రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఫిబ్రవరి 2014, మంగళవారం


హిందీ సినిమాలు ఇంతేనా ?

హిందీ సినిమాలు కూర్చోబెట్టే విషయం తక్కువగానూ, పారితోషికాలూ బడ్జెట్లు కళ్లు చెదిరేంత మహా ఎక్కువగానూ తయారైన ప్రమాదాన్ని పసిగట్టిన సుభాష్‌ఘాయ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూ నాలుగేళ్ళు గడిపేశారు. అయినా ఏటా నూటయాభై తీస్తే నూటపాతిక ఫ్లాపయ్యే పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఏ మూకుమ్మడి ఫ్లాపులకి సినిమా రచనే కారణమని నిర్ణయించారో, ఆ స్క్రీన్‌ప్లే కోర్సులకోసం ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్ అభ్యర్థులు అయిపు లేకుండాపోయారు. మామూలుగా మూడు నెలలు, ఆరు నెలలు వుండే ఈ కోర్సుని ఏడాదిపాటు నూరిపోసినా, హిందీ సినిమాల్ని ఉద్ధరించే కథానుకథాయోధులు కాలేకపోయారు. కారణమొక్కటే కార్పొరేట్ సంస్థలు కూడా మూస ధోరణిలోమీ కథ తీసుకుంటే దర్శకత్వం వహించేదెవరు? దర్శకుణ్ణి పెట్టుకుంటే అతను తన కథే పట్టుకొస్తాడే, అప్పుడెలా?’ అని కళ్ళు తెరిపిస్తున్నారు. కార్పొరేట్ అయినంత మాత్రాన హాలీవుడ్ పద్ధతుల్ని పాటించాలని లేదు. ఇక్కడ ఫీల్డులో పాతుకుపోయిన పాత మూస భావాలతోనే అవికూడా దుకాణం తెరవాల్సిందే.

సీనియర్ రచయిత కమలేష్ పాండే కూడా హిందీ సినిమాల దుస్థితికి నేటి రచయితలే కారణమని భావిస్తారు. వీళ్ళు దర్శకులకి ఉపగ్రహాలనీ, వాళ్ళ ప్రాపకంకోసం విలువల్ని వదులుకుంటారనీ అంటారు. వాళ్ళిచ్చే డీవీడీలు చూసి, వాళ్ళు చెప్పినట్టు రాసి, ఆ స్క్రిప్టులమీద వాళ్ళ పేర్లే రాసిచ్చి, ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోయే వృత్తితత్వం తెలీని అర్భకులని కూడా అంటారు పాండే. వీళ్ళకసలు ముంబాయిలో కథలు నిండుకున్నాయని తెలీదనీ, కథలెక్కడున్నాయో ఆ గ్రామసీమలకెళ్ళలేరనీ నిందిస్తారు. కానీ పాండే తన కాలంలో వుండి మాట్లాడుతున్నట్టుంది. ఆ కాలంలో రచయితలకి బ్రాండ్ నేమ్ వుండేది. కమలేష్ పాండే, సలీం-జావేద్, రాహీ మసూంరాజా, రాబిన్ భట్... వీళ్ళ కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలతో సబ్జెక్టులు తెరకెక్కేవి. ఇప్పుడవన్నీ దర్శకులేసుకుంటారు. రచయిత ఫిలిం ఇనిస్టిట్యూట్ పట్టా పొందినా, అనామకంగా దర్శకుల కొలువుల్లో చోటు సంపాదించుకోవాల్సిందే. ఫిలిం ఇనిస్టిట్యూట్ భాష మాట్లాడకుండా, అక్కడ నేర్చుకున్న శాస్త్రంకూడా మర్చిపోయి, సొంత కథా కాకరకాయా పక్కనపెట్టి, చెప్పింది రాసిపెట్టాల్సిందే. సొంత కథతో రచయిత అన్పించుకోవాలంటే తనే దర్శకుడవ్వాలి తప్ప మరో మార్గంలేదు. కమలేష్ పాండే లాంటి సీనియర్లకి ఇంకా సాగుతూండవచ్చు. తనింకా మూడు పెద్ద సినిమాలకీ, రెండు చిన్న సినిమాలకీ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ అదే ఐడెంటిటీ నిలబెట్టుకోవచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు కొత్త రచయితలకెక్కడిది. అలాంటప్పుడు అసలు సొంత టాలెంట్‌నే బయటపెట్టుకోలేని వీళ్ళు, హిందీ సినిమాల దుస్థితికి కారకులెలా అవుతారు. తమ కథే బాగాలేనప్పుడు గ్రామసీమలకెళ్ళి ఏం వెతుక్కుంటారు. అసలు గ్రామసీమల కథలు ఇప్పుడు చూసే హిందీ ప్రేక్షకులున్నారా?

నాటి ప్రసిద్ధ హీరో వినోద్‌ఖన్నా అయితే ఇంకో అడుగు ముందుకేశారు. ఫీల్డులోకి నవలా రచయితలు రాకపోవడమే ఈ దుస్థితికి మూలకారణమని తేల్చేశారు. నవలా రచయితలు మొహమాటపడుతుంటారని, వాళ్ళని బుజ్జగించి బామాలి తీసుకురావాలనీ, అంతేగాక యూనివర్సిటీల్లో స్క్రీన్‌ప్లే కోర్సులు ప్రవేశపెట్టాలనీ డిమాండ్ చేశారు. 

ఇది చోద్యంగానే వుంటుంది వినేవాళ్లకి. నవలా రచయితలు సినిమా రచయితలెప్పుడయ్యారు. ఆర్కే నారాయణ్ తను రాసిన గైడ్నీ, గుల్షన్ నందా కటీపతంగ్నీ ఇచ్చారేమో సినిమా తీసుకోమని. ఇచ్చి తప్పుకోవాలే తప్ప ఇంకెందులోనూ చేతులు పెట్టకూడదుగా. ఎన్నారై రచయిత ఫరూఖ్ ధోన్డీ కథతో సుభాష్‌ఘాయ్ కిస్నాతీస్తున్నప్పుడు, కథా చర్చల్లో పాల్గోడానికి పిల్చి ఏం మర్యాద చేశారో, అప్పట్లో ధోన్డీ డెక్కన్ క్రానికల్ ఎడిట్ పేజీలో ఇంత పొడుగు వ్యాసం రాసుకోవాల్సి వచ్చింది. చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సమ్ ఒన్తో త్రీ ఇడియెట్స్తీసిన రాజ్‌కుమార్ హిరానీ, చేతన్ పేరు వేయకుండా రేపిన దుమారం తెలిసిందే. నవలా 

రచయితలకిస్తున్న గౌరవ మర్యాదల మాటలా వుంచితే, అసలు నవలా రచయితలు సినిమా రచనలో విఫలమవడం విశ్వవ్యాప్తంగా కన్పించే ఒక వాస్తవమే. నవలా రచన వేరు, సినిమా రచన వేరు. ప్రసిద్ధ నవలా రచయిత స్కాట్ ఫిట్జెరాల్డ్ అయినా, ‘జాస్రచయిత పీటర్ బెంచ్లే అయినా, ‘్ఫరెస్ట్ గంప్రాసిన విన్‌స్టన్ గ్రూమ్ అయినా తమ నవలల్ని సినిమాలుగా మలచడంలో విఫలమైన వాళ్ళే. ఫిట్జెరాల్డ్ తనదికాని రంగంలో విఫలయత్నంచేసి వెళ్ళిపోతే, వద్దన్నా పీటర్ బెంచ్లే జాస్స్క్రిప్టుని మూడుసార్లు రాసిచ్చి సమయం వృధాచేశారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ చివరి నిమిషంలో తనకి తెలిసిన టీవీ రచయితని పిలిపించుకుని ఏరోజు సీన్లు ఆరోజు రాయించుకోవాల్సి వచ్చింది. ఇక ్ఫరెస్ట్ గంప్తో విన్‌స్టన్ గ్రూమ్‌తో తలెత్తిన వివాద ఫలితంగా స్క్రిప్టు రాయకున్నా, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో నవలా రచయితగానైనా ఆయన పేరు ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో నవలా రచయితలకి మొహమాటాలు, వాళ్లకి బుజ్జగింపులతో ఆహ్వానాలూ జోకుకిందే లెక్కించవచ్చు. 

ఎటుతిరిగీ హిందీ సినిమాల వైఫల్యానికి నేటి రచయితలనే బాధ్యుల్ని చేస్తున్నారు. ఎలాటి బాధ్యతాయుత స్థానంలోనూ వుండని, సినిమాల జయాపజయాల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేని, ఈ అమాయకుల్ని అర్జెంటుగా సంస్కరించే పని పెట్టుకున్నారు. ఫిలిం ఇనిస్టిట్యూట్లూ, యూనివర్సిటీల్లో కోర్సులూ.. వామ్మో.. సినిమాల్ని హిట్ చేయడానికి సుశిక్షితులైన రాత పని కూలీలు ఎంతవసరం నిజంగా!
వ్యవస్థని బాగుచేయకుండా, వ్యవస్థలో నామమాత్రమైన రచయితల సంస్కరణతో ఏది బాగుపడుతుంది. హాలీవుడ్ ఇలా రచయితల వ్యవస్థని నాశనం చేసుకోలేదు, యూరప్ చేసుకుంది. 1960లలో యూరప్‌లో ఆధర్ థియరీఅనే పదాన్ని కాయిన్ చేసి, సినిమాకి నిజమైన కథకుడు దర్శకుడే, రచయితకాదని డిసైడ్ చేశారు. దీంతో అక్కడి పరిశ్రమ నిజమే కాబోలనుకుని రచయితల్ని అంటరాని వాళ్ళుగా చూడడం మొదలెట్టింది. అంతగాక ఫిలిం ఇనిస్టిట్యూట్స్‌లో స్క్రీన్‌ప్లే కోర్సుల్ని ఎత్తిపారేసింది. ఇక దర్శకులే రాసుకుని తీయడం మొదలెట్టారు. 

హాలీవుడ్‌లాగా యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా చూసే కమర్షియల్ సినిమాలు తీయలేవు. కాబట్టి అక్కడ చెల్లిపోతుంది. ఇది భారత్‌కెలా వర్తిస్తుంది. అయినా కమర్షియల్ సినిమాల కాలవాలమైన బాలీవుడ్ ప్రపంచంలో దర్శకులే రచయితలు కావడం మొదలెట్టారు. ఇది గత పదేళ్లలో వచ్చిన మార్పు. ఇక్కడ్నుంచీ రచయిత రచయితగా కథనిచ్చే హక్కుని కోల్పోయాడు. దర్శకుడు ఆ హక్కుని లాక్కున్నాడు. ఇక కమర్షియల్ సినిమాలకి నప్పని యూరప్ ఫార్ములా అమల్లో పెట్టేశారు.
తామే రాసుకుని తీస్తున్న హిందీ దర్శకులు దర్శకులుగా విఫలమవుతున్నారని కాదు, రచయితలుగా సినిమాల్ని ఫ్లాప్ చేస్తున్నారు. పాన్ సింగ్ తోమర్తీసిన తిగ్మాంశూ ధూలియా ఫస్ట్ఫా రచనకీ, సెకండాఫ్ రచనకీ సంబంధమే వుండదు. జోకర్తీసిన శిరీష్ కుందర్ మొత్తం సినిమా అంతా రాయరాక చతికిలబడ్డాడు. దీంతో సల్మాన్‌ఖాన్‌తో తెలుగు కిక్రీమేక్ అవకాశాన్ని కోల్పోయాడు. కాక్టెయిల్కి రాసి తీసి సినిమా అంతా ఏడ్పించాడు హోమీ అదజానియా. ఇలా ఎందరో.

హీరోలకీ తాము నటిస్తున్న కథల మీద పూర్తి అవగాహన వుండదు. తమ పాత్రవరకే చూసుకుని, దాన్ని హైలైట్ చేసుకోవడంకోసమే తంటాలు పడతారు. ఇలాటి హీరోలందరి సినిమాలూ ఫ్లాపవుతున్నాయి. ఒక్క అమీర్‌ఖాన్ తప్ప స్క్రిప్టుని కూలంకషంగా పరిశీలించే హీరోలు లేరు. అమీర్‌ఖాన్ తన పాత్రేగాక, ఇతర పాత్రల్నీ, మొత్తం కథనరీతుల్నీ పోస్టుమార్టం చేసి, ఒక సమంజసమైన కథాప్రపంచం సృష్టికి వొత్తిడి తెస్తాడు. తమ పాత్రల్ని మాత్రమే హైలైట్ చేసుకునే ఇతర హీరోలకి ఆ పాత్ర చిత్రణల గురించైనా అవగాహన వుండదు. దర్శకుడు ఏదో రాసుకొస్తే, అది యాక్టివ్ పాత్రా, పాసివ్ పాత్రా తెలుసుకోలేరు. పాసివ్ పాత్రల్లో నటించేసి ఫ్లాప్ చేస్తారు. నటనలో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూట్లు కూడా నటన నేర్పుతాయే తప్ప, యాక్టివ్, పాసివ్ గురించీ, పాత్ర చిత్రణల గురించీ చెప్పవు.
నిర్మాతలకి ఇదేం పట్టదు రచన విషయం దర్శకుడు చూసుకుంటాడు. నటించి హీరో అదరగొడతాడు. కాబట్టి హిట్టయి పోతుందనుకుని ఇతర వ్యవహారాలు చూసుకుంటారు. ఏదో రీమేకులతో కలిసివచ్చి సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవ్‌గన్ లాంటి ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాలు వంద కోట్లు దాటి వసూళ్లు చేసినంతమాత్రాన అంతా బాగున్నట్టు కాదు. నూటయాభైలో నూట పాతిక నుయ్యో గొయ్యో చూసుకుంటున్నాయి. రచయితలుగా మారిన దర్శకులు, నిర్మాతలు, శిష్య రచయితలూ కలిసి ఏం చేస్తూంటారో మనోజ్ త్యాగీ బాగా చెప్తారు.

 రచయిత అవుదామని బ్యాంకుద్యోగం మానేసిన త్యాగీ మాటల్లో, ప్రతీరోజూ నిర్మాతలు, దర్శకులు, రచయితలూ మీటింగులు పెట్టుకుంటారు. ఆ మీటింగుల్లో గత రాత్రి ఏమేం విదేశీ సినిమాలు చూశారో ముచ్చటించుకుంటారు. వాటిలోంచి ఏది పనికొస్తుంది. మొత్తం పనికొస్తుందా, అక్కడక్కడా ఎత్తిపోతలు చేసుకోవాలా, వాటిని ఇంకెవరయినా కాజేశారా అనే ఎజెండాతో మాఫిగా భేటీ లాంటిది పెట్టుకుంటారు. ప్రముఖ సినీ విమర్శకుడు కోమల్ నహతా ప్రకారమైతే, పనికిమాలిన స్టోరీలైన్లు, పేలవంగా అల్లుకున్న ప్లాట్లు, ఒక గ్రామర్, స్ట్రక్చరూ లేని స్క్రిప్టులతో తొంభయి శాతం సినిమాలు తీస్తున్నారు.

శిష్య రచయితల్లో సత్తావున్న వాళ్ళు వుండరని కాదు. రాంగోపాల్ వర్మతో సౌరభ్ శుక్లా, అనురాగ్ కాశ్యప్‌లున్నంతకాలం ఆయన సినిమాలు వేరు, వాళ్ళు దర్శకులుగా వెళ్ళిపోయాక వేరు. సత్తావున్న హిందీ రచయితలు కూడా తమ పేరుతో కథ ఇచ్చుకోలేని పరిస్థితులే వున్నప్పుడు దర్శకులవుతున్నారు. దర్శకుడు రచయిత అవడం, రచయిత దర్శకుడవడం అనే మ్యూజికల్ చైర్స్‌తో గమ్మత్తయిన ఆటాడుకుంటున్నారు. సీనియర్ రచయితల నిగ్రహ నిబద్ధతలు వేరు. కమలేష్ పాండేనే మీరెందుకు దర్శకుడు కాకూడదని అడిగితే-

నేను దర్శకుణ్ణి ఎందుకు కానంటే, రచయితగా నా పని ముగిసిపోలేదు. రచయితగా ఏక కాలంలో ఆరు కథల మీద పనిచేయగలను, అదే దర్శకుడ్నయితే ఒకే కథతో రెండేళ్లు ఇరుక్కుపోవాలి. అది భరించలేను. నేను చెప్పాల్సిన కథలు ఇంకా చాలా వున్నాయి, జీవితకాలం సరిపోదు. నా కథల్ని కోరుకుని వాటిని దివ్యంగా తెరకెక్కిస్తున్న దర్శకులు నాకుండగా బాధే లేదు- అంటారు పాండే. తేజాబ్, ఖల్‌నాయక్, సౌదాగర్, చాలబాజ్, దిల్, రంగ్ దే బసంతీ, ఢిల్లీ-6 మొదలయిన ముప్పయి నాలుగు హిట్సిచ్చి, ఇప్పుడు ప్రియదర్శన్ కోహినూర్’, ‘మిస్టర్ ఇండియారీమేక్, కన్సైన్‌మెంట్, లైఫ్ ఆఫ్టర్ డెత్, భైరవీ మొదలయిన సినిమాలకి పనిచేస్తున్న పాండే గురించి ఇంకా చెప్పుకోవాలంటే, నేటి రచయితలు సిగ్గుపడేలా ఎప్పటికప్పుడు స్క్రీన్‌ప్లే పుస్తకాలు, ప్రతిరోజూ స్క్రీన్‌ప్లే వెబ్‌సైట్స్, కొత్త హాలీవుడ్ సినిమాల స్క్రీన్‌ప్లేలు, హిందీ పత్రికల్లో కాల్పనిక కథలూ చదవడం వగైరా, స్క్రీన్‌ప్లే వర్క్‌షాపులకి హాజరవడం వంటి వ్యాపకాలూ పెట్టుకుని నిత్యం అప్డేట్ అవుతుంటారు.



ఇలాటి సీనియర్ రచయితలు రంగంలో లేరు. ఉన్న అమాయక శిష్య పరమాణువులకి హిందీ సినిమాల ఉన్నతికోసం చాకిరేవు పెట్టాలని ఉపన్యాసాలిస్తున్నారు. అసలు కూర్చోబెట్టి స్క్రీన్‌ప్లే పాఠాలు బోధించాల్సింది రచనలుచేస్తున్న దర్శకులకీ, పాత్రలు తెలియని హీరోలకీ, అసలేమీ తెలియని నిర్మాతలకీ.. దీంతోబాటు మాఫియా భేటీల్ని అంతం చేస్తేగానీ హిందీ సినిమాలు బాగుపడవు. ఇది చేయకుండా, హిందీ సినిమాల క్వాలిటీ గురించి బాధపడ్డం అనవసరం!


సికిందర్ 
(ఆంధ్రభూమి)