రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 2, 2014

సాంకేతికం


పెళ్లంటే పరాయి డ్రెస్సులా?
కాస్టూమ్స్ డిజైనర్ మోహన్ 


ఇప్పుడు తెలుగు సినిమాల్లో డిజైనర్ పెళ్ళిళ్ళ ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా తెలుగు పెళ్ళిళ్ళలో మెహందీ అనీ, సంగీత్ అనీ ఎక్కడిదో కల్చర్ తెచ్చిపెట్టుకుని నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి కల్పిస్తున్నారు. సానియా మీర్జా పెళ్లిలో ఇవి చూశామంటే అర్థముంది. కళల్లో లాగే నేటివిటీని కూడా ఫ్యూజన్ చేసి చూపిస్తామంటే ఎలా? తెలుగు సినిమా పెళ్ళి సన్నివేశాల్లో షేర్వానీ చుడీదార్లూ, పెళ్లిపీటల మీద అప్పుడే శోభనం పెళ్లికూతురి వేషంలో హీరోయినూ కన్పిస్తే ప్రేక్షకులు తెలుగు సినిమా చూస్తున్నట్టా, లేక ఏ రాజస్థానీ వేడుకకో తరలివెళ్ళినట్టా?


కాస్ట్యూమర్లని కంపెనీకి పరిమితం చేసి, స్టార్లు తమ దుస్తుల్ని తామే నిర్ణయించుకునే కాలం ప్రారంభమయినపుడు ఇలాటివి తప్పవేమో. ఆ మధ్య ఒక హాలీవుడ్ సినిమాలో అమెరికా ప్రాంతపు కథకి, నేపథ్యంగా ఆసియా ఖండపు కొండలు కన్పించేసరికి విమర్శకులు ఖండించారు. మనకా ప్రమాణాల పట్టింపు లేదు. ఈ పూర్వ రంగంలో ప్రముఖ కాస్ట్యూమర్ అవ్వారు మోహన్‌రావు అలియాస్ మోహన్ తన వృత్తినెలా సమర్థించుకుంటారో చూద్దాం. "నా వరకూ నేను పని చేసిన సినిమాల్లో పెళ్ళి దృశ్యాల్ని మధుపర్కాలతో మన నేటివిటీలోనే చూపించాం. హీరోయిన్లకి సాధారణ తెలుపు కాటన్ చీరా జాకెట్లనే తొడిగాం. పెళ్ళి సీనుందని చెప్పి నాకొప్పజెప్పాక, ఇక ఎందులోనూ ఎవరూ జోక్యం చేసుకోవడం జరగలేదు.''

జగపతిబాబు 'జాబిలమ్మ పెళ్ళి'తో ప్రారంభమై ఇప్పుడు బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' వరకూ చేరుకున్న మోహన్ ఏ కాస్ట్యూమర్ ప్రతిభయినా నేటివిటీలో ఒదిగినప్పుడే రాణిస్తుందని స్పష్టం చేశారు. అలాటి నేటివిటీకి పరాకాష్ఠ అయిన పౌరాణికాలకే ఆయనకి అవకాశాలొచ్చినప్పుడు ఇక చెప్పేదేముంది?
'పరమవీరచక్ర'లో బాలకృష్ణని ధర్మరాజుగా చూపించి మంచి మార్కులే కొట్టేశారు. దీనికి వాడిన గద, కిరీటం ఎక్కడివి? నాటి 'సీతారామకళ్యాణం'లో ఎన్టీఆర్ వాడినవే! ఆభరణాలు 'లవకుశ'లో ఎన్టీఆర్ ధరించినవే! రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో ఇవన్నీ భద్రపర్చి ఉన్నాయి. ఒక్క బొట్టు తప్ప, మిగతా దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు, చేతి వాచీలు, అవసరమైతే ఓ విగ్గు కూడా కాస్ట్యూమర్ బాధ్యతల క్రిందికే వస్తాయి. బొట్టు మాత్రం మేకప్‌మాన్‌కి దఖలుపడిన ప్రత్యేక హక్కు. ఇక పౌరాణికాల్లో గదలు, కిరీటాలు, వడ్డాణ కంకణ గింకణ గొడవంతా కాస్ట్యూమర్లదే!


ఈ విధంగా బాపు దగ్గర 'శ్రీరామరాజ్యం'కి పని చేయడం గొప్ప అదృష్టమని తన్మయం చెందారు మోహన్. బాపు వేసి ఇస్తున్న డిజైన్ల ప్రకారం కాస్ట్యూమ్స్ రూపొందిస్తున్నానన్నారు. ఇక్కడ మనం బాపులో కాస్ట్యూమ్స్ డిజైనర్‌ని కూడా చూడొచ్చు. మోహన్ ప్రయత్నిస్తున్న ఈ పౌరాణిక కళారూపం అవతలి పార్శ్వంలో 'అలా మొదలైందిఅనే ఆధునిక సక్సెస్‌ని కూడా చూడొచ్చు. ఒక దర్శకురాలి (నందినీరెడ్డి)తో తొలిసారి పనిచేసిన అనుభవ గాథ. బాలకృష్ణతో పాటు వరుణ్ సందేశ్‌కీ పర్సనల్ కాస్ట్యూమర్‌గా కొనసాగుతున్న ఆయన "కాస్ట్యూమ్ వేల్యూ ఉన్న సినిమా మహేష్‌బాబు నటించిన కౌబాయ్ సినిమా టక్కరి దొంగ'' అని చెప్పుకొచ్చారు. తను చెన్నయ్‌లో ఒక సినిమా పని ముగించుకుని వచ్చేవరకూ ఈ కాస్టూమ్స్ కోసం దర్శకుడు జయంత్ నిరీక్షించారన్నారు.

జయంత్‌తో బాటు జగపతిబాబు, నిర్మాత బూర్గులపల్లి శివరామకృష్ణ, బాపు, దాసరి, కోడి రామకృష్ణ, అరుణ్ ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులందించిన ప్రోత్సాహంతో ఈనాడు 50 సినిమాల కాస్ట్యూమర్‌గా నిలబడ్డానని చెప్పారు. 1986లో చిలకలూరిపేట నుంచి బయల్దేరి చెన్నయ్ చేరుకున్నారు మోహన్. అక్కడ కాస్ట్యూమర్‌గా ఉన్న అన్న ప్రసాద్ దగ్గర కొంతకాలం పనిచేసి, కాస్ట్యూమ్స్ కృష్ణకి అసిస్టెంట్‌గా చేరారు. తండ్రి పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్. 1992లో హైదరాబాద్ చేరుకుని ఫీల్డులో కొనసాగిన మోహన్, 1996లో 'జాబిలమ్మ పెళ్ళి'తో జగపతిబాబుకి పర్సనల్ కాస్ట్యూమర్‌గా మారారు. అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఈనాడు, చందమామ, ఘర్షణ, లవ్‌ఫరెవర్ (హిందీ) సినిమాలకు పనిచేశారు.


ప్రస్తుతం శ్రీరామరాజ్యంతో బాటు, బాలకృష్ణ మరో సినిమా, అల్లరి నరేష్, వరుణ్ సందేశ్ సినిమాలు రెండు ఆయన వస్త్రాలంకరణలో భాగమయ్యాయి. అయితే శ్రీరామరాజ్యంలో సీత పాత్ర పోషిస్తున్న నయనతారకి చెన్నయ్ నుంచి పర్సనల్ కాస్ట్యూమర్ పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 28- ప్రపంచ టైలర్లకి ఒక మహత్తర దినం. 1845లో ఇదే రోజున అమెరికాకు చెందిన ఎలియాస్ హోవ్ అనే ఆయన కుట్టు మిషన్‌ని కనిపెట్టాడు. ఆయన పేరు మీదుగా ఆ రోజు తామంతా టైలర్స్ డే జరుపుకుంటామని తెలియజేశారు మోహన్. ఆ మహానుభావుడి  పటాలు రెండు మోహన్ బిజీ  వర్క్‌షాపులో వేలాడదీసి ఉన్నాయి.

సికిందర్

(డిసెంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)