రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 1, 2022

1152 : రివ్యూ!


రచన - దర్శకత్వం : స్వరూప్ ఆర్ ఎస్ జె
తారాగణం : తాప్సీ పన్నూ, హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్ధ, రిషబ్ శెట్టి, హరీష్ పి, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం : మార్క్ జె రాబిన్, ఛాయాగ్రహణం : వై దీపక్
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, పీఏ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు ; ఎన్ ఎం పాషా, అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
విడుదల : ఏప్రెల్ 1, 2022
***

        తెలుగు సినిమాల నుంచి దూరంగా వెళ్ళి బాలీవుడ్ లో రియలిస్టిక్ సినిమాలతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న తార తాప్సీ పన్నూ, మూడేళ్ళ తర్వాత తెలుగుకి తిరిగి వచ్చి మిషాన్ ఇంపాసిబుల్ నటించింది. 2019 లో నవీన్ పొలిశెట్టితో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే హిట్ తీసిన దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె, మలి ప్రయత్నంగా చైల్డ్ ఆర్టిస్టుల కాంబినేషన్లో మార్కెట్ వేల్యూ కోసం తాప్సీ తో మిషాన్ ఇంపాసిబుల్ తీస్తూ దేశవ్యాప్త దృష్టి నాకర్షించాడు. తాప్సీ కూడా తనకి జన్మనిచ్చిన తెలుగు సినిమాకి తిరిగి రావడం రుణం తీర్చుకోవడమేనని భావావేశానికి లోనైంది. మరి దర్శకుడు ఆమెని తిరిగి తెలుగుకి తీసుకొస్తూ రుణం తీర్చుకునేలా చేశాడా? లేక రుణం తీర్చుకోవడం ఇంపాసిబుల్ అనేలా చేశాడా? ఇది తెలుసుకుందాం...

కథ

    శైలజ (తాప్సీ పన్నూ) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. తన జర్నలిజంతో ఒక రాజకీయ నాయకుడ్ని పదవిలోంచి దింపేసి, బాలల అక్రమ రవాణా మాఫియాని పట్టుకోవడానికి కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ (రఘుపతి రాఘవ రాజారాం) అనే ముగ్గురు 10-12 ఏళ్ల స్కూలు కుర్రాళ్ళు చదువు పట్ల శ్రద్ధ లేక, ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూంటారు. ఈ ముగ్గురికీ ఒక అయిడియా వస్తుంది. రఘుపతి (హర్ష్ రోషన్), రాఘవ (భాను ప్రకాశన్), రాజారాం (జయతీర్ధ) ముగ్గురూ కలిసి  మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీం ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్పి 50 లక్షల బహుమానం సంపాదించుకోవాలని బయల్దేరతారు. ముగ్గురూ శైలజకి తారసపడతారు. ఈ ముగ్గురూ తన మిషన్ కి ఉపయోగపడతారనుకుని చేరదీస్తుంది. చైల్డ్ ట్రాఫిక్కింగ్  మాఫియా రామ్ శెట్టి (హరీష్ పి) ని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడానికి ఈ ముగ్గురి సాయం తీసుకుంటుంది. ఇందులో సఫలమైందా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    2014 లో పాట్నాలో ముగ్గురు స్కూలు పిల్లలు మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీంని పట్టుకుని అప్పగిస్తే 50 లక్షల బహుమానమన్న ప్రభుత్వ ప్రకటనకి ఉత్తేజితులై బయల్దేరి వెళ్ళి పోలీసులకి దొరికిపోయారు. ఈ సంఘటన దర్శకుణ్ణి ఆకర్షించింది. దీని ఆధారంగా కథ తయారు చేసి, దానికి పిల్లల అక్రమ రవాణా (చైల్డ్ ట్రాఫిక్కింగ్) అంశం జోడిస్తూ, తాప్సీ పన్నూకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్ర రూప కల్పన చేశాడు. జానర్ వచ్చేసి కామిక్ థ్రిల్లర్.

        2014 వార్తా కథనం ప్రకారం ఆ ముగ్గురు స్కూలు పిల్లలు డాన్ దావూద్ మీద తీసిన డీ-డే అన్న బాలీవుడ్ థ్రిల్లర్ చూసి, అందులో దావూద్ ని పట్టుకుంటే 50 లక్షలు అన్న ప్రభుత్వ ప్రకటన నిజమే అనుకుని పట్టుకోవడానికి బయల్దేరారు. ఈ పిల్లలతో కామెడీ ఇంకా వుంది... ఈ పిల్లల్లో ఒకడి అమ్మమ్మ పాకిస్తాన్ లోని కరాచీలో వుంటోంది. దావూద్ కూడా కరాచీలోనే దాక్కున్నాడు. ఇంకేం, అమ్మమ్మ దగ్గరకెళ్ళి పోయి వుంటే, వాణ్ణి పట్టుకోవచ్చని ప్లానేసుకున్నారు. కరాచీ వెళ్ళాలంటే వీసా, పాస్ పోర్టులుండాలని కూడా వాళ్ళకి తెలీదు.

        ఇంటర్నెట్ లో కరాచీలోని దావూద్ ఇంటి ఫోటోని కూడా డౌన్ లోడ్ చేసుకున్నారు. దాని మ్యాపుని స్టడీ చేసి, కాంపౌండ్ లోకి ఎలా ప్రవేశించాలి, ప్రవేశించి దావూద్ మీద పడి ఎలా పట్టుకోవాలీ మొత్తం స్కెచ్ వేసుకున్నారు. తీరా తేలిందేమిటంటే, మ్యాపులో అది దావూద్ ఇల్లు కాదు. పాక్ లోనే అబ్బొటా బాద్ లో అప్పట్లో దాక్కుని అమెరికన్ కమెండోల చేతిలో చచ్చిన బిన్ లాడెన్ ఇల్లు అది! ఉదంతానికి ఇది కొసమెరుపు.

    ఈ పిల్లలు కలకత్తాలో డబ్బులైపోయి తిరుగుముఖం పట్టారనేది వేరే సంగతి. వీళ్ళ  ఉదంతంలో కొట్టొచ్చేట్టు కన్పించేదేమిటంటే, చైల్డ్ స్పిరిట్. ఇలాటి స్పిరిట్ వున్న పిల్లల్ని నిజానికి గ్రూమింగ్ చేస్తే భవిష్యత్తులో ఎక్కడో వుంటారు. వీళ్ళేమీ తప్పుడు పనికి పాల్పడలేదు. దేశానికుపయోగ పడే మంచి పనికే బయల్దేరారు. ఆ వయసులోనే అంత ప్లానింగ్ చేశారు. అది అవుతుందనే నమ్మారు. తెలిస్తే ఏదీ చేయలేరు, తెలియకపోతే ఏదైనా చేసేస్తారు.

        రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చిన్నతనంలో గూఢచార కార్యాలయానికి వెళ్ళిపోయి నన్ను గూఢచారిగా చేర్చుకోండి అనేశాడు. నువ్వింకా పెద్ద వాడివి అవ్వాలి, ట్రైనింగు పొందాలీ అని అక్కడి అధికారి అనేసరికి, పట్టువదలకుండా అవన్నీ చేసి, ఆ కార్యాలయానికే పెద్దవాడై గూఢచారిగా వచ్చాడు. తర్వాత్తర్వాత ఇంకెన్నో మజిలీలు దాటుకుని దేశాధ్యక్షుడయ్యాడు.

        ఛైల్డ్ స్పిరిట్ ని చంపవచ్చా? ఈ పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో, మీ పిల్లలు మళ్ళీ ఇలాటి పనులు  చేయకుండా అదుపులో పెట్టుకోండి అన్నారంటే ఏమనాలి. ఈ సినిమా కథ రాసిన దర్శకుడు కూడా ఈ చైల్డ్ స్పిరిట్ లోని  స్పార్క్ ని, ఇందులో ఇన్ని డైనమిక్స్ నీ  సినిమాకి పట్టుకో లేక పోవడం విచారకరం.

        పిల్లల్ని పాకిస్తాన్ పంపేసి, మ్యాపు ప్రకారం అబ్బొటాబాద్ లోని అదే బిన్ లాడెన్ ఇంటికే పోతే, ఇండియన్ గూఢచారుల కన్నుగప్పడానికి తెలివిగా అక్కడే దాక్కుని దావూద్ ఇబ్రహీమే ఎదురైతే ఏం జరుగుతుంది? - అన్న కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథ చేయకుండా, దావూద్ ఇబ్రహీం అనుకుని మొదలెట్టిన కథని కూడా, తాప్సీతో పిల్లల అక్రమ రవాణాని కథగా చేసి పాత మూస కథలోకి కలిపేయడంతో, చైల్డ్ స్పిరిట్ తో వున్న  కొత్త కథ కిల్ అయిపోయింది. మెయిన్ కథ తలనొప్పిగా తయారయ్యింది.

నటనలు - సాంకేతికాలు

    తాప్సీది పూర్తి నిడివి పాత్ర కాదు. ఓ పెద్ద సైజు అతిధి పాత్ర అనుకోవాలి.  ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రకూడా ఇప్పుడు అసహజ పాత్రే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంతరించి పోయింది. స్టింగ్ ఆపరేషన్లు చేయడం, స్కాములు బయట పెట్టడం ఇవన్నీ ఒకప్పటి మాట. ఇప్పుడు ఫ్రెండ్లీ జర్నలిజం. రోజువారీ నేర వార్తలు రాసే క్రైమ్ రిపోర్టర్లు. కాబట్టి జర్నలిజం గురించి తెలిసిన వాళ్ళకి తాప్సీ పాత్ర అసహజంగా అనిపిస్తుంది. దర్శకుడు రీసెర్చి చేసుకోవాల్సింది.

        ఈ పాత్రలో తాప్సీ చేయడానికి కూడా ఏమీ లేదు. పాత్రకి మోటివ్ వుంటే, ఆ పరమైన పట్టుదల, భావోద్వేగాలూ వుండి, నటించడానికీ మెప్పించడానికీ  అవకాశముండేది. అన్ని బాలీవుడ్ రియలిస్టిక్ సినిమాలు సోలో క్యారక్టర్ గా చేస్తున్న తను ఈ చిన్న విషయం ఎందుకు తెలుసుకోలేదో తెలీదు. చైల్డ్ ట్రాఫిక్కింగ్ ని అడ్డుకోవాలన్న ఆమె మిషన్ కి ఏ డ్రమెటిక్ కారణం లేదు. పోనీ కథలో తనకి పరిచయమైన ఆ ముగ్గురు పిల్లల్ని చైల్డ్ మాఫియా కిడ్నాప్ చేసివుంటే, అప్పుడు ఓ బలమైన మోటివ్ ఏర్పడి వుండేది. ఇది కూడా జరగలేదు.

        పిల్లల సాయంతో చైల్డ్ మాఫియాని పట్టుకోవడానికి ఆమె చేసే ఇన్వెస్టిగేషన్, ప్లానింగ్, యాక్షన్ అన్నీ చైల్డిష్ గా, సిల్లీగా, చిరాకు పెట్టేవిగా వున్నాయి. తెలుగు రుణం తీర్చుకోవాలనుకున్న తాప్సీ రేపు ఉగాదికి కూడా తెలుగు వాళ్ళని ఇలా టార్చర్ పెట్టొచ్చా అన్పించేలా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, దర్శకుడు ఇలా పాత్ర రూప కల్పన చేశాడు. ఇందుకు ఎంతో అభినందనీయుడు.

        ఇక ముగ్గురు పిల్లలు. ఇలాటి బాలల పాత్రలకి ప్రాధాన్యమున్న సినిమాలో తెలుగు బాల నటుల్నైనా ప్రోత్సహిద్దామనే ఆలోచన మేకర్ కి రాలేదు. పరాయి వాళ్ళనే బాగా నటించారు, నవ్వించారు- అని మనం పొగడాలి. బాగానే నటించారు, బాగానే నవ్వించారు కాదనలేం. కామెడీ పేరుతో పిల్ల చేష్టలు మితిమీరి పోయాయి కూడా. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇదంతా ఫస్టాఫ్ 40 నిమిషాల సేపే. కథలోకి ప్రవేశించక  మునుపే. కథలోకి వచ్చాక ఆ కామెడీలు లేవు, ఫన్ లేదు సెకండాఫ్ లో కూడా.

        ఇక రామ్ శెట్టి అనే విలన్ పాత్ర వేసిన హరీష్ పి ఇంకో సిల్లీ పాత్ర. అంత పెద్ద పలుకుబడి గల మహా విలన్, అనుచరులు చేసే చిన్న చిన్న పనులు కూడా వీధిలోకొచ్చి తానే చేస్తూంటాడు. ఎందుకంటే తాప్సీ అతడ్ని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడానికి అనుకూలంగా వుండాలిగా? ఈ సినిమాలో ఏ పాత్రా ఆయా పరిస్థితుల్లో అదెదుర్కొనే  మానసిక స్థితిని బట్టి నడుచుకోదు. పాత్రలకి దర్శకుడే తన మానసిక స్థితినాపాదించి కథ నడిపిస్తూంటాడు. ఇందుకే ఈ కథ ఇలా వుంది. ఈ సినిమాని చూడడం దర్శకుడి మానసిక స్థితిని గ్రహించడమే.

        సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ థ్రిల్లర్ జానర్ మ్యూజిక్కిచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఏం దమ్ముందో బాణీలు కూర్చే సంగీత దర్శకులకి ముందే తెలిసి పోతూంటుంది. నిర్జీవ సన్నివేశాలకి స్వరాలతో ప్రాణం పోస్తే లేస్తాయా అన్న ఆశతో లేపడానికి ప్రయత్నిస్తారు. ఆ పైన దేవుడి దయ. ఇందుకే చాలా సినిమాలు సంగీతం గొప్ప, సినిమాలు దిబ్బలా వుంటాయి.

        కెమెరా మాన్ దీపక్ కూడా కళాకాంతులు లేని వ్యవహారాన్ని ఎలా తేజోవంతం చేయాలో అంతా చేశాడు. ఆ పైన దేవుడి దయ. ఇక ఎడిటింగ్ సహా ఇతర విభాగాలు సమయాను కూలంగానే పని చేశాయి. నిడివి రెండు గంటలకి లాక్ చేశారు.

చివరికేమిటి

        సినిమా టైటిల్లో 'మిషన్' బదులు 'మిషాన్' అని ఎందుకంటే, సినిమాలో చూపించిన పల్లెటూళ్ళో 'బార్బర్' బోర్డు 'బార్బార్' అయింది కదాని జస్టిఫికేషన్. సరే,  ఈ మధ్య వరసగా చిన్నా పెద్దా సినిమాలు సెకండాఫ్ కథ చేసుకోలేక ఫ్లాపవుతున్న వైనాన్ని రిపీట్ చేశాడు ఈ దర్శకుడు కూడా.

          ఫస్టాఫ్ కామెడీల కాలక్షేపాలు తీయడంలో అందరూ నిపుణులే. తీరా కథ ప్రారంభిస్తే అదెలా నడపాలో తెలియని అమాయకులైపోతారు. సెకండాఫ్ టార్చర్ పెట్టేస్తారు. ఈ సెకండాఫ్ టార్చర్లు ఇప్పట్లో తప్పేలా లేవు. దీనికి కారణాలు, నివారణలు కనుగొనాలన్న ఆలోచన కూడా చేయడం లేదు.

        చైల్డ్ ఆర్టిస్టుల్ని ఉపయోగించుకుని ఫస్టాఫ్ కామెడీలు లాగేశాక, తాప్సీతో పిల్లల్ని కలుపుతూ కథ ప్రారంభించేసరికి, సెకండాఫ్ ఈ చైల్డ్ మాఫియా కథ అగాథంలో పడిపోయింది. అర్ధం పర్ధం లేని దృశ్యాలతో నిండిపోయింది. చైల్డ్ ట్రాఫిక్కింగ్ తో చాలా సినిమాలొచ్చాయి. ఇంకా దీనికి మార్కెటబిలిటీ వుంటుందా. లేక దావూద్ కథతో కొత్త  మార్కెట్స్ ఇండియా వ్యాప్తంగా ఓపెనవుతాయా అన్న వివేచన లేకుండా సింపుల్ గా ఈ సినిమాని చుట్టేశారు తాప్సీ పేరు నుపయోగించుకుని.

        చివరి అరగంట, దాని తర్వాత ముగింపూ అయితే చెప్పక్కర్లేదు. 'ఏజెంట్ ఆత్రేయ' తీసిన దర్శకుడితో ఇలా ఎవరూ ఆశించరు. ఇప్పటికైనా అసలు కథంటే ఏమిటో పునరాలోచించుకుని సినిమాలు తీస్తే క్షేమం. ఎవరైనా సరే, సినిమాని సినిమాలాగా చూడాలన్న పడికట్టు పదాన్ని వల్లెవేయడం మాని, కథని కథ లాగా చూపించాలని గ్రహిస్తే మంచిది. పెరిగి పోయిన టికెట్ల ధరలకి ఇంకా సిల్లీ సినిమాలు తీస్తామంటే కుదిరే పరిస్థితి లేదు.
—సికిందర్

 

Friday, March 25, 2022

1151 : రివ్యూ!

 

దర్శకత్వం ; ఎస్ఎస్ రాజమౌళి
తారాగణం ;  ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్,
కథ : కెవి విజయేంద్ర ప్రసాద్, స్క్రీన్ ప్లే : ఎస్ ఎస్ రాజమౌళి, మాటలు : బుర్రా సాయి మాధవ్, సంగీతం : ఎంఎం కీరవాణి, ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్,  కూర్పు: ఏ శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ :  డివివి ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : డివివి దానయ్య
విడుదల : మార్చి 25, 2022

***
    స్ ఎస్ రాజమౌళి గ్లోబల్ స్థాయిలో ఇంకో అడుగు ముందుకేసి నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) అన్ని  రికార్డులు బ్రేక్ చేసే టార్గెట్ పెట్టుకుని ఎట్టకేలకు ఈ రోజు విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచే థియేటర్లు క్రిక్కిరిసి పోవడం ప్రారంభించాయి. ఇద్దరు పవర్ఫుల్ యువ స్టార్లు ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల డబుల్ ధమాకా కాంబినేషన్ ఇద్దరి ఫ్యాన్ బేస్ లని ఉర్రూతలూగిస్తోంది. మరి ఇంత వూరించిన 'ఆర్ ఆర్ ఆర్' ఇద్దరి ఫ్యాన్సుకీ, మిగతా ప్రేక్షకులకీ ఏ విధమైన సంతృప్తి నిచ్చింది? ఈ పానిండియా మూవీతో మరోసారి తెలుగు సినిమా స్థాయి నిలబెట్టుకుందా? తెలుసుకుందాం...

కథ

   1920 లో అప్పటి నిజాం రాజ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మల్లి అనే ఒక గిరిజన బాలిక గాత్రం నచ్చి ఒక బ్రిటిష్ అధికారి ఆమెని అపహరిస్తాడు. అడ్డుకున్న ఆమె తల్లిని అతడి అనుచరులు హతమారుస్తారు. దీంతో ఆ బాలికని  విడిపించుకుని తీసుకురావడానికి గిరిజన యువ నాయకుడు భీమ్ (ఎన్టీఆర్) ఢిల్లీ బయల్దేరతాడు. ఇటు భీమ్ ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఇన్స్ పెక్టర్ రామరాజు (రామ్ చరణ్) ని పురమాయిస్తుంది. భీమ్ - రామ్ ఇద్దరూ ఎవరికెవరూ తీసిపోరు. ఇద్దరి శక్తులు కలిస్తే బ్రిటిష్ పీఠం కదిలిపోతుంది. అయితే స్నేహితులుగా మారిన వీరిద్దరూ శత్రువులుగా విడిపోతారు. తిరిగి వీళ్ళు ఎలా కలిశారు, గిరిజన బాలిక విషయం ఏమైంది, విజయ రామరాజు (అజయ్ దేవగణ్) తో రామ్ కి వున్న సంబంధమేమిటి, సీత (ఆలియా భట్) ఎవరు, జెన్నీ (ఒలీవియా) ఎవరు... ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే మిగతా కథ వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలా వుంది కథ

    ఇది రొటీన్ గా మరో స్వాతంత్ర్య పోరాట కథ కాకపోవడం రిలీఫ్. స్వాతంత్ర్య పోరాట పూర్వపు నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళు అపహరించిన బాలిక కోసం ఇది కమర్షియల్ యాక్షన్ కథ. ఇలాటిదే కథతో, ఇదే రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన రాజన్న 2011 లో నాగార్జున హీరోగా వచ్చింది. ఇందులో నిజాం రాజ్యంలో సంగీతం తెలిసిన మల్లమ్మ అనే గిరిజన బాలిక చుట్టూ కథ వుంటుంది. ఆర్ ఆర్ ఆర్ లో మంచి గాత్రమున్న మల్లి అనే గిరిజన బాలిక చుట్టూ కథ! ఈ పోలికలు కన్పిస్తాయి.

   గిరిజన బాలిక కోసం జరిగే కథగా చూస్తే  ఆర్ ఆర్ ఆర్ అంత బలమైన మూవీ కాదు. బాలిక చుట్టూ ఎలాటి భావోద్వేగ బలం లేదు. అందుకని ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలకి భావోద్వేగాలు కల్పించి స్నేహాల, శతృత్వాల కథ నడిపారు. దీంతో పాత్రల  భావోద్వేగాల యాక్షన్ డ్రామాగా ఇది వుంటుంది.

నటనలు - సాంకేతికాలు


      పాత్రల భావోద్వేగాల యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఈ గ్లోబల్ మూవీని నిలబెట్టారు. ఇద్దరి నటనల్లో ఏ ఒకర్ని డామినేట్ చేయాలన్న ప్రయత్నం కనిపించదు. సుహృద్భావంతో పరస్పరం సహకరించుకుని నటించడం కన్పిస్తుంది. ఇద్దరికీ సమాన స్థాయి సజీవ పాత్రలు రూపొందించాడు దర్శకుడు రాజమౌళి. ఇద్దరి విడి విడి ఇంట్రో సీన్లు బిగ్ యాక్షన్ తో అదిరేట్టు వున్నాయి. ఈ ఇంట్రో సీన్స్ కే 40 కోట్లు వ్యయం చేశామంటున్నారు. ఎన్టీఆర్ ఎమోషనల్ క్యారక్టర్ అయితే, చరణ్ యాక్షన్ క్యారక్టర్. ఎమోషన్స్ తో ఎన్టీఆర్ ఫస్టాఫ్ ని, యాక్షన్ తో చరణ్ సెకండాఫ్ ని రాజ్యమేలారు.

   ఇద్దరూ కలిసి ఒక బాలుడ్ని రక్షించే సీను, మోటార్ బైక్, గుర్రాల మీద ఇద్దరి స్వారీ, ఫ్రెండ్ షిప్ లో నాటు నాటు వైరల్ సాంగ్, ఎన్టీఆర్ మీద కొమురం భీమ్ సాంగ్, శత్రువులుగా మారిన తర్వాత ఇంటర్వెల్లో ఇద్దరి మధ్య ఫైట్...ఇలా చెప్పుకుంటే ఎన్నో, ఒకరు నిప్పు అయితే ఇంకొకరు నీరు. ఈ రెండిటి సంఘర్షణతో కూడిన కథనం.

   ఈ పాత్రలు స్నేహం, శతృత్వం, ఉమ్మడి లక్ష్యం చుట్టూ వుంటాయి. రోమాన్స్ వుండదు, హీరోయిన్లు లేరు. వీటితో బాటు తగిన కథా బలం లేకపోయినా, ఎన్టీఆర్ - చరణ్ లు పూర్తిగా తమ టాలెంట్స్ తోనే విజయయాత్ర సాగించేశారు. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక అద్భుత మల్టీ స్టారర్ అనుకోవాలిది.

    ఇక సీత పాత్రలో అలియా భట్ కి పెద్దగా చేయడానికేమీ లేదు. పైగా తనది సంక్షిప్త పాత్ర. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో అజయ్ దేవగణ్ పాత్ర వల్ల సినిమాకి చేకూరిన బలం కూడా తక్కువే.

    సాంకేతికంగా చెప్పుకోవాలంటే బాహుబలి ని చూసిన తర్వాత రాజమౌళి వూహా శక్తి ఏమిటో తెలిసిందే. ఇప్పుడు బాహుబలి ని మించిన విజువల్ వండర్స్ ని సాధించడంతో  తను ఇంకో మెట్టు పైకి చేరుకున్నాడు. లొకేషన్స్, సెటింగ్స్, ఔట్ డోర్స్, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్...ఇలా ఒకటేమిటి- సర్వం వైభవోపేత కళా ప్రదర్శనే. యాక్షన్ సీన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గత సినిమాల్లో రాజమౌళి యాక్షన్ సీన్స్ ఏదో వొక హాలీవుడ్ మూవీ రిఫరెన్సుగా వుండేవి. ఈసారి ఒరిజినాలిటీని ప్రదర్శించాడు. హాలీవుడ్డే రిఫరెన్స్ గా తీసుకునేలా.


   యాక్షన్ సీన్స్, ఆడియో గ్రాఫీ, కొరియోగ్రఫీ, బీజీఎం .. ప్రతీ శాఖా అంతర్జాతీయ స్థాయి విలువలతో పోటీ పడ్డాయి. ఎం ఎం కీరవాణి నేపథ్య సంగీతం, పాటలు చెప్పుకోనక్కర్లేకుండా హిట్స్. సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ అయితే మగధీర’, బాహుబలి రెండు భాగాలకి మించి ఉన్నతమైన ఆర్ట్ వర్క్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మూడు గంటల 7 నిమిషాల నిడివిని లాక్ చేసింది.

చివరికేమిటి

    అపహరణకి గురైన గిరిజన బాలికని తిరిగి తెచ్చుకోవడమనే బలహీన స్టోరీలైన్ మీద ఈ మల్టీ బిలియన్ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారు. ప్రారంభంలో ఈ అపహరణని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, దీన్ని మరుగున పడేస్తూ ఫస్టాఫ్ గంటా 45 నిమిషాలూ కథలోకి వెళ్ళకుండా ఎన్టీఆర్, చరణ్ ల ఇంట్రోలు, క్యారక్టర్లు, బ్రోమాన్సులు, సాంగులు మొదలైన వాటితో గడిపేసి, ఇంటర్వెల్ లో బాలిక కథ కొచ్చి, స్టార్స్ ఇద్దరి మధ్య శతృత్వం పాయింటు కూడా కల్పించారు.


   ఫస్టాఫ్ లో కథని మరిపిస్తూ క్యారక్టర్ల మెగా షోగా టైము తెలియకుండా ఎంటర్ టైన్ చేసినా, సెకండాఫ్ ప్రారంభించేసరికి గిరిజన బాలిక అపహరణ అనే బలహీన కథే సవాలుగా నిలిచింది. ఇంటర్వెల్ లో ఈ బాలిక పాయింటు, శతృత్వాల పాయింటూ ఎస్టాబ్లిష్ చేశాక, సెకండాఫ్ ప్రారంభంలో అజయ్ దేవగణ్ తో ఫ్లాష్ బ్యాక్ వల్ల కూడా  సెకండాఫ్ ప్రారంభమే బాగా కుంగింది. మళ్ళీ చివరి అరగంటకే, యాక్షన్ సీన్స్ అందుకుంటే తప్ప, సెకండాఫ్ వూపందుకోలేదు. బలహీన కథ, ఫ్లాష్ బ్యాక్ ఈ రెండూ స్టార్స్ ఇద్దరికీ పెద్ద సవాలు విసిరాయి -  యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని నిలబెట్టమని. ఇందులో సక్సెస్ అయ్యారు. ఇద్దరి పాత్రలు, నటనలు గుర్తుండి పోయేలా. విఫలమవుతున్న తమిళ పానిండియాల కి తెలుగు పానిండియా ఇలా అందనంత దూరంలో వుందని తేల్చారు.

-సికిందర్


Friday, March 18, 2022

1150 : రివ్యూ!


రచన -దర్శకత్వం : శాంటో మోహన వీరంకి
తారాగణం : రాజ్ తరుణ్, ర్షా బొల్లమ్మ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ తదితరులు
సంగీతం : స్వీకార్ అగస్తి, ఛాయాగ్రహణం : శ్రీరాజ్ రవీంద్రన్
నిర్మాతలు :నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
విడుదల : మార్చి 18, 2022
***

        డేళ్ళ క్రితం కుమారి 21 ఎఫ్ విజయం తర్వాత 14 వరస పరాజయా లెదుర్కొన్న రాజ్ తరుణ్, గాయపడిన లేడిలా మరోసారి సక్సెస్ పులి ఎదుట నిల్చున్నాడు. స్టాండ్ అప్ రాజ్ తరుణ్ - అంటూ ధైర్యం తెచ్చుకుని పులితో 15 వసారి తలపడ్డాడు. హీరోలకీ  బాక్సాఫీసుకీ మధ్య ఈ కాపలా పులి శనిలా దాపురించింది. దీన్ని జయించిన వాడు దాని కిష్టమైన ఆహారాన్ని వేసి లొంగదీసుకుంటున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా జయించాలంటే పులి ఇష్టపడ్డ ఫుడ్డు వేయాలి. వేశాడా? పులిని దాటుకుని బాక్సాఫీసులోకి వెళ్ళాడా? స్టాండప్ కమెడియన్ గా ఏం చేశాడు? ఇవి చూద్దాం...

కథ

వైజాగ్ లో రాహుల్ (రాజ్ తరుణ్) ఒక స్టాండప్ కమెడియన్. తండ్రి ప్రకాష్ (మురళీ శర్మ), తల్లి ఇందుమతి (ఇంద్రజ) వుంటారు. వీళ్ళకి కొన్ని గొడవలొచ్చి విడిపోతారు. రాహుల్ తల్లితో వుంటూ ఎక్కడా సరిగ్గా ఉద్యోగం చేయలేక స్టాండప్ కామెడీలు చేస్తూ వుంటాడు. తల్లి అభ్యంతరం చెప్తుంది. ఇంతలో హైదరాబాద్ లో ఉద్యోగం వస్తుంది. అక్కడ ఉద్యోగం మాత్రమే చేస్తానని మాటిచ్చి హైదారాబాద్ వస్తాడు. ఉద్యోగంలో చేరాక అక్కడ శ్రేయ (వర్షా బొల్లెమ్మ) అతడ్ని ప్రేమిస్తుంది. తల్లిదండ్రులు విడిపోవడం చూశాక అతను ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద నమ్మకం కోల్పోతాడు. సహజీవనం చేద్దామంటుంది. ఒప్పుకుంటాడు. ఇప్పుడు సహజీవనం చేస్తూంటే అతను ప్రేమ విలువ, పెళ్ళి విలువ ఎలా గుర్తించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేని వాడు వాటి విలువని ఎలా గుర్తించాడనే ఎన్నోసార్లు సినిమాలుగా తీసిన పాత కథే. రెబెల్ కథ కాదు, రాడికల్ కథ కాదు. తల్లిదండ్రుల కారణంగా ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద వైముఖ్యమున్న వాడు ప్రేమకోసం ఎలా నిలబడ్డాడనేది చూపించదల్చుకున్నారు. పాయింటు చెప్తేనే రొటీన్ చట్రంలో వుందన్పిస్తున్నప్పుడు, కొత్త కథ చేయాల్సింది చేయలేదు. పాయింటుకి సహజీవనం కోణం కలిపినా పాత కథే. సహజీవనాలన్నీ సరాసరి వెళ్ళి పెళ్ళి సముద్రంలో కలుస్తాయన్నది సినిమాల్లో తెలిసిందే. కానీ ఇలా ఏవో విలువల్ని గుర్తించాల్సింది అతను కాదు, అతనలా తయారవడానికి ఏ విలువల్ని వదులుకున్నారో తెలుసుకోవాల్సింది పేరెంట్స్. ఇలాటి పేరెంట్స్ కి క్లాసు పీకే కథవ్వాలి తప్ప అతనేదో గుర్తించడం కాదు. ప్రేమతో పెళ్ళితో అతను రెబల్ గానే, రాడికల్ గానే నిర్ణయాలు తీసుకుని సోకాల్డ్ సొసైటీకి హెచ్చరికలు పంపిస్తే, దారికొస్తారు విడిపోవాలనుకుంటున్న, లేదా విడిపోయిన పేరెంట్స్. పెళ్ళిని పేరెంట్స్ గౌరవించనప్పుడు పిల్లలెందుకు గౌరవించాలి? ఉపయోగపడే ఇలాటి ప్రశ్నతో చేయాల్సిన ఆధునిక కథ.  

నటనలు- సాంకేతికాలు

రాజ్ తరుణ్ ఎంత నటించినా బాక్సాఫీసు దగ్గర పులి ఆవురావురని చూస్తోంది. దానికి మాంచి పౌష్టిక విలువలతో కూడిన దిట్టమైన స్క్రిప్టుని పడెయ్యాలి. స్క్రిప్టాకలితో పులి బాక్సాఫీసు ముందు బైఠాయించిందని తెలుసుకోనంత కాలం ఇంతే. తనకి నటన వచ్చినంతగా కథలు రావడం లేదు. అల్లరి నరేష్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు రాజ్ తరుణ్ నటించడానికి ఎన్నుకున్న కథలోనే కాదు, పాత్రలోనూ బలం లేదు. తన పాత్రే కాదు, అన్నిపాత్రలూ బలహీనపాత్రలే. పాత్రలు ఇంక డానికి తగిన కథలేదు, కథ ఇంకడానికి తగిన పాత్రచిత్రణ ల్లేవు. కథ అల్లడం, పాత్రచిత్రణలు చేయడం ఈ కొత్త దర్శకుడి పరిధిలో లేవు. సినిమా అంటే పైపై స్టయిలిష్ మేకింగే అనుకుంటే రాధేశ్యామ్ కూడా నిలబడలేదు. ఈ హెచ్చరికని స్మాల్ మేకర్స్ తీసుకోకపోతే ప్రేక్షకులు ఇచ్చింది తీసుకోరు.

        పాత్రపరంగా రాజ్ తరుణ్ పాత్రకి కన్ఫ్యూజన్ సృష్టిస్తే అది ప్రేక్షకుల పాలిట కన్ఫ్యూజన్  గా మారింది. దీన్ని వివరించాలంటే ఇక్కడ చోటు చాలదు. స్టాండప్ కమెడియన్ గా తను పేల్చిన జోకులు ఫస్టాఫ్ లో పేలలేదు, సెకండాఫ్ లో పేలాయి. ఈ స్టాండప్ కమెడియన్ పాత్ర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజా హెగ్డే చేసిందే. ఈమెది కూడా రాజ్ తరుణ్ పాత్రలాంటిదే- పేరెంట్స్ తో.

        ఇక హీరోయిన్ హర్షా బొల్లమ్మ పాత్ర హీరో ప్రేమించకపోతే, తనే సహజీవనం ప్రతిపాదించడం ఇంకో విఫల కథా పథకం. ఈ పని చేయాల్సింది హీరో రాజ్ తరుణ్. పెళ్ళిగిళ్ళి జాంతానై, సహజీవనానికి ఒప్పుకో, లేకపోతే తప్పుకో - అంటే అది క్యారక్టర్ లోంచి పుట్టిన కథనమవుతుంది. యాక్టివ్ పాత్రవుతుంది. లేకపోతే పాత్ర కోసం దర్శకుడు పుట్టించిన పాసివ్ పాత్ర కథనమవుతుంది. ఇలా హీరోయిన్ గా హర్ష కూడా తనకిచ్చిన బలహీన పాత్ర తీసుకుని, వచ్చిన నటన చేసింది.         
 
          మిగిలిన పాత్రల్లో పాత్రధారులు అనుభవమున్న వాళ్ళే. పాత్రలు సహకరించలేదు నటించడానికి.  ఇక విషయం లేని సినిమాలు సాంకేతికంగా ఎంత బావుంటాయో అంత బావుంది సాంకేతికుల పనితనం  ఛాయాగ్రహణం సహా. వీళ్ళకి కూడా రాజ్ తరుణ్ కొరతే- తగిన కథ! పోతే, పాటలు లేకపోతేనే బావుండేలా వుంది. ఈ పాటలతో ఒనగూడిన అదనపు విలువేమీ లేదు. కొత్త దర్శకుడు స్టయిలిష్ మేకర్ గా కొనసాగ దల్చుకుంటే కథా బలం కోరుకునే స్క్రిప్టులు కాకుండా, కథతో పనిలేని  మైండ్ లెస్ కామెడీలు ప్రయత్నిస్తే సరిపోవచ్చు.

—సికిందర్ 

 

 

ఈ రోజు స్టాండ్ అప్ రాహుల్ రివ్యూ,
రాధేశ్యామ్ స్క్రీన్ ప్లే సంగతులు.
రేపటి నుంచి కొంత కాలం విరామం.


Thursday, March 17, 2022

1149 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : చేతన్ కుమార్
తారాగణం : పునీత్ రాజ్కుమార్, ప్రియా ఆనంద్, శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం: చరణ్ రాజ్, ఛాయాగ్రహణం : స్వామి జె గౌడ
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
విడుదల : మార్చి 17, 2022
***

        టీవల ఆకస్మికంగా మృతి చెందిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలైంది. కన్నడ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీ అట్టహాసంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైనట్టు ప్రకటించారు. తెల్లారి నప్పట్నించే ఓవర్సీస్ నుంచి ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరవుతూ సూపర్ సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు నెమ్మదిగా టికెట్లు కొనుక్కుని తీరుబడిగా ప్రదర్శన శాలలోకి వెళ్తున్నారు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. కాసేపు పునీత్ ని చూస్తూ ఏసీ చల్లదనంలో సేద దీరవచ్చని సీట్లలో ఆసీనులవుతున్నారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం...

        థేమిటంటే... సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) ఒక సెక్యూరిటీ సర్వీసెస్  నిర్వహిస్తూంటాడు. ఇందులో భాగంగా విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) కుటుంబ సెక్యూరిటీ భాధ్యతలు తీసుకుంటాడు. విజయ్ గైక్వాడ్ ఒక మాఫియా. ప్రత్యర్థి మాఫియాతో అతడికి ప్రమాదం పొంచి వుంటుంది. అప్పటికే తన తండ్రిని చంపించేశాడు. ఇక చెల్లెలు నిషా (ప్రియా ఆనంద్) ని కూడా చంపించేస్తాడని భయం పట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్న సంతోష్, ప్రత్యర్ధి వర్గాన్ని అంతమొందించేస్తాడు. దీంతో సంతృప్తి చెందిన గైక్వాడ్, చెల్లెలు నిషాని సంతోష్ కిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఇంతలో  సంతోష్ గురించిన భయంకర నిజం తెలుస్తుంది. ఈ సంతోష్ అసలెవరు? ఎందుకిలా  కావాలని గైక్వాడ్ కి దగ్గరయ్యాడు? జేమ్స్ పేరుతో అతడి గత చరిత్రేమిటీ? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి...

        ఈ సినిమా చూస్తూంటే కొన్ని తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. అవేమిటనేది సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవాలి. అలా కలెక్షన్స్ పెరుగుతాయి. దర్శకుడు చేతన్ కుమార్ లో ఒరిజినాలిటీ అనేది లేదు. తెలుగు సినిమాల్ని కలిపి కన్నడ సూపర్ స్టార్ తో తీస్తూ, ఆ కలిపిన కథల్ని ఎలా నడపాలో కూడా తెలుసులేక పోయాడు. పురాతన రజనీకాంత్ బాషా టెంప్లెట్ ని వాడేశాడు. దీంతో నేటి సినిమాలాగా అన్పించడానికి ఈ కథ మొహమాట పడి ఇంటర్వెల్ కే తప్పుకుంది. అయితే సదరు తెలుగు సినిమాల్ని చూసినా చూడకపోయినా కన్నడ ప్రేక్షకులు తమ దివంగత స్టార్ సినిమా కాబట్టి ఆ భావోద్వేగాలతో హిట్ చేసేస్తారు.


        తెలుగు ప్రేక్షకులతో ఈ పాజిటివ్ ఫలితాలుండవు. తెలుగులో చూసిన నాల్గైదు సినిమాలిందులో వున్నాయి కాబట్టి- ఇవి  బాషా నీడన తలదాచుకున్నాయి కాబట్టి, జేమ్స్ గా మారిన బాషా కోసం పోటీలు పడి వచ్చే అవకాశం లేదు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో జేమ్స్ అనే సైనికుడు, అతడి దేశభక్తి, ఆ దేశభక్తితో మాఫియాల్నీ, రౌడీల్నీ కాల్చి చంపే పోరాట శక్తీ చూడాలి. ఎందుకిదంతా అంటే రివెంజీ కథ కోసం. కనుక సైనికుడు, దేశభక్తి, రివెంజీ కలిపితే పాత తరహా మసాలా యాక్షన్ ఫార్ములా జేమ్స్ అయింది.

        దీనికి పునీత్ రాజ్ కుమార్ పాత్ర, నటన ఏమాత్రం సహకరించవు. భావోద్వేగ సన్నివేశాలు అతి బలహీనపడి, చీటికీ మాటికీ యాక్షన్ దృశ్యాలు వచ్చేస్తూంటాయి. మంచి బాడీ వున్న పునీత్ ఫైటింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్ ఇవే హైలైట్ గా వుంటాయి. మిగిలిన విషయాలన్నీ అతుకుల బొంతలా వుంటాయి. పునీత్ కీ డూప్ ని వాడి అవసరమైన సీన్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇంత స్టార్ మూవీలో ఫ్యాన్స్ ని నవ్వించడానికో, ఆనంద పర్చడానికో ఎంటర్ టైన్మెంట్ అనేది కూడా లేకుండా సినిమా తీశాడు దర్శకుడు.

        ఇక హీరోయిన్ ప్రియా ఆనంద్ అద్భుత సౌందర్య రాశిలా మెరిసిపోతుంది. కానీ కథలో అదృశ్యమైపోతుంది. చివర్లో ఒక ట్విస్టు కోసం ప్రత్యక్ష మవుతుంది. ఇలా ఆమె ఒక పార్ట్ టైమ్ పాత్ర చేస్తుంది. తెలుగు హీరో శ్రీకాంత్ మాఫియాగా ఫర్వాలేదన్పించుకుంటాడు. పునీత్ సోదరులు శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ లు ఫ్యాన్స్ కి హుషారు తెప్పించడం కోసం దర్శనమిస్తారు. వీళ్ళుగాక ఇంకా అనేకమంది కన్నడ నటులతో ఈ సినిమా కిటకిటలాడుతూ వుంటుంది. ప్రొడక్షన్ విలువల కోసం భారీగా ఖర్చు చేశారు. కానీ చరణ్ రాజ్ సంగీతంలో పాటలు అంతంత మాత్రంగా వున్నాయి.  

        మాఫియాలకో నీతి వుంటుంది. అదేమిటంటే, తమ మధ్య గొడవల్లో కుటుంబాల్ని టార్గెట్ చేసుకో కూడదని. హిందీలో ఈ నీతితోనే  చూపిస్తారు. ఈ కన్నడలో మాఫియా నీతి లేకపోగా, పాత మాఫియా కథ చూపించారు.

—సికిందర్