రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Saturday, July 20, 2019
Tuesday, July 16, 2019
849 : స్క్రీన్ ప్లే సంగతులు
ఒక సినిమాలో ముగింపు ట్విస్టు తీసుకుని ఇంకో సినిమాలో ఇంటర్వెల్ ట్విస్టుగా వాడుకుంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ కే కథ అయిపోతుంది. చాలా
కామన్ సెన్సు. హాలీవుడ్ ‘సిక్స్త్ సెన్స్’ లోని ముగింపు ట్విస్టుని సందీప్ కిషన్ ‘నిను వీడని
నీడను నేనే’ లో ఇంటర్వెల్లో మలుపుగా వాడుకుంటే ఇంతే
జరిగింది. ఆ తర్వాత నడపడానికి కథ లేక
సెకండాఫ్ సతాయించింది. ‘సిక్త్ సెన్స్’ లో సజీవంగా కన్పిస్తున్న బ్ర్రూస్ విల్లీస్
పాత్ర నిజానికి సజీవంగా లేదనీ, అది మరణించిన
బ్రూస్ విల్లీస్ పాత్ర ఆత్మ అనీ ముగింపులో ట్విస్టు వస్తుంది. ఈ క్లాసిక్ ట్విస్టు
తో ఇలాటి సినిమాలు హాలీవుడ్ లో ఆ తర్వాత ఇరవైకి పైగా వచ్చాయి. వీటిలో ‘ది అదర్స్’
ని మనీషా కోయిరాలాతో హిందీలో ‘అంజానే’ గా ఫ్రీ మేక్ కూడా చేశారు. ఒక బంగాళాలో
ఆనందంగా జీవిస్తున్న మనీషా కోయిరాలా పాత్రా, ఆమె పిల్లలూ నిజానికి ఆత్మలని తెలియడం
ముగింపు. ఇవేవీ ‘సిక్స్త్ సెన్స్’ ఇంపాక్ట్ ని కల్గించలేకపోయాయి.
ఇలాటి ముగింపు ట్విస్టుకి
మొదటి సినిమా వరకే ఇంపాక్ట్ వుంటుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎలా మార్చి తీసినా
పెదవి విరుస్తారు ప్రేక్షకులు. ఈ ట్విస్టు ఇంటర్వెల్లో ఇస్తే, ‘నిను వీడని నీడను
నేనే’ (నివీనీనే) గా సెకండాఫ్ లో ప్రేక్షకులకి శూన్యం మిగులుతుంది. హాలీవుడ్ లో
ఇదే పాయింటు తో అన్ని సినిమాలు తీసిన వాళ్లకి, ఈ ట్విస్టు ఇంటర్వెల్లో పెట్టి
తీయాలని ఒక్కరికైనా ఆలోచన వచ్చి వుండక పోతుందా? వచ్చే వుంటుంది. అలా తీస్తే ఏమవుతుందో కూడా తెలిసే వుంటుంది.
అందుకని పదేపదే ఆ ముగింపు ట్విస్టుని ముగింపులోనే పెట్టి తీస్తూ పోయారు. కానీ మనం తేడా కదా? తేడా గల పనులే చేస్తాం
కోట్లు గుమ్మరించి.
‘సిక్స్త్ సెన్స్’ లో ఒక బాలుడికీ, సైకియాట్రిస్టుకీ మధ్య కథ వుంటుంది. ఇది అమెరికాలో బాలల్ని కూడా విపరీతంగా ఆకర్షించి కలెక్షన్లు పెంచుకుంది. అప్పట్లో ఈ సినిమా చూడని అమెరికన్ బాలలు దాదాపూ లేరని అంటారు. ఒక బాలుడు చూసిన ముగింపునే ఆ తర్వాత పదిహేనేళ్ళూ వెయ్యి సార్లు చూస్తూ పోయాడంటే, ‘సిక్స్త్ సెన్స్’ ఇంపాక్ట్ ఎటువంటిదో వూహించవచ్చు. ఇందులో బాలనటుడిగా హెలీ జోల్ అస్మెట్ నటించాడు. సైకియాట్రిస్టుగా సూపర్ స్టార్ బ్రూస్ విల్లీస్ నటించాడు.
‘సిక్స్త్ సెన్స్’ సంగతి
కథా ప్రారంభంలో ఒక కోపిష్టి పేషంట్ బ్రూస్ విల్లీస్ ని షూట్ చేస్తాడు. సంవత్సరం తర్వాత బ్రూస్ విల్లీస్ తో భార్య ఎడమొహం పెడమొహంగా వుంటుంది. ఒక బాలుడు వచ్చి తనకి ఆత్మలు కన్పిస్తున్నాయనీ,
దీంతో అందరూ తనని దూరం పెట్టారనీ అంటాడు. ఈ బాలుడ్ని ట్రీట్ చేయడానికి
పూనుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఆత్మల గురించిన కథ చివరికేమవుతుందంటే, అసలు బ్రూస్
విల్లీస్ పాత్రే ఒక ఆత్మ అని తేలుతుంది. తను మొదట్లో కోపిష్టి పేషంట్ షూట్ చేసినప్పుడే చనిపోయాడు. కానీ భార్యతో
రిలేషన్ షిప్ సమస్యలు తీర్చుకోవడానికి అతడి ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా ఇక్కడే వుండిపోయింది.
ఇక ఇప్పుడు ఆత్మ అని రివీలయ్యాక, భార్య
కరిగి దగ్గరవుతుంది. ఆత్మ నిష్క్రమిస్తుంది.
మొదట్లో కోపిష్టి పేషంట్ షూట్ చేసిన తర్వాత ఏడాదికి ఓపెన్ చేస్తే బ్రూస్ విల్లీస్ కోలుకుని బతికే వున్నాడని భావిస్తాం. నిజానికి షూట్ చేసినప్పుడే చనిపోయాడన్న విషయం దాచి పెట్టి కథ నడిపారు. రెండోది, చివర్లో తను ఆత్మ అని చెప్పడానికి శరీరంలో బుల్లెట్ రంధ్రాన్ని చూపిస్తాడు. మూడు, ఆత్మగా ఇక్కడే ఎందుకుండి పోయాడనేదానికి భార్యతో సఖ్యత సాధించడం కోసమని కథ తెలుపుతుంది. ఇలా ఒక పరిపూర్ణమైన కథ చూడడానికి మనకి దొరికింది. సందీప్ కిషన్ ఏమిచ్చాడు? తమిళ దర్శకుడితో పరాభవించిన కథ ఇచ్చాడు.
రిషి (సందీప్ కిషన్), దియా (అన్యా సింగ్) లు భార్యాభర్తలు. ఒక రాత్రి కారులో పోతూండగా శృంగార చేష్టలు అదుపు తప్పి, కారుకూడా అదుపు తప్పడంతో ఘోరప్రమాదం జరుగుతుంది. అందులోంచి బయటపడి అటుగా వెళ్తే అనుకోకుండా స్మశానంలో ప్రవేశిస్తారు. అక్కడో శవం కాలుతూంటుంది. ఎలాగో అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తే అద్దంలో వేరే ముఖాలు కనబడతాయి. రిషి అద్దంలో చూసుకుంటే అర్జున్ (వెన్నెల కిషోర్) మొహం, దియా అద్దంలో చూసుకుంటే మాధవి మొహం కన్పిస్తాయి. వాట్సాప్, ఫేస్ బుక్ లలో కూడా వాళ్ళ ఫోటోలు మారిపోతాయి. దీంతో కంగారుపడ్డ రిషి పారాసైకాలజిస్టుని కలుస్తాడు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఎసిపి (పోసాని) తోడవుతాడు. అప్పుడు తెలుస్తుంది, రిషి – దియాలలో వున్నది అర్జున్, మాధవిలు కాదనీ, అర్జున్ – మాధవిల్లోనే రిషీ - దియాలున్నారని. అంటే అసలు అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్యా సింగ్) లే చనిపోయి, రిషి (వెన్నెల కిషోర్) అతడి భార్య దియాల్లో ఆత్మలుగా వుంటూ ఇబ్బంది పెడుతున్నారని తేలుస్తాడు ఎసిపి. ఇదీ ఇంటర్వెల్ ట్విస్టు.
ఇప్పుడేం చేయాలి? అద్దాల్లో వేరే మొహాలు కన్పించడంతో ప్లాట్ పాయింట్ వన్, ఈ మొహాల మిస్టరీ ఛేదించడంతో ఇంటర్వెల్ ఏర్పడ్డాయి. ఇక్కడ్నించీ ఏం చెయ్యాలి? పారాసైకాలజిస్టు ఆ ఆత్మల్ని పారద్రోలాలి. సమస్యకి ఇదే కదా లాజికల్ ముగింపు. ఈ ముగింపుతో సెకండాఫ్ కి ఇదే కొనసాగింపు కావాలి. ఈ కొనసాగింపు నిలబడుతుందా, ఇంటర్వెల్లో అంత మేజట్ ట్విస్టు ఇచ్చాక? సెకండాఫ్ కొనసాగింపు ఈ మేజర్ ట్విస్టుకి పై స్థాయిలో వుండాలి. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ‘సిక్స్త్ సెన్స్’ లో ఇది అల్టిమేట్ ముగింపుగా లాక్ అయిపోయి వుంది. ముగింపు దగ్గరే ఈ మేజర్ ట్విస్టు పని చేస్తుంది తప్ప, దీని లాక్ తీసి ఇంకెక్కడో వాడుకుంటామంటే కుదరదు.
సైకలాజికల్ మీనింగ్
ఆత్మల
కథలు మనిషి కేం నేర్పుతాయి? ఆత్మ అనేది ఒక సైకలాజికల్ టూల్. జీవితంలో అందరితో
సామరస్య పూర్వకంగా జీవించు, సంతృప్తి కరంగా మరణించు - అని ఈ టూల్ ద్వారా పరోక్షంగా
సైకలాజికల్ మేసేజ్ ఇవ్వడం. ఎక్కడైనా పొరపొచ్చాలుంటే వెనక్కి వెళ్లి వాటిని
సరిదిద్దుకోమంటాయి ఆత్మల కథలు. ఆత్మలు
పరలోకానికి వెళ్ళిపోకుండా తీరని కోరికలతో ఇక్కడే తచ్చాడడంలో పరమార్థమిదే. జీవించి
వున్నప్పుడే గతంలోకి వెళ్లి సరిదిద్దుకోమనడమే.
ఆత్మలతో కాక గతంలోకి వెళ్లి సరిదిద్దుకునే కథలు ఇంకో రూపంలో కూడా వుంటాయి - టైం మెషీన్ ఫాంటసీలతో. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో టీనేజి హీరో టైం మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణించి, అక్కడ టీనేజీలో వున్న తన తల్లిదండ్రుల్ని కలుసుకుని, రిలేషన్ షిప్ సమస్యల్ని మరమ్మత్తు చేసి వస్తాడు. వస్తే ఇప్పుడు తల్లిదండ్రులు కీచులాడుకోకుండా హయిగా వుంటారు.
‘ఓ బేబీ’ లో ఫోటో స్టూడియో కూడా అలాటి టైం మెషినే. అక్కడ ఫోటో దిగిన ముసలావిడ యవ్వనవతిగా మారడం కాలంలో వెనక్కి వెళ్లి తన యవ్వనపు రోజుల్ని దర్శించడమే. అప్పట్లో తీరని కోరికలే ముసలితనంలో ఆమె దుందుడుకు ప్రవర్తనకి మానసిక కారణాలయ్యాయి. ఆ కోరికలు తీర్చుకుని తిరిగి వర్తమానంలోకి వచ్చి, మారిన మనిషిగా అందరితో కలిసిపోతుంది. ఆత్మల కథలనైనా, టైం మెషీన్ కథల్నైనా, లేదా పూరాణాలనైనా అవి సైకలాజికల్ మీనింగ్ తో - సైకలాజికల్ జర్నీగా వుంటాయని తెలుసుకున్నప్పుడే వీటి ప్రయోజనాల్ని మనం పొందగలం.
అయితే ‘ఓ బేబీ’ కొరియన్ ఒరిజినల్ లోని ఈ సైకలాజికల్ మీనింగ్ ని తెలుగు మేకర్లు అర్ధం జేసుకోక పోవడం వల్ల - ఫోటో స్టూడియో అనేది కాలంలో వెనక్కి తీసికెళ్ళే టైం మెషీన్ కి సింబాలిజమని తెలుసుకోకపోవడం వల్ల - ఫోటో దిగడానికి వెళ్ళినామె చేతిలో వినాయకుడి బొమ్మ పెట్టి, దేవుడి మహిమవల్ల ఆమె ఫోటో దిగి యంగ్ గా మారిపోయిందని హాస్యా స్పదమైన భాష్యం చెప్పారు! మానసికంగా నీలోకి నువ్వు ప్రయాణించమనే సైకలాజికల్ మీనింగ్ వున్న కథని, దేవుడి లీల వల్ల యంగ్ గా మారిపోయినట్టు తమాషా కథగా విలువ తగ్గించేశారు. ఇది చాలనట్టు, మళ్ళీ ముగింపులో వినాయకుడి బొమ్మ వల్ల రాజేంద్ర ప్రసాద్ పాత్ర యంగ్ నాగ చైతన్యగా మారిపోయిందని చూపించి, మొత్తం కొరియన్ కాన్సెప్ట్ నే అపహాస్యం చేశారు. ప్రసిద్ధ బ్యానర్లు చేయాల్సిన పని కాదిది. ఇంకా 14 ప్రపంచ భాషల్లో రీమేక్ అయిందిది. ఎవరూ ఇలా చేయలేదు.
అరాచకం
ఇలాటిదే
ఇప్పుడు ‘సిక్స్త్ సెన్స్’ తో ‘నివీనీనే’ అనే
అరాచకానికి పాల్పడ్డారు. ‘సిక్స్త్ సెన్స్’ లో చనిపోయాక ఆత్మ పరలోకానికెళ్ళి
పోకుండా ఇక్కడే ఎందుకుండి పోయిందనడానికి
కారణం కథే చెప్తోంది - భార్యతో సఖ్యత సాధించడం కోసమని. ఈ ప్రయత్నమంతా సీన్లలో
కనిపిస్తుంది. అయితే బ్ర్రూస్ విల్లీస్ పాత్ర బతికే వున్నాడని భ్రమింపజేస్తూ కథ
నడుస్తుంది. ‘నివీనీనే’ లో చనిపోయిన అర్జున్ - మాధవిల ఆత్మలు రిషీ దియాల్లోకి
ఎందుకు చేరాయో కారణం తెలీదు. ఎలా చేరాయో కూడా వాటికీ తెలీదు. పరలోకానికి
వెళ్ళకుండా ఏం కోర్కె తీర్చడానికున్నాయో తెలీదు.
ఇదీ
ఇంటర్వెల్ ట్విస్టు దగ్గర పరిస్థితి. ప్రారంభంలో అద్దంలో ఎవరో కన్పించడం,
ఇంటర్వెల్లో అద్దంలో కన్పిస్తున్న వ్యక్తే నిజమని తెలియడం ఈ రెండూ అద్భుతమన్పించి
వుంటాయి. దీని తర్వాత వాట్ నెక్స్ట్ అర్ధం గాలేదు. రిషి శరీరంలో దూరిన అర్జున్ ఆత్మని సైకాలజిస్టు
పారద్రోలక పోయినా, ఆ పని అర్జునే చేసుకుంటాడు రిషి శరీరం లోంచి బయట పడాలని. ఇక
అద్దంలో రిషితో మాట్లాడి బయటపడే కామెడీ ప్రయత్నాలు ప్రారంభించే సరికి జానర్ మర్యాద
మంట గలిసి పోయింది. ఏం చేయాలో అర్ధంగాక ఏదేదో చేయడంతో సెకండాఫ్ అతుకుల కథతో
సెకండాఫ్ సిండ్రోం అనే సమస్య బారిన పడింది. ఒకసారి సెకండాఫ్ సిండ్రోంలో పడిందా ఇక
ఆ సినిమాని ఎవరూ రక్షించలేరు. సెకండాఫ్ లో కథకి
ఆపరేటివ్ కంటిన్యూటీ వుందా అని తెలుసుకోవడానికి సినిమా అంతా తీసి
చూసుకోనవసరం లేదు. ఐడియా అనుకున్నప్పుడే దాని స్ట్రక్చర్ లోనే తెలిసిపోతుంది. ఐడియాని
సినాప్సిస్ గా రాసుకున్నప్పుడే తెలిసిపోతుంది. ఐడియా సెట్ చేసుకోకుండా, సినాప్సిస్
రాసుకోకుండా స్క్రీన్ ప్లేలు రాసుకుంటే ఇలాగే వుంటుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దొంగోడు,
సైజ్ జీరో, జ్యోతిలక్ష్మి, నర్తనశాల, 24 కిస్సేస్, పడిపడి లేచే మనసు... ఇలా
సెకండాఫ్ సిండ్రోంలో పడి గల్లంతయిన సినిమా లెన్నో.
అర్జున్ రిషితో అనుకున్నది సాధించలేక, ఇంకో కథ ఎత్తుకుంటాడు. అసలు తను ఎలా చనిపోయాడో తెలుసుకునే కథ. యాక్సిడెంట్ ఎలా జరిగింది, రూటు డైవర్షన్ ఇచ్చిన వాడెవడు, వాడు ఫలానా వాడు, వాడితో, వాడి సహచరులతో తాను బస్తీలో కొట్లాడి, మాధవిని విడిపించుకున్నాడు. అయితే ఆ గ్రూపే పగబట్టి ప్లానింగ్ గా చంపబొయారన్న మాట, కానీ తను మాధవితో సరసాలడుతూ డ్రైవింగ్ చేయడంతో కంట్రోలు తప్పి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తామిద్దరూ చనిపోయారు....
అర్జున్ రిషితో అనుకున్నది సాధించలేక, ఇంకో కథ ఎత్తుకుంటాడు. అసలు తను ఎలా చనిపోయాడో తెలుసుకునే కథ. యాక్సిడెంట్ ఎలా జరిగింది, రూటు డైవర్షన్ ఇచ్చిన వాడెవడు, వాడు ఫలానా వాడు, వాడితో, వాడి సహచరులతో తాను బస్తీలో కొట్లాడి, మాధవిని విడిపించుకున్నాడు. అయితే ఆ గ్రూపే పగబట్టి ప్లానింగ్ గా చంపబొయారన్న మాట, కానీ తను మాధవితో సరసాలడుతూ డ్రైవింగ్ చేయడంతో కంట్రోలు తప్పి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తామిద్దరూ చనిపోయారు....
బస్తీలో కొట్లాట సీను ఫస్టాఫ్ ప్రారంభంలోనే చూపిస్తారు. ‘సిక్స్త్ సెన్స్’ లో బ్రూస్ విల్లీస్ ని షూట్ చేసే సీనుని ఇలా మార్చారన్న మాట.. మార్చి దీనికో పెద్ద కథని జోడించి సెకండాఫ్ లో నడిపారు. ఇది నిలబడలేదు. ఎందుకంటే, ఎలా చనిపోయారో ఆత్మకి తెలియకుండా ఎలా వుంటుంది? ఈ లాజిక్ కి దొరకకూడదన్నట్టు, పారా సైకాలజిస్టు వింత వాదన చేస్తాడు. అర్జున్ ఆత్మ రిషిలోకి దూరడం వల్ల అర్జున్ ఆత్మ జ్ఞాపకశక్తి కోల్పోయిందట. ఆత్మ అతీతమైనదా?మనిషి అతీతుడా? ఆత్మకి జ్ఞాపక శక్తి పోతుందా? ఇంతవరకూ మనం చూసిన సినిమాల్లో ఒకడ్ని ఆత్మ ఆవహించిందంటే, వాడు వాడి కంట్రోల్లో వుండడు, ఆత్మ వాడి మెదడులో తిష్ట వేసి వాడి జ్ఞాపకాలనే చెరిపి పారేస్తుంది...
ఈ కథ సైకలాజికల్ మీనింగ్ గ్రహించకుండా దాన్నే ముక్కలు చేస్తూపోయారు. ‘సిక్స్త్ సెన్స్’ సైకలాజికల్ మీనింగ్ ఏమర్ధమైందో. ఇలా రకరకాల మార్గాలు ప్రయత్నించి, ఇక లాభం లేదని మదర్ సెంటి మెంటుతో ఏడ్పుల కథగా మార్చేశారు. జానర్ మర్యాద ఒకసారి కాదు, పదేపదే శకలాలైంది.
ఈ మొత్తం గజిబిజిలో ప్లాట్ పాయింట్ టూ ఎక్కడుందంటే చెప్పడం ఎవరి తరం గాదు. ‘సిక్స్త్ సెన్స్’ ముగింపు ట్విస్టునే కాదు, ఇంకేసినిమా ఎలాటి ముగిపునీ తెచ్చి ఇంటర్వెల్లో పెడితే ఇంతే. ‘శివ’ లో నాగార్జున రఘువరన్ ని చంపడం ముగింపు. దీన్ని ఇంటర్వెల్లో పెడితే పెడితే ఎలావుంటుంది? ఆ సినిమాకి శ్రద్ధాంజలి ఘటించడమే.
―సికిందర్
Sunday, July 14, 2019
848 : సందేహాలు సమాధానాలు
Q : ఒక పాత్ర గోల్ ని మరొక పాత్ర తీసుకునే కథలకు ఎలాంటి స్క్రీన్ ప్లే చేసుకోవాలో, ఎలాంటి సన్నివేశాలు రాసుకోవాలో వివరిస్తారా. ఉదాహరణకు ఒక బలహీనమైన వ్యక్తికి గొప్ప గోల్ ఉంటుంది. అతని ఆశయం గొప్పదే గాని, అది సాధించే బలం అతనికి ఉండదు. ఈ పరిస్థితుల్లో మరొక బలమైనవాడు ఆ గోల్ తీసుకుంటాడు. ఇలాంటి కథలకు మార్కెట్ యాస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఎలాంటి పాత్రలు రాసుకోవాలి? ఈ టైప్ కథనానికి రెఫరెన్సు సినిమాలు ఏమైనా ఉన్నాయా? (నాకు తెలిసి తమిళ్ లో కత్తి అనే సినిమా ఉంది).. వీలైనంత విపులంగా, సమగ్రంగా దీని గురించి వివరించగలరు...
―ఎపి, AD
―ఎపి, AD
A : సాధారణంగా జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రతిపాదించిన మోనోమిథ్ స్ట్రక్చర్ (అన్ని మతాల పురాణాల్లో వుండే కామన్ కథా నిర్మాణం) లో ఫస్ట్ యాక్ట్ అంటే, బిగినింగ్ విభాగం వరకే గార్డియన్ పాత్రనేది వుంటుంది. ఇది హీరో పాత్రని గోల్ వైపు మోటివేట్ చేస్తుంది. బిగినింగ్ విభాగంలోనే హీరో పాత్ర గోల్ ని తిరస్కరించే ‘రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’ అనే దశ వస్తుంది. అప్పుడు గార్డియన్ పాత్ర పూనుకుని గోల్ వైపు మోటివేట్ చేస్తుంది. ఆ తర్వాత స్వతంత్రంగా గోల్ ని సాధించేందుకు హీరో పాత్ర ముందుకెళ్ళి పోతుంది.
ఇలా ముందుకెళ్ళి నప్పుడు సహాయ పాత్రల తోడ్పాటు తీసుకుంటుందేమో గానీ, గోల్ మాత్రం తన చేతిలోనే వుంచుకుంటుంది. ఇంకెవరికీ అప్పగించదు. ఇదొక విధానం.
ఈ విధానం కాలక్రమంలో అంతరించి పోయింది. 1970 - 80 లలో హాలీవుడ్ సినిమాలు మోనోమిథ్ ని అనుసరిస్తూ వచ్చాయి. అప్పటి వరకూ కథలకి ప్రాచీన అరిస్టాటిల్ విధానాన్నే పాటించేవి. అరిస్టాటిల్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నాటకాల్లోంచి వచ్చింది. మోనోమిథ్ తో వచ్చిన మొదటి హాలీవుడ్ సినిమా జార్జి లూకాస్ తీసిన ‘స్టార్ వార్స్’. మోనోమిథ్ లో హీరో పాత్ర గోల్ ని సాధించేందుకు ఎన్ని దశల్ని దాటుతుందో (12) అన్ని దశలూ ‘స్టార్ వార్స్’ లో వుంటాయి. మోనోమిథ్ తో సినిమాలు బరువైన కథలతో భారంగా, బారెడు సాగుతూ వుంటాయి. అప్పటి చాలా సినిమాలు ఇలా వున్నవే.
1980 లలో సిడ్ ఫీల్డ్ వచ్చి, పురాణాల కథా నిర్మాణమెందుకని, హీరో పాత్ర ప్రయాణపు దశల్ని ఐదుకి కుదించాడు. ప్లాట్ పాయింట్ -1, పించ్ -1, మిడ్ పాయింట్, పించ్ -2, ప్లాట్ పాయింట్ -2 అన్నవి. దీంతో కథలకి, పాత్రలకి వేగం పెరిగింది. 1990 లనుంచీ నేటి దాకా హాలీవుడ్ సినిమాలు సిడ్ ఫీల్డ్ పారడైం తోనే వస్తున్నాయి.
ఇందులో హీరోకి ‘రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’ దశ వుండదు. దీంతో హీరోని మోటివేట్ చేసే గార్డియన్ పాత్ర వుండదు. పాత్రల్ని, కథని తగ్గించి స్పేడు పెంచే విధానమిది. సిడ్ ఫీల్డ్ నమూనాలో ‘శివ’ లో చూస్తే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీని శివ కొట్టి, గోల్ ని స్వీకరించడా నికి ఎవరూ మోటివేట్ చేయరు. అతనే యాక్టివేట్ అవుతాడు. ఐతే ఇటీవల ‘టైగర్ జిందా హై’ మోనోమిథ్ తోనే వుంది. ఇందులో రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్ దశ, మోటివేట్ చేసే గార్డియన్ పాత్రా వుంటాయి. కానీ ఇటీవలే వచ్చిన హాలీవుడ్ ‘అలీటా’ లో మోనోమిథ్ తో కథని, పాత్రల్ని ఎంత గందరగోళం చేశారో చూశాం.
కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం మోనోమిథ్ లో దొరకదు. ఇక్కడ హీరో పాత్రని గార్డియన్ పాత్ర గోల్ కి మోటివేట్ చేయడం వరకే వుంటుంది. మీ ప్రశ్న ప్రకారం, బలహీన వ్యక్తికి గొప్ప గోల్ వుండి, అది సాధించే బలం లేనప్పుడు, మరొక బలమైనవాడు ఆ గోల్ ని తీసుకోవడం మూడు సందర్భాల్లో జరుగుతుంది. స్పోర్ట్స్ జానర్లో, రోమాంటిక్ లేదా యాక్షన్ జానర్లో, ట్రాజడీ జానర్లో. వీటికి అరిస్టాటిల్ త్రీ యాక్ట్స్ గానీ, సిడ్ ఫీల్డ్ పారడైం గానీ నప్పుతాయి.
స్పోర్ట్స్ జానర్లో హీరో పాత్రే మోనోమిథ్ లోని గార్డియన్ పాత్రవుతుంది. కాకపోతే కథ సాంతం పొడిగించిన గార్డియన్ పాత్రవుతుంది. ఆ క్రీడాకారుణ్ణి లేదా క్రీడాకారిణిని మోటివేట్ చేస్తూ గోల్ నెగ్గేలా చూసే పూర్తి స్థాయి గార్డియన్ పాత్ర. ‘దంగల్’ లో అమీర్ ఖాన్, ‘గురు’ లో వెంకటేష్ పాత్రల్లాంటివి. ఇవి బయటి సినిమాల్లో మేల్ + మేల్ క్యారక్టర్స్ తో వుండొచ్చే మోగానీ, ఇండియాలో మేల్ + ఫిమేల్ గా వుంటేనే వర్కౌటవుతాయి. మేల్ గార్డియన్ అయితే, ఫిమేల్ క్రీడాకారిణి. మేల్ + ఫిమేల్ మధ్య వుండే రసోత్పత్తిని మేల్ + మేల్ మధ్య ఏం అనుభవిస్తారు గనుక ప్రేక్షకులు.
రోమాంటిక్ లేదా యాక్షన్ జానర్లో కూడా మేల్ + ఫిమేలే వర్కౌటవుతుంది. ‘బ్రోచేవారెవరురా’ లో హీరోయిన్ కి గోల్ వుంది, కానీ బలహీనురాలు. ఆమె గోల్ నెరవేర్చేందుకు హీరో పూనుకోవడం వుంది. మీరన్నట్టు బలహీన పాత్రకి గోల్ అన్నప్పుడు, ఆ బలహీన పాత్ర హీరో పాత్ర కాకూడదు. హీరో పాత్రని బలహీనంగా మార్చి, దాని గోల్ ని ఇంకే పాత్రో తీర్చడంగా చేస్తే, అది కమర్షియల్ సినిమా లాంగ్వేజీకి విరుద్ధం. ఈ లాంగ్వేజీ బాక్సాఫీసుకి అర్ధం గాక బోసి పోయి వుంటుంది. ఆల్రెడీ బాక్సాఫీకుకి దాని లాంగ్వేజీ ప్రోగ్రాం చేసి వుంది. దాన్ని పనిమాలా మార్చకూడదు.
కాబట్టి బలహీన పాత్ర ఫిమేల్ అయివుండి, దాని గోల్ తీర్చే పాత్ర (ఇది కూడా గార్డియన్ పాత్రే) హీరో పాత్రయినప్పుడు, ఈ మేల్ + ఫిమేల్ కెమిస్ట్రీ రసోత్పత్తినీ, యూత్ అప్పీల్ నీ పుట్టిస్తుంది. ఐతే ఈ ఫిమేల్ పాత్ర హీరోయినే అయి వుండాలి. హీరోయిన్ కాక, హీరో అమ్మో, అక్కో, చెల్లో, వదినో ( సిస్టర్ సెంటిమెంటుతో బాటు ఇప్పుడు వదిన సెంటిమెంటు కూడా వల్లకాటికి పోయింది) అయితే రసోత్పత్తి జరగక, యూత్ అప్పీల్ గేట్లు తెరుచుకుని పారిపోతుంది. ఇక బలహీన పాత్ర మగ పురుగులైన అన్నో, తమ్ముడో, ఫ్రెండో అయితే మేల్ + మేల్ = ఢమాల్ అవుతుంది. కమర్షియల్ సినిమా కథంటే ఆడా మగా మధ్య రసోత్పత్తి గావించి ప్రేక్షకులకి గాలం వేయడమే.
కానీ పెద్ద వయసు పాత్రలతో, చిన్నపిల్లల పాత్రలతో స్వేచ్ఛ తీసుకోవచ్చు. తాత కోసమో, తండ్రి కోసమో, లేదా పిల్లల కోసమో హీరో పాత్ర గోల్ తీసుకోవడం యూనివర్సల్ లాంగ్వేజీ. ఈ సెంటిమెంట్స్ కి ఢోకా వుండదు.
ఇక ట్రాజడీ జానర్లో హీరో పాత్ర చచ్చిపోతూ దాని గోల్ ని ఇంకో పాత్రకి అందిస్తుంది. ఇలా గోల్ ని ఇంకో పాత్రకి అందించి నిష్క్రమించడం వల్ల ఈ హీరో పాత్రని ‘హేండోవర్’ పాత్రంటారని ‘డ్రమెటికా – న్యూ స్టోరీ థియరీ’ సిద్ధాంత కర్తలు పేర్కొన్నారు. ఇలా ‘మనుషులు మారాలి’ లో శోభన్ బాబు పాత్ర చనిపోతే, దాని గోల్ ని శారద పాత్ర తీసుకున్నట్టు, ‘ఎర్ర మందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర చనిపోతే, దాని గోల్ ని యమున పాత్ర తీసుకున్నట్టు ఈ కథలుంటాయి. ఇప్పుడు చూస్తూ చూస్తూ హీరో పాత్రని చంపుకుని కథలెవరు చేస్తారు. కాబటి ఇది ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ కాదు.
పైన చెప్పుకున్న రెండూ (స్పోర్ట్స్ జానర్ ఉదాహరణ, రోమాంటిక్ / యాక్షన్ జానర్స్ ఉదాహరణ) ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ తో వుంటాయి. వీటిలో పేర్కొన్న కాంబినేషన్స్ తో పాత్రల్ని నిర్ణయించుకోవాలి. ఇక కథలకి ఎలాంటి స్క్రీన్ ప్లే చేసుకోవాలో, ఎలాంటి సన్నివేశాలు రాసుకోవాలో ఎలా చెప్పగలం. అది మీ క్రియేటివిటీ. కానీ గోల్ వున్న, లేదా పైన చెప్పుకున్నట్టు వేరే పాత్ర గోల్ ని తీసుకున్న, హీరో పాత్రతో ఏ కథతోనూ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో మార్పేమీ వుండదు. అవే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలూ, వాటిలో పైన చెప్పుకున్న సిడ్ ఫీల్డ్ ఐదు దశలూ వుంటాయి. ఏ కమర్షియల్ కథకైనా ఇంతే. ఇవి ‘బ్రోచేవారెవరురా’ లో వుండడం వల్ల అలావుంది, ‘నిను వీడని నీడను నేనే’ లో లేనందువల్ల ఇలా వుంది.
Q : నాకున్న అవకాశంతో నేను కొత్త హీరోతో మాత్రమే చిన్న బడ్జెట్
సినిమా తీయగలను. ఇది వర్కౌట్ అవుతుందా?
లేక ఒక సినిమా తీసి ఇంటికి వెళ్లి పోతానా? ఈ మధ్య కొత్త హీరోలతో వస్తున్న చిన్న
సినిమాలను గమనిస్తే భయమేస్తోంది. అవి అడ్రసు లేకుండా పోతున్నాయి. నా పరిస్థితి
కూడా ఇంతేనా?
―టివిఎస్, Asso Dir.
―టివిఎస్, Asso Dir.
A : ప్రేక్షకులు కొత్త మొహాల్ని చూడాలంటే పేరున్న దర్శకులు, పేరున్న బ్యానర్లు వుండాలి. కొత్త దర్శకులు కొత్త మొహాలతో రావాలంటే పేరున్న బ్యానర్లోనో, పేరున్నదర్శకుల నిర్మాణంలోనో రావాలి. కొత్త దర్శకుడు చిన్న బడ్జెట్లో కొత్త హీరోతో చేస్తే పేరున్న డిస్ట్రిబ్యూటర్లు టేకప్ చేయాలి. మొదటిది పక్కన బెడితే, మీకు రెండోది కుదిరేట్టు లేదు కాబట్టి, మూడోది ప్రయత్నించవచ్చు. దీనికి కంటెంట్ బావుండాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే, కొత్త నిర్మాతతో చిన్న సినిమాకి ఒకటే మార్గముంది. కొత్త హీరోలని పక్కన బెట్టి, హీరోయిన్ తో సినిమా చేసుకోవాలి. కొత్త దర్శకుడి చిన్న సినిమాలో కొత్త హీరోల మొహాలు చూడలేని ప్రేక్షకులు, హీరోయిన్ ఎంత కొత్తదై నా చూడ్డానికి వస్తారు. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేసుకోవాలి. అలాగని ఏడ్పుల సబ్జెక్టు కాదు, మీగురించి ఆలోచిస్తే వచ్చిన కొత్త అయిడియా ఇది. పనికొస్తుందేమో చూడండి. కనీసం మీరు మార్కెట్ ని పరిశీలించి అడుగు ముందుకేస్తున్నారు. ఏ పరిశీలన లేకుండా గొర్రె దాటుగా కొత్త కొత్త హీరోలతో చెత్త చెత్త సినిమాలు తీసి పడేసి ఇంటికెళ్ళి పోతున్న మార్కెట్ స్పృహ లేని మండూకాల కంటే మీరు నయం.
Q : ‘దొరసాని’ రివ్యూలో
మీరు తెలంగాణా సినిమా అంటే ఇంకా ఆర్ట్ సినిమా కాదన్నారు. మరెలా వుండాలి?
వివరించగలరు.
―మకరందం, AD
―మకరందం, AD
A : ముందు సినిమా దర్శకుడో రచయితో కావాలనుకున్నవాడు సినిమా చరిత్ర విధిగా చదువుకుని రావాలి. సినిమా చరిత్రలో నిర్మాణాల పరంగా ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి, పరిణామాలూ పర్యవసానాలూ వాటి పరిష్కారాలూ ఏమేం చోటు చేసుకున్నాయో తెలుసుకుని వుండాలి. ఇండియాలో వుంటూ ఇండియా చరిత్ర తెలియక పోవడం ఎలాటిదో, సినిమాల్లో వుంటూ సినిమా చరిత్ర తెలియక పోవడం అలాటిది. కనీసం మనం ఓ కంపెనీలో చేరాలన్నా దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని గానీ చేరం. సినిమాల్లో చేరాలంటే మాత్రం ఏమీ తెలుసుకోకుండా ఎగేసుకుని వచ్చి దూరిపోవడమే.
ఆర్ట్ సినిమాల చరిత్ర గురించి ‘దొరసాని’ రివ్యూలోనే రాసి ఇలా ఇప్పుడెందుకు తీయకూడదో చెప్పాం. ఇంకా వివరాలు కావాలంటే ప్రాంతీయ సినిమాల గురించిన వ్యాసాలున్నాయి : ఈలింక్ క్లిక్ చేసి సంచిక డాట్ కాం లో ‘సినీ విశ్లేషణ’ శీర్షిక లోకి వెళ్ళండి. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ సినిమాలు ఎలా మార్పు చెందాయో తెలుస్తుంది. తెలుసుకున్నాక తెలంగాణా ప్రాంతీయ సినిమా ఎలా వుండాలో మీకో అవగాహన ఏర్పడుతుంది. ఆర్ట్ సినిమాలు దేశవ్యాప్తంగా 1980 లలోనే భూస్వామ్య వ్యవస్థతో బాటే అంతరించిపోయి, ఒక దశాబ్దం తర్వాత దాని కొత్త రూపాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ తెలంగాణా సినిమా అంటే ఈ తరం మేకర్లు కూడా ఇంకా కాలగర్భంలో కలిసిపోయిన ఆర్ట్ సినిమాలనే దగ్గరే ఇరుక్కుపోయి దెబ్బ తింటున్నారు - చరిత్ర పుటలు తేలీక!
Q : నావి మూడు
సందేహాలు : ‘నిను వీడని నీడను నేను’ మూవీ గురించి మీది సహా అందరూ మంచి పాయింట్ బట్
మిస్ చేసుకున్నారని రివ్యూస్ రాశారు. సో ఆమూవీ స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు,
చాలా హెల్ప్ అవుతుంది.
2. సందేహాలు సమాధానాలకి ఆదివారం టైం ఫిక్స్ చేయండి. ఆలోపు అందరూ ప్రశ్నలు అడుగుతారు. ఒక టైం అనుకుంటే కదా ఎవరైనా దాన్ని ఫాలో అయేది. 3. ఏ జానర్ మర్యాద ఏంటి దాని రూల్స్ ఏమిటి, అలా అన్ని జానర్స్ ఆర్టికల్స్ లింక్స్ పెట్టగలరు.
A : మీ మొదటి సందేహంలో మొదటి వాక్యం అర్ధం గాలేదు. రెండో వాక్యానికి జవాబు - ‘నివీనీనే' స్క్రీన్ ప్లే సంగతులు రేపు రాయబోతున్నాం. 2. దేశవిదేశాల నుంచి విశేషంగా పాఠకులున్నా ప్రశ్నలు పంపాలని రూలేం లేదు. కాబట్టి దీనికి రెగ్యులర్ శీర్షికంటూ ఎప్పుడూ ఆలోచించలేదు. దాదాపు సందేహాలు బ్లాగులో ఇస్తున్న వ్యాసాల్లోన్నే తీరిపోతున్నపుడు ఇంకా ప్రశ్నల అవసరముండదు. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఇలా అప్పుడప్పుడు వచ్చే ప్రశ్నలతో ఇర్రెగ్యులర్ శీర్షికే బెటర్. ఎక్కువగా తమ కథలతో నేరుగా సంప్రదిస్తూంటారు. 3. మీరడిగిన జానర్ మర్యాద లింక్స్ ఈ కింద ఇచ్చాం.
―సికిందర్
Saturday, July 13, 2019
847 : స్క్రీన్ ప్లే సంగతులు- 3
మిడిల్ టూ
కథనం :
ఇంటర్వెల్లో దర్శకుడు విశాల్ తండ్రికి ఆపరేషన్ కోసం డబ్బు తీసుకుని, విశాల్ తో బాటు కారులో వెళ్తున్న హీరోయిన్ షాలినికి యాక్సిడెంట్ జరిపించి, డబ్బు దోచుకున్న రాహుల్, అతడి ఫ్రెండ్స్ ఒక చోట వుంటారు. షాలిని, విశాల్ లు డబ్బుతో వెళ్తున్నారని ఎలా తెలిసిందనేందుకు రాకీ వివరిస్తాడు. తను డబ్బు కోసం ఏటీఎంలో కెళ్ళి చూస్తున్నప్పుడు, పక్కనే వున్న బ్యాంకులో పెద్ద మొత్తాలు ఎవరైనా డ్రా చేస్తున్నారేమో చూడాలన్పించింది. వెళ్లి చూస్తే అక్కడ షాలినీ మేనేజర్ లక్షల్లో విత్ డ్రా చేస్తున్నాడు. కారులో వచ్చిన షాలినికి డబ్బందించాడు. అప్పుడామె నడుపుతున్న కారుని ఫాలోయ్యారు...
ఇంటర్వెల్లో దర్శకుడు విశాల్ తండ్రికి ఆపరేషన్ కోసం డబ్బు తీసుకుని, విశాల్ తో బాటు కారులో వెళ్తున్న హీరోయిన్ షాలినికి యాక్సిడెంట్ జరిపించి, డబ్బు దోచుకున్న రాహుల్, అతడి ఫ్రెండ్స్ ఒక చోట వుంటారు. షాలిని, విశాల్ లు డబ్బుతో వెళ్తున్నారని ఎలా తెలిసిందనేందుకు రాకీ వివరిస్తాడు. తను డబ్బు కోసం ఏటీఎంలో కెళ్ళి చూస్తున్నప్పుడు, పక్కనే వున్న బ్యాంకులో పెద్ద మొత్తాలు ఎవరైనా డ్రా చేస్తున్నారేమో చూడాలన్పించింది. వెళ్లి చూస్తే అక్కడ షాలినీ మేనేజర్ లక్షల్లో విత్ డ్రా చేస్తున్నాడు. కారులో వచ్చిన షాలినికి డబ్బందించాడు. అప్పుడామె నడుపుతున్న కారుని ఫాలోయ్యారు...
ఈ ఫ్లాష్ బ్యాక్ తర్వాత షాలిని తలకి తీవ్రమైన గాయంతో హాస్పిటల్లో వుంటుంది. విశాల్ ఆందోళనతో వుంటాడు. తన తండ్రికి ఆపరేషన్ కోసం ఇప్పుడు డబ్బు ఎట్లా అని ఆలోచనలో పడతాడు. అటు కిడ్నాపై బందీగా వున్న మిత్రకి బిర్యానీ తినిపిస్తూంటాడు కిడ్నాపర్ అనుచరుడు. స్కూల్లో చదువుకుంటున్న తన కూతురి గురించి చెప్పుకుంటాడు. ఇటు రాహుల్ కిడ్నాపర్ కి డబ్బు అందించేందుకు కాల్ చేయడం కోసం చూస్తే, సెల్ ఫోన్ వుండదు. ఎక్కడ పడిపోయిందో అర్ధంగాదు. ఫోన్ కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అటు తండ్రికి ఆపరేషన్ కి డబ్బు కోసం ప్రయత్నాల్లో వుంటాడు విశాల్. ఎక్కడా దొరకదు. అటు టౌన్లో మిత్ర తండ్రి ఆర్కే, రాహుల్ తండ్రిని కలుస్తాడు. రాహుల్ హైదరాబాద్ వెళ్ళాడని తెలుసుకుని కాల్ చేయమంటాడు. రెస్పాన్స్ రాదు. రాహుల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే ఫోన్ పోయిందంటాడు రాహుల్. ఆర్కే రాహుల్ ని అనుమానించి, పోలీసు అధికారికి చెప్పి, అతడితో హైదరాబాద్ బయల్దేరతాడు.
దారిలో కూతురి పట్ల ఆర్కే ప్రవర్తనకి మందలిస్తాడు పోలీసు అధికారి. ఆర్కే
ఆలోచనలో పడతాడు. అటు హైదరాబాద్ లో ఫోన్ కోసం వెతుకుతున్న రాహుల్ కి, దాన్ని ఆటోలో రాకీకి
ఇచ్చానని గుర్తుకొచ్చి అడుగుతాడు. ఇవ్వలేదంటాడు రాకీ. రోడ్డు మీద ఆటో వాళ్ళని అడగడం
మొదలెడతారు, చివరికి రాహుల్ కి ఇంకో ఆలోచన వస్తుంది. చివరిసారి తనకి రాకీ ఎప్పుడు
కాల్ చేశాడో చెప్పమంటాడు. రాకీ సెల్
ఫోన్లో చూసి 5.20 కి అంటాడు. ఆ
సమయంలో ఎక్కడున్నామో గుర్తు చేసుకుంటే, యాక్సిడెంట్ జరిపించి డబ్బుదోచుకున్న చోట
వున్నామని గుర్తొస్తుంది. వెంటనే అక్కడికి పరుగెడతారు. విశాల్ కి కూడా డబ్బు దోచుకున్న
దుండగుల సెల్ స్పాట్ లో పడిపోయిందని స్ఫురించి, అతను కూడా అక్కడికి పరుగెత్తుతడు...(ప్లాట్
పాయింట్ టూ).
విశ్లేషణ : మిడిల్ రెండో భాగంలో కథనం వేడెక్కాలి. రాహుల్ సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో వేడెక్కింది. కిడ్నాపర్ కి డబ్బందించి మిత్రని విడిపించుకోవాలంటే సెల్ ఫోన్ లేదు. వాడి నంబర్ తెలీదు. వాడు కాల్స్ చేస్తున్నాడెమో తెలీదు. రెస్పాన్స్ రాక పోవడంతో, వార్నింగ్ ఇచ్చినట్టు, మిత్రని అమ్మేస్తాడేమోనని ఆందోళన. ఇప్పుడేం చేయాలి?
చక్కగా గూగుల్ ఎకౌంట్లోకెళ్ళి క్లిక్ చేస్తే, గూగుల్ మ్యాప్ లో సెల్ ఎక్కడుందో క్షణాల్లో చూపిస్తుంది. కాబట్టి ఇలా తేలిపోయే సమస్యకి సెల్ దొరకడం లేదంటూ ఫాల్స్ వేడి పుట్టించారు. కథకుడు ఆడియెన్స్ కంటే వెనుక వుండి పోకూడదు, ముందుండాలి. ఈ మొత్తం సస్పెన్స్ కథలో కథా సౌలభ్యం మాత్రమే చూసుకుని కామన్ సెన్సుని ఖాతరు చేయకుండా వస్తున్నారు. ప్రేక్షకులకి కామన్ సెన్సు వుండదనుకున్నారేమో. సెల్ కోసం ఎవరెవరో ఆటో వాళ్ళని అడగడమేమిటి? సరే, వీళ్ళు ఐదేళ్లుగా ఇంటర్ చదువుతున్న తెలివిలేని వాళ్ళే అనుకుందాం, సినిమా ప్రారంభమే రాహుల్ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెతుకులాటతోనే దృశ్యాలుంటాయి. 20 వేలు పెట్టి తండ్రి వేరే ఖరీదైన సెల్ కొనిస్తాడు. చదువే రాని వాడికి అంత ఖరీదైన సెల్ ఎందుకో అలా ఉంచితే, దీన్ని కూడా జాగ్రత్త చేసుకోకపోవడం కథా సౌలభ్యం కోసమే.
ఇక దర్శకుడు విశాల్ కూడా తండ్రికి
ఆపరేషన్ డబ్బు కోసం ఆందోళన చెందడం తప్ప చేసేదేమీ వుండదు. నిర్మాతకి పరిస్థితి
చెప్తే సాయం చేస్తాడేమో కూడా ఆలోచించడు. ఇక సెల్ పోగొట్టుకున్న రాహుల్ తన కెప్పుడు
చివరి కాల్ చేశాడో చూడమని రాకీ తో అన్నప్పుడు ఆ టైం 5.20 అంటాడు రాకీ. ఆ టైములో తాము
డబ్బు దోచుకున్న స్పాట్ లో వున్నామని గుర్తు కొచ్చి అక్కడే సెల్ పడిపోయి వుండాలని పరిగెత్తుతాడు
రాహుల్. కానీ అప్పుడా స్పాట్ లో ముగ్గురూ పక్కపక్కనే మాటు వేసినట్టు ఇంతకి ముందు మనకి
చూపిస్తారు. పక్కపక్కనే కూర్చుని వుండగా,
5.20 కి రాహుల్ కి రాకీ ఎందుకు కాల్ చేస్తాడు?
ఇలా ఇష్టానుసారం కథ చేసుకున్నారు. సెల్ ఎక్కడ పడిపోయిందో ఇలా తెలుసుకుని పరిగెత్తడంతో, అటు విశాల్ కి కూడా ఇదే స్ఫురించి పరుగెత్తుకు రావడంతో ప్లాట్ పాయింట్ టూ వేసి, మిడిల్ టూ ముగించారు.
ఎండ్ విభాగం కథనం :
స్పాట్ దగ్గరికి వచ్చిన రాహుల్ అండ్ ఫ్రెండ్స్ విశాల్ కి కన్పించకుండా కూర్చుని ఆ సెల్ కి కాల్స్ చేస్తూంటారు. ఆ సెల్ ఒక పిచ్చోడి దగ్గర మోగుతుంది. వాడికి (బిత్తిరి సత్తికి) సెల్ దొరికింది... వాడి వెంట పడతారు. విశాల్ కూడా వెంటపడతాడు. అటు రాహుల్ కాల్స్ కి రెస్పాండ్ కావడం లేదన్న కోపంతో మిత్రని వేరే గ్రూపుకి అమ్మేద్దామని తీసుకుని బయల్దేరతాడు కిడ్నాపర్. డ్రైవర్ రాష్ డ్రైవింగ్ చేయడంతో - వాహనదారులు అడ్డుకుని డ్రైవర్ ని కొట్టి గలభా సృష్టించడంతో - పోలీసులు వచ్చి వ్యానులో బందీగా వున్న మిత్రని చూస్తారు, కిడ్నాపర్ ని పట్టుకుంటారు.
రాహుల్ అండ్ ఫ్రెండ్స్ ఒక స్కూలు పిల్ల దగ్గరున్న బ్యాగుని గుర్తు పడతారు. మిత్రకి డబ్బు పెట్టి ఇచ్చిన బ్యాగులాగే వుంటుందది. దాన్ని తీసుకుని చూస్తారు. డబ్బుండదు. ఎవరిచ్చారంటే దూరంగా తండ్రిని చూపిస్తుంది. అతను మాఫియా అనుచరుడు. అతడి వెంట పడతారు. తర్వాత పిచ్చోడి దగ్గర సెల్ లాక్కుని పరిగెడుతున్న రాహుల్ కి ముఖాముఖీ అవుతాడు విశాల్. సెల్ కోసం ఇద్దరూ కొట్టుకుంటారు. విశాల్ ని విడిపించుకుని పారిపోతాడు రాహుల్. విశాల్ కి మదర్ కాల్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయిందని అంటుంది. డబ్బెవరిచ్చారంటే నువ్వే పంపించావుగా అంటుంది. హాస్పిటల్ కి పరుగెడతాడు విశాల్. ఆపరేషన్ డబ్బు షాలినియే ఏర్పాటు చేసిందని తెలుసుకుంటాడు.
రాహుల్
కి పోలీస్ స్టేషన్ లో వున్న మిత్రకి రాహుల్ నుంచి కాల్ వస్తుంది. ఏం జరిగిందో అర్ధమవుతుంది.
పోలీస్ స్టేషన్ కి మిత్ర తండ్రి ఆర్కే, పోలీస్ అధికారి వస్తారు. అటు హాస్పిటల్లో షాలినికి
పోగొట్టుకున్న డబ్బు అందుతుంది. అజ్ఞాతంగా రాహుల్ పంపించిన డబ్బు.
ఇటు మిత్రని కారెక్కించుకుని బయల్దేరతాడు ఆర్కే. టౌన్లో పోతూండగా మళ్ళీ నాట్యం హోర్డింగ్ ని చూస్తుంది మిత్ర. చివరి దృశ్యంలో రాహుల్, మిత్రాలు కాలేజీలో వుంటారు...
విశ్లేషణ : ఈ ముగింపులో చేసిన నేరాలకి ఎక్కడా శిక్ష పడకుండా వచ్చేసి కాలేజీలో చేరారు రాహుల్ అండ్ ఫ్రెండ్స్. పోలీసులు కళ్ళ ముందు నేరాలు కన్పిస్తున్నా ఆ వేపుగా ఆలోచించరు. ఒకవేళ ఆర్కే వెంట వున్న పోలీసు అధికారి మేనేజి చేశాడనుకున్నా, పట్టుకున్న కిడ్నాపర్ని కూడా వదిలెయ్యాలి. ఇలా లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీల్లాగే, ఈ లైటర్ వీన్ క్రైం కామెడీని పైపైన రాసేసి తీసేశారు. లాజిక్కులూ కామన్ సెన్సులూ నైతిక విలువలూ పట్టకుండా.
(అయిపొయింది)
―సికిందర్
Monday, July 8, 2019
846 : స్క్రీన్ ప్లే సంగతులు -2
మిడిల్ - 1
కథనం :
రాహుల్, రాకీ, రాంబోలు మిత్రని కిడ్నాప్ చేసి ఆమె తండ్రి ఆర్కేని బెదిరిస్తారు. ఎనిమిది లక్షలు డిమాండ్ చేస్తారు. పోలీసులకి చెప్తే మిత్రని చంపేస్తామంటారు. ఆర్కే ఎనిమిది లక్షలు అందించి మిత్రని విడిపించుకుంటాడు. మిత్రుడైన పోలీసు అధికారి (సత్యకృష్ణ) కి చెప్తాడు. పోలీసు అధికారి కామెడీగా ఎంక్వైరీ చేస్తాడు.
రాహుల్, రాకీ, రాంబోలు మిత్రని కిడ్నాప్ చేసి ఆమె తండ్రి ఆర్కేని బెదిరిస్తారు. ఎనిమిది లక్షలు డిమాండ్ చేస్తారు. పోలీసులకి చెప్తే మిత్రని చంపేస్తామంటారు. ఆర్కే ఎనిమిది లక్షలు అందించి మిత్రని విడిపించుకుంటాడు. మిత్రుడైన పోలీసు అధికారి (సత్యకృష్ణ) కి చెప్తాడు. పోలీసు అధికారి కామెడీగా ఎంక్వైరీ చేస్తాడు.
ఇప్పుడు డబ్బుతో హైదరాబాద్ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుంది మిత్ర. ఆమెని బస్సెక్కించేస్తాడు రాహుల్. వాళ్ళ వాటా మూడు లక్షలు తీసుకొమ్మంటే హైదరాబాద్ వచ్చి తీసుకుంటామంటాడు. అనుమానం రాకుండా ఒకరోజు ఆగి వస్తామంటాడు. ఆర్కే ఇంటికి వెళ్లి చూస్తే మిత్ర వుండదు. మళ్ళీ పోలీసు అధికారికి కంప్లెయింట్ చేస్తాడు. మిత్ర ట్యూషన్ మాస్టార్ని ముగ్గురు కొడుతూండగా చూశానని ఒకడు అంటాడు. ఆ ముగ్గురి గురించి కామెడీగా ప్రశ్నించి కొట్టి పారేస్తాడు పోలీసు అధికారి.
మిత్ర హైదరాబాద్ చేరుకుంటుంది. రాహుల్ కూడా రాకీ, రాంబోలతో చేరుకుంటాడు. మిత్రకి కాల్ చేస్తాడు. కలుద్దామనుకుంటారు. ఇంతలో మిత్ర కిడ్నాప్ అవుతుంది. ఎనిమిది లక్షలున్న బ్యాగుతో సహా బందీ అవుతుంది. ప్రొఫెషనల్ కిడ్నాపర్ ఆమె ఇచ్చిన నంబర్ తీసుకుని రాత్రికల్లా పది లక్షలు ఇవ్వాలని రాహుల్ ని బెదిరిస్తాడు. ఇవ్వకపోతే మిత్రని అమ్మేస్తానంటాడు. రాహుల్ షాక్ తింటాడు...
ఇంతవరకు కథ చెప్పి, సెల్ రింగ్ అవుతూంటే ఆగుతాడు విశాల్. కాల్ కట్ చేసి హీరోయిన్ షాలినికి సారీ చెప్తాడు. మళ్ళీ సెల్ రింగవుతుంది. మళ్ళీ సారీ చెప్తాడు. ఫర్వాలేదు రిసీవ్ చేసుకోమంటుంది. ఆ కాల్ అతడి తల్లి చేస్తుంది. ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందని, ఆపరేషన్ కి ఎనిమిది లక్షలు కావాలనీ. ఇది తెలుసుకుని షాలిని డబ్బు ఏర్పాటు చేస్తానంటుంది. ఇద్దరూ బయల్దేరతారు.
ఇంకోవైపు కిడ్నాపర్ డిమాండ్ చేసిన పది లక్షలు సంపాదించడం కోసం తిరుగుతూంటారు రాహుల్, అతడి ఫ్రెండ్స్. ఏటీఎం మీద కూడా కన్నేస్తారు. డబ్బు కోసం బయల్దేరిన మేనేజర్ కి కాల్ చేసి డబ్బు ఏర్పాటు చేయమంటుంది. హాస్పిటల్ కి దారిలో మేనేజర్ వచ్చి డబ్బు అందిస్తాడు. ఆ డబ్బుతో వెళ్తూండగా కారు ఒక్కసారి యాక్సిడెంట్ కి గురవుతుంది. కారుమీద పడి ఆ డబ్బు దోచుకుని పారిపోతారు రాహుల్ అండ్ ఫ్రెండ్స్
(ఇంటర్వెల్)
విశ్లేషణ :
మిడిల్ అంటే హీరో సంకల్పించుకున్న గోల్ కోసం సంఘర్షణ. గోల్ సాధనలో ఈ సంఘర్షణతో
హీరో పాత్ర ఉక్కిరిబిక్కిరవుతుంది. తను ఒక యాక్షన్ తీసుకుంటే, దానికి రియాక్షన్ గా ఇంకోటి జరుగుతుంది. ఆ
రియాక్షన్ కి ఇంకో యాక్షన్ తీసుకుంటే, దానికి మళ్ళీ రియాక్షన్ గా ఇంకోటి
జరుగుతుంది. ఈ వలయం అంతకంతకూ తీవ్ర స్థాయికి చేరుకుంటూ, ఇందులోంచి బయటపడే మార్గం
ఒక చోట కన్పిస్తుంది : అదే ప్లాట్ పాయింట్ టూ అనే కీలక ఘట్టం. ఇది సెకండాఫ్
క్లయిమాక్స్ దగ్గర వస్తుంది. అక్కడ్నించీ ముగింపుకి దౌడు తీస్తుంది కథనం.
ఈ మిడిల్, ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ కీ, ఇంటర్వెల్ కీ మధ్య మిడిల్ వన్ గానూ, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్ టూ గానూ రెండు భాగాలుగా వుంటుంది. ఈ రెండు భాగాల మిడిల్ విభాగంలో వుండేదే కథ. మిడిల్ కి ప్లాట్ పాయింట్ వన్ కవతల, బిగినింగ్ లో వుండేది కథ కాదు. కేవలం మిడిల్లో వుండే కథకి అది ఉపోద్ఘాతం. అలాగే మిడిల్ కి ఇవతల, ప్లాట్ పాయింట్ టూ తర్వాత మొదలయ్యే ఎండ్ విభాగంలో వుండేది కూడా కథ కాదు. కేవలం మిడిల్ విభాగంలో వున్న కథకి ముగింపు. ఈ మొత్తం మిడిల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరో కేర్పడిన గోల్ ఎలిమెంట్స్ నాల్గూ అమలవుతాయి. పై మిడిల్ వన్ కథనం చూద్దాం.
గత వ్యాసం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మిత్రని కిడ్నాప్ చేశాక, ఇప్పుడు మిడిల్ వన్ లో పడింది కథనం. అంటే కథ ప్రారంభమయ్యింది. ఇక్కడ మిత్రని హైదరాబాద్ కి చేరవేసే గోల్ కోసం రాహుల్ ఆమె తండ్రిని బెదిరించి ఎనిమిది లక్షలు లాగి మిత్ర కిచ్చేశాడు. ఇది గోల్ కోసం హీరో తీసుకున్న యాక్షన్. వెంటనే దీనికి రియాక్షన్ మొదలై పోయింది –మిత్ర ఫాదర్ ఆర్కే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతో. రాహుల్ ని అనుమానించేందుకు ఒక సాక్షి దొరకడంతో. ఆర్కే ఈ కిడ్నాప్ కేసులో దోషుల్ని పట్టుకోవడానికి పట్టుదల తోనే వున్నాడు. కానీ పోలీసు అధికారియే వెర్రి థియరీలు చెప్తూ కేసుని నీరు గారుస్తున్నాడు.
ఇలా రిలీఫ్ దొరికిన రాహుల్ ఇంకో
యాక్షన్ తీసుకుని, మిత్రని హైదరాబాద్ పంపేశాడు డబ్బుతో. ఇప్పుడే తాము కూడా వస్తే అనుమానిస్తారని,
తర్వాత వస్తామని ఆమెని పంపేశాడు. కిడ్నాపైన రెండో రోజే కూతురు మాయమైందంటే,
కిడ్నాప్ వ్యవహారం ఆమే నడిపించి వుంటుందని అనుమానం రావాలి ఆమె తండ్రి ఆర్కే కి. ఈ
యాంగిల్లో రాహుల్ ఆలోచించలేదు. ఆలోచన తక్కువ యూత్ ఎలాటి పనులు చేస్తూంటారనేదే ఈ
కథ. చేస్తున్నవి పెద్ద నేరాలని కూడా తెలుసుకోవడం లేదు. అయితే దీనికి మూల్యం
చెల్లించుకునే నైతిక ఆవరణ కూడా ఈ కథకి లేదు. ఇది పాత్ర చిత్రణల పరంగా
కొట్టొచ్చినట్టుండే లోపం. హాలీవుడ్ ‘బేబీ డ్రైవర్’ లో టీనేజీ హీరో, ఆ వయసులో
తెలియక నేరాలు చేసినా, తర్వాత అతడి అడుగులు శిక్ష అనుభవించే సంఘటనల దిశగానే
తెలియకుండానే పడతాయి. దీంతో ఆ కథ నైతికావరణ (మోరల్ ప్రెమీజ్) పరిపూర్ణంగా
కన్పిస్తుంది. ఇది ఆస్కార్ అవార్డు పొందిన మూవీ అనేది వేరే సంగతి, ఇందులో నేరాలకి
తగిన చట్టం అమలవడమనే జస్టిఫికేషన్ వుంటుంది. ‘బ్రోచేవారెవరురా’ లో ఈ జస్టిఫికేషన్
లేకుండానే హీరోయిన్ సహా హీరోనీ, అతడి ఫ్రెండ్స్ నీ తగిన గుణపాఠం లేకుండానే హేపీ
ఎండింగ్ ఇచ్చారు. దీంతో ఇలాటి యూత్ కి
రాంగ్ మెసేజి వెళ్లేట్టు చేశారు.
ఇందులో చట్ట పాలన చూపించకుండా కర్మ సిద్ధాంతాన్ని అమలు చేశారు. అయితే చివరికి కర్మ సిద్ధాంతం ప్రకారమయినా వాళ్ళకి గుణపాఠం లేదు. టౌన్లో ఆడిన ఉత్తుత్తి కిడ్నాప్ డ్రామాకి రియాక్షన్ గా, హైదరాబాద్ లో రియల్ కిడ్నాప్ జరగడం కర్మ ఫలమే అనుకుంటే, ఇంకా రాంగ్ నిర్ణయం తీసుకుని రాహుల్, విశాల్- షాలినిలకి ప్రమాదం జరిపించి వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆమె ప్రాణాపాయ స్థితిలో కెళ్ళిపోయింది. ఇది హత్యాయత్నం అంతటి తీవ్ర నేరమే.
ఐతే స్టోరీ డైనమిక్స్ కోసం హీరో ఇలాటి చర్యలకి పాల్పడం పాత్ర చిత్రణకి మంచిదే. పోనూ పోనూ అధఃపాతాళంలోకి జారుకోవడం... అయితే ఈ చర్యలకి చివర్లో అనుభవించాలి, ఇదే జరగలేదు. లైటర్ వీన్ క్రైం కామెడీ కైనా ఇది సూటవదు. కథనంలో ఇంకా చాలా వాటిని దాటవేశారు. మిత్రకి ఎనిమిది లక్షలున్న బ్యాగు నిచ్చి హైదరాబాద్ పంపడం కన్విన్సింగ్ గా వుండదు. అందులో మూడు లక్షలు తమ వాటా కూడా రాహుల్ తీసేసుకుండా, హైదరాబాద్ వచ్చి తీసుకుంటాననడం పాత్ర చిత్రణని బలిపెడుతూ కథా సౌలభ్యం చూసుకోవడమే. ఇక అంత డబ్బుతో ఆమె హైదరాబాద్ వెళ్లి రియల్ కిడ్నాపై నప్పుడు ఆ డబ్బు ఇచ్చేసి బయట పడొచ్చు. ఆమె బ్యాగుని చెక్ చేసిన కిడ్నాపర్ అనుచరుడు అందులో ఏమీ లేదంటాడు. కానీ అడుగునే డబ్బులున్నాయి. కథా సౌలభ్యం కోసం ఇవన్నీ దాటవేయడం క్రైం కథకి తగదు. క్రైం కథ లాజికల్ గా వుండాలి.
కథా సౌలభ్యం చూసుకునే పనిలో
లాజిక్ ని దాటవేయడం దర్శకుడు విశాల్ - హీరోయిన్ షాలినల మధ్య బిగినింగ్ విభాగంలో చూశాం.
సగం కథతో అతను కథ విన్పించడానికి వెళ్లడమేమిటి? ఇలాగే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మిడిల్
వన్ లో కూడా కథా సౌలభ్యం కోసం సభా మర్యాదని
బలిపెట్టారు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. కథా సౌలభ్యం చూసుకుంటూ కథనంలో మంచి
డైనమిక్స్ ని మిస్ చేసుకున్న ఈ ఘట్టం గురించి చెప్పుకుందాం : ఎనిమిది లక్షలున్న బ్యాగుతో
మిత్ర హైదరాబాద్ వెళ్లి కిడ్నాప్ అయినప్పుడు, ఆ డబ్బు విషయం దాటవేసి కథ నడిపినప్పుడు,
చివరికి ఆ డబ్బేమైందో కూడా తేల్చలేనప్పుడు, ఒక్కటే చేసి వుండాల్సింది – ఆ డబ్బున్న
బ్యాగు ఆమె పోగొట్టుకోవాలి, పోగొట్టుకున్నాక రియల్ కిడ్నాప్ అవ్వాలి. ఇది పదహారణాల
కర్మ ఫలం.
ఇక దర్శకుడు విశాల్ షాలినికి రియల్ కిడ్నాప్ వరకూ కథ చెప్తున్నప్పుడు, అతడి సెల్ మోగుతుంది. కట్ చేస్తాడు మళ్ళీ మోగుతుంది. మళ్ళీ కట్ చేస్తాడు. కథ చెప్పడానికి వెళ్ళిన కొత్త దర్శకుడు సెల్ స్విచాఫ్ చేయకుండా, లేదా సైలెంట్ లో పెట్టకుండా టేబుల్ మీద పడేసి ఇంత కేర్లెస్ గా వుంటాడా? అది మర్యాదేనా? అతను దర్శకుడేమో గానీ ముందు కల్చర్ నేర్చుకోవాలి. సినిమా కల్చర్ ఇలా వుండదు. ఆ హీరోయిన్ కూడా ఇరిటేట్ అవకుండా ప్రోత్సహిస్తుంది. పైగా ఆ సమయంలో అతడికి తండ్రికి యాక్సిడెంట్ అయితే వెంటనే ఎనిమిది లక్షలు ఇచ్చేయడానికి బయల్దేరుతుంది... ఈ రెండు పాత్రలూ ఏమిటోగా వున్నాయి.
ఇప్పుడు వీళ్ళకి యాక్సిడెంట్ జరిపించి రాహుల్ డబ్బు కొట్టేయడం ఇంటర్వెల్ కి ట్విస్టు విప్పడం. అదేమిటంటే, ఇంతవరకూ ఫస్టాఫ్ లో విశాల్ చెప్తున్న కథ రాహుల్ - మిత్ర – అండ్ ఫ్రెండ్స్ రూపంలో కల్పిత కథగా వస్తోందన్న అభిప్రాయం ఇక్కడ తప్పవడం. అతను చెప్తూన కథే బయట కాకతాళీయంగా రాహుల్ - మిత్ర – అండ్ ఫ్రెండ్స్ తో నిజంగా జరుగుతున్నదని రివీలవడం. ఇందువల్లే ఇది విశాల్ కి తెలియకుండా అతడి ప్రోఫెటిక్ (భవిష్యవాణి) నేరేషన్ అయింది. చివరికి తనూహిస్తున్న పాత్రలే నిజంగా వుండి, అతడిమీద ఎటాక్ చేసి డబ్బెత్తు కెళ్ళి పోయాయి. గమ్మతయిన కథ ఇది.
(మిడిల్ టూ రేపు)
―సికిందర్
Subscribe to:
Posts (Atom)