రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


కథ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బోయపాటి శ్రీను

తారాగణం : అల్లు అర్జున్‌, ర‌కుల్‌ప్రీత్‌ సింగ్, కేథ‌రిన్‌ ట్రెసా, 
ఆది పినిశెట్టి, శ్రీకాంత్, బ్రహ్మానందం, సాయికుమార్‌, సుమ‌న్ త‌దిత‌రులు
మాటలు : ఎం. రత్నం సంగీతం: థ‌మ‌న్‌, ఛాయాగ్రహణం : రిషీ పంజాబీ
బ్యాన‌ర్ : గీతా ఆర్స్ట్‌, నిర్మాత‌ : అల్లు అర‌వింద్‌
విడుదల :  22, ఏప్రిల్ 2016
***
స్టయిలిష్ స్టార్  అల్లు అర్జున్ తో బోయపాటి ‘బాలకృష్ణ’ శ్రీను తీస్తున్న సినిమా,  మాస్- వూర మాస్ అని విడుదలకి ముందే ప్రచారమైపోయింది.  కాబట్టి ప్రేక్షకులు ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా సినిమా కెళ్లాలని అర్ధమైపోయింది. ఎక్కువ ఆశలు పెట్టుకునేదేం వుండదుగానీ, మినిమం వినోదం లభించినా అదే చాలు. వూర మాస్ అన్నాక వినోదమే కాబట్టి,  ఏ మేరకు దీనికి న్యాయం చేశారో ఈ  కింద చూసుకుంటూ వెళ్దాం...

కథ
          రిహద్దులో కంటే దేశం లోపలే సరిదిద్దాల్సిన సమస్యలున్నాయని సైన్యంలో ఉద్యోగం మానేసి వచ్చి సమాజంలో  అన్యాయాల్ని ఎదుర్కొంటూఉంటాడు గణ (అల్లు అర్జున్). ఇతడి తండ్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఉమాపతి (జయప్రకాశ్).  కొడుకుని ఎందుకూ పనికి రాని  వేస్ట్ ఫెలో అని తిడుతూంటాడు. గణ కి ఓ బాబాయి, పిన్నీ  కూడా వుంటారు. వీళ్ళు పిల్లలు వద్దనుకుని గణ నే కొడుకులాగా చూసుకుంటారు.  బాబాయ్ శ్రీపతి  (శ్రీకాంత్) ఒక లాయర్. ఇతడి కొచ్చే కేసులు కోర్టు వెలుపల తన్ని పరిష్కరిస్తూంటాడు గణ. 


        ఇలా వుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) ప్రజల భూములు లాక్కుంటూ ఉంటాడు. పర్ణశాల అనే వూళ్ళో ఆయిల్ ఫ్యాక్టరీకి భూముల కోసం అక్కడ దౌర్జన్యాలు చేస్తూంటాడు. ఈ నేపధ్యంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే (సాయికుమార్) కూతుర్ని పెళ్లి సంబంధం చూసుకు రమ్మని గణని పంపిస్తాడు బాబాయిని తోడిచ్చి తండ్రి.   కానీ ఇక్కడ అప్పటికే ఎమ్మెల్యే అన్షితా రెడ్డి (కేథరిన్ ట్రెసా) ని వెంటపడి ప్రేమిస్తున్న గణ,  ఈ పెళ్లి చూపులు ఇష్టపడక, అక్కడ జానూ (రకుల్ ప్రీత్ సింగ్) కి తను నచ్చినా తనకి నచ్చలేదని చెప్పి వచ్చేస్తాడు.

        ఇటు ఎమ్మెల్యే అన్షిత ఒక కండిషన్ పెడుతుంది. గణ కొట్లాటలకి వెళ్ళడం మానేసి తన వెనుక  ఉంటానని ఫలానా అమ్మవారి ముందు ప్రమాణం చేస్తేనే పెళ్లి చేసుకుంటానని అంటుంది. దీనికి ఒప్పుకున్న గణ, అమ్మవారి ముందు ప్రమాణం చేస్తూంటే దుండగులు జానూని తరుముకుంటూ వచ్చేస్తారు. చేస్తున్న ప్రమాణం ఆపేసి ఆమె ప్రాణాలు కాపాడతాడు గణ. 

          జానూని దుండగులు ఎందుకు చంపాలనుకున్నారు? ఆమె కథేమిటి? అందులో గణ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? వైరం ధనుష్ తో ఎలా శత్రుత్వం వచ్చింది? చివరి  కేమైంది?...మొదలైన ప్రశ్నలకి సమాధానాల కోసం వెండి తెరని ఆశ్రయించాల్సిందే. 

ఎలావుంది కథ 
     బోయపాటి కథలాగే వుంది. అయితే ఇది మరీ పురాతనమైనది. ఇందులో సస్పెన్స్ కోసం ఏ ప్రయత్నం చేసినా అది కూడా పురాతనంగానే తెలిసిపోతూ వుంటుంది. కథ- ఫ్లాష్ బ్యాక్- మళ్ళీ కథ అనే రొటీన్ శైలిలో చూపించుకు వచ్చాడు. కథలో ‘సమపాళ్ళు’ అనే మాటకొస్తే, ఫ్యామిలీ విషయాలు, కామెడీ, ఇద్దరు హీరోయిన్లతో రోమాన్సూ, ముఖ్య పాత్రల మధ్య అనుబంధాలు, ఏవీ సమపాళ్ళల్లో లేవు. ఒక్క యాక్షన్ సీన్లు మాత్రమే శ్రద్ధగా సమపాళ్ళల్లో మేళవించి పావుగంటకో సారి గట్టిగా వున్నాయి. ట్రైలర్స్ లో ఈ వయొలెన్సు  చూసి  ఓవర్సీస్ బయ్యర్స్ వణికిపోయి- ఇది ఇక్కడి ప్రేక్షకులతో  వర్కౌట్ కాదని, ఇంకో మంచి ట్రైలర్ విడుదల చెయ్యమనీ ఫోన్ల మీద ఫోన్లు చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణతో  బోయపాటి తీసిన ‘లెజండ్’, అంతకి ముందు ‘సింహా’ బలమైన కుటుంబ- యాక్షన్ కథలుగా పేరుబడ్డాయి.  అల్లుఅర్జున్ తో వూర మాస్ అంటూ ఆ వూర మాస్ తనమంతా రెచ్చిపోయి ఫైట్లలోనే  పెట్టాడుతప్ప- కమర్షియల్  విలువల కోసం కథలో ఏమాత్రం పెట్టలేదు.  వెరసి ఇది కుటుంబ ప్రేక్షకులకి  పెద్దగా ఆకర్షించే కథ కాకుండా పోయింది. 

ఎవరెలా చేశారు 
      వూర మాస్ గా అర్జున్ ఫైట్ల వరకూ ఏ లోపంలేకుండా చూసుకున్నాడు. మాస్ నుంచి ఈలలూ కేరింతలూ బాగానే రాబట్టుకునే విధంగా చేశాడు. అలాగే పాటలకి డాన్సులు తన  స్టాండర్డ్స్ కి తగ్గకుండా చూసుకున్నాడు. మిగతా సన్నివేశాల్లోనే-  నటించడానికి పెద్దగా స్కోప్ ఇవ్వని  కథైపోయింది. వూర మాస్ గా  తెర చిరిగిపోయేట్టు హీరోయిన్లతో రోమాన్స్ వెలగబెడదామంటే, కడుపుబ్బా నవ్విద్దామంటే, క్రేజీ టపోరీ క్యారక్టర్ గా అల్లకల్లోలం సృష్టిద్దామంటే,  కథలో ఆ ఎజెండయే లేదు- ఫైట్స్ తప్ప!  ఇక్కడ అర్జున్ ని తగ్గించేసి తాను కూడా తగ్గిపోయాడు బోయపాటి. ఇది అన్యాయం కమర్షియల్ సినిమాకి. ఇక ఎమోషన్స్ తో క్యారక్టర్ ని పైకి లేపుదామంటే,  ఆ మాయదారి విలన్ కూడా క్లయిమాక్స్ దాకా ఎదురు పడడు. ఎవడ్రా వాడూ అని విలన్ పాత్ర ఆది పినిశెట్టి ఎక్కడో వుండి కేకలేస్తాడు, రమ్మనండ్రా ఆణ్ణీ అని అర్జున్ ఇక్కడ చిందులేస్తాడు. క్లయిమాక్స్ లోనే ఎదురుపడి కొట్టుకునేది!. 

           కాబట్టి ఎమోషన్స్ ప్రసక్తే లేదు. ఇక ఇంటి నిండా వున్న కుటుంబ సభ్యులతో అనుబంధాలు పోషిద్దామన్నా ఆ పాయింటే ఆలోచించలేదు దర్శకుడు. ఇంటితో కనెక్ట్ అయ్యే ఒక చిన్న త్రెడ్ అర్జున్ చేతి కివ్వలేదు బోయపాటి. అంతా కృత్రిమమే. కొడుకుకంటే ఎక్కువ చూసుకునే బాబాయ్ తో కూడా అర్జున్ కి ఒక కంట తడి పెట్టించే  సీన్ ఇవ్వలేదు. అందుకే క్లయిమాక్స్ లో చావుబతుకుల్లో వున్న బాబాయ్ తో అర్జున్ సీన్ చప్పగా తయారయ్యింది. వూర మాస్ అంటే ఆల్ రౌండర్. అన్నిట్లో అందర్నీ మెప్పిస్తూ, ప్రత్యర్థుల్ని నొప్పిస్తూ, నవ్విస్తూ ఆడి పాడి,  చివర్లో కాస్త కంట తడిపెట్టించి సెలవుతీసుకో వాల్సిన- గుర్తుండి పోయే  పాత్ర చిత్రణ ఎందుకో బోయపాటి చేయలేకపోయాడు. 

          ఇక హీరోయిన్ లిద్దరూ కూడా అర్జున్ లాగే ఏమీ చేయలేకపోయారు- యాక్షన్ కి  తప్ప మరి దేనికీ కథ అవకాశ మివ్వకపోవడం వల్ల. బ్రహ్మానందం చాలా నీరసంగా ఎందుకురా నాకీ కామెడీ అన్నట్టు డైలాగులు చెప్పేసి వెళ్లి పోతూంటాడు. బ్రహ్మానందం ఇంటరెస్ట్ పాతాళానికి చేరిన సినిమాగా ఇది చరిత్రలో నమోదవుతుంది. 

          మిగిలిన పాత్రధారుల్లో  ముఖ్యుడైన, తమిళంలో హీరోగా నటిస్తున్న (ఇటీవలే ‘మలుపు’)  ఆది పినిశెట్టి (నాటి ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) విలన్ పాత్ర పోషించడం బోయపాటి సినిమాకి ఒక ప్లస్ అయిన పాయింటే . కానీ హీరో- విలన్ల మధ్య ఏకపక్ష, పరోక్ష కథనాల వల్ల ఆది కూడా సక్రమంగా పాత్రని పోషించ లేకపోయాడు. ఇతడికీ అర్జున్ లాగే నటించడానికి స్కోపు లేదు- కేవలం యాక్షన్ సీన్స్ లో చెలరేగడం మాత్రమే. యాక్షన్ సీన్స్ తప్ప ఇంకేదీ  హీరోకీ, విలన్ కీ ప్రధానం కాదనే  కాలం వచ్చేసింద నుకుంటే మాత్రం, సినిమాలు  ఇలాగే వుండాలని అనుకుంటే మాత్రం చెప్పేదేమీ వుండదు.

         సంగీతం- ఛాయాగ్రహణం పెద్దగా మెప్పించేవిగా లేవు. యాక్షన్ సీన్స్ కళాకారులు మాత్రమే
(రామ్ –లక్ష్మణ్ సహా) ఈ సినిమని తమ భుజాల మీద మోశారు. సినిమా బాగోగులతో సంబంధం లేకుండా వీళ్ళ  పనితనానికి అభినందించాల్సిందే. 

చివరికేమిటి 
    సింహా, లెజెండ్ ల మీద చూపెట్టిన బోయపాటి గ్రిప్ ఈసారి సడలింది. దీనికి నిదర్శనం కథ ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లయిమాక్స్ దాకా తెలియక పోవడమే. సెకండాఫ్ లో  అరగంట పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ పూర్తయితేనే గానీ అసలు కథేమిటో తెలిసి అది ప్రారంభం కాదు. టెక్నికల్ గా చెప్పాలంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే చేశాడు బోయపాటి! క్లయిమాక్స్ దాకా విషయం లేదు కాబట్టి చీటికీ  మాటికీ యాక్షన్ సీన్స్ తో  నింపేశాడు. క్లయిమాక్స్ లో  విలన్ ని ఎదుర్కొనే డ్రామా అంతా అసహజమే.  విషయం లేని సినిమాకి రెండు గంటలా 40 నిమిషాల నిడివి తీసుకున్నాడు. బేసిగ్గా ఈ సినిమా తనే తీసిన ‘భద్ర’ లాంటిదే. హీరోయిన్ ని కాపాడే కథతో 2003 లో  ‘ఒక్కడు’ తో  ప్రారంభమైన ట్రెండ్ లో ఎన్నో సినిమాలొచ్చి పాతబడిపోయాయి. 14 ఏళ్ల తర్వాత కూడా ఆ వనవాసంలోనే వున్నట్టు మళ్ళీ  అదే తీస్తే ఎలా!  అదే అడవిలోకి ప్రేక్షకుల్ని తోస్తే ఎలా!

 -సికిందర్