రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 20, 2015

రైటర్స్ కార్నర్

   
   
కంపెనీ, చక్ దే ఇండియా, బంటీ ఔర్ బబ్లీ , శుద్ధ్ దేశీ రోమాన్స్ వంటి హిట్  సినిమాల రచయిత జైదీప్ సహానీ రాయటర్ వార్తా సంస్థ కిచ్చిన ఇంటర్వ్యూ లో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. అవేమిటో ఈ కింద చూద్దాం..
?  శుద్ధ్ దేశీ రోమాన్స్ ప్రమోషన్ సందర్భంగా మీకూ దర్శకుడు మనీష్ శర్మ కీ అధిక  ప్రాధాన్య మిచ్చారు. అదెలా జరిగింది?
* ఇది మమ్మల్నే ఆశ్చర్య పర్చింది. మాకు తెలియని కొత్త అనుభవమిది. మా మార్కెటింగ్ మేనేజర్లు ప్రొమోస్ లో మా ఇద్దర్నీ ఉపయోగించుకుంటే ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకర్షించ వచ్చని భావించారు. నా దర్శకుడే కాదు, నిర్మాత కూడా రచయితగా నాకింత గౌరవ మివ్వడం నా అదృష్టం..
?   ఏ రచయితనీ ప్రమోషన్ లో ఇంతలా వాడుకోలేదేమో!
నిజమే, ఒక మంచి సాంప్రదాయం ఇలా ప్రారంభమైతే రచయితలకి మంచిదే..
?  నిర్మాతలు రచయితల కివ్వాల్సిన విలువ ఇవ్వడం లేదంటారా?
*   మంచి రచన వల్ల సినిమా ఎంత లాభపడుతుందో తెలిసిన నిర్మాతలు తప్పక రచయితలకి  విలువిస్తారు. ఇది మంచి నిర్మాతలు గుర్తించినంతగా అల్లాటప్పా నిర్మాతలు గుర్తించ లేరు. నేను రాయడం ప్రారంభించిన రోజుల్లో రచయితలకి విలువ లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. ఇప్పుడు చాలా మంది నిర్మాతలే గాకుండా పరిశ్రమలో ఇతరులూ కథా రచనని ఇతర శాఖలతో సమానంగా గుర్తిస్తున్నారు. ఒకప్పుడు సలీం- జావేద్ ల కాలం లో ఈ గుర్తింపూ, స్పృహా ఎక్కువ వుండేవి. తర్వాత కాలంలో ఏమైందో ఏమో కథా రచయితా అతడి రచనా సోదిలోకి లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆదరిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు సినిమాకి రైటరెవరూ అని ఆరాతీస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. ఇక సినిమా రివ్యూలలో నైతే ఇంకా రచయితల గురించి రాయాలన్న ఆలోచన కన్పించడం లేదు..
?  ప్రేక్షకులు దేన్ని కోరుకుంటున్నారో టికెట్ల అమ్మకాలు తెలియజేస్తాయి. అలాటి బ్యాంగ్, ఫ్లాష్ వున్న కథలు మీరివ్వ లేరా?
* సామాన్య ప్రజల గురించి, వివిధ వృత్తివ్యాపకాల్లో వున్న వాళ్ళ గురించీ నేను రాయడాని కిష్ట పడతాను. ఆఫీసు కెళ్ళకుండా, టాయిలెట్ కెళ్ళకుండా, తినకుండా తిరిగే పాత్రల్ని నేనూహించలేను. మన చుట్టూ వుండే  కథల్నే ప్రజల కోసం రాస్తాను. అయితే ప్రేక్షకుల విలువైన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వినోదం గురించి కూడా ఆలోచిస్తాను.
?  అంటే మీరు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తారన్న మాట?
* వాళ్లకి బోరు కొట్టించకూడదు కదా? అదేసమయంలో పాత్రల్నికూడా దృష్టిలో పెట్టుకుంటాను.
?  మీరెక్కువగా రాయరెందుచేత?
* గత పదిహేనేళ్ళలో  ఏడెనిమిది సినిమాలే రాశాను. నా వృత్తిని గౌరవించే వాళ్ళనే ఎంపిక చేసుకుని రాస్తూంటాను కాబట్టి సినిమాల సంఖ్య తక్కువే వుంటుంది. నన్ను గౌరవించక పోయినా లెక్క చెయ్యను- నా వృత్తిని గౌరవించాలి. నేను దర్శకుడిగా మారకపోవడానికి కారణ మీదే..రచనా వృత్తి మీద గౌరవం. పైగా వీలైనంత ఎక్కువ మంది ప్రతిభ గల దర్శకులకి రచన చేసి దాన్ని వాళ్ళెంత థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తారో చూడాలన్న ఆసక్తి నాకెక్కువ!
?  మీరు రాసే విధానం ఏమిటి?  ఎలా ప్రారంభిస్తారు?
* ఒక్కో సినిమాకి ఒక్కో విధంగా వుంటుంది. నాకు సంబంధించినంతవరకూ సినిమా అనేది పాత్రల గురించి వుండాలి, జానర్ గురించి కాదు. ఏదైనా సబ్జెక్ట్ నా దృష్టిని ఆకర్షిస్తే, దానికి సంబంధించిన సమాచారాన్ని పక్కాగా  సేకరించడంలో ఎక్కువ కాలం గడిపేస్తాను. ఈ సబ్జెక్టుల్లో కొన్ని తెరకెక్క వచ్చు, కొన్ని పనికి రాకపోయినా వాటి మీద చేసిన వర్క్ అంతా ఒక మంచి అనుభవంగా మిగిలిపోతుంది. రాయడానికి నాకో టైం టేబుల్ అంటూ వుండదు. చాలా అరుదుగా రాస్తాను. ‘కంపెనీ’ అనే మాఫియా సినిమా కోసం, ‘చక్ దే ఇండియా’ అనే స్పోర్ట్స్ సినిమా కోసమూ ఎంతో రీసెర్చి చేయాల్సి వచ్చింది. ఎంత రిసెర్చి చేయడానికైనా సిద్ధ పడతాను తప్ప, ఎక్కడినించీ కథల్ని మాత్రం దొంగిలించను. నా జీవితంలో ఎవరి దగ్గరా పెన్సిలు కూడా దొంగిలించ లేదు. ‘ఖోస్లా కా ఘోస్లా’  రాయడానికి పెద్దగా కష్ట పడలేదు. నేనూ ఆ సినిమా  దర్శకుడు దిబంకర్ అలాటి వాతావరణంలోనే పెరిగాం గనుక!
?  హీరో హీరోయిన్ల చుట్టూ మీరు కథ లెందుకు రాయరు?
* ఏమో తెలీదు. పాత్రలంటే నాకు కక్కుర్తి ఎక్కువ కావడం వల్లనేమో. కొత్త కొత్త తరహా పాత్రలకోసం కక్కుర్తి పడతాను. వివిధ యాసల కోసం కూడా కక్కుర్తి పడతాను. రైటర్ కిది సహజం. పాత్రల కక్కుర్తి, యాసల కక్కుర్తి, భిన్న జారుల- ఆర్ధిక గ్రూపుల కక్కుర్తీ ఇదంతా ఏటో తీసికెళ్ళి పోయి నా చేత రాయిస్తున్నాయి. నా దృష్టిలో మెయిన్ స్ట్రీమ్  కమర్షియల్ సినిమాలు  నాటు మోటు సినిమాలు. ఈ ట్రాప్ లో పడకుండా కథలో ఎదురయ్యే ప్రతీ మెయిన్ స్ట్రీమ్ ఘట్టాన్నీ నా కక్కుర్తులతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాను.
?  రాయడంలో మీకెదురయ్యే అతి కష్టమైన పార్టు ఏది?
* ఏదీ లేదు. నిజానికి నాకు నచ్చని మరొకరి కథ మీద పనిచేయడమే కష్టమైన పార్టు. కథ
బావుంటే అందులో కష్టమైన పార్టు అంటూ ఏమీ వుండదు.

?  రచయితలకి మంచి పారితోషికాలు లభించక పోవడం పై మీరేమంటారు? మీరెలా డిమాండ్ చేస్తారు?
చెప్పడం కష్టం. నిర్మాతలతో ఎవరికీ వాళ్ళు మాట్లాడుకోవాలి. మన అలవాట్లు, ఖర్చులు తగ్గించుకుంటే పెద్దగా డిమాండ్ చేసే అవసరం రాకపోవచ్చు. మనం రాజాలా బతకాలనుకుంటే డిమాండ్ చేయవచ్చు. కానీ మనం రాజాలా బతకడం కోసం ఎవరూ భారీ పారితోషికా లివ్వరు. నా కలాటి భారీ ఆశలేం లేవు- నా భారీ ఆశలల్లా పాత్రల కోసమే వుంటాయి, నాకోసం నేను ఆశలు పెట్టుకోను.
?  హిందీ సినిమాలకి సెకండాఫ్ శాపం అనేది వెన్నాడుతూనే వుంది కదా - ఒక గొప్ప అయిడియాతో మొదలైన కథ సెకండాఫ్ కొచ్చేసరికి దారితప్పి గందరగోళం అవుతోంది- రచయితగా మీరెలా ఎదుర్కొంటారు దీన్ని?
అది సెకండాఫ్ శాపం కాదు, ఇంటర్వెల్ శాపమనాలి దాన్ని. కొన్ని రకాల సినిమా కథలకి ఇంటర్వెల్ అడ్డంకి గా మారుతుంది, ‘రాకెట్ సింగ్’ లో లాగా. ఒక మూడ్ ని క్రియేట్ చేయాలనుకుంటాం...ఆత్మావలోకనం చేసుకునే మూడ్...ఇంటర్వెల్ తర్వాత అదే మూడ్ ని రీక్రియేట్ చేసి ముందుకు కొనసాగుతాం..దీనికి ఇంటర్వెల్ శాపం. ఇంటర్వెల్ లేకపోతే  ఏ సమస్యా లేదు.
?   శుద్ధ్ దేశీ రోమాన్స్ లాంటి కథ ఎలా రాశారు?
 
* రోమాన్స్ తో నా కెక్కువ అనుభవం లేదు. బంటీ ఔర్ బబ్లీ లో కూడా వున్నది ప్రేమ కథ అని
నేననుకోను. ఇంటర్వెల్ సమీపిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు ఫీలవడం మొదలెడతారు. అప్పుడు నేను ఇంటర్వెల్ రాసేసి పారిపోయాను- ఎందుకంటే దాన్ని డీల్ చేయడం నావల్ల కాలేదు. ఏదో ఒక సమయంలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారని నాకు తెల్సు. అందుకని వాళ్ళని ఫోర్సు చేయలేదు. నా పాత్రల్ని నేను ఫోర్స్ చేయను. చాలా లైట్ టచ్ లో ఉంచుతాను. ఈ కోణంలో చూస్తే ఇదే  నా మొదటి రోమాంటిక్ సినిమా అవుతుంది. అది బావుందా లేదా నాకైతే తెలీదు.
?  మరి ఏ రకమైన ప్రేమకథ మీరు చెప్పాలని ప్రయత్నించారు?
* రోమాంటిక్ కామెడీ రాయడం అనవసరమని నా అభిప్రాయం. నాకు తెలిసి అన్ని రోమాన్సులలోనూ కామెడీయే అంతర్లీనంగా వుంటుంది. ప్రత్యేకంగా రాయనవసరం లేదు. రోమాంటిక్ కామెడీ అనే మాటకే అర్ధం లేదు. కానీ మన దేశంలో  గత పది పదిహేనేళ్ళుగా రిలేషన్ షిప్స్ ని యూత్ చూస్తున్న తీరు పూర్తిగా మారిపోయింది. ముందు తరం వాళ్ళకంటే ధైర్యం చేసి వుంటున్నారు. ఒకటి కాకపోతే ఇంకోటిగా నాల్గైదు రిలేషన్ షిప్స్ తో కూడా ఎక్కడో అక్కడ స్థిర పడ్డం లేదంటే,  వాళ్ళు ఇంకా ఇంకా బెటర్ ని ట్రై చేసి చూద్దామని అనుకుంటున్నట్టే. ఒక పట్టణానికీ మెగా సిటీకీ తేడా ఏమిటంటే, యూత్ పట్టణ సాంప్రదాయ జీవితాన్ని కలిగి ఉంటూ మెగా సిటీ ఆధునికతతో నిత్యం సంఘర్షిస్తూ వుంటారు.  మన కల్చర్ తో మనం చాలా హిపోక్రసీ తో వుంటాం కదా, ఈ యూత్ వచ్చేసి నీరు పల్ల మెరుగు అన్నట్టు తమ దారి తాము వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు.                                                                             *




Friday, April 17, 2015

సహజీవన ప్రశ్న!

రచన – దర్శకత్వం : మణిరత్నం
తారాగణం : దుల్ఖేర్ సల్మాన్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, లీలా శ్యాంసన్  తదితరులు
మాటలు : కిరణ్, సంగీతం : ఏ ఆర్ రెహమాన్,  పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఛాయాగ్రహణం : పిసి శ్రీరాం, కూర్పు:  శ్రీకర్ ప్రసాద్,  కళ : శర్మిష్ఠా రాయ్,  నృత్యాలు : బృంద
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్,   నిర్మాత :  దిల్ రాజు
విడుదల :   17 ఏప్రెల్ 2015   సెన్సార్ :      u/a
***
       మర్షియల్ సినిమా కళాత్మకంగా ఉండడాన్ని చూసి ఎన్నాళ్ళవుతోంది? ట్రెండీ మూవీస్  పేరుతో  చిత్ర విచిత్ర కెమెరా యాంగిల్సూ, ఎడిటింగ్ విన్యాసాలూ, నేపధ్య శబ్ద ఫలితాలూ పోగేసుకుని సారం లేని ఫాస్ట్ ఫుడ్ చందాన హోరెత్తిస్తున్న- మనసుకీ కంటికీ శ్రమ కల్గిస్తూ విషయం తక్కువ రొద ఎక్కువ ఖర్మాన పడిపోతున్న- భారతీయ సినిమాకి ఓ స్పీడ్ బ్రేకర్ వేస్తూ మూలాల్ని గుర్తుచేసే సినిమా ఒకటి వస్తుందని  కలలుగనే ఆశాజీవులది అత్యాశ అసలు కాబోదు, నిశ్చయంగా నిజమయ్యే కలే. కాకపోతే ఇలా కలలు గనే వాళ్ళు తరం మారి సినిమాలని ఎప్పుడో మర్చిపోయారు. ప్రస్తుత తరానికి ఇలాటి కలల గొడవే లేదు- కళాత్మకత, రసాస్వాదన లనేవి వాళ్లకి ఎప్పుడో అపరిచిత, అస్పృశ్య వస్తువులై పోయాయి గనుక! ఈ రెండు వర్గాల యోగ్యతలతో పనిలేకుండా మనం మణిరత్నం మోసుకొచ్చిన ఈ నయా నజరానా వైపు ఓసారి దృష్టి సారిస్తే, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకసారి ఉద్ఘాటించినట్టు,  తమిళ సినిమాలు ఎక్కువ కళాత్మకంగా వుంటున్నాయన్న వాస్తవం మరోసారి నిజమవుతూ  ఇలా సాక్షాత్కరిస్తుంది!

     దేశంలో సీనియర్లలో మిగిలిన ఏకైక కళాత్మక దర్శకుడు మణిరత్నమిప్పుడు. ఆరుపదులు దగ్గర పడుతున్నా అజ్ఞాతంలోకి జారుకోకుండా, ఎప్పటికప్పుడు సినిమా యూనిక్ సెల్లింగ్ పాయింటుని అన్వేషిస్తూ, లక్ష్యిత ప్రేక్షకుల్ని నిర్దేశించుకుంటూ, పరిశ్రమిస్తున్న ఏకైక సినిమా దర్శకుడు. ఐతే ఈ స్థాయి దర్శకుడు ఇంకా ప్రేమకథల చట్రంలోనే  విజయాల్ని వెతుక్కునే దశలో మిగిలిపోయిన మాట కూడా వాస్తవమే - రాంగోపాల్ వర్మ ఇంకా చిన్నా చితకా హార్రర్  సినిమాల్లోనే తన సర్వస్వాన్నీ ధారబోసుకుంటున్నట్టు! ఐతే ఒకటి- మణిరత్నం మరోసారి యువ ప్రేమకథనే  తనదైన శైలిలో కళాత్మకంగా చెప్పాలనుకున్నప్పుడు, తన సీనియారిటీ ప్రకారం  విషయపరంగా నిరాశపర్చకుండానూ  చూసుకోవాల్సి వుంటుంది. నేటితరం యువప్రేక్షకుల ఆట స్థలంలోకి తను రావొచ్చు గానీ, ఆ వచ్చినప్పుడు కొత్త దర్శకుడిలా  సేఫ్ జోన్ చూసుకుంటూ రానవసరం లేదు. ఇప్పుడు యువ ప్రేమకథలో మణిరత్నం అనే మహా దర్శకుడు ధైర్యంగా ఏం చెప్పబోతున్నట్టు? అన్నదే చర్చనీయాంశ మౌతుంది- మిగతా కళాత్మక విలువలు సరే!


     నిజంగానే ఈ సినిమా యూనిక్ సెల్లింగ్ పాయింట్ హీరో హీరోయిన్లు దుల్ఖేర్ సల్మాన్- నిత్యా మీనన్ ల జంట. ఈ జంట ఇప్పటికే మూడు విజయవంతమైన సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుత్తం మణిరత్నం తో నాల్గో సినిమా. ‘ఉస్తాద్ హోటల్’ కి మూడుజాతీయ అవార్డులు కూడా లభిస్తే, మిగిలిన రెండూ  ‘బెంగళూరు డేస్’, ‘100 డేస్ ఆఫ్ లవ్’ పాపులర్ సినిమాలుగా ఖ్యాతి కెక్కాయి. మూడేళ్ళ లోనే  రికార్డు  స్థాయిలో 17 సినిమాల్లో నటించిన దుల్ఖేర్ సల్మాన్ మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి కుమారుడు.


     సల్మాన్- నిత్యాల మధ్య రోమాంటిక్ కెమిస్ట్రీ, కమిట్ మెంట్ ఎలర్జీ ప్రధానంగా సాగే ఈ ప్రేమ కథలో అసలేం వుందో ఇప్పుడు చూద్దాం...

సహజీవన సారం !
     ముంబాయి లోని ఛత్రపతి రైల్వే టెర్మినస్ లో మొదలౌతుంది సినిమా. ఆదిత్య కంఠమనేని  అలియాస్ ఆది ( దుల్ఖేర్ సల్మాన్ ) అప్పుడే ట్రైన్ దిగుతూ అవతలి ప్లాట్ ఫాం మీద ఆత్మహత్య చేసుకోబోతున్న తార ( నిత్యామీనన్) ని చూసి కేకలేస్తాడు. టెన్షన్ తో ఈ ఎపిసోడ్ గడిచాక, ఓ చర్చిలో పెళ్ళిలో తారసపడతారు తిరిగి. అక్కడ సైగల భాషతో సన్నిహితులవుతారు. తార జాబ్ చేస్తూంటుంది. పారిస్ వెళ్లి ఆర్కిటెక్చర్ కోర్సు చేసేందుకు సమాయత్తమవుతూంటుంది. ఆది వీడియో గేమ్స్ ఇండస్ట్రీలో చేరేందుకు ముంబాయి వచ్చాడు. ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని, తను ప్రతిపాదించిన యాక్షన్ ఓరియెంటెడ్  వీడియో గేమ్ కాన్సెప్ట్ ని ఆరు వారాల్లో రూపొందించే ఛాలెంజిని స్వీకరిస్తాడు. తార హాస్టల్లో వుంటే, తను గణపతి అంకుల్ ( ప్రకాష్ రాజ్) ఫ్లాట్ లో పేయింగ్ గెస్ట్ గా చోటు సంపాదించు కుంటాడు. గణపతి భార్య భవానీ ( ఇటీవలే రాజీనామా చేసిన కేంద్రీయ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లీలా శ్యాంసన్ )కి జ్ఞాపక శక్తిని  కోల్పోయే అల్జిమీర్స్ జబ్బు వుంటుంది. కానీ శాస్త్రీయ సంగీతమనే వ్యాపకం ఒకటి ఉండడంతో ఆ లోకంలో వుంటుంది. వంటపనంతా గణపతే చూసుకుంటూ ఉంటాడు. ఆమె ఎక్కడికో వెళ్ళిపోయి తప్పిపోతే వెతుక్కొచ్చే పనికూడా అప్పుడప్పుడు చేస్తూంటాడు.

     తారకి పారిస్ స్వప్నం ఎలాగో, ఆదికీ అమెరికా వెళ్లి స్టీవ్ జాబ్స్ అయ్యే కల అలాగ. గమ్యాలు రైలు పట్టాల్లాగా వున్నా, ఆలోచనలు ఒకలాగే వున్నాయి. ఇద్దరికీ కమిట్ మెంట్ ఎలర్జీ వుంది. ప్రేమ సరే గానీ, పెళ్ళే బోరు. ఆమె పారిస్ కీ, అతను యూఎస్ కీ వెళ్ళే లోగా లవర్స్ గా గడిపేసి, వీలయితే సహజీవనం కూడా చేసేసి, ఎవరి దారిన వాళ్ళు దులుపుకు వెళ్లి పోవడానికి పెద్దగా అభ్యంతరాలేమీ వుండవు. ఈ నేపధ్యంలో తను వుంటున్న గణపతి ఫ్లాట్ లోనే తనగదిలోకి తెచ్చేసుకుంటాడు తారని ఆది. ముందు  గణపతి ఛీ ఛా అన్నా, తార  ఎంచక్కా భవానీ ఆంటీ తో కూర్చుని కీర్తనలు పాడేసరికి ఐసయి పోతాడు గణపతి. అలా కాంట్రాక్టు శృంగారంలో మునిగితేలుతున్న వీళ్ళ ఫ్లాట్ కి ఆది అన్న కుటుంబంతో సహా చూసి వెళ్ళడానికి వచ్చేస్తాడు.

          ఇక్కడ్నించీ అలా అలా అప్పుడొకటీ అప్పుడొకటీ వీళ్ళు దొరికిపోయే సంఘటనలు ఎదురవుతాయి. ఆది వదిన విషయం పసిగట్టి, పెళ్లి చేసుకోకుంటే బ్యాగు సర్దుకో అని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇస్తుంది తారకి. తారకి ఇంకో ఇబ్బంది వుంది. కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తలైన తల్లి దండ్రులున్నారు. వాళ్ళతో పడక తన దారి తను చూసుకున్నా- పెళ్ళంటూ తల్లి వదలడం లేదు. తార వ్యవహారం ఆమెకీ తెలిసిపోయి ఆది ని ఇబ్బందులకి గురిచేస్తుంది. అన్నతో కూడా ఆదికి ఇబ్బందులున్నా ఇవేనీ పెద్ద సమస్యలు కావు. తన ప్రాజెక్టు పూర్తి చేసి యూఎస్ వెళ్ళేఛాన్సు  కొట్టేసినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు ఇద్దరూ విడిపోక తప్పని పరిస్థితి- విదిపోయారా??ఏం చేశారు? ఆది యూఎస్ వెళ్ళడానికి తార ఒప్పుకుందా? ఏం చేసింది? – ఈ ప్రశ్నలే రాబోయే క్లయిమాక్సుకి పెట్టుబడులు...

ఆకర్షణలు అనాకర్షణలు
     సినిమాకి ప్రధానాకర్షణ మొదటే చెప్పుకున్నట్టు సల్మాన్- నిత్యా లు. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ  ఎలాటి అరమరికల్లేకుండా అత్యంత సహజంగానే బాగానే వర్కౌట్ అయింది. ఇది రోమాంటిక్ కెమిస్ట్రీ సంగతి. కమిట్ మెంట్  ఎలర్జీ ఎలా వర్కౌట్ అయ్యిందో తర్వాత చూద్దాం. ఇది సున్నిత ప్రేమ- కామ ( పాత్రలే ఇలా మాట్లాడకుంటాయి) కథ కావడంతో మణిరత్నం  వీళ్ళ మధ్య ఆ సున్నితత్వాన్ని చెక్కు చెదరకుండా చివరంటా సమర్ధవంతంగా కాపాడుకొ చ్చాడు. తెలుగు ప్రేక్షకులు నిత్యా మీనన్ ని ఇదివరకే కొన్ని సినిమాల్లో చూసేశారు. కొత్తగా చూస్తున్నది సల్మాన్ ని. ఇతను సాధారణ లవర్ బాయ్ పాత్రని హెచ్చుతగ్గుల్లేని సాఫీతనంతో సరదాగా పోషించుకొచ్చి తప్పక తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఉంటాడు. అయితే ఇంతా చేసి ఇతను ఈ ఒక్క సినిమాతో తెలుగులో వచ్చి పోయే మలయాళ నటుడే కాబట్టి పెద్దగా ఆశలేం పెట్టుకోలేరు.

     ప్రకాష్ రాజ్ మరోసారి డౌన్ ప్లే చేసిన సగటు భర్త పాత్రలో ఒదిగిపోయి సహజత్వాన్ని తీసుకొస్తే, అంతే ఉత్తమంగా అల్జిమీర్స్ వ్యాధిగ్రస్తురాలి పాత్రలో లీలా శ్యాంసన్ ని చూడొచ్చు. ఇతరపాత్రల్లో వచ్చీపోయే నటీనటులు మణిరత్నం మార్కుని దృష్టిలో పెట్టుకునే నటించారు.

          ఏఆర్ రెహమా నెందుకో ఈ రోమాంటిక్ కథకి తగ్గ హుషారయిన సంగీతాన్ని అందించలేకపోయాడు. ఇది చాలా బ్యాడ్. పాత్రలు ఫాస్ట్ గా, అల్ట్రా మోడరన్ గా వుంటే సంగీతం స్లోగా ఎలా వుంటుంది? సంగీతాన్నిఎంచుకోవడం పూర్తిగా దర్శకుడి బాధ్యతే / టేస్టే కాబట్టి సంగీత దర్శకుణ్ణి ఏమనలేం. ఒక సినిమాకి సంగీతం కోసం రెహమాన్ నెలల తరబడీ కృషి చేసిన  సందర్భాలున్నాయి. తాజాగా ఇరానియన్ దర్శకుడు మజీద్ మజీది తో ఏడాదిన్నర కష్టపడితే గానీ ఆ సినిమాకి అంత మంచి  సంగీతం రాలేదు. మణిరత్నం తో రెహమాన్ మ్యూజిక్ అంటే ఉండాల్సిన కిక్ లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒక్క మొదటి పాట మాత్రమే క్యాచీగా వుందంటే అదీ సినిమాలో పూర్తిగా వుండదు. ఈ పాటకి ఎడిటింగ్ గిమ్మిక్కులు మినహాయిస్తే, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిగతా భాగాన్ని క్లాసిక్ లుక్ కి అనుమతించాల్సిన  ఎడిటింగ్ పరిమితుల్ని దాటిపోలేదు. కళా దర్శకత్వం, నృత్యదర్శకత్వం ఇత్యాది  విభాగాలూ పరిపూర్ణతని తీసుకొ చ్చినవే - పీసీ శ్రీరాం కెమెరా పనితనంతో సహా. దర్శకుడిగా- టెక్నీషియన్ గా మణిరత్నం దృశ్యాత్మక పరిణితి నుంచి ఈసారి కూడా జారిపోలేదు. ఈసారి కూడా దర్శకుడిగా మణిరత్నం చెరిగిపోని తన సంతకంతో మెస్మరైజ్ చేశాడు సందేహం లేదు, కానీ కథకుడిగానే.. కథకుడిగానే..కథకుడిగానే....

స్క్రీన్ ప్లే సంగతులు
    వివాహేతర సహజీవనాన్ని కోర్టులు ఆమోదించి కొన్ని రక్షణలు కూడా కల్పించాయి. కాబట్టి ఇది అనైతికం అనడానికి వీల్లేదు. మైనారిటీ తీరిన యువతీ యువకుల జీవన శైలి వాళ్ళిష్టం. వివాహేతర సహజీవనం అదొక జీవన శైలి. ఇంతవరకూ ఫర్వాలేదు. మణిరత్నం తన కథలో ఈ జీవనశైలిని  వివాదాస్పదం చేయదల్చుకో లేదు. హీరో హీరోయిన్ల ఈ రకమైన జీవన శైలితో ఇతర పాత్రలకి తంపులు పెట్టి తమాషా చూసే నాసిరకం చిత్రణలకి పాల్పడలేదు. ఈ జీవన శైలితో హీరో హీరోయిన్లు వాళ్లకి వాళ్ళే సమస్య అయిపోయినట్టు చూపించు కొచ్చాడు. కానీ అలాటి సమస్య అప్పుడెందుకు  పుట్టాలో, పుడితే జీవితాలేమవగలవో ప్రమాద ఘంటికని మోగించి మణిరత్నం అన్పించుకోకుండా- పైపైన అంతా బానేవుంది చల్తాహై, ఓకే ప్రొసీడ్ అన్నట్టుగా చాలా ఈజీగా తీసుకున్నాడు. ఒక సీనియర్ గా ఇది తగునా? కొత్త కుర్ర డైరెక్టరూ తనూ ఒకటేనా? తెలిసీ తెలీక  ప్రేమల్లో పడితేనో, లేదా అసలు టీనేజీ ప్రేమలే ప్రమాదమనో అంతేసి పెద్ద లెక్చర్లిస్తూ పుంఖాను పుఖాలుగా సినిమాలే తీస్తున్నప్పుడు- తెలిసీ తెలీక సహజీవనానికి సిద్ధపడే ఈ  సినిమాల్లో బాపతు హీరో హీరోయిన్ల లాంటి వాళ్లకి అలాటి ముందు జాగ్రత్తే చెప్పకపోతే- ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నట్టు? ఫర్వాలేదు, ముందు సహజీవనం చేయండి-  తర్వాత ప్రేమపుడితే పెళ్లి చేసుకుందురు గాని-అనేనా? మణిరత్నం ఏమరుపాటుగా ఇచ్చేస్తున్న ఈ రకం అపరిపక్వ సందేశాన్ని బాగా అర్ధం జేసుకోవాలంటే, ఈ కథ ముగింపుని కూడా చెప్పేయాల్సి వుంటుంది తప్పదు!

Spoiler ahead!
          స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. దృశ్యపరంగా చూసేందుకు కథలే బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్యతో  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది.

          ప్రస్తుత సినిమాతో జరిగిందిదే. ఇది కథ కాదు, గాథ!

          ఈ స్క్రీన్ ప్లే ఇలా వుంది ..హీరో హీరోయిన్లు పరిచయమయ్యారు, స్నేహితులయ్యారు, తలో దేశంలో తమతమ ప్లాన్స్ గురించి మాటాడుకున్నారు, పెళ్లి గురించి అభిప్రాయాలు చెప్పుకున్నారు, విదేశాల్లో ప్లాన్సే ముఖ్యంగాబట్టి పెళ్ళీ గిళ్ళీ జాంతానై అనుకున్నారు, ఇక్కడ ఉన్నన్నాళ్ళూ సహజీవనం చేసి- తర్వాత ఎవరి దేశం పట్టుకుని వాళ్ళు వెళ్లిపోదా మనుకున్నారు, మకాం పెట్టారు, బంధువులతో చిన్న చిన్న దాగుడు మూతలాడుకున్నారు, పెద్దల పెళ్లి ప్రయత్నాలని తిప్పి కొట్టారు, ఇంతలో హీరో కి యూఎస్ వెళ్ళే టైమొచ్చింది, హీరోయన్ చిన్న బుచ్చుకుంది, చిర్రుబుర్రులాడింది, ఏమంటే ప్రేమ పుట్టింది, అతను వెళ్ళిపోతే తట్టుకోలేదు, అతను వెళ్లి తీరాలి, ఈ సమస్యతో కాసేపు గింజుకోవడాలు, ఎవరూ ప్లాన్స్ ని డ్రాప్ చేసుకోవద్దు- ఇద్దరం పెళ్లి చేసుకుందాం- నువ్వు పారిస్ కి నేను యూఎస్ కి వెళ్దాం అన్నాడు హీరో, మళ్ళీ హీరోయిన్ గుంజాటన, హీరోకి జంజాటం,  చివరికి సరే పెళ్లి చేసుకుందాం...అనేసి గంతులేసి అతణ్ణి పెళ్లి చేసుకుని హమ్మయ్యా అనేసుకుంది హీరోయిన్! 




         ఇంతే! సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకూ కథ ప్రారంభం కాదు. అంతవరకూ బిగినింగ్ విభాగం హీరో హీరోయిన్ల అంతులేని చిలిపి చేష్టలతో సాగుతూనే వుంటుంది. యాభై నిమిషాలకి సహజీవనం ప్రస్తావన తెచ్చి ప్రారంభమౌతుంది కథ. ఇలాసహజీవనం అనే సమస్యని ఏర్పాటు చేసుకుని  మిడిల్ లో పడిన కథ లో వెంటనే సంఘర్షణ- హీరో అన్న కుటుంబం రాకతో ప్రారంభమైనట్టు హాస్య ధోరణిలోనే చూపించి విశ్రాంతి వేశారు. విశ్రాంతి  ఘట్టం కథకి సంబంధించి చెప్పడానికి ఏ విషయమూ లేక ముగియగానే- ద్వితీయార్ధం భారీగా యాక్షన్ సీన్ తో ప్రారంభమౌతుంది!


          మణిరత్నం తను తయారు చేసుకున్న ప్రధాన కథలో వాడీ  వేడీ  వెయిట్ కూడా లేదని గమనించడం వల్లనో  ఏమో- సినిమా ప్రారంభంలో టైటిల్స్ పడుతున్నప్పుడు సినిమా జానర్ తో సంబంధంలేని యాక్షన్ విజువల్స్ తో క్రిమినల్స్ వేటగా భారీ ఎత్తున యానిమేషన్ చూపించినట్టుగానే- మళ్ళీ దీన్నే ఇంటర్వెల్ తర్వాత వెంటనే వేరే దృశ్యాలతో మరింత స్థాయి పెంచుకున్న యాక్షన్ యానిమేషన్ రెండుమూడు నిమిషాలు వేశారు. దీంతో ప్రేక్షకులకి అసలు కథలో లేని థ్రిల్ భర్తీ చేసినట్టవుతుందని భావించినట్టుంది. ఈ రెండు యానిమేషన్సూ హీరో రూపొందించే వీడియో గేమ్ తాలూకు విజువల్స్ అన్నమాట! పనిగట్టుకుని వీటిని ఏదో  జరిగిపోతోందన్నట్టు  వైడ్ స్క్రీన్ లో వేసి హడావిడి చేశారు- తాటాకు చప్పుళ్ళ లాగా!

          కథ మిడిల్లో పడ్డాకైనా ద్వితీయార్ధంలో సమస్య తాలూకు సంఘర్షణని పెంచకుండా, ఎక్కడా ప్రేక్షకులు ఎదురుచూసే సంఘర్షణ అనేది పుట్టించకుండా-ఇంకా హీరో హీరోయిన్ల స్వీట్ నథింగ్స్ తోనే  సహనపరీక్ష పెట్టారు. ఇలా సాగుతున్న మిడిల్ ని కూడా విషయంలేకుండా ముగిస్తూ- హీరో అమెరికా ప్రయాణపు కథనం తో ఎండ్ విభాగానికొచ్చేశారు. అంటే క్లయిమాక్స్ కొచ్చేసిందన్న మాట కథ. ఇంకేముంది హీరోయిన్ అలగడాలు, అదేమంటే ప్రేమ పుట్టినట్టు చెప్పడాలు, హీరో నచ్చ జెప్పడాలు, చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకుని చెరో దేశం వెళ్ళిపోవడానికి నిశ్చయించు కోవడంతో, హీరోయిన్ అలక తీరి సుఖాంతం చేయడాలూ... ఇంతే! ఈ మాత్రం దానికి పెద్ద అల్ట్రా మోడరన్ అర్బన్ క్యారక్టర్స్ లా,  లివ్ ఇన్ రిలేషన్ షిప్ బిల్డప్పులతో మొదట ఆ మాట లెందుకో? ఇదంతా ఎవర్నో అనుకరించబోయిన చేతకాని తనంగానే తేలింది.
           
          స్క్రీన్ ప్లే సంగతులు ఈ తీరున వుంటే- మొత్తం దీని కాన్సెప్ట్ విషయానికి వస్తే-

          దర్శకుడు ఎంతసేపూ వీళ్ళిద్దర్నీ పెళ్లి వైపు డ్రైవ్ చేసి భారతీయ విలువలు  చాటడానికే తాపత్ర యపడుతున్నాడని స్పష్టమౌతూనే వుంటుంది మొదట్నించీ. ఇందుకు బ్యాక్ డ్రాప్ లో అంతటి దుర్భర స్థితిలోనూ గణపతి- భవానీల అన్యోన్య దాంపత్యాన్ని సింబాలిక్ గా చూపిస్తూ హీరో హీరోయిన్లకి ఆలోచనలు రేకెత్తిస్తూనే ఉంటాడు. నిజానికి ఈ సహజీవన ప్రహసనం లో వున్న ప్రశ్న వీళ్ళిద్దరికీ ఎలాగో పెళ్లి జరిగిపోవడం గురించి కాదు. అస్సలు కాదు. ఎందుకంటే, సహజీవన ఏర్పాటులో ప్రేమ అనే మాటకి తావుండదు. ఆర్ధికంగానో శారీరకంగానో పరస్పరం  అవసరాలు తీర్చుకుంటూ కెరీర్ చూసుకునే తత్త్వం తోనే కలిసి జీవించడం జరుగుతుంది. ఆర్ధికంగా సరిపడ నప్పుడు, శారీరకంగా సరదా తీరిపోయినప్పుడు ఎవరిదారి వాళ్ళది. మరొకళ్ళతో మరో సంబంధంతో మరో మకాం, అంతే. ప్రేమకి, ఎమోషన్స్ కీ తావుండదు. ఈ రెండూ ఈ బాపతు సహజీవనానికి ప్రతిబంధకాలే. ఈ సంబంధంలో ఒకరికి ప్రేమ పుడుతోందంటే ఆ సంబంధం బీటలు వారుతున్నట్టే. ప్రేమ ఆ బంధానికి ప్రమాద హెచ్చరిక చేస్తుందన్న మాట! ప్రేమ ఇద్దరికీ పుడితే సరే. పెళ్లి జరిగిపోవచ్చు. కానీ పుట్టాలని నియమం లేదు, పుడుతుందని గ్యారంటీ లేదు. ఒకరు వ్యతిరేకిస్తే, ఒప్పందం ప్రకారం వదిలేసి వెళ్ళిపోతే రెండో వ్యక్తి పరిస్థితి ఏమిటి? ఈ రెండో వ్యక్తి అమ్మాయే అయితే ఏం చేస్తుంది? అతడి మీద  ప్రేమని చంపుకోలేక ఎలా బ్రతుకుతుంది? ఇంకెవర్ని పెళ్లి చేసుకుని సుఖ పడుతుంది? లేదూ వదిలేసిన వాడి కోసం ఎంత అల్లరి పాలవుతుంది? అతడి మీద చీటింగ్ కేసు పెడుతుందా? రేప్ కేసు పెడుతుందా? నష్ట పరిహార కేసు పెడుతుందా? మనోవర్తి డిమాండ్ చేస్తుందా? ఇదంతా ముంబాయి లాంటి అర్బన్ సెటప్ లో నడుస్తున్న చరిత్రే! కోర్టు లకీ,  కాకపోతే  నడి బజారుకీ ఎక్కుతున్న వ్యవహారాలే!

           కనుక ఈ వాస్తవ దృక్పథంతో మణిరత్నం- హీరోయిన్ కి ప్రేమ పుట్టినప్పుడు అక్కడ్నించీ కథని తన గుప్పిట పట్టుకుని-హీరో ని ప్రత్యర్ధిన గా చేసి- అతడి మీద హక్కుల పోరాటంగా హీరోయిన్ సంఘర్షణ ని తీవ్రతరం చేసి- ఆర్గ్యుమెంట్ తో ఒక బర్నింగ్ ఇష్యూగా చేసి- ఇలాటి సంబంధంలోకి వెళ్ళే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకోవాలి సుమా, ఆనక తగుదునమ్మా అని ప్రేమిస్తున్నానంటే జీవితం ఏమంత బావుండక పోవచ్చు,  తస్మాత్  జాగ్రత్త అని హెచ్చరిక చేసి వదిలేసి వుంటే- దటీజ్ మణిరత్నం అన్పించేది!

          అనాలోచితంగా ప్రేమలో పడ్డం, అనాలోచితంగా సహజీవనం చేయడం ఒక్కటే!  


—సికిందర్ 

         

         
         



















Sunday, April 12, 2015

ఆనాటి సినిమా


          మేఘం తమిళనాడు నుంచి అలా అలా తేలుతూ వచ్చి వాలింది. వాన మేఘాలు కేరళ నుంచొస్తాయి. ఇది వాస్తు మేఘం. అందులో తెల్లగా మెరుస్తూ ఏవో అక్షరాలూ. ఏమిటా అని పరీక్షగా చూస్తే  అది దర్శకుడి పేరు! ఇదేదో డిఫరెంట్ గా వుందే  న్యూ వేవ్ గా.. అని ఫ్రీజై, వాస్తు మారిపోయిన ఆ వాల్ పోస్టర్ డిజైన్ పై భాగం కేసే తెలుగు ప్రేక్షకుల క్రేజీ లుక్స్.. ‘మన్మధలీల’ ఆ సినిమా...కె. బాలహందర్ ఆ దర్శకుడు!
న్యూవ్ వేవ్ ప్రయోగాలతో నిత్య పథికుడతను!


          దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారే గానీ, ఆ పేరుని కాస్త క్యాప్షన్ లో పెట్టి గౌరవించు కోవాలని అప్పటిదాకా ఎవరికీ తట్టలేదు, బాల చందర్ కి తప్ప!
          పోస్టర్ల అడుగున ఇతర సాంకేతికుల పేర్ల వరసలో ఇరుక్కున్న దర్శకుడి పేరుని అమాంతం పైకి లాక్కొచ్చి , నింగిలో ప్రతిష్టించిన వాడు కైలాసం బాలచందర్. ఇంటి పేరులోనే ఊర్ధ్వ ముఖ యానం ఉన్నాక, అది పోస్టర్లో నూ ఉండాలన్న ఆలోచన రాకపోతుందా? ఇది తర్వాత తెలుగులోనూ ప్రముఖ దర్శకులకి మాస్ కాపీయింగ్ వనరు అయిపోయిన సంగతి తెలిసిందే.
          బాల చందర్ బ్రెయిన్ చైల్డ్ ప్రభావం అలాంటిది...
          కొత్తాలోచన, కొత్త పంథా అతడి కళలు. ఫ్రేముల్ని ప్రేమించడానికి మనకి బాపు ఎలాగో  తమిళులకి బాల చందర్ అలాగ. కళ్ళజోడు ఫ్రేముల్లోంచి కెమెరా కూడా పట్టుకోలేని ప్రతీకల ప్రహేళికలు, పాత్రల ప్రస్థానాలు, మనస్తత్వాల మదింపులు.. నాటక రచయితగా ప్రారంభమయ్యాడు. సినిమాల్లోకి వచ్చాడు. ఎమ్జీఆర్, ముక్తా శ్రీనివాసన్ ల వంటి పాపులర్ హీరోలకి అప్పట్లో మాస్ డైలుగులు రాశాడు. తను డైరెక్టర్ అయ్యేటప్పటికి దీనికి భిన్నమైన పంథా పట్టుకు పోయాడు. అదే మాస్ మసాలా కి దూరంగా న్యూవేవ్ పంథా!  కమర్షియల్ సినిమాలతో హీరోల ఏలుబడిలో హీరోయిన్లకి విలువ లేకుండా పోవడం చూశాడు. అప్పుడు మధ్యతరగతి జీవితాల్ని సున్నితంగా తడిమి, ఒకటొకటిగా విధి వంచితల వృత్తాంతాలతో ప్రేక్షక హృదయాల్ని గెల్చుకోవడం ప్రారంభించాడు. న్యూ వేవ్ అతడి ఒరవడి అయ్యింది. సైకాలజీ దాని ముడి సరికయ్యింది. మనసు చుట్టే రీళ్ళు చుడతాడు. మనసుకవి ఆత్రేయ లాగా మనసు దర్శకుడతను.
          అతడి న్యూవేవ్ ప్రయోగాల్లోనూ ఒక తేడా వుంది. న్యూవేవ్ సినిమాలంటే హిందీ లో సైతం అప్పటిదాకా కమర్షియల్ విలువల్లేని సీరియస్ కళారూపాలుగా  ఉంటున్న తీరుని కాస్తా, దాని మేధోపరమైన బడాయిని కాస్తా, బ్రేక్ చేసేస్తూ తనదైన న్యూవేవ్ సినిమాని ప్రవేశపెట్టుకున్నాడు.. నాణేనికి రెండు ముఖాలుంటాయి. బాల చందర్ చేతుల్లో రెండు పళ్ళేలుంటాయి. ఒక పళ్ళెం లో వేడివేడి అన్నం వడ్డిస్తాడు, మరో పళ్ళెంలో ఫాస్ట్ ఫుడ్ పెట్టేస్తాడు! ఇదీ బాలచందర్ బ్రాండ్ న్యూవేవ్!  ఆఫ్ బీట్ లో కమర్షియాలిటీని కలిపికొట్టి వడ్డించే విందు భోజనం!
          ‘బొమ్మాబొరుసా పందెం వెయ్యీ..నీదో నాదో  పై చెయ్యీ..’ అన్నపాట చాలామంది వినే వుంటారు. అప్పట్నించీ –అంటే 1971 నాటి నుంచీ తెలుగులో వున్నాడు బాలచందర్. అప్పటి ‘బొమ్మాబొరుసా’ అతను తెలుగులో తీసిన తొలి సినిమా అయింది. తర్వాత ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘47 రోజులు’, ‘ఇది కథ కాదు’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, ‘కోటి విద్యలు కూటి కొరకే’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’, ‘గుప్పెడు మనసు’...ఇవన్నీ ప్రత్యేకించి తెలుగు వాళ్ళకోసం తన హృదయాన్ని ఒలిచి మల్చిన  సజీవ చిత్రాలు. మరో తొంభై దాకా తమిళ, హిందీ కన్నడలూ అతడి కెరీర్ గ్రాఫ్ లో కొలువు దీరాయి. ఏడు  జాతీయ అవార్డులూ జై కొడుతూ ముంగిట వచ్చి చేరాయి.
          1930 లో జన్మించాడు బాలచందర్. ‘మన్మధలీల’  తీసేనాటికి 46వ ఏట వున్నాడు! సాధారణంగా ఈ వయసు కొచ్చేటప్పటికి దర్శకులు, తరం మారి మళ్ళీ తాజాగా పుట్టుకొచ్చే  నవతరం  ప్రేక్షకుల హృదయాల్ని అర్ధం జేసుకోలేక, అవే పాతవాసనల చాదస్తాల్ని ప్రదర్శించుకుని ఔటై పోవడం చూస్తూంటాం. బాలచందర్ ఈ కోవకి చెందడు. 46 ఏళ్ల వయసులో  ఇరవైలలోని కుర్రకారులకి పిచ్చెత్తించే ‘మన్మధలీల’ తీసి వదిలాడు! మళ్ళీ 48 ఏట ‘మరోచరిత్ర’ అనే మరో కుర్ర సినిమాని యూత్ కి ఎక్కుపెట్టి కిర్రెక్కించాడు! మనసు దర్శకుడికి మానసిక వృద్ధాప్యం అప్పుడే వుండదేమో!
          మరో చరిత్ర! ఇందులో మనసు- వయసుల లడాయి ఎలావుంటుందో చూపిస్తాడు. మనసుకు ప్రతీక కమల్ హాసన్ పాత్ర అయితే - వయసుకి సింబల్ సరిత పాత్ర. మనసూ వయసుల సయ్యాటలో పడి మిగతా ప్రపంచాన్ని ఆదమరిస్తే దాని పర్యవసానాలెంత  తీవ్రంగా ఉంటాయన్నదే ఇక్కడ హెచ్చరిక. ఈ పర్యవసానాలకి ‘విధి’ అని పేరు పెడతాడు. ‘విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్ఠ లేననీ’ -అంటూ ఆత్రేయ చేత పాట రాయించి!
       విధి అనే ఎలిమెంటు ఆరోజుల్లో బాక్సాఫీసు ఫార్ములాగా ఏలుకుంటోంది. సినిమాలు సబ్జెక్టివ్ గా ఉండేవి- ప్రేక్షకులూ ఆలాగే సబ్జెక్టివ్ గానే బుద్ధిగా వుండే వాళ్ళు. వీర హీరోయిజాలతో ఆబ్జెక్టివ్ గా సినిమాలు తీయడం- ప్రేక్షకులు మళ్ళీ దీనికి బుద్ధిగా మారిపోవడం తర్వాత్తర్వాత  జరిగింది. సినిమాలెలా ఉండాలో ప్రేక్షకులు నిర్ణయించరు, సినిమాలే నిర్ణయించుకుని తమ వెంట ప్రేక్షకుల్ని తీసుకుపోతాయి. అలా ఆనాటి విధి అనే సబ్జెక్టివ్ ఎలిమెంటు – అది సృష్టించే విషాద ముగింపులూ  అప్పటి ట్రెండ్ లో ఒక ఆమోదనీయమైన భాగమై పోయాయి. ‘మరోచరిత్ర’ విషాదాంతం ఓ పునర్జన్మకి ప్రారంభమే. కాకపోతే పుట్టుకల్లేవు. ఎప్పుడు పుడతారో తెలీదు. బాలూ – స్వప్న ( కమల్- సరిత) ల ఆత్మలు వచ్చి తమ కథ చెప్పుకుంటున్నాయి. సముద్ర హోరులో ఆ శిథిల సౌధంలో వాళ్ళ స్వీట్ నథింగ్సే ప్రతిధ్వనిస్తున్నాయి. ఇహలోకంలో ఒక్కటి కాలేకపోయిన ఆర్తి వాళ్ళ సంభాషణల్లో వ్యక్త మౌతోంది. ఆ సముద్రపు టొడ్డున ఇంకా ఆ రోజుల్లో విశాఖకి ఉక్కు కర్మాగారం రాలేదు. దాని తాలూకు పైలాన్ మాత్రమే  వెలసింది పర్యాటక కేంద్రంలా. అది సినిమాలో కన్పిస్తూంటుంది.. ఇంకా ఆరోజుల్లో అబ్బాయిలు చక్కగా బెల్ బాట మ్సే వేసుకుని వీర స్టయిల్ కొడుతున్నారు. అమ్మాయిలూ ఇంకా నిండుగా చీర కట్టుకుంటూనే, తామూ మోడరన్  అన్పించుకోవడానికి కాస్త ధైర్యం చేసి, స్లీవ్ లెస్ జాకెట్లు మాత్రమే  వేసుకుని పబ్లిక్ రియాక్షన్స్ ని టెస్ట్ చేస్తున్నారు. అబ్బాయిలకి ఇంకా సెల్ ఫోన్లు అనే జీవనాధారం లేక మౌతర్గాన్ లు వాయించుకుంటూ కూర్చున్నారు. ఉద్యోగాలకి ఈసురోమనే గవర్నమెంటాఫీసులే గతి. అలాటి ఓ నిద్రపుచ్చే ఆఫీసులో దిక్కుమాలిన ఉద్యోగానికి ఛీ కొట్టేసి ఇంటికొచ్చేస్తాడు బాలూ.

      పక్కింట్లో వుంటుంది స్వప్న. ఎదురుగా పర్చుకుని అంతా సముద్రం. పక్కపక్కనే ఈ తెలుగు-తమిళ కుటుంబాలు రెండిటికీ ఎప్పుడూ కీచులాటలే. సంస్కృతుల సమరం. అలాటిది బాలూ స్వప్నలకి ప్రేమకుదిరి ఇళ్ళల్లో దుమారం రేగుతుంది. వీళ్ళ ప్రేమ మత్తుని వదిలించడానికి కుటుంబాలు రెండూ ఉపాయంతో ఓ షరతు పెడతాయి. ఏడాది పాటు ఇద్దరూ దూరం దూరంగా గడపాలి. ఏడాది ఎడబాటు తర్వాతకూడా ఇంకా ఇంతే  బలంగా ప్రేమలుంటే ఆప్పుడు పెళ్లి చేస్తామంటారు  ఎలాగూ ఆ నాటికి ప్రేమలే ముంటాయిలే పిచ్చోళ్ళకి అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళది!

         దీనికి సరేనని స్వప్నని వదిలి హైదరాబాద్ కొచ్చేస్తాడు బాలూ. ఇక్కడ సంధ్య పాత్రలో మాధవి పరిచయమౌతుంది. ఈమె దగ్గర నాట్యం నేర్చుకునే పనిలో పడతాడు. అటు బాలూనే స్మరించుకుంటూ బరువుగా గడుపుతున్న స్వప్నకి  పెళ్లి సంబంధం తెస్తారు. ఈ పెళ్ళికి ఒప్పుకుందని అటు అపార్ధం జేసుకున్న బాలూ, మనసు విరిచేసుకుని సంధ్యకి పెళ్లి ప్రతిపాదన చేసిపారేస్తాడు. భర్త లేని సంధ్యకి బాలూ ప్రతిపాదనతో ప్రాణం లేచొస్తుంది. తీరా స్వప్నతో అతడి అసలు కథ తెలిసి, పెద్ద మనసు చేసుకుని, ఆ అపార్ధాలూ తొలగించి తను తప్పుకుంటుంది వాళ్ళ జీవితాల్లోంచి. ఇక ఏడాది గడువు ముగిసిపోయి, ఏమాత్రం మాసిపోని ప్రేమతో స్వప్నని  చేపట్టేందుకు హ్యాపీగా వెళ్తున్న  బాలూ మీద దుండగుల దాడి జరుగుతుంది. అదే  సమయంలో స్వప్న మీద వేరొకడు అత్యాచారం చేస్తాడు. కొనూపిరిరులతో మిగిలిన ప్రేమికులిద్దరూ విధిలేక ఇక ఆత్మార్పణం చేసుకుని కథ ముగిస్తారు!

   శాడ్ టర్నింగ్..ఎందుకీ విషాదం? రాని  భాషలతో ఇద్దరి మధ్యా  రోమాన్సూ అంతగా పండించి, అరడజను సూపర్ హిట్ పాటలతో అలరించి, కామిక్ రిలీఫ్ కోసం మిశ్రోతో నవ్వించి, కాలం-దూరం- సమాచార లేమి అనేవి నిజమైన ప్రేమల్ని నిర్వీర్యం చేయలేవనీ నిరూపిస్తూ ఈ ఆకస్మిక ట్రాజడీ దేనికి?

     సినిమాలకి రెండు రూపాల్లో క్లయిమాక్సులు వుంటాయి. స్టోరీ ( కథా ) క్లయిమాక్సు ఒకటైతే, ప్లాట్ ( కథనపు) క్లయిమాక్స్ రెందోది. మొదటిది ఉద్దేశించిన స్టోరీ పాయింటుకి  న్యాయం చేస్తుంది. అంటే ఏడాది పాటూ ఎడబాటుని భరించిన బాలూ స్వప్నలు ఎలా ఏకమయ్యారనేది స్టోరీ క్లైమాక్సు చూపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ కోవలోనే ముగింపునే ఊహిస్తారు. కానీ ప్లాట్ క్లయిమాక్స్ వచ్చేసరికి అది స్టోరీ క్లయిమాక్సుని  అప్రస్తుతం చేసేస్తుంది. ఏ సినిమా చూసినా బాలచందర్ ముగింపుతో ఒక షాక్ ఇస్తాడు. షాక్ ట్రీట్ మెంట్, యాంటీ క్లయిమాక్సులు అతడి రెండు కళ్ళు కదా? ఈ సినిమాలో ఏం చక్కా స్టోరీ క్లయిమాక్స్ కి ప్లాట్ క్లయిమాక్స్ తో చెక్ పెట్టేసి తమాషా చూశాడు. ఇదే సరైనదన్పించి ప్రేక్షకులకి వడ్డించాడు.

          ప్లాట్ క్లయిమాక్స్ కథనం లోంచి పుడుతుంది. ఎలాగంటే, కథనం లో సంధ్య అన్న బాలూ మీద కక్ష గట్టే  బీట్ ఒకటి వుంది. తన చెల్లెలు సంధ్యతో పెళ్లిని ఎగ్గొడుతున్నాడన్న కక్ష అది. అలాగే అటు స్వప్న తో ఒకడెవడో అదివరకు మిస్ బిహేవ్ చేసి లెంపకాయ తిన్నవాడు పగబట్టిన బీట్ కూడా వుంది. ఈ రెండు బీట్లూ ఉన్నాక మొదట ఉద్దేశించిన- ప్రేక్షకులాశిస్తున్న స్టోరీ క్లయిమాక్స్ అనేది ఆటోమేటిగ్గా అప్రస్తుత మైపోతుంది.


          గొప్ప సినిమాల్లో నిగూఢంగా వుండే సత్యాల కోసం వెతకాలంటాడు  జేమ్స్ బానెట్. ఇక్కడ ప్లాట్ క్లయిమాక్స్ ద్వారా ఓ నిగూఢ సత్యాన్నే స్థాపించాడు బాలచందర్. ఇదే ప్రేక్షకుల సబ్ కాన్షస్ తో వాళ్లకి తెలీకుండా కనెక్ట్ అయిపోయింది. ఫలితంగా సినిమా దిగ్విజయం సాధించింది.

          ఆఫ్ట్రాల్ విధి అంటే ఏమిటి! కేవలం మన ఇగోలని బట్టి పని చేసుకు పోయే యాంత్రిక శక్తేగా? మన ఇగోలతో మనం పోగేసుకున్న మంచీ చెడ్డ కర్మల తూకాన్ని బట్టి జీవితంలో ఆయా ఘట్టా లె దురవుతూంటాయి కదా? దీన్నే విధి విలాసమన్నారు కదా? అప్పుడు దీంతో దేవుడి కెలాటి  సంబంధమూ లేదు. దేవుడు ఉపయోగించుకోమని మనకి ఓ చక్కటి విచక్షణా జ్ఞానం గల మెదడు ని మాత్రమే ఇచ్చి ఊరుకున్నాడు. ఎలా ఉపయోగించుకుంటే అలా తయారవుతాం! స్వప్న తన వయసు ప్రభావం చేత విచక్షణా జ్ఞానం తో తీసుకోవాల్సిన ఛాయిస్ ని మరచి, తనతో మిస్ బిహేవ్ చేసిన వాడి ఇగోని దారుణంగా దెబ్బ తీసింది అలా లెంపకాయ కొట్టేసి! ఆ తర్వాత కాలంలో తప్పించుకోలేని ఆ చర్య తాలూకు ఫలితం అనుభవించింది. అటు బాలూ కూడా ఆ క్షణంలో విచక్షణా జ్ఞానం లేక మనసు మీద అదుపు కోల్పోయాడు. ప్రేమించిన స్వప్ననే అనుమానించాడు. దరిమిలా దారితీసిన పరిణామాల రిత్యా కక్ష గట్టిన సరిత అన్నతోనే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! ఎవరైనా తొందరపడి ఛాన్స్ తో గాక- ఛాయిస్ తో నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్లాట్ క్లయిమాక్స్ ప్రవచిస్తున్న నిగూఢ సత్యమన్న మాట!

          ఇంత విషయమున్నాక- ఇంకా సిల్లీగా ప్రేమికులిద్దర్నీ కలిపేసి సుఖాంతం చేయాలని కేవలం విషయపరిజ్ఞానం లేని దర్శకులే చేస్తారు- బాలచందర్ కాదు!

          ప్లాట్ క్లయిమాక్స్ తో శాస్త్రీయంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయి మెగా హిట్టయిన ఈ ‘మరో చరిత్ర’ ని స్వర్గీయ  ఎల్వీ ప్రసాద్ హిందీలో ‘ఏక్ దూజే కే  లియే’ గా రీమేక్ చేయాలని నిర్ణయించినప్పుడు కూడా - ముగింపుని సుఖాంతం చేయాల్సిందిగా వొత్తిళ్లు వచ్చాయి బాల చందర్ మీద. ఆయన ఒరిజిజనల్ ముగింపు నుంచి అంగుళం కూడా కదిలేది లేదని స్పష్టంగా చెప్పేశాడు. మళ్ళీ దుఖాంతమే హిందీలో సూపర్ హిట్టయ్యింది. దుఖాంతంలో జీవితసత్యాలతో సబ్ కాన్షష్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ వున్నాయి! దీనికి ముందు తెలుగు ఒరిజి నల్ తమిళంలో డబ్బింగ్ అయి కూడా ఏడాది పాటూ ఆడింది. హిందీ రిమేక్ కూడా హైదరాబాద్ లో ఏడాది పాటూ ఆడింది. కథలో వున్న  వినూత్న ‘ఏడాది ఎడబాటు’ పాయింటే గమ్మత్తుగా  ప్లాట్ క్లయి మాక్సుగా మ్యాజిక్ చేసి ఏడాది పాటూ ప్రదర్శనలకి దారి తీసిందన్న మాట!

          ‘మరో చరిత్ర’ - ఒక అపూర్వ చరిత్ర. మనకోసం బ్లాక్ అండ్ వైట్ లో ఇంత అద్భుతంగా సృష్టించిన ఈ వెచ్చటి అనుభవానికి రివాజుగా బాల చందర్ ఆస్థాన  విద్వాంసులందరూ పనిచేశారు. గణేష్ పాత్రో, ఆచార్య ఆత్రేయ, ఎం ఎస్ విశ్వనాథన్, లోకనాథ్ ప్రభృతులు...ఇక కమల్ హాసన్- సరితల జంట  తమ అసమాన నటనలతో ఈ సినిమా చూసే ఏ తరం ప్రేక్షకుల హృదయాలలో నైనా చిరస్థాయిగా నిలిచి పోతారు.


సికిందర్ 

(సెప్టెంబర్ 2009 ‘సాక్షి’ కోసం)