రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, December 3, 2022

1257 : రివ్యూ!


         2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం చెల్లో షో(చివరి షో) అక్టోబర్ 14 న గుజరాత్ లో విడుదలైంది. దీనికి పూర్వం 2021 లో వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో హల్చల్ చేసింది. ఆస్కార్స్ కి ఎంట్రీ పొందడంతో  ఈ సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగింది. అయితే ఆన్ లైన్ లో అందుబాటులో లేకపోవడంతో నిరుత్సాహానికి గురైన ప్రేక్షకుల్ని నెట్ ఫ్లిక్స్ ఆదుకుంది. నవంబర్ 25 నుంచి దీన్ని స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఇతర భాషల్లో డబ్ చేయకుండా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో విడుదల చేయడంతో ఇంగ్లీషు రాని ప్రేక్షకులకి దూరంగానే వుండిపోతోంది. పేద పిల్లల జ్ఞాన తృష్ణ గురించి తీసిన ఈ కళాఖండం ఆ వర్గాల ప్రేక్షకుల్లోకి స్ఫూర్తిగా వెళ్ళాలంటే వివిధ భాషల్లో డబ్ చేయాల్సిందే. మనమే తీసిన ఒక అంతర్జాతీయ సినిమా దేశీయ భాషల్లో ప్రదర్శనలకి నోచుకోకపోతే ఏం లాభం.

        గుజరాతీ సమాంతర సినిమా దర్శకుడు పాన్ నళిన్ వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 23 సార్లు ఉత్తమ చలన చిత్ర్రాల అవార్డులందుకుని మేటి దర్శకుడుగా పేరుపొందాడు. చెల్లో షో కి మూడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డులతో బాటు, మరో ఏడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో నామినేషన్లు పొందాడు.

అలాగే జపాన్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇజ్రాయెల్ దేశాలు థియేట్రికల్ రిలీజ్ కి కొనుగోలు చేశాయి. చెల్లో షో ఫిల్మ్స్-ఫుడ్-ఫ్రెండ్స్-ఫ్యామిలీ సెలబ్రేషన్ గా రూపకల్పన చేశానని చెప్తున్న నళిన్, సినిమా కళకి నివాళిగా ఇటలీ తీసిన సినిమా పారడిసో (1988) తర్వాత - చెల్లో షో ని అంతరించిపోయిన సినిమా రీళ్ళ కి బాధాతప్త వీడ్కోలుగా అందించాడు. నిజంగా ఈ కళాఖండం చూస్తే కదిలిపోని, కళ్ళు చెమర్చని సినిమా అభిమానులుండరు.

పిల్లల సృజనాత్మక విజయం
సమయ్ తొమ్మిదేళ్ళ పేద బ్రాహ్మణ విద్యార్థి. గుజరాత్ లోని సౌరాష్ట్రలో చలాలా అనే కుగ్రామం రైల్వే స్టేషన్ పక్కన టీలమ్మే తండ్రికి సాయపడుతూ, స్కూలుకెళ్ళి  చదువుకుంటూ వుంటాడు. కొందరు నేస్తాలుంటారు. అతడి దృష్టి ఒక్కటే- కాంతిని పట్టుకోవాలని. కాంతి నుంచి కథలు, కథలనుంచి సినిమాలూ పుడతాయని భావిస్తూంటాడు. స్కూలు ఎగ్గొట్టి సినిమాలకి పోతూంటే తండ్రి బాపూజీ కొట్టి- సినిమాలనేవి కుళ్ళు. మన సాంప్రదాయం కాదు. బ్రాహ్మణులు ఇలాటి పనులు చేయడం చూశావా?’ అని కొడతాడు. బ్రాహ్మణ బ్రాహ్మణ అంటూ నువ్వెక్కడున్నావో చూడు- రోజంతా చాయ్ లమ్ముకుంటూ కప్పులు కడుగుతున్నావ్. చాయ్ చాయ్ అని అరుస్తు
న్నావ్ అనేస్తాడు కొడుకు.

ఒక రోజు టికెట్ లేకుండా దూరాడని సినిమా హాల్లోంచి బయటికి విసిరేస్తారు. ప్రొజెక్టర్ ఆపరేటర్ ఫజల్ చేరదీసి, చపాతీలు తింటూ- మా ఇంటిదానికి చపాతీలు చేయడం రాదంటాడు. మా అమ్మ బాగా చేస్తుందంటాడు సమయ్. అప్పట్నుంచి తల్లి స్కూలుకి కట్టిచ్చే భోజనాన్ని తెచ్చి ఫజల్ కిచ్చి, ప్రొజెక్షన్ రూంలో కూర్చుని రోజూ జోధా అక్బర్ఫ్రీగా చూస్తూంటాడు. కాంతి ఎలా ప్రసరిస్తోంది, ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తోందీ నిశితంగా గమనిస్తాడు.

సినిమాలు ఎలా తీస్తారని అడిగితే, ‘సినిమాలు కథల గురించి తీస్తారు. కథలతో సినిమాలకి పాత సంబంధముంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం కథలు చెప్పడం లాగా, వ్యాపారులు సరుకులు అమ్ముకోవడానికి కథలు చెప్పడం లాగా, డబ్బున్న వాళ్ళు డబ్బులు దాచెయ్యడానికి కథలు చెప్పడం లాగా...భవిష్యత్తు కథలు చెప్పే వాళ్ళదే! అని జ్ఞాన భోద చేస్తాడు ఫజల్.

ఇక నేస్తాలతో కలిసి సైకిలు చక్రాలు, పెడల్, కుట్టు మిషను, ఫ్యాను రెక్కలు, అద్దాలు, బల్బులు మొదలైనవి పోగేసి, దూరంగా ఒక పాడుబడ్డ ఇంట్లో ప్రొజెక్టర్ తయారు చేసేస్తాడు. రైల్వే స్టేషన్ కొచ్చే సినిమా రీళ్ళని ఎత్తుకొచ్చి, తాన్ తయారు చేసిన చేత్తో తిప్పే ప్రొజెక్టర్లో ఆడించి, తెర మీద బొమ్మవేసి కేరింతలు కొడతాడు.

ఇలా సినిమాలు ప్రదర్శించుకుని, శబ్దాలు సృష్టించుకుని ఆనందిస్తూండగా, ఒక రోజు ఫజల్ నుంచి దుర్వార్త  వస్తుంది. సమయ్ పరుగెత్తుకుని వెళ్ళి చూస్తే, సినిమా హాల్లో ప్రొజెక్టర్, రీళ్ళూ తీసి బయట పారేస్తూంటారు. ఫజల్ ఉద్యోగం పోతుంది. కొత్త టెక్నాలజీతో ఆధునికంగా డిజిటల్ ప్రొజెక్టర్ బిగిస్తూంటారు... ఈ మార్పుని సమయ్ తట్టుకోలేకపోతాడు.   

సినిమా అంటే ఫిలిమ్ రీళ్ళు అనే శతాబ్దకాలపు చరిత్ర ఇక పరిసమాప్తమవుతున్న పరిణామాలు చూసి సమయ్ కలలన్నీ చెదిరిపోతాయి. ఈ మార్పుని ఎలా స్వీకరించాలి? ఇప్పుడేం చేయాలి? ఇక్కడ్నుంచి అతడి ఆలోచనలు ఏ దిశగా పయనించాయి? ఇంకే  ముగింపుకి స్వాగతం పలికాడు?... ఇవన్నీ ఎంతో హృద్యంగా తెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు.

సినిమాయే సెలబ్రేషన్

దర్శకుడు డిజిటల్ సినిమాల చరిత్రకి అంకురార్పణ మాత్రమే చేసి వూరుకోలేదు. పాత ప్రొజెక్టర్లు, రీళ్ళూ ఏమయ్యాయీ ఇవీ చూపించాడు. వివిధ పరిశ్రమల్లో తుక్కుకింద ముద్దయి చెంచాలుగా, ప్లాసిక్ పైపులుగా, చేతి గాజులుగా ఉత్పత్తి అవడాన్ని సమయ్ సాక్షిగా చూపించాడు. అసలు సమయ్ తయారు చేసిన ప్రొజెక్టరు కూడా ఏదో సినిమాటిక్ గా చూపించలేదు. దానికి వాడిన వస్తువుల ఉపయోగాన్ని సాంకేతికంగా సాధ్యమే అన్నట్టు ఇంజనీరింగ్ చేసి చూపించాడు. ప్రపంచంలో తొట్ట తొలి ప్రొజెక్టర్ తయారు చేసినప్పుడు ఏం చేసి వుంటారో, ఏ రూపంలో వుండేదో అదొక చారిత్రక ఘట్టం. సమయ్ సినిమా హాల్లో ప్రొజెక్టర్ని పరిశీలించి, పారేసిన వస్తువులతో ఒక చేత్తో తిప్పే ప్రొజెక్టర్నే తయారు చేయడం పిల్లల్లో దాగివుండే అద్భుత శాస్త్రీయ దృష్టికి తార్కాణమన్నట్టుగా చూపించాడు!

గ్రామీణ పిల్లలంతా కలిసి సాధించిన ఈ విజయాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే, చెప్పుకుంటే సినిమా రీళ్ళ దొంగతనం బయటపడుతుంది. ప్రతీ సన్నివేశం చాలా ఫన్నీగా, హాస్యంగా, వినోదపరుస్తూ వుంటుంది. ఈ వినోదం కూడా కళ్ళు చెమర్చేలా వుంటుంది. సమాంతర సినిమా అయినా ఆర్ట్ సినిమాలాగా సీరియస్ గా, నెమ్మదిగా సాగకుండా, సరదాగా వేగంగా పరిగెడుతూంటుంది. ఫిల్ముతో పిల్లల సెలబ్రేషన్, ఫ్రెండ్ షిప్ తో పిల్లల సెలెబ్రేషన్, తల్లి తయారు చేసే వంటకాలతో ఫుడ్ సెలబ్రేషన్, సమయ్ కుటుంబంతో ఫ్యామిలీ సెలెబ్రేషన్ ... ఇలా ఈ సినిమాయే ఒక సెలెబ్రేషన్.

స్కూలుకి తల్లి కట్టిచ్చే భోజనాన్ని సమయ్ ఫజల్ కి తినబెట్టడంతో వాళ్ళిద్దరి ఫ్రెండ్ షిప్ ఇంకో సెలెబ్రేషన్. తల్లి కింద పొయ్యి మీద ఎలా వండుతుందో వివరంగా చూపిస్తాడు దర్శకుడు. గుత్తి వంకాయ కూర, బెండకాయ మసాలా, మిర్చీ మసాలా, కొత్తిమీర చింతపండు చట్నీ...ఇలా మనకే నోరూరేలా రోజుకో వంట వండుతుంది. ఈమెకి తెలియకుండా తీసికెళ్ళి ఫజల్ కి తినిపిస్తూంటాడు. ఫజల్ సెలబ్రేట్ చేసుకుంటాడు.

ప్రతీ దృశ్యం విలువైనదే, విషయం చెప్పేదే. సినిమా హాల్లో చాలా రోజులు జోధా అక్బరే ఆడుతుంది. తర్వాత దాన్ని తీసేసి అమితాబ్బచ్చన్ ఖుదా గవా ఆడిస్తారు. ఆ తర్వాత ఇంకో సినిమా అడిస్తూంటే మధ్యలో ఆగిపోయి గొడవ గొడవ అవుతుంది. ఆ రీలు సమయ్ ఎత్తుకుపోవడంతో ఈ గొడవ.

రీళ్ళతో చరిత్ర పరిసమాప్తమయ్యాక, తిరిగి సమయ్ రైళ్ళాగినప్పుడు చాయ్ లమ్మే పరిస్థితికే వచ్చాక, తండ్రితో కదిలించే దృశ్యాలుంటాయి. మొదట్లో అగ్గిపెట్టెలు సేకరించి, వాటిమీద వుండే వివిధ బొమ్మల్ని వరుస క్రమంలో పేర్చి, బొమ్మల కథలు చెప్పే నేర్పుతో ప్రారంభమయిన కొడుకు సృజనాత్మకతని ఇక తండ్రి గుర్తించి- తీసుకునే నిర్ణయం విజయం వైపుగా వుంటుంది. వీడ్కోలు భావోద్వేగ పూరితంగా, ఒక జ్ఞాపకంగా వుండిపోతుంది.  

ఒన్ బాయ్ షో

పేద పిల్లవాడి పాత్రలో భవిన్ రబరీ ఒక అద్భుత చైల్డ్ ఆర్టిస్టు. సినిమా చూశాక కలకాలం గుర్తుండి పోతాడు. భవిన్ వన్ బాయ్ షో అనొచ్చు దీన్ని. మిగతా పాత్రల్లో బాలనటులు కూడా అంతే సహజత్వంతో నటిస్తారు. తండ్రిగా దీపెన్ రావల్, తల్లిగా రిచా మీనా, బక్క ప్రాణి ఫజల్ గా భవేష్ శ్రీమాలీ.... ఇలా ప్రతీ వొక్కరూ నిజజీవితంలో చూస్తున్నట్టే వుంటారు. తక్కువ మాటలతో ఎక్కువ భావాల్ని ప్రదర్శిస్తారు. సినిమా నడక ఒక లయగా వుంటుంది. సినిమా సాగిపోతున్నట్టు అస్సలు గుర్తించలేనంతగా ప్రతీదృశ్యంలో గాఢంగా సంలీనం చేస్తుంది. ఒక సెకను కూడా కళ్ళు తిప్పుకోలేం. ఆపి ఆపి వాయిదాలుగా చూడకుండా- ఏకబిగిన చూసేసేంత సృజనాత్మక, సాంకేతిక ఔన్నత్యాలతో వుంటుంది గంటా 50 నిమిషాల సేపూ.

స్వప్నిల్ సోనావనే ఛాయాగ్రహణం, మైకేల్ బారీ  శబ్దగ్రహణం, పంకజ్ పాండ్యా కళా దర్శకత్వం, సిరిల్ మోరిన్ సంగీత దర్శకత్వం, శ్రేయాస్ కూర్పు... ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నవే.

అసలు పరీక్ష ఏమిటంటే, పాలిన్ నళిన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లు నిర్మాతలుగా వ్యవహరించిన చేల్లో షోఆస్కార్స్ లో 95 దేశాలతో పోటీపడాల్సి రావడం.

—సికిందర్ 

1256 : రివ్యూ!


 

రచ-దర్శకత్వం : ఆనంద్ జె
తారాగణం: రావణ్ రెడ్డి, శ్రీ నిఖి, లహరీ గుడివాడ, రవీంద్ర బొమ్మకంటి, అమృత వర్షిణి తదితతరులు
సంగీతం: ఫణి కళ్యాణ్, ఛాయాగ్రహణం :
బ్యానర్ : కాస్కేడ్ పిక్చర్స్,
నిర్మాతలు: డి. రమేష్ , రెడ్డి రాజేంద్ర
విడుదల : నవంబర్ 18, 2022
***

        బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, స్వామి రారా మొదలైన రాబరీ సినిమాల శ్రేణిలో అలిపిరికి అల్లంత దూరంలో కొత్త చేరిక. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త నేపథ్యం. ఇన్ని కొత్తలున్నాక చూడ్డానికి కొత్త ఉత్సాహమే వస్తుంది. ఈ  ఉత్సాహం సినిమా చూస్తూంటే వుంటుందా లేదా అన్నది సందేహం. ఈ సందేహం తీర్చుకోవడానికి విషయమెలా వుందో చూద్దాం...

కథ

    తిరుపతిలో వారధి (రావణ్ రెడ్డి) దేవుడి పటాలు అమ్మే షాపు నడుపుకుంటూ వుంటాడు. తల్లి (లహరీ గుడివాడ) నర్సుగా పనిచేస్తూ వుంటుంది. తండ్రి పక్షవాత రోగి. బోలెడు అప్పులుంటాయి. అవితీర్చే భారం వారధి మీద వుంటుంది. అలాంటిది అతను కీర్తి (శ్రీ నిఖిత) ని చూసి ప్రేమిస్తాడు. డబ్బున్న కుటుంబానికి చెందిన కీర్తి గోశాలలో వాలంటీరుగా పని చేస్తూంటుంది. కూతురు వారధి ప్రేమలో పడిందని తెలుసుకున్న కీర్తి తండ్రి, డబ్బు లేని వారధిని కూతురి జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. దీంతో వాళ్ళిద్దరి ప్రేమకి బ్రేకుపడుతుంది. దీంతో ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు వారధి.

హైదరాబాదుకి చెందిన గౌతమ్ రెడ్డి (రవీంద్ర బొమ్మకంటి) తిరుపతిలో టూ స్టార్ హోటల్ యజమాని. అతను భార్యతో కూతురితో తిరుపతి వస్తాడు. భార్య (అమృతవర్షిణి) మొక్కు తీర్చుకోవాల్సి వుంది. వారధి కారు డ్రైవర్ కమ్ గైడ్ గా కూడా పని చేస్తూంటాడు. గౌతమ్ రెడ్డి కారుకి డ్రైవరుగా వచ్చిన అతను, గౌతమ్ రెడ్డి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి తెచ్చుకున్న బ్లాక్ మనీ రెండు కోట్ల రూపాయలున్నాయని తెలుసుకుని ఆ డబ్బు కొట్టేస్తాడు.

దీంతో గౌతమ్ రెడ్డి భార్య గోలగోల చేస్తుంది. అది ముడుపు కట్టిన డబ్బు అనీ, ఆ డబ్బు తప్ప వేరే డబ్బు ముట్టుకోననీ, అదీ రేపు వైకుంఠ ఏకాదశికి పొద్దున్న బ్రహ్మ ముహూర్తం లోపు హుండీ లో వేయాలనీ పట్టు బడుతుంది.

దీంతో ఆ డబ్బుకోసం వేట మొదలవుతుంది. ఇప్పుడేం చేశాడు వారధి? ఆ డబ్బుతో దొరక్కుండా ఏఏ ప్రయత్నాలు చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో ఏడు కొండలవాడు చూపిన లీలలు ఏమిటి? చివరికి ఈ డబ్బు దోపిడీ కథ ఎలా ముగిసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

    అలిపిరి అనగానే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద జరిగిన నక్సల్ దాడి గుర్తుకొస్తుంది. మార్కెటింగ్ కి ఈ రిఫరెన్స్ ధ్వనించేలా టైటిల్ పెట్టినట్టుంది. ఇది కర్మ సిద్ధాంతం గురించి చెప్పే కథ. పూర్వం వారధి తండ్రి ఒక దొంగతనం చేసి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఇప్పుడు వారధి గౌతమ్ రెడ్డి డబ్బు కొట్టేస్తే అది వెళ్ళి ఆనాడు తండ్రి వల్ల దోపిడీకి గురైన వ్యక్తికే చేరుతుంది. ఇది బాగానే వుంది. మరి డబ్బు పోగొట్టుకున్న గౌతమ్ రెడ్డికి డబ్బెలా దొరికింది? వారధి ప్రేమిస్తున్న కీర్తి తండ్రి పోలీసుల భయంతో దాచుకున్న బ్లాక్ మనీ పారేస్తే ఆ డబ్బే దొరికింది. ఐతే బ్లాక్ మనీ పోగొట్టుకున్న గౌతమ్ రెడ్డికి బ్లాక్ మనీయే వచ్చేలా చేసి, తన హుండీలో బ్లాక్ మనీయే ఎలా వేయించుకుంటాడు ఏడుకొండల వాడనేది ప్రశ్న. బ్లాక్ మనీ ఆయనకి అలవాటై పోయిందా?

శ్రీ విష్ణు నటించిన రాజరాజ చోర లో లాగా ఒక ఆలయంలో పూజారి ప్రవచనం చెబుతూ ఈ కథ మొదలెట్టి-కర్మ సిద్ధాంతం, ఏడుకొండలవాడి లీలలు వగైరా ఉద్బోధిస్తాడు. కానీ దర్శకుడి రచన, దర్శకత్వం మొదలైన వాటికి ఏడుకొండల వాడి అండ లభించినట్టు లేదు. దీంతో సినిమా గుది బండలా తయారైనట్టు కన్పిస్తుంది. ప్రారంభం నుంచీ ముగింపు వరకూ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, చిత్రీకరణ అనేవి అప్డేట్ కాకుండా సహన పరీక్ష పెడతాయి.

రెండు గంటల పది నిమిషాల సినిమాలో తొలి గంటా పది నిమిషాలు హీరో కష్టాలు, హీరోయిన్ తో ప్రేమ, ఈ ప్రేమకి ఒక ఫ్లాష్ బ్యాకు, ఇంట్లో తల్లి దండ్రులతో తగాదాలు, హీరోయిన్ తండ్రితో సమస్య -ఇవే సాగుతూ కథే ప్రారంభం కాదు. ఆఖరికి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దోపిడీ సంఘటన ఇంటర్వెల్లో జరిగి అప్పుడు కథ ప్రారంభమవుతుంది.

ఇక సెకండాఫ్ కథ ఆ దోపిడీ జరిగిన రాత్రి తెల్లార్లూ జరుగుతుంది. ఇది కూడా నీరసంగా సాగుతుంది. గౌతమ్ రెడ్డి మనుషులు వెంటాడ్డం, వారధి తప్పించుకోవడం - అనే ట్రాకుతో భావోద్వేగ రహితంగా ఫ్లాట్ గా సాగుతుంది. సెకండాఫ్ లో హీరోయిన్ కనిపించదు. ఇదొక లోపం. కనీసం కథ కోసం, నేను డబ్బుతో వస్తాను- నువ్వు కొండ పైన వెయిట్ చెయ్, అక్కడే పెళ్ళి చేసుకుందాం కొండపైనే – అని చెప్పివుంటే- ప్రేమికుల కథగా యూత్ అప్పీల్ తో, కథకి బలం వచ్చి భావోద్వేగాలుండేవి. ఒక థ్రిల్, సస్పెన్స్ అనేవి ఏర్పడేవి.      తమిళంలో 2019 లో వెట్రి నటించిన జీవి ఇలాటిదే కథ చాలా అర్ధవంతంగా, థ్రిల్లింగ్ గా  తీశాడు కొత్త దర్శకుడు విజే గోపీనాథ్. ఇందులో ఒక ఇంటి యజమానురాలితో బాటుఆమె తమ్ముడి జీవితంలో సంఘటనల్లాంటివి హీరో వెట్రి  జీవితంలోనూ  ప్రారంభమవుతాయి. ఆ యజమానురాలి  ఇంట్లో ఇప్పుడు తను చేసిన దొంగతనం లాగేగతంలో ఇంకొకడు చేసిన దొంగతనం వుంటుంది. ఆ గతమేంటో పూర్తిగా తెలుసుకుంటే తప్ప పరిష్కార మార్గం వుండదు. ఇంకోటేమిటంటేగతంలో ఆ యజమానురాలి జీవితంలో జరిగిన విషాద సంఘటలేఇప్పుడు వెట్రీ  చెల్లెలికీ జరుగుతూండడంతో- దీన్నాపడానికి- ఈ చట్రాన్ని త్రుంచెయ్యడానికి - చేసే ప్రయత్నమే విధితో సాగే ఈ పోరాట కథ.

ప్రస్తుత కొత్త దర్శకుడు తను చేపట్టిన కాన్సెప్ట్ కి సంబంధించిన రీసెర్చ్ చేసుకోకుండా, ఈ జానర్ లో వచ్చిన ఇతర సినిమాలూ  పరిశీలించకుండా- తోచిన విధంగా ఈ సినిమా తీసేసినట్టుంది. తోచిన విధంగా తీసేసేంత సులభమైపోయాయి సినిమాలు.

నటనలు- సాంకేతికాలు

    కొత్త దర్శకుడు తన ప్రయత్నంలో విఫలమైనా, కొత్త హీరో రావణ్ రెడ్డిలో విషయముంది. అతడికి సహజంగా నటించడం వచ్చు. హావభావ ప్రకటనలు తెలుసు, దుఖం అభినయించడం తెలుసు. అయితే కథా కథనాలే అతడికి సహకరించలేదు.  కథా కథనాలని పక్కన పెట్టి కేవలం అతడి నటన కోసం చూడాలనుకుంటే చూడొచ్చు.

హీరోయిన్ నిఖిత కూడా ఇంట్రెస్టింగ్ నటి. కానీ ఎక్కువ సన్నివేశాలు లేవు, సెకండాఫ్ లో ఒక సీనులో తప్ప కనిపించదు. ఇంకో చెప్పుకోదగ్గ పాత్ర, నటి హీరో తల్లిగా నటించిన  లహరీ గుడివాడ. ఇక హైదరాబాద్ క్యారక్టర్స్ రవీంద్ర బొమ్మకంటి, అమృత వర్షిణి ఫర్వాలేదు. హీరో ఫ్రెండ్ గా నటించిన ఆర్టిస్టు కూడా ఫర్వాలేదు.

సాంకేతికాల విషయానికొస్తే చెప్పుకోవడానికేమీ లేదు. కెమెరా, సంగీతం, కూర్పు క్వాలీటీతో లేవు. తిరుపతి లొకేషన్స్ మాత్రం విస్తృతంగా చూపించారు. బడ్జెట్ ని బాగా కుదించి ఈ సినిమా తీసినట్టుంది. ఈ బాపతు కథా కథనాలకి ఇంత కంటే బడ్జెట్ కూడా అవసరం లేదు.

—సికిందర్

Friday, December 2, 2022

1255 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : శైలేష్ కొలను
తారాగణం : అడివి శేష్, మీనాక్షీ చౌదరి, కోమలీ ప్రసాద్, రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్,  తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, మాగంటి శ్రీనాథ్ తదితరులు
సంగీతం ; ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవార్ట్ ఏడూరి:  ఛాయాగ్రహణం : ఎస్ మణికందన్  
బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా
నిర్మాతలు : తిపిరినేని ప్రశాంతి, నాని
విడుదల : డిసెంబర్ 2,2022
***

        2020 లో శైలేష్ కొలను విశ్వక్ సేన్ నటించిన హిట్ కి సీక్వెల్ గా విడుదలైన హిట్ 2 లో హీరో మారి అడివి శేష్ నటించాడు. హిట్ సిరీస్ లో మొత్తం ఆరుగురు హీరోలతో ఆరు సినిమాలు తీయాలని ప్రణాళికట. ఈ రెండో ఇన్ స్టాల్ మెంట్ కి కూడా తిపిరినేని ప్రశాంతి, నాని నిర్మాతలు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా తీయాలని సమకట్టిన ఈ సిరీస్ లో హిట్ కి హిందీ రీమేకుగా రాజ్ కుమార్ రావ్ తో తీసిన హిట్-ది ఫస్ట్ కేస్ ఫ్లాపయ్యాక, దర్శకుడు హిట్ 2 తెలుగు సీక్వెల్ తీశాడు. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) చేపట్టే నేర దర్యాప్తు కథ ఈసారి ఎలా వుందో చూద్దాం...

కథ

కృష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) వైజాగ్ హిట్ టీంలో ఎస్పీగా వుంటాడు. దీనికి బాస్ గా డిజిపి నాగేశ్వర రావు (రావు రమేష్), మెంబర్లుగా హర్ష (కోమలీ ప్రసాద్), అభిలాష్ (మాగంటి శ్రీనాథ్) వుంటారు. ఆర్య( మీనాక్షీ చౌదరి) అనే అమ్మాయితో కేడీ సహజీవన సంబంధంలో వుంటాడు. ఆర్య ఏమీ చేయకుండా ఇంటి పట్టున వుంటుంది. ఒక రోజు ఒక హత్య కేసు రిపోర్టవుతుంది, కేడీ వెళ్ళిచూస్తే కాళ్ళు, చేతులు, మొండెం, తల  వేరు చేసిన అమ్మాయి శవం పడుంటుంది. తల ఆధారంగా హతురాలెవరని దర్యాప్తు చేస్తూంటే, తల ఒక్కటే ఆమెదనీ, మిగిలిన శరీర భాగాలు వేరే ముగ్గురమ్మాయిలవనీ బయట పడుతుంది. దీంతో సీరియల్ కిల్లింగ్స్ కోణంలో దర్యాప్తు మొదలెడతాడు. ఇప్పుడు ఎవరీ సీరియల్ కిల్లర్-  నల్గురమ్మాయిల్ని ఎందుకు చంపాడు - ఈ అమ్మాయిలెవరు- కేడీ ఈ కేసుని ఎలా ఛేదించి సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

రొటీన్ కథే. రొటీన్ ప్రేమ సినిమాలెలా వస్తున్నాయో, అలా రొటీన్ గా టెంప్లెట్ లో వస్తున్న క్రైమ్ సినిమాల్లో ఇదొకటి. రొటీన్ గా అదే ఎండ్ సస్పెన్స్ కథ. ఎండ్ సస్పెన్స్ సినిమా కథ అంటేనే కత్తి మీద సాములాంటిది. చివరి వరకూ హంతకుడ్ని చూపించకుండా, ఎంత సేపూ వాడి కోసం హీరో చేసే దర్యాప్తుతో వన్ వే గా సాగే కథని రక్తి కట్టించడం చాలా కష్టం. అంటే హీరోకీ, హంతకుడికీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంగా, ఒక గేమ్ గా ఇలాటి కథలు వుండవు. అంటే, వెండి తెర కోరుకునే సీన్ టు సీన్ సస్పెన్సు తో  ఇవి వుండవు. పైగా చిట్ట చివర్లో హంతకుడ్ని రివీల్ చేసినప్పుడు, వాడు చెప్పే ఏ కారణమూ కథని ఇంకో లెవల్ కి తీసికెళ్ళక తేలిపోవడమే జరుగుతోందింత కాలమూ  ఇలాటి సినిమాలతో. ఇందులో హిట్ 2 కూడా ఒకటి.

కథ ఎంత రొటీనో కథనమూ అంత సాధారణంగా వుంది- సస్పెన్సు, ఎత్తు పల్లాలు, స్ట్రగుల్, థ్రిల్, టెన్షన్ వంటి ఎలిమెంట్స్ లేకుండా. చివర్లో హంతకుడెవరనే దానికి దగ్గరయ్యే కొద్దీ పది నిమిషాలు సస్పెన్సు కన్పిస్తుంది. తీరా హంతకుడ్ని పట్టుకుంటే –అతను రాంగ్ ఛాయిస్. పర్సనాలిటీ లేని, హైటూ లేని  ఆర్టిస్టుని రివీల్ చేసి ఇంకో తప్పిదం చేశారు. పైగా  అతను చిన్నప్పుడు కుటుంబంలో జరిగిన సంఘటనలు తను సైకోగా మారడానికి కారణమని రొటీన్ విషయమే వెల్లడించేసరికి, ముగింపు వీగిపోయింది. ఈ ఘట్టాన్ని దర్శకుడు తురుపు ముక్కగా ప్లాన్ చేసుకుని, షాకింగ్ గా వుండేట్టు వాడుకుని వుండాలి, అది జరగలేదు.  

ఇక ముందు ఒకే అమ్మాయి శరీర భాగాలని చెప్పి, తర్వాత కాదు నల్గురమ్మాయిల శరీర భాగాలనీ చెప్పడంతో షాక్ వేల్యూ కూడా కరిగిపోయింది. శవాన్ని చూడగానే ఒకమ్మాయి కాదు, నల్గురమ్మాయిల శరీరభాగాలని ఇన్వెస్టిగేటర్ అయిన హీరో అక్కడే చెప్పేసి వుంటే- ఆ సన్నివేశం బ్లాస్ట్ అయి భావోద్వేగాలతో వెంటాడే ఆపరేటివ్ ఇమేజిగా వుండేది. ఆ ఇమేజితో అతను నిద్రపోలేడు. చీటికీ మాటికీ హీరోయిన్ తో రోమాన్సు చేయలేడు. ఆ ఇమేజి వెంటాడుతూంటే  హంతకుడి కోసం బర్నింగ్ ఎమోషన్ తో ఇన్వెస్టిగేట్ చేయాలి.

పాత్ర పరంగా  కూడా ఈ బర్నింగ్ ఎమోషన్ లేకపోవడం ఇంకో లోపం. హీరోని కేసుల్ని తేలిగ్గా తీసుకునే రకంగా, హంతకుల్ని సీరియస్ గా తీసుకోకుండా ఆడుతూ పాడుతూ పట్టేసుకుంటాడనీ పరిచయం చేశారు. అంటే హత్యకి గురయ్యే వాళ్ళ పట్ల కూడా అతడికి ఫీలింగ్స్ వుండవు. అలాగే నల్గురమ్మాయిల శరీర భాగాలు చూసి కూడా చలించడు. బాధితుల పట్ల ఏ స్పందనా లేకుండా ఎవరి కోసం, ఎందుకోసం పనిచేస్తున్నాడో తెలీదు.

హిట్ లో అనాధ శరణాలయం బ్యాక్ డ్రాప్. ఇందులో స్త్రీ సంక్షేమ సంఘం నేపథ్యం. హిట్ లో ఇన్వెస్టిగేషన్ పేరుతో తెలివితేటల వాడకం అధికం కావడంతో గజిబిజిగా తయారయ్యింది. ఏదో హడావిడీ జరుగుతూ వుంటుంది- ఆ హడావిడిని విశ్లేషిస్తే లాజుక్కులే వుండవు. ప్రతీదానికీ ఫోరెన్సిక్ సైన్స్ ని లాగడం. ఈ సారి ఫోరెన్సిక్ సైన్స్ ఓవరాక్షన్ లేదు, నామ మాత్రంగా వుంది. అయితే లాజిక్కులు వుండవు. ఉదాహరణకి హంతకుడు నల్గురమ్మాయిల శరీర భాగాల్ని హోటల్ గదికి ఎలా తెచ్చి పేర్చి పోయాడనే దానికి వివరణ వుండదు.

ఈ హిట్ టీంని  పోలీసు శాఖ గర్వించదగ్గ అత్యుత్తమ విభాగంగా కథలో హైలైట్ చేయకుండా- మళ్ళీ హిట్ లోలాగే అవినీతి అధికారుల్ని చూపించి విలువలేకుండా చేశారు. ఇంటర్వెల్ సీనుతో ఇంపాక్ట్ ఏమీ లేదు. ఎందుకంటే ఇలాటి సినిమాల్లో మొదట అమాయకుణ్ణి హంతకుడుగా చూపించడం రొటీనే.

హిట్ 2 ని పెద్దగా ఆలోచించకుండా, తెర మీద జరుగుతున్న హడావిడికి పైపైన థ్రిల్ ఫీలై చూసేస్తే ఇది హిట్టే అని చెప్పొచ్చు.

నటనలు- సాంకేతికాలు

 క్షణం’, ఎవరు లాంటి పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో నటించిన అడివి శేష్- ఈ సారి స్క్రిప్టులో ఇన్వాల్వ్ కాలేదేమో, తన పాత్ర చిత్రణ దగ్గర్నుంచీ కథాకథనాల వరకూ ఉదాశీనంగా వుండిపోయినట్టు ఫలితం చెప్తోంది. అయినా హిట్టే, హిట్ హిట్టు కాకపోతే ఎలా? అవతల నల్గురమ్మాయిలు ముక్కలైవుంటే, ఎప్పుడు పడితే అప్పుడు సహజీ వనం చేస్తున్న అమ్మాయితో సరసం, సంగీతం, ప్రెగ్నెన్సీ వగైరా ఎంజాయ్ చేసే పోలీసు పాత్రలో అడివి శేష్ భేష్ అనాలి. ఇంకా పెళ్ళి గురించి కాబోయే అత్తగారితో కామెడీ. ఇక యాక్షన్ సీన్స్ చూస్తే విలనే (హంతకుడు) చివరివరకూ కనిపించకపోతే ఏముంటాయి. పూర్తిగా యాక్షన్ రహిత ఇన్వెస్టిగేషన్ కథ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్సుల ఎసెస్మెంట్ ఎవరు ఫాలో అవగలరు. అడివి శేష్ ప్రేక్షకుల్లో తనకున్న ఫాలోయింగ్ తో ఈ సినిమా గట్టెక్క వచ్చు.

హీరోయిన్ మీనాక్షీ చౌదరిని పైన చెప్పుకున్న అవసరాల కోసమే, సంసార పక్షంగా  ఇంటి పట్టున వుండే చదువుకున్న అమ్మాయి పాత్ర. స్త్రీసంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు చేసే స్వయంకృషి, పనీ పాటలు ఆమెకి పట్టవు. టీం మెంబర్ గా కోమలీ ప్రసాద్ కి హీరోయిన్ కంటే ఎక్కువ పాత్ర వుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక అవినీతి పరుడైన టీం బాస్ గా రావురమేష్ యాక్టివ్ పాత్ర కాడు. కూర్చుని హీరోకి వ్యతిరేకంగా చక్రం తిప్పే శకుని పాత్ర. దర్శకుడు సృష్టించిన హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం ని ఒక ఆదర్శ సంస్థగా ప్రేక్షకులు అభిమానించే ఇమేజిని క్రియేట్ చేయాలను కోకపోవడం చాలా విచారించాల్సిన విషయం. దర్శకుడు తన టీంని తనే అవమానించుకుంటున్నాడు –అప్పుడు హిట్, ఇప్పుడు హిట్ 2, ఇంకా రాబోయే సీక్వెల్స్ లో కూడా ఇదే ఆశించాలేమో.

ఇక హిట్ 3 కి హింట్స్ ఇస్తూ ముగింపులో నేచురల్ స్టార్ నానీ ఎంట్రీ. సినిమాలో ఎక్కడా ఈలలు వెయ్యని ప్రేక్షకులు ముగింపులో మాత్రం నానిని చూసి దద్దరిల్లేలా ఈలలు వేయడం బావుంది. ఈ రివ్యూ రాసినవాడికి ఇప్పుడు హుషారొచ్చింది!

—సికిందర్

1254 : రివ్యూ!

రచన - దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
తారాగణం : ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధికా శరత్‌కుమార్, రవీనా తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
బ్యానర్ : ఎజిఎస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కల్పతి అఘోరం, కల్పతి గణేష్, కల్పతి సురేష్
తెలుగు పంపిణీ : దిల్ రాజు
విడుదల : నవంబర్ 25, 2022
***
        వంబర్ లో విడుదలై తమిళంలో హిట్టయిన లవ్ టుడే తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. తమిళంలో కోమలి అనే హిట్ తీసిన దర్శకుడు ప్రదీప్ రంగ నాథన్ రెండో ప్రయత్నమిది. ఇందులో తనే హీరోగా నటించాడు. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన లవ్ టుడే రోమాంటిక్ కామెడీ తమిళంలో 70 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. అంత కొత్తదనం ఇందులో ఏముంది? నేటి ప్రేమల గురించి ఏమిటి కొత్తగా చెప్పారు? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) కాగ్నిజెంట్‌లో డెవలపర్ గా జాబ్ చేస్తూంటాడు. తల్లి సరస్వతి (రాధిక), అక్క దివ్య (రవీనా రవి) లతో కలిసి వుంటాడు. దివ్యకి 8 నెలల క్రితం డాక్టర్ యోగి (యోగి బాబు) తో నిశ్చితార్థం జరిగింది. ఇంకో నాల్గు రోజుల్లో పెళ్ళి వుంది. ఇలా వుండగా, ప్రదీప్ తన కొలీగ్ నిఖిత (ఇవానా) ని గాఢంగా ప్రేమిస్తూంటాడు. ఆమె కూడా అంతే గాఢంగా ప్రేమిస్తుంది. ఇక పెళ్ళి చేసుకుందామని ప్రదీప్ వెళ్ళి ఆమె తండ్రి (సత్యరాజ్) ని కలుస్తాడు. ఆ తండ్రి ఉద్యోగం, కులం, ఆస్తీ అంతస్తులు ఇవేమీ అడగడు. కేవలం ఇద్దరూ ఫోన్లు మార్చుకుని ఒక రోజు గడిపితే, అప్పటికీ పెళ్ళికి ఓకే అనుకుంటే తనకూ ఓకే అని చెప్పేస్తాడు. ప్రదీప్ ఫోను నిఖిత కిచ్చి, నిఖిత ఫోను ప్రదీప్ కిచ్చేస్తాడు.

ఈ విచిత్ర కండిషనుతో ఇరుకున పడ్డ ఇద్దరూ ఎలాటి అనుభవా లెదుర్కొన్నారు? ఒకరి ఫోను ఇంకొకరి దగ్గరుంటే ఏఏ రహస్యాలు బయటపడ్డాయి? ఏఏ గొడవలు జరిగాయి? ఇవి తట్టుకుని ప్రేమని నిలబెట్టుకున్నారా? పెళ్ళికి అర్హత సంపాదించుకున్నారా? మధ్యలో ప్రదీప్ అక్క పెళ్ళి గొడవలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రేమించి పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఆ ప్రేమ నిలబడుతుందని గ్యారంటీ లేదు. ముందే పరీక్ష పెడితే ఏ విషయం తేలిపోతుంది. సినిమాలు కులాలో అంతస్తులో కలవక పెద్దలు అడ్డుకునే కథలతోనే వచ్చాయి. ఈ పాత ఫార్ములా కాకుండా, నేటి కాలపు ప్రేమలకి కీలెరిగి వాతపెట్టే ఆధునిక దృక్పథపు తండ్రి పాత్రతో కొత్త కథ చెప్పాడు దర్శకుడు.

దీనికి కమల్ హాసన్ - సరితలతో కె. బాలచందర్ తీసిన మరోచరిత్ర తో పోల్చ వచ్చు. 1980 లలోనే బాలచందర్ ముందు కాలపు ప్రేమల్ని నిర్వచించాడు. ఇందులో ఇద్దరి తల్లిదండ్రులు ప్రేమికులిద్దరూ ఓ ఏడాదిపాటు కలుసుకోకుండా దూరంగా వుంటే- అప్పుడా తర్వాత కూడా ఇంతే బలంగా పరస్పరం ప్రేమ ఫీలైతే - పెళ్ళి చేస్తామని పరీక్ష పెడతారు. అప్పట్లో బాల చందర్ తీసిన ఈ తెలుగు స్ట్రెయిట్ మూవీ పెద్ద సంచలనం. తిరిగి ఏక్ దూజే కే లియే గా కమల్ హాసన్ తోనే హిందీలో తీస్తే అదీ సంచలనం. ఇందులో ఒక ఏడాది పాటు కమ్యూనికేషన్ లేని దూరాలైతే, లవ్ టుడే లో ఒక రోజు పాటు కమ్యూనికేషన్ తో దూరాలు.

ఈ కథని కొత్త రకంగా వుండే సీన్లతో కొత్త కొత్తగానే చెప్పాడు. ఎక్కడా పాత మూస కన్పించదు. ప్రేమికుల ఒకరి సెల్ ఇంకొకరి దగ్గరుంటే దాచి పెట్టిన ఏ ఏ విషయాలు బయట పడతాయి, ఎవరెవరు కాల్స్ చేస్తే ఏఏ సంబంధాలు రట్టవుతాయి, సోషల్ మీడియా యాప్స్ ఇంకేం సంక్షోభాలు సృష్టిస్తాయి - వీటికెలా రియాక్ట్ అవుతారు, కొట్టుకుంటారు, అసలు ప్రేమల మీదే నమ్మకమెలా పోతుందీ- ప్రేమలు ఒక బూటకమనీ తెలుసుకునేందుకు మోబైల్స్ ని మించిన మీడియం ఏముందీ వగైరా నవ్విస్తూ ఏడ్పిస్తూ, తీపి చేదుల మిశ్రమంలా చేసి చెప్పాడు. సెల్ ఫోన్స్ ఎంత సామాజిక సేవ చేస్తాయో ఆవిష్కరించాడు. ఇక ప్రేమ పెళ్ళిళ్ళని ఓకే చేయాలంటే  సెల్ ఫోన్లు మార్చి చూడడమే.

అయితే సినిమా స్లోగా నడవడాన్ని భరించాలి. ఫస్టాఫ్ కామెడీ చేసి, సెకండాఫ్ ఎమోషన్లతో బరువు పెంచాడు. ఈ బరువు యూత్ ఆడియెన్స్ కి బోరు కొట్టకుండా కథలో గాఢంగా ఇన్వాల్వ్ చేశాడు. ఇలాటివి యూత్ ఎవరికైనా ఎదురు కాగల పరిస్థితులే. వీటన్నిటితో రెండున్నర గంటలదాకా నిడివి సాగుతుంది. అయితే కేవలం ఇద్దరి ప్రేమికుల కథగా చెప్తే బలం వుండదని- కమెడియన్ యోగిబాబు డాక్టర్ క్యారక్టర్ తో, హీరో అక్క పెళ్ళి గొడవల గురించిన కామిక్ సబ్ ప్లాట్ ని సృష్టించాడు. అయితే యోగిబాబు కామెడీ అంతగా ఏమీ నవ్వించదు. హీరో హీరోయిన్లతో చివరి పదిహేను నిమిషాలు ముగింపు  దృశ్యాలు హైలైట్ గానే  వుంటాయి. తను తీసిన షార్ట్ ఫిలింనే ఈ  సినిమాగా తీశాడు దర్శకుడు.

నటనలు- సాంకేతికాలు  

హీరోగా నటించిన దర్శకుడు ప్రదీప్ అతి సామాన్యుడిగా కన్పించే పాత్రలో గమ్మత్తైన బాడీ లాంగ్వేజ్ తోనే నవ్వొచ్చేలా వుంటాడు. ఫస్టాఫ్ కామెడీగా నటిస్తూ సెకండాఫ్ లో సీరియస్ గా మారిన పాత్రతో, తన కారణంగా హర్ట్ అయిన హీరోయిన్ తో- ఎమోషనల్ గా మారే దృశ్యాల్లో బలహీన నటన కనబరుస్తాడు. దర్శకుడుగా మాత్రం ఫర్వాలేదన్పించుకుంటాడు. హీరోయిన్ ఇవానా క్యారక్టర్ బలమైనదే అయినా తను బలమైన నటి కాదు. సెకండాఫ్ లో ఏడ్పు సీన్లకి బాగా కష్టపడాల్సి వచ్చింది. హీరో తల్లిగా రాధికది స్వల్ప పాత్ర. అయితే ఫన్నీగా వుండే పాత్ర. డాక్టర్  గా యోగిబాబుకి అంతగా కామెడీ లేదు. హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ మరో మారు ప్రిన్స్ లో లాగా కథని డ్రైవ్ చేసే పూర్తి స్థాయి బలమైన పాత్ర- హాస్యంతో కూడిన నటన.

యువన్ శంకర్ రాజా సంగీతం గురించి చెప్పాలంటే అవి పాటల్లా లేవు, మాటల్లా వున్నాయి. రొటీన్ పాటల నుంచి ఇదొక రిలీఫ్. ఇక కామెడీ సినిమాకి నేపథ్య సంగీతం ఏముంటుంది. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం తక్కువ బడ్జెట్ తో తీసిన సాధారణ లొకేషన్స్ లో రిచ్ గానే అన్పించేట్టు వుంది.

ఎప్పుడూ అవే టెంప్లెట్స్ తో- అంటే, అయితే అపార్ధాలతో విడిపోవడం, లేకపోతే ప్రేమిస్తున్న విషయం  పైకి చెప్పలేక లోలోన ఏడుస్తూ వుండడం అనే రెండే ప్రేమ డ్రామాలతో రొటీన్ గా వస్తున్న ప్రేమ సినిమాల మధ్య లవ్ టుడే కొత్త మేకర్స్ కి కనువిప్పు. చేతిలో వుండే టెక్నాలజీతోనే రిలేషన్ షిప్స్ లోపలి స్వరూపాల్ని బయట పెట్టి ఆలోచింప జేస్తూ, ఇంతకి ముందు రాని కోణంలో ఈ కాలపు ప్రేమ సినిమా లవ్ టుడే’.         

సినిమా ప్రారంభంలో, చిన్నప్పుడు హీరో మామిడి పండు రసం పీల్చి, టెంక పాతి పెట్టే దృశ్యం వుంటుంది. విత్తనం నాటాకా దాని సమయం అది తీసుకుని వృక్షమై ఫలాల్నిస్తుంది. ఓపిక పట్టాలి. ప్రేమలో కూడా ఇంతే. ప్రేమలో పడ్డాక నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకున్నప్పుడే దాని ఫలాల్ని పరిపూర్ణంగా అనుభవించొచ్చని దర్శకుడు చెప్పే నీతి.

—సికిందర్