రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, జూన్ 2015, శుక్రవారం

ఎడిటింగ్


తెలుగులో తొలి ఎవిడ్ ఎడిటర్  కె. వి. కృష్ణా రెడ్డి 


మాన్యువల్ ఎడిటింగ్ తో అనుభవమున్న ఫిలిం ఎడిటర్లు కంప్యూటర్ ఆధారిత ఎవిడ్ ఎడిటింగ్ లోనూ మంచి నైపుణ్యం సంపాదించుకోగలరా? భవిష్యత్తులో ఈ రెండు టెక్నాలజీలతోనూ పరిచయమున్న సీనియర్ ఎడిటర్ల నిష్క్రమణ తర్వాత, కేవలం కంప్యూటర్ ఎడిటింగ్ లో శిక్షణ పొంది వస్తున్న తరంతో ప్రమాణాలెలా వుండబోతున్నాయి? భవిష్యత్తులో అంతా కట్ అండ్ పేస్ట్ తరహా సారం లేని వ్యవహారమే అవుతుందా...అంటే, కాదంటారు కృష్ణా రెడ్డి.

        మా అసిస్టెంట్లకి మాన్యువల్ ఎడిటింగ్ లోని బేసిక్స్ ని కూడా నేర్పుతూంటాం. ఆనాటి బేసిక్స్ తెలియక పోతే ఈనాటి కట్స్ కి రాణింపు వుండదు. వాళ్ళు నేర్చుకుని వస్తున్న ఆధునిక టెక్నాలజీల నుంచి మేమూ నేర్చుకుంటూ వుంటాం. మాన్యువల్ నుంచి ఎవిడ్ కి మారినప్పుడు నాకేమీ తెలీదు. ఎవిడ్ లో ఎక్కడా శిక్షణ కూడా పొందలేదు. కష్టపడి స్వయంగా నేర్చుకున్నదే


        తను చేసినవి యాభై సినిమాలైతే, అందులో 80 శాతం వరకూ హిట్ సినిమాల రికార్డు వున్న సీనియర్ ఎడిటర్ కె వి కృష్ణా రెడ్డి –తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి ఎవిడ్ ఎడిటర్ గా కూడా నమోదవుతారు. ఎప్పటి కప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్న ఎవిడ్ అన్ని వెర్షన్స్ లోనూ చేయి తిప్పుకున్న  ఈయన ప్రస్తుతం, ఎవిడ్ మాక్ 3.5  పైన పని చేస్తున్నారు. త్వరలో దీని తర్వాతి వెర్షన్ ఎవిడ్ హెచ్ డీ కీ మారనున్నారు.

          పోతే తెలుగులో మొదటిసారిగా 2- హోల్ లెన్స్ తో షూట్ చేస్తున్న ఒక సినిమాకీ ఈయనే ఎడిటర్. ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు తనయుడు హీరోగా నిర్మిస్తున్న తాజా సినిమా ఈ కొత్త లెన్స్ తోనే షూట్ చేస్తున్నట్టు కృష్ణారెడ్డి చెప్పారు. ఈ లెన్స్ ముడి ఫిలింని రెట్టింపు ఆదా చేస్తుందన్నారు. 


        ముడి ఫిలిం మీద ఒక ఫ్రేముకి 4 చొప్పున స్ప్రాకెట్స్ ( ప్రక్క రంధ్రాలు) వుంటాయి. ఇప్పటి వరకూ వాడుతున్న కెమెరా లెన్సులు ఇరుప్రక్కలా ఈ నాలుగు రంధ్రాల మధ్య స్థలంలో బొమ్మని చిత్రీకరిస్తున్నాయి. 2- హోల్ లెన్సు  ఇరు పక్కలా రెండు రంధ్రాల మధ్య చోటునే వాడుకుంటుంది. అంటే సగం ఫ్రేము అన్నమాట. ఒక రోల్ లో 400 అడుగుల ముడి ఫిలిం ఉంటుందనుకుంటే, ఈ కొత్త లెన్సు తో షూట్ చేస్తే 800 అడుగుల అవుట్ పుట్ వస్తుందన్న మాట. దీంతో ముడి ఫిలిం మీద వ్యయం సగానికి తగ్గుతుంది. తర్వాత డీ ఐ లో ఈ సగం ఫ్రేముల బొమ్మల్ని పూర్తి ఫ్రేముల సాధారణ స్థితికి విస్తరిస్తారు. ఎందుకంటే, థియేటర్లలో వుండే ఫిలిం ప్రొజెక్టర్లు 4 స్ప్రాకెట్స్ రన్ గలవి కాబట్టి.

          ఇదంతా వివరించిన కృష్ణారెడ్డి, ఈ రోజుల్లో ఎడిటర్ అనే వాడు నైపుణ్యాన్ని పెంచుకోక పోతే ఇంతే సంగతులన్నారు. ప్రేక్షకులు ఎడిటింగ్ మీద కూడా కామెంట్స్ చేసేస్తున్నారన్నారు. పూర్వం మద్రాసులో డాక్టర్ డి రామానాయుడు దగ్గర పని చేస్తున్నప్పుడు, ఆయన ఆంధ్రా వెళ్ళి సినిమాలు చూసి రమ్మని పంపించేవారట కృష్ణారెడ్డిని. అలా ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమాలు చూస్తున్నప్పుడు- ఆ ప్రేక్షకులు ఎడిటింగ్ ని ఉద్దేశించి- ‘భలేగా కుట్టా డ్రోయ్!’ అని కేరింతలు కొట్టేవాళ్లట అప్పట్లోనే!  

డిజాల్వ్
  ‘ ఫిలిమ్స్ ఆర్ మేడ్ ఆన్ టూ టేబుల్స్’  అని రాజ్ కపూర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు కృష్ణా రెడ్డి- ‘వన్ ఈజ్ రైటర్స్ టేబుల్, ఎనదర్ వన్ ఈజ్ ఎడిటర్స్ టేబుల్ ’ 

          మరయితే అప్పుడు స్క్రీన్ ప్లే అని దేన్ని అనుకోవాలి? ముందుగా రచయిత/ దర్శకుడు రాసుకున్నదా, లేకపోతే  ఆఖర్న ఎడిటర్ కూర్పు చేసిందా?-  అని ని కృష్ణా రెడ్డిని అడిగినప్పుడు- మొదటిది ఊహించి రాసేదనీ, అది దృశ్యరూపం లోకి వచ్చేసరికి నడకలో కొన్ని మార్పులు తప్పవన్నారు.
          ( సీనియర్ ఎడిటర్  మార్తాండ్ కె. వెంకటేష్ అయితే రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం చిత్రీకరించిన సినిమాని వరస మార్చేసి రెండు మూడు వెర్షన్స్  కూర్పు చేసి చూపిస్తారు దర్శకుడికి. కొన్ని సీన్లు ముందు వస్తేనే బావుంటాయి. కొన్ని సీన్లు తర్వాత వస్తేనే టెంపో వుంటుంది..ఇలా...అంటే,  ఆఖర్న రాయని స్క్రీన్ ప్లే రైటర్ ఎవరయ్యా అంటే ఎడిటరే అన్నమాట! )  కృష్ణా రెడ్డి విషయానికొస్తే, కథా లక్షణాలూ పాత్రల భావోద్వేగాలతో పాటు, సంభాషణల నిడివి పైనా ఎడిటర్ కి మంచు పట్టు వుండాలన్నారు.

ఫ్రీజ్ షాట్

         ఇక డిజాల్వ్, ఫెడిన్, ఫేడవుట్, ఫ్రీజ్, స్ప్లిట్ స్క్రీ న్ వంటి ఎడిటింగ్ టెక్నిక్స్, లేదా ఆప్టికల్ ఎఫెక్ట్స్ పూర్వం మాన్యువల్ గా చేయించి ఎడిటర్ కి పంపించే వారన్నారు కృష్ణా రెడ్డి. ఇప్పుడివన్నీ ఎడిటర్ దగ్గరే ఉంటున్నాయి సాఫ్ట్ వేర్ రూపంలో. అయితే ఇవి కథా స్వభావాన్ని సమన్వయం  చేసుకుంటూ కథాగమనం లో ఇమిడిపోయేట్టు వాడుకోవాలే తప్ప,  ఫ్యాషన్  కోసం దుర్వినియోగం చేయరాదని హెచ్చరించా రాయన.  

          ‘ షిప్ట్ వైప్స్ ఒక దృశ్యాన్ని పేజీలా తిప్పి మరో దృశ్యాన్ని చూపిస్తాయి. ఇలాటి వాటితో సమస్య లేదు. కానీ స్పీడ్ రాంప్స్ విషయంలో జాగ్రత్త వహించకపోతే రసభంగం కలుగుతుంది.  దృశ్యంలో ప్రశాంతంగా నడుస్తున్న నటుడు అకస్మాత్తుగా స్పీడు పెంచేసి గజిబిజిగా అడుగులేస్తున్నట్టు స్పీడ్ రాంప్ వేస్తే, అందుకనుగుణంగానే రీ రికార్డింగ్ కూడా స్పీడెక్కి ప్రేక్షకుల మూడ్ ని దెబ్బ తీస్తుంది ‘ అన్నారు.  

స్పీడ్ రాంప్
       సరే, మరైతే సస్పెన్స్ థ్రిల్లర్స్ విషయంలో ఎడిటర్ కి ఏమైనా ప్రత్యేక స్కిల్స్ వుండి  తీరాలా? 
అనడిగితే - తప్పనిసరిగా వుండి తీరాలన్నారు.  ముఖ్యంగా హ్యూమన్ సైకాలజీ తెలిసి వుండాలన్నారు. 

          ‘ ఎడిటింగ్ లో ఓ పాత్ర భయానక స్థితిని అనుభవిస్తున్న షాట్స్  ని ఎలాటి శబ్ద ఫలితాలూ జోడించి ఎడిటర్ కి అందించరు. ఎడిటింగ్ తర్వాతే జోడిస్తారు. కాబట్టి ఆ నిశ్శబ్ద షాట్స్ ని ఎడిట్ చేయాలంటే- ప్రేక్షకుల మానసిక లోకం లో కెళ్ళి అక్కడ్నించీ మేనేజ్ చేయాలి. సైలెంట్ షాట్స్ లో ఆ పాత్ర కదలికలు, మూడ్, ఫీలింగ్స్, ఏ మేరకు వుంటే ప్రభావ శీలంగా ఉంటాయో ఊహించి కట్స్ వేయాలి. థ్రిల్లర్స్, హారర్స్ కష్టమైన సినిమాలే!’ అన్నారు.

స్ప్లిట్ స్క్రీన్
          కెవి కృష్ణారెడ్డి ఒక యాక్సిడెంటల్ ఎడిటర్. 1981 లో నెల్లూరు జిల్లా మర్రిపాడు నుంచి సరాసరి మద్రాసెళ్లి  పోయి రామానాయుడి దగ్గర కెమెరా పని అడిగారు. ఖాళీ లేదు ఎడిటింగ్ లోకి వెళ్ళమన్నారు రామానాయుడు. అప్పుడు అక్కడ అప్రెంటీసుగా  చేస్తూంటే, ఇది కదా రైట్ ప్లేసూ అన్పించిందాయనకి. ఆ తర్వాత రామానాయుడు తీసిన ‘దేవత’ కి  కృష్ణారెడ్డి ఎడిటర్ గా ప్రమోటై గత పాతికేళ్ళూగా ఆయన సినిమాలకీ, ఎం ఎస్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి వంటి అగ్ర నిర్మాతలు తీసే  సినిమాలకీ పని చేస్తూ  వస్తున్నారు కొణిదల వెంకట కృష్ణా రెడ్డి.


సికిందర్
(డిసెంబర్ 2010 ‘ఆంధ్ర జ్యోతి’ సినిమా టెక్ శీర్షిక )