరు వాళ్ళు? అనే ప్రశ్న వస్తుంది. కథలతో సంబంధం లేనివాళ్ళతో క్రాస్ చెకింగ్ కరెక్టేనా? తెలిసిన దర్శకుడికో, రచయితకో విన్పిస్తే సరయిన ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశముంటుంది. ప్రేమలో త్యాగం ఉదాత్తమైనదని చెప్పడం ముగింపు అనుకుందాం. ఈ ముగింపు సీన్లకి సృష్టించిన డ్రామాకి, ఫీల్ కి పడిపోయి కథలతో సంబంధం లేని వాళ్ళంతా బావుంది బావుంది అన్నారనుకుందాం. ఓ నిర్మాతకి చెబితో ఆయన కూడా ఆ ముగింపుకే ఫ్లాట్ అయిపోయి ఓకే చేశానుకుందాం - తీరా ఇంకో క్రాస్ చెకింగ్ లో ఆ ముగింపులో చేసిన త్యాగంలో స్వార్ధం, క్రౌర్యం, పరిహాసం వగైరా వగైరా నెగెటివిజాలు ఎన్నో కనబడుతున్నాయని లాజికల్ గా తేలితే? ఇది కరెక్టే అని తన కామన్ సెన్సుకే ఇప్పుడనిపిస్తే అప్పుడేమిటి? ఏం చేయాలి? ముగింపులతోనే కాదు, కథా నడకలతో, హీరోగారి పోకడలతో, ఇంకా చాలాచాలా వాటితో ఇలాటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.
నిర్మాత చేత ఆఫీసుకూడా ప్రారంభించి, తీరా కథలో కృష్ణ బిలాలున్నాయని బయటపడితే, ఆఫీసు వుంటుందా పోతుందా అని పీడకలలతో గడపడం భావ్యమేనా? దీనికి పరిష్కారమేమిటి? ఒక్కటే మార్గం : ఒకసారి సొంతంగా రాసుకుని నిర్మాతని ఒప్పించుకున్నాక ఇంకెవరికీ విన్పించుకోవద్దు. క్రాస్ చెకింగ్ జోలికిపోవద్దు. అప్పుడు కనీసం నిర్మాతని వంచిస్తున్నామనే గిల్టీ ఫీలింగ్ వుండదు. అజ్ఞానమే చాలా మనశ్శాంతినిస్తుంది. కాబట్టి ఎవరి సహకారం లేకుండా కథ రాసేసుకుని నిర్మాతని ఒప్పించాక, ఇక అందులో లోపాలెన్నే ప్రయత్నం చేయకూడదు. తీర్పుని బాక్సాఫీసుకే వదిలెయ్యాలి.
ఇంకో ఝలక్ కూడా ఇచ్చుకుంటున్నారు నిర్మాతలకి. నోటి దూలతో ఝలకానందాన్ని తీర్చుకుంటున్నారు. నల్గురితో కూర్చుని పర్ఫెక్ట్ కథ తయారుచేసుకుని నిర్మాతకి విన్పిస్తే –చాలా బావుందయ్యా దీన్ని టేకప్ చేస్తానని ఆయన అంటే, వెంటనే ఆ మాట పట్టుకుని ముందు కెళ్ళాలా? లేదు, నోటి దూల అలా చేయనివ్వదు. సార్ , ఇంకో వెర్షన్ కూడా వుందండీ, అది ఈ టైపులో వుంటుంది...అని మొదలెడితే, తలుపు తట్టిన అదృష్టం వుండేనా పోయేనా? ఈ ఝలక్ తో ఆ నిర్మాత - అది రేపు వింటా - అంటాడు. ఆ రేపు ఇక రాదు. ఓకే చేసిన వెర్షన్ కూడా ముందుకు పోదు.
నువ్వు రాసిన మొదటి ప్రతి షిట్ అన్నాడు సోమర్సెట్ మామ్. దాన్నుంచి వచ్చిన మేలు ప్రతి ఓకే అయ్యాక, షిట్ లాంటి చిత్తు ప్రతితో నిర్మాత టేబుల్ ని అశుద్ధం చేయమేమిటి?
సినిమాలంటే క్రియేటివిటీ ఒక్కటే కాదు, సేల్స్ మాన్ షిప్ కూడా. ఇది లేకపోతే క్రియేటివిటీ లేదు, దాని పిల్లా పాపలూ లేవు.
-సికిందర్
No comments:
Post a Comment