రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 27, 2016

షార్ట్ రివ్యూ!





కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సతీష్ కాసెట్టి
తారాగణం: శ్రీకాంత్, నిఖితా తుక్రాల్, నాజర్, కోట శ్రీనివాస రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పృథ్వి, వినయ్  వర్మ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల్, సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : శ్యాం ప్రసాద్
బ్యానర్ : అఖండ భారత్ క్రియేషన్స్ , నిర్మాత: షేక్ మస్తాన్
విడుదల : 26 ఫిబ్రవరి 2016
***
          టెర్రరిజం మీద సినిమాలు ఇవ్వాళ కొత్త కాదు. హిందీలో  రొటీన్ కి కాస్త పక్క కెళ్ళి క్యారక్టర్ బేస్డ్ టెర్రరిజం సినిమాలు వాస్తవికంగా తీసిన సందర్భాలున్నాయి. కానీ తెలుగులో ఒకే టెంప్లెట్ ని పెట్టుకుని, అవే మూస టెర్రరిజాలు తీస్తున్నారు. నగరం మీద టెర్రరిస్టులు దాడికి ప్లాను చేయడం, దాన్ని హీరో సాయంతో పోలీసులు భగ్నం చేయడం... ఈ చట్రం లోంచి బయటికి వచ్చి తీసిన టెర్రరిజం సినిమాలు తెలుగులో జీరో. ఇంతేగాక కథా కథనాల పరంగానూ ఇవి మూసపాత్రలతో సహా మూస ఫార్ములా సినిమాలుగానే ఉంటున్నాయి. తీస్తే కమర్షియల్ మసాలాగా తీయడమో, లేకపోతే రియలిస్టిక్ పేరు చెప్పి దాన్ని మళ్ళీ మూస ఫార్ములా గా తీయడమో చేస్తున్నారు. ఇంకో కేటగిరీ ఏమిటంటే,  ఎప్పుడో పాతబడిన, చూసి చూసి వున్న  ‘ముఖ్యమంత్రి సీటు కోసం హోం మంత్రి కుట్ర చేయు’  టైపు పాత చట్రంలోకే మళ్ళీ టెర్రరిజం కథల్ని కూడా ఇరికించేసి చూపించెయ్యడం. ప్రస్తుత ‘టెర్రర్’ ఈ పథకం కిందికే వస్తుంది. తెలుగు సినిమా కథ తయారుచేయడం ఎంత ఈజీ అయిపోయింది!! 

        ఈ మధ్య సినిమాలతో వెనుకబడ్డ హీరో శ్రీకాంత్ పోలీసు పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలాగే  ‘హోప్’, ‘కలవరమాయే మదిలో’ సినిమాల దర్శకుడు సతీష్ కాసెట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో రావడం ప్రత్యేకత. విడుదలకి ముందు ఈ సినిమా పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపింది. ఈ ఆసక్తినీ అంచనాలనీ అందుకునే విధంగా  ‘టెర్రర్’  ఏయే ప్రత్యేకతలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. 

కథ
       
క కేసు విషయంలో పనిష్మెంట్ గా  కౌంటర్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి బదిలీ అవుతాడు సీ ఐ విజయ్( శ్రీకాంత్). ఆ కేసులో అతను  ప్రవర్తించిన తీరుని వ్యతిరేకించి అతడి తండ్రి ( నాజర్) దూరమవుతాడు. భార్య పూజ  ( నిఖితా తుక్రాల్) తో వేరే కాపురం ఉంటాడు విజయ్. తన మీద కేసు ఎంక్వైరీ అనుకూలంగా రావడానికి ఓ ఎమ్మెల్యే ( పృథ్వీ) కి  డబ్బులిస్తూంటాడు విజయ్. ఇలా వుండగా కౌంటర్ ఇంటలిజెన్స్ డిసిపి  రాథోడ్ (వినయ్ వర్మ) అనే పై అధికారి విజయ్ కి ఓ ఆపరేషన్ అప్పజెప్తాడు.  సిటీలో టెర్రరిస్టు కార్యకలాపాల మీద నిఘా వెయ్యమని. విజయ్ దర్యాప్తు చేపట్టి ఇన్ఫార్మర్ల తోడ్పాటుతో కేసుని ఛేదిస్తూంటాడు. ఇంకో వైపు ఎమ్మెల్యేకి డబ్బులివ్వాల్సిన వొత్తిడి వుంటుంది. విజయ్ దృష్టికి  రాకుండా ఒక బాంగ్లాదేశ్  కి చెందిన టెర్రరిస్టు ముఖ్యమంత్రిని హతమార్చేందుకు పథకం వస్తాడు. ఇది హోంమంత్రి (కోట శ్రీనివాసరావు) కీ, కేంద్ర నాయకుడికీ తెలిసి వాళ్ళ రాజకీయప్రయోజనాల కోసం సైలెంట్ గా ఉండిపోతారు. టెర్రరిస్టు దాడిలో ముఖ్యమంత్రి చనిపోతే ఆ పదవిలోకి  తను రావాలన్న ఆశతో హోం మంత్రి ఉంటాడు. ఇతడికి డిసిపి రాథోడ్ తోడవుతాడు. దీంతో విజయ్ మీద వొత్తిడి తెస్తాడు దర్యాప్తు ఆపెయ్యమని. విజయ్ కి తెర వెనుక కుట్ర అర్ధమైపోయి ఎదురు తిరుగుతాడు. తను లొంగే సమస్యే లేదనీ, కుట్రని భగ్నం చేస్తాననీ సవాలు విసిరి హోం మంత్రికి శత్రువవుతాడు. ఇదీ విషయం. ఇప్పుడు తన మీద జరిగే హత్యాయత్నాల్ని  తిప్పికొడుతూ, నగరానికి టెర్రరిజం ప్రమాదాన్ని విజయ్ ఎలా నివారించాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
       
ముందే చెప్పుకున్నట్టు ఇది ‘ముఖ్యమంత్రి సీటు కోసం హోం మంత్రి కుట్ర చేయు’  రొటీన్ టెర్రర్ మూస కథే. ఇన్నేళ్ళుగా మనం చూస్తున్న దాని ప్రకారం దేశం లో నాయకులెవరూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దాఖలాల్లేవు. నాయకులెవరికైనా వుంటే గింటే మాఫియాలతో, స్మగ్లర్లతో సంబంధాలుంటున్నట్టు చూస్తున్నాం. ఇది కూడా ఆర్ధిక ప్రయోజనాలకోసమే. టెర్రరిస్టులతో చేతులుకలిపి దేశద్రోహానికి పాల్పడే దుర్మార్గులుగా లేరు నాయకులు. వాళ్లకి దోచుకోవడానికి దేశం వుండాలి, జనం వుండాలి. బాంబులు పేల్చి మారణహోమం సృష్టించడం వాళ్ళ సిద్ధాంతంలో భాగం కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ ఇదే. దేశంలో ఏ నాయకుడినీ యాంటీ నేషనల్ అనలేని, రుజువు చేయలేని చర్చ. మన నాయకులు ఇంతవరకు పుణ్యాత్ములే. కాబట్టి- పార్లమెంట్ సాక్షిగా పరిస్థితి ఇలా వుంటే,  వాస్తవదూరంగా నాయకుల్ని టెర్రరిస్టులుగా చూపించడం ఎలాటి సామంజస్యత? సగటు ప్రేక్షుకుడు పార్లమెంట్ ని నమ్మాలా, ఈ సినిమాని నమ్మాలా? 

        ఇంకెవరో మసాలా దర్శకుడు ఇలా తీస్తే పోనీలే అనుకోవచ్చు, కానీ ఒక జాతీయ అవార్డు పొందిన దర్శకుడుగా సతీష్ కాసెట్టి సామాజిక స్పృహ ఇలా వుండాల్సింది కాదు. దీనికి కమర్షియల్ మసాలాలు లేని వాస్తవిక సినిమా అనడం కూడా సమంజసం కాదు.

ఎవరెలా చేశారు
       
ప్రధానపాత్ర లో శ్రీకాంత్ ఇంకా బాగా చేయడానికి స్కోప్ వుంది, పాత్ర అనుమతిస్తే. కానీ పాత్రకి  చాలా సంకెళ్ళు పడ్డాయి. తనకి బలమైన విలన్ లేకపోవడం, ఉన్న విలన్ కూడా క్లయిమాక్స్ కి ముందు వరకూ ఎదురుపడకపోవడం, ఆ విలన్ తో కూడా కథ కొనసాగక, క్లయిమాక్స్ అంతా  ఆ విలన్ అనుచరుడైన బచ్చాలా వున్న జ్యూనియర్ ఆర్టిస్టు తో తలపడాల్సి రావడం వంటి బాక్సాఫీసు వ్యతిరేక అంశాల సంకెళ్ళు శ్రీకాంత్ నట సామర్ధ్యాన్ని కుదించి వేశాయి. శ్రీకాంత్ యమ సీరియస్ గా నటించ వచ్చు, కఠినమైన ఎక్స్ ప్రెషన్స్ డైలాగులూ ఇవ్వొచ్చు. ఎన్కౌంటర్లు చేయవచ్చు. ఇవన్నీ ఎవరి మీద? అసలైన ప్రత్యర్ధి ఎవరో తెలీకుండా, వాడి జోలికెళ్ళాకుండా, ఛోటా మోటా పక్క పాత్రల మీద ప్రతాపం చూపించడమా? నటనని పాత్రచిత్రణతో కలిపి చూడాలి. 

        మేకప్ కూడా పోలీస్ అధికారిని తలపించే విధంగా లేకపోవడం ఇంకో లోపం. శ్రీకాంత్ పోలీస్ పాత్రకి రియలిస్టిక్ లుక్ తీసుకురావడం మీద కూడా శ్రద్ధ పెట్టలేదు దర్శకుడు- ఇక్కడ సందర్భం కాకపోయినా ‘క్షణం’ లో సత్యం రాజేష్ పోషించిన పోలీసు అధికారి పాత్రని చూస్తే, ఆ లుక్- అచ్చం పోలీస్ అధికారి అన్నట్టుగానే వుంది. ఆ లుక్, దానికి తోడూ పర్వర్టెడ్ మెంటాలిటీవీటితో అతడి నటనా, మాట తీరూ  ప్రేక్షకులకి వెర్రెత్తించే విధంగా వున్నాయి.  తనొక కమెడియన్ అన్న విషయాన్నే పూర్తిగా మరిపించేశాడు. 

        కోట, పృథ్వీ ల నటన మూస ఫార్ములా సినిమాల నటనే తప్ప కథ చేస్తున్న డిమాండ్ మేరకు సీరియస్ రియలిస్టిక్ పాత్రలుగా కన్పించరు. దేశద్రోహం కూడా కామెడిగానే చేసేట్టున్నారు. ఇవి కథకి పొసగని పాత్ర చిత్రణలు. ఇతరపాత్రల్లో దాదాపు అందరూ కొత్త వాళ్ళే- చాలా వరకూ జ్యూనియర్ ఆర్టిస్టులుగా కన్పిస్తారు. టెర్రరిస్టుగా వేసిన నటుడు  సైతం ఆ పాత్ర స్థాయిలో లేడు. ఇలా కాస్టింగ్ లోపం అడుగడుగునా ఇబ్బంది పెడుతుంది.

        పాటలు లేని ఈ సినిమాలో సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు, అలాగే శ్యాం ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా.

చివరికేమిటి?
        దర్శకుడిలో చిత్రీకరణ సామర్ధ్యం వుంది. అయితే కాన్సెప్ట్ స్పృహ, కథా కథనాలకి  ఇంకాస్త నిబద్ధతా అవసరమన్నట్టు కన్పిస్తుంది. చాలావరకూ డైలాగుల రూపంలో కథ నడిచిపోతుంది. ఇంటర్వెల్ పడగానే అంతవరకూ చూసింది నాటకం లాగుందే అన్పించిక మానదు. ఈ టెర్రరిజం - ఈ 'వాస్తవికత'  కూడా థ్రిల్లర్ జాతి  కిందికే వస్తాయి. వాస్తవికత అయినంత మాత్రాన కథా లక్షణాల్ని విస్మరించలేం. కానీ 
 ఎంతసేపూ శ్రీకాంత్ పాత్ర టెర్రరిస్టెవరో తెలుసుకునే దర్యాప్తుతోనే సరిపోతుంది- దర్యాప్తు అంశం బాక్సాఫీసు ఫ్రెండ్లీ గా వుండేది కథలో కొంత మేరకే. వీలయినంత త్వరగా దర్యాప్తు పర్వం ముగించుకుని కనుగొన్న విలన్ తో సంఘర్షణ ప్రారంభం కాకపోతే అది థ్రిల్లర్ అవదు. ‘డే ఆఫ్ ది జాకాల్’ ఇందుకు క్లాసిక్ ఉదాహరణ. ఫ్రాన్స్ ప్రెసిడెంటుని చంపేందుకు కుట్రపన్నిన టెర్రరిస్టెవరా అని కనుక్కునే దర్యాప్తు కాస్సేపే- వాడు తెలిసిపోగానే వాణ్ణి పట్టుకునే ఎలుకా పిల్లి చెలగాటంలోకి మలుపు తిరుగుంతుంది. మహాత్మా గాంధీని చంపే కథతో కమల్ హా సన్ తీసిన ‘హేరామ్’ అనే కల్పిత కథ కూడా ఇంతే. పోరాడేందుకు విలన్ లేక క్లయిమాక్స్ దాకా వాడెవరో తెలుసుకునే ఏకపక్ష  కథనం వల్ల,   విజువల్ మీడియా అయిన సినిమాకి ఎంతో అవసరమైన యాక్షన్- రియాక్షన్ ల థ్రిల్లింగ్ ప్లే లేకుండా పోయింది ‘టెర్రర్’ లో.

        ఇంతగ్యాప్ తర్వాత సతీష్ కాసెట్టి తీయకతీయక తీసిన ఈ టెర్రర్ స్టోరీ  స్క్రీన్ ప్లే లో పాత్రల పరమైన, కథా కథనాల పరమైన లోపాలన్నిటినీ తొలగించుకుని పూర్తి ప్రొఫెషనలిజం ఉట్టిపడేలా తీసి వుంటే, ఫలితాలు చాలా చాలా బావుండేవి. తనూ నిర్మాతా శ్రీకాంత్ ఎక్కడో వుండేవాళ్ళు!

--సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)