రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, మార్చి 2017, శుక్రవారం

రివ్యూ!





దర్శకత్వం : వంశీకృష్ణ ఎం.
తారాగణం : రాజ్ తరుణ్, అనూ ఇమ్మాన్యుయేల్, అర్బాజ్ ఖాన్, పృథ్వీ, నాగేంద్ర బాబు, రఘుబాబు, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం :  బి. రాజశేఖర్
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
విడుదల: మార్చి 3, 2017

***
         యంగ్ స్టార్ రాజ్ తరుణ్ యువప్రేక్షకుల్లో ఆకర్షణ పెంచుకుని ఓపెనింగ్స్ ని రాబట్టుకునే స్థాయికి ఎప్పుడో ఎదిగాడు. ఏ భేషజాలూ పెట్టుకోకుండా అవసరమైతే ఇంకో హీరోతో కలిసి నటించడమో, లేదా అతిధి పాత్రలు సైతం పోషించడమో కూడా చేస్తూవస్తున్నాడు. తను సోలోగా నటించిన ‘సీతమ్మ అందాలు- రామయ్య సిత్రాలు’ తో బాగా చేదు అనుభవం ఎదురయ్యాక, మరో సోలోగా ఇప్పుడు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లో నటించాడు. రొటీన్ గా నటిస్తున్న లవర్ బాయ్ సినిమాలనుంచి కొంచెం తేడాగా ఈ సారి ఓ  యాక్షన్ కామెడీలో ప్రయత్నించాడు.  ఈ యాక్షన్ కామెడీ కూడా పరమ రొటీన్ గా వున్నా ఫర్వా లేదనుకున్నట్టు, మొహమాటం లేకుండా నటించేశాడు. క్రితంసారి ‘దొంగాట’ అనే కిడ్నాప్ కామెడీ తీసి ఫర్వాలేదన్పించుకున్న దర్శకుడు వంశీకృష్ణ, ఈసారి కూడా కిడ్నాప్ మూవీనే  కొంచెం తేడాగా తీద్దామనుకున్నట్టుంది. వీళ్ళిద్దరి ఈ తేడా గల ప్రయత్నం ఏ మేరకు తేడా కనబర్చిందో చూద్దాం...

కథ

          కిట్టు (రాజ్ తరుణ్) ముగ్గురు ఫ్రెండ్స్ తో కారు గ్యారేజీ నడుపుకుంటూ వుంటాడు. కారు రిపేరు కిచ్చిన ఇన్ కం టాక్స్ కమీషనర్ (నాగబాబు) కూతురు జానకి (అనూ ఇమ్మాన్యుయేల్) తో ప్రేమలో పడతాడు. ఓ రోజు జానకి తండ్రి ఆమెకి పాతిక లక్షలు ఇచ్చి, కిట్టూ నిజాయితీని పరిశీలించడానికి కారులో మర్చిపోయినట్టు నటించామంటాడు. ఆమె  కారులో పెట్టిన ఆ డబ్బుని  కిట్టూ ఫ్రెండ్స్ లో ఒకడు కొట్టేసి పారిపోతాడు. ఈ దొంగతనం ఆమెకి తెలీకుండా అడ్జెస్ట్  చేయడం కోసం ఒక గ్యాంగ్ లీడర్ (ప్రభాకర్) దగ్గర అప్పు తీసుకుంటాడు కిట్టూ.  గడువు దాటిపోవడంతో ఆ గ్యాంగ్ లీడర్ సతాయించడం మొదలెడతాడు. అప్పుడు అర్జెంటుగా ఆ పాతిక  లక్షలు సంపాదించడం కోసం ఫ్రెండ్స్ తో కలిసి పెంపుడు కుక్కల్ని కిడ్నాప్ చేయడం మొదలెడతాడు. కిడ్నాపులతో ఆ డబ్బు ఇంకా సమకూరకముందే, చూడకుండా జానకి పెంపుడు కుక్కనే కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో జానకిని ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. కిట్టూ దగ్గర్నుంచీ, ఇంకా  అటు ఏర్ (అర్బాజ్ ఖాన్) అనే మాస్టర్ క్రిమినల్ నుంచీ కమీషనర్ కి డిమాండ్ కాల్స్ రావడంతో అతను ఇద్దరూ ఒకటే అనుకుంటాడు. యాక్సెస్ కార్డు కోసం కూతుర్వే కిడ్నాప్ చేశారనుకుంటాడు. తను మాస్టర్ క్రిమినల్ ఆఫీసు మీద రెయిడ్ చేసినప్పుడు ఒక సేఫ్ ని సీజ్ చేసి దాని యాక్సెస్ కార్డు పట్టుకుపోయదు. ఈ యాక్సెస్ కార్డుకోసం ఇతను జానకిని కిడ్నాప్ చేస్తే, కిట్టూ డబ్బుకోసం జానకి పెంపుడు కుక్కని కిడ్నాప్ చేశాడు – ఆ కుక్క అమేదని తెలీక.

          ఇదీ సంగతి. ఇక ఈ చిక్కు ముడి ఎలా వీడింది, కన్ఫ్యూజన్ క్లియర్ అయి ఎలా కథ సుఖాంతమయ్యిందీ అన్నది మిగిలిన కథాకమామిషు.

ఎలావుంది కథ
          ఇది రొటీన్ యాక్షన్ కామెడీ. కొత్తదనమేమీ లేదు. కిడ్నాప్ కథలూ వాటితో  కామెడీలూ ఎలా వుంటాయో తెలిసిందే. కాకపోతే ఇక్కడ అది హీరోయిన్ అని తెలీక ఆమె మీద పొగగొట్టి, ఆమె పెంపుడు కుక్కనే  హీరో కిడ్నాప్ చేయడం, అదే సమయంలో  వేరే క్రిమినల్ ఆమెనే కిడ్నాప్ చేయడమనే   టూ ఇన్ వన్  హిలేరియస్ ఇంటర్వెల్ సీన్ ఒక కొత్తదనం అనుకోవాలి. అయితే దీన్ని ఇంతే థ్రిల్లింగ్ కథగా కొనసాగించడంలో మాత్రం కొత్తదనాన్నేం ప్రదర్శించలేక పోయారు. వివిధ గ్యాంగులతో కామెడీ మీదే ఎక్కువ దృష్టి పెట్టి గట్టెక్కిం చడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఈ యాక్షన్ కామెడీలో ప్రధాన మలుపు తీసుకున్న హీరో హీరోయిన్ల ప్రేమని కూడా గల్లంతు చేశారు.  ఇలాకాకుండా గతంలో ‘దొంగాట’ లో దర్శకుడు ప్రధాన కథ మీదే కథనాన్ని బాగా ఫోకస్ చేశాడు.

ఎవరెలా చేశారు
          పెంపుడు కుక్కల్ని కిడ్నాప్ చేసే రాజ్ తరుణ్ పాత్ర మాత్రం కొత్తదే. అయితే దీని వల్ల తన ప్రేమ ఎంత రిస్కులో పడిందో, ఆ భావోద్వేగాలతో పాత్ర రాయించుకోవాల్సింది. ఒక ఎమోషనో, ఫీలింగో  లేకుండా ఎంత కామెడీ అయినా నిలబడదు. రాజ్ తరుణ్ తనకున్న రేంజిలో టాప్ స్టార్స్ వైపు చూడకుండా, వాస్తవానికి దగ్గరగా వుండే పాత్రల కోసం కృషి చేస్తే అది తన ప్రత్యేకత కింద వుంటుంది. ఈ యాక్షన్ కామెడీలో కూడా మరీ పగలబడి నవ్వేంత సీన్లు లేవు తన పాత్రకి. 

          హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ పెద్ద మైనస్ మార్క్ ఈ సినిమాకి. అలాగే ఆమె తండ్రిగా నాగబాబు పాత్ర ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా ఎంత ధూమ్ ధామ్  చేస్తుందో, కూతురు  కిడ్నాపవగానే అంత పిరికిగా  ప్రవర్తిస్తుంది. అందరు విలన్స్ కంటే టాప్ రేంజిలో సీన్లు నిలబెట్టిన వాడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. ఇంతకీ అతడి దగ్గరున్న సేఫ్ లో ఏముందన్నది  ఓపెన్ కాని సస్పెన్సే. ‘పల్ప్ ఫిక్షన్’ లో ఒక బ్రీఫ్ కోసం జరిగే యాక్షన్ కామెడీలో చివరికి కూడా ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పరు- హిచ్ కాక్ పరిభాషలో ఇలా ప్లే చేయడాన్ని మెక్ గఫిన్ అంటారు. ఇది ప్రస్తుత సినిమాలోనూ అర్ధవంతంగా వుంది. 

          రేచీకటి పాత్ర నటించిన పృథ్వీ  ఈ యాక్షన్ కామెడీ కొక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ మధ్యే హృతిక్ రోషన్, మోహన్ లాల్ లు సీరియస్ అంధపాత్రలు నటించారు గానీ, పృథ్వీ నటించిన చీకటి పడితే కళ్ళు కన్పించని ఛోటా క్రిమినల్ పాత్ర బాగా కామెడీ. క్లయిమాక్స్ లో అన్ని గ్యాంగులకీ  అతను సృష్టించే కన్ఫ్యూజన్ ఇంతా అంతా కాదు.

          నిమాసి బాబాగా రఘుబాబుది ఇంకో దిక్కుమాలిన జీవితం. ఈ పాత్రకూడా కామెడీకి బాగానే పనికొచ్చింది. ఎన్ కౌంటర్ ప్రియుడుగా రాజారవీంద్ర కూడా ఓకే. 

          నిర్మాణ విలువల పరంగా సినిమాకో స్థాయి మాత్రం లేదు. కెమెరా, సంగీతం రెండూ మైనస్సే.  సెకండాఫ్ లో కేవలం ఒకే పాట వుండడం మంచి రిలీఫ్. 

చివరికేమిటి
          డబుల్ ట్రబుల్ తో కిడ్నాపుల కాన్సెప్ట్ ఓకే  గానీ, స్క్రీన్ ప్లే మాత్రం రొడ్దకొట్టుడు స్క్రీన్ ప్లే.
 ఫస్టాఫ్ మరీ రొటీన్ కథనం, సీన్లు. సెకండాఫ్ కి వచ్చాక కథ కనపడినా,  అసలు పాయింటుకి దూరంగా కిడ్నాపుల కథ ఫ్లాట్ గా మారింది. అసలుకి ఇంటర్వెల్ కి ముందు హీరో కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసి హర్ట్ అయి అతణ్ణి తిరస్కరించిన హీరోయిన్, తీరా  ఆ డబ్బు దేని కోసం – ఎందుకోసం చేసిన అప్పు తీర్చడానికి సంపాదిస్తున్నాడో స్పష్టమై,  అతడి ప్రేమని అంగీకరిస్తూ పిల్చినప్పుడు, వస్తూ వస్తూ ఆమె అని తెలీక ఆమె కుక్కనే కిడ్నాప్ చేయడమనే ఐరనీ చాలా బలమైనది. ఇలా ఈ ఐరనీ ప్రధానంగా  కిడ్నాపుల కథని నడపకుండా- ఏదో యాక్షన్ కామెడీ చేయడంతో, డైలాగుల ఫన్ తో ఎక్కడికక్కడ సీన్లు వినోదత్మకంగానే వున్నా-  ఈ సీన్లన్నిటినీ కలిపి ఉంచగల ఒక ఎమోషనల్ థ్రెడ్ లేకపోవడంతో, వెలితిగానే ఫీలవుతాం. ఈ యాక్షన్ కామెడీకి ఉన్న కాస్తా ఆ ప్రేమ కథే బలం, దీన్ని లేకుండా చేశారు.

-సికిందర్
http://www.cinemabazaar.in