రచన- దర్శకత్వం: ఏ మోహన్ రాజా
తారాగణం : చిరంజీవి, నయనతార,
ప్రగతి, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మురళీ
శర్మ, సాయాజీ షిండే, సునీల్, షఫీ తదితరులు
కథ : మురళీ గోపి (మలయాళం), మాటలు :
లక్ష్మీ భూపాల, సంగీతం : థమన్ ఎస్,
ఛాయాగ్రహణం : నీరవ్
షా
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు : రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
విడుదల : అక్టోబర్ 5, 2022
***
కథ
జనజాగృతి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పికె రామదాసు మృతితో విషాద చ్ఛాయలు అలుముకుంటాయి. ఇంకా అంత్య క్రియలకి ముందే సీఎం పదవి కోసం కుమ్ములాటలు మొదలవుతాయి. పార్టీ నాయకుడు వర్మ (మురళీ శర్మ), నాయుడు (సాయాజీ షిండే) ఎత్తుగడలు వేస్తూంటారు. రామదాసు పెద్ద కుమార్తె సత్యప్రియ (నయనతార), అల్లుడు జయదేవ్ (సత్య దేవ్) ల పేర్లు ప్రతిపాదన కొస్తాయి. జయదేవ్ పెద్ద నేర సామ్రాజ్యాన్ని నడుపుతూంటాడు. ఆ డబ్బుతోనే పార్టీని నడిపిస్తున్నందుకు పదవికి తానే అర్హుడని పావులు కదుపుతాడు.
ఇవన్నీ గమనిస్తున్న రామదాసు ఆత్మీయుడు బ్రహ్మ (చిరంజీవి) రంగప్రవేశం చేసి జయదేవ్ ని అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్యా పోరాటం మొదలవుతుంది. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్న బ్రహ్మ అసలు ఉద్దేశమేమిటి? ఎవర్ని సీఎం పదవిలో కూర్చోబెట్టబోతున్నాడు? అతనంటే సత్య ప్రియకి ఎందుకు ద్వేషం? అసలు బ్రహ్మ ఎవరు? అతడికి రామదాసు కుటుంబంతో సంబంధమేమిటి? ఇవి తెలియాలంటే వెండి తెరమీద చూడాల్సిందే.
ఎలావుంది కథ
రాజకీయ సినిమా కథల్లో ఇదొక భిన్నమైన కథ. ఈ క్రెడిట్ మలయాళం ‘లూసిఫర్’ కిచ్చేయాలి. దీన్ని తెలుగుకి కొన్ని మార్పు చేర్పులతో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసినప్పుడు, ‘లూసిఫర్’ కి దీటుగానే ఫలితం వచ్చింది. ఇంత నీటయిన, అర్ధవంతమైన, బలమైన రాజకీయ డ్రామా చాలా కాలం తర్వాత తెలుగులో చూస్తాం. ఒరిజినల్లో వున్న క్రైస్తవం, కమ్యూనిజం నేపథ్యాల్ని పూర్తిగా తొలగించినా కథకేమీ లోటు రాలేదు. బైబిల్లో లూసిఫర్ కథని తెలుగుకి జానపద రాజు కథగా నేపథ్యమిచ్చారు.
కథ ఒకెత్తు అయితే, పాత్ర చిత్రణలొక ఎత్తు. చిరంజీవి బ్రహ్మ పాత్రని మలయాళంలో మోహన్ లాల్ లాగా పాత్ర వయసురీత్యా ఔచిత్యం చెడకుండా కాపాడారు. చిరంజీవి కదాని ఫ్యాన్స్ కోసం, మాస్ కోసం, హీరోయినూ రోమాన్సూ పాటలూ డాన్సులూ పంచ్ డైలాగులూ కామెడీలూ వంటివన్నీ పూర్తిగా దూరం పెట్టి, ఆనాడు ‘హిట్లర్’ లో చిరంజీవిలాగా హూందాగా చూపించి పాత్రకి పూర్తి న్యాయం చేశారు. చిరంజీవి ఇమేజి చట్రాన్ని తీసి అవతల పడేశారు. రాజకీయ కథ కొత్తగా, మెచ్యూర్డ్ గా వున్నప్పుడు చిరంజీవి కూడా మెచ్యూర్డ్ గా, కొత్తగా వుండాల్సిందే. ఇలా ప్రతీ పాత్రా డీసెంట్ గా బలంగా వున్నాయి. ఇలా చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మౌలిక హిట్ కథ తెరకెక్కింది. ఇది చూస్తూ ‘లూసిఫర్’ ని మర్చిపోవాల్సిందే. ఈ కథలో అసలు బ్రహ్మగా చిరంజీవి ఎవరన్న దానికి రొటీన్ మూస ఫ్లాష్ బ్యాక్ వేయకుండా, ఫస్టాఫ్ నడుస్తున్న డ్రామాతోనే బ్రహ్మ గతాన్ని డిమాండ్ చేసే సన్నివేశం వచ్చినప్పుడల్లా, తెలుపు -నలుపులో మాంటేజెస్ తో దృశ్యాలు వచ్చి పోవడం నీటైన స్క్రీన్ ప్లే రచనలా వుంది.
నటనలు – సాంకేతికాలు
మొదటి పావుగంట తర్వాత చిరంజీవి ఎంట్రీ వుంటుంది. ఈ ఎంట్రీ హీరోయిజం కోసం ఫైట్ సీనుతో కాకుండా, సీఎం అంత్యక్రియలకి వచ్చే సీనుతో డ్రమెటిక్ గా వుంటుంది. పావు గంట తర్వాత నుంచి కథ వేడెక్కి చిరంజీవి క్యారక్టరైజేషన్ స్థిర పడుతుంది. దెబ్బకి ఎదురు దెబ్బ తీసే డ్రామాతో ఇంటర్వెల్ వరకూ పాత్ర ఎలివేట్ అవుతూ పోతూంటుంది. ఇదంతా చిరంజీవి పెర్ఫార్మెన్స్ తో హైలైట్ అవుతూంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఫైట్ సీన్ కూడా డీసెంట్ గా వుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో థమన్ సంగీతంలోని పాటతో ఈ ఫైట్ ఒక ఈవెంట్ లా వుంటుంది.
అయితే సెకండాఫ్ కథ రొటీన్ గాడిలో పడినా, ప్రత్యర్ధితో పోరాటంలో క్యారక్టర్ ని నిలబెట్టుకుంటూ వచ్చారు చిరంజీవి. కానీ చివరి అరగంట క్లయిమాక్స్ ని కాపాడలేకపోయారు.
చిరంజీవికి దీటుగా ప్రత్యర్ధి పాత్రలో స్మాల్ హీరో సత్యదేవ్ ఒక సర్ప్రైజ్ అప్పీయరెన్స్. జయదేవ్ గా సత్యదేవ్ నటించిన ప్రతీ సీనూ రాణిస్తాయి. మెగాస్టార్ మూవీకి విలన్ గా నటించే ధైర్యానికి అతడ్ని మెచ్చుకోవాలి. గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వర్మగా మురళీ శర్మ కామిక్ విలనీ, ఎక్స్ ప్రెషన్స్ చూస్తున్న కొద్దీ చూడాలన్పించేలా వున్నాయి. ఈ ఎక్స్ ప్రెషన్స్ కోసమే దర్శకుడు క్లోజప్ షాట్స్ వేస్తూ పోయాడు. ఇక చిరంజీవి మీద కోపంతో వుండే నయనతార సీరియస్ నటన, బాల్యం నుంచీ ఆమె పాత్రకున్న గతం సన్నివేశాలకి డెప్త్ నిస్తాయి. ఇతర పాత్రల్లో సహాయ నటులూ ఏమీ తీసిపోలేదు.
ఇంటర్వెల్లో మాసూమ్ భాయ్ గా ఎంట్రీ ఇచ్చే సల్మాన్ ఖాన్ తిరిగి క్లయిమాక్స్ లోనే చిరంజీవిని కాపాడేందుకొస్తాడు. ఇద్దరూ వున్న ప్రతీ సీనూ కనువిందు ప్రేక్షకులకి. ఇద్దరి మీదా సాంగ్ కూడా కిక్ నిచ్చేదే. అయితే క్లయిమాక్స్ లో కథ మిగలక పోవడంతో సల్మాన్ చేసేదేమీ వుండదు పాత్ర పరంగా.
థమన్ కూర్చిన సంగీతం మెగాస్టార్ మూవీ లెవెల్లో వుంది. కథా బలం వల్ల తన సంగీతం బలంగా వున్నట్టు అన్పిస్తుంది. నీరవ్ షా కెమెరా వర్క్ చాలా ఉన్నతమైనది. క్రౌడ్ దృశ్యాలు, దృశ్యాలకి వేసిన సెట్స్, ఇన్ డోర్ - ఔట్ డోర్ లొకేషన్స్, యాక్షన్ సీన్స్ ప్రతీదీ అతడి లైటింగ్ -కెమెరా వర్క్ తో దృశ్య వైభవాన్ని సంతరించుకున్నాయి. లక్ష్మీ భూపాల రాసిన డైలాగులు కూడా హైలైట్ గా, కొన్ని చోట్ల ఆలోచనాత్మకంగా వున్నాయి.
చివరి కేమిటి
రీమేకుల దర్శకుడు మోహన్ రాజా (ఎడిటర్ మోహన్ కుమారుడు) ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి ఈ రీమేక్ తో పేరు నిలబెట్టుకున్నాడు. చివరి అరగంట తప్పితే మిగతా రెండు గంటలూ పకడ్బందీ కథా కథనాలతో రాజకీయ డ్రామా నడపడం అభినందించ దగ్గ విషయమే. అయితే, చివరి అరగంటే చేజారిపోయింది. ఈ అరగంట క్లయిమాక్స్ నడపడానికి కథే లేదు. ఒక్క దెబ్బతో విలన్నీ ఫినిష్ చేయొచ్చు. చేయకుండా విలన్ తో యాక్షన్ సీన్స్ సాగిసాగి అనవసర హైరానా లాగా తేలింది. ఈ యాక్షన్ సీన్స్ కి చేసిన సీజీ కూడా నాసిరకంగా వుంది. తుపాకీ కాల్పులు, పేల్చివేతలూ అంతవరకూ నీటుగా చూపించు కొచ్చిన సినిమాని తారుమారు చేశాయి. ఈ లాజిక్ లేని మసాలా మాస్ కోసమేమో తెలీదు. మొత్తానికి చివర్లో సల్మాన్ ని తీసుకొచ్చి చిరంజీవితో ఇలా ధూం ధాం చేసి పూర్తి చేశారు.
దసరా పండక్కి రక్తపాతం లేని తెలుగు ప్రమాణాలతో కూడిన రీమేకుని ఓ రెండు గంటలు ఎంజాయ్ చేశాక, చివరి అరగంట ముగింపు భరించక తప్పదు. అవ్వా కావాలి బువ్వా కావాలీ అంటే కుదరదుగా?
—సికిందర్