రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 30, 2019

812 :టిప్స్




           
(31 – 42)

          31. సినిమాలో ఒక హీరోని చూపిస్తున్నామంటే ఆ కథ అతడిదే అవాలి. మధ్యలో అతణ్ణి పక్కన బెట్టి సహాయ పాత్ర కథగా చెప్పడానికి ఆ సహాయ పాత్రకి ఎంత ఫ్లాష్ బ్యాక్ పెట్టి సమర్ధించాలనుకున్నా బెడిసి కొడుతుంది. ప్రాథమిక జ్ఞానం కూడా లేకుండా ఇలా సినిమాలెలా తీస్తారో చూసి తెలుసుకోవాల్సిందే.  రాస్తున్న ఓ కథ హీరోదా లేక  హీరోయిన్ దా తెలియకపోతే ఆ తీసిన సినిమాని విడుదల చేసుకోవడానికి కాళ్ళరిగేలా తిరగాల్సిందే.
          32. సంఘర్షణకి దారితీసే కారణం బలంగా లేకపోతే  యాక్షన్ కథ సిల్లీగా మారిపోతుంది. పెన్సిలు కోసం పోట్లాడుకునే చిన్నపిల్లల కథలా వుంటుంది. యాక్షన్ కథ వేరు- యాక్షన్ కామెడీ కథ వేరు. రాస్తున్నది యాక్షన్ కామెడీ అయినప్పుడు యాక్షన్ డైనమిక్స్ కి పాల్పడితే అభాసుపాలవుతారు. యాక్షన్ కామెడీలో సంఘర్షణకి దారి తీసే కారణం స్వల్పంగానే ఉండొచ్చు. దానికి విలన్ వైపు నుంచి  రియాక్షన్ మొదట యాక్షన్ విలన్ కి లాగా హీరోని చంపెయ్యడంగానే వుండొచ్చు. కానీ పోనుపోనూ కొత్త కారణాలు పుట్టుకొస్తూ విలన్ లక్ష్యం కూడా మారిపోతూ వుండాల్సిందే.
          33. విజువల్ రైటింగ్ ని సాధించాలంటే పాసివ్ రైటింగ్ మానుకోవాలి. సర్వ సాధారణంగా  డైలాగ్ వెర్షన్ లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్టులో ఇలా రాసేస్తూంటారు - వెళ్ళాడు, కూర్చున్నాడు, తీసుకున్నాడు, ఇచ్చాడు... లాంటి క్రియాపదాల్ని ఉపయోగిస్తూంటారు. ఇవి పాసివ్ పదాలు. అంటే పాసివ్ రైటింగ్. వీటికి బదులు - గబగబా వెళ్ళాడు, కూలబడ్డాడు, లాక్కున్నాడు, విసిరేశాడు - అని రాస్తే యాక్టివ్ పదాలు, అంటే విజువల్ యాక్షన్ తో కూడుకున్న యాక్టివ్ రైటింగ్. యాక్టివ్ రైటింగ్ అంటే విజువల్ రైటింగే. అంటే రాసే ప్రతి చర్యలోనూ  విషయముండాలి. వెళ్ళాడు- అనడంలో విషయం లేదు, గబగబా వెళ్ళాడు -అనడంలో విషయం కన్పిస్తోంది. మొదటి ఉదారహణలో సీన్లు ఎంత డల్ వుంటాయో, రెండో ఉదాహరణలో ఎంత స్పీడుగా వుంటాయో గమనించవచ్చు. ఇలా అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. శోభనం గదిలోకి పాలగ్లాసు పట్టుకుని నిదానంగానే వస్తున్నట్టు  చూపించాలి పెళ్ళికూతుర్ని. అయినా తలుపు సందులో ఆమె చీర ఇరుక్కున్నట్టు రాస్తే,  దాని తదుపరి చర్యలతో సహా సీను విజువల్ రైటింగ్ గా మారిపోతుంది. ఆల్ ది బెస్ట్!
          34. సినిమా తీయడమే కాదు, స్క్రీన్ ప్లే రాయడం కూడా విజువల్ కసరత్తే. టీవీల్లో, పత్రికల్లో చూస్తే  ఎన్నెన్ని పెద్ద పెద్ద ఐడియాల్ని ఒక్క క్షణకాలపు విజువల్స్ లో చూపిస్తారు! పేజీల కొద్దీ  డైలాలగులు రాసేకన్నా తెలివైన పని ఇది. హీరో ఉద్యోగం పోగొట్టుకున్నాడని పదిమాటల్లో డైలాగుగా చెప్పేకన్నా,  ఒక్క విజువల్ తో ఒక్క క్షణంలో చూపించెయ్యొచ్చు. హీరో ఆఫీసు కెళ్ళేసరికి, అతడి పర్సనల్ సరంజామా డస్ట్ బిన్ లో పడుందని చూపిస్తే బలంగా వుంటుంది ఉద్యోగం వూడిందన్న విషయం. సినిమా అంటే చూపించడం, చెప్పడం కాదు. అందుకే విజువల్ రైటింగ్ అవసరం.
          35.  క్యారక్టర్ గోల్ అంటే కథ మొత్తానికీ  కలిపి ఒకే గోల్ మాత్రమే వుండడం కాదు- సీను సీనుకీ అవసరమైన చోటల్లా గోల్స్ వుంటేనే కథ బోరు కొట్టకుండా వుంటుంది. స్టోరీ గోల్ ని సాధించే మార్గంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఈ ఆటంకాలు ఆయా సీన్లలో వుంటాయి. వాటిని అధిగమించడం కూడా ఒక గోల్ అవుతుంది. అధిగమించకపోతే ఆ సీను బోరు కొడుతుంది. అలాటి సీన్లు ఎన్ని వుంటే కథ అంత బోరు కొడుతుంది..
          36. ఒక జీవిత చరిత్ర ఏ రస ప్రధానమో ఆ రస ప్రధానంగా సినిమా చేయకపోతే ఒక అటెన్ బరో  గాంధీవుండదు, ఒక కృష్ణ  అల్లూరి సీతారామరాజు  వుండదు. ఆ జీవిత చరిత్రకి అన్యాయం చేస్తూ  రుద్రమదేవిఅనే కమర్షియల్  కథమాత్రమే వస్తుంది- ‘గాథరాదు. వీరవనిత చరిత్ర వుండదు, తోచిన శృంగార దేవత చిత్రణ లుంటాయి. దీన్ని ఒక్కడుకి మించిన కమర్షియల్ అని కూడా దర్శకుడు అనడం చరిత్రపట్ల తనకున్న నిబద్ధతని పట్టిస్తుంది.
          37. సినిమా స్క్రీన్  ప్లేలు బాగా అర్ధమవ్వాలంటే స్క్రీన్ ప్లేలు చదవాలి. తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేలు దొరకవు. హాలీవుడ్ సినిమాల స్క్రీన్ ప్లేల్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటిని పరిశీలనాత్మకంగా చదవడం ఒక ఎడ్యుకేషన్ రైటర్లకి. కొందరు కొత్త దర్శకులు హాలీవుడ్ సినిమాలు చూస్తూ సీనిక్ ఆర్డర్ వేసుకుని స్టడీ చేస్తున్నారు. దానికంటే కూడా స్ట్రక్చర్ బాగా అర్ధమవ్వాలంటే  స్క్రీన్ ప్లేలు చదవడమే మంచిది. మరి కొందరు హాలీవుడ్ సినిమాలు వేసుకుని చూస్తూ ఏ షాట్  ఎంత లెన్త్ వున్నదీ కౌంట్ రాసుకుంటున్నారు. తీసేటప్పుడు వుండే షాట్స్ లెన్తులు ఎడిటింగ్ లో వుండవు. కాబట్టి ఎడిటింగ్ అయిన షాట్స్ లెన్త్స్ ని పట్టుకుని మనం కూడా ఇన్ని మిల్లీ మీటర్లే  తీయాలనుకోవడం పొరపాటు. పోతే, మరికొంత మంది  ఆయా సినిమాల సెన్సార్ స్క్రిప్టులు సంపాదించుకుని స్టడీ  చేస్తున్నారు. సెన్సార్ స్క్రిప్టుల్లో  షాట్స్ లెన్తులు, డైలాగులూ తప్ప మరేమీ వుండదు. హాలీవుడ్ స్క్రీన్ ప్లేలు చదవడ మొక్కటే సరైన మార్గం.
          38. అన్ని సినిమాలు అందరి కోసమూ తీయలేరు. అన్ని సినిమాల్ని అందరూ చూడరు. భారీ బడ్జెట్లతో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్లు అంటూ తీసున్న సినిమాలనే ఫ్యామిలీలన్నీ కదిలి వచ్చి చూడ్డం లేదు. ఒకే సారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసుకుంటే గానీ వాటికి మనుగడ లేదు. యూత్ సినిమాల పేర తీసే ప్రేమ సినిమాలని ఫ్యామిలీలు కాదుకదా, మాస్ కూడా పూర్తిగా చూడ్డం లేదు. అలాగని యూత్ కూడా అందరూ చూడ్డం  లేదు. హారర్ సినిమాలకైతే ఏ  ప్రేక్షకులుంటారో ఎవరికీ తెలీదు. అయినా ఈ సినిమాల్ని పట్టుకుని ఇది ఫ్యామిలీలకి ఎక్కదు, బి, సి సెంటర్లలో ఆడదు అంటూ ప్రొఫైలింగ్ చేయడం లేదెవరూ. వీటన్నిటినీ క్రాస్ చేసే ఒక విభిన్న కథా చిత్రం వస్తే మాత్రం- చాలా వెంటనే ప్రొఫైలింగ్  చేసేస్తారు. మిగతా ప్రపంచమంతా బ్రహ్మరధం పట్టనీ గాక, స్థానికంగా మాత్రం సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. ఇది బి, సి సెంటర్లలో ఆడదు, ఫ్యామిలీలు రారు, ఇందులో అది లేదు, ఇది లేదు అంటూ తీర్పు లిచ్చేస్తూంటారు. విషయమేమిటంటే, ఈ తీర్పులిచ్చే వాళ్లకి అసలు క్వాలిటీ సినిమా అంటే ఏమిటో అలవాటు తప్పిపోయింది. సగటు ప్రేక్షకుల్లాగా మెదళ్ళని ఇళ్ళ దగ్గర వదిలేసి థియేటర్లలో అమాంబాపతు సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఇవే తెలుగు సినిమాలని డిసైడ్ అయిపోయారు. వీళ్ళకి భిన్నంగా నెట్ ప్రపంచం, షోషల్ మీడియా లోకం ఇలాటి సినిమాలు ఒక్కదానికీ భిన్నాభిప్రాయం లేకుండా బ్రహ్మరధం పడుతూంటాయి.  కాబట్టి ఈ  తీర్పులకి వెరవకుండా- అనుకున్న పంథా లో సాగిపోవడమే అసలైన స్క్రీన్ రైటర్ల కర్తవ్యం. మార్పు తెచ్చే వాళ్లెప్పుడూ వొంటరి వాళ్ళు అనేది పాత మాట. 
          39. స్ట్రక్చర్ అంటే బోరు కొడుతున్నప్పుడు స్ట్రక్చర్ ని ఎగేసే పాత్రల్ని సృష్టించి స్ట్రక్చర్ రహిత స్క్రీన్ ప్లేని రాయవచ్చు. అయితే ఆ పాత్రని పోషించే నటుడికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుండాలి- ‘భలే భలే మగాడివోయ్లో నాని లాగా. ఆ క్రేజీ నటుడు పది నిమిషాల కోసారి కథలో బ్యాంగ్ కూడా ఇస్తూపోవాలి. ఇక స్ట్రక్చర్ ప్రసక్తే వుండదు. స్ట్రక్చర్ అంటే మూడంకాల ( త్రీ యాక్ట్స్) స్ట్రక్చరే  కాబట్టి, దీన్ని రెండంకాలకి కుదించి కూడా రాసుకోవచ్చు. ‘ సైకోలో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  చేసిన పని ఇదే. హీరోయిన్ కథగా నడుస్తున్నది కాస్తా, చరిత్రలో నిల్చిపోయిన బాత్రూం మర్డర్ సీనులో ఆ హీరోయిన్ ని విలన్ చంపెయ్యడంతో విలన్ కథగా మారిపోతుంది. అంటే ఒకే సినిమాలో ఇద్దరి పాయింటాఫ్ వ్యూల్లో ఇద్దరి కథ. ఇక్కడ కూడా ఆ ఇద్దరూ పాపులర్ నటులే కాబట్టి వర్కౌట్ అయ్యింది. నయనతార ని ఆ హీరోయిన్ స్థానంలో, నాగార్జునని ఆ విలన్ స్థానంలో సినిమాని ఊహిస్తే ఎలా వుంటుందో ఆలోచించడి..నాగార్జున నయనతారని చంపాడూ- నాగార్జున నయనతారని చంపాడూ అని  ఒకటే పబ్లిసిటీ అయిపోతుంది! ఇలాగే వుంటాయి సినిమా ట్రేడ్ గిమ్మిక్కులు. కేవలం కథలతోనే కుస్తీ పట్టక్కర్లేదు.
          40. కథల్లో  కాన్ఫ్లిక్ట్ (సమస్య) పుట్టే ఘట్టం వుంటుంది. అది ప్లాట్ పాయింట్ వన్ అనుకుందాం. కాన్ఫ్లిక్ట్  జడంగా వుండి పోయి, దాన్నాథారంగానే సంఘర్షణ జరుగుతూండడం పరిపాటి. హీరో హీరోయిన్లకి జాతకాలు కలవడం లేదని పెళ్ళికి హీరో తండ్రి ఒప్పుకోలేదనుకుందాం.  ఇదే  కలవని జాతకాలు అనే పాయింటు తో కాన్ఫ్లిక్ట్ ని పుట్టించి కథ నడిపిస్తే,  కాన్ఫ్లిక్ట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. కాన్ఫ్లిక్ట్ జడంగా వుండిపోయి కాసేపటికి సంఘర్షణ బోరు కొట్టేస్తుంది. జాతకాలు కలవడం లేదని కాక,  అసలెందుకు  కలవడం లేదో,  దాని పరిణామా లేమిటో ఫన్నీగా  సృష్టిస్తే,  అప్పుడా కాన్ఫ్లిక్ట్ జడత్వాన్ని వదిలించుకుని  వర్కింగ్ కాన్ఫ్లిక్ట్  గా మారిపోతుంది. ఫన్నీ పాయింటేదో  హీరోకే  అవమానకరంగా వుంటే,  దాన్ని తుడిచేసే సంఘర్షణతో అతను నానా పాట్లు పడతాడు. మూలంలో జాతకాలూ అనే కాన్ఫ్లిక్ట్ వుంటుంది, కానీ సంఘర్షణలో దాని పరిణామాలతో వర్కింగ్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ కి వర్కింగ్ కాన్ఫ్లిక్ట్  తోడయినప్పుడే సంఘర్షణ కొత్త పుంతలు తొక్కుతుందని అర్ధం జేసుకోవాలి.
          41. ప్రధాన పాత్ర పట్ల ఎంత దయ చూపిస్తే అవి అంత బోరు కొడతాయి, ప్రధాన పాత్రతో నిర్ధాక్షిణ్యంగా వుంటే అది  కత్తిలా వుంటుంది. ఎంత నిర్ధాక్షిణ్యానికి అంత పదునైన కత్తి. ప్రధాన పాత్ర ఫీలవుతున్న దాన్ని దాన్నుంచి గుంజెయ్యాలి. దానికోసం వెంపర్లాడేట్టు చెయ్యాలి. దాని కోసం పోరాడేట్టు, దాని కోసం ప్రాణాల్నే పణంగా పెట్టేట్టు సంక్షోభం సృష్టించాలి. సంక్షోభం యాక్షన్ కి  దారితీస్తుంది. సంక్షోభం అంటే ఫీలింగ్స్ మధ్య సంఘర్షణే (యాక్షన్). ఫీలింగ్స్ లేకపోతే సంక్షోభం లేదు, దీని పర్యవసానమైన సంఘర్షణా లేదు. యాక్షన్ (సంఘర్షణ) కి మూలం ఫీలింగ్సే. భావజాలాల తేడాలు లేకపోతే బాహాబాహీల్లేవు. ప్రధాన పాత్ర పట్ల దయతో వుంటే బాహాబాహీలేదు. బాహాబాహీ లేకపోతే బలమైన సినిమా లేదు. నిర్ధాక్షిణ్య పాత్ర చిత్రణే నిజమైన బలం బాహాబాహీకి.
          42. 2016 లో వరుసగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో విడుదలైన నాలుగు సినిమాలనీ  ఒకే తరహా విచిత్ర కథనాలతో పెళ్లి కూతుర్లులా ముస్తాబు చేశారు (పెళ్లి కూతుళ్ళు విచిత్రంగా ముస్తాబవుతారని కాదు). మూడు సినిమాల్లో కథనాల్ని ఫ్లాష్ బ్యాక్ లో పెట్టుకుంటే, నాల్గో చలనచిత్రంలో క్లయిమాక్స్ కి కేటాయించుకున్నారు.  నందినీ నర్సింగ్ హోంలో హీరోయిన్ కోసం హీరో ఒకచోట ఎదురు చూస్తూంటాడు. హీరోయిన్ అతడికో కొత్త బైక్ కొనుక్కుని  నడుపుకుంటూ వస్తూ యాక్సి డెంట్ అయి చచ్చిపోతుంది. కావాలనే ఆమె రావడంలేదని హీరో అపార్ధం చేసుకుని వేరే జీవితంలోకి వెళ్ళిపోతాడు. ‘ఎక్కడికిపోతావు చిన్న వాడాలో హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నానని తండ్రికి చెప్పి బయల్దేరుతుంది ( కాసిని టీ నీళ్ళేవో తాగి వస్తుందిలే  అన్నట్టు తండ్రి ఓకే అనేస్తాడు). రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర హీరో ఎదురు చూస్తూంటాడు. ఆమె టూ వీలర్ మీద వస్తూ వస్తూ ఠకీల్మని యాక్సిడెంట్  అయి చచ్చిపోతుంది. ఇది తెలియని హీరో వేరే ఏదో అపార్ధం చేసుకుని వేరే జీవితంలోకి వెళ్ళిపోతాడు. ‘ఇంట్లో దెయ్యం - నాకేం భయంలో కూడా హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నానని అమ్మకి చెప్పి బయల్దేరుతుంది (నాల్గు ఇడ్లీలేవో  కతికి వస్తుందిలే అన్నట్టు  అమ్మ రైటో అనేస్తుంది). రిజిస్ట్రార్  ఆఫీసు దగ్గర హీరో ఎదురు చూస్తూంటాడు. టూ వీలర్ మీద వస్తున్న ఆమె ఇంకేదో గొడవలో ఇరుక్కుని హరీమంటుంది. ఇది తెలియని  హీరో అర్జెంటుగా అపార్ధం చేసుకుని వేరే జీవితంలోకి వెళ్ళిపోతాడు. ఇలా ప్రతీ హీరో కన్వీనియెంట్ గా జంప్ అవడమే! యాక్సిడెంట్ అయినట్టు తెలియదా? టీవీలో రాదా? పేపర్లో రాదా? తండ్రో, తల్లో ఫోనే చెయ్యరా? పైన చెప్పుకున్న మూడో కేసులో హీరోయిన్ తన మరదలే! మరదలు చచ్చిపోయినట్టు కూడా తెలీదా? ఈ మూడూ ఇలా వుండగా, ఇక నాల్గో మూవీలో పాత్ర రివర్స్ అవుతుంది – ఇక్కడ హీరోయినే జంప్ అవుతుంది- ‘అప్పట్లో ఒకడుండే వాడుక్లయిమాక్స్ లో భర్తకోసం హీరోయిన్ రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తూంటుంది. ఇంతలో భర్త ఎన్ కౌంటర్ అయినట్టు టీవీలో వస్తుంది. అది చూసి చాలా బాధపడిపోయి, ఏడ్చేసి రైలెక్కి వెళ్లి పోతుంది! ఇలా పాత్రలు కన్వీనియెంట్ గా జంప్ అవకపోతే అనుకున్న కథనం  చేయలేమని దర్శకుల ఉద్దేశం. పాత్ర కిల్ అయినా సరే, కథనం హాస్యాస్పదంగా అన్పించినా సరే, అదెవరి దృష్టికీ పోదని అంత నమ్మకం. నిజమే, ఒకప్పుడుపంతులమ్మ’, ‘కోరికలే గుర్రాలైతేలాంటి సినిమాలు చూసి ఇద్దరు వ్యాపారస్తులు షాపులో కూర్చుని హీరోయిన్ల పాత్రల గురించి చర్చించుకునే వాళ్ళు. వ్యాపారులకే ఇంత అభిరుచి వుంటే, ఇతరుల సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పుడెవరూ సినిమాలు చూసి చర్చించుకుంటున్న దృశ్యాలు కనపడవు.  అసలు సినిమాల్ని దృష్టితో చూస్తే కదా? ఇదే  ఇలాటి కథనాల పాలిట అదృష్టంగా మారింది!
(మరికొన్ని మరోసారి)
సికిందర్