రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 13, 2020

998 : రివ్యూ

 

  అందరూ కొత్త వాళ్ళే ప్రయత్నించిన అమెరికాలో తెలుగు ఇండియన్ సైకో కిల్లర్ మూవీ గతం. ఇలా అంటున్నందుకు బాధపడక పోతే, కాస్తాలోచిస్తే, ఇలాటి మూవీస్ అఫెన్సివ్ గా వుంటాయి. గతంలో తెలుగులో, హిందీలో ఇలాటి ఫారిన్ నేపథ్యాల్లో తీసిన ఇండియన్ పాత్రలతో క్రైమ్ సినిమాలు, మాఫియా సినిమాలూ చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నే రేకెత్తించేలా వుండేవి. ప్రేక్షకులంగా మనం ఇలా చూపించింది చూసి ఎంజాయ్ చేయలేం కదా? మధ్యలో దేశం గుర్తొచ్చి ఎంజాయ్మెంటు చెడగొడుతుంది. సినిమా చూడవయ్యా అంటే దేశాన్ని గుర్తు చేసుకోవడం నాన్సెనూ సైకో తనమూ అన్పించవచ్చు. మనం సైకోలమే, కానీ ఫారినర్లు ఇలాటి సినిమాలు చూస్తే ఫారిన్లో కూడా ఇండియన్లు ఇంతేనేమో అనుకోవడం సైకోతనం కాబోదు. అమెరికాలో కొందరు ఎన్నారై నేరగాళ్ళు వుండొచ్చు. ఎఫ్బీఐ వేటాడుతున్న టాప్ 10 నేరగాళ్ళల్లో భద్రేష్ కుమార్ వుండొచ్చు. ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి భార్యని చంపి అరెస్టయిన నర్సన్ వుండొచ్చు. కాల్ సెంటర్ స్కామ్ చేసి దొరికిపోయిన కొందరు ఇండియన్ యూత్ వుండొచ్చు. పరాయి దేశాల్లో ఇది తప్పూ అని చెప్పే బదులు గ్లోరిఫై చేసే సినిమాలు వస్తున్నాయి, అదీ సమస్య. ఫారిన్ వెళ్ళి సెటిలవడమంటే ఇండియన్ స్టయిల్ నేరాల్ని అక్కడ దిగుమతి చేసుకోవడమా? ఫ్రాన్స్ లో ఉగ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్న ఒక వర్గానికీ మనకీ తేడా ఏముంది?

    క్రైమ్ జానర్ అసలు ఎజెండా నైతిక విలువల్ని గుర్తు చేయడమే, స్థాపించడమే. అప్పుడే కథా ప్రయోజనమనే మౌలికాంశం నెరవేరుతుంది. సాధ్యం కాకపోతే ఇలాటి సినిమాల్ని తెలుగు రాష్ట్రాల నేపథ్యంగా తీసుకోవచ్చు. సినిమాల్ని సినిమాల్లాగా చూడాలన్న అర్ధం లేని వాదం పని  చెయ్యదు. కమర్షియల్ సినిమా అనేది అతి పెద్ద మాస్ మీడియా అయినంత మాత్రాన బాధ్యత వుండదని కాదు. 

        నీతి శతకం ఆపి విషయానికొస్తే, ఖచ్చితంగా ఇది కథాపరంగా పాక్షికంగా, మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించేలా కొత్త వాళ్ళు చేసిన మంచి ప్రయత్నం, సందేహం లేదు. పాత్రల పరంగా అందరూ కొత్తవాళ్లు కావడంతో పోల్చుకోవడానికి గడ్డాలు అడ్డం వస్తున్నాయి. నటనల పరంగా కథే రిలీఫ్ లేని సీరియస్ మూడ్ కావడంతో, సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సేఫ్ అయిపోయారు కొత్త నటులూ, నటీమణులూ. సైకో రిషిగా రాకేష్, గర్ల్ ఫ్రెండ్ అదితిగా పూజిత, సైకోని పట్టుకునే అర్జున్ గా నిర్మాతల్లో ఒకరైన భార్గవ, ఈయన కొడుకు హర్షగా హర్షా ప్రతాప్, అందరూ మాటలు పలకడానికి నోటికి పనిచెప్పినట్టు కన్పిస్తారు. బిహేవియర్ ద్వారా కూడా భావ ప్రకటన చేసి వుండాల్సింది. ఎలాగూ ఈ మూవీని థియేటర్లలో సామాన్య ప్రేక్షకులకి ఉద్దేశించినట్టు లేదు. డైలాగులు ఇంగ్లీషులో ధారాళంగా ప్రవహించాయి. కొన్ని చోట్ల కథలో మలుపుల్ని తెలియజేసే కీలక డైలాగులు కూడా ఇంగ్లీషులోనే వున్నాయి. సామాన్యులకి కథెలా అర్ధమవుతుంది. అందుకని నెటిజన్లని ఉద్దేశించినప్పుడు, ఇన్ని డైలాగుల్ని కూడా తగ్గించి, ఫిలిమ్ ఈజ్ బిహేవియర్ అని దృష్టిలో పెట్టుకుని, యాక్షన్ ద్వారా అంటే చేతల ద్వారా చెప్పిస్తే - ఈ టెక్నిక్ ఆకర్షణగా వుండేది. 
        
        నిడివి గంటా 40 నిమిషాలే అయినా నిదానమైన నడకవల్ల రెండు గంటలు గడిచిపోయినట్టు అన్పిస్తుంది. మిస్టరీకి వేగం తక్కువ వుండొచ్చు; థ్రిల్లర్ కి వేగమెక్కువ వుండాలి. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం, శ్రీచరణ్ పాకాల సంగీతం ఫర్వాలేదన్పించే స్థాయిలో  వున్నాయి. పాటల్లేవు. కొత్త దర్శకుడు కిరణ్ కొత్తవాడు అన్పించేలా లేడు. కాకపోతే కథనంలో పాక్షికంగానే సక్సెస్ అయ్యాడు.

***

        అమెరికాలో వుంటున్న రిషి (రాకేష్) ఒక ప్రమాదానికి లోనై హాస్పిటల్లో వుంటాడు. స్పృహలో కొచ్చాక జ్ఞాపక శక్తి కోల్పోయి వుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అదితి (పూజిత) ని కూడా గుర్తు పట్టడు. తన కెవరున్నారంటే తల్లి లేదనీ, తండ్రి వున్నాడనీ చెప్తాడు. తండ్రి దగ్గరికి వెళ్దామని తీసుకు బయల్దేరుతుంది. దారిలో కారు పాడయితే అర్జున్ (భార్గవ) అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకుపోతాడు. ఆ ఇంట్లో అర్జున్ కొడుకు హర్ష (హర్షా ప్రతాప్) కూడా అర్జున్ తో పాటు సైకోలా ప్రవర్తిస్తాడు. ఆ రాత్రి కొన్ని ఇబ్బందికర అనుభవాలతో రిషి అదితితో పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ అడ్డుకుంటాడు. రిషి ఆ ఇంట్లో ఇరుక్కుంటాడు.

        ఎవరీ అర్జున్, హర్ష? ఎందుకు రిషిని, అదితిని ట్రాప్ చేశారు? జ్ఞాపక శక్తి కోల్పోయిన రిషి గతమేమిటి? అతడి గతంతో ఈ తండ్రీ కొడుకుల గతంతో వున్న సంబంధమేమిటి? ఎవరు సైకో, ఎవరు కాదు?... అన్న ప్రశ్నలతో కొనసాగేదే మిగతా కథ.

***


       ఇది సైకలాజికల్ కథ కాదు, అంటే ఇందులో పాత్ర ఎందుకు సైకలాజికల్ పేషంట్ గా మారాడన్న విచిత్స, చికిత్స అన్నది గాకుండా, ఒక సైకోగా చేస్తున్న నేరాలకి ఎలా అడ్డు కట్ట వేశారన్న కథ. సైకో థ్రిల్లర్. ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ కథనం. ఈ నాన్ లీనియర్ కథనం పోనూపోనూ ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లో పడి, నిలబెట్టుకున్న నవ్యత కాస్తా డీలా పడిపోయింది క్లయిమాక్స్ సహా.

        స్ట్రక్చర్ లేదని కాదు, వుంది. నాన్ లీనియర్ లో చెదిరిపోయింది. మొదటి పది నిమిషాల్లోపు రిషి అదితిలు  అర్జున్ ఇంట్లో ప్రవేశించడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. ఇక మిడిల్ సంఘర్షణలో వూహించని మలుపు తిరుగుతుంది. పాత్రలు తారుమారైపోతాయి. సైకోగా రిషి తేలతాడు, తన కూతుర్ని హత్య చేసిన రిషి చేత నిజం చెప్పించే పథకంతో అర్జున్ రివీలవుతాడు.

        
        అంటే ఎండ్ సస్పెన్స్  కథనాలకి 1958 లో పరిష్కారం సూచించిన 'టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' టెక్నిక్ అన్న మాట. దీని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. దీని హిందీ రీమేకుగా 'ధువా' వస్తే, తర్వాత ఇంకో రీమేకుగా హిందీలోనే 'ఖోజ్' వచ్చింది. దీన్ని అప్పట్లో తెలుగులో 'పోలీస్ రిపోర్ట్' గా రీమేక్ చేశారు. 'పోలీస్ రిపోర్ట్' అప్పట్లో బాగా తీయలేదనీ, ఇప్పుడు తీయవచ్చాని ఒక దర్శకుడు అడిగారు. అదే కథ ఎన్నిసార్లు తీస్తారు. 'గతం' లాగా ఇంకేదైనా కథతో తీయొచ్చు.
        
        కాకపోతే 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' లో పాత్రలు చిట్ట చివర్లో రివీలవుతాయి, 'గతం' లో మిడిల్ మధ్యలో రివీల్ అయ్యాయి. అంతే  తేడా. ఈ రివీలయ్యే ముందు వచ్చే ట్విస్టుల మీద ట్విస్టులకి మొదట జస్టిఫికేషన్ కన్పిస్తుంది. ఇంట్లో సింగిల్ లొకేషన్లో నైట్ పూట జరిగే చిన్న కథ కాబోలన్న అభిప్రాయం కల్గించడం వల్ల. సింగిల్ లొకేషన్లో ఒక పూట లేదా ఒక రోజులో ముగిసే చిన్న కథలకి హాలీవుడ్ కథనం ట్విస్టులతోనే వుంటుంది. లేకపోతే అదే లొకేషన్లో తక్కువ టైమ్ స్పాన్ లో కదలని సీన్లు బోరు కొడతాయి. ట్విస్టులతో ఎప్పటికప్పుడు వేగంగా కథ రీఫ్రెష్ అవాల్సిందే.
        
    అయితే ఎప్పుడైతే మిడిల్ మధ్యలో పాత్రలు తారుమారై అసలు కథ బయటపడుతుందో- అప్పుడు ఈ ట్విస్టులు చీటింగ్ అనిపిస్తాయి. వాటికి అర్ధం కనిపించదు. ఇదొక పూటలో ముగిసిపోయే చిన్న కథ కాదని ఇప్పుడు తేలింది కాబట్టి.
        
        కొన్ని రోజుల స్పాన్ తో వుండే పెద్ద కథల్లో మల్టీపుల్ ట్విస్టులుండవు. వుంటే హిందీలో 'క్యాష్' లా నవ్వులపాలవుతుంది సినిమా. పెద్ద కథలు ఒకే ట్విస్టు కేంద్రంగా వుంటాయి- 'తూర్పు- పడమర' లాగా. ట్విస్టు అంటే పొడుపు కథ. పొడుపు కథ అన్నాక దాన్ని విప్పాలిగా. అందుకే పైన చెప్పుకున్నట్టు హాలీవుడ్ సింగిల్ లొకేషన్ చిన్న కథల్లో ఒక ట్విస్టు ఇచ్చి, దాన్ని విప్పి, ఇంకో ట్విస్టు ఇస్తూ పోతారు. 'గతం' లో ఇది కూడా జరగలేదు. 
        
       కథల్లో ఏది జరిగినా పాత్రల గోల్ ప్రకారమే జరుగుతుంది. మెమరీ తెప్పించడానికి రిషి బ్రెయిన్లో ట్రిగ్గర్ పాయింట్ ని యాక్టివేట్ చేయడం గోల్ అయినప్పుడు, ఆ ట్రిగ్గర్ పాయింటుతో సంబంధం లేని ట్విస్టులు అతడికెలా ఇస్తారు. వూరికే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి కాకపోతే. అందుకే వర్కౌట్ కాలేదు.

***

       పాత్రలు తారుమారయ్యాక అసలు కథ చెప్తూ మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి. ఇక్కడే తప్పులో కాలేశారు. మొదటిది రిషి చేసిన హత్య గురించి, రెండోది అతడికి యాక్సిడెంట్ జరిగిన విధం గురించి, మూడోది మెమరీ తెప్పించడానికేం చేయాలా అన్న దాని గురించి. వీటిలో మొదటిది మాత్రమే చూపించి, బోరు కొట్టే మిగిలిన రెండూ ఎత్తేయాల్సిన పని. గతంలో రిషి- అర్జున్ లు ఏ సంఘటనతో కనెక్ట్ అయ్యారో ఆ హత్య గురించి తప్ప ఇంకో ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు. కథ శిల్పం చెడి, బ్యూటీ పోతుంది. మిగిలిన రెండు ఫ్లాష్ బ్యాకుల్లో విషయాన్ని క్లయిమాక్స్ కి సర్దేసి- 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' చూపిన మార్గంలో ఏకకాలంలో రిషితో బాటూ ప్రేక్షకులూ ఉలిక్కిపడేలా ప్రయోగించాల్సిన తురుపు ముక్క. ఒక సారి  హిందీ 'ధువా' లో క్లయిమాక్స్ లో అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని సీబీఐ బృందం ఆధారాలు చూపిస్తూ రాఖీని రౌండప్ చేసే డ్రమెటిటిక్, క్లాసిక్ సీను చూడండి.

***

       ఈ కథకి గోల్, డ్రమెటిక్ క్వశ్చన్ ఏదైనా వుంటే, రిషి మెమరీ తెప్పించడమే. ఇదొక్కటే కథ. కథంటే ఇప్పుడు లైవ్ గా జరిగేదే. దీని మీదే ప్రక్షకులు దృష్టి పెట్టి యాక్టివ్ గా వుంటారు. దీన్నోదిలేసి ఎప్పుడో గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాకులేస్తే దృష్టి చెదిరి పాసివ్ అయిపోతారు ప్రేక్షకులు. ఎందుకంటే అది కథ కాదు కాబట్టి. లైవ్ గా జరుగుతున్న కథకి గత సమాచారమివ్వడం కాబట్టి. అనవసరంగా లైవ్ లో జరుగుతున్న ఆసక్తికర కథనాపి పాత సమాచారమిస్తున్నారు కాబట్టి. రాంగోపాల్ వర్మ ఏ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాకుల జోలికి ఎందుకు పోలేదో ఒకసారాలోచిస్తారు కాబట్టి. ప్రేక్షకులు తెలివైన వాళ్ళు కాబట్టి. ఫ్లాష్ బ్యాకులంటే శుభ్రమైన కథ వెన్నులో బాకులు దింపడమే కాబట్టి. అదేం గొప్ప టెక్నిక్కేం కాదు కాబట్టి. 

        
        అందుకని రిషి కి యాక్సిడెంట్ ఎలా అయ్యిందీ అన్న బోరు కొట్టిన ఫ్లాష్ బ్యాక్ అప్రస్తుతం కథకి. అది మెమరీ వచ్చాక అమ్జాద్ ఖాన్ టైపులో అతడికే ఇవ్వాల్సిన డోస్. అలాగే మెమరీ ఎలా తప్పించాలా అని ఆలోంచించే సీన్లూ, డాక్టర్ తో తెలుసుకునే ప్రక్రియలతో కూడుకున్న ఇంకో బోరు కొట్టేసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అనవసరం. ట్రిగ్గర్ పాయింటుని ఎలా యాక్టివేట్ చేస్తారో చెప్పేశాకా ఇంకా చూపించడమెందుకు. చెప్పకుండా చూపించేసి అమ్జాద్ ఖాన్ టైపులో చివర్లో ఫాస్ట్ గా చెప్పేస్తే ప్రేక్షకులు బ్రతికి పోతారు గాని. ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకుల్ని మర్చిపోయి కథ చేస్తే అదేమంత ఆరోగ్యవంతంగా వుండక పోవచ్చు.

సికిందర్

 

Thursday, November 12, 2020

 

Dear Readers,

 Reviews will be posted from tomorrow

Wednesday, November 11, 2020


స్ట్రక్చర్ ని  కాస్సేపు పక్కన పెడదాం, అసలు ఈ క్రియేటివిటీ ఏంటో చూద్దాం. తెలుగు సినిమా అనేది క్రియేటివ్ ఆలోచనల పరంగా ఇంకా సంధి కాలంలోనే కొట్టు మిట్టాడుతోంది. గడిచిపోయిన తొలి వ్యాపార యుగం దాటిరావడానికి మొరాయిస్తోంది. తొలిస్వర్ణయుగం (1931 - 51), మలిస్వర్ణ యుగం (1951 -71) ముగిసిపోయి,  తొలి వ్యాపార యుగం (1971 – 2001) కూడా గడిచి పోయి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా 1971 – 2001 నాటి తొలి వ్యాపార యుగం దగ్గరే తచ్చాడుతోంది తెలుగు సినిమా క్రియేటివిటీ. నేటివిటీ పేర, ప్రేక్షకుల భావోద్వేగాల పేరా ఆ సంధి కాలంలోనే అవాస్తవిక, కృత్రిమ సర్కస్సులు చేస్తోంది. దాంతో చేదు అనుభవాలు చవి చూస్తోంది. నేటివిటీలు మారిపోతున్నాయి, సంస్కృతులు సన్నగిల్లుతున్నాయి,ఇంటర్నెట్ జీవితాలవుతున్నాయి, భావోద్వేగాలూ అందుకనుగుణమైన  సంగతులు పట్టుకుని కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తరాల అంతరాలు చెరిగిపోయాయి. ఇంటర్నెట్  కలిపేస్తున్న జీవితాల్లో అన్ని వయసుల వారూ కలిసిమెలిసి  సాగుతున్నారు. పరస్పర ఫిర్యాదులు లేవు, జనరేషన్ గ్యాప్ సంఘర్షణల్లేవు. అయినా ఇంకా  అదే ముప్పై ఏళ్ళనాటి పాతకాలం మూస క్రియేషన్లతో  సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ మూసతో అనుసంధానం కాలేక మలి వ్యాపార యుగపు ప్రేక్షకులు  గోలెడుతున్నారు. యుగ ధర్మాల్ని క్రోడీకరించుకుని దిశా నిర్దేశం చేయాల్సిన గొప్ప గొప్ప సీనియర్లు, అనుభవజ్ఞులు సైతం  సంధికాలంలోనే గడ్డ కట్టిన క్రియేటివిటీతో  అక్కడే  ఇరుక్కుపోయారు. సినిమా క్రియేటివిటీ వ్యాపారంతో  కూడుకున్నదని తెలిసికూడా కాలం చెల్లిపోయిన పాత ఫ్యాషన్ చొక్కాలు సినిమాలకి ధరింప జేస్తున్నారు.  తొలి వ్యాపార యుగం దాని కాలజ్ఞానంతో ఎంత విజయవంతమో, మలి వ్యాపార యుగాన్ని  అజ్ఞానంతో అంత దివాలా కోరుతనంగా తయారు చేస్తున్నారు  – నిత్యం  90 శాతం ఫ్లాపుల పుణ్యంతో ఇంకా ఇంకా. సింపుల్ గా చెప్పాలంటే , శుభ్రంగా  వ్యాపారం మర్చిపోయారు! 

          ఈ కల్చర్ తాజా బాధితురాలు ‘గాయత్రి’. దీనికి సంధి కాలపు మార్కెటబిలిటీ లేని క్రియేటివిటీ తప్ప స్ట్రక్చర్ పట్టలేదు. స్ట్రక్చర్ లో ఆలోచిస్తే,  కూతురి అన్వేషణలో వున్న శివాజీ (బిగినింగ్),  తీరా కన్పించిన కూతురు దుర్మార్గుడని తిరస్కరించాక (మిడిల్) - ఆమె అపార్ధం తొలగించడానికి స్ట్రగుల్ చేస్తూంటే, పటేల్ ఇచ్చిన ఆఫర్ తో అతని బదులు తను జైలుకెళ్ళి ఇరుక్కుని,  కూతురి  అపార్ధం తొలగడంతో ( ఎండ్) -   ఆమెతో కలిసి పటేల్ అంతు చూశాడు – అనే క్రమంలో వుండాలల్సిన  కథ. 

          ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఇలా కూతురితో తలెత్తిన సమస్యా,  దాని పరిష్కారమూ  అన్న రెండు మూల స్తంభాలాధారంగా వున్నప్పుడే, ఈ కథకి స్క్రీన్ ప్లే అనే సౌధం నిలబడగల్గేది. 

          కానీ ఈ స్క్రీన్ ప్లేకి మొదటి మూలస్తంభమే వుంది, రెండోది కన్పించడంలేదు. శివాజీ యాక్టివ్ పాత్రగా లేడు, పాసివ్ గా కన్పిస్తున్నాడు. ఏది ప్రధాన కథో తెలియడం లేదు, గాయత్రీతో  -  పటేల్ తో రెండు వేర్వేరు కథల్లాగా అన్పిస్తున్నాయి. ఏది ప్రధాన జానరో, ఏది దాని తాలూకు సబ్ జానరో తెలియడంలేదు, రెండూ కలిసి పోయి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామానో, ఫ్యామిలీ థ్రిల్లరో అర్ధం గావడం లేదు.  గాయత్రితో ఫ్యామిలీ డ్రామాగా వుంటూ,  ఒక్కసారిగా  పటేల్ రాకతో ఫ్యామిలీ థ్రిల్లర్ గా మారిపోయి,  సెకండాఫ్ సిండ్రోంలో పడిపోతోంది.  ఇలా సెకండాఫ్ లో కథ ప్లేటు ఫిరాయించి వేరే కథలుగా మారిపోయిన సెకండాఫ్ సిండ్రోములు - సర్దార్ గబ్బర్ సింగ్దొంగోడుధమ్తేరేనామ్హవాజ్యోతిలక్ష్మి, సైజ్ జీరో వగైరా వగైరా  ఎన్నో అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోతోంది ‘గాయత్రి’ కూడా. క్రియేటివ్ యాస్పెక్ట్ రీత్యా స్ట్రక్చర్ పరిస్థితి ఇదీ.
―2―
మార్కెట్ యాస్పెక్ట్  కొద్దాం. ఇక మోహన్ బాబు యువతరం ప్రేక్షకుల్లో పాగా వేయాలనుకుంటే, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా తన పాత్రల తీరుతెన్నుల్ని  మార్చుకోవాల్సిందే. ఇవాళ్ళ సినిమాలు  ప్రధానంగా యూత్ కోసం, తర్వాత మిగిలితే వాళ్ళ అమ్మా బాబుల కోసం. సీనియర్ మోహన్ బాబు అయినా రంగంలో వుండాలంటే యూత్ కోసమే వుండాలి తప్ప, వాళ్ళ అమ్మా బాబుల్ని రంజింప జేస్తానంటే అమ్మాబాబులు ఆల్రెడీ అలసిపోయారు. ఇవాళ్ళ తెలుగు సినిమాలకి యూత్ అప్పీల్  గా మిగిలిన  అంశాలు రెండే రెండు - ఎకనమిక్స్, రోమాంటిక్స్. మోహన్ బాబు మొదటిది ప్రతిబింబించేలా మొదటి పాత్ర పోషణ చేశారు. డబ్బుకోసం ఇతరుల బదులు జైలు కెళ్ళడం. అయితే ఆ ఎకనమిక్స్ తో ఎక్కడా ఆకట్టుకోలేదు. డబ్బు నెక్కడా చూపించలేదు. మాటల్లో తప్ప విజువల్ ప్రెజెన్స్ లేదు. ఆ డబ్బుతో విలాసవంతమైన ఎదుగుదల లేదు. అది నెగెటివ్ షేడ్ అవుతుందని అభ్యంతరం చెప్పదల్చుకుంటే, అసలలా చట్టాన్ని ఏమారుస్తూ ఒకరి బదులు జైలు కెళ్ళడమే పెద్ద నేరం. ఆ డబ్బుతో అనాధ పిల్లల్ని పోషించడం ఇంకా తప్పు. 

          రెండోది, ఈ వుండీ లేని ఎకనమిక్స్ తో యూత్ అప్పీల్ కి,  అనాధాశ్రమం నడపడమనే ఏ మాత్రం పొంతన లేని సంధి కాలపు పాత సుత్తి వ్యవహారం తోడయ్యింది. దీంతో మోహన్ బాబు మొదటి పాత్ర యూత్ అప్పీల్ కి పూర్తిగా దూరమైపోయింది. యూత్ కి కనెక్ట్ కాకుండా పోయారు. మోహన్ బాబు ఇంకా మధ్య వయస్కులైన తన పాత అభిమానుల కోసమో, మరెవరి కోసమో ఆ కాలపు పాత్ర చిత్రణ చేసుకుంటానంటే కుదిరే పరిస్థితి లేదు. వర్గాల కతీతంగా  ప్రేక్షకులందరి అప్పీలూ ఇవాళ్ళ  ఈ రెండిటికే - ఎకనమిక్స్, రోమాంటిక్స్. 

          ఎకనమిక్స్, రోమాంటిక్స్. 
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ – ఇదే మలి వ్యాపార యుగపు సినిమా స్టయిల్.
―3―
పోనీ రోమాంటిక్స్ చూద్దామన్నా, దీని జాడ ఎక్కడా కనబడదు. యువ గాయత్రి పాత్రతో కూడా. మోహన్ బాబు మొదటి పాత్ర శివాజీకి యుక్త వయసు వెర్షన్ పోషించిన విష్ణుతో కూడా రోమాన్స్ కన్పించదు, ఏదో కాసేపు ఫ్లాష్ బ్యాకులో శ్రియతో పాత తరహా ప్రేమ తప్ప. యూత్ అప్పీల్ కి వీలుండే గాయత్రికి ప్రేమాయణం లేకుండానే డ్రైగా చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ అయిన రోమాంటిక్స్ కి విరుద్ధం. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ కి  వుండాల్సిన ఎకనమిక్స్ లేదు, రోమాంటిక్స్ లేదు. మార్కెట్లో యువ ప్రేక్షకులు -  యువ ప్రేక్షకులు అంటూంటారే గానీ ఎవరా యువప్రేక్షకులు? వాళ్ళల్లో అమ్మాయిల్లేరు. చాలా వరకూ అబ్బాయిలే యువప్రేక్షకులుగా పోషిస్తున్నారు సినిమాల్ని. అమ్మాయిల్ని ఆకట్టుకునే పాత్ర చిత్రణలు లేకపోవడం అమ్మాయిలు దూరమవడానికి కారణం. కాబట్టి ‘గాయత్రి’ అని టైటిల్ పెట్టుకున్నప్పటికీ  అమ్మాయిలు డుమ్మా కొట్టడానికి కారణమిదే. కనీసం - ‘గాయత్రి’ క్యారక్టర్ యూత్ అప్పీల్ తో వుందని, ఆమె యూత్ ఫుల్ రోమాంటిక్స్ కి మోహన్ బాబు చేసే డిగ్నిఫైడ్ హెల్ప్ ‘పింక్’ లో అమితాబ్ లాగా ఏంతో అప్డేట్ అయి  వుందనీ, మౌత్ టాక్ వచ్చేలా సినిమా ధోరణి వుంటేగా!
―4―
           ఫ్యామిలీ డ్రామాలు నేటి దైనందిన  జీవితాల్లో  ఎదురవుతున్న సమస్యలతో (ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్) ఎంతో పకడ్బందీగా, ఆధునికంగా  తీస్తే తప్ప ఈ రోజుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కథని ఎకనమిక్స్ తోనో, రోమాంటిక్స్ తోనో ముడి పెట్టి ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ప్రధాన కథగా చేసి చూపించాల్సి వుంటుంది. అంటే శివాజీకి కూతురు కన్పించడం లేదన్న ధ్యాస తప్ప, దాంతో కూతురికోసం సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్లేవర్ తో తీవ్ర ప్రయత్నాలు తప్ప, ఇంకో వ్యాపకం వుండడానికి కుదరదు. ఉపాధి కోసం స్టేజి నటుడి టాలెంట్ ని నేరస్థులకి డబుల్ గా వ్యవహరిస్తూ జైలుకెళ్ళి వస్తూండే బిజినెస్ గా వుంటే వుండొచ్చు. కూతరు కన్పించడం ప్లాట్ పాయింట్ వన్ గా వుంటూ, ఆమె తిరస్కరించడంతో మిడిల్ సంఘర్షణగా కొనసాగుతూ,  మధ్యలో విలన్ గాయత్రీ పటేల్ పరిచయంతో, సంఘర్షణ కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్నగా మారుతూ, చివరికి జైలు కెళ్ళి పటేల్ తో మోసపోయి, కూతురి ఆర్గ్యుమెంటే నెగ్గి తను తలొగ్గి,  ప్లాట్ పాయింట్ టూ కొచ్చి, ఇక కూతురితో కలిసి పటేల్ ని ఎదుర్కొనే ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా ముగియాలి. ఇందులో ఫ్యామిలీ డ్రామా వుంటే అంతర్లీనంగా ఎలాగూ వుంటుంది. దానికోసం తహతహలాడుతూ కథనే ఫ్యామిలీ డ్రామాగా మార్చేయ నవసరం లేదు.
―5―
          కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్న అంటే ఏమిటి? కథంటే ఆర్గ్యుమెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. రెండు పాత్రల మధ్య తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత  కథనమనీ, చివరికి ఆ ఆర్గ్యుమెంట్ తాలూకు జడ్జి మెంట్ తో ముగింపనీ. ఇది ఏ కథయినా డిమాండ్ చేసే దాని ప్రాథమిక హక్కు. దీన్ని కాదనడానికి వీల్లేదు. 

         గాయత్రి ఆర్గ్యుమెంట్ ఏమిటి? పుట్టగానే తన తండ్రి శివాజీ తాగుడు కోసం వెయ్యి రూపాయలకి తనని అమ్మే ప్రయత్నం చేశాడని కదా? ఇదామె అపార్ధమే కావొచ్చు. కానీ ఆమె పుట్టక ముందు నుంచీ తను చేస్తున్న పనేమిటి? తన నాటక కళని తప్పుడు విధానంలో జీవిక కోసం వాడుకుంటూ - చట్టాన్ని ఏమారుస్తూ -  ఆయా నేరస్థుల రూపంలో వాళ్ళ బదులు తను జైలు కెళ్ళి వస్తున్నాడు. ఒక క్రిమినల్ గా రూపాంతరం చెందాడు. అదామె అపార్ధమైతే, ఇది తన నైతిక విలువల ప్రశ్న. దీనికేం సమాధానం చెప్తాడు కూతురికి? ఈ అనైతిక ప్రవర్తన ఆమె చేసుకున్నఅపార్ధాన్ని పూర్తిగా బలపర్చేట్టు లేదా? ఇది కాదా ఫ్యామిలీ డ్రామా అంటే? తప్పిపోయిన కూతురు దొరికి, ఆ తండ్రీ కూతుళ్ళు కన్నీళ్లు కార్చే  పై పై ఉపరితల  మెలో డ్రామాయేనా ఇంకా తెలుగు సినిమా మార్కు ఫ్యామిలీ డ్రామా అంటే?  పాత్రల లోలోపలి కుళ్ళు అలాగే మిగిలిపోతూ? ఈ హిపోక్రసీకే  - ఫాల్స్ డ్రామాకే ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారా?
―6―
        అనాధ పిల్లల సంరక్షణతో, జైలుకి రాకపోకలతో, ఇంకొన్ని మంచి పనులతో  శివాజీని చూపించుకొస్తూ, ఒకచోట అనుకోకుండా కూతురు గాయత్రితో సంఘటన సృష్టించారు. తండ్రీ కూతుళ్ళమని వాళ్ళిద్దరికీ తెలియని డ్రామా బావుంది. దుండగుల బారి నుంచి ఆమెని కాపాడేస్తాడు. ఆమె సెల్ ఫోన్ కింద పడిపోయి వుంటుంది. తీసి ఆమె కివ్వబోయేంతలో ఆమె ఆటోలో వెళ్లిపోతూంటుంది. ఇంటికొచ్చి ఛార్జింగ్ పెడతాడు. సెల్ ఛార్జి అయ్యాక స్క్రీన్ వెలుగుతుంది. అప్పుడా స్క్రీన్ సేవర్ గా ఆమె తల్లి ఫొటో డిస్ ప్లే అవుతుంది. ఆ తల్లి (శ్రియ) శివాజీ భార్యే! ఇదెంతో కదలించే  మంచి మెలో డ్రామాగా వుంటుంది (ఇది తప్ప ఈ ఫ్యామిలీ డ్రామాగా తీసిన సినిమాలో ఇంకొక్క కదిలించే సన్నివేశం కూడా లేదు). 

          పుట్టగానే కన్పించకుండా పోయిన కూతురి కోసం తను పడుతూ వచ్చిన ఆవేదన ఇక తీరిపోయిన క్షణాలు! పట్టరాని ఆనందం. సర్వసాధారణంగా ప్లాట్ పాయింట్ ఘట్టం ఒక సీరియస్ గా తలెత్తే సమస్యతో ఉద్రిక్తంగా వుంటుంది. ఆ సీరియస్ సమస్యని సాధించే గోల్ తో పాత్ర ప్రయాణం మిడిల్లోకి సంఘర్షణాత్మకంగా వుంటుంది. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా వుంది అపూర్వంగా. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఆనందభరితంగా తయారైంది. కథకి అనితరసాధ్యంగా కుదిరిన ప్లాట్ పాయింట్ వన్ మలుపు ఇది. సర్వ సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచి పాత్రకి సీరియస్ ప్రయాణంగానే వుంటుంది. ఇక్కడ దీనికి విరుద్ధంగా,  ఇక్కడ్నించీ శివాజీకి సంతోషకరమైన ప్రయాణంగా వుంది - కూతురు దొరికిందనీ, కూతుర్ని కలుసుకోబోతున్నాననీ!

          ఇంతమంచి ప్లాట్ పాయింట్ వన్ తో శివాజీ ఓ హేపీ సాంగ్ కూడా పాడుకోవడం ప్లాట్ పాయింట్ వన్ ని విజువల్ గా ఇంకెంతో ఎలివేట్ చేసింది. ప్లాట్ పాయింట్ వన్ ని అనుసరించి పాటెప్పుడూ వుండదు. ఇక్కడ ఇలా చక్కగా  కుదిరింది.  తీరా పాట తర్వాత ఆ కూతుర్ని కలుసుకోబోతూంటే, నిండు సభలో తండ్రి గురించి ఆమె చెప్పే మాటలు వింటాడు - తండ్రి ఎంత దుర్మార్గంగా తాగుడు కోసం తనని అమ్మేశాడో అని. దీంతో శివాజీ ప్రపంచం తలకిందు లవుతుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ ఇలా రివర్స్ అయింది. నిజానికి హేపీ గా వున్న ప్లాట్ పాయింట్ వన్ తో,  మిడిల్ కూడా కూతురి కలయిక పరంగా హేపీగా కొనసాగుతుందనీ, సంఘర్షణకి బదులు మిడిల్ కూడా ప్రయోగాత్మకంగా ఇక్కడ హేపీగా కొనసాగబోతోందనీ అన్పించి అత్యంత  ఆసక్తి రేపుతుంది. అలా కలుసుకునీ జీవితాల్ని ఆనందమయం చేసుకున్న తండ్రీ కూతుళ్ళకి  వూహించని విపత్తు ఏదో ఎదురవుతుందనీ ఒక అభిప్రాయం కల్గుతుంది. విపత్తు లేకపోతే ఇది కథగా వుండదు, కమర్షియల్ సినిమాకి పనికి రాని గాథగానే  ముగిసే ప్రమాదముంది.

          అయితే విపత్తు కూతురి మాటల్లోంచే పుట్టింది. శివాజీలో సంఘర్షణ మొదలవుతుంది. తను తాగుడు కోసం పురిటి పిల్లని అమ్మేశాడా? ఇరవై ఏళ్ళనాటి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో నాటక నటుడుగా ప్రేమించి పెళ్ళిచేసుకున్నగురువు కూతురు క్యాన్సర్ సోకడంతో,  శివాజీ తన నట వృత్తిని నేరప్రవృత్తిగా మార్చుకుంటాడు. వైద్యం డబ్బుల కోసం మొదటి సారిగా ఒకరిలా నటిస్తూ జైలుకెళ్ళి వస్తాడు. వస్తే భార్య చనిపోయిందని తెలుస్తుంది. ప్రసవించిన కూతుర్ని అనాధాశ్రమం వాళ్ళు తీసికెళ్ళి పోయారని అంటాడు స్నేహితుడు. తాగుబోతు అయిన స్నేహితుడు,  పుట్టిన శివాజీ కూతుర్ని వెయ్యి రూపాయలకి అమ్మేయబోతూంటే అనాధాశ్రమం వాళ్ళు  పట్టుకుని తీసికెళ్ళి పోయారు. ఇదీ విషయం.

          పెద్ద విషయం కాదు. ఆ అనాధాశ్రమం తెలుసుకుని శివాజీ వెళ్లి కూతుర్ని అప్పుడే తెచ్చుకోవచ్చు. ఈ లాజిక్ ని (కామన్ సెన్స్ ని) దాటవేశారు.

          ఈ ఫ్లాష్ బ్యాక్ కూతురు గాయత్రికి శివాజీ పంపిన డైరీలో రివీలవుతుంది. అతడి డైరీ చదువుకున్న ఆమె వెంటనే తండ్రి మీది ద్వేషం తొలగించుకుంటుంది. ఆమె పాయింటాఫ్ వ్యూలో ఒక ఫ్లాష్ కట్ పడుతుంది. అందులో పదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి యేడని  అనాధాశ్రమం అతణ్ణి అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ,  పుట్టగానే తాగుడుకోసం నిన్నమ్మేసి  పోయాడని  అసహ్యభావంతో అంటాడతను. 

           ఇక్కడ ఈ రెండూ గందరగోళంగా వున్నాయి. ఒకటి- తండ్రి పంపిన డైరీ చదవగానే ఆమె  ద్వేషమంతా తొలగిపోవడం. ఆ డైరీలో రాసిందే నిజమని ఎలా నమ్ముతుంది తనుఅసలు డైరీ ఎలా రాస్తాడుఆ డైరీ లోనే నటుడిగా తన నేరప్రవృత్తి గురించి ఎలా బయట పెట్టుకుంటాడుదొరికిపోడాఇప్పుడు కూతురికి దొరికిపోలేదాఒక తప్పు చేయలేదని ఆమెకి చెప్పబోతూ రెండో తప్పుతో దొరికిపోలేదాఅయినా డైరీ చదివిన కూతురుకి ఈ విషయమే పట్టదు. 

          ఇక ఇప్పుడామెకి  పదేళ్ళ వయసులో అనాధాశ్రమం అతనితో కట్ షాట్ పడుతుంది. తన తండ్రి ఏమయ్యాడని అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ, పుట్టిన నిన్ను తాగుడికి అమ్మేయబోతే పట్టుకున్నాం – అని అసహ్య భావంతో అంటాడతను. ఒక అనాధా శ్రమం నడిపే అతను  అనాధ పిల్ల సందేహం ఇలాగే తీర్చి గాయపరుస్తాడా? జీవితాంతం బాధ పడేలా చేస్తాడా? 

          ఇలాటి అవాస్తవిక, అసహజ చిత్రణలతో, పైపై కథనాలతో చాలా బలహీనపర్చారు. 
దీన్నిసినిమాని సినిమాలాగే చూడాలన్న గొప్ప కొటేషన్ తో సమర్ధించుకో వచ్చు కథకుడు. అతడి విచక్షణకే వదిలెయ్యాలి. సినిమాని సినిమాలాగా చూడడానికి అడ్డగోలుగా రాసి పారేయ్యొచ్చు. 

          అసలు అంతకి ముందు జైలు కెళ్ళే ఒక సందర్భంలో,  శివాజీ పృథ్వీలా నటిస్తూ అతడి బదులు జైలు కెలా వెళ్తాడు? పృథ్వీ హైట్ ఎక్కడ?  తన హైట్ ఎక్కడా? పోలీసులు అంత లాలీపాప్ గాళ్ళా? కోర్టుల్ని కూడా ఇలాగే ఏమారుస్తాడు శివాజీ. తను నేరం చేస్తున్నట్టుగానే ఫీల్ కాడు. ఇరవై ఏళ్లుగా ఇలా మారువేషాలతో మోసాలు చేస్తున్నాడని యంత్రంగానికీ తెలీదు. ఇలాగే  ముగుస్తుంది కథ!

          క్రియేటివిటీని ఇంత అడ్డగోలుగా చేసుకుంటూ స్ట్రక్చర్ ని ద్వేషించడం ఎంతవరకు సబబు? ఇది బాగా ఆలోచించుకోవాలి.  స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలే 90 శాతం ఫ్లాపులకి కారణం. క్రియేటివిటీ స్ట్రక్చర్ లోకొచ్చినప్పుడు ‘గాయత్రి’ లాంటివి  గాయపడవు. శివాజీకీ, గాయత్రీ పటేల్ కీ మధ్య గాయత్రులు గల్లంతవరు.
.
సికిందర్   
11.2.18

Tuesday, November 10, 2020

ఇలా అడుగుతున్న కొందరికి మళ్ళీ గుర్తు చేయడం కోసం పాత పోస్టు (797)

 


Q :  నేను సహకార దర్శకుడ్ని. ప్రస్తుతం ఒక సినిమాకు పనిచేస్తున్నాను. నాకు దర్శకత్వం చేసేముందు స్క్రీన్ ప్లే నేర్చుకోవాలనుంది. కొత్త దర్శకులకు స్క్రీన్ ప్లే నాలెడ్జి ఎంత అవసరమో మీ బ్లాగు ద్వారా తెలుసుకుంటున్నాను.  స్క్రీన్ ప్లే సబ్జెక్టు నేర్చుకున్నాకే దర్శకుడుగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. స్క్రీన్ ప్లే సమూలంగా నేర్చుకోవాలంటే ఎంత కాలం పడుతుంది? స్క్రీన్ ప్లే క్లాసులు పెట్టమని కొందరు అడిగినా మీరు సుముఖంగా లేరని తెలిసింది. నేనెలా నేర్చుకోవాలి?
 మల్లిక్, అసోసియేట్ 

A :  ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో నేర్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే క్లాసుల  ఆలోచన రాలేదు, వచ్చేఅవకాశం లేదు. అప్పుడప్పుడు పర్సనల్ గా నేర్చుకుంటామని  అడిగే వాళ్ళున్నారు.అందుకు కనీసం మూడునెలలు పడుతుందంటే ముందుకొచ్చే పరిస్థితి లేదు. వారం రోజుల వర్క్ షాప్స్ లోనో, నెల రోజుల కోచింగ్ లోనో వచ్చేస్తుందనుకుంటారు. దర్శకత్వ శాఖలోనో,రచయితల దగ్గరో పనిచేసినా నెల రోజుల్లో కూడా ఏమీ రాదు.  
 
          అసలు నేర్చుకునే విషయంలో చాలా మార్పు వచ్చింది. ఒకలాటి అసహనం, తమకే ఎక్కువ తెలుసన్న అహం నేర్చుకోనీయడం లేదు. ఈ అసహనం, అహం అరచేతిలో కంటెంట్ వల్ల వస్తోంది. ఎక్కువగా వరల్డ్ మూవీస్ చూసేస్తూ తమకే ఎక్కువ తెలుసనుకుంటున్నారు. స్క్రీన్ ప్లే నేర్చుకునే విషయంలోనే కాదు, కథలు పట్టుకొచ్చి సహకారమడిగే వాళ్ళు కూడా తమకే  భిన్నంగా ఇంకేదో తెలుసనుకుంటున్నారు. వాళ్ళు భిన్నంగా తమకేదో తెలుసనుకుంటున్నది అంతంత మాత్రం క్రియేటివిటీ మాత్రమే, స్ట్రక్చర్ కాదు. భ్రమల్లో వుంటున్నారు. కమర్షియల్ కాని, ఇక్కడ రూపాయీ వసూలు చేయని, స్ట్రక్చర్ వుండని, ఆర్ట్ మూవీస్ బాపతు వరల్డ్ మూవీస్ గాథలఫ్యాన్స్ గా కొనసాగుతున్నంత కాలం, స్ట్రక్చర్ ప్రాముఖ్యాన్ని ఏం గుర్తించి నేర్చుకుంటారు. కమర్షియల్ సినిమాకి పనికొచ్చే కథకీ, పనికిరాని గాథకీ తేడా అయినా తెలుసుకోవాలిగా. వరల్డ్ మూవీస్ కాస్తాపి కనీసం 80 - 90 లనాటి తెలుగు సినిమాలు కాదుకదా, హాలీవుడ్ సినిమాలైనా చూసే ఆసక్తి లేదు. తమకి తెలిసిన క్రియేటివిటీతో ఇంకా నేర్చుకోవడం టైం వేస్ట్, నేరుగా చేసేయడం బెస్ట్ అనుకునే కల్చర్ పెరిగిపోయింది. బీటెక్ చేయకుండా వూహల్లో ఇంజనీర్లు అయిపోవాలనుకోవడం లాగా.  

            స్క్రీన్ ప్లే నేర్చుకోవాలంటే దృష్టిలో పెట్టుకోవాల్సిన అనుబంధ అంశాలెన్నో వుంటాయి. కేవలం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నేర్చుకుంటే సరిపోదు. ఆ స్క్రీన్ ప్లే ప్రాక్టికల్ గా మార్కెట్లో వర్కౌట్ అయ్యే వివిధ కారకాల్ని కూడా ఏ కథకా కథగా కనుగొని వాటిని జొప్పించే పర్యావరణ కళ కూడా నేర్చుకోవాలి. స్ట్రక్చర్ నేర్చుకున్నంత మాత్రాన అయిపోదు, దానికవసరమైన క్రియేటివ్ శక్తి ఎంతుందో బయటికి తీయడానికి నిరంతర ప్రక్రియ కొనసాగాల్సిందే.       

            సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి - ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ లోనైనా బోధించే స్క్రీన్ ప్లే కోర్సు అమెరికన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే. ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు. ఎందుకంటే ఒక ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటూ దేశంలో ఏ భాషా చలనచిత్రాలకి సంబంధించీ లేదు. ఇండియన్ సినిమాలకి స్క్రీన్ ప్లే రాయబోతే కల్చర్ డామినేట్ చేస్తుంది. ఆ కల్చర్ భరతముని నాట్యశాస్త్రంలో నవరసాల రూపంలోవుంది. నాట్యం, నటన, నాటకం భరతముని నాట్యశాస్త్రంలోంచే వచ్చాయి. 

        మొదటి తరం సినిమాలు ఆ పౌరాణిక నాటకాల్లోంచే నవరస భరితంగా వచ్చాయి. ఈ నవరసాలు, నవరసాలతో కూడిన అభినయాలు, సంగీత నాట్యాలూ సినిమాల్లో భాగమైపోయాయి. వీటివల్ల సినిమా కథకి ఓ స్ట్రక్చర్ ని కూర్చడం సాధ్యం కాదు. అందుకని ఇండియన్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడాలేదు. వరల్డ్ మూవీస్ తీసే యూరోపియన్ దేశాల్లో కూడా, లాటిన్ అమెరికాలో కూడా మనలాగే వాళ్ళ కల్చర్ వల్ల ఓ ఇదమిద్ధమైన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లేదు. ప్రపంచం మొత్తంలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వున్నది ఒక్క అమెరికాకే. 

        అందుకే ఒక్క అమెరికా నుంచి తప్ప మరే దేశం నుంచీ స్క్రీన్ ప్లే బుక్స్, ఆర్టికల్స్, వెబ్ సైట్స్ వెలువడవు. ప్రపంచమంతా స్క్రీన్ ప్లే కోర్సులు బోధించేది అమెరికన్ (హాలీవుడ్) స్క్రీన్ ప్లేతోనే. 

            కానీ కాలంమారింది. ఈ మారిన కాలంలో కమర్షియల్ సక్సెస్ కోసం అమెరికన్ స్క్రీన్ ప్లేని భరతముని భాగం చేస్తూనే మన సినిమాలకి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరముంది. ఇదెప్పుడో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరగాలి. 50 లలో, ’60 లలో తెలుగు సినిమాలు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లోనే రావడం మొదలెట్టాయి భరతమునిని కూడా కలుపుకుంటూ. దేవదాసు, దొంగరాముడు, మనసే మందిరం, వివాహబంధం...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 80 లలో ఖైదీ కూడా, శివ కూడా... 90 లలో కూడా ఇలా కొనసాగింది. 

        2000 నుంచి ఈ ఇరవై ఏళ్లుగా కొత్తతరం మేకర్లతో మారిపోయింది. కథా నిర్మాణం వెనక్కెళ్ళి పోయింది. అప్పట్లో చిత్రం, నువ్వే కావాలి వంటి ప్రేమ సినిమాలతో మొదలైన కొత్త  ట్రెండ్ లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒక్కరయ్యే రచనా నేపధ్యంలేని మేకర్లు వెల్లువెత్తారు. ఒక ఐదేళ్ళ పాటు వందల సినిమాలు లైటర్ వీన్ ప్రేమలంటూ తీశారు. భరతమునిని కూడా వదిలేసి పాత్రల్ని పాసివ్ పాత్రలుగా మార్చేశారు. కథనాల్ని మిడిల్ వుండని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలుగా మార్చేశారు. 

        పూర్వపు సినిమాల్లో సినిమాల్ని ఫ్లాప్ చేసే పాసివ్ పాత్రలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు కన్పించవు. అలాటిది ఆఖరికి మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ ఎవర్నీ వదలకుండా స్టార్ సినిమాలకీ ఇదే జాడ్యాన్ని అంటించారు. ఇలావొక స్ట్రక్చర్ పట్టని రచనా నేపధ్యంలేని క్రియేటివ్ స్కూలు తయారైంది. 

             కానీ ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో నేర్పేది అమెరికన్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నే. అందుకే ఫిలిం ఇనిస్టిట్యూట్స్ ఇంగ్లీషులో అమెరికన్ స్ట్రక్చర్ నేర్చుకుని తెలుగు సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్. ఇదేంట్రా తీరా ఇక్కడ వేరే సీనుందని తలలు పట్టుకోవడం. వీళ్ళు ఇటు క్రియేటివ్ స్కూల్లో అడ్జెస్టు కాలేరు, వాళ్ళు అటు స్ట్రక్చర్ స్కూల్ ని ఇష్టపడరు. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్. మధ్యలో సినిమాల కొచ్చింది చావు. 

            మరేం చేయాలి? బ్యాక్ టు ది ఫ్యూచర్. ఆదిత్య - 369 కాల యంత్రం బుక్ చేసుకుని కాలంలో వెనక్కి 20 వ శతాబ్దంలోకి వెళ్లిపోవాలి. అక్కడి బ్లాక్ అండ్ వైట్ ల నుంచీ చిరంజీవీ బాలకృష్ణల వరకూ రాజ్యమేలిన తెలుగు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని పట్టుకు రావడమే...అమెరికన్ త్రీయాక్ట్ స్ట్రక్చర్ ని తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గా మార్చుకున్న పూర్వీకుల విజ్ఞతని సమాదరించడమే. కనుకే వారం రోజుల వర్క్ షాప్స్ లో, నెలరోజుల కోచింగ్ లో ఉత్సాహపడి అమెరికన్ స్ట్రక్చర్ నేర్చుకుని లాభం లేదనేది. ఎక్కువగా సిడ్ ఫీల్డ్ నే బోధిస్తారు. అమెరికన్ స్ట్రక్చర్ ని తెలుగుకి అన్వయించే ప్రయత్నంలో భాగంగానే ఈ బ్లాగులో వ్యాసాలు వెలువడుతున్నాయి. ఓ పదేళ్ళు పరిశీలించీ పరిశీలించీ, సిడ్ ఫీల్డ్ తో బాటు ఇంకొందర్నీ స్టడీ చేసీ, నేటివిటీకి అన్వయమయ్యేవి తీసుకుని, కానివి తీసేసి, ఏడాది పాటు రాసుకుంటూ వస్తే, ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్అనే వొక నమూనా ప్రతి తయారయ్యింది. దీన్నింకా సంస్కరించే పనుంది. 

            సరే, దర్శకత్వం చేపట్టే ముందు రచన మీద పట్టు సాధించాలన్న మీ ఆలోచన స్ట్రక్చరాశ్యులు కన్పించని ఈ రోజుల్లో చాలా మంచి ఆలోచనే. అసోషియేట్ గా ఈ పాటికి మీకు ఎంతో కొంత అనుభవముంటుంది. ముందు మీరనుకుంటున్నకథకి లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ రాసేయండి. దాని ఆధారంగా ఐడియా దగ్గర్నుంచీ డైలాగ్ వెర్షన్ వరకూ ఐదు మెట్లు ఎలా క్లియర్ చేసుకుంటూ వెళ్తూ స్ట్రక్చర్ నేర్చుకోవచ్చో మీ కథ ద్వారా మీరే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారమంతా బ్లాగులోనే తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్రూపంలో వుంది. స్ట్రక్చర్ నేర్చుకున్నాక ఆ స్ట్రక్చర్ తో మీ కథకి పర్యావరణ కళ తెలుసుకోవడమనే అనుబంధ కోర్సు ప్రారంభించుకో వచ్చు. ఏమైనా సందేహాలు వస్తే పర్సనల్ గా కలిసి తీర్చుకోవచ్చు.

సికిందర్
14.3.19

 

Sunday, November 8, 2020

997 : సందేహాలు -సమాధానాలు

 


          Q : సినిమాల్ని మీరిలా విమర్శిస్తున్నారు, మీరొక సినిమా తీసి చూపించరాదా?
దర్శకుడు
          A : సరే, రివ్యూ రైటర్ల నుద్దేశించి రొటీన్ గా అనేసే మాటే ఇది. ఫర్వాలేదు. దీని ఉపయోగమేమిటో తెలీదు. ఇదెలా వుంటుందంటే, పొలిటికల్ జర్నలిస్టుని పరిపాలించి చూపించరాదా అన్నట్టుంటుంది. సినిమాలు తీయడం మన పనికాదు, ఆ ప్రయత్న మెప్పుడూ చేయలేదు. అవసరమున్న వాళ్ళకి స్క్రిప్టుల్లో తోడ్పడడం వరకే. విమర్శిస్తున్నారనంటే అర్ధం విమర్శ చేయడం లేదని. విమర్శ చేయడం వేరు, విమర్శించడం వేరు. విమర్శ చేయడం దోష -అదోషా నిరూపణ చేయడం. విమర్శించడం నెగెటివ్ మనస్తత్వంతో బాగా ఉడికిపోవడం. దీనివల్ల ఉపయోగమేమిటి? ప్రపంచంలో వున్న విద్వేషం చాలనట్టు. మనం కూడా నెగెటివిజమనే ఇంకో అన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ చేపట్టనవసరం లేదు కదా మైండ్ చెడ గొట్టుకుంటూ. ఎదుట వున్న విషయంలో మంచి చెడ్డలు విడమర్చి చెప్పగల్గితే ఉపయోగం వుండొచ్చు విమర్శించడమంటే కూల్చివేత, విశ్లేషించడం నిర్మాణం. నిర్మాణం వైపే వున్నాం కదా ఇంత కాలం. నిర్మాణం చేతగాక కూల్చివేత మొదలెడితే అప్పుడు రివ్యూలు రాయడం మానేద్దాం. నిర్మాణంలో కూడా వంకర మనస్తత్వం చూస్తే ఏమీ చేయలేం. 90% అట్టర్ ఫ్లాపులంటే వంకర మనస్తత్వం ఎక్కడుందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. విమర్శే కాదు ఆత్మవిమర్శ కూడా అవసరం. రివ్యూలనే అంటే కాదు, రెండు దశాబ్దాలుగా 90% అట్టర్ ఫ్లాపుల్ని కూడా చూడాలి. ఇంతే చెప్పగల్గింది. మిమ్మల్ని గోప్యంగా వుంచడానికి, మీరు కోరినట్టు ప్రశ్నకి మీ పేరివ్వలేదు. ధన్యవాదాలు. 
    Q : హాయ్ సార్, నా పేరు రాజేష్ అసోసియేట్ డైరెక్టర్ ను. నేను చాలా రోజుల నుంచి మీ బ్లాగ్ ఫాలో అవుతున్నాను. స్టోరీ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో మీరు చెప్పిన ఎన్నో అమూల్యమైన విషయాలను అన్నింటినీ ఒక బుక్ లాగా కూడా చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేను కొంతమంది స్నేహితుల స్టోరీ కోసం వర్క్ చేస్తున్నప్పు
డు వాటిలో స్టోరీ అండ్ సిచువేషన్ గురించి కొన్ని అనుభవాలు నాకు ఎదురయ్యాయి. మీరు ఒక ఆర్టికల్ లో చెప్పినట్టు, హీరో ప్యాసివ్ పాత్ర గా ఉండి ఒక సిచువేషన్ లో ఇరుక్కోవడం అన్నది కథ కాదు గాథ అవుతుంది అన్నారు. అదే హీరో స్టోరీ లో ఉండి ఒక సిచువేషన్ నుంచి ఎలా బయట పడాలి అని తనకు తాను ప్రయత్నాలు చేసినప్పుడు అతను యాక్టివ్ క్యారెక్టర్ అవుతాడు, అది స్టోరీ అవుతుంది అని చెప్పారు. కానీ నేను వర్క్ చేసిన కొన్ని స్క్రిప్ట్ లలో హీరో పాత్ర ముందు సిచువేషన్ లో ఉండి తర్వాత స్టోరీ లోకి రావడం జరిగింది. అంటే ఫస్టాఫ్ అంతా ప్యాసివ్ గా ఉండి సెకండ్ హాఫ్ లో యాక్టివ్ క్యారెక్టర్ అయింది. అలా ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించండి.
రాజేష్, అసోసియేట్

        A : ఆర్టికల్స్ ని బుక్ లాగా చేసి పెట్టుకున్నందుకు కంగ్రాట్స్. ఈ సిట్యుయేషన్ ని, స్టోరీనీ తెలుగులో చెప్పుకుంటే అనువుగా వుంటుంది. సిట్యుయేషన్ అంటే పరిస్థితి, స్టోరీ అంటే కథ. పరిస్థితి విడిగా వుండదు, కథలోంచే పుడుతుంది. అయితే పరిస్థితుల సమాహారమే కథ కాదు. అది గాథ. గాథలో పరిస్థితులకి రియాక్షనంటూ వుండదు. హీరో బాధపడుతూ బాధపడుతూనే వుంటాడు చివరి దాకా. ఎవరో వచ్చి ఆదుకుంటే బయట పడతాడు. లేకపోతే పరిస్థితులకి బలై విషాద ముగింపు తెచ్చుకుంటాడు. ఇది పాసివ్ పాత్ర లక్షణం. కాబట్టి కమర్షియల్ సినిమాలు గాథల జోలికి పోకూడదు. సూపర్ స్టార్ సినిమాలైనా సరే. పోతే బ్రహ్మోత్సవం లాంటివి కూడా ఫ్లాపయ్యాయి. అది ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. ఈ విషయం చాలా సార్లు చెప్పుకున్నాం. 

      కథలో ఇలా కాదు, పరిస్థితులున్నా ఆ పరిస్థితుల్ని దాటి గెలిచే ప్రయత్నంతో సమస్యా పరిష్కారముంటుంది. ఇదీ కమర్షియల్ సినిమాల కవసరం. కథంటే ఆర్గ్యుమెంట్, దానికి జడ్జిమెంట్. గాథంటే కార్యాచరణ లేని ఒట్టి స్టేట్ మెంట్. ఈ నిర్వచనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రపంచానికి ఇంట్రెస్టింగ్ గా వుండేవి కథలే. 

        ఇప్పుడు మీరు వర్క్ చేసిన స్క్రిప్టుల విషయాని కొద్దాం. హీరో పాత్ర ముందు వివిధ పరిస్థితుల్లో వుండి తర్వాత కథ లోకి రావడమనేది కరెక్టే. కాకపోతే ఎప్పుడు కథలోకి వచ్చాడన్నది ముఖ్యం. ఆ స్క్రిప్టుల్లో ఫస్టాఫ్ అంతా పరిస్థితులతోనే వుండి, సెకండాఫ్ కథలోకి రావడమనేది తప్పు. 

  స్క్రిప్టు బలం బలహీనతలు టైమింగ్ మీద ఆధారపడుంటాయి. అందుకే రెండు గంటల సినిమా అంక విభజనని టైమింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఏర్పర్చారు. మొదటి అంకం అంటే ఫస్ట్ యాక్ట్, అంటే బిగినింగ్ అరగంట; రెండో అంకం అంటే సెకండ్ యాక్ట్, అంటే మిడిల్ గంట; మూడో అంకం అంటే థర్డ్ యాక్ట్, అంటే ఎండ్ అరగంట. ఇందులో మధ్యలో గంట పాటు సు దీర్ఘంగా వుండే మిడిల్ అనేది సినిమాకి కథ. ముందు అరగంట వుండే బిగినింగ్ ఆ కథకి ఉపోద్ఘాతం. చివరి అరగంట ఎండ్ అనేది మిడిల్లో కథకి చూపించే పరిష్కారం.

        ఇప్పుడు బిగినింగ్ అరగంట కొన్ని పరిస్థితులుంటాయి. ఇవన్నీ ఒకటై పాత్రని ప్లాట్ పాయింట్ వన్ దగ్గరికి నెట్టి గోల్ ని ఏర్పరుస్తాయి. ఈ అరగంట పరిస్థితుల్లో పాత్ర పాసివ్ గా వుండొచ్చు. కానీ ఎప్పుడైతే అరగంట బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ అనే మొదటి మలుపు వచ్చిందో, అక్కడ్నించీ పాత్ర గోల్ కోసం పరిస్థితుల మీద తిరగబడ్డమే వుంటుంది. అంటే యాక్టివ్ గా మారిపోవడం. ఈ ప్లాట్ పాయింట్ వన్ అనేది గంట పాటు మిడిల్ కి ప్రారంభం. అంటే కథా ప్రారంభం. కథా ప్రారంభమన్నాక పాత్ర ఇంకా పాసివ్ గా వుండేందుకు వీల్లేదు. ఈ మిడిల్లో ఎదురయ్యే కొత్త పరిస్థితులతో పొరాడి తీరాల్సిందే. 

        ఇప్పుడు ఇదే అరగంట బిగినింగ్ పరిధి దాటి మిడిల్ పరిధిలోకి వచ్చిందనుకోండి. అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ మిడిల్ పరిధిలోకి జరిగి కథా ప్రారంభం ఆలస్య మైపోతుంది. కథా ప్రారంభం ఎంతాలస్య మైతే అంత మిడిల్ కాలవ్యవధి తగ్గి, కథ బలహీనమవుతుంది. ఇంకా కథ మొదలు కావడంలేదని బోరు కూడా కొడుతుంది. అందుకే అంకాలకి టైమింగ్స్. 

        ఈ బిగినింగ్ కాస్తా ఇంటర్వెల్ దాకా జరిగిందనుకోండి, సగానికి సగం మిడిల్ కి కోత పడుతుంది. అప్పుడు ఇంటర్వెల్ దగ్గర గానీ ప్లాట్ పాయింట్ వన్ తో కథా ప్రారంభం జరగదు. అప్పుడు ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో మిడిల్ కి అరగంట మాత్రమే కథ మిగిలినట్టు.     అంటే అరగంట వుండాల్సిన బిగినింగ్ బరితెగించి మిడిల్ ని అవతలకి నెట్టి పారేసి, ఇంటర్వెల్ దాకా గంట సమయం తనే మింగెయ్యడమన్న మాట. ఈ గంట సేపూ ఉపోద్ఘాతమే చెప్పుకుంటూ బోరు కొట్టించడ మన్నమాట. సగం సినిమా ఈ గంట సేపూ వివిధ పరిస్థితులతో పాత్ర పాసివ్ గానే వుండి పోవడమన్న మాట. ఇదే మీరనే స్క్రిప్టుల్లో జరిగింది. వెంటనే ఆ స్క్రిప్టుల్ని మార్చుకొమ్మని చెప్పాలి. 

        జిమ్ కెళ్తాం. ఐదు నిమిషాలు వామప్ చేసి అరగంట వర్కౌట్ చేస్తాం. అరగంట వామప్ చేస్తామా? నవ్విపోతారు. వామప్ అనేది బిగినింగ్, వర్కౌట్ అనేది మిడిల్, ఇక ఎండ్ కండలు పొంగిన శరీరం. ఏ పనిలో నైనా త్రీ యాక్ట్ స్ట్రక్చరే వుంటుంది. లేకపోతే హ్యూమన్ బ్రెయిన్ ఒప్పుకోదు. హ్యూమన్ బ్రెయినే వొక త్రీయాక్ట్ స్ట్రక్చర్. మన బ్రెయిన్ మన కర్ధం గాకపోతే ఏదీ అర్ధంగాదు. ఫస్టు నిన్ను నీవు తెలుసుకో. సింపుల్ గా అర్ధమయ్యే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ క్లాసిక్ ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్ చదవొచ్చు. ఫ్రీ పిడిఎఫ్ డౌన్ లోడ్ వుంది. పురాణాలు చదవొచ్చు. రైటర్స్ కీ బేసిక్ నాలెడ్జి చాలా అవసరం. బ్రెయిన్ అర్ధంగాక పోతే ఏ బ్రెయిన్ తో రాస్తాడు. ఇవి చదివితే హ్యూమన్ బ్రెయిన్ ఎలా పని చేస్తుందో తెలుస్తుంది. దాంతో త్రీ యాక్ట్ స్ట్రక్చరెందుకో తెలుస్తుంది. 

        సమస్యేమిటంటే, యంగ్ ఏజీలో ఇవి పట్టవు. ఎవడ్రా నాకు చెప్పేదన్పిస్తుంది. ఈ దశ అందరం ఎదుర్కొన్న వాళ్ళమే, వెనుకనున్న వాళ్లూ ఎదుర్కోవాల్సిన వాళ్ళే. ఈ దశదాటే దాకా పట్టు కోసం మునక లేయడమే. దాటాక వేస్ట్ అనుకున్న ఇలాటి పుస్తకాలు అర్ధమవుతాయి. లైఫే ఒక త్రీయాక్ట్ స్ట్రక్చరని అప్పుడర్ధ మవుతుంది. జీవితాన్నిదాటి కళ వుంటుందా, వుండదు. ప్రఖ్యాత  రచయిత సోమర్సెట్ మామ్ ఏమన్నాడో చూడండి- Imagination  grows  by  exercise, and  contrary  to  common  belief,  is  more powerful  in  the  mature  than  in  the  young.’  

        కథల రహస్యమేమిటో, బ్రెయిన్ కోసం సినిమాలెలా పని చేస్తాయో తెలియాలంటే, జేమ్స్  బానెట్  స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్ చదవొచ్చు. ఈ ఫ్రేమ్ వర్క్ లో గొప్పగొప్ప హాలీవుడ్ సినిమాల విశ్లేషణ వుంటుంది. 

        ఇక ఆపి పాయింటు కొద్దాం :  శివ లో బిగినింగ్ అరగంట నాగార్జున పరిస్థితుల్ని గమనిస్తూ పాసివ్ గా వుంటాడు. అరగంటకి ఒకానొక పరిస్థితికి సైకిలు చెయిన్ తీసుకుని తిరగబడతాడు. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంతో యాక్టివ్ గా మారిపోయి, మాఫియాతో నేరుగా తలబడే గోల్ ఏర్పడిపోయి, కథ ప్రారంభ మైపోతుంది. ఇదే సైకిలు చెయిన్ ఘట్టం ఇంటర్వెల్ కి జరిగిందనుకోండి, అప్పుడు శివ పరిస్థితి? అందుకని పాత్ర పాసివ్ గా వుండేందుకు బిగినింగ్ అరగంట వరకే అనుమతి. దాటిందో స్ట్రక్చర్ చెడగొట్టినట్టు. శివ సినిమా చూడడం సిడ్ ఫీల్డ్ స్కీన్ ప్లే స్ట్రక్చర్ బుక్ చదవడమే. తెలుగు సినిమాలు కూడా 2000 కి పూర్వం స్ట్రక్చర్ తోనే వుండేవి. పాసివ్ క్యారక్టర్లు వుండేవి కావు. తర్వాత గ్లోబలైజేషన్ తో స్ట్రక్చర్ ఎగిరిపోయి, ఫటాఫట్ జయలక్ష్మి ఐపోయింది లోకం. 

        Q : 'క్షణం' = బన్నీ లేక్ ఈజ్ మిస్సింగ్, గాన్ బేబీ గాన్, ఫ్లయిట్ ప్లాన్ ఇంకా కొన్ని సినిమాల మిక్సింగ్ ను మీరు పదే పదే ఎలా సమర్థిస్తారు ? 'పెళ్లిచూపులు' = ది హండ్రెడ్ ఫుట్ జర్నీ, నాక్డ్ అప్, షెఫ్ సినిమాల మిశ్రమమే కదా? పైన చెప్పిన ఆ సినిమాల  మాతృకలు  మీకు తెలియదని కాదు. కానీ ఒక ఒరిజినాలిటీ లేని కృతకమైన స్ట్రక్చర్ ను మీరు పదే పదే ఎందుకు మెన్షన్  చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఉవాచ. కొత్తగా వస్తున్న రైటర్స్, డైరెక్టర్స్ కాపీ కొట్టి సినిమాలు తీయాలా ? లేక మీలాంటి గొప్ప విశ్లేషకుల పరిశీలనను అనుసరించి సినిమాలు తీయాలా ? లేక వల్లంపాటి గారి కధ లేదా నవల శిల్పం అనుసరించాలా ?
పేరు లేదు

       A : పేరు తెలియజేస్తే బావుండేది. ఒక సినిమాని మొత్తంగా కాపీ కొట్టే కంటే కొన్ని సినిమాల్ని కలిపి తీసి సక్సెస్ చేసుకోవడం నయమే. అందుకు కూడా క్రియేటివిటీ అవసరం కాబట్టి. అలాటి క్రియేషన్స్ కృతకంగా ఎందుకుంటాయి. పెళ్ళిచూపులు తలంగాణా భాష, నేటివిటీలతో సహజ సినిమా. క్షణం అనే థ్రిల్లర్ అన్ని సినిమాలు కలిపి తీసినా మల్టీ షేడ్స్ తో ఎలా నిలబడిందో దాని మీద రాసిన స్క్రీన్ ప్లే సంగతులు ఒకసారి చూడండి. పెళ్లి చూపులు దర్శకుడు మీరు చెప్పిన హాలీవుడ్ సినిమాలని అనుసరించానని చెప్పిన మాట వీకీపీడియాలో బహిరంగంగానే వుంది. వాటిలో ఏ వొక హాలీవుడ్ ని కాపీ కొట్టినట్టు చెప్పినా కేసులు పడేవి. 

        ఇక కొత్తగా వస్తున్న దర్శకులు, రచయితలు కాపీకొట్టి తీయవచ్చా అంటే తీయవచ్చు. గంటలో ఎక్కడ్నుంచి కాపీ కొట్టారో ట్విట్టర్ లో టాంటాం అయిపోతుంది. నెటిజన్లని తక్కువ అంచనా వేయకూడదు. అయినా ఫర్వాలేదనుకుంటే కాపీ కొట్టుకుంటూ వుండొచ్చు. ఫారిన్ సినిమాలతో కేసులు మీద పడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు ఏదో చేసి. పక్కనున్న వాడి కథ కాపీ కొడితే ఇక్కడే దొరికిపోయి, కాపీ కొట్టలేదని ఛానెల్స్ లో తెలుగు ప్రేక్షకుల ముందు, ప్రజా కోర్టులో  అరుపులకి దిగాలి, ఛీఛీ అన్పించుకోవాలి. అంత సన్మానం జరుగుతుంది. అరుపులు మంచివా సద్బుద్ధి మంచిదా ఆలోచించుకోవాలి. 

        పోతే మనం గొప్ప విశ్లేషకులం కాదు గానీ, నిత్య విద్యార్ధులమైతే చాలు. సినిమాల్ని ఎవర్ని ఫాలో అయి తీయాలన్నది కాదు, ఏ విధానాన్ని అనుసరించాలన్నది నిర్ణయించుకోవాలి. విధానాలకి ఎవరూ బాసులు కారు. రెండు విధానాలున్నాయి : స్ట్రక్చర్ స్కూలు, క్రియేటివ్ స్కూలు. స్ట్రక్చర్ స్కూలు క్రియేటివిటీని కాపాడుతుంది, క్రియేటివ్ స్కూలు స్ట్రక్చర్ ని పక్కన పెడుతుంది. ఛాయిస్ మీదే. డాక్టర్ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి నవలా శిల్పం’, కథా శిల్పం లాంటి సాహిత్య పుస్తకాలు చదువుకుంటే సినిమాలకి మంచిదే. ఈ పుస్తకాలు కూడా స్ట్రక్చర్నే చెప్తాయి.  

సికిందర్