రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, July 16, 2017

484 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు




స్క్రీన్ ప్లేల్లో మిడిల్ విభాగంలో కథ ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం. కథంటే ఏమిటి?   కథంటే కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్ ల లడాయి అని ఈ బ్లాగ్ లో కొన్ని సార్లు చెప్పుకున్నాం. ఏ సినిమా కథయినా  మిడిల్ తోనే   ప్రారంభమవుతుంది. మిడిల్ కి ముందు బిగినింగ్ లో జరిగేదంతా  కథకి ఉపోద్ఘాతమే. ఉపోద్ఘాతం ముగిసే చోట బిగినింగ్ కూడా ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటై, గోల్ ఎలిమెంట్స్ బ్లాస్ట్ అవుతూ  మిడిల్లో పడుతుంది కథనం. ఇదెలా జరుగుతుందో ‘బ్లడ్ సింపుల్’ స్క్రీన్ ప్లేలో గత వ్యాసంలో చూశాం. అలా అప్పుడది ఒక కథగా మారుతుంది. దేవుడేం చేశాడు? సృష్టి నడవడానికి సరిపడా శక్తినీ, రసాయన మూలకాల్నీ తన గోల్ ఎలిమెంట్స్ గా బిందువులో కూరి, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఢామ్మని బ్లాస్ట్ చేశాడు. అంతే, ఆ బిగ్ బ్యాంగ్ తో  మిడిల్ అనే సృష్టి ప్రారంభమయింది. ఆ శక్తీ, రసాయన మూలకాలనే తన గోల్ ఎలిమెంట్స్ తో సాఫీగా నడుస్తున్న మిడిల్ అనే సృష్టిలో, ఇక జీవం పోయడం మొదలెట్టాడు. శక్తీ, మూలకాలు, జీవం-  జీవం రూపంలో ఈ సృష్టినంతా వ్యాపించి వున్నది సబ్ కాన్షస్ మైండే - ఈ మూడూ కలిసి మనం చూస్తున్నదే  దేవుడు నిర్మించి దర్శకత్వం వహిస్తూ మనకి చూపిస్తున్న నవరసాల  మహోజ్వల  సూపర్ హిట్ అనంత చలనచిత్ర రాజం. ఈ దేవుడు తన మైండ్ నే మన మైండ్  గా కూడా అమర్చాడు. అప్పుడు మన మైండ్ దానికదే దానికి ఆకట్టుకునే డిజైన్ తో కథల్ని అల్లింది. అది స్టోరీ మైండ్ అయింది. స్టోరీ మైండ్ మన మైండ్ ఒకటే!

         
స్క్రీన్ ప్లేకి గుండెకాయ మిడిల్. మన  గుండెకాయని పనిచేయిస్తున్నదేది? సబ్ కాన్షస్ మైండ్. అంటే మిడిల్ అనేది స్క్రీన్ ప్లేకి సబ్ కాన్షస్ మైండ్. కథకి ఆత్మని ఏర్పాటు చేసే శక్తి. మన మైండ్,  కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల ప్యాకేజీగా వచ్చింది. ఈ రెండిటి మధ్యలో ఫ్రీగా ఇగోని కొట్టుకొచ్చాం షాప్ లిఫ్టింగ్ చేసి.  ఈ కేర్ ఫ్రీ ఇగోకి కాన్షస్ మైండ్ లోనే మజా చేయడం బాగా ఇష్టం. సబ్ కాన్షస్ వైపు (అంతరాత్మ వైపు) చూడాలంటే చచ్చేంత జంకు. ఎందుకంటే అందులో నీతులుంటాయి, నగ్నసత్యాలుంటాయి, దేవుడు కొంపలంటుకుంటున్నట్టు  రాసి పెట్టిన ప్రకృతి నియమాల చిట్టా అంతా వుంటుంది. మొత్తంగా సబ్ కాన్షస్ మైండ్ అంటేనే  రూల్సు. అవన్నీ ఎగేసి బతకాలనుకుంటుంది  రాజాలాంటి కేర్ ఫ్రీ ఇగో. కాబట్టి తన డ్రంకెన్ డ్రైవింగ్ ని పట్టుకునే లాంటి సబ్ కాన్షస్ మైండ్ వైపు చచ్చినా వెళ్ళ కూడదనుకుంటుంది. ఇప్పుడు స్క్రీన్ ప్లేకి  బిగినింగ్  కాన్షస్ మైండ్ అయితే, మిడిల్ సబ్ కాన్షస్ మైండ్, రాజాలాంటి ఇగోగారు  హీరో!  కష్టపడి, నానా యాతనపడి ఇది అర్ధం జేసుకోనంత కాలం సినిమా కథలు కథల్లాగా వుండవు,  స్క్రీన్ ప్లేలు  స్క్రీన్ ప్లేల్లాగా వుండవు. 

అంటే అంత వరకూ బిగినింగ్ అనే కాన్షస్ మైండ్ లో మజా చేస్తూ వుండిన ఇగో అనే హీరోకి, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఇక వెనక్కి తిరిగి చూడలేని, ముందుకే వెళ్లి తీరాల్సిన సమస్య ఎదురవుతుందన్న మాట. ముందుకూ  అంటే తాను  జంకే  మిడిల్ అనే సబ్ కాన్షస్ మైండ్లోకే . ఇక  సబ్ కాన్షస్ సాగరమథనమనే సంఘర్షణా కార్యక్రమం ఇగోకి. ఇందుకే కథంటే కాన్షస్  -  సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే (లడాయి) అయింది. ఇందులో ఇగో మంచీ చెడూ నేర్చుకుని ఎదిగి- మోక్షం పొందుతూ ఎండ్ విభాగంలో పడుతుంది. అంటే కథ యొక్క అంతిమ లక్ష్యం ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చడమే నన్నమాట. ఏం చేసీ మనం ఇగోని చంపుకోలేం, మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకోమనే చెబుతారు. ఇదే చేస్తుంది కథ. ఇదే మన మైండ్, దీనికి సరిపోలే స్టోర్ మైండ్.
          కాబట్టి ఇగో (హీరో) జర్నీ= బిగినింగ్(కాన్షస్) మజా + మిడిల్ (సబ్ కాన్షస్) సంఘర్షణ + ఎండ్ మోక్షం = మెచ్యూర్డ్ ఇగో.
           ‘బ్లడ్ సింపుల్’ కథలో డిటెక్టివ్ విస్సర్ చెడు కర్మలు చేసిన యాంటీ హీరో కాబట్టి మోక్షం బదులు శిక్ష పొందుతాడు, అంతే.
                                    ***
  స్క్రీన్ ప్లేల్లో మిడిల్ రెండు భాగాలుగా వుంటుంది : ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ వన్, ఇంటర్వెల్ తర్వాత నుంచీ ప్లాట్ పాయింట్ టూ వరకూ  మిడిల్ టూ.  ముందుగా మిడిల్ వన్ చూద్దాం : ఈ విభాగం బ్లడ్ సింపుల్  వన్ లైన్ ఆర్డర్ లో ఈ క్రింది 10 సీన్లున్నాయి. (రిఫరెన్స్ కోసం ఈ విభాగం మార్కింగ్ చేసిన వొరిజినల్ స్క్రీన్ ప్లే కాపీని ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు)

          14. ఎబ్బీ తనకోసం వేరే ఫ్లాట్ చూసుకోవడం
          15. ఎబ్బీ బార్ కెళ్ళి మార్టీకీ రేకీ మధ్య మళ్ళీ గొడవ జరక్కుండా చూసుకోమని చెప్పడం
          16. రే బెడ్రూంలో ఎబ్బీ అలికిడి విని మార్టీ వచ్చినట్టున్నాడని  రే కి అనుమానం వ్యక్తం చేయడం
          17.  విస్సర్ రహస్యంగా రే ఫ్లాట్ కొచ్చి ఎబ్బీ  రివాల్వర్ కొట్టేసి వెళ్ళిపోవడం 
         18. విస్సర్ మార్టీకి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ చంపేశాననడం
          19.  విస్సర్ మార్టీ దగ్గరికెళ్ళి మర్డర్ ఫోటో చూపించి డబ్బు తీసుకుని, మార్టీని షూట్ చేయడం
          20.  రే బార్ కొచ్చి మార్టీ శవాన్నీ, రివాల్వర్నీ చూసి ఈ హత్య ఎబ్బీ చేసిందనుకోవడం
          21. కారులో శవంతో రే బార్ లోంచి బయట పడడం
          22.  హైవేమీద ప్రయాణంలో మార్టీ ఇంకా బతికే వున్నాడని  రే తెలుసుకుని పారిపోవడం
          23.  మార్టీ ని అలాగే లాక్కెళ్ళి సజీవ సమాధి చేయడం
(end of middle -1)
***
      స్క్రీన్ ప్లేల్లో సహజంగా బిగినింగ్ లో మొత్తం ఉపోద్ఘాతానికి అనుగుణంగా, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటైన గోల్ ఎలిమెంట్స్ ఆధారంగా,  మిడిల్ వన్ మొదలవుతుంది. గోల్ ఎలిమెంట్స్ కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అని చెప్పుకున్నాం. విస్సర్ గోల్ ఎబ్బీ, రే ల్ని చంపడంగా ఏర్పాటయ్యింది. గోల్ కోసం పాత్ర పడుతూ లేస్తూ పోవడం వుంటుంది. ఈ పదమూడు సీన్లూ సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతిరూపాలే. దీంతో విస్సర్ ఎలా తలబడుతున్నాడో చూద్దాం. మిడిల్ వన్ స్ట్రక్చర్ లో రెండు మజిలీలుంటాయి : 1. పించ్ వన్, 2. ఇంటర్వెల్. పించ్ వన్ సీను ఇంటర్వెల్ సీనుకి దారితీస్తుంది. అప్పుడే మిడిల్ వన్ పటిష్టంగా వుంటుంది. 

          ఒకసారి మనం జాగ్రత్తగా  గమనిస్తే ‘బ్లడ్ సింపుల్’ బిగినింగ్ ప్రారంభ సీను, ముగింపులో ప్లాట్ పాయింట్  వన్ (13 వ) సీనూ ఒకదానికొకటి మిర్రర్స్ లా వుంటాయి. ప్రారంభ  సీను రాత్రి పూట  వర్షంతో వుంటే, ముగింపు సీను పచ్చటి ప్రకృతి మధ్య తేటగా వుంటుంది- వర్షం వెలిసిందన్న భావంతో. నిజంగా వర్షం వెలిసిందన్న ఫీలింగే మనకి. అంత సేపూ రగులుతోంది కథనం. ఆఖరికి మార్టీ వచ్చి ఎబ్బీ మీద చేసిన దాడితో ఇంకా వేడెక్కింది. ఈ విభాగం టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ తారా స్థాయికి చేరింది. ఇక అపెయ్య దల్చుకున్నారు. ఫ్రెష్ గా ఆహ్లాదకర వాతావరణంలో ప్లాట్ పాయింట్ వన్ సీను వేశారు. మిర్రర్ లో ప్రారంభ సీను వర్షంతో వుంటే, తిరగేసిన మిర్రర్ లో ప్లాట్ పాయింట్ వన్ సీను పచ్చటి ప్రకృతితో వుంది. ఇది ద్వంద్వాల పోషణ కూడా.

          ఇలా ఆరుబయట ప్రకృతిలో ఈ సీను మార్టీ, విస్సర్ ల మధ్య ఫన్నీగా నడుస్తూనే,   మర్డర్స్ ఎజెండాతో సీరియస్ మలుపు తీసుకుంటుంది. దీన్ని
against the grain  అంటాడు సిడ్ ఫీల్డ్. అంటే నేపధ్యం ఒకటైతే జరిగేది దానికి విరుద్ధంగా ఇంకోటన్న మాట. పిల్లలు చదువుకునే బడి వరండాలో కూర్చుని దోపిడీ పథకం మాట్లాడు కోవడం. వేశ్యా గృహం ముందు నిలబడి ప్రేమ కబుర్లు చెప్పుకోవడం. వెనుక ఇసుక మాఫియా ఇసుక తోలుకుపోతూంటే, ఇటు నిలబడి రాజకీయ నాయకుడు అవినీతి మీద అరవడం. ఇలా కొన్ని కీలక సీన్లు డ్రమెటిక్ వేల్యూ కోసం  against the grain గా వుండాలంటాడు సిడ్ ఫీల్డ్. ఇలాగే చుట్టూ పచ్చటి ప్రకృతి మధ్య ఆహ్లాదకర వాతావరణంలో హత్యల గురించి మాట్లాడుకుంటున్నారు మార్టీ, విస్సర్ లు. ఈ సీను ఇంకో రెండు పనుల్నికూడా  నిర్వహించింది : ప్రారంభ సీనుతో మిర్రర్ ఎఫెక్ట్ తో ద్వంద్వాల్ని పోషిస్తూనే, against the grain అనే అదనపు విలువనీ నిర్వహించింది. సినిమాలు పామరుల్ని థ్రిల్ చేస్తూనే, రసజ్ఞుల్ని థ్రిల్ చేయడంతో బాటు  రంజింప జేసే  విధంగా రూపొందినప్పుడు, సినిమాలకి దూరమైన అభిరుచిగల ప్రేక్షకులు మెల్ల మెల్లగా దగ్గరయ్యే అవకాశముంటుంది.
          ఇక మిడిల్ వన్ సీన్లు చూద్దాం...

14. ఎబ్బీ తనకోసం వేరే ఫ్లాట్ చూసుకోవడం 
        ఇదేమిటి? బిగినింగ్ 9వ సీనులో రే తో రాజీ పడిపోయాక ఎబ్బీ వేరే ఫ్లాట్ ఎందుకు చూసుకుంటోంది? సీను సీనుకీ ఆశ్చర్య పరుస్తున్నాయి ఈ పాత్రలు. బిగినింగ్ 9 వ సీనులో రే ఆమె క్యారక్టర్ ని అనుమానిస్తూ అన్న మాటలకి-  రేపు వేరే ప్లేస్ చూసుకుని వెళ్లి పోతాలే, నీకు బర్డెన్ గా వుండను – అన్న ఎబ్బీ, తీరా తన భవిష్యత్తు దృష్ట్యా ప్రేమలో అతడితో రాజీపడింది బాగానే వుంది. మరి తెల్లారే అద్దె ఫ్లాట్ ఎందుకు వెతుక్కుంటోంది? ఇక్కడ రెండున్నాయి- ప్రేమకి కట్టుబడడం, అతడి మీద ఆధారపడి బతకడం. ఈ రెండూ చేయదల్చుకోలేదామె. రెండూ చేస్తే రెండో దానికోసమే మొదటి దానికి లొంగిందని అతను అపార్ధం జేసుకోవచ్చు. లేకపోతే అంత పౌరుషంగా- రేపు వేరే ప్లేస్ చూసుకుని వెళ్లి పోతాలే, నీకు బర్డెన్ గా వుండను –అని అనేశాక, ఇక  ఎంత ప్రేమని పునరుద్ధరించుకున్నా, ఇక్కడ వుండగలిగే పరిస్థితే లేదు. పెళ్లి చేసుకుంటే అది వేరు. కానప్పుడు ప్రేమకోసం వచ్చి పోతూ వుండాల్సిందే, వుండడం మాత్రం ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ వేరే చోట వుండాల్సిందే. ఈ మనో విశ్లేషణ నేపధ్యంలో చూస్తే ఆమె ఈ సీనులో వేరే ఫ్లాట్ చూసుకోవడాన్ని అర్ధం జేసుకోగల్గుతాం. 

          ఈ సీన్లో ఐరనీ ఏమిటంటే, తామిద్దర్నీ విస్సర్ ఇక చంపబోతున్నప్పుడు ఇంకా జీవితాన్ని ఇంకేదో  రకంగా ప్లాన్ చేసుకోవడమేమిటి? గొప్ప  ఐరనీ ఇది!  తర్వాతి సీన్లో ఇంకో ఐరనీ ఎదురవుతుంది. 

15. ఎబ్బీ బార్ కెళ్ళి మార్టీకీ, రేకీ మధ్య మళ్ళీ గొడవ జరక్కుండా చూసుకోమని మారీస్ కి చెప్పడం

          పై సీనుతో బాటు ఈ సీను పాత్ర గురించో, కథ గురించో కేవలం సమాచారాన్ని ఇచ్చే దృష్టితోనే వున్నాయి. బిగినింగ్ 7 వ సీన్లో బార్ లో మార్టీకీ, రే కీ జరిగిన ముఖాముఖీ ఫలితంగానే అతను  ఇంటికి వచ్చి ఎబ్బీని అనుమానిస్తూ 9వ సీనుకి తెర లేపాడు. ఇది ఎబ్బీకి అర్ధమై వుంటుంది. భర్తకీ రేకీ గొడవలు జరగడం ఆమె కిష్టం లేదు. రే కూడా గొడవలు రేపే ఉద్దేశంతో లేడు. ఎబ్బీ కూడా రేనే ఫాలో అవుతోంది. అందుకే ఇప్పుడు బార్ కొచ్చి గొడవలు జరక్కుండా చూసుకోమని  బార్ టెండర్ మారీస్ కి చెప్తోంది. 

          కానీ ఆ భర్తే  తామిద్దర్నీ చంపడానికి విస్సర్ ని నియమించాడని ఆమెకి తెలీదు. ఇది ఈమెని చూసి నవ్వాలో ఏడ్వాలో తెలిని పరిస్థితిని సృష్టించే సీను. ఈ మిడిల్ లో కథకిలా జీవం పోస్తున్నారు దర్శకులు. ఇంతకీ ఆ విస్సర్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? దీన్ని సస్పెన్స్ గా వుంచారు. 
          పై రెండు సీన్లకి ట్రాన్సిషన్స్ లేవు, కట్సే వున్నాయి. 

         
16. రేతో  బెడ్రూంలో వున్న ఎబ్బీ, మార్టీ వచ్చినట్టున్నాడని  రే కి అనుమానం వ్యక్తం చేయడం 
          ఈ సీను ఇలా రాశారు :  గది చీకటిగా వుంటుంది. గదిలోంచి కిటికీ వైపు చూస్తే వెన్నెల పడుతూంటుంది. అవతల లాన్, వీధి దీపం వెలుగుతున్న రోడ్డు నిర్మానుష్యంగా వుంటాయి. 

             సడెన్ గా బెడ్ మీద లేచి కూర్చున్న ఎబ్బీ కిటికీ ఫ్రేములో కొస్తుంది. అతనొచ్చే శాడు...అంటుంది. ఆఫ్ స్క్రీన్లో రే అటు వొత్తిగిల్లిన శబ్దం వస్తుంది. ఏంటి సంగతి? -  అంటాడు.
కచ్చితంగా అలికిడి విన్నాను- అంటుంది. డోర్స్ లాక్ చేసి వున్నాయి, ఎవరూ రారు – అంటాడు.  

            ఆమెని లాక్కుంటాడు. అప్పుడు కిటికీ మీద షాట్ ని సస్టెయిన్ చేస్తే అవతల వీధి నిర్మానుష్యంగానే వుంటుంది. మళ్ళీ లేచి కూర్చుంటూ కిటికీ ఫ్రేము బ్యాక్ డ్రాప్ లోకొస్తుంది ఎబ్బీ. రే కేసి చూస్తుంది. నిజమే, అతనే వచ్చి వుంటే పిల్లిలా వస్తాడు. చాలా కేర్ ఫుల్ మనిషి - అంటూ మార్టీ గురించి కొత్త విషయాలు చెప్తుంది. నుదుటి మీద వేలితో చూపిస్తూ, ఈ తన మైండ్ లో రంధ్రాలు  చూస్తూంటానని చెప్పాడనీ,  తనకి డాబు ఎక్కువ, సైకియాట్రిస్టుకి చూపించుకోమని చెప్పాడనీ, తనకి పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఏవీ లేవని సైకియాట్రిస్టు చెప్తే, అతణ్ణి ఫైర్ చేశాడనీ... చెప్పుకుపో
తూంటుంది.

            ఈ మాటల మధ్యలో మొత్తం ఆమె లేచి కూర్చుంటూ నాల్గు సార్లు కిటికీ ఫ్రేములో కొచ్చే షాట్స్ వున్నాయి. నాల్గోసారి ఫ్రేములోంచి తప్పుకున్నప్పుడు అవతలరోడ్డు మీద ఆగివున్న కారు కన్పిస్తుంది.

            షాట్ ని సస్టెయిన్ చేస్తే, దూరం నుంచి లీలగా శబ్దం వస్తూంటుంది...ఇనుము మీద ఇనుము పెట్టి రాస్తున్నట్టు.  దీంతో సీను ముగుస్తుంది. 

            ఈ సీను ప్రారంభం చూస్తే  కిటికీ మీద వెన్నెల పడుతూంటుంది. వెన్నెల చల్లదనానికి గుర్తు. వెన్నెల పడడమే గాక, అవతల వీధి నిర్మానుష్యంగా వుందని ఎస్టాబ్లిష్ చేశారు. కిటికీ ఫ్రేము పాత్ర బందీ అనడానికి వాడే డార్క్ ఎలిమెంట్. అప్పుడు  సడెన్ గా లేచి కూర్చుంటూ ఎబ్బీ కిటికీ ఫ్రేములోకి వస్తుంది. టెలిస్కోపిక్ రైఫిల్ క్రాస్ బార్లో కన్పిస్తున్న టార్గెట్ లా వుంటుందామె. అప్పుడామె, మార్టీ వచ్చినట్టున్నాడనే అనుమానం వ్యక్తం చేయడం ఇంకో ఐరనీ. గత రెండు సీన్ల నుంచీ ఈ ఐరనీని ఆడదైన ఎబ్బీ తోనే చూపిస్తున్నారు, మగాడైన రే తో చూపిస్తే బాక్సాఫీసు అప్పీల్ అంతగా వుండదని కాబోలు. 

            వీళ్ళని చంపాలని విస్సర్ కాంట్రాక్టు తీసుకున్నాడని మనకి తెలుసు. వీళ్ళకి తెలీదు. విస్సర్ ఎప్పుడొచ్చి చంపుతాడో నని మనం సస్పెన్స్ తో వుంటే, ఈమె గారేమో అదేమీ తెలీక మార్టీ వచ్చినట్టున్నాడని అంటోంది. ఇది కూడా ఈమెతో ఐరనీయే. గత సీన్లో బార్ కెళ్ళి  వాళ్ళిద్దరూ గొడవపడకుండా చూడమని మారిస్ కి చెప్పి వచ్చింది. ఇప్పుడేదో అలికిడి విని మార్టీ వచ్చినట్టున్నాడని అంటోంది. ఇంకోసారి ఈ సీనుని పరీక్షగా చూస్తే, ఆమె మూడు సార్లు కిటికీ ఫ్రేములోకి వచ్చి తొలగినప్పుడు, ఆ మూడు సార్లూ  కిటికీ అవతల రోడ్డు నిర్మానుష్యంగానే వుందని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. నాల్గోసారి  ఆమె ఫ్రేములోకి వచ్చి తొలిగాక, అప్పుడు బయట ఆగివున్న కారుని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆ కారు ఇప్పుడు వచ్చి ఆగిందన్న మాట. ఈ కార్లో మార్టీయే వచ్చివుంటే, ఇప్పుడే రావాలి. 

            మరి సీన్ ఓపెనింగ్ లోనే ఆమె లేచి కూర్చుండి పోతూ, మార్టీ వచ్చినట్టున్నాడనీ, ఖచ్చితంగా అలికిడి విన్నాననీ ఎలా అంది? ఇంస్టిక్ట్. రానున్న ప్రమాదాన్ని పసిగట్టే ఇంస్టిక్ట్ లేదా సహజాతం పురుషుడి కంటే స్త్రీ కెక్కువ వుంటుంది. అదే ఇది. ఆమెకి తెలీని ఇంకో సంగతేమిటంటే,  అన్ కాన్షస్ గా ఆమె కిటికీ ఫ్రేములోకి రావడం తొలగడం, ప్రమాదానికో పరిస్థితులకో బందీ అయీ కానట్టు వున్న సంకేతాలిస్తోంది మనకి. నాల్గోసారి కిటికీ ఫ్రేములోంచి ఆమె తొలగినప్పుడు బయట ఆగి వున్న కారు ఫ్రేములో కొచ్చింది. ఇప్పుడామె ఫ్రేములోంచి తొలగిపోవడమంటే, ఆ కారులో ఎవరున్నా తనకే ప్రమాదం లేదని. ఆ కారులో వచ్చిన వాడే ఫ్రేమింగ్ అయిపోయాడని!  వాడికే మూడుతుందని!  ఐతే ఎబ్బీకి ప్రమాదం లేకపోవడమేమిటి? అదెలా సాధ్యం? చూద్దాం! 

            మనకి తెలిసి ఇప్పుడు మార్టీ రావడానికి వీల్లేదు. విస్సర్ కే ఒప్పజెప్పాడు. పని పూర్తి చేసుకోవడానికి విస్సరే వస్తాడు. ఆ కారు విస్సర్ దే. ఆ కారులోనే ప్లాట్ పాయింట్ వన్ లో డీల్ మాట్లాడుకున్నారు. 

            ఇక ఇప్పుడు ఎబ్బీ, రే ల మాటల్ని చూద్దాం: మార్టీ వచ్చినట్టున్నాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అప్పుడు రే- రాడు పడుకో, డోర్స్ లాక్ చేసి వున్నాయని  అనాలి. ఇలా అనకుండా – ఏంటి  సంగతి? - అనడంలో అర్ధం? అస్తమానం మార్టీనే కలవరిస్తున్నావ్, వాడితోనే వుండాలని వుందా? ఏంటి సంగతి?- అన్నట్టు వుందిది. పాత్ర రెండో పాత్ర మనసులోకి డీప్ గా వెళ్తేనే ఇలాటి డిస్టర్బింగ్ డైలాగ్స్ వస్తాయేమో. 

            కానీ ఎబ్బీ మానసిక స్థితి వేరు. ఆమెకి మార్టీ భయం ఇంకా వదల్లేదు. ఏక్షణం వచ్చి ఇంకేం చేస్తాడోననే భయం.  రే మాటల్ని పట్టించుకోకుండా మార్టీ గురించే చెప్పుకు పోసాగింది. అతను  మనోనేత్రంతో రంధ్రాలేవో చూస్తానన్నాడని అంది. డోర్స్ లాక్ చేసి వుంటే మాత్రమేం, అలా ఏ రంధ్రం లోంచి దూరి వచ్చేస్తాడోనని ఆమె  టెర్రర్. తనకి డాబు ఎక్కువని చెప్పాడన్నది. రోజుకో హేండ్ బ్యాగేసుకుని తిరుగుతూంటే అలా అన్నాడేమో.  సైకియాట్రిస్టుకి చూపించుకుంటే పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ లేవని తేలిందంది. దాంతో ఆ సైకియాట్రిస్టుని ఫైర్ చేశాడని అంది. ఇలా విస్సర్ తో ప్రమాద ముంటే మార్టీ గురించే మాట్లాడుతోంది. మార్టీయే చంపడానికి విస్సర్ ని నియమించాడని తెలీక. 

            ఇప్పుడీ సీను ఇనుము మీద ఇనుము పెట్టి రాస్తున్నట్టు వస్తున్న సౌండు తో ముగుస్తుంది. సీను చల్లని వెన్నెలతో ప్రారంభమయింది, కరకు రాపిడితో ముగిసింది. ఈ రాపిడి కర్ధం? ఇనుముని ఇనుముతోనే కోయడమా? ఇనుము ఏది? కోస్తున్నది దేన్ని? 

17.  విస్సర్ రహస్యంగా రే ఫ్లాట్ కొచ్చి ఎబ్బీ  రివాల్వర్ కొట్టేసి వెళ్ళిపోవడం
        పై 16 వ సీనులో ఎబ్బీ, రేలు బెడ్ రూమ్ లో వుంటే, ఇప్పుడు అదే సమయంలో ఈ సీన్లో ఇంట్లో రహస్య కదలికల్ని చూపిస్తున్నారు...కోయెన్ బ్రదర్స్ ఈ సీను రాసిన దానికి చిత్రీకరణలో కొంచెం తేడాతో ఇలా వుంటుంది : చీకటిగా వున్న నడవా లోంచి లివింగ్ రూం లోకి ట్రాక్ డౌన్ చేస్తాం. కెమెరా ముందుకు మూవ్ అవుతూంటే, ఇనుము మీద ఇనుము రాపిడి  శబ్దం తీవ్రమవుతుంది. 

            లివింగ్ రూం లో ఫ్రంట్ డోర్ కేసి మూవ్ అవుతూంటుంది కెమెరా. అలా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రంట్ డోర్ పక్కన గోడమీద హేట్ ఆకారంలో నీడ పడుతూంటుంది. ట్రాక్ డౌన్ చేసి డోర్ హేండిల్ ని క్లోజ్ షాట్ తీసుకుంటూంటే, రాపిడి శబ్దం మరింత తీవ్రమవుతుంది. డోర్ హేండిల్ అటూ ఇటూ తిరుగుతూంటుంది. క్లిక్ మన్న శబ్దంతో లాక్ తెర్చుకుంటుంది. డోర్ ఓపెనవుతుంది. డోర్ సందులోంచి విస్సర్ చూస్తాడు. నిశ్శబ్దంగా లోపలి కొస్తాడు. ఇటు పక్కకి చూస్తే  టేబుల్ మీద ఎబ్బీ బ్యాగులు రెండుంటాయి. ఒక బ్యాగులోంచి రివాల్వర్ బట్ లా కన్పిస్తూంటుంది. బ్యాగు తీసుకుని లోపల కెలుకుతాడు. దాన్ని పెట్టేసి రెండో బ్యాగులో చెయ్యి పెడితే  ఎబ్బీ రివాల్వర్ దొరుకుతుంది. దాన్ని తీస్తాడు. దాని ఛాంబర్ ఓపెన్ చేస్తాడు. 

            అతడి మొహం మీద లో యాంగిల్ క్లోజ్ షాట్ పెడితే, ఆఫ్ స్క్రీన్ లో క్లిక్ మన్న శబ్దం విన్పిస్తుంది. అతడి మొహం మీద ఆరెంజి కలర్ లో వెలుగు ప్రసరిస్తుంది. అతడి చేతుల మీద క్లోజ్  తీసుకుంటే, ఒక చేతిలో ఓపెనైన రివాల్వర్ సిలిండర్, ఇంకో చేతిలో వెలిగించిన సిగార్ లైటర్ వుంటాయి. సిలిండర్లో మూడు బుల్లెట్స్  వుంటాయి. 

          బెడ్ రూమ్ లో చిన్నగా బెడ్ స్ప్రింగుల కదలిక. 
            లివింగ్ రూం వైడ్ షాట్ తీసుకుంటే, విస్సర్ చెవులు రిక్కించి అడుగు లేస్తూంటాడు నడవా వైపు. ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తూ నత్తలా నడుస్తూంటాడు. అతణ్ణి ట్రాక్ చేస్తూంటే, వెనక తలుపు తీసుకుని బయటి కెళ్ళిపోతాడు. 

            బయట అతణ్ణి ట్రాక్ చేస్తూంటే, బెడ్ రూమ్ కిటికీ దగ్గరి కెళ్తాడు. లోపల లుక్కేస్తాడు. మసక చీకటిలో బెడ్ మీద నిద్రలో వున్న ఎబ్బీ రేలు కన్పిస్తారు.
            ఒక శబ్దం అంతకంతకూ దగ్గరవుతున్నట్టు భీకరమైపోయి- ఒక్క మెరుపు మెరిసి బెడ్ రూమ్ లో ఇంకేం కన్పించదు.

            ఇది డైలాగుల్లేని యాక్షన్ తో వున్న సీను. వెనుక 16 వ సీనుకీ ఈ సీనుకీ ట్రాన్సిషన్ గా ఇనుము మీద ఇనుము రాపిడి శబ్దం వాడారు. ఈ శబ్ద తీవ్రతని పెంచారు. లివింగ్ రూం లో ఫ్రంట్ డోర్ కేసి కెమెరా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రంట్ డోర్ పక్కన గోడమీద హేట్ లా  ఏర్పడ్డ  నీడ హేండ్ బ్యాగు తాలూకుదే  నిజానికి. టేబుల్ మీద వున్న హేండ్ బ్యాగు అలా వంగి వుండడంవల్ల అది అచ్చంగా హేట్ ఆకారంలో నీడని తలుపు పక్కన గోడమీద సృష్టిస్తోంది. ఈ హేట్ ఆకారం చూస్తే విస్సర్ పెట్టుకునే లాంటిదే. తలుపు పక్కన హేట్ లా నీడ పడుతోందంటే తలుపవతల మనవాడు హాజరై పోయాడన్నమాట. తంతే బూరెల గంపలో పడ్డట్టు, ఎబ్బీ హేండ్ బ్యాగే అతడి హేట్ ఆకారంలో నీడని సృష్టిస్తోంది!

            అతను లోపలికొచ్చాక, హేండ్ బ్యాగు ఫ్లాప్,  బ్యాగులోంచి బయటి కొచ్చినట్టు కన్పిస్తున్న రివాల్వర్ బట్ లాగే ఫోల్డ్ అయి వుంటుంది!
            ఎలాంటి క్రియేషన్ ఇది! చాలా సూక్ష్మ దృష్టి వుండాలి. ఒక సస్పెన్స్ తో కూడిన సీనుని ఇంత హృదయరంజకం చేస్తున్నారు.

            ఇక విస్సర్ నత్తలా అడుగులేసే షాట్. ఎందుకలా నడుస్తున్నాడు? బెడ్ రూమ్ లోంచి శబ్దానికి. బెడ్ రూం లోంచి శబ్దం అతన్నలా నడిచేలా చేస్తోంది. ఆ సమయంలో శబ్దం రావడమెందుకూ, ఆ శబ్దం అతన్నలా నడిపించడ మెందుకూ, ఏమిటిందులో మర్మం?  ఏమిటి విధి చేస్తున్న హెచ్చరిక? సింక్రో డెస్టినీ.  ఏదీ వూరికే జరగదు, ఎందుకో జరుగుతుంది. ఇంకేదో సృష్టిస్తుంది,  అప్పుడర్ధమవుతుంది. విస్సర్ ని అలా నడిచేలా చేసిన ఎబ్బీ, రే ల మంచం కిర్రు శబ్దపు మర్మం మరి కొన్ని సీన్ల తర్వాత మనకి పూర్తిగా బోధ పడుతుంది. స్క్రీన్ ప్లే పరిభాషలో ఫోర్ షాడోయింగ్ అంటారు దీన్ని. 

            ఇంతకీ ఎబ్బీ రివాల్వర్ని దొంగిలించి దాంతో ఏం చేయబోతున్నాడు విస్సర్? వాళ్ళ ఆత్మహత్యని సృష్టించబోతున్నాడా?  బెడ్ రూమ్ కిటికీ దగ్గరికి రావడం, నిద్రిస్తున్న వాళ్ళని చూడడం, పెద్ద మెరుపు మెరిసి గదంతా కళ్ళు  చెదిరేలా ఫ్లాష్ అవడం- ఏమిటిది? రివాల్వర్ షాట్స్ తాలూకు స్పార్క్సే నా? ఆ శబ్దాన్ని వేరే భీకర శబ్దంతో కవర్ చేశారా? ఇంతకీ
ఇనుము మీద ఇనుము రాపిడికి అర్ధం? 

18. విస్సర్ మార్టీకి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ చంపేశాననడం
       మార్నింగ్ ఎక్కడో హైవే మీద ఫోన్ బూత్ లో ఓపెనవుతాడు విస్సర్. రోడ్డు మీద నుంచి ఒక భారీ ట్రక్కు అలా వెళ్ళిపోతుంది. మార్టీ కి కాల్ చేస్తాడు. చేపలు పట్టావా?- అంటాడు. అర్ధం గాక,  ఏంటీ? – అంటాడు మార్టీ. చేపలు పట్టావా? - రిపీట్ చేస్తాడు విస్సర్. పట్టానంటాడు మార్టీ. ఏం చేపలు పట్టావని అడుగుతాడు విస్సర్. ఏమిటిదంతా, పనైందా? - అని సీరియస్ అవుతాడు మార్టీ. అయ్యిందిలే,  నువ్వు నాకు ఎమౌంట్ బాకీ –అంటాడు విస్సర్. 

            ఈ సీనుకి వెనక సీను సౌండ్ ట్రాన్సిషన్ వుంటుంది. వెనక సీను ముగింపులో భీకర శబ్దం,  ఇప్పుడు ఈ సీను ప్రారంభంలో పోతున్న భారీ ట్రక్కు శబ్దం.

            చేపలు పట్టావా అని మార్టీని అడుగుతున్నాడు విస్సర్. తనకిచ్చే ఫీజు లెక్క ఎకౌంట్ లో కవర్ చేయడానికి ఫిషింగ్ ట్రిప్ కి వెళ్లి రమ్మని తనే చెప్పాడు విస్సర్ మార్టీ కి- ప్లాట్ పాయింట్ వన్ 13 వ సీనులో. ఆ ప్రకారం అడుగుతున్నాడిప్పుడు. పనైందని మార్టీకి చెప్పాడు- ఎబ్బీ, రేలని  ఫినిష్ చేసే పని.
            ఎబ్బీ, రేలు ఇక లేరన్న భావంతో సీను ముగిసింది.


-సికిందర్