రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 23, 2021

1030 : బాక్సాఫీసు


      త శుక్రవారం విడుదలైన నాల్గు సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. దేనికీ సరైన ప్రేక్షకులు లేరు. ఎంత అట్టహాసంగా పబ్లిసిటీ  చేసినా ప్రేక్షకులు స్పందించలేదు. ముఖ్యంగా మంచు విష్ణు -కాజల్ అగర్వాల్ లు నటించిన బిగ్ బడ్జెట్ మోసగాళ్ళు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్స్ ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇక మరో క్రేజ్ వున్న హీరో కార్తికేయ చావు కబురు చల్లగా ని కార్తికేయ కోసం కూడా థియేటర్లకి వెళ్లలేదు యూత్. పోతే సాయికుమార్ కుమారుడు ఆది నటించిన  శశి సంగతి కూడా ఇంతే. చివరగా మరో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ ఈ కథలో పాత్రలు కల్పితం  కనిపించకుండా గల్లంతయింది.

        నాల్గు సినిమాలకి దర్శకులు కొత్త వాళ్ళే. మోసగాళ్ళు కైతే అమెరికన్ దర్శకుడు! మోసగాళ్ళు శుక్ర శని ఆదివారం మూడు రోజులూ ఓవర్సీస్ కలుపుకుని అతి కష్టంగా కోటీ 32 లక్షలు వసూలు చేయగల్గింది. దీని బడ్జెట్ 50 కోట్లు! దీని ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు అని అంటున్నారు. బయ్యర్లకి భారీ నష్టం. నిర్మాతకి 20 కోట్లయినా  థియేటర్ కలెక్షన్లు రావాలి. ఇది అసాధ్యం.


        చావుకబురు చల్లగా బడ్జెట్ 9  కోట్లు. వసూళ్లు ఓవర్సీస్ కలుపుకుని 3 కోట్లు. భారీ నష్టం. శశి బడ్జెట్ 6 కోట్లు. వసూళ్ళు 34 లక్షలు. ఇక ఈ కథలో పాత్రలు కల్పితం అంకెలు లేవు. మోసగాళ్ళు’, చావుకబురు చల్లగా’, శశి  ఈ మూడూ 11 నుంచి 21 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో ప్రదర్శనలకి నోచుకున్నాయి.


        ఓటీటీల్లో విభిన్న కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, తెలుగు సినిమాల కంటెంట్ గురించి తెలిసిందే కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారని అర్ధం జేసుకోవాలి. జాతిరత్నాలు ని తప్పించుకోలేక పోతున్నారు. రెండో వారం కూడా ఓవర్సెస్ సహా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.


***

Monday, March 22, 2021

1029 : సందేహాలు -సమాధానాలు

Q : మీ‌ బ్లాగు మొదటి సారి నిన్ననే చూసాను. నాదొక సందేహం. కథ చేస్తున్నపుడు కథలో లోటు పాట్లు అనేవి ఎలా తెలుస్తాయి? వివరించ గలరు. మంచి పుస్తకం సజెస్ట్ చేయగలరు.
మణి కుమార్
A :  రైటర్ అవాలనుకుప్పుడు ముందు రైటింగ్ నేర్చుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టాలి. కథలు తర్వాత ఆలోచించ వచ్చు. సిడ్ ఫీల్డ్ పుస్తకం కొనుక్కున్నానన్నారు. బేసిక్స్ నేర్చుకోవడానికి అదొక్కటి చాలు. జోసఫ్ క్యాంప్ బెల్ భారీ గ్రంథం ఎందుకు కొన్నారు. అది హయ్యర్ స్టడీస్. బేసిక్సే నేర్చుకోకుండా హయ్యర్ స్టడీస్ దేనికి. ఏమర్ధమవుతుందని. ఏది పడితే అది కొనకండి. హాయిగా సిడ్ ఫీల్డ్ పుస్తకం ముందు పెట్టుకుని, 'శివ' సినిమా చూస్తూ స్ట్రక్చర్ ని స్టడీ చేయండి చాలు. ఒక ఆర్నెల్ల పాటు దీని మీదే వుండండి. అప్పుడా తర్వాత  కథలు  రాయడం నేర్చుకోవచ్చు. ఇంకేమీ చదవక్కర్లేదు, ఉన్నమతి పోతుంది. ఆర్ట్ ఫీల్డ్ అలాటిది. నాలెడ్జి ఎక్కువైపోతే ఎవరికీ అర్ధంగాని మేధావులై పోయి ఎవరికీ అర్ధం గాని కథలు చెప్తారు.

Q : సినిమాలకి ఐడియాలు బాగున్నా, సినిమాలు ఎందుకు ఫేయిల్ అవుతూ ఉంటాయి?  కొంచెం వివరించగలరు.
ఏపీజే, అసోసియేట్

A :  ఐడియాలు బావున్నాయని ఎలా తెలుస్తోంది? ఏం చూసి ఐడియా బావుందని అనుకుంటారు? ఏమిటి దాని సైన్సు? ఐడియాకి షీల్డుగా ముగ్గురు సెక్యూరిటీ గార్డు లుంటారు. 1. మార్కెట్ యాస్పెక్ట్, 2. ఆర్గ్యుమెంట్, 3. స్ట్రక్చర్. మార్కెట్ యాస్పెక్ట్ అది వేడి వేడిగా అమ్ముడుబోయే ఐడియాయేనా చూస్తుంది. అమ్ముడుబోయేదైతే దాని పొటెన్షియల్ ఏ స్థాయిలో వున్నదీ చూస్తుంది - లోకలా, గ్లోకలా? నాంది’, మోసగాళ్ళు వంటి ఐడియాలు గ్లోకల్ గా వెళ్లగల ఐడియాలైతే, లోకల్ స్థాయిలో తీసేశారు.

        ఇక ఆర్గ్యుమెంట్. ఇది కథకి సంబంధించి. అనుకున్న ఐడియాలో కథే వుందా, లేక గాథ వుందా చూస్తుంది. గాథ వుంటే సినిమాకి పనికిరాదు. ఐడియాలో ఆర్గ్యుమెంట్ కనిపిస్తే కథకి పనికొస్తుంది.

        చివరిది స్ట్రక్చర్. ఇది ఐడియాలో కన్పిస్తున్న కథకి స్ట్రక్చర్ వుందా చూస్తుంది. అందులో బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా చూస్తుంది. ఈ మూడూ నిర్దుష్టంగా వుంటే ఐడియా పనికొచ్చే ఐడియా అవుతుంది. మార్కెట్ యాస్పెక్ట్ + ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ = ఐడియా.      

 Q : రీసెంట్ గా జాతి రత్నాలు సినిమా చూశా. అసలు లాజిక్ లు ఏవీ పట్టించుకోకుండా కేవలం నటులను, వాళ్ళు చేసే కామెడీనీ నమ్ముకుని సినిమా తీశారు. అది పెద్ద హిట్ అయింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందా? లేదా లక్ అనుకోవాలా? ఇలా స్ట్రక్చర్ గురించి పట్టించుకోకుండా తీసిన సినిమాలు హిట్ అవుతుంటే, ఇంక స్ట్రక్చర్ అని ఎక్కడైనా మాట్లాడితే వాళ్లు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సినిమా సక్సెస్ వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కేవలం క్రియేటివ్ గా ఆలోచించి సక్సెస్ కొడితే సరిపోతుందా? ఇక స్ట్రక్చర్ ను పక్కన పెట్టాల్సిందేనా?
రమేష్, అసిస్టెంట్

A : పాయింటేమిటంటే, జాతిరత్నాలు లో కథే లేదు, లేనప్పుడు స్ట్రక్చర్ ప్రసక్తి ఎక్కడొస్తుంది. అందుకని  ఇలా కథే లేకుండా, మైండ్ లెస్ కామెడీగా, స్టాండప్ కమెడియన్ జోకులతో, జాతి రత్నాలు లాగా తీస్తూ వుంటే హిట్టవుతాయా అనడిగితే ఏం చెప్పాలి. సాంప్రదాయేతరంగా ఏది ఎలా హిట్టయిందని అన్పిస్తే, దాన్ని అలా తీయాలన్పిస్తే, తీయడమే. ఆపే వాళ్ళెవరూ లేరు.

        కథే లేని జాతిరత్నాలు లో స్ట్రక్చర్ చర్చ దేనికి? స్ట్రక్చర్ మీకు తెలిస్తే ఎక్కడా వాదన పెట్టుకోక మీ పని మీరు సైలెంట్ గా చేసుకుపోండి. స్ట్రక్చర్ ని పక్కన పెట్టాల్సిందేనా అని డిఫెన్స్ లో పడిపోతే స్ట్రక్చర్ నేర్చుకునే పని పెట్టుకోకండి. ఫ్లాపవుతున్న 90% సినిమాలూ స్ట్రక్చర్ వల్లే ఫ్లాపవుతున్నాయా? ఈ వారం తాజాగా ఫ్లాపయిన నాల్గూ స్ట్రక్చర్ వల్లే ఫ్లాపయ్యాయా? ఫిలిమ్ స్కూల్స్ లో స్ట్రక్చర్ పాఠాలు ఇక అవసరం లేదా? లక్షలకి లక్షలు బైట్స్ తో హాలీవుడ్ నుంచి స్ట్రక్చర్ వ్యాసాలు వెలువడుతూంటాయి. వాళ్ళు అనవసరంగా కష్టపడుతున్నారా? ఏ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీకొడుతున్నారో అవి స్ట్రక్చర్ తో వుండే సినిమాలు కావా? కాబట్టి వాదోపవాదాలు అనవసరం. ఒకటి నిజం. అసిస్టెంట్స్ స్థాయిలో ఇప్పుడు స్ట్రక్చర్ స్పృహ పెరుగుతోంది. వీళ్ళని నిర్మాతలు, హీరోలు ప్రోత్సహించే రోజులొస్తే బావుంటుంది. స్ట్రక్చర్ విశ్వసనీయత గురించి అనవసర సందేహాలు వద్దు.

Q : కరోనా తరువాత ఆడియన్స్ కేవలం కామెడీలు, బలమైన ఎమోషన్స్ మాత్రమే కోరుకుంటున్నారు అనిపిస్తుంది ఈ మధ్య వచ్చిన సినిమాలు చూస్తుంటే. కరోనా తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా మారింది అంటారా? వీటి గురించి మీ విశ్లేషణ చెప్పండి.
రవి, పి, అసోసియేట్

A : కామెడీలూ ఎమోషన్లూ ఎప్పుడూ వుండేవే గానీ, ఇప్పుడు నానాజాతి సస్పెన్స్ థ్రిల్లర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓటీటీల్లో గ్లోబల్ కంటెంట్ కి ఎక్స్ పోజ్ అవుతున్న యూత్ థియేటర్స్ లో అలాటివి కోరుకుంటున్నారు. వయోలెంట్ అడల్ట్ మూవీస్, రోమాంటిక్ సస్పెన్స్ మూవీస్. మేకర్లు ఈ జానర్స్ ని అర్ధం జేసుకోకుండా ఏవిటేవిటో లేకి సస్పెన్స్ థ్రిల్లర్లు టోకున తీసేస్తున్నారు. కాలంతో కలిసివచ్చిన అవకాశంతో, యూత్ కోరుకుంటున్న కంటెంట్ ని క్వాలిటీతో అందించకుండా, ఆ మధ్య కాలం వరకూ విసుగెత్తించిన రోమాంటిక్ కామెడీలు తీసి పడేసి నట్టు, చీప్ సస్పెన్స్ థ్రిలర్లతో ఆసక్తిని చంపేస్తున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, మేకర్లకి లిమిటెడ్ జానర్లే తెలుసు. ఆ ఒకటి రెండు లిమిటెడ్ జానర్లే ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ఎందుకు చూస్తారు, ఓటీటీ చూస్తారు.

Q : ఒక ఐడియా అనుకొని దాన్ని కథగా మలచాలి అనుకున్నప్పుడు అందుకోసం ఏమైనా మినిమం టైం పీరియడ్ పెట్టుకోవాలా? లేక ఐడియా మీద ఎక్కువ రోజులు పని చేయాలా? ఎందుకంటే ఒక్కోసారి ఎన్నిరోజులు ఆలోచించినా కథ రెడీ అవదు. అప్పుడు అరే ఈ ఐడియా మిస్ అవుతున్నామే అనుకుంటాం. ఒక్కోసారి ఐడియా బాగున్నా ఆ సమయానికి మనం కథ చేయలేకపోతాం. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? దీని గురించి వివరించగలరు.
వీడియార్, అసోసియేట్

A : పైవొక ప్రశ్నకి చెప్పిన విధంగా, ఐడియా నిర్దుష్టంగా కుదిరే వరకూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు కుస్తీ పట్టాల్సిందే. ఐడియాగా కుదరనిది కథగా కుదరదు. బిందువుగా తెలియనిది సింధువుగా తెలియదు. ఎన్ని రోజులాలోచించినా కథ రెడీ అవడం లేదంటే ముందుగా ఐడియాని ఆలోచించక పోవడం వల్లే. ఐడియా ఆధారంగా బిగినింగ్ మిడిల్ ఎండ్ లతో సుస్పష్టమైన 20 పేజీల ( రైటింగ్ లో 50 పేజీలు) సినాప్సిస్ సిధ్ధం చేసుకోక పోవడం వల్లే. చేసే పని సిస్టమాటికల్ గా చేస్తే అయోమయం వుండదు.

Q : విడుదల అయిన 10 రోజుల్లోపే ఓటీటీ లోకి వచ్చిన గాలి సంపత్ అనే సినిమా చూశాను.  అసలు జానర్ మర్యాదను మంట కలిపి చాలా నిర్లక్ష్యంగా చేసిన స్క్రిప్టు అది అనిపించింది సినిమా చూస్తే. మీకు కుదిరితే అన్ని జానర్ మర్యాదల గురించి మా కోసం ఒక పిడిఎఫ్ ఫైల్ పెట్టగలరు. ఇప్పటికే పెట్టి ఉన్నట్లు అయితే మరొకసారి పోస్ట్ చేయగలరు.
సచిన్, జి, అసిస్టెంట్

A : ఆల్రెడీ ఒక పోస్టు పెట్టాం. ఇప్పుడు కుదిరేలా లేదు. సెర్చి బాక్స్ లో జానర్ మర్యాదలు అని తెలుగులో కొడితే వ్యాసాలు కనపడతాయి. అవి తీసుకోండి.

(కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. అవి వచ్చే వారం)

సికిందర్

  

Sunday, March 21, 2021

1028 : 'మోసగాళ్ళు' ఐడియా


(ఆదివారం Q&A సోమవారం వెలువడుతుంది)
      న్ని నదులూ వెళ్ళి సముద్రంలో కలుస్తాయన్నట్టు అన్ని జానర్లూ వెళ్ళి తెలుగులో మూస టెంప్లెట్ లో కలిసి పోతాయి. మోసగాళ్ళు తో ఈ ముచ్చట మరోసారి తీర్చుకున్నారు. హీరోయే కథా రచయిత, దీని అమెరికన్ దర్శకుడు ఇంకో రచయిత, మరో ఇద్దరు తెలుగు రచయితలు, ఇంకో మాటల రచయితా...ఇంత మంది కలిసి 50 కోట్ల బడ్జెట్ తో ఆశ్చర్య పర్చారు. సినిమా కథ రెండు వేల కోట్ల స్కామ్ గురించైతే, సినిమా సమస్య 50 కోట్ల బడ్జెట్ గురించి. రెండువేల కోట్ల స్కామే చేస్తున్నాం కాబట్టి 50 కోట్లు పోతే పోయాయనుకున్నారేమో. ఆ రెండు వేల కోట్లు ప్రేక్షకులకైనా పంచి పెడితే నష్టపరిహారంగా వుంటుంది. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ లు ఆ డబ్బు ఎక్కడ దాచేశారో తెలియదని ముగింపు ఇచ్చారు. ప్రేక్షకులు దాన్ని కనిపెట్టి దోచుకోవడం మీద ఇక దృష్టి పెట్టాలి.

        2016 లో ముంబాయిలో మీరా రోడ్ స్కామ్ అనే కాల్ సెంటర్ మోసం జరిగింది. కాల్ సెంటర్ ఉద్యోగులు అమెరికన్లని ఐఆర్ఎస్ అధికారులమని ఫోన్లు చేసి, ఆదాయపన్ను ఎగవేత దార్లు అంటూ వాళ్ళని బెదిరించి, రెండు వేల కోట్లు బకాయిల పేర దండుకున్నారు. దీని మాస్టర్ మైండ్ షాగీ రవీందర్ పశుహా అనే పాతికేళ్ళు నిండని వాడు. రెండేళ్ళూ ఇది సాగించాక పోలీసులకి దొరికిపోయాడు. ఈ కేసే మోసగాళ్ళు కథ కాధారం. షాగీ పాత్ర విష్ణు పోషించాడు. షాగీకో అక్క వుంది. అక్క పాత్ర కాజల్ పోషించింది.

        కాల్ సెంటర్ బాస్ నవదీప్ కి ఈ అక్కా తమ్ముళ్ళు సహకరించి, కాల్ సెంటర్ ఉద్యోగులతో కలిసి ఐఆర్ఎస్ పేరుతో అమెరికన్లని మోసం చేసి సంపన్నులై, ఎలా దొరికిపోయారన్నది కథ. ఈ ట్రూ క్రైమ్ (నిజంగా జరిగిన నేరం) జానర్ కథ ఐడియాలో లోడ్ అయివున్న శక్తివంతమైన బహుముఖ ప్రయోజనాల వైపు దృష్టి సారించకుండా, తెలిసిన, అలవాటయిన ఒకే ఒక మూస టెంప్లెట్ లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఎగ్జిక్యూషన్ కి అయిన ఖర్చు 50 కోట్లు. అన్ని మరణ శిక్షలకీ ఉరి కంబమే అన్నట్టు, అన్ని జానర్ల కథలకీ అదే టెంప్లెట్- మూస టెంప్లెట్. ఈ మూసలో ఆశ్చర్య కరంగా దీని అమెరికన్ దర్శకుడు వచ్చి కలిసిపోవడం కొసమెరుపు. కలిసిపోయేట్టు చేస్తుంది తెలుగు మూస. క్వెంటిన్ టరాంటినో ని తీసుకొచ్చినా చేస్తావా చస్తావా అన్న పరిస్థితే వుంటుంది. మా పద్ధతిలో మా బాక్సాఫీసు పనితీరు ప్లస్ 50% అయితే, మీ పద్ధతిలో మీ బాక్సాఫీసు మైనస్ 90% కదా అని టరాంటినో గనుక అంటే, మా పద్ధతిలో మాకు మైనస్ 90% మాత్రమే కావాలని విజయవంతమైన పట్టుదల.

        జరిగిన ట్రూ క్రైమ్ ని పరిశోధన చేసి రాశామన్నారు. ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో వున్నదే. డొమైన్లో వున్నది వున్నట్టు సినిమా తీస్తే పరిశోధన అవుతుందా? స్టోరీ ఐడియా అవుతుందా, ఎత్తి రాసిన వార్తా కథన మవుతుందా? డొమైన్లో వున్న విషయం కాక కొత్తగా ఏం చూపించారు, ఏం చెప్పారు?

        స్కామ్ చేసి దొరికిపోయిన షాగీ డబ్బెక్కడుందో పోలీసులు కనుక్కోలేకపోయారు. స్కామ్ చేసి దొరికిపోయిన అక్కాతమ్ముళ్ళు డబ్బెక్కడ దాచారో తెలియదని సినిమాలో కూడా షాగీ కేసు ముగింపే  ఇచ్చారు. ఇందులో పరిశోధన ఎక్కడుంది? స్టోరీ ఐడియా ఏముంది?

        ట్రూ క్రైమ్ కేసు అంతు చిక్కకుండా వుంటే, దాన్ని పరిశోధించి సమాధానమిచ్చేది ట్రూ క్రైమ్ జానర్. సంచలనం సృష్టించిన జెస్సికా లాల్ హత్య కేసుతో తీసిన  నో ఒన్ కిల్డ్ జెస్సికా తో దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ పనే చేశాడు. మరో సంచలనాత్మక ఆరుషి హత్య కేసు గురించి తల్వార్ తీసి ఈ పనే చేసింది దర్శకురాలు మేఘనా గుల్జార్. వీళ్ళిద్దరూ తేలని ఈ కేసుల్లో ఇలా జరిగుండ వచ్చని పరిశోధనాత్మక అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ రెండు సినిమాలూ చర్చనీయాంశాలయ్యాయి. హాలీవుడ్ బ్లాక్ ఢాలియా’, జోడియాక్ వంటి ట్రూ క్రైమ్స్ కూడా ఇలాటివే. మోసగాళ్ళు తో ఇలా నోటెడ్ అయ్యే అవకాశాన్నికోల్పోయారు మూస టెంప్లెట్ తో. దీని ఐడియాలో దాగున్న మార్కెట్ యాస్పెక్ట్ లాభాలని పట్టించుకోలేదు. ఐడియా - ఐడియా విశ్లేషణతో మార్కెట్ యాస్పెక్ట్, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ - ఇవంటే పడక పోతే ఇలాగే వుంటుంది.

***

         2. పై దృక్పథం ఒకటుంటే ఐడియాలో లోడ్ అయి వున్న బుల్లెట్ ప్రయోజనాలు పూర్తయినట్టా? కాదు. ఈ స్కామ్ లేవనెత్తుతున్న ప్రశ్నలు తీవ్రమైనవి. దేశ ప్రతిష్టకి సంబంధించి కూడా. షాగీ కోటి 20 లక్షల మందిని అమెరికన్లని బెదిరించాడు, 6,400 మంది నుంచి రెండువేల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ముంబాయిలోనే గాక ఇంకో నాల్గు నగరాల్లో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి, 700 మంది ఉద్యోగులతో కాల్స్ చేయించాడు. ఉద్యోగులు ఐఆర్ఎస్ తరపునే తమ సంస్థ పని చేస్తోందన్న నమ్మకంతో వుండిపోయారు. విలాసవంతమైన జీవితం గడిపాడు. గర్ల్ ఫ్రెండ్ బర్త్ డేకి రెండున్నర కోట్ల రూపాయల బహుమతి ఇచ్చాడు.

        స్కామ్ ఆలస్యంగా అమెరికాలో ఐఆర్ఎస్ కి, ఎఫ్బీఐ కీ లీకై ముంబాయి పోలీసుల్ని ఎలర్ట్ చేశారు. ముంబాయి పోలీసులు పట్టుకోబోతే దుబాయి పారిపోయాడు షాగీదుబాయి నుంచి పట్టుకొచ్చి లోపలేస్తే, బెయిల్ మీద విడుదలై దర్జాగా తిరుగుతున్నాడు షాగీ. రూపాయి కూడా షాగీ నుంచి వసూలు చేయలేకపోయారు. స్కామ్ తో సంబంధమున్న అతడి అక్కని అరెస్ట్ చేశారు. 700 ఉద్యోగుల్నీ అదుపులోకి తీసుకుని చాలా మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళల్లో ఉద్యోగినులు కూడా వున్నారు.  

        స్కామ్ వల్ల అమెరికన్లే కాదు, ఇండియాలో 700 మంది ఉద్యోగులూ మోసపోయారు. చేస్తున్నది స్కామ్ అని తెలియకుండానే కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ బాధితుల పరిస్థితి ఏమిటి? వీళ్ళ కథ లేమిటి? ఇలా మోసపోయే వాళ్ళు ఏం నేర్చుకోవాలిందులోంచి? ఇది చూసి ప్రేక్షకులు ఏం నీతి గ్రహించాలి? స్కామ్ చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు. మోసగాళ్ళు ని తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తామని చెప్పారు. కానీ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? జాతీయ సమస్య అయిన దీనిగురించి జాతీయ స్థాయికి తీసికెళ్ళే అవకాశాన్నికూడా కోల్పోయారుగా- తెలుగుకే పరిమితమైన మూస టెంప్లెట్ తో?

***

        3. ఇక వేల మంది అమెరికన్ బాధితుల పరిస్థితి... మీ ఇంటికి మా అఫీషియల్స్ వస్తారు, వీధిలో మీ పరువు తీస్తారు, మూడు నెలలు జైల్లో వేస్తారు, మీ కార్డులన్నీ రద్దు చేస్తారని బెదిరిస్తూంటే, ఏడ్చి అలా చేయవద్దని హీనంగా బతిలాడుకున్నారు అమెరికన్లు. ఈ బాధితుల పరిస్థితేమిటి? కథ లేమిటి? ఇలా ఫూల్స్ అవకుండా ఏం నేర్చుకోవాలిందులోంచి?  ఇలాటి సైబర్ క్రైమ్స్ కి బకరాలవుతున్న వాళ్ళని చూసి ప్రేక్షకులేం నేర్చుకోవాలి?  మోసగాళ్ళు ని ఇంగ్లీషులో అమెరికాలో కూడా విడుదల చేస్తామన్నారు. ఇందులో దానికి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? మా వోడు మీ వాళ్ళని ఫూల్స్ చేసి దోచుకుంటే మీరేం చేయలేక పోయారనీ, వాణ్ణి  అమెరికాకి లాక్కొచ్చి జైల్లో వెయ్యలేక పోయారనీ, అమెరికాకి చెబుతున్న అర్ధంలో సినిమా వుంటే, ఏమంత బావుండదేమో? అక్కడి ఇండియన్ల గురించి కూడా ఆలోచించాలేమో?

        ఈ కథలో హీరో చేసిందంతా చేసి, పోలీసులు పట్టుకోబోతూంటే పరివర్తన వచ్చేస్తుంది. చాలా తప్పు చేశానని బాధపడిపోతాడు. పోలీసులకి దొరక్కుండా దుబాయి పారిపోతానంటాడు. అక్క వద్దంటుంది. పోలీసులకి లొంగిపోయి హేపీగా బేడీలు చూపిస్తాడు. పది నెలలే జైలు శిక్ష పడి విడుదలై వచ్చేస్తాడు. దాచుకున్న డబ్బుతో అక్కాతమ్ముళ్ళు ఫుల్ - ఫుల్- ఫుల్ హేపీ! ఈ ఐడియాకి లోకల్ గానైనా మార్కెట్ యాస్పెక్ట్ గనుక వుంటే, 2 వేల కోట్లకి 50 కోట్లు కలిపి ఇచ్చేయచ్చు. మనకి 5 రూపాయలు మిగిలినా చాలు. మినీ సిగరెట్ వస్తుంది. మస్తుగా దమ్ము కొట్టొచ్చు.

***

        4. ట్రూ క్రైమ్ జానర్ కి ప్రత్యేక క్రియేటివ్ యాస్పెక్ట్ వుంటుంది. ఐడియాతో పైన చెప్పుకున్న నిజమేంటో చెప్పగల దృక్పథంతో బాటూ, దర్శకుడి పర్సనల్ యాంగిల్ వుంటుంది. నేరస్థుణ్ణి చూపిస్తూనే, అతడికి బలైన బాధితుల గురించీ చూపించే యాంగిల్ వుంటుంది. అప్పుడే ఇతర థ్రిల్లర్స్ కి తేడాగా వుంటుంది. పన్ను ఎగవేతలూ, చిన్న చిన్న నేరాలూ ట్రూ క్రైమ్స్ జానర్ కి పనికి రావు. హత్యలూ బ్యాంకు దోపిడీలూ వంటివి వుండాలి. జానర్ మర్యాదలు
క్రైమ్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్, డ్రామా, టెన్షన్, హై రిస్కూ కలిసి వుండాలి. ఒక ట్రూ క్రైమ్ కేసు దొరికింది కదాని దాన్ని మాత్రమే రీసెర్చి చేసేస్తే సరిపోదు. స్క్రిప్టు విధివిధానాల కోసం కూడా జానర్ రీసెర్చి చేసుకోవాలి. అలా వచ్చిన ఇతర సినిమాల్ని జానర్ మర్యాదల కోసం పరిశీలించాలి.

        స్కాంని బయట పెట్టి విలన్ని పట్టుకునే కథల్లో ఇక నావెల్టీ లేదు. ఇది చాలా అరిగిపోయిన టెంప్లెట్. ఆ మధ్య హిందీలో ఇమ్రాన్ హాష్మి తో  వై చీట్ ఇండియా’ అనే ట్రూ క్రైమ్ వచ్చింది. ఇందులో హీరో డబ్బున్న విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకునితెలివైన పేద విద్యార్ధులకి కొంత డబ్బిచ్చి ఎంసెట్ పరీక్షలు రాయించిడబ్బున్న విద్యార్ధుల్ని పాస్ చేయిస్తూంటాడు. ఇతణ్ణి ఎలా పట్టుకుంటారనేదే కథ. ఈ హీరోని పట్టుకుంటే ప్రేక్షకుల కేంటిపట్టుకోకపోతే ఏంటి?

        హీరో అవతల తను టార్గెట్ చేసిన పేద, ధనిక వర్గాల విద్యార్ధుల వైపు నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచీ కూడా కథ చెప్తే పట్టించుకుంటారు ప్రేక్షకులు. దర్శకుడు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో వున్న, తెలిసిన కేసునే పట్టుకుని అలాగే తీసేశాడు. ఫ్లాపయింది. పేరెంట్స్ తమ పిల్లల్ని అమెరికా చేర్చాలని కలలు గని చేసే పనులెలా వుంటాయో  చూడండని కథా ప్రారంభంలోనే చెప్పి మర్చిపోయాడు దర్శకుడు.

***
        5. నిఖిల్ నటించిన అర్జున్ సురవరం’ అనే ట్రూ క్రైంలో కూడా ఇంతే. నిఖిల్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో జాబ్ చేస్తున్నాడని పోలీసులు పట్టుకున్నాక, ఈ స్కామ్ చేస్తున్నదెవరో పట్టుకోవడానికి బయల్దేరతాడు. ఈ పాత టెంప్లెట్ ఫ్లాపయింది. స్కామ్ ఎవరు చేస్తే ఏమిటి, ఎవర్ని పట్టుకుంటే ఏంటి?

        హీరో నిందితుడిగా పట్టుబడితే ఎవరిక్కావాలినిర్దోషిగా నిరూపించుకుంటే  ఎవరిక్కావాలిఈ కథలు ఎప్పటివి? నకిలీ సర్టి ఫికెట్లు కొంటున్న స్టూడెంట్స్ అనేకం వుంటున్నారు. వాళ్ళ జీవితాలతో దీని విష పరిణామాలు చూపిస్తే ట్రూ క్రైమ్ జానరవుతుంది. నకిలీ సర్టిఫికేట్లు కొనే స్టూడెంట్స్ నైతికసామాజిక స్థితి ఏ గతి పడుతుందో హెచ్చరిస్తే ప్రయోజనముంటుంది. ఉత్తరప్రదేశ్ లో వేల మంది ఇలాగే మోసపోయి, నకిలీ సర్టి ఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారని దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళ గతేమిటిడ్రమెటిక్ క్వశ్చన్ ఇదీ.

***
        6. మోసగాళ్ళు లో అక్కాతమ్ముళ్ళ జీవితాల్ని చిన్నప్పట్నుంచీ చూపించే కాలం చెల్లిన టెంప్లెట్ తో ఎత్తుకున్నారు. పేదరికంతో ఆ కష్టాలూ పేరెంట్స్ కన్నీళ్లూ చూపించుకొచ్చారు. పెద్దవాడై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు హీరో. ఒక స్ట్రీట్ బాక్సింగ్ లో పాల్గొనే టెంప్లెట్ ఎంట్రీతో జాబ్ చేస్తూంటాడు. అక్క ఎకౌంటెంట్ గా వేరే చోట వుంటుంది. ఆమెని డబ్బుకోసం వేధించే భర్త వుంటాడు. ఇతణ్ణి వదిలించుకోవడానికి డబ్బు కావాలి. ప్లస్ పేరెంట్స్ కి రిచ్ లైఫ్ ఇవ్వాలి. అందుకని స్కామ్ కి ఒప్పుకుని, అమెరికన్లని స్కామ్ చేస్తారు. దొరికిపోతారు. దొరికిపోయాక హీరో మాత్రమే జైలు కెళ్తాడు. సీను తిప్పితే, పది నెలల్లో శిక్ష ముగించుకుని విడుదలైపోయి - హేపీ ఎండింగ్ ఇస్తాడు- దాచుకున్న డబ్బుని అక్కతో కలిసి ఎంజాయ్ చేయడాయినికి!

 దోచుకున్న డబ్బు సరేందర్ చేయకుండా మారిపోయానని  జైలుకెళ్ళడ మేమిటి. విడుదలై వచ్చి ఆ డబ్బుని ఎంజాయ్ చేయడ మేమిటి! ఇదేం కథ!

        ఈ కథలో మూసఫార్ములా సినిమాల్లో చూసి చూసి వున్న ఇంకా చాలా టెంప్లెట్ సీన్లున్నాయి. పేరెంట్స్ ని రిచ్ బంగళాకి తీసుకొచ్చి చూపించే అరిగిపోయిన రొటీన్ సీను సహా.        హీరో నేరం చేయాడానికి పేదరికం, ఇతర కష్టాలూ అనే టెంప్లెట్ జస్టిఫికేషన్. కానీ స్కామ్ చేసిన షాగీ అనేవాడు చిన్నప్పట్నుంచే మోసగాడు. మోసాలు చేయడమే వృత్తి. జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్ ని చట్టం ఒప్పుకోదు. డ్రీమ్ వరల్డ్ టెంప్లెట్లు రియల్ వరల్డ్ లోకి రావాల్సిన టైమ్ వచ్చేసింది. హీరో నేరాలు చేశాడు, కానీ మంచి కోసమే చేశాడన్న బుజ్జగింపుల కిక లొంగరు ప్రేక్షకులు. రియల్ వరల్డ్ కావాలి.

        మెడికల్ సీట్ల స్కామ్ మీద ఇటీవలి హిందీ హాలాహల్ అనే ట్రూక్రైమ్, రియల్ వరల్డ్ నే చూపిస్తుంది. మాఫియాలే గెలుస్తారు, కూతుర్ని పోగొట్టుకున్న డాక్టర్ అయిన బాధితుడు గెలవడు. మిగిలిన  కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, మాఫియా ఇస్తానన్న డబ్బుతో మంచి హాస్పిటల్ కట్టుకుని సెటిల్ అవాల్సిందే. మాఫియా మీద పోరాడే ఎస్సై హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. లారీ చక్రాల కిందికి వచ్చేసి. ఎస్సై అనేవాడు పై అధికారులూ నాయకులూ చెప్పేది విని, లంచాలతో ఉద్యోగం చేసుకోవాలే గానీ, ఠాట్ ఠీట్ బాధితుడికి న్యాయం చేస్తా, కనిపించని నాల్గో సింహాన్ని నేనూ అంటూ ఓవరాక్షన్ చేస్తే, ఎంత హీరో అయినా కన్పించకుండా పోతాడు. రియల్ వరల్డ్ సెటప్.   

        అన్ని నేరాలు చేసిన హీరో ఇంకా మారిపోయే టెంప్లెట్టా? జస్టిఫికేషన్ కోసం మార్పు అనే డ్రీమ్ వరల్డా? దేశంలో, బయటా అంత మందిని బాధించిన వాణ్ణి తీసి కెళ్ళి అమెరికా జైల్లో పడేసి ఇండియా పరువు నిలబెట్టక?

        హీరో క్రిమినల్ పాత్ర వేస్తే క్రిమినలే. క్రిమినల్ గా మారితే ఏమేం జరుగుతాయో కఠిన శిక్ష సహా చూపిస్తే ఎక్కువ నమ్మి ఆలోచనలో పడతారు ప్రేక్షకులుఅలాటి పన్లు తాము చేయకుండా జాగ్రత్త పడతారు. అదే శిక్ష పొందిన క్రిమినల్ గా విలన్ పాత్రని చూపిస్తే ఏ ప్రభావమూ వుండదు. ఇలా ఈ వాస్తవ కథతో మంచు విష్ణు వాస్తవం కాని డ్రీమ్ వరల్డ్ లో బుజ్జగిస్తూ వుండిపోయాడు.

        ఇక సినిమాలో ఏ సీన్లు ఎందుకొస్తున్నాయో, స్ట్రక్చర్ ఏమిటో అంతుబట్టకుండా, చప్పగా సాగుతుంది. కనీస స్థాయి థ్రిల్లర్ లక్షణాలు కూడా లేకుండా. డైలాగులు మాస్ సినిమా డైలాగులుగా వుంటాయి, జానర్ స్పెసిఫిక్ గా కాకుండా. అమెరికన్ దర్శకుడు విషయం లేని దీనికి కెమెరాతో చీకాకు పెట్టే టెక్నికల్ హంగామా చేస్తూ వుండి పోయాడు. మూస టెంప్లెట్ సినిమాలు బాక్సాఫీసు సినిమాలు కావు, అవిప్పుడు బి గ్రేడ్ సినిమాలవుతాయి. 

సికిందర్

 


Thursday, March 18, 2021

1027 : సాంకేతికం

     కొన్ని సినిమాల్లో ఓ షాట్ స్ట్రెస్ బస్టర్ లా వెంటపడుతుంది. ఆ షాట్ ని గుర్తు చేసుకుంటే మానసిక వొత్తిళ్ళు దూరమైపోయేంత బలం వాటికుంటుంది. సినిమా మొత్తం మీద ఆ షాటే గుర్తుండిపోతుంది. ఆఫ్ కోర్స్, ఇది చూసే వాళ్ళ దృష్టిని బట్టి వుంటుంది. సినిమా కథలు, స్క్రీన్ ప్లే వెతలూ లోకమైపోయిన వాళ్ళకి షాట్స్ మీద క్రియేటివ్ దృష్టి ఎక్కువ వుంటుంది. ఎందుకంటే సినిమా కథలంటేనే, స్క్రీన్ ప్లేలంటేనే షాట్స్ తో విజువల్ గా ఆలోచించడం. సినిమా కథ ఆలోచించడమంటే మేస్త్రీలా కథలో పడి తిరుగుతూ విజువల్ గా ఆలోచించడమే, మహర్షిలా వ్యాసం రాయడానికి కూర్చుని ఆలోచించినట్టు కాదు. విజువల్ సెన్స్ తో సినిమాలు చూసినప్పుడు ఎక్కడ బడ్జెట్ వృధా అవుతోంది, ఎక్కడ ఆదా అవుతోందీ తెలుస్తుంది. సినిమాలకి స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్ కావాలి. స్టోరీ రైటింగ్ సీన్లు చూస్తుంది, స్టోరీ మేకింగ్ షాట్లు చూస్తుంది. స్టోరీ రైటింగ్ ఒక విషయాన్ని మూడు సీన్లలో చెప్పి బడ్జెట్ ని వృధా చేస్తుంది. స్టోరీ మేకింగ్ మూడు సీన్లతో చెప్పే విషయాన్ని ఒక్క షాట్ తో చెప్పి బడ్జెట్ ని ఆదా చేస్తుంది. దర్శకత్వ మంటే సెట్స్ లో చేసేది కాదు, హిచ్ కాక్ లా పేపర్ మీద చేసేది. హిచ్ కాక్ కి రచయితలతో అంత ఓపికుండేది. వాళ్ళతో కలిసి పేపర్ మీదే పడుండే వాడు. బాలీవుడ్ లో అంత ఓపిక ఇప్పుడూ వుంది. రచయితల తోడ్పాటు లేకుండా షూటింగ్ స్క్రిప్టే పూర్తి చెయ్యరు. ఇందాకా తాజాగా సెల్ టెక్స్ లో హై ఫైగా వున్న ఒక డైలాగ్ వెర్షన్ తో పూర్తయిన స్క్రిప్టుని చూస్తూంటే, అందులో దర్శకత్వం కనిపించడం లేదు. ఒక చోట ఏక బిగిన అరగంట స్క్రీన్ స్పేస్ వృధా అయ్యే సీన్ల పరంపర వుంది. అరగంట స్క్రీన్ స్పేస్ అంటే బడ్జెట్ లో పావు వంతు. రెండు కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో 50 లక్షలు అనాలోచిత సీన్లతో వృధా వృధా. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బతకడానికే ఇది, సినిమా కాదు. స్టోరీ రైటింగ్ ఫలితం ఇలా వుంటుంది.

        రే, వెంటాడే షాట్స్ రెండు రకాలు : నటనా పరమైనవి, రచనా పరమైనవి. నటనా పరమైనవి ఆర్టిస్టులు చూసుకుంటారు వాళ్ళ భావోద్వేగాల క్లోజప్స్ తో. ఇవి కూడా వెంటాడ వచ్చు. అయితే ఇవి ఆ సీనుతో మాత్రమే సంబంధంతో వుంటాయి. సీను మారిందంటే భావోద్వేగాలు మారతాయి. ఇవి కత్తిరింపులకి గురయినా కథకి నష్టముండదు. ఈయనకి/ ఈవిడకి అంత ఇంపార్టెన్స్ ఎందుకయ్యా, ఆ షాట్ ని కత్తిరించి పారేయ్ - అని ఎడిటింగ్ లో లేపెయ్యొచ్చు. ఆయన/ఆవిడ ఆ షాట్ ఇచ్చి మేఘాలలో నడుచుకుంటూ ఇంటికెళ్ళి పోయాక, తీరా సినిమాలో చూసుకుంటే, బ్లాంక్ గా కన్పించి నేలమీద రాలిపడడమే.

        రచనా పరమైన షాట్స్ ఇలా కాదు, ఇవి కథకి సంబంధించి వుంటాయి. ముందు జరిగిన కథని దృష్టిలో పెట్టుకుని తర్వాత జరగబోయే కథ చెప్తాయి ఆ ఒక్క షాట్ తో. వీటిని కత్తిరించలేరు బామియాన్ తాలిబన్లయితే తప్ప. ఇలాటి రెండు షాట్స్ ఈ మధ్య బాగా పిచ్చెత్తించి నిద్ర పట్టకుండా చేశాయి. ఏమిటీ షాట్స్? వీటిగురించి పిచ్చెత్తి ఎందుకు రాయాల్సి వచ్చిందిప్పుడు పనులాపుకుని తీరిగ్గా? స్టోరీ మేకింగ్ కి ఇవి అందిస్తున్న మైండ్ బ్లాస్టింగ్ టెక్నిక్సే కారణం. ఇలా చేయాలీ స్టోరీ మేకింగ్ అనీ చెబుతూ... ఇటీవల ఓటీటీలో విడుదలైన హాలాహల్ లోని ఒక షాట్, స్క్రీన్ ప్లే సంగతులు రాసిన దే ర్ విల్ బి బ్లడ్ లోని ఇంకో షాట్.

***
       1. పక్క షాట్ చూడండి. దేర్ విల్ బి బ్లడ్ ఎండ్ విభాగంలో చర్చి సీన్. ఈ సీన్లో డానీ ప్రాయశ్చిత్తం చేసుకుని మతంలో చేరాక, భక్తుల అభినందనలు అందుకుంటున్నప్పుడు, మేరీ వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. కొద్ది సెకన్ల పాటే వుండే ఈ షాట్ చెప్పకనే కథ చెప్పేస్తుంది. ఈ షాట్ కి పూర్వ కథలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వుంటుంది మేరీ. ఆమెకి నాస్తికుడైన డానీ అండగా వుంటాడు.  తను నాస్తికుడైతే ఆమె కాబోయే నాస్తికురాలని. కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆమెని ఫ్యామిలీగా కూడా ప్రకటించాడు. నాస్తికుడుతో నాస్తికురాలి అనుబంధం ఇక్కడుంది.

        ఈ నేపథ్యంలో ఈ షాట్ ఇప్పుడు చెప్పే కథేమిటంటే- నిశ్శబ్దంగా బేబీ మేరీ ఆలింగనం చేసుకోవడంలో, ఫ్యామిలీలో నీతో పాటే నేనూ అన్న అర్ధమిస్తోంది. అతను మారాడు, తానూ మారింది. ఆడియెన్స్ కి ఇక రిలీఫ్. తానూ మతాన్ని స్వీకరిస్తూ హామీ ఇస్తోంది. ఆడియెన్స్ కి ఆమె మీద నమ్మకం. అప్పుడేమంది తను? చర్చికి బాకీ వున్న 5000 అతను ఇస్తాననడం అతడి గొప్ప మనసు అంది. అతనేమన్నాడు? ఎప్పట్నుంచో ఇవ్వాల్సిన బాకీ అన్నాడు. ఈ సిన్సియారిటీతో ఆడియెన్స్ కి హమ్మయ్యా అని అతడిపట్ల పూర్తి పాజిటివ్ ఫీల్. ఇంతే, దీంతో షాట్ ముగుస్తుంది. ఈ షాట్ కి బిజిఎం వుండదు. వుంటే చెడుతుంది.

        ఇంత క్లుప్తంగా వున్న ఈ షాట్ లో బాకీ గురించిన రెండు మాటలే పని గట్టుకుని ఇంకెందుకున్నాయి? డానీ డానీయే. చచ్చినా మారడు. చర్చికి మాటిచ్చి రేపు బాకీ ఎగ్గొట్టక వుంటాడా? రేపు బాకీ ఎగ్గొడితే ఆడియెన్స్ కి ఈ మాటలే గుర్తుకు రావాలంటే, ఈ మాటలు చెదిరిపోయే ఇంకే మాటలూ ఇక్కడ వుండకూడదు. చాలా డిస్టర్బింగ్ షాట్ ఇది. మేరీ అతడ్ని నమ్మేసి మతంలోకి వచ్చింది. రేపు పెళ్ళయాక తెలుస్తుంది అతడ్ని నమ్మడం ఎంత మోసమో. ఇక్కడ చర్చి సాక్షిగా కొడుకుని స్వీకరించిన ఇతనే, రేపు కొడుక్కుని బాస్టర్డ్ అని వెళ్లగొట్టేసినప్పుడు, కోడలిగా తను అవమానకర పొజిషన్లో పడ్డప్పుడు గానీ అర్ధం గాదు. అయితే ఈ షాట్ లో మేరీ ఫేస్ ఎందుకు చూపించలేదు? ఎందుకంటే దీని తర్వాత ఆమె కథలో కన్పించదని. ఇలా ముందు జరగబోయే వాటికి మందుగుండు అంతా ఈ ఒక్క షాట్ లోనే జొప్పించి వుంది... ఇదీ స్టోరీ మేకింగ్.

***
        2. దీన్ని స్టోరీ రైటింగ్ చేస్తే - చర్చిలో డానీ మతంలో చేరిన సీన్ నెంబర్ వన్ తర్వాత, సీన్ నెంబర్ టూ - డానీ ఇంటికెళ్తాడు. మేరీ పరిగెట్టుకుంటూ వస్తుంది - అంకుల్ అంకుల్ అంకుల్ అని పట్టి వూపేస్తుంది. ఏంటమ్మా ఏంటంత సంతోషం? ప్రభువు చల్లని చేయి తాకిన గొర్రెపిల్లలా చెంగు చెంగు మంటున్నావు?’ - డానీ. నువ్వు చర్చి కెళ్ళావు కదూ? నేనూ చర్చికి వెళ్తా, చర్చికెళ్తా, ప్రార్ధన చేస్తా. నువ్వెలా చేస్తే అలా చేస్తా. సేమ్ టు సేమ్ అంకుల్ - మేరీ. నా బంగారు తల్లి కదే. బుజ్జి తల్లి కదే. ఎంత ఎదిగావమ్మా నువ్వూ - డానీ. నన్ను చర్చికి తీసికెళ్ళాలి. తీసికెళ్ళాలీ తీసికెళ్ళాలీ.. మేరీ. సీన్ నెంబర్ త్రీ- చర్చికి వెళ్తారు. కలిసి ప్రార్ధన చేస్తారు. అంకుల్ ఇప్పుడెంతో బావుంది. నేను నీతోటే వుంటా నంకుల్, ప్రామీస్ అంకుల్ ప్రామీస్ - మేరీ. నేనెప్పుడు కాదన్నానమ్మా నా మేరమ్మ  తల్లమ్మ తల్లీ, పద ఐస్ క్రీమ్ తిందాం - డానీ. ఈ సీన్లకి పులకింఛిపోయే బిజిఎం కూడా వస్తూంటుంది. ఇలా వుంటుంది... అప్పుడెప్పుడో పాత రాతి యుగపు నాటి నరహంతక సుత్తి కాక ఏమిటిది మూడేసి సీన్లతో? ముందు వెనుక కథతో సంబంధం లేకుండా బడ్జెట్ ని తేరగా ఆరగిస్తూ?

***
     3. ఇక హాలా హల్ ముగింపులోషాట్. క్లయిమాక్స్ లో సచిన్ ఖెడేకర్ కి కౌన్సెలింగ్ చేస్తున్న పద్ధతిలో విలన్ వివరిస్తాడు చాలా స్మూత్ గా మంచి చెడ్డలు. అనవసరంగా మాతో పెట్టుకోక మంచిగా బ్రతక మంటాడు. సీన్ కట్ అవుతుంది. రోహతక్ లో ఆందోళనలో వున్న సచిన్ భార్యా కూతురు, అతణ్ణి వచ్చెయ్యమని అంతకి ముందే కోరి వుంటారు. ఇప్పుడు ఈ షాట్ లో టేబుల్ ముందు కూర్చుని కూతురు స్టడీ చేస్తూంటుంది.  తలెత్తి తలుపు వైపు చూస్తుంది. ఆమె మొహం ఒక్కసారి ప్రసన్నమవుతుంది. షాట్ కట్ అయిపోతుంది. దీనికి బిజిఎం వుండదు. బిజిఎంవుంటే ఫీల్ వుండదు. దీనితర్వాత సీనుండదు.

        ఆమె తలుపు వైపు అలా ఏం చూసి ప్రసన్నమై వుంటుంది? సచిన్ వచ్చేసి వుంటాడు. ఇలా సచిన్ ని చూపించకుండానే ఆ అర్ధంలో షాట్ తీశాడు క్రాఫ్ట్ తెలిసిన దర్శకుడు. ఇది కథ చెప్పే మర్చిపోలేని బ్యూటీఫుల్ షాట్. ఈ షాట్ తర్వాత ఇక సీనుండదు. విలన్ తో ఓడిపోయి ఇంటికొచ్చిన సచిన్ మొహం చూడాలన్న తహతహని  ఆడియెన్స్ కి అలాగే మిగిల్చేస్తాడు దర్శకుడు. అర్ధోక్తిలో షాటుని ఆపితే ఎంత బలంగా వెంటాడుతూ వుంటుందో చెప్పనవసరం లేదు. ఇది స్టోరీ మేకింగ్.

***
        4. ఈ ఒక్క షాటునే ముగింపుతో స్టోరీ రైటింగ్ చేస్తే ఎలా వుంటుంది? ఆమె తలుపు వైపు చూసి ప్రసన్నమయేసరికి, తలుపు దగ్గర సచిన్ ని భయంకరంగా చూపించేస్తూ సెంటిమెంటల్ సీను రాసుకుంటూ రాసుకుంటూ పోతారు. పెన్నులన్నీ అయిపోయి పరిగెడతారు. అసలలా సచిన్ ని చూపిస్తే చాలు నాశనం చేయడానికి. అప్పుడు సచిన్ కాల్షీటు కావాలి, మేకప్, కాస్ట్యూమ్స్ ఖర్చులు కావాలి, ఇంకా... అద్దె భవనపు ఖర్చు, యూనిట్ ఖర్చు, ఎడిటింగ్ ఖర్చు, డబ్బింగ్, బిజిఎం ఖర్చు, డీఐ ఖర్చూ.. ఇంకా థియేటర్లకి కరెంటు ఖర్చు, ప్రేక్షకులకి టైమ్ వేస్టూ. ఈయనేంటీ అర్ధమైపోయిన దాన్ని ఇంకా చూపిస్తాడూ - అని లేచెళ్ళి పోవడం....

***

        5. ఈ కింది వీడియో చూడండి. 2010 ప్రాంతంలో ప్రచారంలో వున్న, పాపులరైన  ధూమపాన హెచ్చరిక యాడ్ ఫిలిమ్. ప్రారంభం చూడండి. టేబుల్ ముందు కూర్చుని బొమ్మలేసుకుంటూ వుంటుంది అమ్మాయి. సడెన్ గా తలతిప్పి చూస్తుంది. సిగరెట్ తాగుతూ గుమ్మం లోంచి లోపలికొస్తూ కనిపిస్తాడు తండ్రి. చిరునవ్వుతో చూస్తాడు. తానూ ఆప్యాయంగా చిరునవ్వుతో చూస్తుంది...



        ఈ షాట్స్ ఫిమేల్ టచ్ తో వుండడం వల్ల గుర్తుండి పోతున్నాయా? ఆలోచించాల్సిన విషయం. పై మూడు షాట్స్ లో ఫిమేల్ క్యారెక్టర్సే వున్నాయి. హాలా హల్ షాట్ చూస్తూంటే ఈ యాడ్ ఫిలిమ్ లో షాట్ గుర్తుకొచ్చింది. ఎంత యాక్షన్, వయోలెంట్ మూవీస్ లోనైనా, ఒకటి రెండు కథతో, పాత్రచిత్రణతో కూడిన ఇలాటి ట్రాడిషనల్ ఆడతనపు షాట్స్ వుంటే, లైఫ్ వుంటుందని చెప్పొచ్చు. బ్యూటీ వస్తుంది.

సికిందర్ 

 

Wednesday, March 17, 2021

1026 : బాక్సాఫీసు

    జాతి రత్నాలు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం బాక్సాఫీసు బరిలో జాక్ పాట్ కొడుతూ పోతున్నారు. 5 రోజుల్లో 19 కోట్ల వరకూ జాక్ పాట్ కొట్టేశారు. బాక్సాఫీసు రత్నాలు అన్పించుకున్నారు.  అనుదీప్ కెవి అనే కొత్త దర్శకుడు స్వప్నా సినిమా ప్రొడక్షన్ బ్యానర్లో, మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో, జాతి రత్నాలు రికార్డు కలెక్షన్లతో ట్రేడ్ పండితుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం ఓవర్సీస్ తో బాటు రెండు రాష్ట్రాల్లో, 5 వ రోజు  2.7 కోట్లు వచ్చాయి. 5 రోజుల్లో మొత్తం కలెక్షన్లు 19.02 కోట్లు. మొదటి రోజు 3.92 కోట్లు, రెండవ రోజు 2.9 కోట్లు, మూడవ రోజు 4.2 కోట్లు, నాల్గవ రోజు 5.3 కోట్లూ వచ్చాయి.


        ఇంతటితో ఆగేలా లేదు. నేటితో రెండవ వారంలోకి అడుగుపెడుతోంది. ఈ వారం కూడా కలెక్షన్లు స్ట్రాంగ్ గా వుండబోతాయని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తం లైఫ్ టైమ్ పర్ఫార్మెన్స్ 30 కోట్లు పైనే వుంటుందని అనుకుంటున్నారు. జాతి రత్నాలు కి కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బాగా ప్లస్ అయింది. ఈమె ఇక రవితేజతో చేయబోతోంది. ఈ మూవీ ప్రధానంగా అర్ధం పర్ధం లేని మైండ్ లెస్ కామెడీయే. జోకులే తప్ప కథేమీ వుండదు. ఈ జోకులకి యువప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయి కథా కాకరకాయా లేకపోవడాన్ని పట్టించుకోవడం లేదు. ఒక చిన్న బడ్జెట్ సినిమాని భారీ బ్లాక్‌బస్టర్‌ స్థాయికి తీసికెళ్లారు. నిజానికి పరిమిత థియేటర్ల లోనే మొదట రిలీజ్ చేశారు. భారీ రెస్పాన్స్ చూసి రెండవ రోజునుంచీ థియేటర్ల సంఖ్యని పెంచుకుంటూ పోయారు నిర్మాతలు.


      ‘జాతిరత్నాలు ఇలా వుంటే, ఇక శ్రీకారం లో శ్రీ లోపించి కారం ఘాటు ఎక్కువైంది. దేశంలో రైతాంగం ఆందోళన విజయవంతంగా 100 రోజులు దాటిపోతే; రైతాంగం మీద తీసిన 'శ్రీకారం' ముందుకెళ్ళనని మొరాయించింది. రైతులు వ్యతిరేకిస్తున్న కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం లాగే యజమాని కింద ఉమ్మడి రైతుల్ని చూపిస్తే ఎలా? ఈ దోపిడీ బావజాలాన్ని గత వందేళ్ళల్లో చాలాసార్లు తిప్పి కొట్టారు రైతులు. దీని వసూళ్ళు  7.10 కోట్ల దగ్గర వున్నాయి. ఫ్లాప్ కింద పరిగణిస్తున్నారు. శర్వానంద్ కి వరసగా ఇది నాల్గో ఫ్లాప్. కరోనాకి ముందు, కరోనాకి తర్వాతగా సినిమాల విభజన వుండబోతొందని గుర్తించాలి శర్వానంద్. కరోనా తర్వాత మరింత గ్లోబల్ ప్రేక్షకులుగా మారారు ఆడియెన్స్. మూసని తిప్పికొట్టి వాస్తవికతని కోరుకుంటున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్-  శ్రీ విష్ణుల పాతమూస  గాలి సంపత్ కి సహజంగానే వడ గాలులు వీచాయి.

సికిందర్ 

 

 

Tuesday, March 16, 2021

1025 : స్క్రీన్ ప్లే టిప్స్

     మిడిల్ 1 ఉద్రేకాలు పెరిగే ప్రచ్ఛన్న పోరాటంగా , మిడిల్ 2 లో బాహాబాహీకి దిగే   ప్రత్యక్ష పోరాటంగా యాక్షన్ మూవీ వుంటే, మిడిల్ 1 మిడిల్ 2 ఒకేలా వుండే మోనాటానీ ఫీల్ వుండదు. దేర్ విల్ బి బ్లడ్ యాక్షన్ మూవీ కాకపోయినా ఈ వైవిధ్యాలతో వుంటుంది.


        2. ప్రధాన పాత్ర బ్యాక్ గ్రౌండ్ గురించి ముందే చెప్పేయకుండా సెకండాఫ్ కి సేవ్ చేసుకుంటే, ఫస్ట్ హాఫ్ లో హీరో పాత్రతో ఇతనెవరా అని సస్పెన్స్ ఉత్పన్నమవుతూ వుండే అవకాశముంది. సెకండాఫ్ లో కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టూ విజువల్ ప్రెజెన్స్ వుంటుంది. ఉదా దేర్ విల్ బి బ్లడ్’.

        3. సినిమా మార్కెట్ యాస్పెక్ట్ కి ఒక ముఖ్య సూత్ర్ర మేమిటంటే, ఫస్ట్ డే ఫస్ట్ షో కి వచ్చే ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ స్క్రిప్టులో సమ్ థింగ్ క్రేజీ థాట్ కి పాల్పడ్డం. దాంతో ఆ థాట్ తో థ్రిల్లయిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుల్ని, మిగతా షోలకి మౌత్ టాక్ తో ప్రచారకులుగా మార్చెయ్యడం. సింపుల్ గా చెప్పాలంటే మొదటి షోకే సినిమాని వైరల్ అయ్యేలా చూడడం.

        4. ఈ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రధాన పాత్రని టార్గెట్ చేసే వుంటుంది.  అందుకని ఆ క్వశ్చన్ కి సమాధానం లేదా పరిష్కారం వెతికే ప్రయత్నం, లేదా సంఘర్షణ ఆ ప్రధాన పాత్రకే వుంటుంది. అంటే సమాధానం అంత త్వరగా దొరక్కుండా కథనాన్నిజటిలం చేస్తూ పోవాలన్న మాట. గోల్ అనే పదం వాడినప్పుడు నేరోగా అది పాత్రకి మాత్రమే అంటి పెట్టుకుని ఫ్లాట్ గా వుంటుంది. కథలో ఫీల్ వుండదు. డ్రమెటిక్ క్వశ్చన్ అనుకున్నప్పుడు, కథంతా కూడా ఆ క్వశ్చన్ పుట్టించే ఫీల్ నిండి పోతుంది. అంటే సోల్ అన్నమాట.

        5. వాస్తవిక కథలతో వెబ్ సిరీస్ నైనా కమర్షియల్ సినిమాల ప్రధాన స్రవంతిలోకి తీసుకురాక పోతే ఈ తరం ప్రేక్షకులకి రుచించవు. ప్రధాన స్రవంతి అంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో వుండే కథ. ఇండియాలో విజువల్ మీడియాకి త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వినా మార్గం లేదు. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ చూసి మోసపోవద్దు. అవి స్ట్రక్చర్ వుండని ఆర్ట్ సినిమాల్లాంటివి. సినిమా ట్రైలర్ కైనా, యాడ్ ఫిలిమ్ కైనా త్రీయాక్ట్ స్ట్రక్చరే వుంటుందని గుర్తించాలి. స్ట్రక్చర్ లేని ఉత్త క్రియేటివ్ ప్రదర్శన అంటే గోడలు లేని భవనం లాంటిది.

        6. ప్రాంతీయ సినిమాల్లో అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి. క్రియేటివిటీకి పదును పెట్టుకుంటే, తెలుగు మూస కమర్షియల్ సినిమాల రూపు రేఖలు కూడా ఇవి మార్చేయగలవు. క్రియేటివిటీ పరంగా ఇంకెంత కాలం టెంప్లెట్ సినిమాల మీద ఆధారపడతారు. వీటిలో రవంత స్క్రీన్ ప్లే టిప్ కూడా దొరకదు.

        7. హిందీలో కంటెంట్ మారింది,  మారిన కంటెంట్ తో సినిమాల్ని పునర్నిర్వచిస్తోంది బాలీఫుడ్నిన్నటి సినిమా ఇవ్వాళ వుండడం లేదు. ఇవాళ్టి సినిమా రేపుండడం లేదు. ట్రెండ్ సెట్టర్స్ లేవు. ట్రెండ్ సెట్టర్స్ ని ఫాలో అయ్యే తామరతంపర మేకింగులు లేవు. దేనికదే యూనిక్ ఐడియా, దేనికదే యూనిక్ మోడల్. మూస చట్రాల్లేవు, రేసు చక్రాలే వున్నాయి. యూనిక్ మేకర్లదే మార్కెట్, యూనిక్ థింకర్లకే డిమాండ్.

        8. ప్రేక్షకులు యూనిక్ గా మారుతున్నారు. ఓటీటీ కంపెనీలు సినిమాలెలా వుండాలో నిర్ణయిస్తున్నాయి. క్లాస్ మాస్, ఏబీసీ సెంటర్ తరగతులు ఒకటయ్యాయి. ఒన్ నేషన్, ఒన్ సినిమా అనే నేటి నినాదం. దీనికి తగ్గట్టు తెలుగు స్టార్స్ తో పానిండియా సినిమాలు వస్తున్నాయి.

సికిందర్