రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, నవంబర్ 2020, మంగళవారం

ఇలా అడుగుతున్న కొందరికి మళ్ళీ గుర్తు చేయడం కోసం పాత పోస్టు (797)

 


Q :  నేను సహకార దర్శకుడ్ని. ప్రస్తుతం ఒక సినిమాకు పనిచేస్తున్నాను. నాకు దర్శకత్వం చేసేముందు స్క్రీన్ ప్లే నేర్చుకోవాలనుంది. కొత్త దర్శకులకు స్క్రీన్ ప్లే నాలెడ్జి ఎంత అవసరమో మీ బ్లాగు ద్వారా తెలుసుకుంటున్నాను.  స్క్రీన్ ప్లే సబ్జెక్టు నేర్చుకున్నాకే దర్శకుడుగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. స్క్రీన్ ప్లే సమూలంగా నేర్చుకోవాలంటే ఎంత కాలం పడుతుంది? స్క్రీన్ ప్లే క్లాసులు పెట్టమని కొందరు అడిగినా మీరు సుముఖంగా లేరని తెలిసింది. నేనెలా నేర్చుకోవాలి?
 మల్లిక్, అసోసియేట్ 

A :  ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో నేర్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే క్లాసుల  ఆలోచన రాలేదు, వచ్చేఅవకాశం లేదు. అప్పుడప్పుడు పర్సనల్ గా నేర్చుకుంటామని  అడిగే వాళ్ళున్నారు.అందుకు కనీసం మూడునెలలు పడుతుందంటే ముందుకొచ్చే పరిస్థితి లేదు. వారం రోజుల వర్క్ షాప్స్ లోనో, నెల రోజుల కోచింగ్ లోనో వచ్చేస్తుందనుకుంటారు. దర్శకత్వ శాఖలోనో,రచయితల దగ్గరో పనిచేసినా నెల రోజుల్లో కూడా ఏమీ రాదు.  
 
          అసలు నేర్చుకునే విషయంలో చాలా మార్పు వచ్చింది. ఒకలాటి అసహనం, తమకే ఎక్కువ తెలుసన్న అహం నేర్చుకోనీయడం లేదు. ఈ అసహనం, అహం అరచేతిలో కంటెంట్ వల్ల వస్తోంది. ఎక్కువగా వరల్డ్ మూవీస్ చూసేస్తూ తమకే ఎక్కువ తెలుసనుకుంటున్నారు. స్క్రీన్ ప్లే నేర్చుకునే విషయంలోనే కాదు, కథలు పట్టుకొచ్చి సహకారమడిగే వాళ్ళు కూడా తమకే  భిన్నంగా ఇంకేదో తెలుసనుకుంటున్నారు. వాళ్ళు భిన్నంగా తమకేదో తెలుసనుకుంటున్నది అంతంత మాత్రం క్రియేటివిటీ మాత్రమే, స్ట్రక్చర్ కాదు. భ్రమల్లో వుంటున్నారు. కమర్షియల్ కాని, ఇక్కడ రూపాయీ వసూలు చేయని, స్ట్రక్చర్ వుండని, ఆర్ట్ మూవీస్ బాపతు వరల్డ్ మూవీస్ గాథలఫ్యాన్స్ గా కొనసాగుతున్నంత కాలం, స్ట్రక్చర్ ప్రాముఖ్యాన్ని ఏం గుర్తించి నేర్చుకుంటారు. కమర్షియల్ సినిమాకి పనికొచ్చే కథకీ, పనికిరాని గాథకీ తేడా అయినా తెలుసుకోవాలిగా. వరల్డ్ మూవీస్ కాస్తాపి కనీసం 80 - 90 లనాటి తెలుగు సినిమాలు కాదుకదా, హాలీవుడ్ సినిమాలైనా చూసే ఆసక్తి లేదు. తమకి తెలిసిన క్రియేటివిటీతో ఇంకా నేర్చుకోవడం టైం వేస్ట్, నేరుగా చేసేయడం బెస్ట్ అనుకునే కల్చర్ పెరిగిపోయింది. బీటెక్ చేయకుండా వూహల్లో ఇంజనీర్లు అయిపోవాలనుకోవడం లాగా.  

            స్క్రీన్ ప్లే నేర్చుకోవాలంటే దృష్టిలో పెట్టుకోవాల్సిన అనుబంధ అంశాలెన్నో వుంటాయి. కేవలం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నేర్చుకుంటే సరిపోదు. ఆ స్క్రీన్ ప్లే ప్రాక్టికల్ గా మార్కెట్లో వర్కౌట్ అయ్యే వివిధ కారకాల్ని కూడా ఏ కథకా కథగా కనుగొని వాటిని జొప్పించే పర్యావరణ కళ కూడా నేర్చుకోవాలి. స్ట్రక్చర్ నేర్చుకున్నంత మాత్రాన అయిపోదు, దానికవసరమైన క్రియేటివ్ శక్తి ఎంతుందో బయటికి తీయడానికి నిరంతర ప్రక్రియ కొనసాగాల్సిందే.       

            సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి - ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ లోనైనా బోధించే స్క్రీన్ ప్లే కోర్సు అమెరికన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే. ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు. ఎందుకంటే ఒక ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటూ దేశంలో ఏ భాషా చలనచిత్రాలకి సంబంధించీ లేదు. ఇండియన్ సినిమాలకి స్క్రీన్ ప్లే రాయబోతే కల్చర్ డామినేట్ చేస్తుంది. ఆ కల్చర్ భరతముని నాట్యశాస్త్రంలో నవరసాల రూపంలోవుంది. నాట్యం, నటన, నాటకం భరతముని నాట్యశాస్త్రంలోంచే వచ్చాయి. 

        మొదటి తరం సినిమాలు ఆ పౌరాణిక నాటకాల్లోంచే నవరస భరితంగా వచ్చాయి. ఈ నవరసాలు, నవరసాలతో కూడిన అభినయాలు, సంగీత నాట్యాలూ సినిమాల్లో భాగమైపోయాయి. వీటివల్ల సినిమా కథకి ఓ స్ట్రక్చర్ ని కూర్చడం సాధ్యం కాదు. అందుకని ఇండియన్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడాలేదు. వరల్డ్ మూవీస్ తీసే యూరోపియన్ దేశాల్లో కూడా, లాటిన్ అమెరికాలో కూడా మనలాగే వాళ్ళ కల్చర్ వల్ల ఓ ఇదమిద్ధమైన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లేదు. ప్రపంచం మొత్తంలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వున్నది ఒక్క అమెరికాకే. 

        అందుకే ఒక్క అమెరికా నుంచి తప్ప మరే దేశం నుంచీ స్క్రీన్ ప్లే బుక్స్, ఆర్టికల్స్, వెబ్ సైట్స్ వెలువడవు. ప్రపంచమంతా స్క్రీన్ ప్లే కోర్సులు బోధించేది అమెరికన్ (హాలీవుడ్) స్క్రీన్ ప్లేతోనే. 

            కానీ కాలంమారింది. ఈ మారిన కాలంలో కమర్షియల్ సక్సెస్ కోసం అమెరికన్ స్క్రీన్ ప్లేని భరతముని భాగం చేస్తూనే మన సినిమాలకి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరముంది. ఇదెప్పుడో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరగాలి. 50 లలో, ’60 లలో తెలుగు సినిమాలు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లోనే రావడం మొదలెట్టాయి భరతమునిని కూడా కలుపుకుంటూ. దేవదాసు, దొంగరాముడు, మనసే మందిరం, వివాహబంధం...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 80 లలో ఖైదీ కూడా, శివ కూడా... 90 లలో కూడా ఇలా కొనసాగింది. 

        2000 నుంచి ఈ ఇరవై ఏళ్లుగా కొత్తతరం మేకర్లతో మారిపోయింది. కథా నిర్మాణం వెనక్కెళ్ళి పోయింది. అప్పట్లో చిత్రం, నువ్వే కావాలి వంటి ప్రేమ సినిమాలతో మొదలైన కొత్త  ట్రెండ్ లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒక్కరయ్యే రచనా నేపధ్యంలేని మేకర్లు వెల్లువెత్తారు. ఒక ఐదేళ్ళ పాటు వందల సినిమాలు లైటర్ వీన్ ప్రేమలంటూ తీశారు. భరతమునిని కూడా వదిలేసి పాత్రల్ని పాసివ్ పాత్రలుగా మార్చేశారు. కథనాల్ని మిడిల్ వుండని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలుగా మార్చేశారు. 

        పూర్వపు సినిమాల్లో సినిమాల్ని ఫ్లాప్ చేసే పాసివ్ పాత్రలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు కన్పించవు. అలాటిది ఆఖరికి మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ ఎవర్నీ వదలకుండా స్టార్ సినిమాలకీ ఇదే జాడ్యాన్ని అంటించారు. ఇలావొక స్ట్రక్చర్ పట్టని రచనా నేపధ్యంలేని క్రియేటివ్ స్కూలు తయారైంది. 

             కానీ ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో నేర్పేది అమెరికన్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నే. అందుకే ఫిలిం ఇనిస్టిట్యూట్స్ ఇంగ్లీషులో అమెరికన్ స్ట్రక్చర్ నేర్చుకుని తెలుగు సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్. ఇదేంట్రా తీరా ఇక్కడ వేరే సీనుందని తలలు పట్టుకోవడం. వీళ్ళు ఇటు క్రియేటివ్ స్కూల్లో అడ్జెస్టు కాలేరు, వాళ్ళు అటు స్ట్రక్చర్ స్కూల్ ని ఇష్టపడరు. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్. మధ్యలో సినిమాల కొచ్చింది చావు. 

            మరేం చేయాలి? బ్యాక్ టు ది ఫ్యూచర్. ఆదిత్య - 369 కాల యంత్రం బుక్ చేసుకుని కాలంలో వెనక్కి 20 వ శతాబ్దంలోకి వెళ్లిపోవాలి. అక్కడి బ్లాక్ అండ్ వైట్ ల నుంచీ చిరంజీవీ బాలకృష్ణల వరకూ రాజ్యమేలిన తెలుగు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని పట్టుకు రావడమే...అమెరికన్ త్రీయాక్ట్ స్ట్రక్చర్ ని తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గా మార్చుకున్న పూర్వీకుల విజ్ఞతని సమాదరించడమే. కనుకే వారం రోజుల వర్క్ షాప్స్ లో, నెలరోజుల కోచింగ్ లో ఉత్సాహపడి అమెరికన్ స్ట్రక్చర్ నేర్చుకుని లాభం లేదనేది. ఎక్కువగా సిడ్ ఫీల్డ్ నే బోధిస్తారు. అమెరికన్ స్ట్రక్చర్ ని తెలుగుకి అన్వయించే ప్రయత్నంలో భాగంగానే ఈ బ్లాగులో వ్యాసాలు వెలువడుతున్నాయి. ఓ పదేళ్ళు పరిశీలించీ పరిశీలించీ, సిడ్ ఫీల్డ్ తో బాటు ఇంకొందర్నీ స్టడీ చేసీ, నేటివిటీకి అన్వయమయ్యేవి తీసుకుని, కానివి తీసేసి, ఏడాది పాటు రాసుకుంటూ వస్తే, ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్అనే వొక నమూనా ప్రతి తయారయ్యింది. దీన్నింకా సంస్కరించే పనుంది. 

            సరే, దర్శకత్వం చేపట్టే ముందు రచన మీద పట్టు సాధించాలన్న మీ ఆలోచన స్ట్రక్చరాశ్యులు కన్పించని ఈ రోజుల్లో చాలా మంచి ఆలోచనే. అసోషియేట్ గా ఈ పాటికి మీకు ఎంతో కొంత అనుభవముంటుంది. ముందు మీరనుకుంటున్నకథకి లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ రాసేయండి. దాని ఆధారంగా ఐడియా దగ్గర్నుంచీ డైలాగ్ వెర్షన్ వరకూ ఐదు మెట్లు ఎలా క్లియర్ చేసుకుంటూ వెళ్తూ స్ట్రక్చర్ నేర్చుకోవచ్చో మీ కథ ద్వారా మీరే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారమంతా బ్లాగులోనే తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్రూపంలో వుంది. స్ట్రక్చర్ నేర్చుకున్నాక ఆ స్ట్రక్చర్ తో మీ కథకి పర్యావరణ కళ తెలుసుకోవడమనే అనుబంధ కోర్సు ప్రారంభించుకో వచ్చు. ఏమైనా సందేహాలు వస్తే పర్సనల్ గా కలిసి తీర్చుకోవచ్చు.

సికిందర్
14.3.19