రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

కథలోంచి పలాయనం!

రివ్యూ..
పైసా 
**నాని, కేథరిన్ ట్రెసా, సిద్ధికా శర్మ, చరణ్ రాజ్, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ తదితరులు

సం గీతం : సాయి కార్తీక్,   ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్,  ఎడిటింగ్ : త్యాగరాజన్  రచన : పద్మశ్రీ, కే కే బెనర్జీ , పాత్రికేయ

నిర్మాత : రమేష్ పుప్పాల,    బ్యానర్ : ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్
రచన- దర్శకత్వం : కృష్ణ వంశీ
విడుదల :                సెన్సార్ : 'A'
***
నానీ- కృష్ణ వంశీ ల కాంబినేషన్ లో అట్టహాసంగా ప్రారంభమై విడుదల సంక్షోభా న్నెదుర్కొంటూ వచ్చిన ‘పైసా’ మొత్తానికి బాక్సాఫీసు పరీక్షకి వచ్చి నిలబడింది. దర్శకుడు కృష్ణ వంశీ ఏదో సామాజిక స్పృహతో తీసినట్టు అన్పించే ఈ ‘పైసా’, దీనికి సహజంగా ఇచ్చే షుగర్ కోటింగ్ దృష్ట్యా  ప్రేక్షకుల్ని మాయచేసి కాసేపు ఊకదంపుడు మసాలా సినిమాల మత్తు నుంచి దూరంగా, ఆలోచనాత్మక సినిమా దిశగా సంసిద్ధుల్ని చేస్తుందేమో నన్న అభిప్రాయాన్ని కల్గించింది. మరోపక్క విషయపరంగా అభ్యంతరకరంగా వున్న కారణంగా విడుదల ప్రశ్నార్ధకం కాలేదన్నదీ ఒక నిజం. ఒక సామాజిక సమస్యతో ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ భారీ కమర్షియల్ ‘జైహో’ కి సైతం ప్రేక్షకు లిచ్చిన తీర్పు గమనిస్తే, ఈ తరహా సినిమాలు సరైన అవగాహన లేకుండా తీస్తే ఇంతే సంగతులవుతాయని కూడా గమనించగలం. మరి ఈ కోవలో ‘పైసా’ ఎటువైపు నిలబడింది- ప్రేక్షకుల వైపా, ‘జైహో’ వైపా?


‘పైసా’ ఫక్తు మాస్ కమర్షియల్ ముద్రేసుకుని చేయాలనుకున్న ఒక సోషల్ కామెంట్. ‘పిల్ల జమీందార్’ తర్వాత మరో సారి నాని మాస్ పాత్రతో ఒన్ మాన్ షో గా నడిపిన డబ్బు సినిమా. డబ్బు సినిమాలు రోడ్ మూవీస్ గానో, ఛేజ్- థ్రిల్లర్స్ గానో తప్ప, విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూనే, షుగర్ కోటింగ్ తో షోషల్ కామెంట్ గా వచ్చిన దాఖలా ఈ మధ్య కాలంలో లేదు. కృష్ణ వంశీ లాంటి ఒక  సీనియర్ దర్శకుడు, అందునా ప్రత్యేక పంథాగల సాం కేతికుడు ఇలాటి సబ్జెక్టుని డీల్ చేస్తున్నాడంటే పాతా కొత్తా అభిమానులంతా  విడుదల జాప్యానికి సంబంధించిన కారణాల కతీతంగా క్యూ కట్టేస్తారు. మరి వాళ్ళ అభిమానాన్ని నిలబెట్టుకుందా ఈ ‘పైసా’ ?

నగరాల్లో కళ్ళు చెదిరే సంపద సృష్టి జరుగుతోంది. దురదృష్ట వశాత్తూ దీనికి ఆత్మాభిమానం చంపుకుని నెగెటివ్ గా స్పందించే కళ్ళే ఎక్కువ కనబడుతున్నాయి సొసైటీలో. అలాటి ఒక జత కళ్లున్న ప్ర ‘క్యాష్’ అనబడే ప్రకాష్ అనే యూత్ కథే ఈ సినిమా. ఈ కథానాయకుడు  చివరంటా ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం!

‘కోటి’ ఆశల కుర్రాడు!
ఓల్డ్ సిటీలో షేర్వానీ లకి మోడలింగ్ చేసే ప్రకాష్ (నాని) కి బాగా డబ్బు సంపాదించు కోవాలని కోరిక వుంటుంది. కోటి రూపాయలు సంపాదించుకుంటే ఇక జీవితం సాఫీగా సాగిపోతుందనే ఆలోచనలుంటాయి. ఎక్కడ చూసినా వేల,లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల వార్తలు అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. అంత డబ్బుని ఊహించలేక పోతాడు. దుబాయి వెళ్ళిన స్నేహితుడు పంపిన డబ్బు హవాలా రూపంలో తీసుకోవడానికి వెళ్ళినప్పుడూ అక్కడ ధనరాశులు చూసి డంగై పోతాడు. ఎలాగైనా ఒక్క కోటి రూపాయలు కళ్ళ జూడాలన్న పట్టుదల పెరిగిపోతుంది.

మరో వైపు ఇతనంటే ఇష్టపడే వస్త్రాల షాపులో పనిచేసే నూర్ (కేథరిన్ ట్రెసా) వుంటుంది. ఈమె ఇష్టాన్ని వెటకారం చేస్తూంటాడు. దీన్ని కట్టుకుంటే జీవితాశయం నెరవేరదని వాదిస్తాడు. అనుకోకుండా బంజరా హిల్స్ లో నివశించే రాజకీయ నాయకుడు సన్యాసిరాజు (చరణ్ రాజ్) అల్లరి కూతురు స్వీటీ (సిద్ధికా శర్మ ) పరిచయంకావడంతో డిసైడ్ అయిపోతాడు. డబ్బున్న అమ్మాయికి వలేస్తే తక్షణం జీవితం మారిపోతుందని ప్రేమించడం మొదలెడతాడు.
ఇటు తనని తిరస్కరించాడన్న కోపంతో దుబాయి షేక్ ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిపోతుంది నూర్. 

ఇది తెలుసుకున్న ప్రకాష్ ఆ పెళ్లిని తప్పించి ఆమెని తీసుకుని పారిపోతున్న క్రమంలో ఓ కారేక్కేస్తాడు. దీంతో ఆ కారుకి సంబంధించిన ముఠా కూడా వెంటపడతారు. ఆ కార్లో యాభై కోట్ల రూపాయల హవాలా డబ్బుంటుంది. ఈ డబ్బు ఉప ఎన్నిక గెల్చి సీఎం అయ్యేందుకు పన్నిన పన్నాగంలో భాగంగా విదేశాల నుంచి తెప్పించాడు సన్యాసిరాజు.

హైజాక్ అయిన ఈ డబ్బుల కోసం హడావిడిగా ఇంకో శ్రీకాకుళం గ్యాంగునీ, ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టు( రాజారవీంద్ర)నీ రంగంలోకి  దింపుతాడు సన్యాసిరాజు. ఇంతకీ ఆ కార్లో అంత డబ్బుందని డబ్బు పిచ్చిగల ప్రకాష్ తెలుసుకున్నాడా? తెలుసుకుంటే ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ డబ్బుతో ఏం చేశాడు? నూర్ ఏమైంది? స్వీటీ సంగతేంటి?...మొదలైన ప్రశ్నలకి ఇక్కడ్నించీ మిగతా ఆట చూడాలి.


మొదటే చెప్పుకున్నట్టు ఇదంతా ఇంకో పాత్రకి అవకాశామివ్వని నానీ ఒన్ మాన్ షో. ఈ షోలో అతని నటనకి వంక పెట్టడాని కేమీ లేదు. కాకపోతే షో కూడా ఆ నటనతో పోటీ పడాలి. జవ జీవాలున్న మూడు ఘట్టాలు- గాలిపటం కోసం గలాటా, అంకెల్లో లక్ష కోట్లు రాసే కామెడీ, కారులో డబ్బు కనుగొన్నప్పటి మలుపు- ఈ మూడింట్లో అతను ప్రేక్షకుల్నుంచీ మంచి రెస్పాన్సే రాబట్టుకోగాలిగాడు. ఇలాటి ఘట్టాలు ఇంకిన్ని వుండి వుంటే ఆ ఒన్ మాన్ షిప్ కి సమగ్రత వచ్చేది.

హీరోయిన్ లిద్దర్లో కేరళ కి చెందిన కేథరిన్ ఇప్పటికే తెలుగు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. ఈమెకి నటన తెల్సు, అయితే సెకండాఫ్ లో ఈమె పాత్ర ఐపు లేకుండా పోయి ఈమె టాలెంటుకి గండి కొట్టింది. రెండో హీరోయిన్ సిద్ధికా గ్లామరారబోతకే  పనికొచ్చింది. చరణ్ రాజ్, రాజారవీంద్ర మొదలైన ప్రతినాయక పాత్రధారులు రొటీన్ నటనలతో అయ్యిందన్పించారు.

పాటలు- సంగీతం, కెమెరా, ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఏవైనా సరే సాంకేతిక హంగులు విషయపరంగా సినిమాని రంజింప జేయడం మీద ఆధారపడి వుంటాయి. విషయం గాడి తప్పినప్పుడు సాంకేతికాలు సినిమాని నిలబెట్టలేవు.

 స్క్రీన్ ప్లే సంగతులు
‘మొగుడు’  నిజంగానే హిందూ వివాహ వ్యవస్థ మీద తీసిన ఉదాత్త సినిమాయేనా? పెళ్లి వ్యవస్థ మీద సినిమా తీస్తున్నామని భావించుకుంటూ వేరే బాట పట్టిపోయిన క్రియేషనే ఇది ... వరకట్నం, విడాకులు, వేరుకాపురాలూ  లాంటి సమస్యల్లాగే – పెట్టిపోతల దగ్గర, కుటుంబ ఆచారాల దగ్గరా, పెళ్లి తంతులోనూ వచ్చేతేడాలుంటాయి.ఇలాటి ఒక తేడా గురించి తీసిన సినిమా మాత్రమే ‘మొగుడు’. దీనికి పెళ్లి వ్యవస్థతో ఎలాటి సంబంధమూ లేదు...రెండు కుటుంబాల మధ్య ఆచార వ్యవహారాల గురించి సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు- ఏది తప్పు ఏది ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల  పరిశీలనార్ధం కృష్ణ వంశీ  ఎక్కు పెట్టినట్టే. ఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగిపోయి వుంటే, ఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసి వుండేది. ఇలా కాకుండా ఆ ఆర్గ్యుమెంట్ ని ( సైద్ధాంతిక విభేదాల్ని) హింసాత్మక చర్యలకి దారితీయించి, నానా బీభత్సం సృష్టించడంతో, దీన్నాపే మరో చర్యగా చివరాఖరికి గోపీచంద్ భోరున ఏడుస్తూ చెప్పుకునే ‘గాథ’ లా తయారయ్యింది సినిమా.‘కథ’  అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, ‘గాథ’ నిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అనేసి ఉత్త స్టేట్ మెంట్ ఇచ్చేసి వదిలేస్తుంది. ఈ తేడా గుర్తించడం అవసరం.  ఆర్గ్యుమెంట్ సహిత ‘కథలే’ సినిమాలకి పనికోస్తాయే గానీ, స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే ‘గాథలు’ కాదు...

2011 లో కృష్ణ వంశీ గత సినిమా ‘మొగుడు’ ని సమీక్షిస్తూ ఈ సమీక్షకుడు ‘దర్శకులం డాట్ కాం’ లో రాసిన రివ్యూలోని భాగాలివి. ఈ ప్రస్తావన ఇక్కడెందుకంటే,  సరీగ్గా గత సినిమాలో చేసిన భారీ తప్పుని దర్శకుడు తెలుసుకోకుండానే, అదే తప్పు చేస్తూ  తర్వాతి సినిమా ‘పైసా’ తీసినందుకు!


మొగుడు’లో పెళ్లి వ్యవస్థ గురించి చెప్పాలనుకున్నట్టే, ‘పైసా’ లో డబ్బు స్వామ్యం గురించి చెప్పాలనుకుని కథ మొదలెట్టారు. తీరా ‘మొగుడు’ లో పెళ్లి వ్యవస్థతో సంబంధంలేని వ్యక్తిగత వైషమ్యా లని రగిల్చి బీభత్స కాండ సృష్టించినట్టే, ‘పైసా’లోనూ ఎత్తుకెళ్ళిన డబ్బుకోసం ముఠాల వేటగా నీరుగార్చేశారు. ‘మొగుడు’లో కాన్సెప్ట్ ని వదిలేసి వ్యక్తిగత విభేదాలే సృష్టించినప్పుడు కనీసం అది కథా లక్షణాలతో కూడి వుండి, ఏదితప్పు?ఏది ఒప్పు? అన్న ఆర్గ్యుమెంట్ ని  ఎక్కుపెట్టగల్గారు. ‘పైసా’ లోనూ  కథకుండాల్సిన ఆర్గ్యుమెంట్ ని - కోటి కోసం డబ్బున్న అమ్మాయిని కట్టుకోవాలన్న ఆశయంతో స్థాపించారు. ‘మొగుడు’ లో ఈ ఆర్గ్యుమెంట్ ని కూడా సెకండాఫ్ లో వదిలేసి- సినిమాకి పనికిరాని స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే ‘గాథ’ గా మార్చేసినట్టే, ‘పైసా’ లో కూడా చివరికి ‘ఇదిగో ఇలా జరిగితే ఇలా ముగిసిందీ- అనే ‘గాథ’ గానే మార్చేశారు!

సింపుల్ గా చెప్పాలంటే, రాజకీయాల్లో డబ్బు పాత్రపై ఒక షోషల్ కామెంట్ గా ప్రారంభించిన కథని, పసలేని డబ్బు వేటగా దిగజార్చారు. సినిమా ప్రారంభించి అరగంటలో ‘కోటి కోసం డబ్బుగల అమ్మాయి’ అనే నిర్ణయంతో మొదటి అంకాన్ని చక్కగా సకాలంలో ముగించి, కథ ప్రారంభించాక- అదే కథలోంచి పలాయనం చిత్తగించారు.

హీరోకి దొరికిన, విలన్ పోగొట్టుకున్న డబ్బుకోసం డజన్ల సినిమాల్లో ఇదివరకే వచ్చేసిన యాక్షన్ సినిమాగా మార్చేశారు. ఈ యాక్షన్లోనూ రిలీఫంటూ లేక పోగా, పైపెచ్చు దాన్నొక ఉన్మాదంగా తయారుచేసి వదిలిపెట్టారు. యాభై కోట్లు దొరికిన హీరో లక్ష్యం ఏంటో ఎష్టాబ్లిష్ చెయ్యక –సినిమాకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ పోషించి ఎక్కడో ముగింపులో అసలు విషయం చెబుతూ ఉస్సూరన్పించారు.

కానీ దానికి ముందే హీరో ఆ డబ్బంతా తగుల బెట్టడం యాంటీ సెంటిమెంట్ గా మారిపోయి రసభంగం అయ్యిందన్న విషయం కూడా గమనించలేదు. సినిమాకి ఓపెన్ సీన్ –టు- సీన్ సస్పెన్స్ మాత్రమే వర్కౌట్ అవుతుందన్న ప్రాథమిక పాఠం పూర్తిగా మరిచారు. దర్శకుడు ఈ ‘కథ’ ని ‘ఇంటరాక్టివ్ స్క్రీన్ ప్లే టెక్నిక్’ తో రాసినట్టు చెప్పుకున్నారు. ప్రేక్షకుల్ని ఎక్కడెక్కడ ఎలా ఇన్వాల్వ్ చేయాలనే ప్రక్రియ ఇదని సెలవిచ్చారు. కానీ ఇంటరాక్టివ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ అనేది ఎక్కడాలేదు- ఉంటే గింటే అది టీవీ షోలకి పాశ్చ్యాత్య  దేశాల్లో వుంది. అసలు ఏ సినిమా స్క్రీన్ ప్లే అయినా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసేది గానే వుంటుంది- కొత్తగా ఇంటరాక్టివ్ అనేదేమీ వుండదు.

ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీ ని కేంద్రంగా చేసుకుని నడిపిన ఈ కథలో చూపించినట్టు,  ఇప్పుడక్కడ ఒకప్పటి ప్రసిద్ధ రెడ్ లైట్ ఏరియా ‘మెహెందీ’ లేదు. దాన్ని 1996 లోనే మూయించేశారు. అలాగే ముగింపులో ఇవ్వాలనుకున్న ట్విస్టు కోసం ఫస్టాఫ్ లో ఒక చోట వేసిన లీడ్ సీనులో చెప్పినట్టు- సంపాదనలో ఇరవై ఐదు శాతం దానమివ్వాలని  ముస్లిముల మతంలో ఎక్కడా చెప్పలేదు. రంజాన్ నాటికి ఆ  ఏడాదంతా కూడబెట్టిన మొత్తం స్థిర చరాస్థుల విలువలోంచి 2.5 శాతం జకాత్ గా ఇవ్వాల్సి వుంటుంది. సినిమాలో చూపించినట్టు పరాయి సొత్తు సొంతం చేసుకుని అందులోంచి దానమివ్వడాన్ని మతం ఒప్పుకోదు.

పాత్రోచితానుచితాలు
ఎక్కువ ప్రేక్షకాదరణ వుండే కమర్షియల్ సినిమాల్లో హీరో పాత్ర – క్యారక్టర్ గ్రాఫ్ మూడంచెలుగా వుంటుంది. వ్యక్తిగత అసంతృప్తులతో ప్రారంభమై, తన విశ్వాసాలకి సవాలుగా సాగి, ఆఖర్న తన అంతర్గత శత్రువు(అంటే-తన ‘విశ్వాసాలు’ అనుకుంటున్న రాంగ్ థింకింగ్) నీ- బహిర్హత విలన్లనీ జయించడంతో పాజిటివ్ గా మారడం!


 కానీ ఈ సినిమాలో హీరోకి ఈ జర్నీ లేదు. డబ్బుకోసం అమ్మాయిని పట్టడం అనే రాంగ్ థింకింగ్ నుంచి అతడేమీనేర్చుకోలేదు. ఎలా ప్రారంభమైన పాత్ర అలాగే ముగిసింది- వ్యక్తిగత స్వార్ధంతో. దొరికిన డబ్బు ఏం చేశాడో డొంకతిరుగుడు లెక్కలు చెప్పేకన్నా- ఆ డబ్బుని ఇన్ కం ట్యాక్స్ వాళ్ల పరం చేస్తే వాళ్ళే పది శాతం – ఐదుకోట్లు రివార్డు ఇచ్చి చట్టబద్ధత కల్పించే వారుగా- అలా లీగల్ సొమ్ముతోనే దుబాయ్ వెళ్ళిపోయే వాడుగా?

సినిమా ప్రారంభం లో కాసేపు దర్శకుడు కాన్సెప్ట్ ని షోషల్ కామెంట్ గా హడావిడి చేశాడుగానీ- దాన్నే గుర్తుంచుకుని వుంటే- కనీసం క్లైమాక్స్ లో నైనా కోట్లాది రూపాయలు వెదజల్లి అధికారంలోకి రావాలనుకునే నాయకులకి చెంప పెట్టులాంటి సందేశంతో హీరో చర్యల్ని సృష్టించేవాడు.

పక్కన చూపించే జేమ్స్ బానెట్ ‘ స్టోరీ వీల్ ‘ లోకి ఈ సినిమాలోని విషయాన్నీ, పాత్రనీ  తెచ్చి చూస్తే, ఇవి  పూర్తి అట్టడుగు స్థాయి (viii) యాంటీ ఫెయిరీ టేల్ (గాథ – కథ కాదు) కి చెంది, తన నుంచి తాను దూరమైపోయిన అసమర్ధ  పాత్రగా మాత్రమే తేల్తాయి!






   


-సికిందర్