రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జులై 2017, ఆదివారం

483 : 'పాలపిట్ట' ఆర్టికల్






   
    కొందరు దర్శకులు అన్ని రకాల సినిమాలు తీస్తూ ఏ భావజాలానికీ కాకుండా పోతారు. కొందరు దర్శకులు ఫక్తు భావజాలాల  ప్రచారంతో  సినిమాలకే దూరమైపోతారు. ఇంకొందరు దర్శకులు భావజాలాల్ని వ్యాపారీకరణ చేసి ముందుకు పోతూంటారు. భావజాలమనేది యావత్ ప్రేక్షకులకీ  రుచించని, మాస్ మీడియా అయిన సినిమాకి సరిపడని  డ్రై సబ్జెక్టు. అందుకే కళాత్మక (ఆర్ట్ ) సినిమాలు లేదా సమాంతర సినిమాలు కాలక్రమంలో ప్రజాదరణ కోల్పోయాయి.
          
        మహామహులైన శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ ల లాంటి ఆర్ట్ సినిమా దర్శకులు 90 లలో నిరుద్యోగులైపోయారు. వాళ్ళు ఇటువైపు తెలుగు నుంచి దూసుకొస్తున్న ‘సమాంతరాన్ని వ్యాపారీకరణ’ చేసి తన భావజాలంతో ప్రకాశిస్తున్న కె. విశ్వనాథ్ ని గమనించలేకపోయారు.  ఇంకెప్పుడో 2000 సంవత్సరానికి  తమ భావజాలాల్ని పునరుద్దరించుకునే మార్గం కోసం, తమకి పడని, భిన్న ధృవమైన మసాలా బాలీవుడ్ తో రాజీపడక  తప్పదని గ్రహించారు. ఇక బాలీవుడ్ స్టార్స్ ఆకర్షణలతో తమవైన ‘ఆర్ట్ సినిమాలు’ తీయడం ప్రారంభించి  ఈ సారి యావత్ ప్రేక్షకుల్నీ ఆకట్టుకోవడం మొదలెట్టారు. వీటికి కమర్షియలార్టు అనీ, క్రాసోవర్ సినిమా అనీ కొత్త పేర్లు ప్రచారం చేశారు. ప్రారంభించిన ఈ ట్రెండ్ లో కూడా బెనెగళ్,  నిహలానీలు ఎంతో  కాలం నిలబడలేకపోయినా - ప్రపంచీకరణ వచ్చేసి వాళ్ళ  మానస పుత్రికని బతికించింది. ఇప్పటికీ బతికిస్తోంది. బెనెగళ్, నిహలానీల క్రాసోవర్ ట్రెండ్ ని అందిపుచ్చుకుని, ప్రపంచీకరణ నేపధ్యంలో  కొత్త  కొత్త దర్శకులు చిన్న చిన్న బడ్జెట్లతో  బెనెగళ్, నిహలానీల ఫ్రేం వర్క్ లో   కమర్షియలేతర  కథల్ని కమర్షియల్ చట్రాల్లో బిగించి చూపించడం మొదలెట్టారు. దీనికి మల్టీ ప్లెక్సుల  హవా తోడ్పడడంతో ఇప్పుడీ  సినిమాలు మల్టీప్లెక్స్ సినిమాల పేరిట శాశ్వతంగా పాగావేసే దాకా పోయాయి.

           అయితే గమనార్హ మేమిటంటే, బెనెగళ్, నిహలానీలు ఆలస్యంగా గ్రహించిన విషయాన్నే కె. విశ్వనాథ్ అడ్వాన్సుగా పాతికేళ్ళ ముందే గ్రహించారు!  తన భావజాల వ్యాప్తికి ఆయన అప్పట్లోనే స్టార్స్ ని ఆశ్రయించారు. ఐతే బెనెగళ్, నిహలానీల లాగా కేవలం స్టార్స్ తో తాననుకున్న కథలు సాదాగా చెప్పకుండా- ఆ స్టార్స్ కి  సంస్కృతి, సాంప్రదాయం, సంగీతం అనే డెప్త్ కూడా ఇస్తూ భారతీయతని కల్పించారు. కళ ఏదైనా అందులో భారతీయత,  ఒకోసారి సనాతన ధర్మం తప్పని సరిగా ప్రతిబించాలని ఆయన భావించినట్టు కన్పిస్తుంది. వాస్తవిక సినిమాలు వామపక్ష వాదాన్ని ఆశ్రయిస్తే, తను మతవాదం వైపు వున్నారు. మత కోణంలోంచి సామాజిక రుగ్మతల్ని  చూశారు.

          మత కోణం లోనే కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ విప్లవ పాత్ర సృష్టి జరగడం వల్ల అది అంత హిట్టయ్యిందేమో. లేకపోతే అల్లూరి విప్లవ కథ ఫక్తు డ్రై సబ్జెక్టు . దాన్ని ప్రధాన స్రవంతి సినిమాకి పనికొచ్చేలా  భక్తిరసంతో అభిషేకించి సస్యశ్యామలం చేశారు రచయిత త్రిపురనేని మహారథి. ఒకవైపు గిరిజనులకోసం బ్రిటిష్ పాలకులతో పోరాడే వీరుడిగా చూపిస్తూనే, మరోవైపు మహిషాసుర మర్ధిని స్తోత్రం  పాడగల పారంగతుడిగానూ  చిత్రించడంతో, ఆ పాత్ర దైవత్వాన్ని సంతరించుకుని చిరస్థాయిగా ప్రేక్షకుల మనోఫలకాల మీద నిల్చి పోయింది. మౌలికంగా భారతీయులు  మత జీవులు. మెజారిటీ ప్రజల మనోభావాలని గౌరవించే కళే కలకాలం బతుకుతుంది.

          ఈరీత్యా చూస్తే విశ్వనాథ్ కి పూర్వమే త్రిపురనేని మహారధి సమాంతరాన్ని మతంతో వ్యాపారీకరణ చేశారేమో అన్పిస్తుంది. సమాంతర సినిమాలకి మాత్రమే పనికొచ్చే కథలని, యావత్ ప్రేక్షకులకీ రుచించని డ్రై  సబ్జెక్టుల్ని, మరింత జనరంజకమయ్యేలా మతంతో  సామాన్యీకరించడం మొదలెట్టారు  విశ్వనాథ్. మతతత్వం లేని మతం. ఇంకా మాట్లాడితే సెక్యులర్ మతం. ఇలా స్టార్స్ అనే హంగు, వాళ్ల పాత్రలకి మత నేపధ్యపు సంస్కృతీ సంగీత సాంప్రదాయాల డెప్త్,  ఈ రెండంచెల  విధానంతో చెప్పాలనుకున్న సామాజిక సమస్యల్ని వినోదాత్మకం చేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే డప్పు సినిమాల్ని సరిగమల సినిమాలుగా మార్చేశారు. డప్పు సినిమాల విప్లవ కవిత్వాన్నే, తన సరిగమలతో భావకవిత్వంగా చెప్పడం మొదలెట్టారు. ఇదేదో బూర్జువా ఫ్యూడల్ దోపిడీ అన్పించవచ్చు, కానీ తప్పదు,  ప్రేక్షకుడు మాట వినాలంటే! విప్లవ కవిత్వంలో వుండని వినోదాన్ని, భావకవిత్వంలో చూశాడు ప్రేక్షకుడు. సరిగమల భావకవిత్వమే సామాజికాంశాల భావజాలానికి తియ్యటి షుగర్ కోటింగ్ అయ్యింది. ఇది ప్రేక్షకుడికి నచ్చింది. 



           విచిత్రంగా వుంటుంది. పాశ్చాత్య సంగీతాన్ని తోసిపుచ్చుతున్నట్టు కన్పించే  విశ్వనాథ్,  సాటి దేశీయ డప్పు సినిమాలకే పోటీ రావడం. అదీ డప్పుతోనే మొదలెట్టడం ‘సిరిసిరిమువ్వ’ తో !

          ఐతే బెనెగళ్, నిహలానీల వారసత్వంగా మల్టీప్లెక్స్ సినిమాలు నిలబడినట్టు- అలాటి వారసత్వాన్ని విశ్వనాథ్ తెలుగు సినిమాలకి ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకపోయారనడం కంటే తర్వాతి తరం దర్శకులు అందుకోలేక పోయారనడం సబబు. తెలుగు సినిమాలకి ప్రపంచీకరణ నేపధ్యంలో ఇక యువ ప్రేక్షకులే మిగలడంతో, తర్వాతి తరం దర్శకులు అన్ని సాంప్రదాయాల్నీ పక్కకునెట్టి,  సినిమా అంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్  అనే ధోరణిలో పాప్ కార్న్ సినిమాలు తీయడం మొదలెట్టారు. విశ్వనాథ్ సాంప్రదాయాల్నే కాదు,  కమర్షియల్ గా ఆయన చాటిన  సామాజిక స్పృహని కూడా అక్కడే వదిలేశారు. మల్టీప్లెక్స్ సినిమాలతో గుణాత్మకంగా  హిందీ సినిమాలు ఎదుగుతూంటే, తెలుగు సినిమాలు ఎదుగూ బొదుగూ లేకుండా నిర్జీవంగా పడి వుండేట్టు చేశారు ఈ దర్శకులు.

          విశ్వనాథ్ ని గమనిస్తే ఆయన ‘సిరిసిరి మువ్వ’ కి పూర్వం వేరు, ‘సిరిసిరి మువ్వ’ నుంచి పూర్తిగా వేరుగా కన్పిస్తారు. ఆయన ‘సిరిసిరి మువ్వ’ కి పూర్వం లాగే అవే సినిమాలతో అలాగే కొనసాగకుండా పంథా మార్చుకుని దాదా సాహెబ్ ఫాల్కేని అందుకునే  దాకా అడుగులేశారు.  ‘సిరిసిరి మువ్వ’ అనే కళాత్మకానికి పూర్వం కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతోనే  చేయి తిప్పుకోసాగారు. ప్రసిద్ధ స్క్రీన్ ప్లే పండితుడు రాబర్ట్ మెక్ కీ ఇదే అంటాడు : కళాత్మక సినిమాలు తీయడానికి సాహసించే ముందు మామూలు కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోవాలని.  విశ్వనాథ్ ఈ పని చేస్తున్నప్పుడు రాబర్ట్ మెక్ కీ రంగంలో లేరు. తర్వాత విశ్వనాథ్ ని చూసే ఈ సిద్ధాంతం చేశారన్నట్టుంది.

          1965 లో విశ్వనాథ్ తొలి ప్రయత్నం ‘ఆత్మగౌరవం’ కీ, 1976 లో ‘సిరిసిరి మువ్వ’కీ మధ్య  11 ఏళ్ల కాలంలో తీసిన 16 సినిమాల ధోరణీ వేరు. వీటిలో 1975 లో తీసిన ‘జీవన జ్యోతి’ తప్ప మిగిలిన పదిహేనూ తెలుపు నలుపు సినిమాలు కాగా, వీటిలో 10 కుటుంబ కథలే. ‘జీవనజ్యోతి’ తో బాటు మరో మూడు స్త్రీ కథలతో తీసినవే. ఇంకో  ‘కాలం మారింది’  అనే ఒక సామాజికం, ‘నేరము శిక్ష’ అనే సాంఘీకం తీశారు. ‘ఆత్మగౌరవం’ నుంచీ వరుసగా ప్రైవేట్ మాస్టారు, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టు పెడతా, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, చిన్ననాటి స్నేహితులు, నిండు దంపతులు, అమ్మమనసు, చిన్ననాటి కలలు ...ఇవన్నీ కుటుంబ కథలే కావడం గమనార్హం. అంటే కుటుంబ కథలు అనే ఒకే జానర్ లో పది సినిమాలు తీస్తూ కుటుంబ సినిమాల మీద పట్టు సాధించారన్న మాట. ఇవి తీస్తూనే 1972 నుంచి మధ్యమధ్యలో ‘కాలం మారింది’ అనే సామాజిక కథా చిత్రం, ‘నేరము శిక్ష’ అనే సాంఘీకం;  శారద, ఓ సీతకథ, జీవనజ్యోతి, మాంగల్యానికి మరో ముడి అనే మహిళా చిత్రాలూ తీస్తూ పోయారు. ‘సుడి గుండాలు’ అనే మరో సామాజికానికి రచన చేశారు. ఇలా కుటుంబాల్ని అర్ధం జేసుకుని, సమాజాన్ని అర్ధం జేసుకుని, స్త్రీనీ అర్ధంజేసుకుని – తను సమకట్టబోయే అసలు సిసలు కళా ప్రయాణానికి   అస్త్ర శాస్త్రాలు సిద్ధం జేసుకుని- ‘సిరిసిరి మువ్వ’ తో  కొత్త విశ్వనాథ్ గా అవతరించారు.

          ‘సిరిసిరిమువ్వ’ తో ఆయన అంతకి ముందు తీసిన కాలక్షేప కథా చిత్రాలకి పూర్తిగా దూరం జరిగిపోయారు. సమాజానికి, వాస్తవికతకీ దగ్గరగా వచ్చారు. దర్శకుడుగా ఎదిగారు. మరింత బాధ్యతాయుతంగా మారారు. అంతేకాదు, నిర్మాణంలో సృజనాత్మక శక్తిని అపారంగా పెంచుకున్నారు. ‘సిరిసిరి మువ్వ’ కి ముందూ తర్వాతా ఆయన సృజనాత్మక శక్తి పరిణామ క్రమం కూడా రికార్డు చేయదగ్గదే. ముందు తీసిన వాటిలో అంతగా సృజనాత్మకత కన్పించదు, ‘సిరిసిరి మువ్వ’ తో ఆయన చిత్రీకరణ విధానాన్ని సమూలంగా మార్చేశారు. వాస్తవిక కథా చిత్రాలు డిఫరెంట్ మేకింగ్ ని కోరుకుంటాయి. దీన్నే అనుసరించారు విశ్వనాథ్. అలాగని ఒక ‘మాభూమి’ లా తీయాలనుకోలేదు. దేశంలో ప్రతీ వాస్తవిక కథాచిత్రాల దర్శకుడూ వాస్తవికతని వాస్తవికతలాగే చూపిస్తూంటే, 1976 లో ‘సిరిసిరిమువ్వ’ తో ఎత్తుకోవడం ఎత్తుకోవడం వాస్తవిక కథా చిత్రాన్ని ఎత్తుకున్న విశ్వనాథ్,  పాతికేళ్ళు ముందు కెళ్ళి పోయారు. తన సమకాలీనుల్లా కాకుండా వాస్తవికతకి  అప్పుడే స్టార్ ఆకర్షణలతో, సంగీత సాహిత్య నాట్యాల హంగులతో వినోదాత్మక వాస్తవికత అనే శాశ్వతంగా నిలబడిపోయే కొత్త ఎవర్ గ్రీన్ మ్యూజికల్ కళారూపంగా పరిచయం చేశారు. 2000 లో బెనెగళ్, నిహలానీ లు తిరిగి తమ కళని బతికించు కోవడానికి బాలీవుడ్ స్టార్స్ తో చేస్తున్న ప్రయత్నాలనే అడ్వాన్సుగా పాతికేళ్ళ ముందే విశ్వనాథ్ చేసేశారు.

          1976 లో శ్యాం బెనెగళ్ తన నాల్గో ప్రయత్నంగా ‘మంథన్’ అనే తక్కువ మంది చూసే పక్కా  వాస్తవికత తీస్తోంటే,  విశ్వనాథ్  ‘సిరిసిరి మువ్వ’  అనే ఎక్కువ మంది చూసే వినోదాత్మక వాస్తవికతని తీయసాగారు. ఇతరులు త్వరలోనే ఆదరణ కోల్పోయే సమాంతర – వాస్తవిక సినిమాలు తీస్తూంటే,  విశ్వనాథ్ ఆదరణకి ఢోకా ఉండని ‘వ్యాపారీకరణ చేసిన సమంతరాన్ని’ తీశారు. అక్కడ్నించి అదే ఆయన మంత్రమైంది.

          ‘సిరిసిరిమువ్వ’ ఎందుకు వాస్తవిక కథాచిత్ర మైంది? ఎందుకంటే,  అందులో తియ్యటి కలల ప్రపంచాల రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా పోకడలు లేనందునే. వీటిలో కన్పించని అణగారిన జీవితాలు, పాత్రలూ వుండడం వల్లే. డప్పుకొట్టి జీవించే చంద్రమోహన్, గజ్జెకట్టి నాట్యించే జయప్రదల అణగారిన పాత్రల జీవనసమరమే ఈ వాస్తవికత. ఇతర సమాంతర సినిమాల్లో పాత్రలు రివల్యూషనరీ డప్పు వాయిస్తూంటే, చంద్రమోహనేమో డివోషనల్ డప్పు వాయిస్తూ దిగారు. ఐనప్పటికీ ఈ తియ్యటి వాస్తవికతని తీయడానికి ఒక నిర్మాత ఒప్పుకోలేదు, ఒక పంపిణీ దారుడు డాక్యుమెంటరీ లా వుందని వెనక్కిపోయారు. డప్పూ గజ్జే సరే, జయప్రదకి ఆ మూగతన మేమిటి, సత్యనారాయణకి ఆ అంగ వైకల్యమేమిటి...ఇన్ని బాధలు చూపిస్తూ సినిమా తీయాలా? చివరికి   ఏడిద నాగేశ్వర రావుకి తీయాలనే అన్పించింది. అక్కడ్నించీ  ఈ తరహా కళారూపాలతో విశ్వనాథ్- నాగేశ్వర రావుల ప్రయాణం అప్రతిహతంగా సాగింది. 

      విశ్వనాథ్ సమాంతరాన్ని ప్రధాన స్రవంతి చేశారు.  ఇలా దేశంలో ఎవ్వరూ చేయలేదు. ఇక్కడ్నించీ ఆయన  మ్యూజికల్ సమాంతర ప్రధాన స్రవంతుల్లో అన్నీ సామాన్య పాత్రలే, వాటితో సామాజిక సమస్యలే, లేదంటే   శారీరక- వ్యక్తిత్వ లోపాలే. సమాజాన్నీ మనిషినీ ఆయన గుప్పెట పట్టి ఇక వదల్లేదు. ‘సిరిసిరి మువ్వ’ తర్వాత రెండేళ్ళ పాటూ మళ్ళీ  ప్రేమ బంధం, జీవిత నౌక, కాలాంతకుడు, సీతామా లక్ష్మి, ప్రెసిడెంట్ పేరమ్మ లాంటి రెగ్యులర్స్ తీస్తూ వుండిపోయారు. అప్పుడు ‘సిరిసిరిమువ్వ’ డప్పు  సాంబయ్య పాత్రలోంచి శంకర శాస్త్రిని పుట్టించి ‘శంకరాభరణం’ అనే మరో మ్యూజికల్ సమాంతర ప్రధానస్రవంతి తీసి అజరామరం చేశారు. సాంబయ్యలోంచే శంకర శాస్త్రి పుట్టాడు. అలా పుట్టించడానికి విశ్వనాథ్ కి అహం అడ్డురాలేదు. ఆయన సినిమాల్లో అణగారిన పా త్రలు నిరాదరణకి గురయిన తార్కాణా ల్లేవు.

          శంకరశాస్త్రి చరిత్ర సృష్టించిన లెజండరీ పాత్ర. పరమ సెక్యులర్ పాత్ర. ప్రభుత్వం ఓట్లేయించుకుని వదిలేస్తుంది అణగారిన వర్గాలని- కానీ మతం అలా చేయదని మంజు భార్గవి అణగారిన పాత్రతో నిరూపిస్తాడు శంకర శాస్త్రి. ప్రభుత్వం చేయనిచోట మతం చేయడమే బ్రాహ్మణిజమని సందేశం పంపుతాడు. బ్రాహ్మణిజం  సామాజిక పొందికకి పట్టుగొమ్మ కావాలన్నదే శంకర శాస్త్రి కాంక్ష. విశ్వనాథ్ సృష్టులన్నీ సామాన్య జీవులని ఇన్స పైర్ చేసేవే. ‘సప్తపది’ లో  అస్పృశ్యతా భావాన్ని, ‘సిరివెన్నెల’, ‘స్వాతిముత్యం’ లలో అంగ – మానసిక వైకల్యాల్ని, ‘సాగరసంగమం’ లో మద్యపాన దుష్ప్రభావాన్ని, ‘సూత్రధా రులు’ అహింసా వాదాన్ని, ‘స్వయంకృషి’, ‘ శుభోదయం’  లలో శ్రమైక జీవన సౌందర్యాన్ని,  ‘శృతిలయలు’  లో భౌతిక సుఖాల ప్రమాదాన్ని, ‘స్వాతికిరణం’ లో ఈర్ష్యాసూయల ఉపద్రవాన్ని, ‘శుభలేఖ’ లో వరకట్న సమస్యని...ఇలా మనిషి, లేకపోతే సమాజం వీటి చుట్టే అయన కథలు పరిభ్రమించాయి. ఈ కథలన్నీ వాస్తవిక సినిమాలు చూపించే సామాన్య మానవులవే. విశ్వనాథ్ మతాన్ని- కళల్ని కలిపి వినోదాత్మక  వాస్తవికత చేసి న్యూ సినిమా చూపించారు. కమలహాసన్, చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్, బాలకృష్ణ, రాజశేఖర్, మమ్మూట్టి, జయప్రద, రాధిక, విజయశాంతి, భానుప్రియ సుహాసిని, మీనా, మీనాక్షీ శేషాద్రి మొదలైన పాపులర్ స్టార్స్ తో ఈ సమాంతర సినిమా కథలు తీసి సమాంతరాన్ని బాక్సాఫీసు ఫ్రెండ్లీ సినిమాలుగా మార్చేశారు. 2000 లకి పూర్వం హార్రర్ సినిమాలు ముక్కూ మొహం తెలియని వాళ్ళతో ఓ వర్గం ప్రేక్షలు చూసే ‘బి’ గ్రేడ్ సినిమాలుగా ఉండేవి అన్ని భాషల్లో. 2000 లో మహేష్ భట్ స్టార్స్ తో ‘రాజ్’ అనే హర్రర్ తీసి ‘ఏ’ గ్రేడ్ హోదా కల్పించడంతో అన్నివర్గాల ప్రేక్షకుల్లోకి అది వెళ్లి ప్రధాన స్రవంతి జానర్ గా మారిపోయింది. అక్కడ్నించీ అన్ని భాషల్లో హారర్స్ కి స్టార్ హోదా వచ్చేసింది. ఇవన్నీ ఆలస్యంగా చేసిన పనులు. అంతకి పాతికేళ్ళ క్రితమే స్టార్స్ ని నటించకూడని సినిమాల్లో నటింపజేసి,  వాస్తవిక సినిమాల్ని ప్రధానస్రవంతి సినిమాలుగా మార్చేశారు విశ్వనాథ్.

          రియలిస్టిక్ సినిమాలే సెమీ రియలిస్టిక్ సినిమాలుగా రూపం మార్చుకుని హిందీలో మల్టీ ప్లెక్సుల్లో ఆడుతున్నాయి. తెలుగులో ఈ మాత్రమైనా రావడం లేదంటే విశ్వనాథ్ కళని కాలానికి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం వల్లే. చిన్నసినిమాల పేరుతో ఎందుకూ పనికిరాని  నాసిరకం సినిమాలు తీసి, ఆపై థియేటర్లు ఇవ్వడంలేదని హక్కుల కోసం పోరాడే వాళ్ళంతా, ఒకసారి విశ్వనాథ్ సాగించిన క్రమబద్ధమైన,  తనని తాను ఎడ్యుకేట్ అండ్ అప్డేట్ చేసుకునే మజిలీలతో కూడిన సినీ ప్రయాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే,  సృజనాత్మక అలసత్వం వదిలిపోయి, కొత్త వికాసంతో థియేటర్ల బెంగ తీరి నిజమైన సినీ వ్యాపారులవుతారు.


-సికిందర్ 
(from Palapitta June '17 issue)