రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 4, 2019

817 : టిప్స్


       52. ‘నువ్వు తోపురా’ లో హీరో సుధాకర్ పాత్రకి కల్పించిన నైతిక ప్రాతిపదిక ఏమిటి? అతను ఆవారా, బీటెక్ పూర్తి చెయ్యడు, ఏ పనీ చెయ్యడు, నడుం వంచి పని చేయమంటే సూరి ఎవ్వరికీ వంగడు అని పంచ్ డైలాగు. ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్), ఇంట్లో చెల్లెలు - ఓ కప్పు టీ కూడా సొంత డబ్బులతో కొనుక్కోలేని వాడివని అవమానించినా దులుపుకు పోతాడు (తర్వాతెప్పుడో ఫీలవుతాడు). వేళా పాళా లేకుండా ఫ్రెండ్స్ తో మద్యం తాగుతాడు. తాగి వచ్చి ప్రభుత్వోద్యోగిని అయిన చదువుకున్న తల్లితో, చదువుకుంటున్న చెల్లెలితో మిస్ బిహేవ్ చేస్తాడు. అన్నం ప్లేటు తీసి ఎత్తి పడేస్తాడు. ఎందుకిలా చేస్తున్నాడంటే చెప్పిన కారణం చిన్నప్పట్నుంచీ తల్లి తనని పట్టించుకోలేదట. ఆమె ఆఫీసు నుంచి వచ్చి, పాపాయిగా వున్న చెల్లెల్నే  చూసుకుంటూ, వంట పనీ అదీ  చేసుకుంటూ తనని పట్టించుకోలేదట. 

           ఇదీ ఇంతవరకూ ఇంట్లో కథకి నైతిక ప్రాతిపదిక. ఇంత వయసొచ్చాకైనా తల్లిని  అర్ధం జేసుకోకపోవడంలోని సైకలాజికల్ గ్యాప్ తో వుంది. పైగా తల్లి మీద ఆధారపడి బతుకుతూ. ఇది కథలో తల్లితో కాన్ఫ్లిక్ట్ కి (సంఘర్షణకి) సరిపోయిందా అన్నది వేసుకోవాల్సిన ప్రశ్న. సరిపోలేదనే సన్నివేశాలని చూస్తూంటే తెలుస్తుంది. మొన్న ‘సూర్యకాంతం’ లో లాగే పైపైన రాసేసి ఏదో చల్తాహై అన్నట్టు ఇదీ తీసేశారు.  ‘తోపు’ అన్నాక మానసిక ఎదుగుదలకి అడ్డు పడే కారణాలుండకూడదు. తోపు తోపే – వాడి మైండు షార్పే, అదే సమయంలో తుప్పే. ఈ కథ లోనే ఒకచోట సబబైన ఒక  కారణముంది మైండ్ తుప్పు పట్టడానికి. దీన్ని గుర్తించలేదు. 

           చిన్నప్పుడు తల్లి గురించి ఒకడు చెడుగా మాట్లాడతాడు. పొద్దుపోయినా తల్లి ఆఫీసు నుంచి ఇంటికి రావడం లేదంటే ఇంకే నాన్నతో గడుపుతోందో నని. ఈ మాట అనగానే – దీంతో ఇక తల్లి తనని నిర్లక్ష్యం చేస్తున్న కారణం వాడి పసి మనసుకిలా తెలిసొచ్చి, దాంతో తల్లి మీద ఇప్పుడు అనుమానంతో  కూడిన ద్వేషం బలపడుతుందన్న అంచనా వెంటనే మనకి అందుతుంది. కానీ దీన్ని నీరుగారుస్తూ అక్కడికక్కడే మ్యాటర్ సెటిల్ చేసేశారు. వాడు వెంటనే తల్లిని అంత  మాట అన్నవాడిని కొబ్బరి కాయ పెట్టి కొట్టేస్తాడు. ఇంకేముంది- తనని నిర్లక్ష్యం చేస్తున్న తల్లి పట్ల ఈ పాజిటివ్ యాక్షన్ మొత్తం కాన్ఫ్లిక్ట్ నే గల్లంతు చేసేసింది. 

          ఇక్కడ మనం రాసి పెట్టుకోవాల్సిన  స్క్రీన్ ప్లే నీతి  ఏమిటంటే – కాన్ఫ్లిక్ట్ ని బిల్డప్ చేస్తున్నప్పుడు మధ్యలో దాన్ని సెటిల్ చేసేసే పాజిటివ్ టర్నింగు లిచ్చుకోకూడదని! 

          చిన్నప్పుడు విన్న మాటలతో వాడు (రాముడే విన్న మాటలతో సీతని దూరం పెట్టాడు) తల్లిని ద్వేషించి వుంటే, తల్లి ఇంకో నాన్నతో గడిపి రావడమే  తనని నిర్లక్ష్యం చేయడానికి మూలమని విషబీజం నాటుకుని వుంటే,  పెద్దయ్యాక కూడా దీనికి ఎక్స్ పైరీ వుండదు. ఏమో అప్పుడలా తిరిగిండొచ్చు అమ్మ - అని ఇప్పటికీ అనుకోవడానికి వీలుంది. ఒక అనుమానం ‘ముత్యాల ముగ్గు’ ని అంత హిట్ చేసింది. ఈ అనుమాన బీజం కాన్ఫ్లిక్ట్ కి ఆధారమైనప్పుడు, ఆ  నైతిక ప్రాతిపదిక చాలా బలంగా వుంటుంది. మనసులో పెట్టుకున్న అనుమానం ఎప్పుడు బరస్ట్ అయి బయట పెడతాడు - అప్పుడా మదర్ ఏమని జవాబిస్తుంది - అన్న బలమైన ఎమోషనల్ డ్రామా కోసం మనం ఉత్కంఠతో ఎదురు చూడొచ్చు. కథంటే ఇదికదా. వంద రూపాయలిచ్చుకున్న ప్రేక్షకుడు విషయం లేకుండా ఏం చూస్తూ కూర్చుంటాడు (జీఎస్టీ తో కలిపి 112 తీసుకుంటున్నారు, నూట పదహార్లు చేస్తే సరిపోతుంది కళా సేవలకి). 

          స్క్రీన్ ప్లే నీతి -2  :  ప్రేక్షక భక్తుడు  దక్షిణగా  సమర్పించుకున్న నూట పదహార్లు విలువ చేసే కళా  సేవలు కూడా అందించలేనప్పుడు కాళ్ళూ చేతులు ముడుచుక్కూర్చోవాల్సిందే!

          ఇక అమెరికా వెళ్లిపోయేటప్పుడు మదర్ తో ఇంకేదో గొడవ పెట్టుకుని చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇంకేదో గొడవ కాదు, ఈ అనుమాన బీజమే బద్ధలవ్వాలి. తల్లి మీద అభాండం వేసేసి వెళ్లిపోవాలి. ఆమె కుప్పకూలిపోవాలి. ఇది మనల్ని సినిమా సాంతం ఆందోళన పరుస్తూ వెంటాడాలి - ఇప్పుడెలా పరిష్కారమవుతుందాని. ప్లాంట్ పాయింట్ వన్ అంటే ఇలా వుండాలి కదా? ఇంకేదో లేకి గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కథకి సంబంధమున్న ప్లాట్ పాయింట్ లా వుందా? ఇందుకే ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదని, ఇంకేదో వుంటుందనీ ఇంటర్వెల్ దాకా భరిస్తూ చూడాల్సి వచ్చింది.

***
         సరే, దీన్నలా వుంచుదాం. ఇక అమెరికా వెళ్ళాక  అక్కడ ఏ నైతిక ప్రాతిపదికన కొనసాగాడు? అమెరికా వెళ్లకముందు, హీరోయిన్ తో విడిపోయాడు. ఆమె ఎమ్మెస్ కి యూఎస్ కెళ్ళడం నచ్చలేదు. బీటెక్ పూర్తి చేసి తననీ రమ్మన్నా మొండికేశాడు. అలా విడిపోయాక, అమెరికా వెళ్తాడు. అమెరికా  వెళ్లేందుకు కథకుడు చేసిన కథనం చిన్నప్పుడే తాత దగ్గర డప్పు బాగా వాయించడం నేర్చుకోవడం. ఈ డప్పు కళ ఇప్పుడు అమెరికాలో ప్రోగ్రాం ఇచ్చేందుకు దారి తీస్తుంది. అక్కడికెళ్ళి మిస్ బిహేవ్ చేసి ఆ తెలుగు సంఘం వాళ్లకి దూరమైపోతాడు. చదువూ పూర్తి చేయలేదు, జస్ట్ అమెరికా వచ్చే ముందే తాత చనిపోతే శవయాత్రలో తాత కోసం డప్పు వాయించాడు, అంత సెంటిమెంటల్ డప్పు కళతో అమెరికా  వచ్చిన వాడు దాన్ని కూడా ఉపయోగించుకుని బాగుపడాలనుకోడు. మరేం తోపు?  మరెందుకు అమెరికాకి రావడం? క్యారక్టర్ కి విలువల ఆధారిత మోటివేషన్ ఏది? అమెరికా వెళ్ళడమంటే అమేథీ వెళ్ళడం కాదుకదా? 

          స్క్రీన్ ప్లే సేవల రీత్యా చెప్పాలంటే డప్పు వాయించడానికి అమెరికా వెళ్ళడమంటే ఒక కమర్షియల్ అప్పీలున్న సెటప్ అది. దీని పే ఆఫ్ అలాగే జరిగిపోవాలి. డప్పు వాయించేసి ఆదరగొట్టాలి. ఆ డప్పు చిరిగిపోవాలి తల్లి మీద కసితో! అతడి మైండ్ మీద తల్లియే స్వారీ చేస్తోంది. ఈ భారం ఇంకెప్పుడు దిగిపోతుందో తెలీదు. ఇది పాత్రకి ఎమోషనల్ సెటప్. ఫిజికల్ సెటప్ వచ్చేసి తిరిగి రాలేక అమెరికాలో ఇరుక్కోవడం. 

          కానీ ఇందంతా వుండదు. అమెరికాలో డప్పు ప్రదర్శనే వుండదు (పాపం తాత!). అతడి రొచ్చు ప్రవర్తన నచ్చక అమెరికా తెలుగు సంఘం వాళ్ళు వెళ్ళగొడతారు. మామూలుగా విమాన మెక్కించి తిరుగు టపాలో పంపించేస్తారు. పంపించక పోతే అది కాంట్రాక్టు ఉల్లంఘన. డిమాండ్ చేసి రిటర్న్ జర్నీ సాధించుకోవచ్చు. అలా చేయక, ఏం చెయ్యాలో తోచనట్టు, అమెరికాలో గొప్ప చిక్కులో పడిపోయినట్టు ఫీలవుతాడు. ఫీలయ్యి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా వుండి పోవడానికి నిర్ణయించుకుంటాడు. పెట్రోల్ బంకులో ఉద్యోగంలో చేరతాడు. ఇందులో కూడా లాజిక్ ఆలోచించకుండా పక్కన బెడదాం. అయితే ఇక్కడ్నించే కథ వీగిపోవడం మొదలెడుతుంది.  ఇప్పటి వరకు ఫస్టాఫ్ అరగంట కథే. ఇక్కడ్నించీ ఇంకో రెండు గంటలు అమెరికాలో కథంతా వుంది. దీని నైతిక ప్రాతిపదికేమిటో చూద్దాం. 

          ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా పెట్రోలు బంకులో వుంటూ శాశ్వత పౌరసత్వం గురించి ఆలోచిస్తాడు. దీనికి గ్రీన్ కార్డు కోసం అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తెలుసుకుని, ఒకమ్మాయితో ఉత్తుత్తి పెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆమె ఏడు వేల డాలర్లు డిమాండ్ చేస్తుంది. అంత డబ్బెలా అని ఆలోచిస్తూంటే ముగ్గురు క్రిమినల్స్ పరిచయమవుతారు. వాళ్ళు త్వరలో పెద్ద డ్రగ్ డీలింగ్ చేయబోతున్నారు. ఆ డ్రగ్స్ కొట్టేసి అమ్ముకోవాలని ప్లానేస్తాడు. ఆ తర్వాత కథంతా దీనిగురించే. 

          దీనికి నైతిక ప్రాతిపదికేమిటి? అతను మొదటి నుంచే క్రిమినల్ అయివుంటే, డ్రగ్స్ దందా కోసం అమెరికా వచ్చి వుంటే, ఆ క్రిమినల్ మనస్తత్వానికి నైతిక ప్రాతిపదిక సరిపోతుంది. అది వాడి  నీతి.  దానికెలాగూ చివర్లో అనుభవించే ముగింపూ వుంటుంది. 

          కానీ మన తోపు క్రిమినల్ కాదు. సరూర్ నగర్లోనూ డబ్బుకోసం అలాటి పన్లు చేయలేదు. అమెరికా వచ్చి క్రిమినల్ ఆలోచన లెలా చేస్తాడు? చట్టం కళ్ళు గప్పి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా వుంటూ గ్రీన్ కార్డుకి నిచ్చెన లెలా వేస్తాడు? అందుకు చట్టం కళ్లుగప్పి బోగస్ పెళ్లికి ఎలా సాహసిస్తాడు? దీనికి డబ్బుకోసం డ్రగ్ దందాలోకి ఎలా దిగిపోతాడు? ఇవన్నీ చేస్తూ నానా కష్టాలు పడుతున్నాడని చెప్పి ఎలా కన్విన్స్ చేస్తారు?

          అమెరికా వెళ్ళిన వాడి కష్టాలు ఇంత ప్లానింగ్ తో, వాడి నేరస్థ మనస్తత్వంతో చూపిస్తే అవి మనం ఫీలయ్యే కష్టాలవుతాయా? అమాయకుడు అమాయకంగా కష్టాలెదుర్కొంటే వుండే  నైతిక ప్రాతిపదిక క్రిమినల్ చర్యలకి పాల్పడితే వుంటుందా? దాంతో పాత్ర మీద సానుభూతి వస్తుందా? పోనీ ఆ క్రిమినల్ చర్యలతో ఎంటర్ టైన్ చేస్తుందా? దీని తాలూకు కామెడీలు వగైరా ఎంజాయ్ చేస్తామా? ఏం మెసేజ్ ఇస్తున్నాడు యూత్ కి? అమెరికా  వెళ్లి ఇలాటి పనులు చేసి సెటిలవమనా? మొన్నే అమెరికన్ అధికారులు యూనివర్సిటీ ప్రవేశాల పేరుతో వలపన్ని వందలాది తెలుగు విద్యార్ధుల్ని పట్టుకుని హెచ్చరిక పంపారు. ఎందరో  నిపుణులు అమెరికాకి ఎంత జాగ్రత్తగా వెళ్లి, ఎలా మెలగాలో టీవీల్లో మొత్తుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కొచ్చే యూత్ దీన్నెలా తీసుకోవాలి?  దీన్ని వినోదంగా చూసి మిగతా విషయాలు మర్చిపోవాలా? సరే కానీ,  పాత్రపరంగా సినిమాటిక్ గా చూసినా,  నైతిక ప్రాతిపదికనేది యూత్ ని ఒప్పించేదిగా వుందా?

***
          నైతిక ప్రాతిపదిక రోమాన్స్ తో కూడా లేదు. సరూర్ నగర్లో ప్రేమించి దూరం చేసుకున్న  హీరోయిన్ అమెరికాలో కన్పిస్తే ఒక్క క్షణం ఆగి ఆలోచించడు. ఆమె కంటే గ్రీన్ కార్డు, బోగస్ పెళ్లి ఇవే ముఖ్యమనిపిస్తాయి. ఆ బోగస్ అమ్మాయినే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. ఇలా  ‘మోరల్ ప్రెమైజ్’ సరిగా లేని సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని ‘'The Moral Premise: Harnessing Virtue and Vice for Box Office Successఅని ఒక పుస్తకమంతా రాశాడు  పీహెచ్డీ చేసిన స్టాన్లీ విలియమ్స్.

(మరికొన్ని మరోసారి)
సికిందర్  
.





Friday, May 3, 2019

816 : బాలీవుడ్ అప్డేట్




         
ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలని ఎన్నికల సంఘం ఆపేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యా నాథ్ బయోపిక్ గా బరితెగించి తీసిన తీసిన ‘జిల్లా గోరఖ్ పూర్’ పోలీసు కేసు నమోదు కావడంతో విడుదల ఆగిపోయింది. ఇందులో సీఎం యోగీని పిస్టల్ పట్టుకున్న నేతగా యాంటీ హీరోగా చూపిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. ఇదిలా వుండగా తాజాగా ఇంకో యోగీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని పేరు నకాష్ (శిల్పి). దర్శకుడు జైఘం ఇమాం. యోగీని ప్రియతమ నేతగా చూపిస్తూ శ్లాఘించాడు. సెన్సారు వారు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. నిజానికి ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయిన దీన్ని ఇంకాలస్యం చేయకుండా విడుదల చేయవచ్చు. కానీ ప్రధాని బయోపిక్ నే ఈసీ ఆపేశాక యోగీ వెండితెర కావ్యాన్ని ఈసీ అనుమతిస్తుందన్న ఆశలేం పెట్టుకోవడం లేదు నిర్మాతలు. అందుకని వచ్చేనెల విడుదల చేస్తున్నారు. 

          ‘నకాష్’ నిజానికి యోగీ ఆదిత్యానాథ్ బయోపిక్ కాదు. ఇందులో ఒక ముఖ్య  పాత్రగా మాత్రమే ఆయన కన్పిస్తాడు. అదెలా అన్నది దర్శకుడు చెప్పడం లేదు. కానీ దీని కథ మాత్రం బయటి కొచ్చేసింది. గత సంవత్సరం సింగపూర్ దక్షిణాసియా చలన చిత్రోత్సవాల్లో అవార్డు  గెలుచుకున్న సందర్భంగా కథ తెలిసిపోయింది. దర్శకుడు జైఘం ఇమాంని  ‘ఎమర్జింగ్ ఫిలిం మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది కూడా జ్యూరీ. ‘నకాష్’ కథ సెక్యులర్ ఇండియా కథ. మరి సెక్యులర్ ఇండియా కథలో యోగీ పాత్ర  పనేమిటి? యోగీని ఇందులో ఎలా చూపించినా సంఘ్ పరివార్ మాత్రం అల్లరి చేయకుండా ప్రశాంతంగా వుంది.    కథ వచ్చేసి,  వారాణసిలో ఒక ముస్లిం శిల్పి అల్లా రఖా. ఇతను ఆలయాల్లో హిందూ విగ్రహాలని చెక్కుతూంటే ముస్లిం సమాజం వెలి వేస్తుంది. మదరసాలో అతడి పిల్లలకి ప్రవేశం దొరకదు. హిందూ సమాజం కూడా కన్నెర్ర జేస్తుంది. పోలీసులు పట్టుకుని కొడతారు. అల్లారఖా రక్షణలో ఆలయ ట్రస్టుకి చెందిన బంగారం వుంటుంది. దాన్ని అతడి స్నేహితుడు సమద్  దొంగిలిస్తాడు. ఏడాది గడుస్తుంది. అల్లా రఖాని  మతసామరస్యానికి  ప్రతీకగా కీర్తిస్తుంది మీడియా. దీంతో మున్నా అనే హిందూ నేత ఎన్నికల్లో ఓడిపోతాడు. వారణాసిలో ఇరుమతాల వారికీ హీరో అయిపోయిన అల్లా రఖా మీద మున్నాతో బాటు సమద్  కక్ష గడతాడు. నేపధ్యంలో ఏం జరిగిందన్నది మిగతా కథ. 

         ఇందులో సీఎం యోగీగా కుముద్ మిశ్రా నటించాడు. ఈ పాత్రని యోగీతో ఏంతో స్ఫూర్తి పొంది రూపొందించినట్టు  దర్శకుడు వివరించాడు. ప్రేక్షకులు ఈ పాత్రని బాగా  ఎంజాయ్ చేస్తారని కూడా అన్నాడు. సింగపూర్  చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించాక కేన్స్ చిత్రోత్సవాలకి కూడా వెళ్ళింది ‘నకాష్’. ఇందుకు గాను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఎంపిక చేసి పంపింది. 'నకాష్' నిర్మాతలుగా గోవింద్ గోయల్, పవన్ కుమార్ మిశ్రా, ఆశుతోష్ శర్మ, శ్వేతా తివారీ లున్నారు. సరే, ఇదంతా యోగీ హీరోయిజం గురించి. మరి యాంటీ హీరోయిజం గురించి? 

          ‘జిల్లా గోరఖ్ క్ పూర్’ గత సంవత్సరం ఆగస్టులో పోలీసు కేసు నమోదై విడుదల ఆగిపోయింది. బిజెపి నేతలే కేసు వేసి దీన్ని అడ్డుకున్నారు. యోగీ ఆదిత్యానాథ్ కాస్ట్యూమ్స్ లో వున్న పాత్ర చేతులు వెనుక కట్టుకుని నిలబడితే, ఆ చేతుల్లో పిస్తోలు వుండడం, ఎదురుగా  ఆలయాలూ గోవులూ వుండడం పోస్టర్ల మీద చూసి దుమారం లేపారు బిజెపి నేతలు. యోగీని గోరఖ్ పూర్ మాఫియాగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మాత వినోద్ తివారీ మీద కేసు వేసి సినిమా విడుదలని అడ్డుకున్నారు. 
 నిర్మాత తివారీ స్పందిస్తూ,  పోస్టర్లు చూసి అపార్థం చేసుకున్నారనీ, అయినప్పటికీ సమాజంలో శాంతి సామరస్యతల దృష్ట్యా ‘జిల్లా గోరఖ్ పూర్’  ని బుట్ట దాఖలు చేస్తున్నట్టు ప్రకటించాడు. 

సికిందర్

Thursday, May 2, 2019

815 : టిప్స్



(43 – 51)

        43. 2016 డిసెంబర్ 23, 24 తేదీల్లో విడుదలైన  ఒక్కడొచ్చాడు’, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’, ‘పిట్ట గోడమూడూ ఫస్టాఫ్ ని విడిచి కత్తి సాము చేసినవే. ఇంటర్వెల్ అనే చౌరస్తాలో దారి తెలీక చిక్కుకుని విలవిల్లాడినవే. దారి తెలీనప్పుడు వుండేది  గోదారే.  ఒక్కడొచ్చాడుఫస్టాఫ్ లో మొదలెట్టిన యాక్షన్ కథ వదిలేసి కామెడీ దారి పడితే, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్కథ కామెడీ పాయింటే అయినా ఇంటర్వెల్ తర్వాత పాయింటు వదిలేసి ఇంకేవో అర్ధంపర్ధం లేని కామెడీలు చేసుకుంటూ పోయారు. ఈ టైపు టీవీ లెవెల్ కామెడీలు చూసేందుకు ఇంట్లోనే చాలా ఛానెల్స్ వున్నాయి. మళ్ళీ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకి అవే టీవీ లెవెల్ కామెడీలు చూపిస్తే ఎలా? తెలుగు ప్రేక్షకులు ఇలాటి కామెడీలో రామచంద్రా అంటూ అల్లాడి పోతున్నారా? ఇక పిట్టగోడదాని రియలిస్టిక్ ధోరణిలో నడుస్తున్నది కాస్తా, సెకండాఫ్ లో పెద్ద సినిమాల ఫార్ములా కళలూ బిల్డప్పులూ అవీ పట్టుకుని ఎదగాలని తెగ ప్రాకులాడి, ఆఖరికి జానర్ మర్యాద పోగొట్టుకుని  పతనమైంది.
          44. సుప్రసిద్ధ స్పిరిచ్యువల్ గురు దీపక్ చోప్రా సినిమాల్లో మిథికల్ క్యారెక్టర్ అవశ్యత గురించి ఏంతో  బాగా చెప్పారు. బేసికల్ గా మనిషి అనేవాడు పురాణాలతో కనెక్ట్ అయివుండి,  వాటితో ఆత్మిక దాహాన్ని తీర్చుకోవాలని తహతహ లాడుతూంటాడనీ, సినిమాల్లో కొచ్చేసరికి ఆయా  పురాణ పురుషులైన రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు తదితరుల నవీన రూపాలని హీరో పోషించే పాత్రల్లో అనుభవించి సంతృప్తి  పడతాడనీ, ఇలాంటి మిథికల్ క్యారక్టర్లే అమెరికన్లకి కౌబాయ్ పాత్రలనీ వివరిస్తారు చోప్రా. అందుకే  పురాణ పాత్ర- ఆత్మిక దాహం   రెండిటితోనే జానపదాలైనా, పురాణాలైనా, నేటి హిట్ సినిమాలైనా నిలబడుతున్నాయని మనం గ్రహించాలి. మరి పురాణ పాత్ర- ఆత్మిక దాహ ఎలిమెంట్స్ దేని ఆధారంగా పరివ్యాప్త మవుతాయంటే, మన మానసిక లోకంలో కాన్షస్ సబ్ కాన్షస్ మైండ్ ఇంటర్ ప్లేల  వల్లే పరివ్యాప్త్ర మవుతాయి. స్టార్ వార్స్, జాస్, కోయీ మిల్ గయా, గుప్త్, ఒక్కడు, ఆదిత్య-369, మగధీర లాంటివెన్నో...ఇలా నిలబడ్డవే. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే,   ఇంటర్ ప్లే లో కాన్షస్ మైండ్ సబ్ కాన్షస్ మైండ్ నే మధిస్తుంది తప్ప, సబ్ కాన్షస్ మైండ్ వచ్చేసి కాన్షస్ మైండ్ ని మధించదు! ప్రకృతి మన మైండ్స్ కి ఇలాటి ఏర్పాటు చేయలేదు. మన అనుభవంలోకొచ్చే ఏ విషయాన్నీ మన మైండ్ స్వీకరించాలన్నా, లేదా తిరస్కరించాలన్నా అదంతా  ప్రకృతి సూత్రాల  ప్రకారమే జరుగుతుంది తప్ప, విరుద్ధంగా జరగదు. పురాణ పాత్రలు పాసివ్  గా వుండవు. చాలా చేతకాని సినిమాల్లోనే పాసివ్ హీరో పాత్రలుంటాయి. ఇది ప్రకృతి విరుద్ధమే. రచయితల, దర్శకుల  మైండ్ ప్రకృతి రీత్యానే యాక్టివ్ పాత్ర కోసం ప్రయత్నిస్తూంటే, ఎందుకో వాళ్ళ మతి చెడి ఇంకో రూటులో అండర్ కవర్ ఎజెంట్లలా ప్రకృతి విరుద్ధంగా ఘోరంగా ఆలోచించడం మొదలెడతారు. కాన్షస్ మైండ్ సబ్ కాన్షస్ ని  మధించడమంటే,  హీరో వచ్చేసి (కాన్షస్ మైండ్) విలన్ (సబ్ కాన్షస్) ని మధించి వధించి విజయం సాధించడమన్న మాట. అంతే గానీ సబ్ కాన్షస్ కి ప్రతీక అయిన విలన్ వచ్చేసి కాన్షస్ ఇగో అయిన హీరోని మధించడం కాదు- ఇదిమానసిక శాస్త్రానికే వ్యతిరేకం. అందుకే పాసివ్ హీరో పాత్రలు హాస్యాస్పదమైన- ఎందుకూ పనికిరాని బకరాలుగా కన్పిస్తూంటాయి.
          45.  స్క్రిప్టు రాయడమంటే గుడ్డెద్దు చేలోపడ్డట్టు కాగితాల్లో పడి పొర్లాడ్డం కాదు. చాలా  మంది చేసే పని ఇదే. ఏదేమిటో తెలీదు, ఏది ఎందుకో తెలీదు, ఎక్కడ్నించి ఏది ఎక్కడి దాకో తెలీదు... అసలు  ఏదైనా సినిమా చూస్తూ, దానికి లైన్ ఆర్డర్ వేయలేకపోతే, లైన్ ఆర్డర్ లో ఒక్కో సీనులో ఏమేం జరిగాయో నాల్గు వాక్యాల్లో రాయలేకపోతే, మొత్తం లైన్ ఆర్డర్ కి రాసుకున్న వాక్యాల ఆధారంగా కథాక్రమం తెలుసుకోవడం చేతగాకపోతే; ఒక్కో సీను దేనికోసం ఉద్దేశించారో, ఒక్కో సీను ఎలా మొదలై, ఎలా నడిచి, ఎలా ముగిసిందీ అదీ రాసుకోవడమూ రాకపోతే, ప్లాట్ పాయింట్స్ ఎక్కడెక్కడ వున్నాయో గుర్తించ లేకపోతే, ప్లాట్ పాయింట్ వన్ వరకూ కథనంలో పాత్రల పరిచయాలు, కథ జానర్, నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, చివరికి సమస్య ఏర్పాటూ ఎలా జరిగాయో పసిగట్టడం చేతగాకపోతే, టోటల్ గా కాన్సెప్ట్ ఏమిటో ఒక్క లైనులో చెప్పలేకపోతే, దేని చుట్టూ మెయిన్ పాయింటు వుందో అదీ తెలీకపోతే - ఏవో కథలల్లుకుంటూ స్క్రీప్టులు  రాస్తూ కూర్చోవడం పక్కా తెలివితక్కువతనమే. కనీసం శుక్రవారం విడుదలైన సినిమా చూసిన వాళ్ళు ప్లాట్ పాయింట్స్  ఏమిటో చెప్పలేకపోయినప్పుడు, రివ్యూ రైటర్ కి కాల్ చేసి సినిమా ఎలావుందని ఉల్టా అడగడం హాస్యాస్పదం. సినిమా ఎలావుందో రివ్యూ రైటర్ కి  తెలుసు- తమకేం తెలిసిందో అది చెప్పగలగాలి. చాలావరకూ సగటు ప్రేక్షకుల్లాగా కాలక్షేపం కోసమే అన్నట్టు సినిమాలు చూసేస్తున్నప్పుడు, సినిమా ఫీల్డు దాకా రానవసరం లేదు- మాత్రం దానికి వూళ్లోనే వుంటూ శుభ్రంగా  సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు.
          46. కమర్షియల్ సినిమా కథెప్పుడూ హీరో హీరోయిన్లదే. హీరో హీరోయిన్ కోసమో, హీరోయిన్ హీరో కోసమో చేస్తేనే కమర్షియల్ కథ. అంతేగానీ తండ్రి కోసమో, తల్లి కోసమో, చెల్లికోసమో, తమ్ముడి కోసమో, ఇంకెవరో ఫ్రెండ్ కోసమో చేస్తే బలహీన కమర్షియల్ కథ. వీటికంత యూత్ అప్పీల్ వుండదు. ఈ పాత్రల కోసం హీరో లక్ష్యం పెట్టుకుని బయల్దేరడమన్నది కాలం చెల్లిన పురాతన ఫార్ములా. అప్పటి ప్రేక్షకులు ఇప్పుడు లేరు. ఈ పాత్రలే కాదు - తాత,  నాయనమ్మ, అమ్మమ్మ లాంటి పాత్రలు కూడా కాలం కాదని కనుమరుగైపోయాయి. కుటుంబాలు ఎవరికి  వాళ్ళు జీవించే న్యూక్లియర్ కుటుంబాలై పోయాక చాలా మంది బంధువులు, బంధుత్వాలు యూత్ కి తెలియని పరిస్థితి. ఈ పాత్రలతో కథలు చేస్తే యూత్ కి కనెక్ట్ కాని పరిస్థితి. అసలీ పాత్రల ఉద్దేశం ఒకప్పుడు మనిషిలోని తొమ్మిది రకాల భావోద్వేగాల్ని సంతృప్తి పరచడం కోసమే వుండేది. స్టార్ సినిమాలతో సినిమా అంటే స్టార్ ఒక్కడే అన్న పద్ధతి వచ్చాక, మిగిలిన అన్ని పాత్రలకీ, వాటితో వుండే ప్రేక్షకుల భావోద్వేగాలకీ కత్తెర పడి, మూడే  ఎమోషన్స్ మిగిలాయి : స్టార్ కామెడీ, హీరోయిన్ తో ప్రేమ, విలన్ తో ప్రతీకారం. ఇంతలో కుటుంబాల నేపథ్యాల వల్ల యూత్ కూడా ఈ బ్రాకెట్ లో కొచ్చేశారు. అంటే ఎప్పుడో స్టార్లు మొదలెట్టింది కరెక్టే! వాళ్లు సామాజిక దార్శనికులు, కాల జ్ఞానంతో ముందే సినిమాల్ని డిసైడ్ చేయగలరు. కాబట్టి కమర్షియల్ సినిమా కథంటే హీరో హీరోయిన్లదే, మధ్యలో ఒక విలన్ గాడు.
          47. రెగ్యులర్ స్క్రీన్ ప్లేలా గా అన్పించకుండా కమర్షియల్ స్క్రీన్ ప్లే వుంటుందా? ‘బిచ్చగాడులో  హీరో - హీరో ఎదుర్కొనే సమస్య- దాంతో  సంఘర్షణ- చివరికి పరిష్కారమూ అనే రెగ్యులర్ నడకే  కన్పిస్తుంది  గానీ, సమస్య ఒక విలన్ రూపంలో  వుండదు. మరి  విలన్ లేకుండా కథెలా వుంటుంది,  రాజాధి రాజాలోలాగా అదొక గాథఅవుతుందేమో అన్పించవచ్చు. ఇక్కడ విలన్ మానవ రూపంలో లేడని మాత్రమే చెప్పడం. విలన్విధిరూపంలో వుంటుంది.  విధిహీరో తల్లిని కబళించిన కోమా.
         
అందుకే ఇది కథతో హీరో పాత్ర ఒక్కటే చేసే ప్రయాణంలా వుంది. 48 రోజులు  బిచ్చమెత్తుకుని  దీక్ష పూర్తి చేయాల్సిన  గోల్ కోసం చేసే పోరాటమే ఈ ప్రయాణం. దీక్ష పూర్తి చేయకుండా అడ్డుకునే  విలన్లెవరూ లేరు, తల్లిని కోమాలోనే చంపెయ్యాలని చూసే విలన్ కూడా ఎవడూ లేడు. అతడి దీక్షకి వివిధ రూపాల్లో అడ్డుతగులుతున్నవిధియే విలన్. ప్రయాణంలో రకరకాల పాత్రలు స్టోరీ పాయింటుతో సంబంధం లేకుండా హీరోని సమస్యల్లో ఇరికిస్తూంటాయి - అవన్నీ విధి పెట్టే  పరీక్షలే.
         
అంటే డాక్యుమెంటరీల్లో వాడే స్టార్ట్ అండ్ స్టాప్ నడక పద్ధతి అన్నమాట. ఒక సమస్య ఎత్తుకోవడం, దానికి పరిష్కారం చూపి ముగించేసి, మరింకో సమస్య ఎత్తుకోవడం...ఇలాగన్న మాట. పద్ధతిలో  ప్రధాన సమస్యంటూ వుండదు. అన్నీ విడివిడి చిన్న చిన్న సమస్యలే అయి వుంటాయి. కానీ కమర్షియల్ సినిమాలకి ఒకే ప్రధాన సమస్య వుండాలి. అలా ఒకే  ప్రధాన సమస్య లేకుండా, ఒక్కో విడి విడి సమస్యలుగా  స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటరీ పద్ధతిలో చూపినందు వల్లేసైజ్ జీరో’, ‘ఆటోనగర్ సూర్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్లాంటి కమర్షియల్స్ ఫ్లాపయ్యాయి.  ఒక్కో సమస్యని చెప్పి ముగిస్తూ వుండడమంటే చిన్న చిన్న కథలు చెప్పడమే. కానీ కథానికలతో సినిమా వర్కౌట్ కాదు. ఒకే పెద్ద కథ వుండాలి. ‘బిచ్చగాడువిషయానికొస్తే, ఇక్కడ విడి విడి సమస్యలూ కష్టాలూ ఎదురై,  అవి ఎప్పటికప్పుడు ముగిసిపోతున్నా- నేపధ్యంలో ప్రధాన సమస్య ఒకటుంటూ పెద్ద కథగా వుంది : అది విధితో పోరాడుతూ 48 రోజుల దీక్ష అనే గోల్ ని పూర్తిచేసి, కోమాలో వున్న తల్లి ని బతికించుకునే ఒకే పెద్ద కథ. కాబట్టి రెగ్యులర్ స్క్రీన్ ప్లేగా  వుండకుండానే ఇది కమర్షియల్ స్క్రీన్ ప్లే అయి హిట్టయ్యింది.
         
48. దర్శకుడు తను తీస్తున్న కథ జానర్ కి చెందుతుందో గుర్తించకపోవడం, గుర్తించినా దాని అసలు కథన రీతు లేమిటో తెలుసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు గల్లంతవుతున్నాయి. సారవంతమైన భూమిలోనే మొక్కలు బలంగా పెరుగుతాయి. సారవంతమైన స్క్రీన్ ప్లే లేనిదే బలమైన కథనం ప్రాణం పోసుకోదు. సారవంతమైన స్క్రీన్ ప్లే అంటే ప్లాట్ పాయింట్స్ తో, అంక విభజనతో, క్యారక్టర్ ఆర్క్ తో, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ తో, జానర్ మర్యాదతో  ...ఇలా అనేక మిశ్రమ ధాతువుల సంకలనం. స్క్రీన్ ప్లే ఎప్పుడూ ఇలా సేంద్రియంగానే వుంటుంది, ఫర్టిలైజర్స్ వాడితే దాని భూసారం తగ్గుతుంది. భూసారాన్నిఇచ్చేది మొదట ప్రధానంగా కథ తాలూకు జానర్  లక్షణాలు. సాధారణంగా సస్పెన్స్ తో కూడిన కథా చిత్రాలనైనా సస్పెన్స్ థ్రిల్లర్ అనెయ్యడం పరిపాటి. దోవనే పడి గుడ్డిగా కథ తయారు చేసుకోవడమూ ఆనవాయితీ. కానీ సస్పెన్స్ అనేది ఒక్క థ్రిల్లర్ జానర్  లోనే కాదు,   మిస్టరీఅనే మరో జానర్  లో కూడా వుంటుందనీ,  రెండూ వేర్వేరు జాతులనీ తెలుసుకోవడం మాత్రం జరగడం లేదు. హార్రర్లో కూడా సస్పెన్స్ వుంటుంది. దాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అనరు గానీ, మిస్టరీని మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్స్ లోనే  కలిపేసి మాట్లాడ్డం విచిత్రం.
         
సస్పెన్స్ థ్రిల్లర్ లో విలన్ ఎవరో తెలిసిపోతూంటాడు, మిస్టరీలో చివరిదాకా తెలియడు. సస్పెన్స్ థ్రిల్లర్సీన్ - టు- సీన్ సస్పెన్స్అనే  కథన ప్రక్రియతో, విలన్ తో ఓపెన్ గేమ్ గా నడుస్తుంది, మిస్టరీఎండ్ సస్పెన్స్  కథన ప్రక్రియతో విలన్ తోక్లోజ్డ్ గేమ్గా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ని  ఎండ్ సస్పెన్స్ప్రక్రియతో నడిపినా, లేదా మిస్టరీనిసీన్ -టు- సీన్ప్రక్రియతో నడిపినా రెండూ అట్టర్ ఫ్లాప్ అవుతాయి.  సస్పన్స్ థ్రిల్లర్ స్పీడుగా సాగుతుంది, మిస్టరీ నిదానంగా నడుస్తుంది. రెండిటి సస్పెన్సుకూ రెండు పార్శ్వా లుంటాయి- ఎందుకు? / ఎవరు ? - అన్నవి. నేరంఎందుకుజరిగింది? / ‘ఎవరుచేశారు?- అని. సస్పెన్స్ థ్రిల్లర్ కి రెండూ ఓపెన్ చేసి విలన్ ని పట్టుకోవడం గురించి ఎత్తుకుపై ఎత్తుల సీన్- టు- సీన్ సస్పెన్స్ గా నడపవచ్చు. మిస్టరీకి అలా కుదరదు. ఎందుకు జరిగిందో తెలియకూడదు, ఎవరు చేశారో కూడా తెలియ కూడదు. ప్రశ్నలకి సమాధానాల్ని అన్వేషిస్తూ, క్లూస్ ని పట్టుకుంటూ చిట్ట చివరికి దోషిని పట్టుకుని, నేరం ఎందుకు చేశాడో అప్పుడు తెలుసుకుంటాడు హీరో.
         
49. మిస్టరీ అన్నాక దాని ముగింపు అప్పటివరకూ సాగిన కథన తీవ్రతకి మించిన స్థాయిలో షాక్ వేల్యూతో వుండాలి. చిట్ట చివరికి బయట పడే మిస్టరీ (రహస్యం) ప్రేక్షకులకి షాకింగ్ గా వుండాలి, ఓస్ ఇంతేనా అన్పించ కూడదు. ఇందుకే మిస్టరీ ముగింపు చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. దీనికెంతో ఆలోచనా శక్తీ, సబ్జెక్టు పట్ల రీసెర్చీ అవసరం. అలాగే మిస్టరీ కథనంలో క్లూస్ ఇస్తూ అనుమానాన్ని ఇతరుల మీదికి పోనిస్తూ ( ఇలా అనుమానితులుగా చూపించడాన్ని, నేరస్థుడ్ని పట్టివ్వగల అవకాశమున్న క్లూస్ ని చూపించడాన్నీరెడ్ హెర్రింగ్స్అంటారు, చాలావరకూ వీటిని ప్రేక్షకుల్ని మిస్ లీడ్ చేస్తూ బిజీగా వుంచడానికి ప్రయోగిస్తారు) నడపాలి. ఇలా కాకుండా నడపడం, మర్డర్ మిస్టరీల రచయిత్రి ఒక్క స్వర్గీయ అగథా క్రిస్టీ కే చెల్లింది! పాఠకులకి ఆమె పట్ల వల్లమానిన అభిమానమో మరేంటో, చివరి పేజీలవరకూ ఆమె ఇచ్చే అన్ని సమాధానాల కోసం ఓపిగ్గా చదివేవారు. ఇలా రెడ్ హెర్రింగ్స్ ని కూడా దాచిపెడు ఇంకెవరైనా నవలలు రాస్తే చదవలేక విసిరికొట్టేయడం ఖాయం.
            50. డైలాగ్ వెర్షన్ అంటే 75 శాతం స్టార్ ని ఎలివేట్ చేసేది, పాతిక శాతం మిగిలిన నటీనటులకి వదిలేసేది - అన్న పద్ధతికి మారిపోయింది.   పద్ధతిలో ఎక్కువగా బలి అవుతున్నవి సినిమాకి ముఖ్యమైన విలన్ పాత్రలే . విలన్ పాత్రలు కండబలంతో హింస ప్రధానంగా చెలరేగేలా చూడడమే గానీ, వాటికోసం గుర్తుంచుకోదగ్గ ఒక్క డైలాగూ రాయడానికి ఇప్పుడు వీల్లేదు. ఒకప్పుడు విలన్ పాత్రల్లో ఎస్వీ రంగారావుకి, నాగభూషణంకి, రావుగోపాలరావుకీ రాసి పేల్చిన డైలాగుల మోత ఇప్పుడు మూగబోయింది. ఇప్పుడు స్టార్ పాత్ర ఒక్కటే  డైలాగులు పేల్చాలన్న నియమం రావడంతో, స్టార్ తో దీటుగా పోరాడే విలన్ పాత్రలు కేవలం ఎక్స్ ప్రెషన్స్ కి పరిమితమవుతున్నాయి. వాటిని కర్కశంగా, పైశాచిక లక్షణాలతో చూపించి చంపి వదిలేస్తున్నారు.
         
డైలాగ్ వెర్షన్ అంటే ఒక సమగ్ర, సంపూర్ణ విక్షణానుభవాన్నిచ్చే  సినిమా చూపించేదిగా గాకుండా, కేవలం స్టార్ ని దృష్టిలో పెట్టుకుని చేసే  పాక్షిక రచనగా, కరపత్రంగా  మారిపోయాక - రచయిత అంటే స్టార్ కి నాల్గు పంచ్  డైలాగులు రాసేవాడుగా మిగిలిపోయాడు. ఇలా కాకుండా విలన్ కూడా డైలాగులు పేల్చి చప్పట్లు కొట్టించుకోవాలంటే- విలన్  కర్తవ్యంలో  నిర్మాత పుండరీ కాక్ష్యయ్యలా, లేదాభారత్ బంద్లో  కాస్ట్యూమ్స్ కృష్ణ లా పేరున్న నిర్మాతో మరెవరో విలన్ గా రంగప్రవేశం చేయాలేమో. కనీసం విలన్ గా మారిన జగపతి బాబుతోనూ మర్యాద ప్రదర్శించుకోవడం లేదు.
         
ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే- ఎంతసేపూ ప్రేక్షకులు స్టార్ విన్యాసాలు చూస్తూ ఏకపక్షంగా స్టార్ పక్షానే వుండి  డ్రైగా సినిమాలు చూడాల్సి వస్తోంది. విలన్ కూడా స్టార్ కి దీటుగా వున్నప్పుడు ఇతడికి కూడా ప్రేక్షకులు కొమ్ము కాసే వీలుంటుంది. స్టార్ వైపు కాసేపు, విలన్ వైపు కాసేపూ కొమ్ములు కాయడమంటే సినిమా చూడడం వందశాతం లీనమైపోవడమే. గొప్ప విలన్ పాత్ర వున్నప్పుడే గొప్ప సంఘర్షణతో గొప్ప హీరో పాత్ర పుడుతుంది-   రెండిటి ధూంధాంతో కనీసం డైలాగ్ వెర్షన్ కి బాక్సాఫీసు ఫ్రెండ్లీ స్వభావం ఏర్పడుతుంది క్రియేటివిటీతో బాటు.
      51. ఆఖరికి టైటిల్స్ కూడా టెంప్లెట్ లో కొచ్చేశాయి! వెండి తెర మీద కామెడీ సినిమాల టైటిల్స్ వేయాలంటే అవే  కార్టూను బొమ్మలతో  అదే పాతబడిన పురాతన విధానం ఇంకా కొనసాగుతోంది. చిన్న పిల్లల్ని ఎంటర్ టైన్ చేస్తున్నట్టు, నటీ నటుల కార్టూన్  లేదా కేరికేచర్, ఇంకా లేదా త్రీడీ యానిమేషన్స్ తో కొంటె చేష్టలు చూపిస్తూ సరిపెట్టేస్తున్నారు. కామెడీ సినిమాల టైటిల్స్ కి కొంటె చేష్టల కార్టూను టెంప్లెట్  తప్ప మరో క్రియేటివిటీ వల్ల కాదనట్టు మొక్కుబడిగా సరిపెట్టేస్తున్నారు. కామెడీ సినిమాల టైటిల్స్ పడుతూంటే ఏదో పాత సినిమా మొదలవుతున్నట్టే వుంటోంది. కథా రచనలో అంత క్రియేటివిటీ చూపించినఅమీ తుమీకామెడీకి సైతం టైటిల్స్ ని కార్టూన్లతోనే  వేసేసి ఉస్సూరనిపించడం ఆశ్చర్య పర్చే విషయం. పాత సినిమాకి బుక్ అయిపోతున్నాంరా బాబూ అన్పించేట్టు టెంప్లెట్ టైటిల్స్ వేసేశారు. మైకేల్ డాబ్స్ రాసిన ఒక నవల వుంది- అందులో కథకి సంబంధించే వివిధ పాత్రలకి జరిగే వివిధ గమ్మత్తయిన సంఘటలతో నవల ప్రారంభం కావడం ఒక గొప్ప ఓపెనింగ్ టీజర్. ఇలాటి ఇన్స్ పైరింగ్ అయిడియాలు వెతికితే దొరుకుతాయి. ఓపెనింగ్ టీజర్ల కాలంలో ఇంకా కార్టూను టెంప్లెట్ టైటిల్సే  వేసుకోవడమేమిటో అర్ధంగాని విషయం.

(మరికొన్ని మరోసారి)
సికిందర్