రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, నవంబర్ 2022, మంగళవారం

1242 : హాలీవుడ్ రివ్యూ!


 

        టీవల సీరియల్ కిల్లర్ సినిమాలు పెరిగిపోయాయి. ఈ థ్రిల్లర్స్ కి ప్రేక్షకులు ఎక్కువ వుంటున్నారని, మంచి వ్యాపార సాధనమనీ కుప్పతెప్పలుగా తీసి మార్కెట్లో వదులుతున్నారు. అయితే సీరియల్ కిల్లింగ్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా ఎందుకు మారింది, దీన్నెలా అరికట్టాలి, అసలు దీని మూల కారణాలేమటీ తెలియజెప్పే కోణంలో సినిమాలు రావడం లేదు. సీరియల్ కిల్లింగ్స్ కి బలయ్యేది అమాయకులే. హంతకుడితో ఏ సంబంధంలేని అమాయకులు. అమాయకుల్ని బలితీసుకునే టెర్రరిజం, సీరియల్ కిల్లింగ్స్ రెండూ ఒకటే. కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రభుత్వాలు సీరియల్ కిల్లింగ్స్ మీద దృష్టి పెట్టడం లేదు. 400 మందిని చంపగల సీరియల్ కిల్లర్స్ ఏ టెర్రరిస్టులకీ తక్కువ కాదు. సీరియల్ కిల్లర్స్- టెర్రరిస్టులు ఇద్దరూ మానసిక రోగులే.

    యితే ఇవేమీ చర్చించకుండా ఇంకో సీరియల్ కిల్లర్ సినిమా రోటీనుగా వచ్చేసింది. ది గుడ్ నర్స్ పేరుతో ఈ నెల 21న విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది. దీని దర్శకుడు డెన్మార్క్ కి చెందిన టోబియాస్ లిండ్హామ్. ఇందులో నర్సు అమీగా జెస్సికా చాస్టెయిన్, సీరియల్ కిల్లర్ చార్లీ కొలెన్ గా ఎడ్డీ రెడ్మాయెన్ నటించారు. పోలీస్ డిటెక్టివ్ డానీగా నామ్డో అసాముగా, ఇంకో పోలీస్ డిటెక్టివ్ టిమ్ గా నోవా ఎమరిచ్ టిమ్లా నటించారు. సంగీతం బయోస్ఫేర్, ఛాయాగ్రహణం జోడీ లీ లైప్స్. ఈ అమెరికన్ సీరియల్ కిల్లర్ మూవీ ఎలా వుందో చూద్దాం...

        అమీ పెన్సిల్వేనియాలోని ఒక ఆస్పత్రిలో నర్సు. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్. అత్యవసరంగా ఆమె గుండె మార్పిడి చికిత్స చేయించుకోక పోతే ప్రాణాపాయం. అయితే ఆమె పని చేసే ఆస్పత్రిలో ఏడాది సర్వీసు పూర్తి కాని పరిస్థితి వల్ల ఆస్పత్రి అందించే ఉచిత బీమా సౌకర్యం ఆమెకి వర్తించదు. ఇంకో మూడు నెలలు గడిస్తే గానీ ఏడాది పూర్తి కాదు. ఇలా ఇబ్బందిపడుతూనే, డ్యూటీలతో వొత్తిడికి లోనవుతూనే నైట్ షిఫ్ట్స్ చేస్తూంటుంది.

కొత్త నర్సు ఎంట్రీ

    ఇప్పుడు చార్లీ కొలెన్ అనే అతను కొత్త నర్సుగా వచ్చి చేరతాడు. అమీ పరిస్థితికి జాలిపడతాడు. ఆస్పత్రిలో మందులు కొట్టేసి ఆమెకిస్తూంటాడు. ఆమె పిల్లలకి దగ్గరవుతాడు. ఆమెకి క్లోజ్  ఫ్రెండ్ అవుతాడు. ఇంతలో ఆస్పత్రిలో ఒక రోగి అవసరం లేని డబుల్ డోస్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తో చనిపోతాడు. ఈ ఇంజెక్షన్ ఎవరిచ్చారో అర్ధంగాదు. ఆస్పత్రి యజమాన్యం కంప్లెయింట్ చేస్తుంది. ఇద్దరు పోలీస్ డిటెక్టివులు డానీ, టిమ్ లు వచ్చి దర్యాప్తు చేపడతారు.

        దర్యాప్తు జరుగుతూండగానే మరి కొందరు రోగులు సరికాని ఔషధ మోతాదుల కారణంగా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం ప్రారంభిస్తారు. డిటెక్టివులు అమీని కఠినంగా ప్రశ్నిస్తారు. కొత్తగా చేరిన చార్లీ నేపథ్యాన్ని ఆరా తీస్తారు. వేరే ఆస్పత్రిలో చార్లీ పనిచేసినప్పుడు ఇలాగే మరణాలు సంభవించాయని, ఆస్పత్రి యాజమాన్యం కంప్లెయింట్ చేయకుండా చార్లీని తొలగించారనీ తెలుసుకుంటారు. చార్లీని ప్రశ్నిస్తే క్లూ ఏమీ దొరకదు. కానీ అమీకి చార్లీమీద అనుమానం బలపడి, అతడ్ని సీరియల్ కిల్లర్ గా నిరూపించేందుకు సాక్ష్యాధారాల సేకరణ మొదలెడుతుంది...

చార్లీ ఎవరు?

    ఈ సీరియల్ కిల్లర్ కథకి నిజ కేసు ఆధారమని సమాచారమిచ్చారు. చార్లీ కొలెన్ అనే నర్సు వివిధ  న్యూజెర్సీ ఆస్పత్రుల్లో 1988-2003 మధ్య 400 మంది రోగుల్ని చంపి పట్టుబడ్డాడు. 2006 లో అతడికి 11 యావజ్జీవ శిక్షలు పడ్డాయి. కానీ ఎందుకు చంపాడో అతను కారణం చెప్పలేదు, పోలీసులు కూడా తెలుసుకోలేక పోయారు. ఈ కేసు తీసుకుని ది గుడ్ నర్స్ నిర్మించారు.

        అయితే సినిమాతో వచ్చిన సమస్యేమిటంటే, అమీ పాత్ర పరంగా ఆమె దృక్కోణంలో కథ సాగుతుంది. అందుకని చార్లీ చేసే హత్యా దృశ్యాలుండవు. మరణాలే చూపిస్తూంటారు. అంటే యాక్షన్ వుండదు. అతడి మీద అమీ సాక్ష్యాధారాలు సేకరించే దృశ్యాలే వుంటాయి. డిటెక్టివుల ఇంటరాగేషన్లు వుంటాయి. సీరియల్ కిల్లర్ గా చార్లీతో యాక్షన్ దృశ్యాలుండవు. ఈ మూవీ యాక్షన్ తో గాకుండా డైలాగులతోనే నడుస్తుంది- రంగస్థల నాటకం లాగా. అందుకని యాక్షన్ తో వుండే థ్రిల్స్, సస్పెన్స్, టెంపో, టెన్షన్, టెర్రర్ వంటివి అనుభవం కావు. క్లయిమాక్సు, ముగింపు కూడా డైలాగులతోనే వుంటాయి. ఈ కథలో కూడా అతనెందుకు చంపాడో చెప్పలేదు. సీరియల్ కిల్లర్ గా అనుమానితుడిగా కన్పిస్తున్నప్పుడు అతడి నేర మనస్తత్వం కూడా మొహంలో కనపడదు.

        గుండె జబ్బుతో వున్న అమీకి మరెవ్వరూ రోగులు హత్యకి గురవకుండా చూసే బాధ్యత, హంతకుడిగా చార్లీని పట్టుకునే కర్తవ్యం కల్పించి ఎంత రెండు గంటల సేపు కథ నడిపినా ఫలితం లేకపోయింది. పైగా లైటింగ్ తో సమస్య వుంది. లో-కీ లైటింగ్ తో దృశ్యాలు షూట్ చేశారు. దీంతో దృశ్యాలు, మొహాలు సరిగ్గా కనిపించని పరిస్థితి. హార్రర్ ఫీలింగ్ ని క్రియేట్ చేయడానికి ఇలా చేసి వుండొచ్చు, కానీ కథలోనే హార్రర్ లేనప్పుడు చిత్రీకరణతో వస్తుందా?

    హాస్పిటల్లో, అమీ ఇంట్లో పూర్తిగా ఇండోర్స్-టు-ఇండోర్స్ గా జరిగే ఈ కథ తగిన వేగం కూడా లేక జడంగా వుంటుంది. యాక్షన్ లేకపోయినా సీరియల్ కిల్లర్ క్యారక్టర్ స్టడీకైనా పనికొస్తుందా ఈ సినిమా అంటే అదేం లేదు. మెడికల్ థ్రిల్లర్ అన్నాక సీరియల్ కిల్లర్ మానసిక లోకం కూడా బయటపెట్టకుండా, అసలు మానసిక వైద్యుల పాత్రే లేకుండా కథ నడిపేశారు. భయంకర నిజజీవిత సీరియల్ కిల్లర్ని చూడాలనుకుంటే, నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలైన డాహ్మర్ చూస్తే చాలు.

—సికిందర్

31, అక్టోబర్ 2022, సోమవారం

1241 : కొరియన్ రివ్యూ!

    2000ల ప్రారంభంలో మ్యూజిక్, మూవీస్ సహా దక్షిణ కొరియా వినోద పరిశ్రమ కొంత మాంద్యాన్ని ఎదుర్కొంది. అయితే కాలం గడిచే కొద్దీ ఈ రెండు రంగాలు వాటి సొంత అస్తిత్వాలతో  ప్రపంచ సూపర్ పవర్‌లుగా మారే స్థాయికీ క్రమంగా అభివృద్ధి చెందాయి, ఆర్ధికంగా అపూర్వ విజయాలు సాధిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల సంఖ్యనూ అపారంగా పెంచుకున్నాయి. మన దేశంలోనైతే చెప్పనవసరం లేదు, ఇక తెలుగులో సరే- ఎన్నో కొరియన్ సినిమాలు తెలుగులో ఫ్రీమేకులు, రీమేకులు చేసేస్తున్నారు. ఇవాళ కొరియన్ సినిమా సాంకేతికంగానూ, సృజనాత్మకంగానూ గుణాత్మకమైన ఆవిష్కరణలు చేస్తూ పురోగమిస్తోంది. శాంసంగ్, ఎల్జీ వంటి టాప్ టెక్నాలజీ బ్రాండ్లని పక్కన పెడితే, దక్షిణ కొరియా అంతర్జాతీయంగా మిలియన్ల కొద్దీ గృహాలకు కె -పాప్ అంటూ మ్యూజిక్ ని, కె- డ్రామాలంటూ సినిమాలనూ అమోఘంగా ఎగుమతి చేస్తోంది.

          కె- డ్రామా అంటే కొరియన్ రోమాంటిక్ డ్రామాలు  ఒక తిరుగులేని బ్రాండ్ గా పాపులరయ్యాయి. కె- డ్రామాలు చూడకపోతే చిన్న చూపుకి గురయ్యే పరిస్థితి దాకా వెళ్ళింది. ఇవి చాలా వరకూ టీనేజీ రోమాన్సులుగానే వుంటాయి. అలాగని అసభ్య అశ్లీల వెకిలి తనాలతో వుండవు. చీప్ కామెడీలతో వుండవు. టీనేజీ సినిమాలని కూడా కొరియన్ సంస్కృతిని, విలువల్నీ ప్రతిబింబిస్తూ టీనేజర్లలో ఉత్తమాభిరుచిని ప్రోత్సహించేలా తీస్తారు. క్లాసిక్ అనే మూవీ చాలా పెద్ద ఉదాహరణ. ఈ కె- డ్రామా జానర్ లో తాజాగా ట్వెంటీయత్ సెంచురీ గర్ల్ విడుదలైంది.

        అక్టోబర్ 21 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ర్యాంకులో 7 వ స్థానం పొందింది. హిందీ ఆడియోతో అందుబాటులో వుంది. ఇందులో కొరియన్ పాత్రల పేర్లు ఇబ్బందికరంగా, ఫాలో అవడానికి తికమకగా వుండొచ్చని తెలుగు పేర్లుగా మార్చాం :సారిక (పాత్ర పేరు నబో-రా, నటి కిమ్ యో-జంగ్), దశ (పాత్ర పేరు యోన్-డు, నటి రోహ్ యూన్-సియో), ఆకార్ (పాత్ర పేరు బేక్ హ్యూన్-జిన్, నటుడు పార్క్ జంగ్-వూ), ఆకాష్ (పాత్ర పేరు పూన్ వూన్-హో, నటుడు బైయోన్ వూ-సియోక్). దీనికి దర్శకురాలు బాంగ్ వూ-రీ.

విషయంలోకి వెళ్తే...

    20వ శతాబ్దం ముగిసే ఒక సంవత్సరం ముందు, 1999లో ఈ ప్రేమ కథ. అథ్లెటిక్స్ లో ఆరితేరిన సారిక అనే 17ళ్ళ స్టూడెంట్ కి దశ అనే క్లాస్ మేట్ వుంటుంది. దశ హార్ట్ సర్జరీ కోసం యూఎస్ వెళ్ళాలి. అయితే తను ఆకార్ అనే స్టూడెంట్ ని తొలి చూపులోనే వలచినందున, ఇంకా అతడి గురించి తెలుసుకోకుండా హార్ట్ సర్జరీకి యూఎస్ వెళ్ళలేనని మొండికేస్తుంది. ఏం ఫర్వాలేదు, తను ఆకార్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఈ మెయిల్ చేస్తూంటానని సారిక హామీ ఇవ్వడంతో, నిశ్చింతగా యూఎస్ కెళ్తుంది దశ.

        కాలేజీలో సారిక ఆకార్ ని ను అనుసరించడం మొదలెడుతుంది. ఒక రోజు ఆమె ఆకార్, అతడి క్లాస్ మేట్ ఆకాష్ ఇద్దరూ కాలేజీ బ్రాడ్‌కాస్టింగ్ క్లబ్‌లో చేరబోతున్నారని విని, తనుకూడా దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. క్లబ్‌  ఆడిషన్స్ లో ఎంపికవుతుంది. ఆకాష్ కూడా ఎంపికవుతాడు, కానీ ఆకార్ అప్లయి చేసుకోలేదని తెలుసుకుని నిరాశ చెందుతుంది.  

        దీంతో సారిక ఆకార్ ని నిశితంగా పరిశీలించడానికి ఆకాష్ కి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆకాష్ తో సన్నిహితంగా మెలగడంలోని ఆంతర్యం గ్రహించిన ఆకార్, తననే ప్రేమిస్తోందని పొరబడి డేటింగ్ ప్రపోజ్  చేస్తాడు. దశ బాయ్ ఫ్రెండ్ తనని డేటింగ్ అడిగేసరికి కంగారు పడిన సారిక కాదు పొమ్మంటుంది. అయితే ఈమె ఆకాష్ తో ప్రేమలో వుందనుకుంటాడు ఆకార్. సారిక కూడా తనకి ఆకాష్ పట్ల ఫీలింగ్స్ పెరుగుతున్నాయని తెలుసుకుంటుంది. ఇది గ్రహించిన ఆకాష్ ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.  

        ఇక విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయి గుండెని పదిలంగా పట్టుకుని దిగిన దశ, ఇక్కడి పరిస్థితి చూసి ఢామ్మంటుంది. సారిక తప్పుడు అబ్బాయిని అనుసరించి వివరాలు పంపిందని గ్రహించి మంచాన పడుతుంది. తను ప్రేమించింది ఆకార్ ని కాదు, ఆకాష్ నే.  తను ఆకాష్ ని మొదటిసారి కలిసిన రోజు, అతను ఆకారే అనుకుంది. ఎందుకంటే అతను ఆకార్ పేరుగల  ట్యాగ్‌తో వున్న ఆకార్ జాకెట్‌ ని ధరించాడు!

        వార్నీ, కొంప మునిగిందనుకున్న సారిక, గుండాపరేషన్ దశని పరేషాన్ చేయకూడదని తను ఆకాష్ నే ప్రేమిస్తున్న విషయం దాచి పెడుతుంది. దాచిపెట్టి ప్రాణస్నేహితురాలి పట్ల విశ్వాసంతో ఆకాష్ ని దూరం పెడుతూంటుంది. అయితే ఆకార్ ద్వారా, ఆకాష్ - సారిక ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం దశ తెలుసుకుంటుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకుని, తమ స్నేహం కోసం తనే ఆకాష్ మర్చిపోతానని అనేస్తుంది. ఇదీ విషయం.

స్నేహాలు- విశ్వాసాలు

   ప్రేమంటే స్వార్ధమనీ, స్నేహమంటే విశ్వాసమనీ ప్రేమ కంటే స్నేహమే ఉదాత్తమైనదనీ, త్యాగాలకి సిద్ధపడే టీనేజర్ల కథ ఇది. దర్శకురాలు ఇది తన జీవితానుభవమేనని చెప్పుకుంది. దీన్ని టీనేజర్ల ముందుంచింది. అయితే విషాదాంతం చేయకుండా వుండాల్సింది. టీనేజర్లకి  ప్రేమలు-పొరపాట్లు- దిద్దుబాట్లు వుంటాయి. దిద్దుబాటు చూపించి మార్పు తేవాలనుకోవాలేగానీ, మరణమే పరిష్కారమని కాదు. స్నేహంలో ప్రాణత్యాగం మిగిలున్న వ్యక్తికి జీవిత కాల శిక్షయి పోతుంది. టీనేజీ ప్రేమ కథల్ని ట్రాజడీ చేయాల్సిన  అవసరం లేదు.

        ప్రధాన పాత్ర సారికని పోషించిన నటి  కిమ్ యో-జంగ్ నటన చిలిపితనంగా ప్రారంభమై, గంభీరంగా మారుతుంది. సున్నితంగా బాగానే  నటించింది. స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తనని ప్రఫోజ్ చేయడంతో కంగారు పడి- ఏవేవో తన దురలవాట్లు, చెడ్డ గుణాలూ చెప్పుకుని తప్పించుకునే కామెడీ  సీను బావుంటుంది. నూడుల్స్ అసహ్యంగా తింటానని కూడా తింటూ చూపిస్తుంది.

        స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ వివరాలు కూపీలాగే పనులు కూడా హాస్యంగా  వుంటాయి. తను కనుగొన్న ప్రతిదాన్నీ శ్రద్ధగా ఈ - మెయిల్ చేస్తూంటుంది - అతడి షూ సైజు దగ్గర్నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఇంటి చిరునామా వరకూ- కష్టపడి సేకరించి పంపుతుంది. అతను ఒక సినిమా సీడీ కోరితే అది తీసుకొచ్చి ఇస్తే, ఏం సీడీ తెచ్చిందో బయటపడి- ఆ అడల్ట్ సీడీని పైకెత్తి పట్టుకుని అందరికీ కనిపించేలా గోడకుర్చీ వేసుకోమని పనిష్ చేస్తాడు ప్రిన్సిపాల్. ఆమె అలా సీడీ పట్టుకు కూర్చోవడాన్ని బాయ్ ఫ్రెండ్ కూడా చూసేసరికి – నిన్ను నాశనం చేస్తా- అని తిట్టుకుంటుంది. ఇతన్నే తన టెక్వాండో విద్యతో రౌడీల బారి నుంచి కాపాడుతుంది. కానీ తన కాలే విరిగి ప్లాస్టర్ వేయించుకుంటుంది. ఇలాటివన్నీ ఎంటర్టయిన్ చేస్తూ నటించింది.  

        దశ పాత్రలో నటి, ఆకార్, ఆకాష్ పాత్రల్లో నటులూ ప్రతిభ గల వాళ్ళే. దర్శకురాలు అలా నటింపజేసుకుంది. ఈ నల్గురు తప్ప వీళ్ళ మధ్య కథలోకి ఇంకెవ్వరూ రారు. ఈ ఫిల్టరింగ్ ఫ్రెష్ గా వుంటుంది. రెండు గంటల రన్నింగ్ టైమ్ ఉన్నప్పటికీ, కొన్ని కీలక పాత్రల్ని ముందుకు తీసికెళ్ళకుండా వదిలేసింది దర్శకురాలు. పైన చెప్పుకున్నట్టు ముగింపు మాత్రం జనాదరణ పొందక పోవచ్చు. 20వ శతాబ్దం చివర్లో కూడా టీనేజర్ల మనస్తత్వాలు, విలువలతో వాళ్ళ అయోమయం, వాళ్ళ అనాలోచిత నిర్ణయాలూ వుండేవని చెప్పదల్చుకుందేమో. 20వ శతాబ్దపు అమ్మాయి కథ కాబట్టి. 

నిర్మాణ విలువలు - కాలీన స్పృహ

        1999 నాటి నేపథ్య వాతావరణ సృష్టి బాగా జరిగింది. ఆనాటి వీహెచ్ఎస్  టేపులు, పేజర్లు, పబ్లిక్ ఫోన్‌బూత్‌లతో సహా 90ల నాటి సైన్‌ బోర్డులూ దర్శన మిస్తాయి. అప్పటి కంప్యూటర్లు సరే. ఈమెయిల్ ఇంటర్ఫేస్ కూడా. అప్పటి ప్రసిద్ధ కె-పాప్ వీడియోలు, టీవీ  డ్రామాలూ  జ్ఞాపకాలని ళ్ళీ పునరుజ్జీవింపజేస్తాయి. టీనేజీ కథాలోకానికి వాడిన కలర్స్, లొకేషన్స్, సెట్స్ ఎక్కడా రఫ్ గా వుండవు. నేపథ్య సంగీతం సహా ప్రతీదీ నిర్మాణ విలువల పరంగా, టీనేజీ వయస్సంత సౌకుమార్యంతో వుంటాయి. కంటికి, వొంటికి ఆరోగ్యకరంగా.

        హాలీవుడ్ లోనైనా సరే, కొరియాలో నైనా సరే, టీనేజీ రోమాన్సులన్నాక 17 - 19 మధ్య వయస్కులతోనే తీస్తారు. మనలాగా 20-25 ఏళ్ళ ముదురు శాల్తీలతో, ఇంకా గడ్డాలూ మీసాలేసుకున్న బెరడు ఫేసులతో తీయరు. అందుకని వయస్సుకి తగ్గ టీనేజీ ఇన్నోసెన్స్ తో, వాళ్ళకి నప్పే చేష్టలతో అవి సహజంగా వుంటాయి. టీనేజీతో మన జ్ఞాపకాల్లోకి తీసికెళ్తాయి. అందుకే కె- డ్రామాలు అంత పాపులరవుతున్నాయి. మన మేకర్లు టీనేజీలో వాళ్ళు చూసిన జీవితాన్ని పాతికేళ్ళ పోకిరీ రూపాలతో రోమాంటిక్ కామెడీలుగా డ్రామాలుగా తీసి పరమానందం పొందుతారు. ఇంకా మాట్లాడితే మెడిసిన్ చదివే లవర్స్ ని పదహారేళ్ళ టీనేజర్ల మాటలతో, చేష్టలతో చూపించి దురదానందం అనుభవిస్తారు.

—సికిందర్

 

30, అక్టోబర్ 2022, ఆదివారం

1240 :రివ్యూ!



దర్శకత్వం : ఇంద్ర కుమార్
తారాగణం : అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహీ తదితరులు
రచన : ఆకాష్ కౌషిక్, మధుర్ శర్మ; ఛాయాగ్రహణం : అసీమ్ బజాజ్, సంగీతం : అమర్ మోహిలే
బ్యానర్స్ : టీ-సిరీస్ ఫిల్మ్స్, మారుతీ ఇంటర్నేషనల్, సోహమ్ రాక్‌స్టార్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృషన్ కుమార్, అశోక్ ఠాకేరియా, సునీర్ ఖేటర్‌పాల్దీపక్ ముకుత్, ఆనంద్ పండిట్, మార్కండ్ అధికారి
విడుదల : అక్టోబర్ 25, 2022
***
          దీపావళి సినిమాల శ్రేణిలో థాంక్ గాడ్ ఇంకో ఫీల్ గుడ్ మూవీ అని ప్రకటించుకుంటూ వచ్చింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాల కాంబినేషన్లో సీనియర్ దర్శకుడు ఇంద్రకుమార్ కుటుంబ పర ప్రేక్షకులకి అందిస్తున్న కాకర పువ్వొత్తి అన్నారు. ఇంకా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో హోమ్లీ వాతావరణం. మామూలుగా అయితే పెద్ద స్టార్లు దీపావళి కుటుంబపర సినిమాలతో దిగాలి. ఈసారి గైర్హాజరయ్యాక అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లు మాత్రం వచ్చారు. అక్షయ్ కుమార్ తో రామ్ సేతు అనే భక్తి యాక్షన్ మూవీ అడుగున మిగిలుంటే 1-1.5 రేటింగ్స్ ని కూడా సొంతం చేసుకుని గర్వకారణంగా నిలిచాక, అజయ్ పరిస్థితి ఏమిటి? దీపావళికి తన జీవితంలో, ప్రేక్షకుల జీవితాల్లో వెలుగులు నింపడానికా? చీకట్లు నింపడానికా? ఇది తెలుసుకుందాం...

కథ

    కొన్నేళ్ళ క్రితం అయాన్ కపూర్ (సిద్ధార్థ్ మల్హోత్రా) ముంబైలో టాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా బాగా డబ్బు గడిస్తాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా పని చేసే భార్య రుహీ  కపూర్ (రకుల్ ప్రీత్ సింగ్), చదువుకునే కూతురు పిహూ కపూర్ (కీయారా ఖన్నా) వుంటారు. ఇంతలో పెద్ద నోట్లు రద్దు కావడంతో నల్లధనంతో నడిచే అతడి వ్యాపారం మూతబడుతుంది. అప్పులపాలై, ఇల్లు అమ్మకానికి పెట్టి కస్టమర్స్ దొరక్క కోపం, చిరాకు, ఆవేశం పెంచుకుని అల్లరి చేస్తూంటాడు. ఒక ఉద్రిక్త పరిస్థితిలో అదుపు తప్పి కారు యాక్సిడెంట్ చేసుకుంటాడు.

        కళ్ళు తెరిస్తే మాయాలోకంలో వుంటాడు. అది మోడరన్ గా వున్న యమలోకం. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబిసి) సెట్ లాగా వేసి వుంటుంది. ఆసనం మీద సూటు బూటు వేసుకుని ఆధునికంగా మిస్టర్ సీజీ (అజయ్ దేవగణ్) వుంటాడు. సీజీ అంటే చిత్రగుప్తుడు. అయాన్ పాపాల డేటా వినిపిస్తాడు. అందులో అయాన్ కోపం, స్వార్ధం, ఈర్ష్య, కామం వంటి నరకానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ వుంటాయి. నిజానికి అయాన్ చచ్చిపోయి యమలోకానికి రాలేదు. గాయాలతో హాస్పిటల్లో స్పృహలేని స్థితిలో ఆపరేషన్ టేబుల్ మీదున్నాడు. ఆత్మ కాసేపిలా యమలోకాని కొచ్చి మిస్టర్ సీజీకి చిక్కింది. ఆ ఆపరేషన్ కి అయిదు గంటలు పడుతుందనీ, ఈలోగా పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ తో జీవితంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని వస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందనీ, లేకపోతే ఇంతే సంగతులనీ మిస్టర్ సీజీ అప్డేట్స్ ఇస్తాడు.

        దీనికి గేమ్ ఆఫ్ లైఫ్ అనే గేమ్ షోలో పాల్గొనాలని రెండు డిజిటల్ కుండలు చూపిస్తాడు- పాపాల డిజిటల్ కుండ, పుణ్యాల డిజిటల్ కుండ. ఏ కుండ ముందు టాప్ అప్ కొస్తుందో దాని ప్రకారం అయాన్ సంగతి చూసుకోవడం జరుగుతుంది. ఖర్మ అనుకుని తప్పులు సరి దిద్దుకోవడానికి బయల్దేరతాడు అయాన్. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది 2009 నాటి డెన్మార్క్ సినిమా సార్టే కుగ్లర్ (సేల్స్ మాన్) కి అధికారిక రీమేక్ అని ప్రకటించి, పూర్తిగా భారతీయీ కరించారు. దర్శకుడు ఇంద్రకుమార్ 1990 లలో, 2000 ప్రారంభంలో దిల్, బేటా, రాజా, మస్తీ, ఢమాల్ వంటి 10 హిట్ సినిమాలు తీసిన వాడే. 2007 లో కనుమరుగై, తిరిగి 2011 నుంచి డబుల్ ఢమాల్, టోటల్ ఢమాల్, గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ అంటూ హిట్లే తీశాడు. కానీ ఇప్పుడేమైందో ఔట్ డేటెడ్ అయిపోయాడు. పూర్తిగా ’90 లనాటి వాసనలతో చాదస్తంగా థాంక్ గాడ్ తీశాడు.

        ఇలా దేవుడు పరీక్ష పెట్టే కథతో గతవారం ఓరి దేవుడా విడుదలైంది. 2021 లో తమిళంలో వినోదయా చిత్తం విడుదలైంది. వినోదయా చిత్తం’, థాంక్ గాడ్ దాదాపు ఒకటే. సముద్రకని దర్శకత్వం వహించిన వినోదయా చిత్తం (వింత కొరిక) లో దేవుడు వుండడు, కాలం రూపంలో సముద్రకని వుంటాడు. బాసిజంతో విర్రవీగే కార్పొరేట్ మేనేజర్ గా తంబి రామయ్య వుంటాడు. తను లేకపోతే ప్రపంచంలో పనులు జరగవనీ, ప్రపంచమే ఆగిపోతుందనీ ఆధిపత్య భావంతో కుటుంబం సహా జనాల్ని ఇబ్బంది పెడుతూంటాడు. ఒక రోజు కారు యాక్సిడెంట్ చేసుకుని కాలం దగ్గరికొస్తాడు. ఇంత త్వరగా తను చావడానికి వీల్లేదనీ, తను చేయాల్సిన పనులు ఇంకా మిగిలున్నాయనీతను లేకపోతే పనులాగి పోతాయనీ,  కనుక పనులు పూర్తి చేయడానికి 30 రోజుల సమయం కావాలనీ కాలాన్ని వేడుకుంటాడు. ఏం పనులు పూర్తి చేస్తావో చూస్తా పద - అని కాలం వెంట వస్తాడు.     

    
మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీమన కోసం కాలం ఆగదనీకనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ ఇది. ఇదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీజనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీమరణాన్ని చూసి భయపడకూడదనీచెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ.  ఇదే పేరుతో శ్రీవత్సన్ రాసిన తమిళ నాటకం  ఆధారంగా తీశారు. ఇందుకే గంటన్నర వుంది. నాటకం గాథగా వుంటే నష్టమేం లేదు. సినిమా కోసం నాటకాన్ని మార్చలేదని  సమాచారం. ఇక్కడే తప్పులో కాలేశారు ఈ గాథని కథగా మార్చకుండా. సముద్రకని దీన్ని గంటన్నర ప్రయోగాత్మక సినిమాగా తీసి ఓటీటీలో విడుదల చేశాడు. దీన్ని పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ లతో తెలుగులో రీమేక్ చేస్తామని ఆవేశపడ్డారు. తర్వాత వార్తల్లేవు. ఇది గాథ అని తెలుసుకోకుండా రీమేక్ చేసివుంటే చేతులు కాలేవి.

        ఇలా కాన్సెప్ట్ పరంగా థాంక్ గాడ్’, వినోదయా చిత్తం దగ్గర దగ్గరగా వుంటాయి. అయితే తమిళంలో తంబిరామయ్య నటన వల్ల ఎక్కువ వినోదంగా వుంటుంది. థాంక్ గాడ్ లో ఇద్దరు స్టార్లున్నా తీసిన విధానం వెనకటి కాలానికి చెందింది కావడం వల్ల నీరసంగా వుండి ఆకట్టుకోదు. పైగా ఇందులో హీరో పనులన్నీ ఆటంకాలు లేకుండా ఈజీగా జరిగి పోతూంటాయి. తంబిరామయ్య పూర్తి చేయాలనుకున్న పనులకి కాలం అడ్డు తగులుతూ వుంటుంది. ఎక్కువ సంఘర్షణకి లోనవుతాడు.

        చేసిన తప్పులు దిద్దుకునే కథతో నాగ చైతన్య నటించిన థాంక్యూ ఎలావుందో థాంక్ గాడ్ అలావుంది. హీరో యమలోకానికి వచ్చి గేమ్ ప్రారంభమయ్యే సీనుతో కథా ప్రారంభం తప్ప, మిగతా తప్పులు దిద్దుకునే సీన్లు నీరసంగా, పూర్ గా వుంటూ, ఇక ఇంద్రకుమార్ రిటైర్మెంట్ ని సూచిస్తున్నాయి.

నటనలు- సాంకేతికాలు
    యముడి పక్కన కామెడీగా వుండే చిత్రగుప్తుడు అజయ్ దేవగణ్ రూపంలో కామెడీగా వుండడు. అజయ్ తన సహజ ముఖ కవళికలతోనే వుంటాడు. నేటి కాలానికి మిస్టర్ సీజీగా స్టయిలిష్ చిత్రగుప్తుడుగా  హీరోకి ఆర్డర్లేస్తూంటాడు. మాటల్లో చిత్రగుప్తుడి వ్యంగ్యం కూడా వుండదు. కొన్ని డైలాగులు ఫన్నీగా వున్నాయి. ఒక బాగా నవ్వొచ్చే డైలాగుంది- మీ సూపర్ స్టార్ ఒకాయన పొడుగ్గా వుంటాడు కదా, ఆయన వచ్చి వెళ్ళాడు (కూలీ షూటింగులో అమితాబ్ బచ్చన్ గాయపడ్డ సంఘటన) ఇక్కడ గేమ్ గెలిచాడు. పోతూ మా ఐడియా దొంగిలించి కేబిసి షో ప్రారంభించుకున్నాడు అని!

          ఐతే యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పాత్రలో కామెడీ వుంది. అయితే తప్పులు దిద్దుకుంటూ చేసే కామెడీ కాలం చెల్లిన, పంచ్ లేని కామెడీ కావడంతో అతను తేలిపోయాడు. నేటి తరం ప్రేక్షకుల ట్రెండీ యాక్షన్ హీరో అయిన తను ఇలాటి సినిమాలోకి పొరపాటున వచ్చేశాడు.

        తెలుగులో కనుమరుగైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి హిందీలో ఆఫర్లు బాగానే వస్తున్నాయి గానీ, పాత్రలే సరిగ్గా వుండడం లేదు. పైగా సినిమాలు ఫ్లాపవుతున్నాయి- సర్దార్ కా గ్రాండ్ సన్, ఎటాక్, డాక్టర్ జీ, ఇప్పుడు థాంక్ గాడ్. ఇక నోరా ఫతేహీ యమలోకంలో ఒక పాటలో కన్పిస్తుంది.

        ఆధునిక యమలోకం సెట్, ఇతర సాంకేతిక విలువలు బాగానే వున్నాయి గానీ, పాటల విషయంలో ఇంద్రకుమార్ ఈసారి హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోయాడు. ఏవో పాటలు వచ్చిపోతాయి. ముగింపు సీను కూడా ఎంత సిల్లీగా వుందో చూస్తే- హీరో భార్యకీ, కూతురికీ ఒకే సారి కిడ్నీలు పోతాయి. ఇద్దరికీ తన రెండు కిడ్నీలూ  ఇచ్చేయడానికి ఆత్మహత్యా యత్నం చేస్తాడు హీరో. ఇంతలో డాక్టర్ వచ్చేసి - గుడ్ న్యూస్, కిడ్నీలు దొరికాయ్- ఎవరో చనిపోతూ అవయవ దానం చేశాడు. అవి సెట్ అయ్యాయి- అంటాడు. ఈ విడ్డూరం ఎలా జరిగింది? మిస్టర్ సీజీ వల్ల జరిగింది.

        ఇలా నవ్వాలో ఏడ్వాలో అర్ధంగాని ఈ సెంటిమెంటల్ డ్రామాని ప్రేక్షకులు తిట్టు కుంటారని ఇంద్రకుమార్ కి తెలిసే వుంటుంది. అందుకే ఉపాయంగా నేపథ్యంలో తన పాత హిట్ సాంగ్ వదిలాడు- దిల్ దేదీయా హై జాన్ తుమ్హే దీంగే, దగా నహీ కరేంగే సనమ్... అని పాట వస్తూంటే మాత్రం ప్రాణం లేచొస్తుంది మనకి నిజమే, కానీ దగా నహీ కరేంగే అంటూ పాటతోనే చేసిన దగాతో దొరికిపోయాడుగా!

—సికిందర్

 

29, అక్టోబర్ 2022, శనివారం

1238 : రివ్యూ!


రచన- దర్శకత్వం : అభిషేక్ శర్మ
తారాగణం : అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నుస్రత్ భరుచాసత్యదేవ్, నాజర్ తదితరులు
సంగీతం : డానియల్ బి. జార్జ్,   ఛాయాగ్రహణం : అసీమ్ మిశ్రా
బ్యానర్స్ : కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, మజాన్ ప్రైమ్, అబడాంటియాఎంటర్టయిన్మెంట్, లైకా ప్రొడక్షన్స్
నిర్మాతలు : అరుణా భాటియా విక్రమ్ మల్హోత్రా
విడుదల : అక్టోబర్ 25, 2022
***

      రుస ఫ్లాపులెదుర్కొంటున్న అక్షయ్ కుమార్ రామ్ సేతుతో విజయాలకి వారధి వేసుకుందామని వచ్చాడు. భక్తి- యాక్షన్ సినిమాల సీజన్ నడుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా దీన్ని చూసి తరిద్దామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ కి ముందు ప్రారంభమై ఈ దీపావళికి విడుదలవుతున్న దీని కోసం చాలా కష్టపడ్డాడు అక్షయ్ కుమార్, దర్శకుడు అభిషేక్ శర్మ మీద విశ్వాసంతో. అభిషేక్ శర్మ కిది  రెండో స్టార్ సినిమా. ఇవి తప్పిస్తే గతంలో తీసిన ఐదు సినిమాలూ చిన్న సినిమాలు. 2018 లో జాన్ అబ్రహాంతో పరమాణు- ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్అని భారత దేశం జరిపిన అణుపరీక్ష మీద తీశాడు. ఇది ఫర్వాలేదన్పించుకుంది. ఇప్పుడు రామాయణంలోని రామసేతు మీద భక్తి- యాక్షన్ థ్రిల్లర్ తీశాడు. మరి ఈ ప్రయత్నమెలా వుంది? ఇందులో భక్తిగానీ, యాక్షన్ గానీ అర్ధవంతంగా ఏమైనా వున్నాయా? ఇది తెలుసుకోవడానికి రామేశ్వరం వెళ్దాం...

కథ

   2017 లో నాస్తికుడైన డా. ఆర్యన్ కులశ్రేష్ఠ (అక్షయ్ కుమార్) పాకిస్థానీ బృందంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియాన్ కి వెళ్తాడు. అక్కడ ఓ భారతీయ రాజుకి  చెందిన పురాతన నిధిని తవ్వుతున్నప్పుడు తాలిబన్లు దాడి చేస్తారు. ఆర్యన్ ఆ నిధిని చేజిక్కించుకుని తప్పించుకుంటాడు. ఇటు దేశంలో పుష్పక్ షిప్పింగ్ కంపెనీ యజమాని ఇంద్రకాంత్ (నాజర్) తన సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా రామసేతుని కూల్చివేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాడు. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుందని, భారత్-శ్రీలంక మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందనీ అభిప్రాయపడతాడు.

     ఇది దేశంలో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తుంది.  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవుతుంది. ఇంద్రకాంత్‌తో చేతులు కలిపిన ప్రభుత్వం, ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సహాయం తీసుకుంటుంది. ఇప్పటికి ఆర్యన్ ఏఎస్ఐ జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొంది వుంటాడు. ఇతడి లాంటి నాస్తికుడే తమకు సహాయం చేయగలడని ప్రభుత్వం భావిస్తుంది. రామసేతు సహజసిద్ధమైన కట్టడమని, మానవ నిర్మితం కాదని పేర్కొంటూ నివేదికని సమర్పించాల్సిందిగా కోరుతుంది. అప్పుడు ఆర్యన్ సమర్పించిన నివేదిక రామాయణంపై కూడా ప్రశ్న లేవనెత్తుతుంది. ఇది పెను వివాదానికి దారి తీస్తుంది. ఇంద్రకాంత్ కూడా ఆర్యన్ తో జతకట్టి రామసేతువు మానవ నిర్మితం కాదని ప్రపంచానికి నిరూపించమని కోరతాడు.

            ఆర్యన్ రామేశ్వరం చేరుకుంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ బాలి (ప్రవేశ్ రాణా), పర్యావరణవేత్త డాక్టర్ సాండ్రా రెబెల్లో (జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ఆర్యన్‌ మిషన్‌లో సాయం చేయడానికి వస్తారు. వీళ్ళ పరిశోధనల్లో రాముడు 7000 సంవత్సరాల క్రితం జన్మించాడని, రామసేతు రాముడి పుట్టుక కంటే ముందే వుంధనీ పేర్కొంటారు. ఇక దీని పర్యవసానాలు ఎలా ఎదుర్కొన్నాడన్నది, ఫలితంగా నాస్తికుడైన తను రామ సేతుని నిజంగా రాముడే వానర సైన్యంతో నిర్మించినట్టు నమ్మే ఆస్తికుడుగా ఎలా మారాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ

ఒక నాస్తికుడైన ఆర్కియాలజిస్టు రాముడ్ని నమ్మే భక్తుడిగా ఎలా మారాడన్నది ఈ కథ. స్పిరిచ్యువల్ థ్రిల్లర్ జానర్ కథ. బాబ్రీ మసీదు కింద రామాలయం లేదనడం ఎలాంటిదో, రామేశ్వరంలో రామసేతు లేదనడం అలాటిది. సాక్షాత్తూ నాసా అలాటిదేమీ లేదని సాక్ష్యాలు చూపించినా మత విశ్వాసం ముందు అది దిగదుడుపే. కాబట్టి నాస్తికుడైన ఆర్యన్ ఆస్తికుడుగా మారకపోతే ఈ సినిమా వుండదు, బాయ్ కాట్ అవుతుంది.

అయితే ఈ సినిమా తీసిన దర్శకుడి దార్శనికత ఎలాంటిదంటే అతనే సెంటిమెంట్లకి పూర్తిగా కట్టుబడడు. ఆటో కాలు ఇటో కాలు వేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. రామేసేతుకథ కోసం రామేశ్వరంలో ఆ కాలు పెట్టకుండా, డామన్ డయ్యూలో పాదం మోపి ఇదే రామేశ్వరం అనుకోమంటాడు. రేపు వేటపాలెం చూపించి వారణాసి అనుకో మంటాడేమో తెలీదు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు, డామన్ వెళ్ళినా అట్టర్ ఫ్లాప్ తప్పలేదు. లొకేషన్ దగ్గరే స్పిరిచ్యువాలిటీ ఆవిరైపోయింది.

        రామేశ్వరంని ఎవాయిడ్ చేసినట్టు, రామసేతుతో సంబంధమున్న శ్రీలంకని కూడా ఎవాయిడ్ చేశాడు. శ్రీలంక బదులు గోవా చేరింది. శ్రీలంకలో స్థిరపడ్డ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాండ్రా రెబెల్లో పాత్ర, తను గోవాకు చెందానని చెప్పుకుంటుంది. ఇలాటివి చాలా వున్నాయి. అసలు రామసేతు మీద సినిమా తీస్తూ మొదటి అరగంట వేరే సినిమా చూపించే భక్తికూడా వుంది. ఈ అరగంట సేపు అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్టు పాత్ర పరిచయం పేరుతో ఇండియానా జోన్స్ లాగా చేసే వేరే సాహసకృత్యాలే వున్నాయి అసలు కథతో సంబంధం లేకుండా.

        సినిమా అంటే పాత్ర పరిచయమేనా, కథ కాదా? బహుశా కేజీఎఫ్ తో ఇన్స్పైర్ అయి క్యారక్టర్ ఎలివేషన్స్ తో ఇలా నింపేద్దామనుకున్నాడు. ఇది బెడిసి కొట్టింది. కారికేయ2 లో కృష్ణుడు పురాణం కాదనీ, చరిత్ర అనీ వాదన తప్ప నిరూపణ లేని సెంటిమెంట్ కి మోకరిల్లి ముగించినట్టే, ఇక్కడ రామ సేతు విషయంలోనూ జరిగింది. రామ సేతు మానవ నిర్మితం కాదనీ, అది లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సహజ భౌగోళిక ప్రక్రియ అనీ, చెప్పిన నాసా పరిశోధనని ఇంకోలా చెప్పి చరిత్రగా మార్చినట్టే, ఇక్కడా మత విశ్వాసం ఆధారంగానే ముగించారు.

        అయితే ఈ భక్తి భావోద్వేగపు ముగింపుకి రావడానికి చేసుకొచ్చిన పరిస్థితుల కల్పనేమీ లేదు. దీంతో అక్షయ్ కుమార్ నాస్తిక పాత్ర రామభక్తుడయ్యే ఉద్వేగభరిత సన్నివేశం నిర్జీవంగా మిగిలింది. కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్పలో నాస్తికుడైన తిన్నడు శివ భక్తుడయ్యే కన్నప్పగా మారే క్రమానికో కథ వుంటుంది. రామ్ సేతుదర్శకుడు కనీసం భక్తి సినిమాలైనా ఎలావుంటాయో చూడకుండా, తనకు తెలిసిన గ్రాఫిక్స్ తో యాక్షన్ దృశ్యాలు తీసేసినట్టుంది. రామ సేతుని కనుగొనే యాక్షన్ దృశ్యాలకి చివర ఓ భక్తి దృశ్యం కలిపితే సినిమా అయిపోయింది. ఎక్కడా కథకి ప్రధానమైన ఆధ్యాత్మిక భావ తరంగాలు కథని డ్రైవ్ చేయవు. ఈ గ్రాఫిక్స్ కూడా నాసి రకంగా, హాస్యాస్పద్సంగా వున్నాయి. సముద్రం, డైవింగ్ దళాలు, రామసేతు సెట్ కూడా ఆకర్షణీయంగా లేవు. రామసేతు బయటపడుతోందంటే ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుని కేకలు వేసే ఉద్విగ్న డ్రామా వుండాలి. ఇలాటి కమర్షియల్ చిత్రీకరణ కూడా లేదు. స్పిరిచ్యువల్ జర్నీ అన్నాక ప్రేక్షకుల్ని బలంగా ఆ లోకంలోకి లాక్కెళ్ళే దర్శకత్వ ప్రతిభ పూర్తిగా లోపించింది.

నటనలు-సాంకేతికాలు

అక్షయ్ కుమార్ పాత్ర బలహీనతలు నటనలో బయట పడతాయి. పాత్ర బలహీనం, కథ కూడా బలహీనం కావడంతో తన హీమాన్ యాక్షన్ దృశ్యాలు బోరు కొట్టే స్థాయిలో వున్నాయి. మాస్ ప్రేక్షకులు కూడా ఈలలు వేయలేరు. స్పిరిచ్యువల్ షేడ్స్ రివీలయ్యే సస్పెన్సు తో కూడిన పాత్ర చిత్రణ అయివుంటే అక్షయ్ అలా రూపొందించుకుని వుంటే ఈ సినిమా బెటర్ గా వుండేది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ఆర్కియాలజిస్టు ఇండియానా జోన్స్ సినిమాలు ప్రసిద్ధి చెందిన స్పిరిచ్యువల్ థ్రిల్లర్సే కదా?

        అక్షయ్ కి తోడుండే యాక్షన్ పాత్రలో తెలుగు నటుడు, ‘గాడ్ ఫాదర్ఫేమ్ సత్యదేవ్ కాస్త కామెడీ చేస్తూ ఆకట్టుకుంటాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచాలు సహాయ పాత్రలుగా మిగిలిపోయారు. విలన్ గా మాత్రం నాజర్ ఒక ఊపు ఊపాడు. చాలా విషాదకరమేమిటంటే, ఛాయాగ్రాకుడు అసీమ్ మిశ్రా టాలెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరవడం. డానియల్ జార్జ్ నేపథ్య సంగీతం భక్తిని రెచ్చగొట్టదు.  అంతా రామమయమని రాముడి లీలలు ప్రస్ఫుటమయ్యే - నేపథ్య సంగీతానికి తోడ్పడే చిత్రణలు చేయాలని ముందసలు దర్శకుడు అభిషేక్ శర్మకి తెలియాలి.

        మొత్తానికి రామసేతు  చూద్దామని రామేశ్వరం వెళ్తే డామన్ చేరుకుంటాం. అక్కడ డామన్  దెయ్యాలు  కన్పిస్తాయి. కాశీకి పోయాను రామాహరీ అని అక్కడ్నుంచి బయల్దేరాలి...

—సికిందర్