రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 13, 2017

512 : స్పెషల్ ఆర్టికల్

        తెలుగు సినిమాల కర్తలు ఒక విచిత్రమైన – కొంపలు ముంచుకునే  కమ్యునికేషన్ గ్యాప్ తో హాయిగా గడిపేస్తున్నారు. దేశంలో లేదా రాష్ట్రంలో  ఏ పరిణామం సంభవించినా సినిమాలకది  శాశ్వత కమర్షియల్ ముడి సరుకవుతుందని సంబరపడి  సినిమాలు నిర్మించేస్తున్నారు. మాసి పోయిన పరిణామాలు ఇంకా సమసిపోని బాక్సాఫీసు దినుసులే అనుకుంటూ అహోరాత్రాలు కష్టపడిపోతున్నారు. వాటిని సజీవంగా వుంచడానికి పదుల కోట్ల రూపాయలు పణంగా పెడుతూ ప్రతిష్టాత్మకంగా ఫీలవుతున్నారు. తీరా బాక్సాఫీసు ఇస్తున్న సందేశాలు చూసి లబోదిబోమంటున్నారు. బాక్సాఫీసు ఎప్పుడూ వర్తమానంలో వుండి,  రియల్ టైం ఫలితాలనే అందిస్తుందనీ,  ‘The Power of Now’ ని ఎత్తిచూపుతుందనీ తెలుసుకోలేక పోతున్నారు. బిజినెస్ అంటే ప్రేక్షకుల మార్కెట్ అని కాక, బిజినెస్ అంటే బయ్యర్లే అనుకుంటున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ అనే ఒక నిర్లక్ష్యం చేస్తున్న పదాన్ని అర్ధంజేసుకోలేక, క్రియేటివ్ యాస్పెక్ట్ లకి పాల్పడుతున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ లేని క్రియేటివ్ యాస్పెక్ట్ ఎందుకూ కొరగాదని తెలుసుకోలేకపోతున్నారు. పూర్తిగా ప్రేక్షకులతో, సమాజంతో, దేశంతో సంబంధాలు తెగిపోయిన కూపస్థ మండూకపు కళలు పోతున్నారు. ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తున్నా చెప్పక తప్పడంలేదు. సినిమాలు  తీయడానికి నక్సలిజాన్ని వాడుకోవడం అయిపోయింది, ఫ్యాక్షనలిజాన్ని అరగదీయడం అయిపోయింది, మాఫియాయిజంని  అడపాదడపా సానబట్టడం జరుగుతోంది; నక్సలిజానికీ, ఫ్యాక్షనలిజానికీ  కాలదోషం పట్టిందని వదులుకున్న ప్రాప్త కాలజ్ఞత, మాఫియాయిజంతో కలగడం లేదు. సరే, మాఫియాలు ఎప్పుడూ వుండే అసాంఘీక శక్తులే అనుకుందాం, బాలీవుడ్ దీన్ని వాడుకోవడం ఎప్పుడో మానేసింది.  తీస్తే గీస్తే  గతంలో కి వెళ్లి ‘ఒన్స్ అపాన్ ఎ టైం....’ బాపతు  గతకాలపు మాఫియా వ్యవహారాలు  తీస్తున్నారు.  రెండు వారాల క్రితం విడుదలైన ‘డాడీ’ 1980 లనాటి ముంబాయి డాన్ అరుణ్ గావ్లీ కథే. ఇక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తనకంటూ ప్రియమైన  తెలుగు మాఫియాల్ని సృష్టించుకుని, మూవీ మేకింగ్ మేడీజీ చేసుకున్న పూరీ జగన్నాథ్ కూడా తన కెరీర్ ని ‘నిల్లేరు’ మీద నడకలా ఫీలవుతున్న చారిత్రక సందర్భంలో, ఇంకోపక్క ఇంకొందరు ఆరిపోయిన టెర్రరిజపు నిప్పుల్ని రాజేస్తున్నారు. దీపపు పురుగుల్లా అందులోపడి ఆహుతైపోతున్నారు. ఇదీ ఇప్పటి సమస్య!

         
టెర్రరిజం ఆరిపోయిన నిప్పా? ఆరిపోయిన నిప్పే కాశ్మీర్ ని వదిలేసి. దేశంలో నగరాల మీద జరిగిన టెర్రర్ దాడుల్లో 2013 లో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ దాడి చిట్ట చివరిది. ఆ తర్వాత జరుగుతున్నవన్నీ కాశ్మీర్ లోనే. ‘రా’ వెబ్సైట్, ‘ఎన్ ఐ ఎ’ వెబ్సైట్ ఇది చెప్తాయి. నిన్నటికి నిన్న ‘టైమ్స్ నౌ’ బయట పెట్టిన టేపుల్లో కాశ్మీర్ నాయకుడి ప్రగల్భాలు చూస్తే, వాళ్ళ లక్ష్యం సిరియా ఐఎస్ తో కలిసి కాశ్మీర్ ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే. ఇందుకే గత కొంత కాలంగా కాశ్మీర్ కే పరిమితమవుతున్నాయి దాడులు. అమెరికా ప్రభుత్వం విడుదలచేసిన ఒక రిపోర్టులో,  2016 లో పాకిస్తాన్ లో కంటే ఇండియాలో ఎక్కువ దాడులు జరిగాయని పేర్కొంది. అదీ కాశ్మీర్, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో. మావోయిస్టు దాడుల్ని కూడా కలిపి ఈ రిపోర్టు ఇచ్చింది. ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో మావోయిస్టు దాడుల్ని తీసేస్తే, టెర్రర్ దాడులు జరిగింది ఒక్క కాశ్మీర్ లోనే.

          ఈ పరిస్థితుల్లో ఇంకా 2013 నాటి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ మీదే  గ్లామర్ పెంచునుని నక్షత్రాలూ, యుద్ధం శరణాలూ  తీస్తే ఏమౌతుంది? మూడవుతాయి : ఒకటి - ప్రేక్షకులకి పరమబోరు; రెండు - టెర్రరిస్టులకి పరమానందం; మూడు - ప్రభుత్వానికి పరాభవం. 

          మూడోదే చాలా విచారకరమైనది. సినిమా కర్తల సెన్సిటీవిటీని వెల్లడిస్తుంది. 2014 నుంచి రాష్ట్రాల్లో ఎలాటి దాడులు జరక్కుండా నిఘా సంస్థలూ బలగాలూ కట్టు దిట్టం చేసుకు వస్తూంటే, సినిమాలుతీసి దాడులు చూపించడం ప్రభుత్వం మీద జోకేయడమే అవుతుంది. ఆల్రెడీ విమెన్ సేఫ్టీ విషయంలో పోలీసులకి ఈ పరాభవం ఎదురవుతూనే వుంది. పోలీసులో పక్క స్త్రీల భద్రత కోసం బయటికెళ్ళి నప్పుడు ఫలానా యాప్ వాడండీ, ఈఈ  జాగ్రత్తలు తీసుకోండీ - అని వూర ప్రచారం చేస్తూంటే, ఇదేం పట్టక సినిమాల్లో అజ్ఞానపు హీరోయిన్ పాత్రల్ని సృష్టించి ప్రమాదాల్లోకి నెట్టేయడం చేస్తున్నారు. ఎవేర్నెస్ బదులు పోలీసుల ప్రచారానికి గండి కొట్టడం. ఇది వరకు సినిమాల్లో సామాజిక సృహ అంతగా అవసరపడలేదు. ఇప్పుడు అత్యవసరంగా స్పృహ తెచ్చుకోకపోతే, వ్యతిరేక సంకేతాలివ్వడాన్ని డీఫాల్టు యాప్ గా ఇన్ స్టాల్ చేసుకునే ప్రమాదం వుంది.

          అలాగే ఇంకా బాంబు దాడులు జరిపించి టెర్రరిస్టు కథలతో సొమ్ము చేసుకోవా
లనుకోవడం, ప్రభుత్వాన్ని పరిహసించడమవుతుందో కాదో మైండ్ పెట్టి ఆలోచించాలి. దేశభక్తి నినాదాల వల్ల ఈ పరిహాసం నీరాజనమైపోదు. అయినా సరే పరిహాసం కాదనుకుంటే ఇలాగే మరిన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఏం ఫర్వాలేదు. బాక్సాఫీసు చూసుకుంటుంది.  ముందు ఏ విషయం స్పష్టత తెచ్చుకోవాలి.  బాలీవుడ్ కూడా ఈ దాడుల సినిమాలు వదిలేసిందని గుర్తుంచుకోవాలి. 2013 లో వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ టెర్రర్ - 26 /11’ ఆఖరిది. ఆ తర్వాత “పాంథమ్’ (2015), ‘బేబీ’ ( 2015), ‘నీరజ’ (2016) వచ్చాయి. మొదటి రెండూ  విదేశాల్లో టెర్రరిస్టుల్ని పట్టుకోవడం గురించి. రెండోది,  1983  లో అబూ నిదల్ హైజాక్ చేసిన అమెరికా విమానం గురించి.

          అసలు విషయమేమిటంటే,  టీవీ సీరియల్స్ వచ్చేసి ఫ్యామిలీ కథలనే జానర్ ని సినిమాలకి లేకుండా చేశాక, అచ్చమైన ఫ్యామిలీ కథలు ఇక చెప్పలేమని, వాటిని ఫ్యాక్షన్ కథల రూపంలో తీసి తిరిగి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని సంపాదించుకోవడం మొదలెట్టారు. ఫ్యామిలీ కథలకి హింసని జోడిస్తే తప్ప ఈ జనాలు చూసేట్టు లేరని అలా ఫ్యాక్షన్ సినిమాలు తీసి తగిన శాస్తి చేయడం మొదలెట్టారు. ఆ సినిమాల్లో అన్నీనరుక్కునే దుర్మార్గుల కుటుంబాల కథలే. ఇవే గొప్ప కుటుంబకథా చిత్రాలుగా తరించారు ప్రేక్షకులు కూడా. రానురాను ఫ్యాక్షన్ కి కాలదోషం పట్టి మాఫియాలు దొరికారు. ఇక మాఫియాల కుటుంబాల కథలు. ఒక మాన మర్యాదలున్న వాళ్ళ కుటుంబ కథలిక లేవ్!  అమాయక ప్రేక్షకులు కూడా మానమర్యాద ల్లేవ్, బొంగూ లేదన్నట్టుగా తయారయ్యారు.ఇలా వుండగా దిల్ సుఖ్ నగర్లో ధనా ధనా  బాంబులు పేలాయ్. దీంతో కుటుంబ కథలు దీని మీద పడ్డాయి. కుటుంబ కథ పరాన్న జీవి అయిపోయింది. ఎక్కడ కొత్త హింస వుంటే  అక్కడ దాన్ని పట్టి పల్లార్చడం మొదలెట్టింది. 

          ఇంతే గానీ, ఈ బాంబు దాడులతో సందేశాలిచ్చేదేమీ వుండదు. కుటుంబ కథలకోసం కరివేపాకులా వాడుకోవడమే. అయితే దారుణంగా ఇవే అట్టర్ ఫ్లాపవుతున్నాయి. ఇలాటిదే ఇంకో టెర్రర్ కథ (దీంట్లో కుటుంబ కథలేదు)  మూడేళ్ళుగా నలుగుతోంది. ఇప్పుడుదాన్ని మార్చాలని, ఇప్పుడున్న పరిస్థితులతో అప్ డేట్ చేసుకోవాలని చెప్పి చేయందించినా, బావిలోంచి పైకి రాలేని పరిస్థితి –  ఫ్లాపైన ‘నక్షత్రం’, ‘యుద్ధం శరణం’ టైపులోనే  ఆలోచనలు!-సికిందర్ 
https://www.cinemabazaar.in

No comments: