గాథల కవలలు ఎపిసోడిక్ కథనాలు కావచ్చా? సందేహం
లేదు-గాథల కథనాలు ఎలా కథని సృష్టించలేవో, ఎపిసోడిక్ కథనాలూ కథని సృష్టించలేవు. కాబట్టి
కవలలే. మరి కమర్షియల్ సినిమాకి కావాల్సింది కథే. సృష్టించింది కథే గాకపోతే
చిత్రీకరించింది కమర్షియల్ సినిమాయే కాదు. టాలీవుడ్డే కాదు, బాలీవుడ్ సైతం ఈ
కన్ఫ్యూజన్ లో పడి మోసపోతోంది. మొన్నే ‘కింగ్డమ్’
అనే గాథతో టాలీవుడ్ మోసపోయాక, ఇప్పుడు ‘వార్ 2’ అనే ఎపిసోడిక్ కథనంతో బాలీవుడ్
మోసపోయింది. ‘వార్ 2’ కి కథ నిర్మాత ఆదిత్యా చోప్రా, స్క్రీన్ ప్లే శ్రీధర్
రాఘవన్, మాటలు అబ్బాస్ టైర్ వాలా, దర్శకత్వం అయాన్ ముఖర్జీ (బ్రహ్మాస్త్ర). ఇంతమంది
కలిసి తామేం చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. సింపుల్ గా వండుతున్న కథకి బిగినింగ్
మిడిల్ ఎండ్ లున్నాయా, కేంద్రబిందువుగా ఓ కాన్ఫ్లిక్ట్ వుందా, ఆ కాన్ఫ్లిక్ట్ ని
జయించే గోల్ తో ప్రధాన పాత్రలున్నాయా అన్న సోయి లేకుండా ఏమేమో చేసుకుంటూ పోయారు. విడివిడి
ఎపిసోడ్లతో పది దేశాల్లో యాక్షన్ సీన్స్ తీసి చూపిస్తూ పోతే అది టూరిజం వీడియో
అవుతుందని తెలుసుకోలేకపోయారు. అలనాడెప్పుడో (1973) తమిళంలో ఎమ్జీఆర్ నటించిన హిట్ ‘ఉలగం సుట్రుం వాలిబన్’ (లోకం చుట్టిన వీరుడు) లో సైంటిస్టుగా ఎమ్జీఆర్ రీసెర్చ్ పేపర్స్ ని
దేశ దేశాల్లో దాచిపెడితే వాటి కోసం విలన్లు వెంటపడతారు. ఇది కథ. కథ కోసం
దేశవిదేశాలు తిరిగింది సినిమా. కథే లేకుండా ఎక్విప్ మెంట్ వేసుకుని పది పన్నెండు
దేశాలు తిరిగితే? ఆ రోజులే నయం, వాళ్ళకి కథంటే ఏమిటో తెలుసు!
ఎపిసోడిక్ కథనాలతో వచ్చే సినిమాలెప్పుడూ గల్లంతే అవుతున్నాయి. ఆటోనగర్ సూర్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సిటిజన్, సైజ్ జీరో,
దర్బార్, పొన్నియన్ సెల్వన్ 1 వంటి అనేక సినిమాలు ఎపిసోడిక్ కథనాలతో వచ్చి
ఫ్లాపయ్యాయి. కారణం, ఎపిసోడ్ లన్నీ ఒకే కథగా కాక, విడివిడి కథలుగా వుండడం.
విడివిడి కథలు సినిమా అవదు, టీవీ షో అవచ్చు. సినిమా స్క్రీన్ ప్లే అంటేనే ఒక బిగినింగ్, ఒక మిడిల్,
ఒక ఎండ్ అంటూ వుంటూ, మొత్తం ఒకే కథగా వుండడం. టీవీ ఎపిసోడ్లకీ బిగినింగ్,
మిడిల్, ఎండ్ లుంటాయి, అయితే అవి ఏ ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్య - సంఘర్షణ - పరిష్కారం అనే పద్ధతిలో ఒక్కో ఎపిసోడ్ నడిచి, ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ వాటి కథ ముగిసి పోతూంటుంది. సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్యా,
దాంతో సంఘర్షణా, దానికొక పరిష్కారమూ వుంటాయి. టీవీ ఎపిసోడ్లు కథల సంపుటి అయితే, సినిమా స్క్రీన్ ప్లే ఒకే పెద్ద నవల.
2. ఎపిసోడిక్ కథనమంటే ఏమిటి?
ఎపిసోడిక్ కథనం ఎలా వుంటుందో పక్క పటం చూడండి. వరుసగా నీటి బిందెలు పెట్టినట్టు వుంటుంది. కానీ వాటిలో నీరుండదు! ఉదాహరణకి- ‘ఆటోనగర్ సూర్య’ లో డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ, ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ
సమస్యతో ఇంకో సంఘర్షణా దానికో ముగింపూ. మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ. ఇలా ఇవి నీరు (కథ) లేని బిందెలు.
‘సైజ్ జీరో’ సెకెండాఫ్ లో క్లినిక్ మీద పోరాటంతో మొదలై,హీరోయిన్ ఫ్రెండ్ కోసం ఫండ్ రైజింగ్ ఎపిసోడుగా, ప్రజలకి అవగాహన కోసం స్పోర్ట్స్ ఈవెంట్ ఎపిసోడుగా
... ఇలా తోచిన పాయింటల్లా ఎత్తుకుంటూ ఎపిసోడ్లమయంగా సాగుతూ పోయి ఎపిసోడిక్
కథనం బారిన పడిపోయింది. ఎపిసోడిక్ కథనాలతో దాక్యుమెంటరీ లుంటాయి. డాక్యుమెంటరీలు
సినిమాలు కావు. డాక్యుమెంటరీలకి పనికొచ్చే ఎపిసోడిక్ కథనాలని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని కూడా అంటారు.. ఒకటేదో సమస్యని ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం; మళ్ళీ ఇంకో సమస్యేదో ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం... ఇలా పదేపదే ప్రారంభ
ముగింపులతో ఎపిసోడ్లుగా చూపించడానికి -
సినిమా మినీ కథల సంపుటి కాదు,
ఒకే పెద్ద కథతో నవల లాంటిది.
ఇలా ఒక్కో సమస్య తీసుకుని
ఎపిసోడ్లుగా నడిపే కథనాన్ని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని కూడా అన్నారు. ఇది
ఎక్కువగా డాక్యుమెంటరీలకి పనికొస్తుంది, సినిమాలకి కాదు. విచిత్రమేమిటంటే, ఎంతో
అనుభవజ్ఞుడైన స్పీవెన్ స్పీల్ బర్గ్ కూడా ఈ ఎపిసోడిక్ కథనానికి పాల్పడి 2001 లో ‘వార్ హార్స్’ అనే ఫ్లాప్ తీయడం!
3.దీనికి
పరిష్కారమేమిటి?
70 ఏళ్ళ క్రితం 1955 లో విడుదలైన ‘దొంగరాముడు’
ఒకే తానుగా వున్న కథ మళ్ళీ మళ్ళీ మొదలైన చోటికే వస్తున్నా, ఎపిసోడిక్ కథనం బారిన పడలేదు.
ఇంటర్వెల్లో కథ తెగి మిడ్ ఫ్రాక్చర్ అవలేదు. ఇంటర్వెల్ తర్వాత కొనసాగుతున్న
పాయింటుని వదిలేసి ఇంకేదో పాయింటు నెత్తుకుని సెకండాఫ్ సిండ్రోం లో పడలేదు. ఏమిటి కారణం? ఒకే కథ, ఆ కథ చివరంటా
అన్ని అంకాల్లో అంతర్లీనంగా కొనసాగుతున్న ‘చెల్లెలి కోసం తాపత్రయం’ అనే ఒకే పాయింటు-
ఇదీ కారణం. కథని కలిపి వుంచే ఈ ‘తాపత్రయం’ అనే ఎమోషన్ లేదా సెంటిమెంటుతో వున్న
ఈ పాయింటు తెగకపోతే ఏదీ తెగదు. ఇంతకంటే మూలసూత్రం లేదు ‘దొంగ రాముడు’ లో. ఇదొక్కటి
గుర్తుపెట్టుకుంటే చాలు, ఎపిసోడిక్ కథనాలే కాదు, మిడ్ ఫ్రాక్చర్, సెకండాఫ్
సిండ్రోం ల బారిన కూడా పడవు కథలు..
4. ఎమోషన్ల
ప్రారంభ ముగింపు లేవి?
ఎమోషన్లనేవి ఒకే కథతో, అందులో
వుండే ఒకే సమస్యతో, ఆ సమస్యతో వుండే ఒకే
పోరాటంతో, ఆ పోరాటంతో వుండే ఒకే
పరిష్కారంగా వున్నప్పుడు మాత్రమే ఏర్పడతాయి. విడివిడి చిన్న చిన్న ఎపిసోడ్లు గా
నడిచే కథనంతో ఏ ఎమోషన్లూ పుట్టవు. సినిమా కథ మొత్తంలో ఎమోషన్లు పుట్టి పెరిగి
అంతమయ్యేవి మిడిల్ లోనే. బిగినింగ్ ముగిసే చోట, ప్లాట్ పాయింట్ వన్ లో,
కాన్ఫ్లిక్ట్ వల్ల పుట్టే ఎమోషన్లు, అక్కడ్నించీ సంఘర్షణ కారణంగా మిడిల్ అంతటా
పుంజుకుంటూ, మిడిల్ ఆఖర్లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, కాన్ఫ్లిక్ట్ కి
పరిష్కారమార్గం దొరకడంతో పూర్తవుతాయి ఎమోషన్లు. అక్కడినించే ఎండ్ క్లయిమాక్స్ లో
విజయం తాలూకు ఎమోషన్లతో వెళ్ళి ముగుస్తుంది కథ,
అంటే కథ తాలూకు ఎమోషన్లు
రాజ్యమేలేది మిడిల్ లోనే. రెండు గంటల
సినిమా వుందంటే మధ్యలో గంట ఎమోషన్లే వుంటాయి. అప్పుడే కథలో లీనమవ గలుగుతాం. కథకి
ఆత్మ (సోల్) కూడా ఇదే. అసలు కథ వుండేది కూడా మిడిల్లోనే. ఇదంతా స్ట్రక్చర్ పట్ల
ఆసక్తి వుంటే తెలుస్తుంది. లేకపోతే ఓటి
బిందేలవుతుంది సినిమా. దొర్లుకుంటూ ఫ్లాప్ లో పడుతుంది! బిందెలు వదిలేసి నిర్మాత,
దర్శకుడు, హీరో తలో దిక్కు పారిపోతారు.
5. ‘వార్ 2’ ఎపిసోడిక్ కథనం
1. కబీర్ ధలీవాల్ (హృతిక్ రోషన్) అంతర్జాతీయ కిరాయి సైనికుల కాంట్రాక్టర్స్ కి ఫ్రీలాన్స్
కిరాయి సైనికుడిగా పనిచేస్తూంటాడు. జపాన్ లో ఒక గ్యాంగ్ స్టర్ ని నిర్మూలించిన
తర్వాత , డబ్బు వసూలు చేసుకోవడానికి బెర్లిన్ లో
కంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ కాంట్రాక్టర్ అతడ్ని మత్తు మందుతో స్పృహ
పోగొట్టి ఇండియాకి తరలిస్తాడు. ఇండియాలో
కలి కార్టెల్ ముందుంటాడు. ఈ కలి కార్టెల్
అనేది ఇండియా, రష్యా, చైనా మొదలైన దేశాలకి చెందిన సభ్యులతో కూడిన శక్తివంతమైన
క్రైం సిండికేట్. ఇది భారత ప్రభుత్వంలోకి చొరబడి నియంత్రించాలని లక్ష్యంగా
పెట్టుకుంది. ఓ రెండేళ్ళ క్రితం ‘రా’ చీఫ్ కల్నల్ సునీల్ లూత్రా (ఆశుతోష్ రాణా)
కార్టెల్ లోకి కోవర్టుగా ప్రవేశపెట్టడానికి కబీర్ ని ప్రయోగించాడని తెలీక, కార్టెల్
కబీర్ ని చేర్చుకుంటూ ఓ విశ్వాస పరీక్ష పెడుతుంది. ‘రా’ చీఫ్ లూత్రాని చంపమంటుంది.
డైలమాలో పడ్డ కబీర్ ఇక తప్పక తన బాస్ లూత్రా ని చంపి కార్టెల్ పట్ల విధేయతని
చాటుకుంటాడు.
2. కబీర్ ని యెమెన్ లో వ్యాపారవేత్త గౌతమ్
గులాటిని కలవడానికి పంపిస్తుంది కార్టెల్. ఇటు కబీర్ లూత్రాని చంపుతున్న
దృశ్యాలు ‘రా’కి చేరతాయి. ఇప్పుడు మాజీ ‘రా’ కొత్త చీఫ్ గా విక్రాంత్ కౌల్ (అనిల్
కపూర్) నియమితుడవుతాడు. మరణించిన లూత్రా కుమార్తె వింగ్ కమాండర్ కావ్య (కియారా అద్వానీ) కబీర్
మాజీ ప్రేమికురాలు. కబీర్ ని ట్రాక్ చేయడానికి నియమించిన బృందంలో ఈమె కూడా
చేరుతుంది. రక్షణ మంత్రి విలాస్ రావు సారంగ్ సిఫార్సు మేరకు, స్పెషల్ యూనిట్ ఆఫీసర్
విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) ని ఈ టాస్క్ ఫోర్స్ కి నియమిస్తారు, విక్రం కబీర్ మీద పాత కక్ష ఏదో వున్నట్టు వుంటాడు. కబీర్ ని స్పెయిన్ లో
ట్రాక్ చేసి ‘రా’ బృందం అతడి మీద దాడి చేస్తారు. విక్రమ్ అతడ్నికారులో వెంటాడి,
తర్వాత ట్రైన్ మీద పట్టుకోవడానికి ప్రయత్నించి -కబీర్ ప్రమాదం లో పడుతున్న క్షణంలో
వదిలేస్తాడు.
3. కబీర్ ఉద్దేశపూర్వకంగా వదిలిన ఒక క్లూ
ఆధారంగా, విక్రమ్ అతడ్ని ఏకాంతంగా కలుసుకుని, కబీర్ కార్టెల్ లో చేరింది దాన్ని నిర్మూలించడానికేనని తెలుసుకుని అతడితో చేతులు కలుపుతాడు. ఇప్పుడు గులాటి రక్షణ మంత్రి
సారంగ్ మీద ఒత్తిడి తీసుకురావడానికి, సారంగ్ కుటుంబాన్ని హత్య చేయమని కబీర్ ని ఆదేశిస్తాడు. విమానంలో ప్రయాణిస్తున్న
సారంగ్ కుటుంబాన్ని కబీర్ ముఠాతో వెళ్ళి చంపే క్రమంలో, విక్రం తో కలిసి ముఠాని
చంపేసి, సారంగ్ కుటుంబాన్ని కాపాడతాడు. ఈ సందర్భంగా విక్రం తన చిన్ననాటి
స్నేహితుడేనని గుర్తిస్తాడు కబీర్. ఇంటర్వెల్.
4. సెకండాఫ్ లో - ఫ్లాష్ బ్యాక్. 1999 లో
ముంబాయిలో తల్లిలేని 15 ఏళ్ళ కబీర్, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అనాధవుతాడు.
విక్రం అనే కుర్రాడితో స్నేహం చేస్తాడు. కబీర్ నిదానస్తుడైతే, విక్రం ఆవేశపరుడు.
ఇద్దరూ ఒక దోపిడీ సంఘటనలో అరెస్టవుతారు. అరెస్టయ్యే ముందు పారిపోతాడు విక్రం.
మళ్ళీ అరెస్టయిన కబీర్ ని వదిలి పారిపోలేక వచ్చి లొంగి పోతాడు. ఇద్దర్నీ బాల
నేరస్థుల కేంద్రంలో కలుస్తాడు అప్పటికి ఆర్మీ మేజర్ అయిన లూత్రా. ఇక్కడి బాల
ఖైదీల్ని సైన్యంలో శిక్షణకి చేర్చుకోవడంలో భాగంగా ఇద్దర్నీ ఎంపిక చేసుకుంటాడు. శిక్షణ
పొందుతున్నప్పుడు విక్రం భావోద్వేగ మూల్యాంకనంలో ఫెయిలవుతాడు. దేశం కంటే తనని తాను
ప్రధానంగా చేసుకోవడం వల్ల సైన్యంలో చేరే అవకాశాన్ని కోల్పోతాడు. తనకంటే దేశమే
ప్రధానమన్న కబీర్ ని సైన్యంలో చేర్చుకుంటాడు లూత్రా. మన స్నేహం కోసం నాతో వచ్చేయ్
అంటాడు విక్రం. కబీర్ ఒప్పుకోడు. నువ్వు అరెస్టయినప్పుడు నీకోసం నేనొచ్చి అరెస్టవలేదా
అని ప్రశ్నిస్తాడు విక్రం. కబీర్ సైన్యంలో అవకాశాన్ని వదిలి రాలేనని ఖచ్చితంగా
చెప్పడంతో, విశ్వాసం లేని అతడ్ని నిందించి వెళ్ళిపోతాడు విక్రం. అప్పట్నుంచి కక్ష
పెంచుకుని వుంటాడు.
5. ప్రస్తుతానికొస్తే- కబీర్ గులాటీని అబుధాబికి
తీసికెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తాడు. విక్రం అడ్డుపడి గులాటీని తను చంపేసి ‘రా’
దృష్టిలో కబీర్ ని గులాటీ హంతకుడుగా చిత్రిస్తాడు. విక్రం కార్టెల్ కోసం పని
చేస్తున్న డబుల్ ఏజెంట్ అని తెలుసుకుంటాడు కబీర్.
6. గులాటీ హత్య కబీర్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కావ్యకి అనుమానాలు
కలిగిస్తుంది. కబీర్ కావ్యాని కలుసుకుని
విక్రం కార్టెల్ కోసం పని చేస్తున్న డబుల్ ఏజెంట్ అనీ, కార్టెల్ అంతమొందించెందుకే
తను పని చేస్తున్నాననీ చెప్తే శాంతిస్తుంది కావ్య.
7. కావ్య సారంగ్ మీద ఎటాక్ జరగబోతోందని
హెచ్చరించే లోపే ముఠా కావ్య, కబీర్ ల మీద ఎటాక్ చేస్తుంది, సారంగ్ కూడా కార్టెల్
సభ్యుదేననీ, విక్రం కార్టెల్ లో చేరేందుకు అతనే సహకరించాడనీ తెలుస్తుంది. తను
ప్రధాన మంత్రి అయ్యేందుకు ప్రజల సానుభూతిని సంపాదిచుకోవడానికి తన కుటుంబం మీద తనే దాడి చేయించాడనీ కూడా తెలుస్తుంది.
8. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లో రక్షణ మంత్రి సారంగ్, విక్రం లు కలిసి ప్రధానమంత్రిని హత్య చేయాలని పథకం వేస్తారు. కబీర్ దీన్ని విఫలం చేసి సారంగ్ ని కాల్చి చంపి, విక్రమ్ మీద కూడా కాల్పులు జరుపుతాడు.
9. కబీర్ ని
ఎట్టి పరిస్థితిలో మట్టుబెట్టాలని ఆదేశిస్తుంది కార్టెల్. విక్రం -కబీర్ ల మధ్య
ఆఖరి పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటంలో పాత కక్షలు మరిచిపోయి ఇద్దరూ ఒకటవుతారు.
10. ఇద్దరూ ఒకటై వివిధ దేశాల్లో కార్టెల్ ని
నిర్మూలించడం మొదలెడతారు.
6.హీరోలు దేనికి? విలన్లు దేనికి?
పై కథనంలో ఎక్కడైనా కథ కనిపిస్తోందా? కేంద్ర
బిందుగా ఏదైనా కాన్ఫ్లిక్ట్ కనిపిస్తోందా? ఇద్దరు హీరోల్లో ఎవరికైనా గోల్ కనిపిస్తోందా?ఎక్కడైనా
భావోద్వేగాలు పుడుతున్నాయా? 10 సంఘటనలు. వీటిలో ఒకదానికొకటి ఏమైనా సంబంధముందా?
కార్టెల్ అనే ముఠా వుంటే, వాళ్ళు
ప్రభుత్వంలో చొరబడి నియంత్రించా లనుకున్నారు తప్ప, అలాటి దేమైనా చేశారా? పోనీ
ప్రధానిని చంపే కుట్రని సెంట్రల్ కా న్ప్లిక్ట్ గా మార్చి కథేమైనా నడిపారా? విలన్లు
ఎందుకోసమూ వుండక పోతే హీరోలు దేనికోసం వుంటారు? విక్రం చిన్నప్పటి కక్షతో కబీర్
తోనైనా కాన్ఫ్లిక్ట్ గా కథ పుట్టిందా? 1997 లో అతి పెద్ద హిట్ ‘ఫేస్ ఆఫ్’ లో కోమాలో వున్న
నికోలస్ కేజ్ మొహాన్ని తన ముఖంగా మార్చుకుని నగరంలో అతను పెట్టిన బాంబు జాడ
తీలుసుకునే ప్రయత్నంలో జాన్ ట్రవోల్టా ఓ పక్క, ఇంకో పక్క అతడికి యాంటీగా కోమా
లోంచి లేచి ట్రవోల్టా ముఖం తగిలించుకుని అల్లకల్లోలం సృష్టించే కేజ్- వీళ్ళ మధ్య
సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ గా కేజ్, ట్రవోల్టా
కొడుకుని చంపి వుండడం...ఇలా కదా త్రీ యాక్ట్స్ లో కథ వుంటుంది?? ఒకదానికొకటి సంబంధంలేని విడివిడి ఎపిసోడ్లు కథవుతుందా?
−సికిందర్
(ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి)