రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, జూన్ 2015, శనివారం

మేకప్

మేకప్ చీఫ్ కిరణ్ కుమార్
         
           టెక్నాలజీ, సాంప్రదాయ కళలు రెండూ ఒకదాని మీదొకటి ఎక్కి స్వారీ చేస్తున్నాయి. ఒక మెగాసెట్ నిర్మాణమంతా కూడా పూర్తిగా కళా దర్శకుడి ప్రతిభ కానట్టే, అందులో చాలా భాగం గ్రాఫిక్స్ సృష్టే వుంటున్నట్టే, మేకప్ కీ గ్రాఫిక్స్ తో అలాటి బలవంతపు కాపురం తప్పడం లేదా? తెర మీద కన్పించే వింత వింత ఫాంటసీ రూపాల సృష్టిలో మేకప్ పాళ్ళూ, గ్రాఫిక్స్ పాళ్ళూ ఎంతెంత? డీఐ మాటేమిటి? ఒక ఆర్టిస్టుకి మేకప్ మాన్ మేకప్ వేశాక, ఆ గెటప్ తో కెమెరామాన్ కూడా చిత్రీకరణ పూర్తి చేశాక, పోస్ట్ ప్రొడక్షన్ లో మళ్ళీ డీఐ (డిజిటల్ ఇంటర్మీడియేట్ అనే కలర్, లైటింగ్ కరెక్షన్ ప్రక్రియ) కలరిస్టు ఆ గెటప్ మీద చేయి చేసుకుంటే, ఆ మేకప్ మాన్ ఒరిజినాలిటీ అంతా ఎమవ్వాలి? ఈ సందేహాలు తీర్చుకోవడానికి మనం నవతరం మేకప్ చీఫ్ కిరణ్ కుమార్ ని కలుసుకుంటు న్నాం.. 
         

మేం మేకప్ చేసిన ఫేసుల్ని మళ్ళీ డీఐ తో సరిదిద్దుతున్నారంటే లైటింగ్ సరీగ్గా చూసుకోకుండా కెమెరా మాన్ ఏం చేస్తున్నట్టు?’ అని కిరణ్ సూటి ప్రశ్న. (తర్వాత డీఐ లో లైటింగ్ పెంచుకోవచ్చులే, తక్కువ లైటింగ్ వాడి షూటింగులో ఖర్చుతగ్గించుకుందాం భయ్యా- అనే అతితెలివి ఒకటి ఈమధ్య బాగా ప్రబలింది..) వాస్తవానికి మేకప్ విషయమై కెమెరా మాన్ మేకప్ మాన్ తో చర్చించాలనీ, కానీ ఇగోల వల్ల ఇది సాధ్యం కావడం లేదనీ బాధపడ్డారు కిరణ్. దృశ్య నేపధ్యాన్ని మెరుగుపరచేందుకే డీఐ అనేది అందుబాటులోకి వచ్చిందనీ, కానీ పనిలో పనిగా నటుల ఫేసుల మీద కూడా చేయి చేసుకుంటున్నారనీ విమర్శించారు కిరణ్. 

          కిరణ్ చెబుతున్నది నిజమే కావొచ్చు. ఈ విషయమై ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఎక్కడా ఫేసులకి డీఐ చేయడం గురించిన సమాచారం లేదు. విదేశాల్లో ఒక ఔత్సాహిక దర్శకుడు మాత్రం తను షూట్ చేసిన నటీమణి రూపం పెళుసుగా వచ్చిందనీ, దీన్ని డీఐతో సరి చేసుకోవచ్చా అని ఆక్రోశించినా కూడా స్పందించిన నాధుడు లేడు. ఐతే ఇలాటి సందర్భాల్లో మాత్రం డీఐతో కరెక్షన్స్ చేసుకో వచ్చన్నారు కిరణ్.

      సాంప్రదాయ కళలతో సహజత్వం ఉట్టి పడుతుంది. వాటి మీద టెక్నాలజీని తెచ్చి రుద్దితే మాత్రం అవి కృత్రిమమై కూర్చుంటాయి. ప్రేక్షకులు పసిగట్ట లేని మభ్య పెట్టడాలు ఎన్నో జరిగి పోతున్నాయి సినిమాల్లో. వెండితెర మీద కన్పించే వికృత రూపాలు గ్రాఫిక్స్ సృష్టే అనుకోవచ్చు ప్రేక్షకులు. కానీ కానే కాదంటారు కిరణ్. 
       అవన్నీ నిజానికి మేకప్ తొడుగులే నంటారు. వీటితో ఆయనకి హాలీవుడ్ తో అనుభవం కూడా వుంది. ‘క్రొకడైల్ – 2’, ‘పానిక్’ అనే రెండు హాలీవుడ్ సినిమాలకి షూటింగులు ఇక్కడే రామోజీ ఫిలిం సిటీలోనే జరిగినప్పుడు, హాలీవుడ్ మేకప్ టీమ్ కి టాలీవుడ్ నుంచి కిరణ్ ఎంపికయ్యారు. కిరణ్ కుమార్ తో బాటు తమిళ, హిందీ రంగాలనుంచి కూడా మరి కొందర్నితీసుకుని శిక్షణ నిప్పించి, విధులప్పగించారు సుప్రసిద్ధ హాలీవుడ్ మేకప్ నిపుణుడు సెర్జివ్ లోపెజ్.

   'క్రొకడైల్ – 2’ లో మొసలి తినేసిన మనిషి సగం శరీర భాగం, ‘పానిక్’ లో పాక్షికంగా వికృత రూపం దాల్చిన మనిషి మొహమూ వున్నాయి. ఈ రెండిటినీ ప్రిస్మాటిక్ మేకప్ అనే ప్రక్రియతో కృతిమంగా సృష్టించామన్నారు కిరణ్. దీన్నే మేకప్- ఎఫెక్స్ అని కూడా అంటారాన్నారు. మొదటి దానికైతే కృత్రిమ పేగులు, ఇతర శరీరం లోపలి భాగాలూ తాము క్రియేట్ చేసినవే అన్నారు. కిరణ్ చెప్పినదాని ప్రకారం, ఈ ప్రక్రియలో మౌల్డింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. మొసలి తినేసిన మనిషి శరీర భాగం లాంటిదే, అచ్చు ఆ పాత్ర నటిస్తున్న ఆర్టిస్టు ని పోలిన మౌల్డింగ్ ని తయారు చేస్తారు. ఇలాటివి తయారు చేసేందుకు హాలీవుడ్ లో ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీ వుంది. మనదగ్గర ఇంకా లేదు. ఇలాటి స్పెషల్ మేకప్ ఐటమ్స్ కోసం హాలీవుడ్ మీదే ఆధారపడాలి. 

           అయినా ఓ సమస్య వుంది. హాలీవుడ్ లో తయారు చేయించుకుని ఈ స్పెషల్ ఐటమ్స్ ని తెప్పించుకున్నప్పటికీ,  వాటితో ఏసీ ఫ్లోర్ లలోనే షూటింగ్ జరుపుకోవాల్సి వుంటుంది. ఏసీ లేకపోతే 
అరగంటకి మించి వీటితో షూటింగ్ జరపలేరు.

          ఈ మౌల్డ్ ని మొదట సిలికాన్ రబ్బర్ తో తయారు చేస్తారు. అది దృఢంగా  ఉండేందుకు ( హార్డ్ మదర్ మౌల్డ్) ప్లాస్టర్ లేదా ఫైబర్ గ్లాస్ తో తయారు చేసిన అచ్చం అలాటిదే తొడుగుని తొడిగిస్తారు. ఇందులోకి జిప్సమ్ ని నింపుతారు. ఇంకా చాలా చాలా సాంకేతిక ప్రక్రియలుండే ఈ ప్రిస్మాటిక్ మేకప్ చివరాఖరికి- ఆ నటి లేదా నటుడికి అమరిస్తే, అది వికృత రూపమైనా, జుగుప్సాకర దేహమైనా నిజంగా నిజమే అన్నట్టు భ్రమ కల్గిస్తాయి. అంతేగానీ ఇక్కడ ఏ గ్రాఫిక్స్ అద్భుతమూ లేదు!

‘పానిక్’ లో మేకప్
మేకప్ లో మనకూ హాలీవుడ్ కీ గల తేడాల గురించి చెప్పారు కిరణ్. హాలీవుడ్ లో హెవీ మేకప్ వేసి దాని మీద నేచురల్ షేడ్స్ ఇస్తే, మన దగ్గర ఫ్లాట్ గా మేకప్ చేస్తారు. మన హీరోయిన్లవి గ్లామర్ పాత్రలే గాబట్టి వాళ్ళ మేకప్ ఈజీ. హీరోలే రకరకాల యాక్షన్స్ తో విభిన్నంగా వుంటారు కాబట్టి ఇందులోనే మేకప్ మాన్ తన టాలెంట్ అంతా చూపెట్టుకునే అవకాశం వుంటుంది.

          మేకప్ లో సహజత్వం , కృత్రిమత్వం అనే తేడా లేమిటనే ప్రశ్నకి- ‘ఇది మంచి ప్రశ్న. ఉదయమే లేచి తయారైన మనిషి మొహం ఒకలా వుంటే, మధ్యాహ్నానికి ఆ మొహం మరోలా తయారవుతుంది. ఇలా వుంటే షూటింగ్ చేయలేం. పొద్దంతా షూటింగ్ చేసినా ఆ ఆర్టిస్టు మొహం ఏ మాత్రం చెదరకుండా కంటిన్యూటీని కాపాడడమే ఇక్కడ మేకప్ ప్రయోజనం. ఇక్కడ సహజత్వానికి అర్ధం ఇదే!’ అని వివరించారు. 

ప్రిస్మాటిక్ మౌల్డ్ 
        బాపట్లకి చెందిన కిరణ్ కుమార్ ( 32) చాలా చిన్న వయసులోనే, అంటే 1992 లోనే వచ్చేసి సినిమాల్లో చేరిపోయారు. ‘సిసింద్రీ’ కి మేకప్ అసిస్టెంట్ గా చేరి, ఆరేళ్ళ తర్వాత శ్రీహరి నటించిన ‘కుబుసం’  కి మేకప్ చీఫ్ అయ్యారు. ఇప్పటికి 57 సినిమాలు పూర్తి చేసిన ఈయన బాలీవుడ్ నటి తులిప్ జోషి కి పర్సనల్  మేకప్ మాన్ గా వుంటున్నారు. టాలీవుడ్ లో సుమంత్ కి పర్సనల్ మేకప్ మాన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ‘గోల్కొండ హై స్కూల్’ ఈయన పని చేసిన తాజా సినిమా. మేకప్ మెన్ల యూనియన్ కి సెక్రెటరీ కూడా అయిన ఈయన-  లోకల్ టాలెంట్ ని గుర్తించి అవకాశాలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.

సికిందర్
(మే, 2011 ‘ఆంధ్రజ్యోతి’- సినిమాటెక్ శీర్షిక)