రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, నవంబర్ 2015, శనివారం

ఈ కథ అవసరమా?






నిర్మాత - దర్శకుడు :పి.రామ్మోహన్ 



తారాగణం  :  సంతోష్ శోభన్, అవికా గోర్, రవిబాబు తదితరులు 
కథ - స్క్రీన్‌ప్లే - మాటలు: సాయి సుకుమార్, పి. రామ్మోహన్
సంగీతం: సన్నీ ఎం.ఆర్
విడుదల : నవంబర్ 27, 2015



క్కువ బడ్జెట్ తో ఏదైనా సినిమా తలపెట్టగానే వెంటనే తట్టేది ఏదో ఒక లవ్ స్టోరీ! అదికూడా ఏ వెరైటీ వుండని అరిగిపోయిన రొటీన్ లవ్ స్టోరీ. ఈ సినిమాలు సోదిలోకి లేకుండా పోతున్నాయని వారం వారం ఒపెనింగ్సూ, రిటర్న్సూ వుండని నిదర్శనాలు కనబడుతూనే వున్నా, కాస్తాగి అందరి దారిలో పడి  మనమేం చేస్తున్నామని ఆలోచించే ఓపిక వుండడంలేదు.  ఇలా ఈ లవ్ స్టోరీల మీద డబ్బులూ పోగొట్టుకుని, పేరూ రాక మిగిలిపోయేకన్నా, ఈ పోగొట్టుకునేదేదో కాస్త ఓ అర్ధమంతమైన రియలిస్టిక్ స్వభావమున్న సినిమా తీసి పోగొట్టుకున్నా, కనీసం గుర్తింపైనా దక్కుతుంది.


          తాజాగా గతంలో అష్టా చమ్మా, గోల్కొండ్ హై స్కూల్, ఉయ్యాలా జంపాలా లాంటి హిట్స్ తీసిన నిర్మాత పి. రామ్మోహన్ ఈసారి తనే దర్శకుడుగా మారి ‘తను- నేను’ అనే టైటిల్ తో రోమాంటిక్ కామెడీకి సమకట్టారు. డబ్బు మీదా. విదేశాల్లో జీవితం మీదా కలలతో అమెరికా తరలి వెళ్ళిపోతున్న యూత్ మనస్తత్వాలూ, వాళ్ళని ప్రోత్సహించే పెద్దల కోరికలూ ఎత్తి చూపాలనుకున్నారు. ఈ క్రమంలో ఆచరణలో కొచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్ ఎంత కమిటెడ్ గా సాగిందో ఈ కింద చూద్దాం...

కథేమిటి
     కిరణ్ ( సంతోష్ శోభన్ ) ఓ కాల్ సెంటర్ ఉద్యోగి. అతడికి ఎన్నారై లన్నా, వాళ్ళ మాటలన్నా తెగ కోపం. కాల్ చేసే ఎన్నారైలని చెడామడా తిట్టేస్తూంటాడు. స్వదేశం లో ఏం లేదని మీరెళ్ళిపోయారంటూ, అమెరికాలో వాళ్ళు గడుపుతున్న జీవితాల్ని కించ పరుస్తూంటాడు. ఇది హద్దులు మీరి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డున పడతాడు. ఈలోగా ఇంకో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కీర్తి ( అవికా గోర్) ప్రేమలో పడతాడు. తన కొచ్చే పదిహేడున్నర వేల జీతం కూడా లేకపోవడంతో ఆమే ఖర్చులు పెట్టుకుంటూ వుంటుంది. 

        ఇలా వుండగా ఆమెకి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. దీంతో కిరణ్ ఠారెత్తి పోతాడు. తన అమెరికా ఎలర్జీ ని బయట పెట్టుకుంటూ, ఆమె అమెరికా వెళ్ళకుండా నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆమె కూడా వెళ్లి తను అక్కడ సెటిల్ అవలేనంటాడు. ఆమె మాత్రం వెళ్లి తీరాలి. ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి బండ్రెడ్డి సర్వేశ్వర్రావు ( రవి బాబు ) కి మాటిచ్చింది- అమెరికా వెళ్లి బోల్డు సంపాదించి పంపిస్తానని. కూతురి సంపాదన మీద పడి బతికే సర్వేశ్వర్రావుకి అమెరికా కలలుంటాయి. ఈ  కలల్ని కొడుకుతో తీర్చుకోవాలని అనుకుంటే అతను లవ్ మ్యారేజీ  చేసుకుని బెంగుళూరు చెక్కేశాడు. కనుక ఇక కూతురి మీదే  ఆశలన్నీ పెట్టుకున్నాడు. కూతుర్ని అమెరికా పంపి ఎన్నారై  కిచ్చి పెళ్లి చేయాలని వుంటుంది. ఆమె పంపే బోల్డు డబ్బుతో బంగాళా కారూ కొనుక్కుని దర్జాగా బతికెయ్యాలని కలలు గంటూ ఉంటాడు. 

        ఈ కలలకి కిరణ్ పీడలా దాపురించాడు. వీడు అమ్మాయి వెళ్ళకుండా ఆపితే, తన కొంప కొల్లేరవుతుంది. అందుకని ఒకప్పుడు కూతురికి ఐ లవ్యూ చెప్పి రిజెక్ట్ అయిన ప్రశాంత్ అనే ఎన్నారై కుర్రాడి  మీద ఆశలన్నీ పెట్టుకుంటాడు. కూతుర్ని వీడు పెళ్లి చేసుకుని అమెరికా తీసికెళ్ళి పోయేలా  ప్లానేస్తాడు. ఈ ప్లాను పారిందా, కిరణ్ ఏం చేశాడు, అసలు కీర్తి ప్రేమిస్తున్నది ఎవర్ని- కిరణ్ నా? ప్రశాంత్ నా? మొదలైన సందేశాలకి జవాబులు దొరకాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే. 


ఎలావుంది కథ

     ముందే చెప్పుకున్నట్టు చాలా సాధారణ రొటీన్ ముక్కోణ ప్రేమ కథ. పేరుకే ఎన్నారైల కాన్సెప్ట్ ఉందిగానీ ఆచరణలో ప్రేమ కథ చట్రంలోనే ఇరుక్కుంది. రామానాయుడు ఫిలిం స్కూల్ విద్యార్థి సాయి సుకుమార్ దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. ఇతడికి సినిమా అవకాశం వచ్చినందుకు అభినందించాల్సిందే. కానీ రామానాయుడు  ఫిలిం స్కూల్లో తను నేర్చుకుంది వచ్చిన తెలుగు సినిమా కథలనే రీ సైక్లింగ్ చేయడం గురించే అయితే, అక్కడ స్టడీ చేసింది పాత మూస సినిమాల్నే అయితే, ఈ పని ఏ శిక్షణా లేని ఛోటామోటా రచయితలు చేస్తూనే వున్నారు. తనూ వాళ్ళల్లో ఒకడై పోవాల్సిన అవసరం లేదు. అయినా ప్రేమ కథే రాయాలని పట్టుబడితే - గత నెల హిందీలో వచ్చిన ‘తిత్లీ’ ( సీతాకోక చిలుక)  లాంటి వెరైటీ -రియలిస్టిక్ ప్రేమకథని ఊహించ గలగాలి. ఈ లో- బడ్జెట్ కమర్షియల్ మూవీ అంతర్జాతీయ  ఫెస్టివల్ సర్క్యూట్స్ లో 22 చోట్ల ప్రదర్శనకి నోచుకుని,  పది అవార్డులూ పొంది దేశంలో విడుదలై సొమ్ములు చేసుకుంది. ఇలాటి కథ తెలుగు ప్రేక్షకులు నోచుకోకూడదా? వాస్తవ మేమిటంటే, తెలుగు మూస  ప్రేమ సినిమాలు ఎప్పుడో సోదిలోకి లేకుండా పోయాయి. ప్రేమ కథలతోనే  షార్ట్ ఫిలిమ్స్ లో యూత్ ఇంకా ముందుకు పోయి,  తమ తమ టేస్టులేమిటో ప్రపంచానికి చాటుతున్నారు. ప్రేమల్ని తామెలా చూస్తున్నారో చెప్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ని  చూసి కనీసం యూత్ నాడిని పట్టుకోగల్గినా ‘తను నేను’ లాంటి సినిమాలు తీయడానికి మనసొప్పదు. యూత్ ఏం కోరుకుంటున్నారో- ఫీడ్ బ్యాక్, స్టడీ అనేవి సినిమా ఫీల్డు కి లేకపోవడంతో, యూత్ తో మానసిక దూరాలు  పెంచుకుని ఇలాటి మాసికల సినిమాలు తీస్తూ పోతున్నారు.

ఎవరెలా చేశారు
     దివంగత దర్శకుడు, మహేష్ బాబుతో ‘బాబీ’ తీసిన శోభన్ కుమారుడు, సంతోష్ శోభన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పరిచయమవుతూనే ఒక స్టాంప్ వేశాడు. ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా ఎలాటి సన్నివేశంలోనైనా నటించేశాడు. వాయిస్ కూడా బావుంది. ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ ఏదైనా వుందంటే ఇతని నటనే. సినిమాల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే మంచి భవిష్యత్తు గల యంగ్ గ్ యాక్టర్ ఇతను. 
        అవికాగోర్ గ్లామర్ పెద్దగా లేకపోయినా నటించే టాలెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే పాత్రలో పెద్దగా డెప్త్ లేకపోవడం టాలెంట్ కి అడ్డుకట్టలా తయారయ్యింది. రవి బాబు ది ఇల్లు కదలని, కూర్చుని డైలాగులు కొట్టే పాత్ర. ఇతర సహాయ పాత్రల్లో నటించిన వాళ్ళందరూ ఓ మాదిరిగా కన్పిస్తారు.

        సినిమాకి సంగీతం, ఛాయాగ్రహణం మైనస్ గా మారాయి. ఈ లో- బడ్జెట్ సినిమాకి రవీందర్ కళా దర్శకత్వం, మార్తాండ్ వెంకటేష్ కూర్పు వల్ల సినిమాకేం ప్లస్ కాలేదు. 
ఈ  రొమాంటిక్ కామెడీకి పి. రామ్మోహన్ దర్శకత్వం ఏ చమత్క్రుతులూ లేని సాధారణ ధోరణిలో వుంది. పాటల చిత్రీ కరణలో ఇది బాగా బయటపడింది. కథా కథనాలు ఎలావున్నా పిక్చరైజేషన్ నేటి యువప్రేక్షకుల్లో క్రేజ్ సృష్టించగల ట్రెండీ లుక్ తో కూడా లేకపోవడం పెద్ద లోపం.


చివరికేమిటి 
     ఈ రొటీన్ ముక్కోణ ప్రేమ కూడా ఫస్టాఫ్ లో వున్న స్ట్రక్చర్ తో సెకండాఫ్ కూడా వుండాల్సింది. ఫస్టాఫ్ లో ఒక స్ట్రక్చర్ తో ఇంటర్వెల్లో హీరో హీరోయిన్లు విడిపోయే వరకూ సాగి, సెకండాఫ్ మొదలయ్యే సరికి వరసమారిపోయి- పాయింటు మీద ఫోకస్ చెదిరిపోయి- అయోమయంలో, జరక్కూడని సంఘటనల్ని జరిపిస్తూ సాగిపోయారు. అసలు ఇద్దర్నీ విడదీసే పాత్రగా వున్న హీరోయిన్ తండ్రి అకస్మాత్తుగా చనిపోవడం, దీని కొనసాగింపు దృశ్యాలతో కాలక్షేపం చేయడం, ఇంకోసారి ఆ ఇద్దరూ యాక్సిడెంట్ కి గురికావడం,  మళ్ళీ దీని కొనసాగింపు దృశ్యాలతో కాలక్షేపం చేయడం...ఇలా స్పేస్ ని నింపేసుకుంటూ పోయారు. ప్రత్యర్ధి పాత్ర అయిన తండ్రిని చంపేస్తే కథే మవుతుందో ఆలోచించలేదు. సెకండాఫ్ ఒక దిక్కూ దిశా లేకుండా సహనాన్ని పరీక్షించేలా తయారయ్యింది. 

        క్యారక్టరైజేషన్ విషయానికొస్తే, మళ్ళీ హీరో ఇక్కడ కూడా మూస మాస్ సినిమాలో వుండే హీరోలాగా బ్యాడ్ లుక్ తో ఉంటాడు,  తన కెవరూ వుండరు, మాస్ హీరోలాగే ఆవారాగా తిరగాలి కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుని బేవార్సుగా లవ్ అంటూ తిరుగుతూంటాడు.  ఇష్టమొచ్చినట్టు మందు కొడతాడు- దీంతో తను చెప్తున్న మాటలకే విరుద్ధంగా ఉంటాడు. ఎన్నారైలని తిట్టేవాడు తను ఇండియాలో ఎంత బాధ్యతగా వుండాలి? ఇక్కడ తను బాగు పడుతున్న దేమిటి? ఆ ఉద్యోగం చేసే తీరేమిటి? ఉద్యోగం పోతే తొక్కలో ఉద్యోగం  అనడమేమిటి? స్నానం కూడా చేయకుండా కంపు కొడుతూ తిరగడ మేమిటి? ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ఆఖరికి కాంప్రమైజ్ అయి అదే అమెరికాకి వెళ్లేందుకు సిద్ధ పడతాడు...


        తీసేది రొటీన్ పాత ప్రేమే అయినా కూడా దానికీ అర్ధం పర్ధం లేకపోతే ఎలా? చూసే ప్రేక్షకులు తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఎన్నారైలని తిట్టడం ఒక కాన్సెప్టేనా? ఓవర్సీస్ లో మళ్ళీ ఆ ఎన్నారైల కోసమే ఈ సినిమా విడుదల చేయాల్సి రావచ్చు.


        చిన్న సినిమాలని ఇటు క్లాస్ కీ- అటు మాస్ కీ కాకుండా ఇలా ఎన్నాళ్ళు తీస్తారో!
         

-సికిందర్