రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, నవంబర్ 2024, మంగళవారం

1355: స్క్రీన్ ప్లే అప్డేట్స్

 

        స్క్రీన్ ప్లే అంటే మన మానసిక లోకాన్ని వెండితెర మీద ఆవిష్కరించే రచన అని  తెలిసిందే. దీని గురించి బ్లాగులో ఇదివరకే పుష్కలంగా సమాచార ముంది. ఏమిటా మానసిక లోకం? కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్- మధ్యలో ఇగో. కనుక స్క్రీన్ ప్లే అంటే కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ ల లడాయి అని కూడా తెలిసిందే. ఎందుకిలా? ఎందుకంటే మన మనసులో నిత్యం ఈ రెండూ సంఘర్షిస్తూ వుంటాయి కాబట్టి. మరి ఇగో ఏమిటి? ఇక్కడ ఇగో అంటే స్క్రీన్ ప్లేలో ప్రధాన పాత్ర. ఈ ఇగో మన మనసులో ఎక్కడ వుంటుంది? కాన్షస్ మైండ్ తో వుంటుంది. అది సబ్ కాన్షస్ మైండ్ జోలికి వెళ్ళాలనుకోదు. ఎందుకంటే అక్కడ చాలా బరువు బాధ్యతలుంటాయి, అంగీకరించి తీరాల్సిన జీవిత సత్యాలుంటాయి. వాటితో సంఘర్షణ లుంటాయి. ఇదంతా కోరుకోదు ఇగో. అది కాన్షస్ మైండ్ లోనే జీవితం పట్ల బాధ్యత లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఒకానొక అత్యవసర/అనివార్య పరిస్థితిలో ఇక తప్పని సరై, సబ్  కాన్షస్ మైండ్ తో తేల్చుకునేందుకు సిద్ధపడుతుంది. ఇలా స్క్రీన్ ప్లేలో కూడా ప్రధాన పాత్ర కాన్షస్ మైండ్ లోంచి సబ్ కాన్షస్ మైండ్ అనే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టి, తన  వ్యతిరేక శక్తులతో పొరాడి, బాధ్యతలూ జీవిత సత్యాలూ తెలుసుకుని, పునీతమై మెచ్యూర్డ్ ఇగోగా మార్పు చెందుతుంది. తిరిగి తన సాధారణ ప్రపంచం సబ్ కాన్షస్ మైండ్ లోకి వచ్చేస్తుంది.

మన మానసిక లోకం ఆధారంగానే కథలనేవి పుట్టాయి. ఇగో గురించి కథలు. కథలన్నీ ఇగో గురించి వుండేవే. మన ఇగోని మనం చంపుకోలేం. దానికి వినాశం లేదు. పొగరుబోతు ఇగోని మెడలు వంచి మెచ్యూర్డ్ ఇగోగానే మార్చుకోగలం సుఖవంతమైన జీవితం కోసం. కనుక మంచి కథలు ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చేవిగానే వుంటాయి.

        
ఈ  కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్- ఇగో అనే త్రికోణం వెండి తెర మీద ప్లే అవడానికి స్క్రీన్ ప్లేగా, అంటే మన మానసిక లోకంగా ఎలా ఏర్పాటయ్యాయి? దీన్నే త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అంటారు. పక్క పటం చూడండి. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 లతో కూడిన  స్ట్రక్చర్. ఇందులో యాక్ట్ 1 స్క్రీన్ ప్లేలో కాన్షస్ మైండ్ పాత్ర వహిస్తే, యాక్ట్ 2  సబ్ కాన్షస్ మైండ్ పాత్ర పోషిస్తుంది. ఇక యాక్ట్ 3 వచ్చేసి ఈ రెండిటి ఉపసంహారం. యాక్ట్ 1 లో పాత్ర, దాని పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా, పాత్రకి సమస్య ఏర్పాటూ వుంటాయి. సమస్య ఏర్పాటయిన యాక్ట్ 1 ముగింపుని ప్లాట్ పాయింట్ 1 అంటారు. అంటే పాత్రకి ఇక్కడ గోల్ ఏర్పాటయ్యిందన్న మాట. సమస్యని పరిష్కరించాల్సిన గోల్. ఈ పాత్ర ఇగోకి ప్రతీక అన్నాం. ఇగో నివాస కేంద్రం కాన్షస్ మైండ్. కాబట్టి  యాక్ట్ 1 లో అది బాధ్యత లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటుంది. యాక్ట్1 లో చాలా సినిమాల్లో హీరో ఆవారాగా తిరిగేది ఇందుకే. ప్లాట్ పాయింట్ 1 దగ్గర సమస్య  ఎదురైనప్పుడు, ఇక ఆవారాగా తిరగడం ఆపి సమస్యతో పోరాటం మొదలెడుతుంది.

    ఈ పోరాటం జరిగేది యాక్ట్ 2 లో, అంటే సబ్ కాన్షస్ మైండ్ మైండ్ లో. పాత్రకి ఎదురైన సమస్యకి కారణమైన ఒక పరిస్థితితోనో, లేదా ప్రత్యర్ధి పాత్రతోనో పోరాడుతుంది. ఇలా కాన్షస్ మైండ్-వచ్చేసి సబ్ కాన్షస్ మైండ్ తో తలపడుతోంది కాబట్టి ఈ సంఘర్షణని కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ ల లడాయి అన్నాం.  లేదా కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే. ఇది యాక్ట్ 2 లో సెకండాఫ్ లో వచ్చే ప్లాట్ పాయింట్ 2 వరకూ వుంటుంది. ప్లాట్ పాయింట్ 2 నుంచి యాక్ట్ 3 మొదలై అది స్క్రీన్ ప్లేకి క్లయిమాక్సు గా వుంటుంది.
        
ఇప్పుడిందులో - సబ్ కాన్షస్ మైండ్ లో - ఇగోకి ప్రతీకైన పాత్ర ప్రయాణం ఎలా వుంటుందో చూద్దాం. ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఈ ప్రయాణం గోల్ ని సాధించడం కోసం సంఘర్షణగా ప్రారంభమవుతుంది. సమస్యని పరిష్కరించేందుకు గోల్ ని స్వీకరించాక పాత్రకి కొన్ని ఎలిమెంట్స్ తొడవుతాయి.  అవి 1 కోరిక, 2 పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4 భావోద్వేగాలు. ఈ నాల్గింట్లో గోల్ సాధించాలన్న కోరిక తప్ప మిగతా మూడూ లేకపోతే ఎట్టి పరిస్థితిలోనూ  కథలో భావోద్వేగాలనేవి పుట్టవు. భావోద్వేగాలు పుట్టక పోతే కథనం డొల్లగా వుంటుంది.

     

   
ఈ నాల్గు టూల్స్ ఎలా వుంటాయో చూద్దాం : 1. కోరిక, అంటే గోల్ ని సాధించాలన్న తీవ్ర కాంక్ష. శివ లో కాలేజీకి మాఫియా పీడా వదిలించాలన్న నాగార్జున కాంక్ష లాంటిది.  2. పణం : కోరికలు ఉత్తినే తీరవు, కొంత మూల్యం చెల్లించుకోవాల్సిందే. కనుక కోరికని తీర్చుకునేందుకు దేన్ని పణంగా పెడుతోంది పాత్ర అనేది తెలియాలి. శివ లో నాగార్జున తన అన్న కుటుంబాన్ని, తన కాలేజీ జీవితాన్నీ పణంగా పెట్టి గేమ్ మొదలెట్టాడు. 3. ఇలా ఇంత రిస్కు తీసుకుంటే తర్వాత ఎదుర్కోబోయే ప్రమాదాలతో పరిణామాల హెచ్చరిక ఏమిటో వ్యక్తం కావాలి. శివ లో నాగార్జున అన్న కూతురు ప్రమాదంలో పడబోతోందా అన్న ఆందోళన లాంటిది. ఈ పణం, పరిణామాల హెచ్చరిక లకి సంబంధించిన రెండు టూల్సూ ఏర్పాటు కావాలంటే, వీటికి సంబంధించిన చిత్రణలు యాక్ట్ 1 కథనంలో జరిగి తీరాలి. శివ యాక్ట్ 1 లో  పణం కి సంబంధించి అన్న కుటుంబంతో నాగార్జున అనుబంధం, కాలేజీ జీవితంతో అనుబంధం రెండూ చిత్రించారు. పరిణామాల హెచ్చరికకి సంబంధించి అన్న కూతురితో అనుబంధాన్ని ప్రత్యేకంగా  చిత్రించారు. ఒక మైనర్ క్యారక్టర్ ని హీరోతో అంత ప్రత్యేకంగా చూపిస్తున్నారంటే ఆ క్యారక్టర్ కి మూడుతుందనే అర్ధం. 4. పై మూడు టూల్స్ మూలంగా పుట్టేవే కథలో భావోద్వేగాలు.

        
ఇప్పుడు ఈ ప్లాట్ పాయింట్ 1 దగ్గర గోల్ ఏర్పాటులో వచ్చి చేరతాయి గత వ్యాసంలో పేర్కొన్న సిక్స్ టెక్నిక్స్ టు కంట్రోల్ సబ్ కాన్షస్ మైండ్ సంగతులు. ఆ టెక్నిక్స్ 1. విజువలైజేషన్, 2. ఆఫర్మేషన్స్, 3. యాక్షన్, 4. మెటఫర్స్, 5. రిపిటీషన్, 6. ఫోకస్.
        
ఇక్కడ గమనించాల్సిన తేడా ఏమిటంటే, పైన చెప్పుకున్న ప్లాట్ పాయింట్ 1 లో గోల్ ఎలిమెంట్స్ కి మూలాలు యాక్ట్ 1 లో ఏర్పాటవుతాయి. కానీ ఈ టెక్నిక్స్ మాత్రం ప్లాట్ పాయింట్ 1 లో ఏర్పాటయిన గోల్ తో అమల్లోకొస్తాయి.  ఇదెలాగో చూద్దాం...
        
1. విజువలైజేషన్ : 
    మన జీవితంలో సాధించాలనుకుంటున్న గోల్ ని ఎలాగెలా సాధించవచ్చో ఒక యాక్షన్ ప్లానుని మెంటల్ మూవీగా వూహించి, ముగింపులో ఎండ్ రిజల్ట్ ని చూపించాలని ఈ టెక్నిక్ చెబుతుంది. స్క్రీన్ ప్లేలో ఇలా మెంటల్ మూవీని వూహిస్తే చెప్పబోతున్న కథంతా రట్టవుతుంది. అందుకని హీరో కేవలం ఎండ్ రిజల్ట్ నే చూస్తున్నట్టు వుండాలి. గోల్ ని పూర్తిగా సాధించాక ముగింపులో ఎండ్ రిజల్ట్ ఎలా వుండబోతుందో ఆ దృశ్యం. అయితే హేపీగా ఎంజాయ్ చేస్తున్నట్టో, ఇంకేదో చేస్తున్నట్టో చూపిస్తే కథకి ముగింపు కూడా రట్టయిపోతుంది. ఇలా కాక సాంగ్ లోంచి ఒక బిట్ తీసుకుని  వూహించుకోవచ్చు. దీంతో ఆ సాంగ్ ఎప్పుడొస్తుందాని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేయొచ్చు. ఇలా వెయిటింగ్ లో పెట్టి గోల్ సాధించాక ముగింపులో ఆ పూర్తి సాంగ్ వేసి ఉత్సుకతని రేపొచ్చు. ఈ సెకెండ్ యాక్ట్ కథనంలో హీరో ఓడిపోతున్నప్పుడల్లా మోటివేషన్ కోసం ఆ సాంగ్ బిట్ ని తలచుకోవచ్చు.
        
సాంగ్ కాకపోతే, ఎండ్ రిజల్టుగా ఇంకేదైనా సింబాలిజంని వాడొచ్చు. స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షి, జలజల రాలుతున్న పూలు, ఒడ్డుకు చేరిన నావ మొదలైనవి.

2. ఫర్మేషన్స్ :
    మామూలుగా ఫలానా కోరిక నెరవేరాలని మనకి మనమే ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటాం. ఇది స్క్రీన్ ప్లేలో హీరో వర్బల్ గా పక్క పాత్రలకి చెబుతూండాలి. ఇది సాధిస్తాను... సాధించి తీర్తాను లాంటి ఉచ్చారణలు. అయితే ఫర్మేషన్స్ తో ఒక సమస్య వుంది. మన మిచ్చుకునే ఆటో సజేషన్స్ నెగెటివ్ రిజల్ట్ ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సి వుంటుంది. నాకు 10 లక్షలు కావాలి... పది లక్షలు కావాలి...అని ఫర్మేషన్ చేస్తే, టైము తీసుకుని విశ్వం ఆ 10 లక్షలు వచ్చేలా చేస్తుంది. అదెలాగో ఉదాహరణకి ఒక నిజ సంఘటన- ఒకతను ఇలాగే 10 లక్షలు కావాలని ఫర్మేషన్స్ చేశాడు. ఓ రోజు బైక్ మీద పోతూ యాక్సిడెంట్ కి గురయ్యాడు. తప్పు అతడిది కాదు, ఎదుటి వాహనం వాడిదే. ఆ యాక్సిడెంట్ లో కాలు తీసేయాల్సి వచ్చింది. అప్పుడు బంధువులు  వాహన దారుడి మీదికి గొడవకి వెళ్ళారు. ఆ వాహన దారుడు గొడవ వద్దనీ, వెంటనే 10 లక్షలకి చెక్కు రాసిచ్చాడు. కోరుకున్న 10 లక్షలు ఇలా వచ్చాయన్న మాట- నెగెటివ్ రిజల్టు చూపిస్తూ!

అందుకని దీన్ని తప్పించడానికి పాజిటివ్ ఫర్మేషన్స్ చేయాలి...నాకు 10 లక్షలు కావాలి, బదులుగా నేను నా వృత్తిలో ఫలానా వస్తువు, లేదా సేవలు అందిస్తాను అనాలి. అప్పుడు డబ్బులిచ్చి వస్తువులూ అందుకుంటారు, లేదా సేవాలూ పొందుతారు ప్రజలు. ఇలా 10 లక్షలేం ఖర్మ, 50 లక్షల దాకా అందిస్తుంది విశ్వం. కాళ్ళు విరగొట్టుకునే, కళ్ళు పోగొట్టుకునే ఖర్మ పట్టదు. ఆందరి బాగుకోసం నేనిది సాధిస్తాను... అని హీరో అంటూంటే సరిపోతుంది.


3.  యాక్షన్ :  ఓ  గోల్ సాధించాలంటే యాక్షన్ కి పూనుకోవాల్సిందే. దీనికో యాక్షన్ ప్లాన్ వుంటుంది, ట్రైనింగ్ వుంటుంది. ప్రపంచ పురాణాల్ని పరిశోధించి అవన్నీ ఒకే స్ట్రక్చర్ తో వున్నాయని గమనించిన జోసెఫ్ క్యాంప్ బెల్ దానిని వివరిస్తూ ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్ అన్న ప్రసిద్ధ గ్రంధం రాశాడు. ఈ స్ట్రక్చర్ కి మోనోమిథ్ అని పేరు పెట్టాడు. ఇందులో గోల్ కోసం హీరో పాత్ర ప్రయాణంలో వుండే 17 దశల్ని వివరించాడు. దీన్నే హీరోస్ జర్నీ అన్నాడు. ఈ హీరోస్ జర్నీ లో హీరో ఒక గోల్ తో సెకెండ్ యాక్ట్ లోకి ప్రవేశించగానే  అక్కడ యాక్షన్ ప్లాన్ వుంటుంది, ట్రైనింగ్ వుంటుంది. పురాణాల స్ట్రక్చర్ మన మానసిక లోకపు స్ట్రక్చరే. స్టార్ వార్స్ సిరీస్ సినిమాలు, ది మాట్రిక్స్’, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ఇతర సినిమాలూ ఈ స్ట్రక్చర్ ఆధారంగానే తీశారు.

  కనుక సెకండ్ యాక్ట్ యాక్షన్ జీవంతో వుండాలంటే ఆ యాక్షన్ కి ప్లాను, ట్రైనింగ్, లేదా ట్రయల్స్ వుండాల్సిందే. ఏ జానర్ కథకి ఆ తరహా ప్లాను, ట్రైనింగు, ట్రయల్స్ వగైరా. ఇంతవరకూ ఫస్ట్ యాక్ట్ కథనంతో వుండే వైబ్రేషన్స్ వేరు. హై వైబ్రేషన్సే వుండనవసరం లేదు. కానీ గోల్ తో సెకండ్ యాక్ట్ లోకి దిగాక హై వబ్రేషన్స్ అన్నవి యాక్షన్ ప్లాను, ట్రైనింగ్,  
ట్రయల్స్ వీటితో మొదలై పోవాలి. నిజ జీవితంలో ఎంజాయ్ చేస్తూ యాక్షన్  తీసుకోవాలని టెక్నిక్. ఎందుకంటే ఎంజాయ్ మెంటు అనేది హై వైబ్రేషన్స్ ని పుట్టిస్తుంది. అప్పుడా హై వైబ్రేషన్స్ విశ్వంతో కనెక్ట్ అయి గోల్ సాధన ఈజీ అవుతుంది.

మెటఫర్స్ :  సబ్ కాన్షస్ మైండ్ మన ఉద్దేశాన్ని అర్ధం జేసుకోవాలంటే మెటఫర్స్ రూపంలో సంకేతాలు చూపించాలి. అంటే సెకండ్ యాక్ట్ స్క్రీన్ ప్లే కథనంలో అక్కడక్కడా నిగూఢార్ధాలతో కూడిన సంకేతాల్ని చూపించ వచ్చు. బ్లడ్ సింపుల్ అనే సినిమాలో బార్ ముందు కూర్చుని వున్న దున్నపోతు విగ్రహం వుంటుంది. దున్నపోతు యముడి వాహనం. దీన్ని చూపించి లోపల మర్డర్ చూపిస్తారు. ఇలాటి మెటఫర్స్ యాక్షన్ కి జీవం పోస్తాయి.

 5. రిపీటీషన్ :  ఎంత సెంటు పూసి కొత్త స్క్రీన్ ప్లే తయారు చేస్తున్నా, అక్కడక్కడా పాత వాసన వచ్చేట్టు పాత సినిమాల్లోని సీన్లు రిపీట్ చేయాల్సిందే. ఈ రిపీటీషన్ ని ఇష్టపడతారు ప్రేక్షకులు.

6. ఫోకస్ :  

    మన మైండ్ గోల్ మీద ఫోకస్ తో వుండాలంటే దానికి బెనిఫిట్స్ ని చూపించాలని టెక్నిక్. గోల్ సాధిస్తే అదనంగా లోకానికేం ఇస్తారోచేస్తారో చెప్పాలి. హీరో ఈ విశాల దృక్పథంతో వుంటే ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకట్టుకుంటాడు. సుల్తాన్ లో సల్మాన్ ఖాన్ ఈవెంట్ గెలిస్తే బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయిన తన కొడుకు పేర రోగగ్రస్తులైన పిల్లలకి అవార్డు మొత్తం ఇచ్చేస్తానంటాడు. ఈ మాట అన్నాక హీరో పాత్ర చిత్రణకి బలం దానికదే వచ్చేస్తుంది.  

    'సిక్స్ టెక్నిక్స్ టు కంట్రోల్ సబ్ కాన్షస్ మైండ్ లోని టెక్నిక్స్ ని పై విధంగా స్క్రీన్ ప్లేలకి వాడుకుంటే మరింత అర్ధవంతంగా వుంటుంది. అసలు సబ్ కాన్షస్ మైండ్ ఎలా పని చేస్తుందో దాన్నుంచే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది వచ్చింది. పురాణ గాథలన్నీ మోనోమిథ్ గా సబ్ కాన్షస్ మైండ్ లో పురాణ పాత్ర చేసే ఒకే విధమైన జర్నీ అయినట్టు.

 —సికిందర్

6, నవంబర్ 2024, బుధవారం

1453 : స్క్రీన్ ప్లే సంగతులు

        మౌలికంగా ఈ మూవీని స్టోరీ ఐడియా స్థాయికి కుదించి చూస్తే ఓ సామెత స్ఫురిస్తుంది. దురాశ దుఖానికి చేటు సామెత. ఈ స్టోరీ ఐడియాతో సినిమాలు రావడం కొత్త  కాదు. చాలా వరకూ ఇవి ఆర్ధికపరమైన కథలతో కూడిన సినిమాలే అయివుంటాయి. అయితే ఏ కాలంలో ఏ ప్రేక్షకులు లక్ష్యంగా ఇలాటి సినిమాలు వస్తున్నాయన్నది ప్రశ్న. ఎందుకంటే  ఆర్ధిక నేరాల తీరు తెన్నులు కాలంతో బాటు శరవేగంగా మారిపోతున్నాయి. 30 ఏళ్ళ  క్రితం స్టాక్ మార్కెట్ తో హర్షద్ మెహతా పాల్పడిన ఆర్ధిక నేరాలు వాటి తీరు తెన్నులతో ఆ కాలంలో సంచలనం. 1992 నాటి ఇండియన్ సెక్యూరిటీస్ స్కామ్ లో అతను దోషిగా నిర్ధారణ అయ్యాడు. అతడి కథతో ఇది వరకే 8 సినిమాలు, సిరీసులు వచ్చాయి. ఇటీవలే స్కామ్ 92- ది హర్షద్ మెహతా స్టోరీ అనే బయోగ్రాఫికల్ ఫైనాన్షియల్ థ్రిల్లర్ వచ్చింది. ప్రతీక్ గాంధీ హర్షద్ మెహతాగా నటించాడు. కనుక సహజంగానే ఇవి పీరియడ్ కథలుగా వున్నాయి. 

        కానీ లక్కీ భాస్కర్  హర్షద్ మెహతా కథ కాదు. హర్షద్ మెహతా కథలోకి ఓ కల్పిత పాత్రగా హీరోని ప్రవేశపెట్టి చెప్పిన హీరో కథ. అది కూడా సెకండాఫ్ లో వచ్చే కథకి చేర్చిన కథ. దీనికోసం మొత్తం కథని 1990 ల నాటి కాలంలో పీరియడ్ కథగా స్థాపించారు. కనుక గడిచిపోయిన కాలానికి చెందిన / నాటి ప్రేక్షకులకి తెలిసిన- 30 ఏళ్ళు దాటిన ఒక పాత ఉదంతాన్ని నేటి కాలపు ప్రేక్షకులకి చూపించి -మీరూ ఇది ఫీలవ్వండని అనడం లాజిక్ అవసరం లేని కమర్షియల్ సినిమా చేసే పనే కావచ్చు. 
       
ఎందుకంటే బ్యాంకింగ్ - స్టాక్ మార్కెట్ స్కాములతో నేటి కాలపు ఇన్వెస్టర్లు / ప్రేక్షకులు ఎదుర్కొంటున్న అనుభవాలు పూర్తిగా వేరు. 30 ఏళ్ళ నాటి అనుభవాలతో సంబంధం లేదు. ఇటీవల ఒక కార్పొరేట్ దిగ్గజం పాల్పడిన భారీ స్కామ్ ని బయటపెట్టిన హిండెన్ బర్గ్ రిపోర్టుతో లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్లు కోల్పోవడం తెలిసిందే. వర్తమాన వాస్తవ పరిస్థితి ఇదైతే
, ఈ సినిమా అందిస్తున్న ఇన్ఫర్మేషన్ వేరు. వర్తమాన కాలంతో సంబంధం లేనిది.

       
రజనీ కాంత్ తాజా విడుదల
వేట్టయన్ లో నేడు ఎంట్రెన్స్ పరీక్షల పేరుతో వి ద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎడ్యూటెక్ విద్యా సంస్థల స్కామ్ ని చిత్రించాడు దర్శకుడు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందో తెలిపే సాంకేతికాలు, కిటుకులు కూడా తెలియజెప్పాడు. ఇది వర్తమానంలో విద్యార్ధులు అనుభవిస్తున్న సమస్యే కాబట్టి ఆ సాంకేతికాలు, కిటుకులూ వాళ్ళకి బాగా అర్ధమవుతాయి. కనుక ఇలాటి సామాజిక సమస్యలతో సినిమాలనేవి కేవలం ఎంటర్ టైన్మెంట్లుగా కాక ఇన్ఫోటైన్ మెంట్లుగా - అంటే ఇన్ఫర్మేషన్ తో కూడిన ఎంటర్ టైన్మెంట్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడ ప్రేక్షకుల్ని ఇన్ఫర్మేషన్ తో మభ్య పెట్టడం వుండదు.
       
అందుకని ఇప్పుడు
లక్కీ భాస్కర్  కథ విషయంలో కాలం చెల్లిన బ్యాంకింగ్- స్టాక్ మార్కెట్  గురించిన మోసాల తాలూకు సాంకేతికాల జోలికి పోకుండా, వాటిని కష్టపడి అర్ధం జేసుకునే అవసరం లేకుండా, దీని స్టోరీ ఐడియాలో మూలాన్ని పట్టుకుని  స్క్రీన్ ప్లే సంగతులు చూస్తే సరిపోతుంది. 

       
ఇది కేవలం పైన చెప్పిన సామెత ఆధారంగా హీరో పాత్ర ప్రయాణం- పరిణామ క్రమం గురించిన కథ. డబ్బు కోసం అక్రమ మార్గాలు తొక్కినవాడు ఎలా పరివర్తన చెందాడన్న కథ మాత్రమే ఇది. కనుక నేటి కాలపు ప్రేక్షకుల అనుభవంలోకి రాని నాటి కాలపు బ్యాంకింగ్- స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ ఎలా జరిగాయన్న కథనం జోలికి వెళ్ళకుండా
, కేవలం క్యారక్టర్ జర్నీ మాత్రమే చూద్దాం.

1. బిగినింగ్ విభాగం

    1990 లలో భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబాయిలో మగధ  బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తూంటాడు. ఆరువేల జీతం, కుటుంబ భారం, వూరంతా అప్పులు అతడ్ని  వూపిరి సలపనివ్వవు. కుటుంబంలో భార్య సుమతి (మీనాక్షీ చౌదరి), ఓ కొడుకు, పక్షవాతం వచ్చిన తండ్రేగాక, పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు కూడా వుంటారు. వీళ్ళందరి భారాన్ని మోస్తూ కష్టాలు పడుతూంటాడు. ఇంకోవైపు అప్పుల వాళ్ళతో అవమానాలు ఎదురవుతూంటాయి. ఇలాటి పరిస్థితుల్లో ఆశిస్తున్న ప్రమోషన్ వస్తే జీతం పెరిగి కష్టాలు తగ్గుతాయన్న నమ్మకంతో  వుంటాడు. ఐతే ఆ ప్రమోషన్ ఇంకొకరు కొట్టేయడంతో బ్యాంకు అధికారితో గొడవ పెట్టుకుని మరింత  అవమానం పాలవుతాడు.
        
ఇతడ్ని ముందు నుంచీ ఆంథోనీ (రాంకీ) అనే వ్యక్తి కలుస్తూంటాడు. ఒక సైడ్ బిజినెస్ కోసం ఎరవేస్తూంటాడు. ఇప్పుడు తన ఉద్యోగ పరిస్థితి తెలుసుకుని డబ్బు సంపాదనకి కసికొద్దీ ఆ సైడ్ బిజినెస్ కి ఒప్పుకుంటాడు భాస్కర్.

2. బిగినింగ్ విభాగం స్క్రీన్ ప్లే సంగతులు

    పై బిగినింగ్ కథనం సీబీఐ అధికారి (సాయి కుమార్) భాస్కర్ మీద విచారణకి రావడంతో మొదలవుతుంది. అంటే అప్పటికి భాస్కర్ రూ. 90, 500 జీతంతో ఏజీఎం గా ప్రమోటై వున్నాడన్న మాట.  బిగినింగ్ లో సీబీఐ అధికారి విచారణ నేపథ్యంలో, క్యాషియర్ గా భాస్కర్ గతాన్ని తల్చుకోవడం ఫ్లాష్ బ్యాకుగా పై కథనం వస్తుందన్న మాట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ కి పూర్తి కాకుండా సెకండాఫ్ ప్రారంభ సీను వరకూ సాగి ప్రెజెంట్ లో కొస్తుంది.
       
పై బిగినింగ్ వరకూ కథనంలో  టూల్స్ 1. బ్యాంకు కార్యకలాపాలతో కథా నేపథ్యం ఏర్పాటు
, 2 భాస్కర్ తో బాటు ఇతర పాత్రల పరిచయాలు, జీవితాలు, 3. అప్పులవాళ్ళ తో అవమానాలతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన జరిగి, చివరికి ఎదురు చూసిన  ప్రమోషన్ విషయంలో జరిగిన అవమానంతో అహం దెబ్బతిని, సమస్య ఏర్పాటుతో 30వ నిమిషంలో బిగినింగ్ విభాగం పూర్తవుతుంది.
       
పై 4 టూల్స్ లో మొదటి మూడూ పకడ్బందీ కథనంతో సాగి
, 4 వ టూల్ కి డీలా పడిపోయింది. 4 వ టూల్ సమస్య ఏర్పాటు అంటే హీరోకి గోల్ ఏర్పాటు అవడమే. అంటే ప్లాట్ పాయింట్ 1 ని ఏర్పాటు చేయడమే. ఇది 30వ నిమిషం లోనే  రావడం ఆలస్యం చేయకుండా బిగినింగ్ కి సరైన కాల వ్యవధినివ్వడమే.
       
కానీ ప్లాట్ పాయింట్ 1 దగ్గర గోల్ ఏర్పాటు
, ఆ గోల్ తో భాస్కర్ పలికిన మాటలూ  బలహీనంగా వున్నాయి. గోల్ ఏమిటంటే బ్యాంకు డబ్బుని అక్రమంగా వాడుకుని బయట సైడ్ బిజినెస్ చేయడం. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన గోల్ ఎలిమెంట్స్ 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. భావోద్వేగాలు.
        
1. కోరిక వరకూ బాగానే వుంది. అప్పులు కట్టేసి అవసరాలు తీర్చుకోవడం. 2. ఈ కోరిక తీర్చుకోవడానికి దేన్ని పణం గా పెడుతున్నాడు- ఉద్యోగాన్ని. కానీ దీని వూసే లేదు. ఉద్యోగం ఊడితే రోడ్డున పడే తీవ్రత వుంది పణంలో. కనుక పణం అనే ఎలిమెంట్ లోపించడంతో దాని తాలూకు ఆందోళనా కథనంలో లోపించింది.
       
3. పరిణామాల హెచ్చరిక ఎలిమెంట్ లో-
(ఈ పని చేస్తే) పోతే నా జీవితం, బాగు పడితే మొత్తం నా కుటుంబం అంటాడు. ఇందులో స్పష్టత లేదు. పోతే నా ఒక్కడి జీవితం అంటే ఏమిటి? తన ఒక్కడి జీవితమెలా పోతుంది? తన మీద ఆధారపడ్డ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఇదీ పూర్తి పరిణామాల హెచ్చరిక. ఇది తాను చెప్పక పోయినా, ఈ బిజినెస్ లో తన పార్ట్ నర్ గా వున్న బ్యాంకు ప్యూను అయినా గుర్తు చేయాలి. అప్పుడు పరిణామాల హెచ్చరికకి సెటప్ ఏర్పాటవుతుంది. సెటప్ లేకపోవడంతో తర్వాతి కథనంలో దాని  తాలూకు పే ఆఫ్ కూడా లేదు. ఇలా పణం, పరిణామాల హెచ్చరిక అనే టూల్స్ రెండూ లేకపోవడంతో కథనంలో 4 వ టూల్ భావోద్వేగాలు కూడా లేవు. మొత్తం కలిపి ప్లాట్ పాయింట్ 1 ఏర్పాటు బలహీనంగా జరిగింది.
       
ఇక ఈ బిగినింగ్ కథనంలో భాస్కర్ కి గోల్ ని విఫలం చేసే ప్రత్యర్ధి పాత్రగా సీబీఐ అధికారి పాత్ర వుంది. ఇది  ప్లాట్ పాయింట్ 1 లో ఎదురై సంఘర్షణకి బీజం పడే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది సీబీఐ అధికారి విచారణ చేపట్టడానికి జరిగిన పూర్వ కథనం. మరి ఇతను ఎప్పుడు కథలోకొస్తాడు
? ఇంటర్వెల్లో ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాకనా? తర్వాతి కథనం చూద్దాం...

3. మిడిల్ 1 విభాగం 

    ఆ సైడ్ బిజినెస్ దుబాయి నుంచి దిగుమతయ్యే సామగ్రికి కస్టమ్స్ ఎగ్గొట్టి అమ్ముకోవడం. దీనికి పెట్టుబడి కోసం భాస్కర్ బ్యాంకు డబ్బుని దాటవేస్తూంటాడు.  డీల్ పూర్తి చేసి వాటాలు పంచుకున్నాక తిరిగి ఆ డబ్బు బ్యాంకులో పెట్టేస్తూంటాడు. ఇలా లాభాలు సంపాదిస్తూ అప్పులు తీర్చేసి, కుటుంబ అవసరాలు పూర్తి చేస్తూ కష్టాల నుంచి విముక్తి పొందుతాడు. పైగా తమ్ముడి లండన్ చదువుకి పెద్ద మొత్తం కూడా కట్టి పంపిస్తాడు. 
       
అయితే గోవాలో ఓ డీల్ పూర్తి చేసి వచ్చి
, డబ్బు తిరిగి  బ్యాంకులో పెట్టేసేందుకు వెళ్తే అక్కడ పై అధికారులు, పోలీసులూ వుండడం చూసి కంగారు పడతాడు. కానీ పోలీసులు వచ్చింది తన పై అధికారి కమీషన్ల మీద లోన్లు మంజూరు చేస్తున్నాడన్న ఆరోపణ మీద అరెస్టు చేయడానికి. దీంతో తేలికపడతాడు. ఈ పై అధికారియే తనకి ప్రమోషనివ్వకుండా అవమానించిన వాడు.  
       
ఇలా గోవా నుంచి డబ్బుతో తిరిగి వచ్చి బ్యాంకులో దొరికిపోకుండా తప్పించుకున్న భాస్కర్
, ఇక ఈ ఆట ఆపేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఏజీఎంగా ప్రమోటవుతాడు. కుటుంబం సంతోషిస్తుంది. ఈ సంతోషంలో అసలు కథ ఇప్పుడు మొదలయ్యింది అంటాడు.  దీంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

4. మిడిల్ 1 విభాగం  స్క్రీన్ ప్లే సంగతులు

    మిడిల్ 1 కథనమంటే హీరో తాను తలపెట్టిన గోల్ కోసం ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షించడం, ఒకసారి తనది, ఇంకోసారి ప్రత్యర్ధిదీ పై చేయి  కావడం. ఇలా సంఘర్షణ కొన సాగుతూ ఇంటర్వెల్లో దాని క్లయిమాక్స్ కి చేరుకుని మిడిల్ 1 విభాగం ముగియడం. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్ కథనం కాబట్టి ఇందులోకి సీబీఐ అధికారి ప్రత్యర్ధిగా రాలేదు. అలాగని ఫ్లాష్ బ్యాక్ లోనే వేరే ప్రత్యర్ధి ఎవరూ ఏర్పాటు కాలేదు. అందుకని ఇక్కడ ప్రత్యర్ధి ఎవరంటే భాస్కర్ మనస్సాక్షియే. తను చేస్తున్నది తప్పు అన్న గిల్ట్ లోపలుంది. దాని గొంతు నొక్కుతూ బ్యాంకు డబ్బుతో చెలగాట మాడుకుంటున్నాడు.
       
సాధారణంగా ఇలాటి ప్రత్యర్ధి లేని కథనాలు వాస్తవిక కథా చిత్రాల్లో వుంటాయి. కదన రంగం తాలూకు సంఘర్షణ అంతా కూడా ప్రధాన పాత్ర మానసిక లోకంలోనే వుంటుంది. తనతో తానే సంఘర్షిస్తూ వుంటుంది. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో వాస్తవిక కథా చిత్రాల కథనాలు చొరబడి రొటీన్ ని బ్రేక్ చేస్తున్నాయి. మామూలుగా కమర్షియల్ సినిమాల్లో ఒక హీరో వున్నాడంటే విలన్ కూడా వుండే ఏర్పాటు వుంటుంది. వాళ్ళిద్దరి సిగపట్లు తెరమీద ప్రత్యక్షంగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి.  ఇప్పుడు ప్రేక్షకులు కూడా మారారు. ఎప్పట్నించీ అంటే
, కోవిడ్ లాక్ డౌన్లో ఇంట్లో బందీలై ఓటీటీల్లో ఎక్కడెక్కడి సినిమాలూ చూడాల్సిన అగత్యం ఎదురవడం మొదలైనప్పట్నుంచీ. లేకపోతే తెలుగు సినిమాలు మారే ప్రసక్తే లేదు.
       
కాబట్టి మిడిల్ 1 భాస్కర్ తో ఎదురు లేకుండా ఏకపక్షంగా సాగుతూ వుంటుంది విజువల్ గా. మొదట రెండు లక్షలు బ్యాంకు నుంచి చాటుగా తరలించడం మొదలుపెట్టి పది లక్షల దాకా పోతాడు. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఇది చేసుకు పోతాడు. ఇలా సాగుతూ చివరికి గోవా వెళ్ళి ఇంకో పెద్ద డీల్ పూర్తి చేసుకుని సూట్ కేసుతో డబ్బుతో తిరిగి వచ్చేసరికి
, బ్యాంకులో పోలీసులు వుంటారు. భయపడి పోతాడు. పోలీసులూ, బ్యాంకు ఉన్నతాధికారులూ అవతల సీరియస్ గా ఏదో చర్చిస్తూ వుంటారు. వెళ్ళిపోయి క్యాష్ కౌంటర్ లో నించున్న భాస్కర్ వైపే చూసి పోలీసు అధికారికి ఏదో చెప్తాడు బ్యాంకు ఉన్నతాధికారి. పోలీసు అధికారి తన వైపు వచ్చేస్తూంటే భాస్కర్ గుండె ఝల్లు మంటుంది. దాదాపు దొరికిపోతాడనగా పోలీసు అధికారి వచ్చేసి, జరుగు!  అని గదమాయించి బయటికి వెళ్ళిపోతాడు. హమ్మయ్యా అనుకుంటాడు భాస్కర్.
       
ఇది భాస్కర్ ఆట కట్టవుతోందనే అర్ధం లో టెన్షన్ క్రియేట్ చేసే సీను. కానీ చివరికి ఉత్తుత్తి సీనుగా తేలిపోతుంది. అంటే ఫేక్ టెన్షన్ సీను. దీనికి పట్టుబడిపోతాడనే సెటప్ వుంది గానీ
, ఈ సెటప్ పే ఆఫ్ అయ్యే విషయంలో ఫెయిలయ్యింది. ఇలాటి ఫేక్ టెన్షన్ సీన్లు ఆడియన్స్ ని చీట్ చేయడం కోసం వుంటాయి.
       
ఇంతకీ పోలీసులు ఎందుకొచ్చారంటే
, కమీషన్ల మీద లోన్లు మంజూరు చేస్తున్నాడన్న ఆరోపణ మీద బ్యాంకు అధికారిని అరెస్టు చేయడానికి. ఇది పూర్తయిన తర్వాత బ్యాంకు పై అధికారి భాస్కర్ దగ్గరికొచ్చి, ఆ సూట్ కేసులో ఏముంది?’ అంటాడు. దాన్ని తెరవమంటాడు. భాస్కర్ కి మళ్ళీ టెన్షన్. కాసేపు ఈ టెన్షన్ తో తీరా సూట్ కేసు తెరిస్తే అందులో నోట్ల కట్టలుండవు, బట్టలు మాత్రమే వుంటాయి. పై అధికారి అది చూసి వెళ్ళిపోయాక ఫ్లాష్ కట్ పడుతుంది. అందులో దీనికి ముందే భాస్కర్ డబ్బు తీసి కౌంటర్ లో పెట్టేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా ఫేక్ టెన్షన్ సీనే. ముందే ఇలా  డబ్బు తీసి పెట్టేస్తే టెన్షన్ ఎందుకు పడినట్టు? టెన్షన్ తో డ్రామా ఎందుకు క్రియేట్ చేసినట్టు? స్ట్రక్చర్ లో ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ 1 సీన్లు ఇవి నిజానికి. కానీ ఫేక్ టెన్షన్ తో ఇవి సీన్లే కాకుండా పోయాయి.  కనీసం ప్లాట్ పాయింట్ 1 దగ్గర  పోతే నా ఒక్కడి జీవితం అన్న ప్రకారమైనా  నిజంగా తాను దొరికిపోయే పరిస్థితి క్రియేట్ అవ్వాలి. అందులోంచి తెలివిగా ఎలా బయటపడ్డాడో చూపించాలి. అప్పుడది రియల్ టెన్షనై ప్రకాశిస్తుంది పాత్ర. “What is character but the determination of incident, what is incident but the illumination of character” - Henry James  అని కదా పాత్ర చిత్రణ? తెలివిగా గడ్డు పరిస్థితిని దాటినప్పుడు కదా పాత్ర కలర్ఫుల్ గా షైన్ అవుతుంది? క్యారక్టర్ ఆర్క్ ఏర్పడుతుంది? యాక్టివ్ క్యారక్టర్ గా వుంటుంది?
       
    పై అధికారి వచ్చి సూట్ కేసు తెరవమన్నప్పుడు హర్ట్ అయి
, నన్నే అనుమానిస్తున్నారా సార్? అయితే మీరే ఓపెన్ చేసి చూసుకోండి అని అలిగినట్టు డబ్బున్న సూట్ కేసు చేతిలో పెట్టేస్తే ఎలా వుంటుంది? ఛాన్సు తీసుకుని పై అధికారితో ఆడుకుంటున్న డేరింగ్ మైండ్ గేమ్ గా వుండదూ? అంత పాత ఉద్యోగిని అనుమానించినందుకు పై అధికారియే ఫీలై సారీ చెప్పి వెళ్ళి పోవచ్చు కూడా. అప్పుడు ఈల వేసుకుంటూ భాస్కర్ సూట్ కేసులో డబ్బు తీసి కౌంటర్ లో పెట్టేసి, బాయ్ ని పిల్చి ఒక టీ ఆర్డర్ చేసి, కాళ్ళు బార జాపుకుని కూర్చుంటే ఎలా వుంటుంది? సరైన సెటప్ - పే ఆఫ్స్ తో రియల్ టెన్షనేనా? ఇల్యూమినేషన్ ఆఫ్ క్యారక్టరేనా? సర్రున పైకి ఎగబ్రాకిన క్యారక్టర్ ఆర్కేనా?
       
దీనికి ముందున్న ఫేక్ టెన్షన్ సీనుని రియల్ టెన్షన్ తో క్రియేట్ చేస్తే
, అప్పుడు సూట్ కేసు కోసమే పోలీసు అధికారి వచ్చేస్తే, సూట్ కేసా సార్? పదండి తీసుకొస్తాను అనేసి సూట్ కేసుతో బ్యాంకు పై అధికారి దగ్గరికి తనేవెళ్ళిపోతే ఎలా వుంటుంది? అప్పుడు బ్యాంకు అధికారిని అరెస్టు చేయించే పనిలో వున్న బ్యాంకు పై అధికారి ఆ పని పూర్తయ్యే వరకూ సూట్ కేసు తెరిపించే పనిని ఆపి వుంచొచ్చు. తర్వాత తెరవమంటే పైన చెప్పిన సెంటిమెంటల్ డ్రామాతో కొట్టొచ్చు భాస్కర్. ఈ రెండు సీన్లలో సూట్ కేసు అనేది ప్లాట్ డివైస్. అంటే అది కూడా ఒక పాత్ర. పాత్ర అన్నాక ప్లే కాకపోతే ఎలా? ఇలా ఇంటర్ వెల్ కి దారితీసే పించ్ 1 సీన్లు ఫేక్ టెన్షన్ సీన్లతో సీన్లే కాకుండా పోయాయి.
       
ఇక దీని తర్వాత ప్రమోషన్ రావడం జరిగి
, రూ. 90, 500 జీతంతో బ్యాంకు ఏజీఎంగా ప్రమోటవుతాడు. ఈ సీన్లో రియల్ టెన్షన్ వుంది. ఎలాగంటే, ఛైర్మన్ పిలుస్తున్నారని కబురొస్తుంది. ఎందుకు పిలుస్తున్నారో, ఇంకేం కొంప మునింగిందో అన్న ఫీలింగుతో భయపడుతూనే ఛైర్మన్ దగ్గరికి వెళ్తాడు. అతడి గిల్ట్ అలా ఫీలయ్యేట్టు చేస్తోంది. తీరా వెళ్తే ప్రమోషనిస్తాడు ఛైర్మన్. ఈ రియల్ టెన్షన్ సీన్లో సెటప్- పే ఆఫ్స్  థ్రిల్లింగ్ గా వున్నాయి. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మిస్సైన ప్రమోషన్ వూహించని సెటప్ అండ్ పే ఆఫ్ గా మారడంతో ఈ థ్రిల్.
       
దీంతో సమస్యలు తీరిపోయి కుటుంబం సంతోషిస్తుంది. ఈ సంతోషంలో
అసలు కథ ఇప్పుడు మొదలయ్యింది అనడంతో ఫస్టాఫ్ పూర్తవుతుంది. ఇలా ఈ ఫస్టాఫ్ బిగినింగ్, మిడిల్ 1 విభాగాల్లో భావోద్వేగాలు కరువై ఫ్లాట్ కథనం కనిపిస్తుంది. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ 1 తర్వాత కథనంలో సమస్యలొస్తే, ప్లాట్ పాయింట్ సరీగ్గా ఏర్పాటయ్యిందా లేదా చూడాలి. ఎందుకంటే ప్లాట్ పాయింట్ 1 అనేది మొత్తం స్క్రీన్ ప్లేకి మూల స్తంభం లాంటిది. అది బలహీనంగా వుంటే తర్వాత కథనం కూడా బలహీనంగానే వస్తుంది. ప్లాట్ పాయింట్ 1 లో రెండు గోల్ ఎలిమెంట్స్ మిస్సవడంతో ఈ సమస్య. వీటిని సరిదిద్దితే భావోద్వేగాలతో కూడిన సమగ్ర కథనం వస్తుంది.
       
భావోద్వేగాల్లేని మిడిల్ 1 కథనం పక్కదారులు పట్టకుండా
, ఏక సూత్రతతో సూటిగా సైడ్ బిజినెస్ గురించే సాగడంతో, సస్పెన్స్ అనే ఎలిమెంట్ ప్రధానంగా సీన్లని నడిపించింది. అందువల్ల ఫస్టాఫ్ బావున్నట్టు అనిపిస్తుంది- భావోద్వేగాలనేవి మర్చిపోతే. మరి ఇదే సస్పెన్స్ ఎలిమెంట్ సెకండాఫ్ లో కూడా అమలయ్యిందా? చూద్దాం...

5. మిడిల్ 2 విభాగం

    ఇప్పుడు కథనం ప్రెజెంట్ కి రావడంతో సీబీఐ అధికారి విచారణ సీను వస్తుంది. భాస్కర్ ఆఫీసులో భాస్కర్ బ్యాంక్ స్టేట్మెంట్లు తీయించి చూస్తాడు. ప్రతీ నెలా శాలరీ మొత్తం రూ. 90, 500 క్రెడిట్ అవుతున్నట్టు వుంటుంది (టీడీఎస్ మినహాయించకుండా ఫుల్ శా లరీ?).  కిందికొస్తే ఏకంగా రూ. 100 కోట్లు జమ అయినట్టు వుంటుంది. ఎక్కడిదీ ఇంత మొత్తం? దీంతో తిరిగి ఫ్లాష్ బ్యాక్స్ మొదలవుతాయి. ఈసారి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్. ఈ ఫ్లాష్ బ్యాక్స్ లో హర్ష మెహ్రా అనే స్టాక్ బ్రోకర్ పిక్చర్ లోకొస్తాడు.

            

ఆ రోజుల్లో ఇతర బ్యాంకుల నుంచి  సెక్యూరిటీల్ని, ఫార్వార్డ్ బాండ్లని కొనుగోలు చేయడానికి బ్యాంకులు  స్టాక్ బ్రోకర్ ద్వారా వెళ్ళే విధానం వుండేది. అలా స్టాక్ బ్రోకర్ హర్ష మెహ్రా మధ్యవర్తిగా కఠారీ బ్యాంకు బీఆర్ (బ్యాంకు రిసీట్) లతో మగధ బ్యాంకు డబ్బుని తన ఖాతాలోకి మళ్ళించుకుని సొంతంగా స్టాక్ మార్కెట్ లో షేర్ల కొనుగోళ్ళకి వాడుకుంటూ వుంటాడు. ఈ బీఆర్ లని మగధ బ్యాంకు ఏజీఎం గా భాస్కర్ ఓకే చేస్తూంటాడు. హర్ష మెహ్రా ఏజెంట్ దీనికి కొంత కమిషన్ ఇస్తూంటాడు భాస్కర్ కి. ఆ డబ్బుతో భాస్కర్ షేర్లు కొనేసి రిచ్ అవుతూంటాడు. ఈ దందా కొనసాగుతూండగా భాస్కర్ కి భార్యతో గొడవలు మొదలవుతాయి. కారణం అతడికి డబ్బు మదం బాగా తలకెక్కడం. ఎవర్నీ కేర్ చేయకపోవడం. డబ్బు లేనప్పుడే సంతోషంగా వుండే వాళ్ళమని వాపోతుంది భార్య. ఇంటా బయటా సంబంధాలు చెడిపోతాయి.

        
ఇక కఠారీ బ్యాంకు అధికారి ఏదో పనిమీద భాస్కర్ ని కలుస్తాడు. భాస్కర్ అతడికి అతను జారీ చేసిన బీఆర్ లని చూపిస్తాడు. 90 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ బీఆర్ లు తను సంతకం పెట్టినవి కావని రియాక్ట్ అవుతాడు కఠారీ బ్యాంకు అధికారి. తన సంతకం హర్ష మెహ్రా ఫోర్జరీ చేశాడని ఆరోపిస్తాడు. ఈ విషయం బయట పడితే తను ఇరుక్కుంటాడని , దీన్ని సీక్రెట్ గా వుంచమని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గుండె పోటుతో చనిపోతాడు.

6. మిడిల్ 2 విభాగం స్క్రీన్ ప్లే సంగతులు

    30 నిమిషాలు సాగే మిడిల్ 2 కథనం బ్యాంకింగ్ ఫ్రాడ్స్, షేర్ మార్కెట్ మానిప్యులేషన్స్ మొదలైన వాటి సాంకేతికాలతో, ఫస్టాఫ్ లోని సస్పెన్సు తో కాకుండా ఓ డాక్యుమెంటరీని ప్రెజెంట్ చేస్తున్నట్టు వుంటుంది. కాలం చెల్లిన ఈ టైపు మోసాలు  ఆసక్తి కల్గించక పోగా, కథనాన్ని నీరుగార్చేస్తాయి. మిడిల్ 2 కథనమంటే ఫస్టాఫ్ లోని మిడిల్ 1 సంఘర్షణకి తీవ్రత పెంచిన కొనసాగింపే.  ఇలా మిడిల్ 1, 2 లలో వుండే ప్రధాన కథ డీలా పడి, కుటుంబ గొడవలతో సబ్ ప్లాట్ మొదలవుతుంది. భాస్కర్ కి సంఘర్షణ ఇక్కడే వుంటుంది. అంతర్గతంగా మానసికంగా వున్న సంఘర్షణ ఇప్పుడు బహిర్గతంగా భౌతికంగా వుంటుంది. ఈ నేపథ్యంలో కఠారీ బ్యాంకు అధికారి రావడంతో ప్లాట్ పాయింట్ 2 కి దారితీసే పించ్ పాయింట్ 2 వస్తుంది. దీని ఫలితంగా ఆ అధికారి గుండెపోటుతో మరణించడంతో ప్లాట్ పాయింట్ 2 ఏర్పాటై మిడిల్ 2 ముగుస్తుంది.

       
ఈ కథనంలో కూడా ప్రత్యర్ధి పాత్ర లేదు. ప్లాట్ పాయింట్ 2 అంటే ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ కొలిక్కి వచ్చి పరిష్కార మార్గం దొరికే కేంద్రం. ప్రత్యర్ధి పాత్ర లేదు గనుక తనతో తానే సంఘర్షిస్తున్న భాస్కర్ కళ్ళు తెరిపించే సంఘటనగా కఠారీ బ్యాంకు అధికారి మరణం తో ప్లాట్ పాయింట్ 2 ఏర్పాటయ్యింది. పాత్ర ప్రయాణం
, పరిణామ క్రమం – దీంతో పూర్తయ్యాయి.

7. ఎండ్ విభాగం

    ఇక ముగింపుకి దారి తీసే కథనం. ఇక్కడ కఠారీ బ్యాంకు అధికారి మరణంతో భాస్కర్లో మార్పు వస్తుంది. భార్యతో, అత్తగారింటితో సంబంధాలు మెరుగు పర్చుకుంటాడు. తండ్రి కూడా జూదం లో ఎంత గొప్పగా ఆడామన్నది ముక్యం కాదనీ, ఎప్పుడు ఆపామన్నది ముఖ్యమని అనడంతో పూర్తిగా పరివర్తన చెంది డబ్బు వాళ్ళకీ వీళ్ళకీ పంచేసి ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అయితే ఈలోపు సీబీఐ అధికారి బ్లాక్ మెయిల్ చేయడంతో తిప్పికొట్టి అతడ్ని వదిలించుకుంటాడు. సీబీఐ అధికారియే కాదు, ఈ స్కామ్ లో తెర వెనుక బ్యాంకు ఛైర్మన్ సహా ఉన్నతాధికారులు కూడా వున్నారని తెలుసుకుని భాస్కర్ బ్యాంకు ఖాతాలో వున్న వంద కోట్లు తీసుకుని కుటుంబంతో బోస్టన్ పారిపోయి అక్కడ సెటిలవుతాడు.

8. ఎండ్ విభాగం స్క్రీన్ ప్లే సంగతులు

    కఠారీ బ్యాంకు అధికారి మరణంతో భాస్కర్ పరివర్తన చెందినా, దీంతో కథ ముగియకుండా- ఆ వంద కోట్లు కూడా సమాజానికి పంచెయ్యకుండా, ఆ డబ్బుతో బోస్టన్ పారిపోవడమనే ట్విస్టు కమర్షియల్ గిమ్మిక్కులు లేకుండా సహజంగా సాగుతున్న కథకి ఆర్గానిక్ ముగింపు లేకుండా చేసింది. ఉదాత్తంగా మారిన పాత్రని నక్కజిత్తుల వాడిగానే వుంచేసింది. దీన్ని జస్టిఫై చేయడానికన్నట్టు మొత్తం బ్యాంకు అధికారుల్నీ అవినీతి పరులుగా చూపించి, మాన్యుఫ్యాక్చర్ చేసిన ముగింపుతో సరిపుచ్చుకుంది కథ.

        మీరు నన్నెలా జడ్జి చేస్తారు- లక్కీ బా... ర్డ్ గానా, లక్కీ భాస్కర్ గానా?’  అంటాడు ప్రేక్షకులతో భాస్కర్ చివరికి.

—సికిందర్

(దీని మీద సందేహాలు,అభిప్రాయాలూ వుంటే
9247347511 కి వాట్సాప్ చేయొచ్చు)


26, అక్టోబర్ 2024, శనివారం

1452 : స్పెషల్ ఆర్టికల్

 

త 30 ఏళ్ళు గా న్యూ ఢిల్లీలో రామ్ వర్మ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్ ఎల్ పి) కోచ్. మన సబ్ కాన్షస్ మైండ్ మన మాట వినేట్టు ఎలా ప్రోగ్రాం చేసుకుని సత్ఫలితాలు పొందవచ్చో నేర్పే ఈ కోర్సుకి ఆయన దేశంలో మొట్ట మొదటి కోచ్. అంతే కాదు, క్యాన్సర్ సహా నయం కాని వ్యాధులు రాకుండా, వస్తే నయం చేసుకునేలా అభివృద్ది చేసిన కొత్త శాస్త్రం ఎపిజెనెటిక్  హీలింగ్ ద్వారా స్వయంగా మన జీన్స్ ని ఎలా ప్రోగ్రామింగ్ చేసుకుని ఆరోగ్యవంతులు కావచ్చో కూడా ఈ కోర్సుల్లో భాగంగా నేర్పుతాడు. తన యుక్త వయస్సులో వివిధ అనారోగ్యాలు వెంటాడి ఇక డాక్టర్లు చేతులెత్తేసిన సందర్భంలో, ఎన్ ఎల్ పి గురించిన ఓ పుస్తకం చేతిలో పడి దాని ద్వారా పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పట్నుంచీ ఈ స్వీయానుభవంతో ఎన్ ఎల్ పి నే వృత్తిగా చేసుకున్నాడు. వివిధ నగరాల్లో వర్క్ షాపులు నిర్వహించడమే గాక, ఎన్నో వీడియోలు రూపొందించాడు. యూట్యూబ్ లో ఈ వీడియోలు వందల సంఖ్యలో వుంటాయి. కాకపోతే హిందీలో వుంటాయి. ఓ మూడేళ్ళుగా ఈయన వీడియోలు గమనిస్తూంటే గత వారం ఒక వీడియో బాగా ఆసక్తి కల్గించింది...

సిక్స్ టెక్నిక్స్ టు కంట్రోల్ సబ్ కాన్షస్ మైండ్ అన్న వీడియోలో, పట్టు పగ్గాల్లేని గుర్రంలాంటి మన సబ్ సబ్ కాన్షస్ మైండ్ కి ఎలా పగ్గం వేసి అనుకున్న గోల్ (లక్ష్యం) దిశగా నడిపించి జీవితంలో విజయాలు సాధించ వచ్చో వివరించాడు. ముందుగా ఈ టెక్నిక్స్ తెలుసుకుందాం. ఇవే టెక్నిక్స్ ని సినిమా స్క్రీన్ ప్లేలకి అన్వయిస్తే కథలు మరింత అర్ధవంతంగా తయారవగలవన్న నమ్మకంతో ప్రయోగాత్మకంగా రాస్తున్న వ్యాసమిది.

    సబ్ కాన్షస్ మైండ్ (సుప్త చేతనావస్థ) ని ప్రోగ్రామింగ్ చేయకపోతే దానికదే ప్రోగ్రాం అయిపోయి జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. మానసికంగా ఓ పద్ధతీ పాడూ లేకుండా జీవించేస్తాం. మనస్సుని అదుపులో వుంచుకోవాలంటారు మునులు, ఋషులు, జెన్ మాస్టర్లు. అంటే ఏమిటి? మన నిత్య జీవితంలో పనులు చేసుకోవడానికి వాడుకునే పైన వుండే, కాన్షస్ మైండ్ (చేతనావస్థ) ని అదుపు చేయడమా? కాదు, అది తలకిందులు తపస్సు చేసినా సాధ్యం కాదు. దానికి దిగువన వుండే సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు లేకుండా కాన్షస్ మైండ్ ఏమీ చేయలేదు. అందుకని అడుక్కి వెళ్ళి సబ్ కాన్షస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలే తప్ప, పైపైన కాన్షస్ మైండ్ తో ఎన్ని పాట్లుపడినా మనస్సుని అదుపు చేసుకునే విషయంలో సక్సెస్ అస్సలు సాధ్యం కాదు.

1. మంచీ చెడుల రహస్యం వైరింగే!

కనుక సబ్ కాన్షస్ మైండ్ ని ప్రోగ్రాం చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ని ప్రయోగించాలి. ఇక్కడ కాన్షస్ మైండ్ తో ఒక చిక్కు వస్తుంది. అది సబ్ కాన్షస్ మైండ్ మాట వినదు. లాజికల్ గా ఆలోచిస్తుంది. ఉదాహరణకి, ఆర్ధికంగా రిచ్ అవ్వాలనుకుని సబ్ కాన్షస్ మైండ్ నేను బాగా రిచ్ ని!’ అంటే, నువ్వెప్పుడు రిచ్ వయ్యావ్? నువ్వింకా పూర్ గానే వున్నావ్ కదా?’ అని అడ్డు తగులుతుంది లాజికల్ కాన్షస్ మైండ్. ఇది నిజమే. సాధారణ భాషలో చెప్పుకుంటే, మనం రిచ్ కానప్పుడు రిచ్ అని చెప్పుకోవడానికి మనసొప్పదు. అబద్ధంలో జీవిస్తున్నట్టు వుంటుంది. కనుక నేను రిచ్ ని అని సబ్ కాన్షస్ కి సజెషన్ ఇవ్వకుండా,  నేను రిచ్ నవుతాను’, నేను రిచ్ నవుతున్నాను అని ఫ్యూచర్ టెన్స్ లో, లేదా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ లో అంటే, రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు కాబోలని, ఇది లాజికల్ గా వుందని, కాన్షస్ మైండ్ ఓకే అని, సబ్ కాన్షస్ తో చేతులు కలిపి -రిచ్ అవడానికి యాక్షన్ తీసుకుంటుంది. ఇలాగే ఆరోగ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సంబంధాలు వగైరా అన్ని విషయాల్లో దీన్ని అప్లై చేయొచ్చు.

కాన్షస్ మైండ్ మన మనసులో స్వల్ప భాగమే, 10 శాతమే వుంటుంది. అదే సబ్ కాన్షస్ మైండ్ 90 శాతం ఆక్రమించి వుంటుంది. ఇది అంతులేని జ్ఞాపకాల భండాగారం. మన ప్రతి మాట, చేత, ఆలోచన, అనుభవాలు, వీటి తాలూకు భావోద్వేగాలూ జ్ఞాపకాలుగా నిక్షిప్తమై పోతాయి  సబ్ కాన్షస్ మైండ్ లో. ఈ స్టోరేజీ మెదడు లోని 80 బిలియన్ల న్యూరాన్స్ లో వుంటుంది. ఈ న్యూరాన్లు శరీరమంతా కణం కణం వ్యాపించి వుంటాయి. కనుక ఈ జ్ఞాపకాలు శరీరంలోని 60 ట్రిలియన్ల కణాలన్నిట్లో చేరిపోతాయి. ప్రతీ కణంలోనూ ఆత్మలాంటి జీన్, మెదడు లాంటి డీఎన్ఏ వుంటాయి. జ్ఞాపకాలు మొదట కణాల్లోని జీన్స్ లోకెళ్ళి పోతాయి. ఆ జీన్స్ మీద తమ రాత రాస్తాయి. జ్ఞాపకాలు పాజిటివ్ గా వుంటే పాజిటివ్ రాతలు, నెగెటివ్ అయితే నెగెటివ్ రాతలు. జీన్స్ వెంటనే ఈ రాతల్ని డీఎన్ఏ కి పంపిస్తాయి. అవి పాజిటివ్ రాతలైతే, ఈ మనిషి సవ్యంగా ఆలోచిస్తున్నాడు/ఆలోచిస్తోంది  గో ఎహెడ్ అంటాయి. నెగెటివ్ జ్ఞాపకాలైతే ఈ మనిషి  చెడుగా ఆలోచిస్తున్నాడు / ఆలోచిస్తోంది ఫంక్షన్ ఆపేయమంటాయి.
       
మన శరీర కణాలు నిత్యం లక్షా 40 వేల రకాల ప్రోటీన్లు తయారు చేస్తూ
, శరీరంలోని ప్రతీ అంగాన్నీ ఆరోగ్యవంతంగా వుంచుతాయి. ఇలాంటప్పుడు డీఎన్ఏ నుంచి పాజిటివ్ సిగ్నల్ అందితే, లక్షా 40 వేల రకాల నాణ్యమైన ప్రోటీన్లు తయారు చేసి, ఆయా అంగాలకి పంపి ఆరోగ్యవంతంగా వుంచుతాయి. అదే నెగెటివ్ సిగ్నల్ అందితే, నాణ్యమైన ప్రోటీన్ల తయారీ ఆపేసి, నకిలీ ప్రోటీన్లు తయారు చేసే పంపుతాయి. దీంతో దేహంలోని అంగాలు దెబ్బతింటాయి. అంటే అనారోగ్యం చేస్తుంది. మన శరీరం మెదడుతో ఇంత వైరింగ్ అయి వుంటే, స్క్రీన్ ప్లేలేమో ఏ వైరింగూ లేని తలాతోకాలేని కథలతో వుంటున్నాయి.

2. అంతా హార్మోన్స్ ఆట!

బాగానే వుంది, ఇక్కడ ఏది మంచి జ్ఞాపకం, ఏది చెడు జ్ఞాపకం ఎలా తెలుస్తుంది జీన్స్ కి? హార్మోన్ల ద్వారా తెలుస్తుంది. ఈ హార్మోన్లు ఎలా ఉత్పత్తి అవుతాయి? మెదడులో పుట్టే ఎమోషన్స్ (భావోద్వేగాల) ద్వారా ఉత్పత్తి అవుతాయి. అంటే సుఖ సంతోషాలు, మంచి తనం, నీతీ నిజాయితీలు మొదలైన పాజిటివ్ ఎమోషన్స్ తో, హేపీ హార్మోన్స్ ఉత్పత్తి అయి న్యూరాన్స్ ద్వారా మొదట కణాల్లోని జీన్స్ కి చేరతాయి. దీంతో జీన్స్ హేపీగా ఫీలై మనల్ని హేపీగా వుంచుతాయి. అదే వొత్తిడి, కోపం, పగా ప్రతీకారాలు, మోసం, భయం మొదలైన నెగెటివ్ ఎమోషన్స్ హేపీ హార్మోన్స్ ని ఆపేసి, కార్టిసాల్ అనే శరీరంలో భాధని పుట్టించే హార్మోన్ ని విడుదల చేస్తాయి. ఇది జీన్స్ లోకెళ్ళి జీన్స్ ని ఏడ్పిస్తాయి. అప్పుడు మనం ఛాతీనో, కడుపునో పట్టుకుని హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకుని, ఖర్మ ఖర్మ అనుకుంటూ నడుం వాలుస్తాం.
       
దాదాపు 100 శాతం రోగాలు మనసు వల్లే. మనసులో ఎమోషన్స్ ఎలా వుంటే శరీరం అలా వుంటుంది. మెదడులోని న్యూరాన్లన్నీ శరీరంలోని కణాలన్నిటితో కనెక్ట్ అయివుండడం వల్ల శరీరానికి ఈ మంచీ చెడులు జరుగుతాయి. అయితే జీన్స్ పై పడ్డ చెడు రాతల్ని మంచి ఎమోషన్స్ తో చెరిపేసి
, పాజిటిటివ్ రాతల్ని ప్రవేశ పెట్టి, ఆరోగ్యాన్ని బాగు చేసుకునే వీలుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ వివరిస్తుంది. ఇది ప్రస్తుతం మనకి అవసరం లేదు.
        
పై కార్యకలాపాలన్నీ సబ్ కాన్షస్  మైండ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మన శరీరాన్ని నడిపించేది సబ్ కాన్షస్  మైండే కాబట్టి. ఐతే రచయితలు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి- ఎమోషన్స్ మనసుకి సంబంధించినవి, ఫీల్ శరీరానికి సంబంధించింది. అంతేగానీ ఎమోషన్స్, ఫీల్ రెండూ మనసుకి సంబంధించినవి కావు. మనసులో ఏ ఎమోషన్ పుడితే హార్మోన్ల ద్వారా శరీరం అలా ఫీలవుతుంది. అంటే వెండితెర మీద ఏ ఏ ఎమోషన్లు ఎలా ప్లే చేస్తే ప్రేక్షకుల శరీరాల్లో ఏఏ హార్మోన్లు విడుదలై ఎలా ఫీలవుతారన్నది తెలుసుకుంటే -స్క్రీన్ ప్లేల క్వాలిటీయే మారిపోతుంది. ఉదాహరణకి- ప్రేక్షకులు ఒక ప్రేమ సన్నివేశాన్ని బలంగా ఫీలవ్వాలంటే, వాళ్ళ శరీరాల్లో ఆక్సిటాసిన్ హార్మోన్ విడుదలయ్యేంత బలంగా ఆ ప్రేమ సన్నివేశముండాలన్న మాట. ఆక్సిటాసిన్ అనేది లవ్ హార్మోన్. రచయితలు మానవ శరీరం గురించి ఎన్ఎల్ పి, ఎపిజెనెటిక్స్ మొదలైనవి చదువుకుంటే రచనలో ఇలాటి మౌలికాంశాలు బాగా ఉపయోగపడతాయి.

3. సిక్స్ టెక్నిక్స్ ఏమిటి?

    ఇప్పుడు విషయానికొద్దాం. మనం గానీ, స్క్రీన్ ప్లేలో పాత్రగానీ జీవితంలో సాధించాలనుకున్న ఏదైనా గోల్ ని సబ్ కాన్షస్ మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా సుసాధ్యం చేసుకోవచ్చన్న విషయం. దీనికి ప్రధాన అవరోధం ఒకటుంటుంది. అది కాన్షస్ మైండ్ కీ, సబ్ కాన్షస్ మైండ్ కీ మధ్య వుండే అడ్డు గోడ. ఈ అడ్డు గోడని కూల్చక పోతే ఏ గోలూ సాధ్యం కాదు. గోల్ సాధించేందుకు సబ్ కాన్షస్  మైండ్ లోకి ఎలా ప్రవేశించాలో కాన్షస్ మైండ్ కి తెలీదు. కనుక ఈ ప్రవేశం గురించి, ఆ తర్వాత గోల్ సాధించే మార్గం వైపుగా ప్రయాణించడానికి చేపట్టాల్సిన టెక్నిక్స్ గురించీ తెలుసుకుందాం.

        a. విజువలైజేషన్ : ఈ టెక్నిక్ తో సబ్ కాన్షస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేస్తే అడ్డు గోడ పడిపోతుంది. విజువలైజేషన్ అంటే ఏమిటి? విజువల్స్ + ఇమాజినేషన్ = విజువలైజేషన్ అవుతుంది. విజువల్స్ అంటే స్మృతులు, ఇమాజినేషన్ అంటే కల్పనా శక్తి. కాబట్టి స్మృతుల్ని కల్పనాశక్తితో జోడించి చూడాలి. ఆ కల్పనాశక్తి త్రీడీలో, లార్జ్ పానరామిక్ పిక్చర్ (విస్తృత దృశ్యం) గా, కలర్ఫుల్ గా వుండాలి. దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి వూహించాలి. ఇదంతా ఒక మెంటల్ మూవీగా మన వూహల్లో రూపొంది చివరికి ఎండ్ రిజల్ట్ పడాలి. ఎండ్ రిజల్ట్ అంటే గోల్ సాధించిన తర్వాత మన జీవితం ఎలా వుంటుందో, ఎలా ఎంజాయ్ చేస్తూ వుంటామో ఆ డ్రామా అంతా శుభం కార్డుగా పడాలి. ఎండ్ రిజల్టుతో ఈ శుభం కార్డుకి చాలా సంతోషిస్తుంది సబ్ కాన్షస్ మైండ్. దీన్ని పట్టుకుని వెళ్ళి ఆ ఎండ్ రిజల్ట్ ని నిజ జీవితంలో మనకి చూపించే వరకూ ఆగదు.

        ఉదాహరణకి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సినిమా దర్శకుడు/దర్శకురాలు మెంటల్ మూవీ ని రన్ చేస్తూ ఈ ఎండ్ రిజల్ట్ ని చూడాలి. తీసిన సినిమా పెద్ద హిట్టయ్యింది. ప్రేక్షకులు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. సినిమా చూసి గుంపులుగా వచ్చి నివాసం ముందు కేరింతలు కొడుతున్నారు. అది మామూలు నివాసం కాకూడదు. పెద్ద భవంతి అయి వుండాలి. తాను ఖరీదైన దుస్తులు ధరించి రిచ్ గా వుండాలి. ఇక నిర్మాతలు అడ్వాన్సులివ్వడానికి క్యూలు కడుతున్నారు. సంతకాలు పెట్టడం, డబ్బు కట్టలు అందుకోవడం. కుప్పలు కుప్పలుగా పడ్డ నోట్ల కట్టల్ని లెక్కెట్టుకోవడం. ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం, డాన్సులు చేయడం, కుటుంబ సభ్యులతో ఫ్లైట్ ఎక్కి టూర్ వెళ్ళడం...ఇదీ శుభం కార్డు లాంటి ఎండ్ రిజల్ట్.

    సబ్ కాన్షస్ మైండ్ కి అర్ధమై యాక్షన్ లోకి దిగే భాష బొమ్మలే. రచనలో ఒక ముఖ్య సూత్రం తెలిసిందే- షో, డోంట్ టెల్ అని. అంటే పాత్ర ఆనందంగా వుంటే ఆనందంగా వున్నట్టు రాయకూడదు. లేదా పాత్ర చేత అలా చెప్పించ కూడదు. ఆనందంగా వుంటే ఎలా వుంటాడో బొమ్మ చూపించాలి. ఆనందం పట్టలేక ఎగిరి గంతెయ్యొచ్చు, లేదా రోడ్డు మీద జనాలకి డబ్బులు పంచుతూ పోవచ్చు. ఇలా బొమ్మ చూపించడమెందుకంటే, ఆ పాఠకుల / ప్రేక్షకుల సబ్ కాన్షస్ మైండ్ బొమ్మని చూసి ఇంప్రెస్ అవుతుందని. అప్పుడా రచన కలకాలం గుర్తుంటుందని. సబ్ కాన్షస్ మైండ్ మెచ్చే భాష బొమ్మలే!
       
ఈ బొమ్మల్ని స్వీకరించే రాడార్ మన మెదడులో ఆర్ ఏ ఎస్ (రెటీక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్) రూపం లో వుంటుంది. ఆ గోల్ డబ్బు కావచ్చు
, ఆరోగ్యం కావొచ్చు, విద్యా వ్యాపార ఉద్యోగాలూ కావొచ్చు, ఇంకేదైనా కావచ్చు - దాన్ని ఎండ్ రిజల్టుతో మెంటల్ మూవీగా ఆర్ఏ ఎస్ అనే రాడార్ కి చూపించాల్సిందే.
       
ఈ మెంటల్ మూవీ ఏమిటి
, ఎలా వుంటుంది? సినిమా దర్శకుడు/ దర్శకురాలు కథ రాయడం, అనుకున్న హీరోకి / నిర్మాతకి విన్పించడం, అది సింగిల్ సిట్టింగ్ లో ఓకే అవడం, నిర్మాత ఆఫీసు ఇవ్వడం, తాను స్టాఫ్ ని తీసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడం, ఇతర ఆర్టిస్టుల్ని, సాంకేతికుల్ని బుక్ చేసుకోవడం, కొబ్బరి కాయకొట్టి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించడం,,, షూటింగ్ జరుగుతూంటే దృశ్యాలు బ్రహ్మాండంగా రావడం, గుమ్మడి కాయ కొట్టి షూటింగు ముగించడం, ఎంజాయ్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ, రిలీజ్ కార్యక్రమాలు, పబ్లిసిటీ, బయ్యర్ల సందడీ, సినిమా రిలీజ్....రిలీజ్ తర్వాత పైన చెప్పిన విధంగా ఎండ్ రిజల్ట్!
        
ఎక్కడా ఇది అవుతుందా లేదా అని సందేహ పడకూడడు. ఆటంకాలు చూడకూడదు. అంతా ఒక ఎంజాయ్ మెంటుగా సాఫీగా జరిగిపోతున్నట్టు వూహిస్తేనే సబ్ కాన్షస్ మైండ్ ఓకే చేసే మెంటల్ మూవీ వస్తుంది.

    అయితే గోల్ కోసం మన ప్రయాణం ఎలాగెలా జరుగుతుందో ఇలా వొక మెంటల్ మూవీని వూహిస్తూంటే, మధ్యమధ్యలో మైండ్ మరిక దేని మీకో వెళ్ళిపోవచ్చు. దీన్ని నివారించడానికి చక్కగా మెంటల్ మూవీని కాగితం మీద పది నిమిషాలు వచ్చేలా వివిధ సన్నివేశాలతో వర్ణించుకుని, లూప్ లో రికార్డు చేసుకుంటే, రాత్రి పడుకునేప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లూప్ లో రిపీటవుతున్న మెంటల్ మూవీని వింటూ నిద్రలోకి జారిపోవచ్చు. నిద్రపోయినప్పుడే కాన్షస్  మైండ్  ఇనాక్టివ్ అయి, సబ్ కాన్షస్ మైండ్ కి దారి క్లియరై  మెంటల్ మూవీ ప్లాంట్ అవుతుంది. ఇలా ఈ విజువలైజ్ చేసిన మెంటల్ మూవీతో అడ్డుగోడని  కూల్చి కాన్షస్ మైండ్ ని సబ్ కాన్షస్ మైండ్ తో కలపవచ్చు.
       
b. ఆఫర్మేషన్స్ : లా ఆఫ్ ఎట్రాక్షన్ లో ఎలాగైతే ఆఫర్మేషన్స్ చేస్తామో అదే ఇక్కడ చేయాలి. అంటే ఆటో సజెషన్స్ ద్వారా సబ్ కాన్షస్ మైండ్ ని జాగృతపర్చడం. అంటే పైన చెప్పుకున్న విధంగా,  నేను రిచ్ నవుతాను’, నేను రిచ్ నవుతున్నాను వంటి గోల్ కి సంబంధించిన విన్నపాల్ని ఆటో సజెషన్స్ గా ఇవ్వడం. ఈ గోల్ నేను సాధిస్తాను’, నా గోల్  సాకారమవుతోంది వంటి ఆఫర్మేషన్స్ ని రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేవగానే కనీసం 30 సార్లు వల్లె వేయాలి, రాయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఆఫర్మేషన్ లోని పదాలు బ్రెయిన్ లో న్యూరల్ పాత్స్ ని సృష్టిస్తాయి. అంటే ముద్రితమైపోతాయి. ఇవి న్యూరాన్స్ ద్వారా శరీరం లోని ప్రతీ కణం కణం లోకీ ఇంకి, గోల్ ని సాధించడానికి శరీరాన్ని ప్రేరేపిస్తాయి. బ్రెయిన్ మెమరీ అంతా శరీర కణాల్లో కూడా మెమరీగా రికార్డయిపోతుంది.
        
c. యాక్షన్ : ఇక గోల్ తాలూకు పనితో యాక్షన్ లోకి దిగాలి. డబ్బు సంపాదన గోల్ అయితే, దానికే మార్గముందో ఆ పనులు మొదలెట్టాలి. సినిమా అవకాశం గోల్ అయితే స్క్రిప్టు రాయడం మొదలెట్టాలి. ఆరోగ్యం గురించయితే ఆరోగ్య సూత్రాలు పాటించడం వంటివి చేయాలి. దీంతో శరీరం చేపట్టిన ఈ యాక్షన్ కి అలవాటు పడుతుంది. ఈ పనులు ఎంత కష్టమైనా ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఈ టఫ్ ఆర్టికల్ని ఎంజాయ్ చేస్తూనే రాశాం! ఎంజాయ్ చేసినప్పుడు హై వైబ్రేషన్స్ పుడతాయి. హై వైబ్రేషన్స్ సబ్ కాన్షస్ మైండ్ ద్వారా యూనివర్స్ తో కనెక్ట్ అవుతాయి. ఇక యూనివర్స్ మనం పడుతున్న శ్రమకి తగ్గ వినియోగ దారుల్ని వెతికి తేవడం మొదలెడుతుంది.
        
డి. మెటఫర్స్ :  అంటే రూపకాలంకారాలు. సబ్ కాన్షస్ మైండ్ మన ఉద్దేశాన్ని అర్ధం జేసుకోవాలంటే మెటఫర్స్ రూపంలో సంకేతాలు చూపించాలి. గెలుపుకి మెటఫర్ శిఖరం పైన జెండా ఎగరేయడం కావొచ్చు. రాకెట్ లా ఆకాశంలోకి దూసుకు పోవడం కావచ్చు. ఇలాటి మెటఫర్స్ తో ఎమోషనల్ కథలు చూపెట్టాలి. ఉదాహరణకి ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళెప్పుడూ కర్రలు పెట్టి కొట్టుకుంటూ వుంటారు. తండ్రి ఎంత వారించినా వినరు. ఇలా కాదని తండ్రి ముగ్గురికీ ఒక్కో కర్ర ఇచ్చి విరగ్గొట్టమన్నాడు. విరిచి పారేశారు. అవే కర్రల్ని కట్ట గట్టి ఇప్పుడు విరగ్గొట్టమన్నాడు. వాళ్ళ వల్ల కాలేదు.
చూశారా, విడిగా వుంటే విరిగి పోతారు. కలిసివుంటే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు అని నీతి చెప్పాడు తండ్రి. ఇక్కడ కట్ట కట్టిన కర్రలు సంఘటిత బలానికి మెటఫర్ అన్నమాట. ఇలాటి మెటఫర్స్ ని ఇష్టపడుతుంది సబ్ కాన్షస్ మైండ్.
       
మెటఫర్స్ పాజిటివ్ సెన్స్ లో వుండాలి. పొరపాటున కూడా
నా జీవితం ముళ్ళదారి అనో, నా గుండె మీద బండ పడింది అనో, నా నెత్తిన పిడుగు పడింది అనో అనకూడదు, లేకి కవిత్వాలు రాయకూడదు. అప్పుడు ముళ్ళదారి, బండ, పిడుగు వంటి మెటఫర్స్ కి ఇన్స్ ఫైర్ అయి వాటినే తెచ్చి నిజజీవితంలో పడేస్తుంది సబ్ కాన్షస్ మైండ్. తధాస్తు దేవతల మహా త్మ్యం అన్నమాట! ఈ తధాస్తు దేవతలే సబ్ కాన్షస్ మైండ్.

    ఇలాటి నెగెటివ్ మెటఫర్స్ వున్న పాటలూ వినకూడదు. నా పేరు బికారీ నా దారి ఎడారి అనే పాట రాసి కవి డబ్బులు సంపాదించుకుంటాడు. పాటని ఎంజాయ్ చేసిన వాళ్ళ జీవితాల్లోకి బికారీనీ, ఎడారినీ మెటఫర్స్ గా తీసుకుని, ఎడారిలో బికారీలు గా మార్చేస్తుంది సబ్ కాన్షస్ మైండ్. యువర్ విష్ ఈజ్ మై కమాండ్' లాంటి అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీనీ భూతం వ్యవహారమన్నమాట! ఈ జీనీ భూతమే సబ్ కాన్షస్ మైండ్.
       
ఇలా కాకుండా
నా జీవితం ఉదయించే సూర్యుడు’, నా ఆరోగ్యం వికసించే పువ్వు- లాంటి పాజిటివ్ మెటఫర్స్ వాడాలి.
        
e. రిపీటీషన్ :  మెంటల్ మూవీనీ, ఆఫర్మేషన్స్ నీ పదేపదే రిపీట్  చేస్తూంటే సబ్ కాన్షస్ మైండ్ ఎంజాయ్ చేస్తూ గోల్ వైపు వేగంగా చర్యలు తీసుకుంటుంది.
       
f. ఫోకస్ :  సబ్ కాన్షస్ మైండ్ ఇచ్చిన టాస్క్ పై ఫోకస్ తో వుండాలంటే దానికి బెనిఫిట్స్ ని చూపించాలి. గోల్ ద్వారా హోదానో, ఆరోగ్యమో, వ్యాపారమో సాధిస్తే అదనంగా లోకానికేం ఇస్తారో, చేస్తారో చెప్పాలి. ఛారిటీ ఇస్తారా, ఉపాధులు కల్పిస్తారా, లేదా ఇంకేదైనా సమాజ సేవ చేస్తారా స్పష్టం చేయాలి. మన వరకూ సంపాదించుకుని స్వార్ధంతో బ్రతికే గోల్ అంత బలంగా వుండదు. ఇలాటి గోల్ కూడా సాధించవచ్చు. కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం. మనం విసిగిపోయి విరమించుకోవచ్చు కూడా. ఒకవేళ ఎన్నాళ్ళకో సాధించినా అది ఎంతో కాలం నిలబడదు. సబ్ కాన్షస్ మైండ్ విశ్వమంతా వ్యాపించి లోక కళ్యాణార్ధం పని చేస్తూంటుంది. దానికి బెనిఫిట్స్ చూపిస్తేనే ఫోకస్ పెట్టి సత్వర ఫలితాల్నిస్తుంది.

ఇదంతా బాగానే వుంది. మరి స్క్రీన్ ప్లే సంగతుల్లోకి ఈ సబ్ కాన్షస్ మైండ్ ఎలా వచ్చింది? ఇప్పటికే ఈ సుదీర్ఘ ఆర్టికల్ భారమై వుండొచ్చు. దీన్ని రెండుగా విడగొట్టి మిగిలిన భాగం రేపు ఫ్రెష్ మైండ్ తో చూస్తే బ్యూటీఫుల్ గా వుంటుంది. స్క్రీన్ ప్లే సంగతుల్లోకి సబ్ కాన్షస్ మైండ్ ఎలా వచ్చింది? రాలేదు, సబ్ కాన్షస్ మైండ్ లొంచే స్క్రీన్ ప్లే సంగతులొచ్చాయి!

ఆల్ ది బెస్ట్
—సికిందర్