రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 28, 2015

ఏదో చెప్పాలని!



దర్శకత్వం  : ప్రకాష్ కోవెలమూడి

తారాగణం  :  అనుష్క , సోనాల్ చౌహాన్, ఆర్య , ప్రకాష్ రాజ్, ఊర్వశి, బ్రహ్మానందం, అలీ, గొల్లపూడి తదితరులు , రచన : కనికా కోవెలమూడి, సంగీతం :  ఎమ్.ఎమ్.కీరవాణి, ఛాయాగ్రహణం : నీరవ్ షా, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ : ఆనంద్ సాయి
బ్యానర్ : పివిపి సినిమా, నిర్మాత  : ప్రసాద్ వి పొట్లురి
విడుదల  : నవంబర్
27, 2015

***

            బాహుబలి, రుద్రమ దేవిల సక్సెస్ తో మంచి ఊపు మీదున్న అనూష్కా ‘సైజ్ జీరో’ అంటూ మరో భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత్రకోసం
ఇరవై కేజీలు బరువు పెరిగి సాహసం చేసింది. దర్శకుడు కే రాఘవేంద్ర రావు కుమారుడు, ‘అనగనగా ఒక ధీరుడు’ ఫేమ్  దర్శకుడు  ప్రకాష్ రావ్,  రెండో ప్రయత్నంగా ఒక
నావెల్టీ వున్న అయిడియాతో తిరిగి ప్రేక్షకుల ముందు కొచ్చారు. ఒక బరువు పెరిగిన హీరోయిన్ పాత్రతో దర్శకుడుగా ప్రకాష్ తన వెయిట్ ని కూడా అదే రేంజిలో ఏమైనా పెంచుకున్నారా లేదా తెలుసుకోవాలంటే విషయంలోకి వెళ్ళాల్సిందే



కథేమిటి?
       ధికబరువుగల పెళ్ళికాని అమ్మాయి సౌందర్య (అనూష్కా) ని చిన్నప్పటి నుంచే తండ్రి ( రావు రమేష్) ముద్దుగా పెంచుకుంటాడు. బరువు చూసుకునే మిషన్ మీద ఈమె బరువుకన్నా, ఆ కార్డు మీద వుండే అదృష్టాన్ని చూసుకోవడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంది తండ్రి నేర్పిన అలవాటు పుణ్యామా అని. చిన్నప్పుడే తండ్రి చనిపోయి, తాత(  గొల్లపూడి), తల్లి ( ఊర్వశి) ల పెంపకంలో అంతే అల్లారు ముద్దుగా పెరుగుతుంది. తల్లి డబ్బావేర్ అనే ప్లాస్టిక్ కంటెయినర్స్ ఏజెన్సీ నిర్వహిస్తూంటుంది. ఒక తమ్ముడు యాహూ ( భరత్) అనే వాడుంటాడు. సౌందర్య బాగా తిండి పోతు కావడంతో తాత అందించే జిలేబీలూ లడ్డూలూ అడ్డం గా లాగించేస్తూ మరింత లావెక్కిపోతుంది. తనెలా వుందో అలాగే హేపీగా వుంటుంది తప్ప,  ఎవరి కోసమో లావు తగ్గే మాటే లేదని డిక్లేర్ చేసుకుని బతికేస్తూంటుంది. పెద్దయ్యాక బట్టలు తొడగాలంటే ఆమెతో మరో ఇద్దరూ కలిసి కుస్తీ పట్టాల్సిందే.  అంత  లావెక్కి పోయి ఉంటుందన్న మాట. ఒక చైనీస్ రెస్టారెంట్ లో పని చేస్తూంటుంది. అక్కడ జ్యోతి అనే ఇంకో అమ్మాయి పని చేస్తూంటుంది. ఈమె తను స్లిమ్ గా తయారై మిస్ ఇండియా పోటీల్లో  పాల్గొనాలని ఆ తయారీలో వుంటుంది. ఇటు ఇంటి దగ్గర సౌందర్యకి ఎన్ని సంబంధాలు వచ్చినా లావు కారణంగా వెనక్కి వెళ్లి పోతూంటాయి. ఎన్నారైకిచ్చి గొప్పగా పెళ్లి చేయాలన్న ఆశలు తల్లికి నెరవేరక విసిగి పోతుంది. అలాటిది అభి ( ఆర్య) అనేవాడితో ఇంకో సంబంధం  వస్తుంది. చూడగానే తిరస్కరిస్తాడతను. ప్రతీసారీ మీ అబ్బాయిలేనా, ఈసారి నేను  రిజెక్ట్ చేస్తానని అంతరి ముందూ అభిని తనే తిప్పి కొట్టేస్తుంది  సౌందర్య. 

        అభి ఒక డాక్యుమెంటరీలు తీసే డైరెక్టర్. క్లీన్ ఇండియా అనే నినాదంతో  దేశంలో టాయిలెట్ల పరిస్థితి మీద డాక్యుమెంటరీలు తీస్తూంటాడు. అలా తిరిగి ఓ పెళ్ళిలో ఇద్దరూ కలుసుకుంటారు. ఫ్రెండ్స్ గా  ఉందామని నిర్ణయించుకుంటారు. ఇంతలో లండన్ నుంచి సిమ్రాన్ ( సోనాల్ చౌహాన్)  అనే సెక్సీ సోషల్ వర్కర్ వచ్చి అభి తో జాయిన్ అవడంతో సౌందర్యకి  జెలసీ పుడుతుంది.

        ఇక ఇంటిదగ్గర తల్లితో సౌందర్యకి ఒత్తిడి పెరిగిపోతుంది. పెళ్లి కుదరాలంటే బరువు తగ్గక్క తప్పదని తల్లి తేల్చి చెప్పేస్తుంది. సౌందర్య కుమిలిపోతుంది. బరువు తగ్గడానికి సత్యానంద్ ( ప్రకాష్ రాజ్) నడిపే  సైజ్ జీరో ఎక్స్ ప్రెస్ వెయిట్ రిడక్షన్ క్లినిక్ లో చేరుతుంది. అక్కడున్న ఫ్రెండ్ జ్యోతికి ఆ ట్రీట్ మెంట్ వికటించి కిడ్నీలు పాడవుతాయి. దీనికి సౌందర్య రియాక్ట్  అయి క్లినిక్ మీద తిరుగుబాటు ఉద్యమం చేపడుతుంది- లావు తగ్గిస్తామని ఇలాటి క్లినిక్కులు చేస్తున్న మోసాల్ని బయటపెట్టడం ఉద్దేశంగా, మరో వైపు జ్యోతి చికిత్సకి ఫండ్ రైజ్ చేసే కార్యక్రమంగా ఉద్యమిస్తుంది..

ఎలావుంది కథ
   ఇంకా మూస కథలు వెల్లువెత్తుతున్న కాలంలో  ఒక నావెల్టీ వున్న ఐడియాని ప్రయత్నించారనుకుంటే ఇదీ తప్పులో కాలేసింది. ఐడియా దగ్గరే అడ్డం తిరిగి పడింది. మార్కెట్ లో దుస్తుల సైజులో అతి చిన్న సైజు డ్రెస్ కి అమెరికాలో ప్రాచుర్యంలో కొచ్చిన కొత్త పదం ‘సైజ్ జీరో’. ఈ ‘సైజ్ జీరో’ బ్రిటన్ లోని సైజ్ 4 తో సమానం. యువతులకైతే సరీగ్గా 31- 23- 32 గా కొలతలు వుంటాయి. మోడలింగ్ రంగంలో ఈ స్లిమ్ నెస్ ని డిమాండ్ చేస్తారు. మితిమీరి సన్నబడే  ఈ సైజ్ జీరో ఫిగర్ క్రేజ్ ప్రమాదకరం గా పరిణమించి, ఒక మోడల్ కూడా  మరణించడంతో, కొన్ని దేశాల్లోని ఫ్యాషన్ షోల్లో అలాటి సైజ్ జీరో మోడల్స్ ని నిషేధించారు. ఈ సైజ్ జీరో ఫిగర్ కోసం సన్నబడే ప్రోగ్రామ్స్ ని వైద్య నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని. తర్వాత ప్రెగ్నెన్సీలో తీవ్ర పరిణామాలుంటాయనీ  హెచ్చరిస్తున్నారు. 


        ఇదీ పాయింటు సైజ్ జీరో గురించి. ఆరోగ్యానికీ, వీలయితే ప్రాణాలకీ ముప్పు తెచ్చే అవకాశమున్న ఈ ప్రమాకర సైజ్ జీరో మోజుని  తెలిసో తెలీకో గ్లామరైజ్ చేస్తూ, ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించే కథ తయారు చేశారు దీనిమీద. సైజ్ జీరో  అనే పదం టైటిల్ కి స్టయిలిష్ గా, ట్రెండీ గా వుందనిపించిందేమో, ఇక దాన్ని  పెట్టేసుకుని అర్ధంపర్ధం లేని కథ అల్లేసుకున్నారు. చెప్పాల్సింది ఒకటైతే, ఇంకేవేవో చెప్పుకుపోయారు...ఒక్క మాటలో ప్రేక్షకులకి మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిస్ ఫైర్ అయిన కథ ఇది! ఆడియెన్స్ కనెక్ట్ కి ఆమడ దూరంలో ఉండిపోయిన అబ్నార్మల్ సృష్టి!


ఎవరెలా చేశారు 
       అధికబరువున్న అమ్మాయి పాత్ర కోసం అనూష్కా రిస్కు చేసి బాగా లావెక్కినప్పటికీ  గ్లామరస్ గానే కన్పిస్తుంది. దాదాపు అన్ని సీన్లలో కన్పించే ఈమె వల్ల సినిమాకి ఒక లుక్ అయితే వచ్చింది,  కానీ యూత్ అప్పీల్ కి ఎంతో అవసరమున్న రోమాంటిక్ ప్లేకి - అదీ సెకండాఫ్ లో అయితే ఏమాత్రం చోటివ్వని పాత్ర చిత్రణ కావడంతో, ప్రేక్షకులు నిరుత్సాహ పడే అవకాశం ఎక్కువై పోయింది. పాత్రచిత్రణ అభాసుపాలైనా, నటనలోమాత్రం  ఏ లోటూ రానివ్వకుండా బాగా కష్టపడింది. కానీ ఆ కష్టమంతా పాత్రలో విషయం లేకపోవడం వల్ల, ఉన్న విషయం అయోమయంగా వుండడం వల్లా   వృధాపోయింది. ఒకటి జరగాల్సింది : ఈ కథ చెప్పిన దర్శకుడికి అనూష్కా ఒకేఒక్క  ప్రశ్న వేసి వుంటే అన్నీ చక్కబడేవి - ‘ఇంత చెప్పారు, ఇంతకీ ఈ కథలో నా పాత్ర అసలేం  కోరుకుంటోందో  కాస్త చెప్పగలరా?’ అన్న బేసిక్ క్వశ్చన్! 

        పాత్రల మీద, పాత్రచిత్రణల మీదా అవగాహన లేకుండా స్టార్లు సినిమాల్ని ఒప్పేసుకుంటున్నంత కాలం  ఇలాగే వుంటాయి ఫలితాలు. 
      
        ఇక తమిళ స్టార్ ఆర్య చేయడానికి ఏమీ లేదు ఇందులో.  సెకండాఫ్ కూడా సగం గడిచేవరకూ అనూష్కాతో అతడికి రోమాన్సే  లేకపోవడం తో పాత్రకి పెద్దగా పనిలేకుండా పోయింది. కథకి ఉపయోగపడని తన డాక్యుమెంటరీ ట్రాకుతో సబ్ ప్లాట్ లో ఉండిపోవాల్సి వచ్చింది. సెకండాఫ్ లో అనూష్కా ఉద్యమం చేపట్టినప్పుడు, ఆ డాక్యుమెంటరీ కూడా వదిలేసి ఆమెకోసం వీడియోలు తీయడంలో పడిపోతాడు. 

        ఇతర పాత్రల్లో కాస్త  ఆకట్టుకునేది ఒకప్పటి తమిళ హీరోయిన్ ఊర్వశి మాత్రమే.  కూతురి పెళ్ళికోసం స్ట్రగుల్ చేసే తల్లి పాత్రలో, అదీ తమిళ అయ్యర్ కుటుంబం నుంచి వచ్చిన స్త్రీగా సినిమాకి ఒక కొత్త ఫ్లేవర్ ని  తీసుకొచ్చింది. ఇక ప్రకాష్ రాజ్ అయితే మహాకవుల సూక్తులు వల్లిస్తూ విలనీ పండించడానికి విఫలయత్నం చేశాడు. అలీ, పోసానిలు నామ్  కే వాస్తే వున్నారు.

       
కీరవాణి సంగీతంలోని పాటలు క్యాచీగా ఏం లేవుగానీ,  చివరి పాట  పిక్చరైజేషన్ వల్ల హైలైట్ అయ్యింది. నీరవ్ షా ఛాయాగ్రహణం, ఆనంద్ సాయి కళా దర్శకత్వం సినిమాకి వన్నె తెచ్చాయని చెప్పుకోవచ్చు.

        ఇక ప్రకాష్ దర్శకత్వం గురించి చెప్పుకోవాలంటే చాలా బలహీనం. అపజయం పాలయిన మొదటి సినిమా అనుభవం నుంచి నేర్చుకున్నదేమీ లేనట్టే కన్పిస్తోంది. ఆయన బలహీనత బలహీన స్క్రిప్టులే! స్క్రిప్టుకి ఏమేం వుంటే బలంగా వుంటుందో బేసిక్స్ కూడా తెలీనట్టు కన్పించడం ఆయన ప్రత్యేకతేమో! ఆల్ ది బెస్ట్!

స్క్రీన్ ప్లే సంగతులు

        ఈ సినిమాని అపహాస్యం పాల్జేసింది యాక్టింగ్ కాదు, కెమెరా వర్క్ కాదు, ఆర్ట్ డైరెక్షన్ కాదు, మ్యూజిక్ కూడా కాదు, ఇంకేదీ కాదు- కేవలం రచన, దర్శకత్వాలే!

        ముందు రచన బావుంటే దర్శకత్వం దానికదే బలపడుతుంది. రచనే బావుండక పోతే ఎంత గొప్ప దర్శకుడైనా, యాక్టర్లైనా, కెమెరామాన్ అయినా, ఆర్ట్ డైరెక్టరైనా, మ్యూజిక్ డైరెక్టరైనా ఇంకెవరైనా - సినిమాని నిలబెట్టలేరు. ఒక్క చెత్త రచన దెబ్బకి వీళ్ళందరి శ్రమా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మృతదేహానికి అలంకరణ చేసిన చందాన సినిమా తయారవుతుంది. 

        ఒక మృతప్రాయమైన రచనకి అందరూ కలిసి చేతనైన డెకొరేషన్ చేశారు ఇక్కడ.

        ఐడియా, దాని విస్తరణ, విస్తరణకి డైనమిక్స్,  స్ట్రక్చర్ లేకపోవడం, బిగినింగ్ ని బారెడు సాగదీయడం, ట్రీట్ మెంట్ లో ఫోకస్ కోల్పోయి స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అవడం, సెకెండాఫ్ సిండ్రోమ్  సుడిగుండంలో పడిపోవడం, ట్రీట్ మెంట్ లో మళ్ళీ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్, క్యారక్టర్ కంటే ప్లాట్ కే ప్రయారిటీ ఇవ్వడం, ప్లాట్ ( కథనం) నడిపిన క్యారక్టర్ పాసివ్ గా తయారవడం, సస్పెన్స్ లోపించడం, టైం అండ్ టెన్షన్ - క్యారక్టర్ గ్రాఫులు ఐపు లేకుండా పోవడం, ప్రాబ్లం సెటప్ ప్రాధాన్యాన్ని గుర్తించక దాన్ని ఆషామాషీగా తయారు చేయడం, దాంతో ప్రాబ్లం సెటప్ లో ఎమోషన్, గోల్, ఫోర్ షాడోవింగ్ ల జాడ లేకపోవడం, ఈ రచన ద్వారా అసలేం చెప్పాలను కుంటున్నారో అసలే తెలీకపోవడం- ఇన్ని తప్పులతడక లున్నాయి ఈ రచనలో! 

        ఇవన్నీ కలిసి ‘సైజ్ జీరో’ రచనని జీరో బ్యాలెన్స్ కథగా తయారు చేశాయి.

        రీఛార్జికి అవకాశంలేని రిలీజ్.

       
రిలాప్స్.
       
                                                          ***
        1. ఐడియా : ‘సైజ్ జీరో’ టైటిల్ తో కథ అనుకున్నప్పుడు ఆ సైజ్ జీరో కాన్సెప్ట్ అసలేంటో వివరించాలి. కానీ అనూష్కా పాత్ర లావు తగ్గే ప్రయత్నానికే  అన్నట్టుగా దీన్ని టైటిల్ గా  పెట్టేశారు. ఆమె సైజ్ జీరో కి తగ్గితే ఏ ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలుసుకోలేదు. సైజ్ జీరోకి తగ్గడాన్ని ఆమె పాత్ర ద్వారా గ్లామరైజ్ చేసి ప్రేక్షకులకి ఏ సంకేతాలు పంపుతున్నారో కూడా గమనించ లేదు.  ప్రకాష్ రాజ్ నడిపే క్లినిక్ కి సైజ్ జీరో పేరు పెట్టారు. ఆ క్లినిక్ మీద హీరోయిన్ ధ్వజమెత్తితే, అతను  సైజ్ జీరోకి తగ్గించడంలో అక్రమాలకి పాల్పడుతున్నందుకు  కాకుండా, అసలు సైజ్ జీరో కాన్సెప్టే మన దేశానికి వద్దనే విధంగా ధ్వజమెత్తి వుండాలి. 

        2. విస్తరణ, విస్తరణకి డైనమిక్స్, స్ట్రక్చర్ లేకపోవడం : బిగినింగ్ లో కథా విస్తరణలో చీటికీ మాటికీ హీరోయిన్ కి పెళ్లి సంబంధాల సీన్లతో నిండిపోయింది. దీంతో కథ ఎక్కడేసిన గొంగళిలా తయారయ్యింది. పైగా ఈ పెళ్లి సంబంధాల సీన్లు  వైవిధ్యం లేక అన్నీ ఒకేలా వున్నాయి. ఒక్కసారయినా కౌంటర్ సిట్యుయేషన్ ని క్రియేట్ చేసి డిఫరెంట్ కామెడీని ఎలివేట్ చేయలేదు. ఆ లావు పాటి హీరోయిన్ కి,  లావుపాటు అబ్బాయి పెళ్లి చూపుల కొస్తే ఏమవుతుంది?- అన్న బ్రెయిన్ టీజర్ ని వదల్లేదు.  

        మొదలెట్టిందే పెళ్లి సమస్యతో ఎత్తుకుని ఇంటర్వెల్ దాకా పెళ్లి చూపుల ఎపిసోడ్లే వేయడం తో ఫస్టాఫ్ అంతా పాత వాసన కొట్టేట్టు తయారయ్యింది. అంతరించిపోయిన  బాల్య వివాహాల సాంప్రదాయం దర్శకుల నరనరాన జీర్ణించుకు పోయినట్టుంది. కథల్లో ఆడపిల్ల ( హీరోయిన్) కనపడితే చాలు, ఆమెకి ఇంకే జీవితాన్నీ స్వేచ్చనీ ఇవ్వకుండా పెళ్లి చేసిపడెయ్యాలని వెంట పడతారు. ఇదో రకమైన మోరల్ పోలీసింగో, సైకలాజికల్ ప్రాబ్లమో! ప్రారంభం నుంచే హీరోయిన్ ని పెళ్లి చట్రంలో ఇరికించేసి, అప్పుడే పరాయిదనే భావం కల్గిస్తే  ప్రేక్షకులు ఎంజాయ్ చేసేదెలా? యూత్ అప్పీల్ ఏముంటుంది అప్పుడే  పెళ్లి కాబోయే హీరోయిన్ తో? శుభ్రంగా నగర జీవితాన్ని అనుభవిస్తున్న, తన లావుతనం తనదీ అన్న కేర్ ఫ్రీ తనంతో వున్న హీరోయిన్ని- అదీ అనూష్కా లాంటి బిగ్ ఫాలోయింగ్ వున్న స్టార్ ని- లవ్ లోనే పడెయ్యాలి, లావుతనంతో రోమాన్స్ లో సమస్యలే చూపించి ఫన్ క్రియేట్ చేయాలి, తన స్థూల కాయానికి ఏ రాకుమారుడు వస్తాడోనన్న డ్రీమ్స్ చూపిస్తూ,  వాస్తవంలో దీనికి వ్యతిరేకమైన ఒకటీ రెండు పెళ్లి చూపులు వేస్తే,  అప్పుడు కథనానికి డైనమిక్స్ వస్తాయి. మరో వైపు ఆమె పనిచేసే రెస్టారెంట్ లో ఆమె స్థూలకాయం ఎలా సమస్య అయ్యిందీ చూపించు కొస్తే కూడా కథనానికి చైతన్యం వస్తుంది. రెస్టారెంట్ లోనే ఏ కృష్ణుడు లాంటి లావుపాటి హీరో ప్రేమ ప్రయత్నాలో చూపించినా విస్తరణ పరవళ్ళు తొక్కుతుంది. 

       ఇంటర్వెల్ వరకూ విస్తరించిన ఈ  బిగినింగ్ విభాగం లో ఏ డైనమిక్సూ లేకుండా, కనీసం సమస్యకి దారి తీసే పరిస్థితులనీ చూపించకుండా,  చప్పగా వెళ్ళిపోవడంతో స్ట్రక్చర్ కే  ఎసరు వచ్చింది. పెళ్లి చూపుల కొచ్చి టాయిలెట్ లో కూర్చుని ఎంతకీ బయటికి రాని హీరో ఎంట్రీ సీను ఇంకా నీరసమైన, చీప్ టేస్టు సీను. టాయిలెట్ కామెడీ అంటారు దీన్ని. నీటైన కథల్లో ఏ వికారాలూ లేని నీటైన కామెడీనే చూపించాలి కదా? పెళ్లి చూపుల్లో ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్  చేసుకుని పరస్పరం తిరస్కరించుకోవడం ఒక కీలక మైన ఘట్టం. తెలివిగల రచయితకి/దర్శకుడికి  ఆడుకోవడానికి స్ట్రక్చర్ ని ఏర్పరచే  ఇంతకంటే టర్నింగ్ పాయింట్ దొరకదు. దీన్ని కూడా తెలుసుకోక పోవడం వల్ల మున్ముందు కథా విస్తరణ అంతా అగమ్యగోచరంగా తయారయ్యింది. ఏ పెళ్లి చూపులప్పుడు కూడా కథలో ఏమీ జరక్కపోతే కథా విస్తరణ ఎందుకోసం?  ఇక హీరో వచ్చాక కూడా అదే నస పెడితే ఆ హీరో కూడా కథకి పనికి రాకుండా పోడా? అదేజరిగిందీ కథలో. 


           హీరోయిన్ కి ఒక ప్రత్యర్ధి పాత్ర ఎవరు? ఎలాగైనా ఆమె పెళ్లి చెయ్యాలని  తిప్పలు పడే ఆమె తల్లి. అలాటి తల్లినే బురిడీ కొట్టిస్తూ హీరోయిన్ హీరోతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం ఒక తుంటరి చర్య. కథలో ఏ చర్య కూడా వృధా పోదు. పోతే  సెటప్ కీ- పే ఆఫ్ కీ లంకె లేక అసంతృప్తి పుడుతుంది ప్రేక్షకులకి. ప్రతి చర్యకీ దాని పరిణామాలుంటాయి. తల్లికి తెలీని ఈ ‘హిడెన్ ట్రూత్’ అనే ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఇక్కడే సమస్యని ఏర్పాటు చేయవచ్చు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి బయట పడితే ఆ తల్లి ఏం చేస్తుంది? ఇలాటి అర్జెన్సీని, ఇలాటి ఒక టెన్షన్ నీ క్రియేట్ చేస్తూ, కథలో చూపించినట్టుగా - ఆ మరో పెళ్లి చూపులకెళ్ళొచ్చు.  ఈ పెళ్లి చూపులు కూడా హీరోయిన్ లావు కారణంగానే విఫలమైనట్టు అదే రికార్డు వేశారు. ఇక  లావు తగ్గాల్సిందే నని తల్లి పట్టుబట్టడం చూపించారు. ఇంతాలస్యంగానా ఈ మాట చెప్పడం? దీంతో తన ఇష్టానికి వ్యతిరేకమైన ఈ పనికి మనస్కరించక హీరోయిన్ ఏడ్వడంతో ఇంటర్వెల్ కొచ్చారు. 


        కనీసం ఈ పెళ్లి చూపులప్పుడైనా మ్యాచ్ ఫిక్సింగ్ తో తల్లిని మభ్యపెడుతున్న హీరోయిన్ కి గుణపాఠం లాంటి అనుభవం ఎదురవ్వాలి కదా? అంటే, ఈసారి పెళ్లి చూపుల కొచ్చినవాడు ఇద్దరు పిల్లలున్న ఏ భార్య చనిపోయిన వాడో అయ్యుంటే, అదేమని హీరోయిన్ నిలదీస్తే, ‘పిప్పళ్ళ బస్తాలా వున్నావ్, ఇంకెవ డొస్తాడే నీకు?’-  అని అతను తీవ్రంగా హర్ట్ చేస్తే - నా లావు నా ఇష్టమని తెగ తినేస్తూ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ కి - ఇంతకంటే ఎదురు దెబ్బ లేదు, కనువిప్పు లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ తో  తల్లిని మభ్య పెట్టినందుకు ఇక శాస్తి జరగడం మొదలయ్యింది- ‘ నెలరోజుల్లో నన్ను చేసుకునే వాడు వస్తాడు చూడు’ అని వాడితో ఛాలెంజి చేసి బరువు తగ్గడానికి తనే నిర్ణయం తీసుకుంటే కథకి చాలా ప్లస్ అవుతుంది. ఎలాగంటే ఇంటర్వెల్లో  తన తప్పు తెలుసుకున్న పాత్ర ఆ మేరకు మారేందుకు చేసే స్ట్రగుల్ తో, రక్తమాంసాలున్నపాత్ర అయి సానుభూతి సంపాదించుకుంటుంది. అంతేగాక, క్లయిమాక్స్ లో ముందుగా  తన తప్పుని సరిదిద్దుకుంటే తప్ప గోల్ ని సాధించ లేని చిక్కుల్లో పడుతుంది. (The first thing that should happen at the midpoint or the Ordeal is that someone (generally the antagonist) should hold up a mirror to the hero and make them aware of their flaw – typically in none too subtle terms. In doing this, it should be clear that the hero CANNOT continue towards their goal without addressing this flaw. Eg. ‘Tootsie’, Dead Poets Society’, ‘An Officer and a Gentleman’, and  ‘Brokeback Mountain’ etc - Allen Palmer )


        ఇక బరువు తగ్గాలని తల్లి పట్టుబట్టడం కాదు- దీనివల్ల హీరోయిన్ గోల్ లో ఎమోషన్, ఛాలెంజ్ లాంటి యాక్టివ్ పాత్ర ఎలిమెంట్స్ పుట్టుకురావు. సినిమాలో చూపించినట్టు బరువు తగ్గాలా!- అని పాసివ్ గా హీరోయిన్ ఏడుపే మిగులుతుంది. 


        ఇక మిడిల్ విస్తరణ చుక్కాని లేని నావ అయింది. తల్లి తీసికెళ్ళి ప్రకాష్ రాజ్ క్లినిక్ లో జాయిన్ చేస్తుంది. అంతలో ఆ క్లినిక్ లో హీరోయిన్ ఫ్రెండ్ జబ్బున పడుతుంది. అతనిచ్చిన మందుల వల్ల ఆమె కిడ్నీలు పాడయ్యాయి. దీంతో ప్రకాష్ రాజ్ మీద హీరోయిన్ తిరుగు బాటు చేయడం, ఫ్రెండ్ కి చికిత్స కోసం వూరు మీద పడి ఫండ్ రైజింగ్ కి ప్రోగ్రాములు చేయడం , ప్రకాష్ రాజ్ ప్రమోషనల్ వీడియోకి పోటీగా తనూ ఓ ప్రమోషన్ వీడియో తీసి రిలీజ్ చేయడం, ప్రకాష్ రాజ్ క్లినిక్ గురించి ప్రజలకి ఎవేర్ నెస్  కల్గించడం కోసం సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, పివిపి స్పోర్ట్స్ సంస్థ ( ఈ సినిమా తీసిన సంస్థకి చెందినదే)  స్పాన్సర్ చేసేందుకు ముందుకు రావడం, మరో వైపు మురికి వాడల్లో ఆర్య డాక్యుమెంటరీ తీసే సీన్లు, అతను వచ్చేసి హీరోయిన్ ప్రోగ్రాములకి వీడియోలు తీయడం, తనతో ఉంటున్న సోనాల్ చౌహాన్ తో ప్రేమలో పడ్డం, ఆర్య మీద ప్రేమ పుట్టిన హీరోయిన్ డిసప్పాయింట్ అవడం, ఇంతలో పివిపి స్పోర్ట్స్ యజమాని అడవి శేష్ హీరోయిన్ కి క్లోజ్ అవడం, హీరోయిన్ అతడి వైపు మొగ్గడం... ఇలా ఇలా హీరోయిన్ బరువు తగ్గే కథకాస్తా - రకరకాల యాడ్స్ ఫిలిమ్స్ లా, మ్యూజిక్ వీదియోల్లా, ఆఖరికి పివిపి సంస్థ ప్రమోషనల్ వీడియో గా కూడా మారిపోయి కూర్చుంది!


        ఎండ్ కొచ్చేసి, ప్రకాష్ రాజ్ ని ఓడించిన హీరోయిన్ ఫ్రెండ్ ఆపరేషన్ కూడా జరిపించి తను అడవి శేష్ తో పెళ్ళికి సిద్ధ పడ్డం, ఆ పెళ్ళిలో ఆర్య వచ్చేసి ప్రేమిస్తున్నట్టు చెప్పడం అనే ముక్కోణ  వ్యవహారంతో కాస్సేపు విసిగించి  ముగింపుకి ..

        ఇలా మొదట్నించీ స్ట్రక్చర్ అనే యాంగిల్ లో కథ ఆలోచించక పోవడంతో విస్తరణ అడ్డగోలుగా సాగి గజిబిజిగా తయారయ్యింది. సింపుల్ గా అనుకుంటున్న ఐడియాకి నాల్గు పేజీల సినాప్సిస్ రాసుకున్నా కథ అతుకుల బొంతలా వుందని ఆ దశలోనే తెలిసిపోయేది. లేదా ఓ అయిదు నిమిషాలు అనుకున్న కథ నేరేషన్ ఇచ్చుకున్నా ఆ కథే నోటికి అడ్డం పడుతూ ఆగిపోయేది. ఇవేమీ చేయకుండా నేరుగా వన్ లైన్ ఆర్డర్ వేసేసినట్టుంది. బాగా అనుభవముంటే తప్ప ఇలా చేయడం కష్టం. ముందు బ్లూ ప్రింట్ లాంటి సినాప్సిస్ వుంటే లైన్ ఆర్డర్ ని  అది గైడ్ చేస్తుంది. సీన్లు ఒక ప్రొగ్రెషన్ తో అందమైన మాలిక లా వస్తాయి. లేదంటే ముక్కల్ని ఏరి వెల్డింగ్ చేసినట్టు సమన్వయం లేని అతుకుల బొంతలా ఇలా తయారవుతుంది కథ.  

                                                     ***
3. బిగినింగ్ ని బారెడు సాగదీయడం : ఒక్కో పెళ్లి చూపులు జరుగుతోంటే ఇక్కడ టర్నింగ్ వస్తుందేమో, అక్కడ టర్నింగ్ వస్తుందేమో నని ఆశగా చూడం తప్ప ఏమీ జరగదు. హీరో వచ్చాక కూడా ప్రాబ్లం ఏర్పాటు కాదు. గంటంపావు సేపూ ఇంటర్వెల్ వరకూ విషయం లేకుండా నడిపించేసి, అక్కడ సడెన్ గా తల్లి చేత  ఇక బరువు తగ్గాల్సిందే నని అన్పించి బిగినింగ్ ముగించారు. దీంతో ఈ గంటంపావు సేపూ చూపించిందేమిటా అన్న ప్రశ్న మిగులుతుంది.        కథలోకి వెళ్ళకుండా బిగినింగ్ ని ఇంత  సాగదీయడం వల్ల మిడిల్ స్కోపు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. మిడిల్ కిచిడీ అయిందనేది వేరే విషయం. చివరికి తేలిందేమిటంటే- స్ట్రక్చర్ స్పృహ వుండని పాత ధరణిలో ఫస్టాఫ్- సెకండాఫ్ బాపతు స్క్రీన్ ప్లేగా దీన్ని సెట్ చేసుకున్నారు. అంటే కథ పుట్టించకుండా బిగినింగ్ నే ఇంటర్వెల్ దాకా బారెడు  సాగదీసి, ఇంటర్వెల్లో  ఉన్నట్టుండి ప్రాబ్లం పెట్టుకుని,  సెకండాఫ్ లో కథలో కెళ్ళే తరహా అన్న మాట. సాంకేతికుల నుంచి అన్నీ ఆధునికమైన ప్రొడక్షన్ విలువల్ని డిమాండ్ చేసి మరీ రాబట్టుకుంటూ, తాము రాసుకునే స్క్రిప్టుని మాత్రం ఇంత కాలం చెల్లిన విధంగా ఎలా తయారు చేసుకోవడంలోనే వాళ్ళు మజా అనుభవిస్తారు. 

                                                ***
4. ట్రీట్ మెంట్ లో ఫోకస్ కోల్పోయి స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అవడం :
ఇంటర్వెల్ దగ్గర లావుతగ్గాలని సంకల్పించుకున్న కథ మరేమయ్యిందో ఏమో సెకండాఫ్ లో, అంటే మిడిల్ విభాగంలో,  ఫోకస్ కోల్పోయి క్లినిక్ మీద  పోరాటం, ఫ్రెండ్ కోసం ఆరాటం వగైరా వగైరా వేర్వేరు కథానికలుగా మారిపోవడంతో- స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అయ్యింది. లావు తగ్గడం హుష్ కాకీ అయి, ఏ స్థూలకాయంతో పెళ్ళికి తయారైంది హీరోయిన్. ప్రధానం గా సినిమా నడ్డి విరిచింది ఈ ఫ్రాక్చరే. ఒక కథ మొదలెట్టి ఇంకేవో కథానికలు ఎలా చెప్తారసలు? 

5. సెకెండాఫ్ సిండ్రోమ్ సుడిగుండంలో పడిపోవడం : ఫస్టాఫ్ లో ప్రాబ్లం ఏర్పాటు చేశాక దాంతో ఎలా కొనసాగాలో స్పష్టత లేకపోవడం సెకండాఫ్ సిండ్రోం కి దారి తీస్తుంది. అంటే సెకండాఫ్ కథ నడపడం చేతగాక పోవడం. బరువు తగ్గాలన్న పాయింటుతో ఫస్టాఫ్ ముగించారు, కానీ సెకండాఫ్ ఈ పాయింటుతో ఎలా రన్ చేయాలో స్పష్టత లేకపోవడంతో, ఆ పాయింటుని వదిలేసి క్లినిక్ అక్రమాల్ని ఎత్తుకున్నారు. తల్లి పెళ్లి  ప్రయత్నాల్ని గాలికి వదిలేశారు. ఇలాటి సెకండాఫ్  సిండ్రోమ్  బాధిత సినిమాలుగా ‘దొంగోడు’, ‘ధమ్’, ‘తేరేనామ్’, ‘హవా’, తాజాగా ‘జ్యోతిలక్ష్మీ’ వంటి అట్టర్ ఫ్లాపులు ఆల్రెడీ వుండగా, ఈ లిస్టులో ‘సైజ్ జీరో’ కూడా చేరిపోయింది. ఇన్ని ఉదాహరణలు కన్పిస్తూండగా మళ్ళీ పొరపాటు ఎలా చేశారంటే,  ఏ సినిమా ఎందుకు హిట్టవుతోందో, ఎందుకు ఫ్లాపవుతోందో శాస్త్రీయ విశ్లేషణ చేసుకోవడం ఎక్కడుంది? శాస్త్రీయ విశ్లేషణ లేకుండా  నిర్మాతల డబ్బు పాడు చేస్తూ ఫీల్డులో కొనసాగేందుకు అన్ ఫిట్ అవుతారని తెలుసుకోవడం ఎక్కడుంది?

6. ట్రీట్ మెంట్ లో మళ్ళీ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ :
 సెకండాఫ్ లో క్లినిక్ మీద పోరాటం ఎపిసోడ్, ఫ్రెండ్ కోసం ఫండ్ రైజింగ్ ఎపిసోడ్, ప్రజలకి అవగాహన కోసం స్పోర్ట్స్ ఈవెంట్  ఎపిసోడ్ ..ఇలా కన్పించిన సమస్యల్లా ఎత్తుకుంటూ ఎపిసోడ్లమయంగా చెప్పుకుపోవడంతో, మొత్తం కథనం డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడింది. ఒక సమస్య ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం; మళ్ళీ ఇంకో సమస్య ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం... ఇలా సినిమా అంటే కథల సంపుటి కాదు, అలా వుంటే ఎవ్వరూ చూడరు. సినిమా అంటే ఒకే పెద్ద కథ , అందులో ఒకే సమస్య,  దాంతో పోరాటం, పరిష్కారం, అంతే.  వెళ్లి వెళ్లి ఏమాత్రం తెలుసుకోక ఈ టెక్నిక్ ని పెట్టుకుని ‘టైగర్ హరిచంద్ర ప్రసాద్’, తమిళ డబ్బింగ్ ‘సిటిజన్’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటివి తీసి భారీగా చేతులు కాల్చుకున్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్  సైతం ఈ ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001  లో ఆయన తీసిన  వార్ హార్స్ఫ్లాపయ్యింది.

స్టార్ట్ అండ్ స్టాప్ ఎపిసోడిక్ స్ట్రక్చర్ 


7. క్యారక్టర్ కంటే ప్లాట్ కే ప్రయారిటీ ఇవ్వడం : కథ పాత్రని నడిపిస్తుందా? పాత్రే కథని నడిపించాలా? ప్రాథమిక జ్ఞానం వున్న వాళ్లెవరైనా రెండోదే చేస్తారు. ఈ ప్రాథమిక నాలెడ్జి లేకపోవడం వల్లే  అధిక సంఖ్యలో దర్శకులు, రచయితలూ కథతోనే పాత్రని నడిపిస్తూ ఎడాపెడా పాసివ్ పాత్రల్ని చేతులారా క్రియేట్ చేసుకుంటూ, అట్టర్ ఫ్లాప్స్ ఇచ్చి మీసాలు మెలేస్తున్నారు- జ్ఞాన రాహిత్యం జిందాబాద్ అంటూ.  పాత్రే కథని నడిపిస్తే అది యాక్టివ్ పాత్ర అవుతుంది. అప్పుడు  కథ దారిలో వుంటుంది. ఇన్నేళ్ళూ గడిచినా ఎంతకీ ఈ యాక్టివ్- పాసివ్ తేడాలు తెలీక పోవడంతో,  ఈ దశాబ్దంన్నర కాలంగా వందల్లో అట్టర్ ఫ్లాప్స్ అయి  కూర్చున్నాయి. పాత్రని పట్టుకుని కథ చేస్తే అది తప్పకుండా మాట వినదు. తనేం చేయాలో తనే  చేసుకు పోతుంది. ఇందుకు ఇష్టపడని పాత్ర సృష్టికర్తలు, దాన్ని కుదేలు చేసి దాని కోసం తామే కథ నడపబోతారు. ఈ పనే జరిగింది  అనూష్కా హీరోయిన్ క్యారక్టర్ తో. క్యారక్టర్ కంటే ప్లాట్ కే ప్రాధాన్య మివ్వడంతో ఆమె చీమూ నెత్తురు లేకుండా తయారయ్యింది, ఇంటర్వెల్లో ఏడ్చింది, ఇంటర్వెల్ తర్వాత ఏటో వెళ్ళిపోయింది. గోల్ లేదు, ఎమోషన్ లేదు, గందరగోళం తప్ప. కథని ఆమే నడిపి వుంటే, ఇందాకా పైన చెప్పుకున్నట్టు,  ఇంటర్వెల్ లోపే హీరోతో మ్యాచ్ ఫిక్సింగ్ తో అక్కడే బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ -1 ని క్రియేట్ చేసేది. దీని పర్యవసానంగానే ఇంటర్వెల్లో తప్పు తెలుసుకుని , యా వచ్చిన వాడి మాటల్ని సవాలుగా సవాలుగా తీసుకుని బరువూ తగ్గి పెళ్ళాడి చూపిస్తాననేది. సెకండాఫ్ లో క్లినిక్ లో బరువు తగ్గేందుకు తనే వెళ్లి చేరేది. తన సవాలుని, గోల్ నీ, ఆ రెండో పెళ్లి వాడి మాటలకి కలిగిన రోషాన్నీ ఎమోషన్నీ దేన్నీ చచ్చినా ఆమె వదులుకునేది కాదు.  క్లినిక్ అక్రమాలు, ఫ్రెండ్ అనారోగ్యం, ప్రజలకి అవగాహన, స్పోర్ట్స్ సంస్థ ప్రమోషన్ లాంటి నాన్సెన్సు లేవీ పెట్టుకునేది కాదు.  లావు తగ్గే ప్రయత్నంలో ఏమేం స్ట్రగుల్స్ పడిందనేది మాత్రంగానే తన కథ తను చెప్పుకునేది - చక్కగా స్క్రీన్ ప్లే ని స్ట్రక్చర్ లో ఉంచుతూ.  

      యాక్టివ్ క్యారెక్టర్ వల్ల ఆటోమేటిగ్గా స్ట్రక్చర్ ఏర్పాటయి పోతుంది. క్యారక్టర్ ని పాసివ్ గా చేసి కథతో దాన్ని నడిపిస్తే  స్ట్రక్చర్ ఏర్పాటు కాదు. ఏ స్ట్రక్చరూ వుండని ఆర్ట్ సినిమా మాత్రమే  తయారవుతుంది. గొప్ప బడ్జెట్లతో గొప్పగాతీస్తున్నామనుకుంటున్నది నిజానికి పాసివ్ పాత్రలతో కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని ఇక్కడ మరోసారి గుర్తు చేసుకుందాం. ఒక్క కథని తానుగా నడిపే కథానాయకుడు (యాక్టివ్ పాత్ర)  స్క్రీన్ ప్లేని ఫ్రాక్చర్ అవనివ్వడు. సెకండాఫ్ సిండ్రోమ్ సుడిగుండం లో పడనివ్వడు. స్టార్ అండ్ స్టాప్ టెక్నిక్కీ చెక్ పెట్టేస్తాడు. యాక్టివ్ పాత్రని మాత్రమే పట్టుకుని ప్రయాణిస్తే స్క్రీన్ ప్లే లో ఏ రోగాలూ పుట్టుకురావు. స్క్రీన్ ప్లే ని క్లీన్ అండ్ గ్రీన్ గా వుంచేది యాక్టివ్ క్యారక్టరే. ఎందుకంటే అది తన స్క్రీన్ ప్లే, తన కథ గనుక. పాసివ్ పాత్ర ఒక వైరస్. స్క్రీన్ ప్లేని అన్నివిధాలా చెడగొడుతుంది. 


10. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ - క్యారక్టర్ ఆర్క్  ఐపు లేకుండా పోవడం : పాసివ్ పాత్రతో ఇవేముంటాయి? ఫస్టాఫ్ లో కథకోసం ఆమె ఏమీ చేయడం గనుక, ఆమె క్యారక్టర్ ఓహో అన్పించే క్యారక్టర్ ఆర్క్ క్రియేట్ చేసే  ప్రసక్తే లేదు. క్యారక్టర్ ఆర్క్ ( పాత్ర ఉత్థాన పతనాల చాపం)  ఎప్పుడు ఏర్పడుతుందంటే పాత్ర - ఆహా ఓహో భలే చేసిందే, భలే కొట్టిందిరా దెబ్బ, హయ్యో ఇలా చేసిందేంట్రా, మళ్ళీ పికప్ చేసుకుంటుందా...అన్న మిశ్రమ స్పందనల్ని ప్రేక్షకుల్లో రెచ్చ గొట్టినప్పుడు. దీన్నే ఇన్వాల్వ్ మెంట్, కనెక్ట్ అంటారు. ఇలా క్యారక్టరే తన ఆర్క్ తో తదనుగుణమైన టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ నీ క్రియేట్ చేస్తుంది. అంటే స్క్రీన్ మీద బొమ్మలు కదిలే టైం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరగడ మన్నమాట. లేకపోతే ఆ వెండితెరని వృధా చేసినట్టే. 


        ఫస్టాఫ్ లో హీరోతో మ్యాచ్ ఫిక్సింగ్ తో గనక అక్కడే హీరోయిన్ బిగినింగ్ ముగిస్తూ ప్లాట్ పాయింట్ -1 ని సృష్టించి వుంటే, తల్లితో ఒక రిస్క్ క్రియేట్ చేసుకుని, పై రెండు ఎలిమెంట్స్(  క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్) నీ పెంచేసేది. ఇంటర్వెల్ దగ్గర  సవాలు విసిరితే, అక్కడి ఎమోషన్  తో ఈ ఎలిమెంట్స్ ని ఇంకా ఆకాశమార్గం పట్టించేది. ఇక సెకండాఫ్ లో తన పాత్ర ప్రయాణంతో మరింత మరింత పెంచుకుంటూ పోయేది. అప్పటికి ఆమెకి ఒక రోశామూ, లక్ష్యమూ వున్నాయి కాబట్టి. 

11. ప్రాబ్లం సెటప్ ప్రాధాన్యాన్ని గుర్తించక దాన్ని ఆషామాషీగా తయారు చేయడం, దాంతో ప్రాబ్లం సెటప్ లో ఎమోషన్, గోల్, ఫోర్ షాడోవింగ్ ల జాడ లేకపోవడం : సినిమాలో చూపించినట్టు  ఇక్కడ ఇంటర్వెల్ సీనే ప్లాట్ పాయింట్ -1 అనుకుంటే,  ఇక్కడ ఏం ఏర్పడ్డాయి? ఈ ప్లాట్ పాయింట్ -1  లో ఉండాల్సిన
 ఎలిమెంట్స్ 1. గోల్, 2. ఎమోషన్, 3. పరిణామాల హెచ్చరికా ఏమైనా ఉన్నాయా? కేవలం తల్లి పెట్టిన కండిషన్ కి హీరోయిన్ బరువు తగ్గాలా అన్నట్టు ఏడ్చింది. అంటే గోల్ ఆమెది కాదు, తల్లిది, ఎమోషన్ అమెది కాదు, తల్లిది, పరిణామాల హెచ్చరికా - అంటే రిస్కూ తల్లిదే! తల్లి అంటే ఎవరు? కథ! కథ డిసైడ్ చేస్తూ హీరోయిన్ ని పాసివ్ గా,  పనికి రాకుండా తయారు చేసి సెకండాఫ్ లోకి పంపింది..

12. ఈ రచన ద్వారా అసలేం చెప్పాలను కుంటున్నారో అసలే తెలీకపోవడం :  హీరోయిన్ లక్ష్యం బరువు తగ్గాలనా? బరువు తగ్గించే వాడి అంతు చూడ్డమా? చావు బతుకుల్లో వున్న ఫ్రెండ్ ని కాపాడుకోవడమా? ఈ క్లినిక్స్ పట్ల ప్రజలకి అవగాహన కల్గించడమా? ఏమిటామె లక్ష్యం? అన్నీ  చేసేసి బరువు తగ్గకుండానే వుండి పోయిందేమిటి? బరువు పెరగండీ, ఏ ప్రాబ్లమూ లేదని చెప్తోందా? ఏం చెప్పించాలనుకున్నారు హీరోయిన్ తో- పాపం వొళ్ళు పెంచి అంత కష్టపడ్డ అనూష్కాని ఫూల్ ని చేస్తూ!

పాత్రోచితానుచితాలు: 
Wrong! You are not born as you are, its your own  making. Every time  you disappoint  us, with  your  wrong assumptions, silly girl!
             చిన్నప్పుడే ఆమె తండ్రి ఆమెకి అడ్డమైన తిళ్ళూ పెడుతూ 30 కిలోలకి పెంచి, ఎనిమిదేళ్ళ వయసులో బీన్ బ్యాగ్ లా తండ్రికి అప్పజెప్పి పోయాడు. ఆ తండ్రేమో, అంటే పిల్ల తాతగారు, ఇంకా అడ్డంగా మేపి 90 కిలోలకి స్కోరు పెంచి- నిగనిగ లాడే నీటి గుర్రంలా కోడలికి,  అంటే పిల్ల తల్లిగారికి కి అప్ప జెప్పేశాడు.  ఇద్దరు మగాళ్ళు మాన్యుఫాక్చరింగ్ చేసి మీద పడేసిన ఈ భారీ శాల్తీతో కుయ్యోమంటూ తల్లికిప్పుడు పెళ్లి సమస్య. ఏ బుద్ధున్న వాళ్ళూ ఆడపిల్లని అలా కొవ్వు పెరిగేలా ప్రమాదకరంగా పెంచరు. ఆడపిల్ల అనే కాదు,  మగ పిల్లలు కూడా అలా లావెక్కి పోతూంటే అది అలారం బెల్ ఎవరికైనా. అలా ఇక్కడ హీరోయిన్ తల్లి బాధ్యత కూడా లేకుండా పోదు. హీరోయిన్ కీ ఇంకా తన శరీరం మీద తనకి శ్రద్ధ వుండాలి. షేపులో ఉండకుండా ఈ రోజుల్లో యువతులు వుండాలనుకోరు. జన్యుపరంగా హీరోయిన్ కి ఒబేసిటీ సమస్య వుంటే పోనీలే అ నుకోవచ్చు. పైగా సానుభూతి చెందవచ్చు. అలాటిదేమీ లేకుండా,  నా తిండీ నా వొళ్ళూ నా ఇష్టమని డిక్లేర్ చేసుకుని అనాగరికంగా తిరుగుతోంది. దీన్ని కామెడీగా తీసుకుని మనం నవ్వాలి. పైగా - లావుగా వున్న అమ్మాయి పెళ్ళికి పనికిరాదా?  పెళ్ళయాక లావెక్కితే  విడాకులిచ్చేస్తారా?- అని వచ్చిన వాణ్ణి దబాయిస్తుంది. లావెక్కడమే తన బాధ్యతా రాహిత్యమైతే, ఇంకా ఆ బాధ్యతా రాహిత్యంతో పెళ్లిని డిమాండ్ చేయడం! హక్కులు మాట్లాడ్డం!

        సరే, ఈ లావు తగ్గడానికి సైజ్ జీరో క్లినిక్ కి వెళ్ళడం ఏమిటి?  సైజ్ జీరో అంటే ఏమిటో తెలుసా? అంత చీపురు పుల్లలా సన్నబడి ప్రాణాల మీదికి తెచ్చుకోవాలనుకుందా? అది ఫాలో అవ్వాల్సిన ట్రెండ్ అని చెప్తోందా? అలాటి క్లినిక్స్ పట్ల ప్రజలకి అవగాహన కల్గిస్తూ సైకిల్ ర్యాలీలు కూడా...అవగాహన కల్గించాల్సింది, హెచ్చారించాల్సిందీ తనలాగా లావెక్క వద్దనా? లేకపోతే - నా లాగా లావెక్కండి,  కానీ సన్నబడడానికి మాత్రం ఇలాటి క్లినిక్స్ కి వెళ్ళ వద్దనా? 

        చాలా కన్ఫ్యూజన్. అర్ధం కాని 90 కిలోల పజిల్ ఇది.


-సికిందర్






 



         
       
       








ఈ కథ అవసరమా?






నిర్మాత - దర్శకుడు :పి.రామ్మోహన్ 



తారాగణం  :  సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు తదితరులు 
కథ - స్క్రీన్‌ప్లే - మాటలు: సాయి సుకుమార్, పి. రామ్మోహన్
సంగీతం: సన్నీ ఎం.ఆర్
విడుదల : నవంబర్ 27, 2015



క్కువ బడ్జెట్ తో ఏదైనా సినిమా తలపెట్టగానే వెంటనే తట్టేది ఏదో ఒక లవ్ స్టోరీ! అదికూడా ఏ వెరైటీ వుండని అరిగిపోయిన రొటీన్ లవ్ స్టోరీ. ఈ సినిమాలు సోదిలోకి లేకుండా పోతున్నాయని వారం వారం ఒపెనింగ్సూ, రిటర్న్సూ వుండని నిదర్శనాలు కనబడుతూనే వున్నా, కాస్తాగి అందరి దారిలో పడి  మనమేం చేస్తున్నామని ఆలోచించే ఓపిక వుండడంలేదు.  ఇలా ఈ లవ్ స్టోరీల మీద డబ్బులూ పోగొట్టుకుని, పేరూ రాక మిగిలిపోయేకన్నా, ఈ పోగొట్టుకునేదేదో కాస్త ఓ అర్ధమంతమైన రియలిస్టిక్ స్వభావమున్న సినిమా తీసి పోగొట్టుకున్నా, కనీసం గుర్తింపైనా దక్కుతుంది.


          తాజాగా గతంలో అష్టా చమ్మా, గోల్కొండ్ హై స్కూల్, ఉయ్యాలా జంపాలా లాంటి హిట్స్ తీసిన నిర్మాత పి. రామ్మోహన్ ఈసారి తనే దర్శకుడుగా మారి ‘తను- నేను’ అనే టైటిల్ తో రోమాంటిక్ కామెడీకి సమకట్టారు. డబ్బు మీదా. విదేశాల్లో జీవితం మీదా కలలతో అమెరికా తరలి వెళ్ళిపోతున్న యూత్ మనస్తత్వాలూ, వాళ్ళని ప్రోత్సహించే పెద్దల కోరికలూ ఎత్తి చూపాలనుకున్నారు. ఈ క్రమంలో ఆచరణలో కొచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్ ఎంత కమిటెడ్ గా సాగిందో ఈ కింద చూద్దాం...

కథేమిటి
     కిరణ్ ( సంతోష్ శోభన్ ) ఓ కాల్ సెంటర్ ఉద్యోగి. అతడికి ఎన్నారై లన్నా, వాళ్ళ మాటలన్నా తెగ కోపం. కాల్ చేసే ఎన్నారైలని చెడామడా తిట్టేస్తూంటాడు. స్వదేశం లో ఏం లేదని మీరెళ్ళిపోయారంటూ, అమెరికాలో వాళ్ళు గడుపుతున్న జీవితాల్ని కించ పరుస్తూంటాడు. ఇది హద్దులు మీరి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డున పడతాడు. ఈలోగా ఇంకో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కీర్తి ( అవికా గోర్) ప్రేమలో పడతాడు. తన కొచ్చే పదిహేడున్నర వేల జీతం కూడా లేకపోవడంతో ఆమే ఖర్చులు పెట్టుకుంటూ వుంటుంది. 

        ఇలా వుండగా ఆమెకి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. దీంతో కిరణ్ ఠారెత్తి పోతాడు. తన అమెరికా ఎలర్జీ ని బయట పెట్టుకుంటూ, ఆమె అమెరికా వెళ్ళకుండా నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆమె కూడా వెళ్లి తను అక్కడ సెటిల్ అవలేనంటాడు. ఆమె మాత్రం వెళ్లి తీరాలి. ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి బండ్రెడ్డి సర్వేశ్వర్రావు ( రవి బాబు ) కి మాటిచ్చింది- అమెరికా వెళ్లి బోల్డు సంపాదించి పంపిస్తానని. కూతురి సంపాదన మీద పడి బతికే సర్వేశ్వర్రావుకి అమెరికా కలలుంటాయి. ఈ  కలల్ని కొడుకుతో తీర్చుకోవాలని అనుకుంటే అతను లవ్ మ్యారేజీ  చేసుకుని బెంగుళూరు చెక్కేశాడు. కనుక ఇక కూతురి మీదే  ఆశలన్నీ పెట్టుకున్నాడు. కూతుర్ని అమెరికా పంపి ఎన్నారై  కిచ్చి పెళ్లి చేయాలని వుంటుంది. ఆమె పంపే బోల్డు డబ్బుతో బంగాళా కారూ కొనుక్కుని దర్జాగా బతికెయ్యాలని కలలు గంటూ ఉంటాడు. 

        ఈ కలలకి కిరణ్ పీడలా దాపురించాడు. వీడు అమ్మాయి వెళ్ళకుండా ఆపితే, తన కొంప కొల్లేరవుతుంది. అందుకని ఒకప్పుడు కూతురికి ఐ లవ్యూ చెప్పి రిజెక్ట్ అయిన ప్రశాంత్ అనే ఎన్నారై కుర్రాడి  మీద ఆశలన్నీ పెట్టుకుంటాడు. కూతుర్ని వీడు పెళ్లి చేసుకుని అమెరికా తీసికెళ్ళి పోయేలా  ప్లానేస్తాడు. ఈ ప్లాను పారిందా, కిరణ్ ఏం చేశాడు, అసలు కీర్తి ప్రేమిస్తున్నది ఎవర్ని- కిరణ్ నా? ప్రశాంత్ నా? మొదలైన సందేశాలకి జవాబులు దొరకాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే. 


ఎలావుంది కథ

     ముందే చెప్పుకున్నట్టు చాలా సాధారణ రొటీన్ ముక్కోణ ప్రేమ కథ. పేరుకే ఎన్నారైల కాన్సెప్ట్ ఉందిగానీ ఆచరణలో ప్రేమ కథ చట్రంలోనే ఇరుక్కుంది. రామానాయుడు ఫిలిం స్కూల్ విద్యార్థి సాయి సుకుమార్ దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. ఇతడికి సినిమా అవకాశం వచ్చినందుకు అభినందించాల్సిందే. కానీ రామానాయుడు  ఫిలిం స్కూల్లో తను నేర్చుకుంది వచ్చిన తెలుగు సినిమా కథలనే రీ సైక్లింగ్ చేయడం గురించే అయితే, అక్కడ స్టడీ చేసింది పాత మూస సినిమాల్నే అయితే, ఈ పని ఏ శిక్షణా లేని ఛోటామోటా రచయితలు చేస్తూనే వున్నారు. తనూ వాళ్ళల్లో ఒకడై పోవాల్సిన అవసరం లేదు. అయినా ప్రేమ కథే రాయాలని పట్టుబడితే - గత నెల హిందీలో వచ్చిన ‘తిత్లీ’ ( సీతాకోక చిలుక)  లాంటి వెరైటీ -రియలిస్టిక్ ప్రేమకథని ఊహించ గలగాలి. ఈ లో- బడ్జెట్ కమర్షియల్ మూవీ అంతర్జాతీయ  ఫెస్టివల్ సర్క్యూట్స్ లో 22 చోట్ల ప్రదర్శనకి నోచుకుని,  పది అవార్డులూ పొంది దేశంలో విడుదలై సొమ్ములు చేసుకుంది. ఇలాటి కథ తెలుగు ప్రేక్షకులు నోచుకోకూడదా? వాస్తవ మేమిటంటే, తెలుగు మూస  ప్రేమ సినిమాలు ఎప్పుడో సోదిలోకి లేకుండా పోయాయి. ప్రేమ కథలతోనే  షార్ట్ ఫిలిమ్స్ లో యూత్ ఇంకా ముందుకు పోయి,  తమ తమ టేస్టులేమిటో ప్రపంచానికి చాటుతున్నారు. ప్రేమల్ని తామెలా చూస్తున్నారో చెప్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ని  చూసి కనీసం యూత్ నాడిని పట్టుకోగల్గినా ‘తను నేను’ లాంటి సినిమాలు తీయడానికి మనసొప్పదు. యూత్ ఏం కోరుకుంటున్నారో- ఫీడ్ బ్యాక్, స్టడీ అనేవి సినిమా ఫీల్డు కి లేకపోవడంతో, యూత్ తో మానసిక దూరాలు  పెంచుకుని ఇలాటి మాసికల సినిమాలు తీస్తూ పోతున్నారు.

ఎవరెలా చేశారు
     దివంగత దర్శకుడు, మహేష్ బాబుతో ‘బాబీ’ తీసిన శోభన్ కుమారుడు, సంతోష్ శోభన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పరిచయమవుతూనే ఒక స్టాంప్ వేశాడు. ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా ఎలాటి సన్నివేశంలోనైనా నటించేశాడు. వాయిస్ కూడా బావుంది. ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ ఏదైనా వుందంటే ఇతని నటనే. సినిమాల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే మంచి భవిష్యత్తు గల యంగ్ గ్ యాక్టర్ ఇతను. 
        అవికాగోర్ గ్లామర్ పెద్దగా లేకపోయినా నటించే టాలెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే పాత్రలో పెద్దగా డెప్త్ లేకపోవడం టాలెంట్ కి అడ్డుకట్టలా తయారయ్యింది. రవి బాబు ది ఇల్లు కదలని, కూర్చుని డైలాగులు కొట్టే పాత్ర. ఇతర సహాయ పాత్రల్లో నటించిన వాళ్ళందరూ ఓ మాదిరిగా కన్పిస్తారు.

        సినిమాకి సంగీతం, ఛాయాగ్రహణం మైనస్ గా మారాయి. ఈ లో- బడ్జెట్ సినిమాకి రవీందర్ కళా దర్శకత్వం, మార్తాండ్ వెంకటేష్ కూర్పు వల్ల సినిమాకేం ప్లస్ కాలేదు. 
ఈ  రొమాంటిక్ కామెడీకి పి. రామ్మోహన్ దర్శకత్వం ఏ చమత్క్రుతులూ లేని సాధారణ ధోరణిలో వుంది. పాటల చిత్రీ కరణలో ఇది బాగా బయటపడింది. కథా కథనాలు ఎలావున్నా పిక్చరైజేషన్ నేటి యువప్రేక్షకుల్లో క్రేజ్ సృష్టించగల ట్రెండీ లుక్ తో కూడా లేకపోవడం పెద్ద లోపం.


చివరికేమిటి 
     ఈ రొటీన్ ముక్కోణ ప్రేమ కూడా ఫస్టాఫ్ లో వున్న స్ట్రక్చర్ తో సెకండాఫ్ కూడా వుండాల్సింది. ఫస్టాఫ్ లో ఒక స్ట్రక్చర్ తో ఇంటర్వెల్లో హీరో హీరోయిన్లు విడిపోయే వరకూ సాగి, సెకండాఫ్ మొదలయ్యే సరికి వరసమారిపోయి- పాయింటు మీద ఫోకస్ చెదిరిపోయి- అయోమయంలో, జరక్కూడని సంఘటనల్ని జరిపిస్తూ సాగిపోయారు. అసలు ఇద్దర్నీ విడదీసే పాత్రగా వున్న హీరోయిన్ తండ్రి అకస్మాత్తుగా చనిపోవడం, దీని కొనసాగింపు దృశ్యాలతో కాలక్షేపం చేయడం, ఇంకోసారి ఆ ఇద్దరూ యాక్సిడెంట్ కి గురికావడం,  మళ్ళీ దీని కొనసాగింపు దృశ్యాలతో కాలక్షేపం చేయడం...ఇలా స్పేస్ ని నింపేసుకుంటూ పోయారు. ప్రత్యర్ధి పాత్ర అయిన తండ్రిని చంపేస్తే కథే మవుతుందో ఆలోచించలేదు. సెకండాఫ్ ఒక దిక్కూ దిశా లేకుండా సహనాన్ని పరీక్షించేలా తయారయ్యింది. 

        క్యారక్టరైజేషన్ విషయానికొస్తే, మళ్ళీ హీరో ఇక్కడ కూడా మూస మాస్ సినిమాలో వుండే హీరోలాగా బ్యాడ్ లుక్ తో ఉంటాడు,  తన కెవరూ వుండరు, మాస్ హీరోలాగే ఆవారాగా తిరగాలి కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుని బేవార్సుగా లవ్ అంటూ తిరుగుతూంటాడు.  ఇష్టమొచ్చినట్టు మందు కొడతాడు- దీంతో తను చెప్తున్న మాటలకే విరుద్ధంగా ఉంటాడు. ఎన్నారైలని తిట్టేవాడు తను ఇండియాలో ఎంత బాధ్యతగా వుండాలి? ఇక్కడ తను బాగు పడుతున్న దేమిటి? ఆ ఉద్యోగం చేసే తీరేమిటి? ఉద్యోగం పోతే తొక్కలో ఉద్యోగం  అనడమేమిటి? స్నానం కూడా చేయకుండా కంపు కొడుతూ తిరగడ మేమిటి? ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ఆఖరికి కాంప్రమైజ్ అయి అదే అమెరికాకి వెళ్లేందుకు సిద్ధ పడతాడు...


        తీసేది రొటీన్ పాత ప్రేమే అయినా కూడా దానికీ అర్ధం పర్ధం లేకపోతే ఎలా? చూసే ప్రేక్షకులు తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఎన్నారైలని తిట్టడం ఒక కాన్సెప్టేనా? ఓవర్సీస్ లో మళ్ళీ ఆ ఎన్నారైల కోసమే ఈ సినిమా విడుదల చేయాల్సి రావచ్చు.


        చిన్న సినిమాలని ఇటు క్లాస్ కీ- అటు మాస్ కీ కాకుండా ఇలా ఎన్నాళ్ళు తీస్తారో!
         

-సికిందర్