రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Saturday, February 27, 2016

షార్ట్ రివ్యూ!


దర్శకత్వం : రవికాంత్ పారెపు
తారాగణం : అడవి శేష, అదా శర్మ, అనసూయ, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, రవి వర్మ, సత్యదేవ్ తదితరులు
కథ : అడివి శేష్,  స్క్రీన్ ప్లే : అడివి శేష్- రవికాంత్ పారెపు, డైలాగ్స్- స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి,  సంగీతం : శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : షానీల్ దేవ్
బ్యానర్ : పివిపి సినిమా- మాటనీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : పరమ్  వి. పొట్లూరి, కెవిన్ ఏన్
విడుదల :26 ఫిబ్రవరి 2016
***
        సృజనాత్మకంగా తెలుగు సినిమాకి  శిఖరాగ్ర తలాల్ని తాకే సృష్టి ఇక అసాధ్యమేమో అనుకుంటున్న నాటు దర్శకత్వాల కాలంలో, కొత్తగా పాతికేళ్ళ యువదర్శకుడు అత్యంత పరిణతితో, దృశ్యమాధ్యమం మీద సంపూర్ణావగాహనతో, పట్టుతో, ప్రావీణ్యంతో, తన పనితనాన్ని తెలుగులో అరుదైపోయిన క్వాలిటీ సినిమా స్థాయికి చేర్చి ‘క్షణం’ ని సార్ధకం చేశాడు. సినిమా కళని కాలాన్ని బట్టి ఏమాత్రం సానబట్టకుండా అరిగిపోయిన దర్శకత్వాలతో అవే రకం నాసి సినిమాలు తీసే వాళ్లకి మార్కెట్లో సవాలు  విసిరాడు. సాధారణంగా  మార్కెట్లో ఓ కొత్త తరహా ఉత్పత్తి వచ్చిందంటే మిగతా ఉత్పత్తి దారులు అప్రమత్తమై దాంతో పోటీ పడే మరో కొత్త ఉత్పత్తి తో మార్కెట్లోకి వస్తారు. ఇది సినిమా ఫీల్డుకు వర్తించదనుకుంటారు. కొత్త మేకింగ్ తో ఓ సినిమా వచ్చిందని ఎంత ప్రచారం జరిగినా, వెళ్లి చూడమని ఎందరు చెప్పినా దర్శకులయ్యే వాళ్ళు, దర్శకులైన వాళ్ళూ అటువైపు కన్నెత్తి చూడరు. పోటీతత్వం ఇలా పడకేయడం మరే రంగంలో చూడం. మేకింగ్ పరంగా ‘క్షణం’ అనే కళాసృష్టి విసురుతున్న కొత్త సవాళ్లు ఎవరికీ పట్టడం లేదు. నాటు దర్శకత్వాల్లోనే వాళ్లకి స్వర్గసుఖాలున్నట్టున్నాయి.

      కొత్త దర్శకుడు రవికాంత్ పారెపు మొదటి ప్రయత్నంగా ఒక థ్రిల్లర్ ని, అందునా చాలా సంక్లిష్ట కథా సంవిధానంతో కూడిన ప్రయత్నానికి సాహసించాడు. ఇందులో పూర్తి విజయం సాధించాడు. అయితే పూర్తి క్రెడిట్ తానొక్కడికే దక్కదు, రైటింగ్ సైడ్ అడివి శేష్ కీ,  అబ్బూరి రవికీ కూడా కలిపి దక్కుతుంది. ఏదైనా ముందు క్వాలిటీ రైటింగ్ వల్లే సాధ్యమవుతుందని నిరూపించారు ఈ ముగ్గురూ.

        ‘క్షణం’ ఒక కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుత విజువల్ కాన్వాస్ తో, మనసు మరల్చుకోనివ్వని ఉర్రూతలూగించే విషయ వ్యక్తీకరణతో, ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ జాతి లక్షణాల్ని ప్రదర్శించుకుంటుంది. కల్తీ లేని దీని జాతి లక్షణమే దీని విజయరహస్యం. ఇప్పుడున్న సోకాల్డ్ సృష్టి కర్తలు ఈ విజయరహస్యాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు, పట్టుకోవాలన్న ఆసక్తి వుంటే కదా! 

        థ్రిల్లర్ అనగానే ‘ఒక వస్తువు కోసం కొంతమంది వెంటాడే’  ఈజీగా వుండే రోడ్ మూవీస్ గానే ఉంటున్న వైనం ఇటీవల ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ తో  కూడా మళ్ళీ చూశాక,  ఈ మూసని  బ్రేక్ చేస్తూ వచ్చిన ‘క్షణం’ ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం...


కథ
       అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న ( రిషి) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ( అదా శర్మ) పిలుపుకి కారణమేంటో తెలుసుకోవడానికి ఇండియా వస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్న శ్వేత తన నాల్గేళ్ళ  కూతురు రెండు నెలల నుంచీ  కన్పించకుండా పోయిందనీ, ఎవరూ- ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. రిషి రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి... ఎవర్నడిగినా,  పోలీసులు సహా,  లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు కేసు క్లోజ్  చేశామంటారు. రిషి కి ఎవర్ని నమ్మాలో అర్ధం గాదు. శ్వేత అబద్ధం చేప్తోందా తనకి కూతురుందనీ?. డ్రగ్స్ బానిసైన శ్వేత మరిది బాబీ (రవివర్మ) మీద కన్నేస్తాడు. ఆఫ్రికన్లతో కుమ్మక్కై వున్న అతడి డ్రగ్ రాకెట్ ని చూసి  శ్వేత కూతుర్ని ఇతనే  కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు. పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూ ఖాన్ ( వెన్నెల కిషోర్) వస్తాడు. ఇంకెవరెవరో వస్తారు.  ఆ పిల్ల తన కూతురేనని  ఇంకొకడొస్తాడు ... అసలేం జరిగి వుంటుంది? శ్వేత మానసిక స్థితిని అనుమానిస్తాడు. ఒకటొకటే అమ్మాయి అదృశ్య రహస్యాన్ని ఛేదిస్తూ పోతాడు...ఒకటొకటే నమ్మలేని నిజాలు బయటపడుతూంటాయి...ఒకటి తవ్వితే ఇంకోటి.. ఆఖరికి తెలుసుకున్న కూతురి రహస్యం ఎదురుతిరిగి తనకే కొట్టడంతో షా కవుతాడు. తన గురించి తనకే తెలీని నిజం బయట పడి అవాక్కవుతాడు...

ఎలావుంది కథ : 
       
హెన్రీ కథల్లోలాగా కొసమెరుపు వున్న షాకింగ్ కథ. కూతురు వుందా లేదా - అసలుందా లేదా -  అన్న సెంట్రల్ పాయింటుతో ప్రేక్షకుల్ని ఆద్యంతం లాక్కెళ్ళే  సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ ఒక కొత్త అనుభూతినిచ్చే విధంగా వుంది చాలా కాలం తర్వాత. అయితే చివర్లో సస్పెన్స్ వీడిపోయాక ఒక నైతిక సంబంధమైన ప్రశ్న ఈ కథ పట్ల గౌరవాన్ని కొంచెం తగ్గిస్తుంది. పుట్టిన కూతురు వేరొకడి రక్తమన్న విషయం దాచి పెట్టి భర్తతో కాపురం చేయడం హీరోయిన్ పాత్రకి తగదు అన్పించేలా వుంటుంది. ఇదేదో విదేశీ కథైతే  అక్కడ ఓకే అనుకోవచ్చు, ఇక్కడ  కాదు. ఎంత  ఈ రహస్యం తెలిసేటప్పటికి సినిమా ముగింపుకొచ్చినా – హీరోయిన్ అనైతికత మనల్ని వెంటాడుతూనే వుంటుంది.

ఎవరెలా చేశారు
         
అందరూ చాలా బాగా చేశారు, నటీనటుల కాడ్నించీ టెక్నీషియన్స్ వరకూ. అడివి శేష్ ఒక హీరోలా హీరోయిజం ప్రదర్శించకుండా, ఓ సామాన్యుడిలా సహజ నటన కనబర్చాడు. ఇంతవరకూ చేసిన సినిమాలు ఒకెత్తు- ఇదొక్కటీ ఒకెత్తు. అతను కేవలం హీరో పాత్రలే వేయకుండా కొన్ని సినిమాల్లో  హీరోయేతర పాత్రలు కూడా వేస్తూ ఇమేజి చట్రాలకి దూరంగా ఉంటున్నాడు. ‘దొంగాట’ లో బుద్ధి తెచ్చుకునే నెగెటివ్ పాత్ర వేశాక, ఇప్పడు బుద్ధి నేర్చుకునే మాజీ బాయ్ ఫ్రెండ్ పాత్ర వేశాడు. తను వున్న ప్రతీ సీనూ ఏ బిల్డప్పులూ లేకుండానే వేడి పుట్టించాడు. అతడి గ్లామరస్ రూపం ఈ పాత్రకి  చాలా ప్లస్ అయింది. 

        హీరోయిన్ అదా శర్మ ఈ సారి మసాలా సినిమాలకి దూరంగా ఒక  విషయమున్న, నటిగా తనకి పని వున్న పాత్ర నటించింది. అసలు పిల్ల ఉందా లేదా, తనని నమ్మాలా వద్దా, తను సైకోనా కాదా అన్న షేడ్స్ అన్నిటినీ అలవోకగా ప్రదర్శిస్తూ ఎమోషనల్ డ్రామాని బాగా రక్తి కట్టించింది. 

        కమెడియన్ సత్యం రాజేష్ పోలీసు అధికారి పాత్రలో తను చౌదరి అయి, కానిస్టేబుల్ ని రెడ్డీ అని పిలుస్తూ కమ్మా రెడ్ల కనిపించని సెటైరికల్ ప్లేని సైడ్లో ప్రదర్శించుకుంటూ పోయాడు. ఇది కాదు  పాయింటు - చాలా సర్ప్రైజింగ్ గా, నిజమైన  బంజారా హిల్స్ పోలీసు వాడిలా ఖతర్నాక్ లుక్ తో, పర్వెర్టెడ్ డైలాగ్స్ తో, ప్రతీచోటా హైలైట్ అవుతూ పోయాడు. అతడికి అవార్డు రావొచ్చు. 

        ఇంకో సర్ప్రైజ్  గిఫ్ట్, ఎసిపి జయగా నటించిన అనసూయ. ప్రతీ పాత్ర వెనకాలా కొంత చీకటి చరిత్ర ఉన్నట్టే, తన నంగనాచి పాత్రని కూడా  టెర్రిఫిక్ గా పోషించు కెళ్ళింది తన క్లాస్ నటనతో.

        ఇక వెన్నెల కిషోర్ బాబూఖాన్ పాత్రలో ఓ షేర్ ఖాన్ త్యాగమొకటి చేస్తూ పాత్రని ఎక్కడికో తీసికెళ్ళాడు. ఇది కూడా కామెడీ పాత్ర కాదు. సత్యం రాజేష్, ఇతనూ ఇక్కడ కామెడీ పాత్రలు కావు. వెన్నెల కిషోర్ ఇహ కామెడీ మానేసి ఇలాటి సెన్స్ వున్న క్యారక్టర్లు వేస్తే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పొందగలడు.

        ఈ సినిమాలో ఆఫ్రికన్ నటులు కూడా ఫెంటాస్టిక్ గా వున్నారు. ఇక డ్రగ్ బానిసగా రవివర్మ డ్రగ్ బానిసలకే గురువు అన్నట్టుగా వున్నాడు. హీరోయిన్ భర్తగా నటించిన సత్యదేవ్ కూడా పైకి కన్పించని శాడిస్టుగా మెత్త మెత్తగా తనవంతు కార్యక్రమం నిర్వహించాడు. ఈ సినిమాలో అందరూ పైకి పవిత్రులే, వెనకాల మాత్రం గోతులే. అయితే కూతురి పాత్రలో అమ్మాయి సెలక్షన్ కుదర్లేదు. చూస్తే ఆమెకి తల్లి పాత్ర అదాశర్మ రంగూ పోలికలూ లేవు, తండ్రి పాత్ర సత్యదేవ్ కి మ్యాచ్ అయ్యే రంగూ పోలికలతో వుంది. కానీ తండ్రి ఈ పాత్ర కానప్పుడు- అసలు తండ్రెవరో ఆ  రూపురేఖలకి దగ్గరగా ఆమె వుండాలేమో...?

        తక్కువ బడ్జెట్ తోనే టెక్నికల్ గా ఈ మూవీ చాలా సాధించింది. దీని విజువల్ కాన్వాస్, డ్రమ్స్ ప్రధానంగా మ్యూజికల్ ట్రాక్,  తెలుగు సినిమాకి ఒక కొత్త జన్మ ప్రసాదించి నట్టున్నాయి. నిజంగానే నిన్న తెలుగు సినిమా పునర్జన్మెత్తింది. కెమెరామాన్ షానీల్ దేవ్ ఈ విజువల్ వండర్ కి చాలా పెద్ద ఎస్సెట్. శ్రీ చరణ్ పాకాల కూడా డ్రమ్స్ తో, అతి కొద్ది ఇన్ స్ట్రుమెంట్స్ తో- సినిమా ఆద్యంతం కథాకథనాలకి తోడ్పడే ఒక థీమ్ ట్రాక్ ని క్రియేట్ చేశాడు. రొడ్డ కొట్టుడు బ్యాక్ గౌండ్ మ్యూజిక్ కాలుష్యం నుంచి విముక్తి కల్గించాడు. లోకేషన్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, ఫైట్స్,  యాక్షన్ దృశ్యాలు కూడా ఉన్నతంగా వున్నాయి.

        ఈ కథని అడివి శేష్ ఇస్తే, అడివి శేష్ తో  దర్శకుడు రవికాంత్ కలిసి స్క్రీన్ ప్లే చేశారు. అబ్బూరి రవి మాటలు రాసి స్క్రిప్టు గైడెన్స్ ఇచ్చారు. ఇదంతా ముగ్గురు విద్యార్ధులు శ్రద్ధగా చదువుకుని  పరీక్ష రాసినట్టుంది. పకడ్బందీ కథా కథనాలు, పకడ్బందీ పాత్రచిత్రణలు, పకడ్బందీ సంభాషణలు ఇందుకే సాధ్యమయ్యాయి. కమర్షియల్ సినిమాని బిల్డప్పుల హీరోతనాలూ, పాటలూ స్టెప్పులూ, లవ్వులూ కామెడీలూ, ఇంకేవో  సెంటిమెంట్లూ సున్నాలూ పూసుకోకుండా కూడా తీయవచ్చని (రాయవచ్చని)  ఓ గైడ్ లా తయారుచేసి పెట్టారు దీన్ని. 

        చిన్నవయసులో దర్శకుడుగా రవికాంత్ తను కొత్తవాడనే ఛాయలు ఎక్కడా కన్పించకుండా- చాలా మెచ్యూరిటీతో దర్శకత్వం వహించాడు. చివర్లో నైతికతకి తిలోదకాలివ్వడం తప్పితే, ఇంకే తప్పులూ దొర్లకుండా చేసిన ఈ తొలిప్రయత్నం థ్రిల్లర్స్ జాతిలో ఒక కళా సృష్టిగా నిలిచిపోతుంది. ప్రేమ కథని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో అవసరమున్నప్పుడల్లా రివీల్ చేస్తూపోయిన క్రియేటివిటీ - సమయస్ఫూర్తి - సబ్జెక్ట్ మీదున్న కమాండ్ ని తెలియజేస్తుంది. 

        ఒక సినిమా తీయాలంటే ఇంత వుంటుందా అని పునరాలోచనలో పడెయ్యకపోతే, ఎవడుపడితే వాడొచ్చి  రొడ్డ కొట్టుడు సినిమాలు తీసేసి పోతాడు. ఈ ‘క్షణం’ చూసి ఒక్క క్షణం ప్రేక్షకులు కూడా ఇలా నిజమైన క్వాలిటీ సినిమాలు చూసే అవకాశమివ్వకుండా, ఎందుకు  రాచిరంపాన పెడుతున్నారో ఆలోచించాలి.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)


1 comment:

Mamatha said...

నిన్న యూట్యూబ్ లో చూశాను, నిజం గా చాలా బావుంది.