ఆచార్య ప్రధాన కథలో ఫస్టాఫ్
లో ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్ -1 ఇంటర్వెల్ వరకూ వచ్చాయి.
ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్ లో సెకెండ్ యాక్ట్ -2 తో మిగిలిన ప్రధాన కథ
ప్రారంభమవాలి. అయితే ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ మిగిలిన ప్రధాన కథ కాకుండా ఫ్లాష్ బ్యాక్
ప్రారంభమయ్యింది. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథ అవదు. ప్రధాన కథ అర్ధమవడానికి
అవసరమైన పూర్వపు బ్యాక్ గ్రౌండ్ సమాచారాన్ని అందించే డేటా బ్యాంక్ మాత్రమే. అంటే
ఇంటర్వెల్లో ఆగిన ప్రధాన కథ, ఫ్లాష్ బ్యాక్ నుంచి కావాల్సిన సమాచారం తోడుకుని, ఆ ఫ్లాష్
బ్యాక్ పూర్తయ్యాకే తిరిగి ప్రారంభమవుతుందన్న మాట. ఈ ఫ్లాష్ బ్యాక్ సుదీర్ఘంగా
గంటా 5 నిమిషాల పాటూ వుంటుంది. దీని తర్వాతే ప్రధాన కథ మిగిలిన భాగం, అంటే సెకెండ్ యాక్ట్ -2 ప్రారంభమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ గంటా 5 నిమిషాలు
తీసుకున్నాక ఇక సినిమాకి మిగిలింది 15 నిమిషాలే. ఈ 15 నిమిషాల్లోనే సెకెండ్
యాక్ట్-2, థర్డ్ యాక్ట్ రెండూ కలిసి సర్దుకోవాలన్న మాట. అంటే
దాదాపూ సెకెండ్ యాక్ట్ -2 లేనట్టే. అంటే దీనర్ధం ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే
అన్నమాట!
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూద్దాం : కొన్నేళ్ళ
క్రితం ధర్మస్థలిలో సిద్ధ (రామ్ చరణ్) ధర్మాన్ని కాపాడుతూ పెరుగుతాడు. దొంగతనం
చేసి పారిపోతున్న దొంగని పట్టుకుని ధర్మం నేర్పి సంస్కరించాలనుకుంటాడు తప్ప
శిక్షించడు. దొంగని కూడా మీరూ అంటూ గౌరవిస్తాడు. సిద్ధ ధర్మ స్థలిలోనే విద్యాలయంలో
విద్యనభ్యసిస్తూ వుంటాడు. అక్కడే యంగ్ బసవ (సోనూ సూద్) విద్యార్థిగా వుంటాడు.
ఇద్దరూ కుస్తీ నేర్చుకుంటారు. బసవ ధర్మాధర్మాల గురించి సిద్ధని రెచ్చగొడతాడు.
సిద్ధ రియాక్షన్ చూపించగానే, ఏం లేదు
ధర్మస్థలిలో అధర్మం పెరిగిపోతే ఎలా రియాక్ట్ అవుతావో చూడాలనుకున్నానని అంటాడు బసవ.
సిద్ధ పూజారి
(తనికెళ్ళ భరణి) కూతురు నీలాంబరిని (పూజా హెగ్డే) ప్రేమిస్తూంటాడు. ఇలావుండగా
మైనింగ్ మాఫియా రాథోడ్ (జిశ్శూ సేన్ గుప్తా) తమ్ముడు (సౌరవ్ లోకేష్) వచ్చి
పెద్దలకి ప్రతిపాదన చేస్తాడు. ధర్మస్థలి ఆదాయం మరింత పెరగాలంటే ఇక్కడ పరిశ్రమలు
రావాలని అంటాడు. ధర్మస్థలి పెద్ద ఆదన్న(నాజర్) ఇతడి ఉద్దేశాన్ని పసిగట్టి
తిరస్కరిస్తాడు. దీంతో బసవ రాథోడ్ తమ్ముడితో చేతులు కలిపి తవ్వకాలు
మొదలెట్టిస్తాడు. సిద్ధ దీన్ని ఎదుర్కొంటాడు. తర్వాత రాథోడ్ తమ్ముడికి మరోసారి
ధర్మాన్ని బోధిస్తాడు.
ధర్మస్థలి ప్రజా బలం ఘట్టమ్మ ఆలయమేనని
రాథోడ్ నమ్మి, బుల్డోజర్ తో నేలమట్టం చేయిస్తూంటే అడ్డుకున్న
సిద్ధ గాయపడి, నదిలో కొట్టుకుపోయి ఏఓబీ (ఆంధ్రా ఒరిస్సా
బోర్డర్) లో నక్సల్ దళానికి దొరుకుతాడు.
ఇంటర్నల్
ఫ్లాష్ బ్యాక్ : ఇప్పుడు సిద్ధ
పుట్టుర్వోత్తరాలు తెలుస్తాయి. సిద్ధ నక్సల్ శంకరన్న కొడుకు. పోలీసు కాల్పుల్లో
తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో కామ్రేడ్ ఆచార్య పాదఘట్టం తీసికెళ్ళి అదన్న
కప్పగించాడు. సిద్ధ అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. సిద్ధ ఎలా పెరుగుతున్నాడో ఓ
కన్నేసి వుంచాడు ఆచార్య.
తిరిగి
మెయిన్ ఫ్లాష్ బ్యాక్ : ఇప్పుడు సిద్ధని చూసుకుని గర్విస్తాడు ఆచార్య.
సిద్ధని దళంలో చేర్చుకుంటాడు. ఇద్దరూ కలిసి ఇంకో చోట రాథోడ్ దురాక్రమణని
ఎదుర్కొంటారు. ఆ సందర్భంగా సిద్ధకో మ్యాప్ దొరుకుంటుంది. దాని ఆధారంగా రాథోడ్ పాద ఘట్టంని
కూడా టార్గెట్ చేశాడని ఆచార్యకి చెప్తాడు. అంతలో రాథోడ్ అనుచరులు చేసిన దాడిలో చనిపోతాడు. ఇప్పుడు ఆచార్య సిద్ధ కోరిక
ప్రకారం, ధర్మ స్థలిని రాథోడ్ బారి నుంచి కాపాడేందుకు వచ్చి
వడ్రంగి వేషంలో వుంటున్నాడన్న మాట (ఫ్లాష్ బ్యాక్ ఓవర్).
ఆచార్య గోల్ గల్లంతు
ఇంటర్వెల్
సీన్లో ఆచార్య బసవకి చెప్పిన -
దివ్య వనమొక వైపు
తీర్ధ జల మొక వైపు
నడుమ పాద ఘట్టం
-కోడ్
లాంగ్వేజీని వివరించే ఉద్దశంతో ఈ ఫ్లాష్ బ్యాక్ అనుకోవాలి. ప్రధాన కథతో ఫస్టాఫ్ లో
ఫోకస్ లేకపోయినా, సెకెండాఫ్ లోనైనా సక్సెస్ కోసం కనీస కృషి
చేసినట్టు కనపడదు. ఫస్టాఫ్ నుంచీ కథ మొత్తంలో ఆచార్య గోల్ (లక్ష్యం) ఏమిటో పైకి
చెప్పకుండా దాచారు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాకే అతను చనిపోయిన సిద్ధ కోరిక
నెరవేర్చే ఉద్దేశంతో ధర్మస్థలికి వచ్చినట్టు గోల్ తెలుస్తుంది. ఇలా చివరి వరకూ గోల్
ని దాచిపెడితే కథెలా అర్ధమవుతుంది? ఇలా ఏ సినిమాలోనూ చూడం.
హీరోకి ఫస్టాఫ్ లోనే గోల్ ని ఎస్టాబ్లిష్ చేసేసి, కథేమిటో
చెప్పేసి, విషయం అర్ధమయ్యేలా కథ నడిపిస్తారెవరైనా.
ఇలా ఆచార్య గోల్ ని
దాచిపెట్టి చిట్టచివరికి రివీల్ చేయడాన్ని స్ట్రక్చర్ అనుమతించదు. అనుమతించి వుంటే
ఆచార్య ఫ్లాప్ కాకూడదు. స్క్రీన్ ప్లే పేజీకి 90 లక్షలు బడ్జెట్ ని డిమాండ్ చేస్తున్నప్పుడు
శ్రీలంక సంగతిలా కాకూడదు సినిమా. శ్రీలంక ప్రధాని రాజపక్సే పాతాళమంటుతున్న
ఆర్ధికవ్యవస్థని కప్పిపుచ్చడానికి మతవాదాన్ని రెచ్చగొడుతూ ఆనందించాడు. చివరికి
స్వమతస్తులే దివాలా తీసి భారీ యాక్షన్ సీన్సుతో,
బ్లాస్టింగ్స్ తో మతోన్మాద రాజపక్సేని పూర్వపక్షం చేశారు. త్రేతాయుగంలో మనం చూడని
లంకా దహనాన్ని పానిండియా లెవెల్లో చూపించారు. అసలు విషయాన్ని దాచిపెట్టి వేరే
విషయాలతో కథ నడిపితే దేశమైనా, సినిమా అయినా ఇంతే.
గత వ్యాసంలో పేజీకి 90 లక్షలు బదులు
సున్నా తగ్గి 9 లక్షలు అని పడుతూ పోయినట్టుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత ఒకరు
దృష్టికి తెస్తే ఈ సవరణ. ఆచార్య పై ఫ్లాష్ బ్యాక్ అంతా ధర్మస్థలి ప్రజలకి చెప్పడం
పూర్తి చేసి, ధర్మస్థలికి ఇలా ఇందుకు తను వచ్చానంటాడు.
ఎందుకు? మాఫియాలకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో
ప్రాణాలర్పించిన సిద్ధ కోరిక తీర్చేందుకు.
సిద్ధ కోరిక తీర్చాలనే తన గోల్ ని
ఇప్పుడు ఈ కథ చివర్లో వెల్లడిస్తున్నాడు ఆచార్య. ఇలా చివరి వరకూ గోల్ ని
దాచిపెట్టడం సస్పెన్స్ కూడా అవదు. సస్పెన్స్ కర్మకి వుంటుంది, క్రియకి వుంటుంది, కర్తకి వుండదు. సస్పెన్స్ అనే అంశం రెండు పొరలతో కప్పి వుంటుంది. మొదటి
పొర ‘ఎందుకు?’ అన్న ప్రశ్నతో, రెండో పొర ‘ఎలా?’ అన్న ప్రశ్నతో.
ఈ రెండు పొరలూ అలాగే కప్పి వుంచితే ఏ సస్పెన్సూ అనుభవం కాదు. అందుకని ముందు ‘ఎందుకు?’ అన్న పొరని విప్పి చూపించెయ్యాలి.
ఆచార్య ఎందుకొచ్చాడు? సిద్ధ కోరిక తీర్చేందుకు వచ్చాడని వెంటనే మొదటి పొర విప్పేయాలి. దీంతో
గోల్ తెలుస్తుంది. అప్పుడు ఆ కోరిక ఎలా తీరుస్తాడో- ఆ గోల్ ఎలా పూర్తి చేస్తాడో- ‘ఎలా?’ అన్న ఈ రెండో పొర విప్పకుండా, సస్పెన్సుతో కథనంలో చూపిస్తూ పోవాలి. ఇలా కాక - ఎందుకు? ఎలా? - అనే పొరలు రెండూ మూసి పెడితే కథేమిటో
తెలియదు, పాత్ర నిలబడదు.
కోరికా? పగా?
ఈ మొదటి పొర విప్పడం కూడా సకాలంలో
ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ -1 దగ్గర
జరగాలి. అక్కడ జరగకుండా సెకండ్ యాక్ట్ - 2 చివర్లో వచ్చే,
ప్లాట్ పాయింట్-2 దగ్గర చెప్తే లాభం లేదు. ప్లాట్ పాయింట్ - 2 అనేది, ప్లాట్ పాయింట్ - 1 దగ్గర ఏర్పాటు చేసిన సమస్యకి / గోల్ కి పరిష్కారం
చూపే టర్నింగ్ పాయింటు మాత్రమే.
కానీ ఇక్కడ తను ఎందుకొచ్చాడో
సకాలంలో పొర విప్పకపోవడం ఒక సమస్య అయితే, అసలు సమస్య - సిద్ధ
కోరిక తీర్చడానికి తను వచ్చినట్టు చెప్పడంతో వచ్చింది. సిద్ధ కోరిక తీర్చడమేమిటి? సిద్ధ చావుకి పగదీర్చుకోవాలి గాని! భాష తేడా వల్ల కథే మారిపోతుంది.
కోరిక తీర్చడం- పగ దీర్చుకోవడం
రెండూ వేర్వేరు భాషలు, ఎమోషన్లు. మొదటిది ప్రో, రెండోది యాంటీ. మొదటి దాంట్లో యాక్షన్ లేదు, రెండో
దాంట్లో యాక్షన్ వుంది. రాథోడ్ బారి నుంచి ధర్మస్థలిని కాపాడాలన్న సిద్ధ కోరిక
తీర్చే సాత్విక ఆలోచనతో వచ్చాడు కాబట్టే, ఆ నిదామైన ధోరణిలో
వడ్రంగిలా బస చేసి సెటిల్డ్ గా వున్నాడు. ఏవేవో వేరే గొడవల్ని పరిష్కరిస్తూ
కాలయాపన చేశాడు. పాత్ర మానసికంగా ఎలా వుంటే అలాగే ప్రవర్తిస్తుంది. ఆచార్య సిద్ధ
కోరిక తీర్చాలన్న సాత్విక భావంతో వున్నాడు గనుకే, ఫస్టాఫ్
అంతా అలా శాంత మూర్తిలా పాసివ్ రియాక్టివ్ పాత్రగా గా కనిపించాడు. వాడిన భాష వల్ల
కథే మారిపోతుంది.
అదే సిద్ధ చావుకి పగదీర్చుకోవాలన్న
పౌరుషంతో - యాక్షన్ తో వచ్చి వుంటే, అసలు ధర్మస్థలికే రాడు. మొదట
శత్రువు లెక్కడున్నారో వేటాడి వేటాడి అక్కడే చంపేసి ధర్మస్థలికి వచ్చి ముగింపు పలక
వచ్చు. అనుచరుడు శత్రువుల చేతిలో చనిపోతే, నక్సల్ క్యారక్టర్
అనేవాడు, అనుచరుడి కోరిక తీర్చాలని తీరిగ్గా వచ్చి
ధర్మస్థలిలో బస చేస్తాడా, లేక తక్షణం పగదీర్చుకునే
యాక్షన్లోకి దిగుతాడా? ఇదీ పాయింటు. క్రితం వ్యాసంలో
చెప్పుకున్నట్టు ఈ విధంగా స్క్రీన్ ప్లే కమర్షియల్ గా లేదు,
ఇలా లాజికల్ గా కూడా లేదు.
సిద్ధ ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్
ఏ ఫ్లాష్
బ్యాక్ అయినా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తోనే వుంటుంది. అంటే ఫస్ట్ యాక్ట్, సెకెండ్ యాక్ట్ -1, సెకెండ్ యాక్ట్ -2, ఎండ్ అనే నాల్గు విభాగాలూ వుంటాయన్న మాట. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో సిద్ధని
పరిచయం చేశారు అతనెవరో చెప్పకుండా. అతనెవరో, ఎవరికి పుట్టాడో
ఇప్పుడే చెప్పకపోవడం మంచిదే. కానీ తనెవరూ అన్న ప్రశ్నతో బాధ అతడికున్నట్టు మనకి తెలియాలి. ఇది క్యారక్టర్ పరంగా
కథా బలాన్నీ, సస్పెన్సునీ పెంచడానికే. క్యారక్టర్ భావోద్వేగాల్ని
సిల్వర్ స్క్రీన్ మీద స్ప్రెడ్ చేయడానికే. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా తర్వాత
వచ్చే ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రేక్షకుల్ని భోరున ఏడ్పించేందుకే- అందుకని ఇప్పుడు
సిద్ధని అతడి జన్మ రహస్యం వెంటాడుతున్నట్టు వుండాలి. ఇలా లేకపోవడంతో ఇంటర్నల్
ఫ్లాష్ బ్యాక్ కూడా ఫ్లాట్ గా తేలిపోయింది.
ఫ్లాష్ బ్యాక్ ప్రారంభంలో సిద్ధ
దొంగని పట్టుకునే యాక్షన్ సీను చూపించి, ధర్మం పట్ల అతడి పాజిటివ్
వైఖరి చెప్పారు. అతనెప్పుడూ ధర్మం గురించి మాట్లాడడం చాదస్తంగా వుంది, యూత్ అప్పీల్ లేదు. ‘నేనున్న చోట నకరాలు పనికిరావు’ అంటూంటే యూత్ క్యారక్టర్ అసెర్టివ్ గా, ఆసక్తికరంగా
వుండేది. తను యాక్టివ్ క్యారెక్టరే, కానీ మాట్లాడే భాష చాదస్తపు
భాష. ఆచార్య పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్. భాష పాసివ్ క్యారక్టర్ భాష.
అయితే సిద్ధ దొంగని పట్టుకునే
సీరియస్ యాక్షన్ సీను కాస్తా కామెడీగా తేలింది. ఆ దొంగోడు నగ కొట్టేసి పరుగెత్తు
కెళ్ళి బస్సెక్కి కూర్చుంటాడు. అతను కూర్చున్న విండోకి వూచ వుండదు. ఇటు పక్క అటు
పక్క విండోస్ కి వూచ వుంటుంది. దొంగ కూర్చున్న విండోకే వూచ ఎందుకుండదంటే, మన రామ్ చరణ్ దొంగని పట్టుకు లాగితే అమాంతం విండోలోంచి బయటకొచ్చి పడాలని
- ఆ విధంగా తెలివిగా అక్కడ వూచ కట్ చేశాడు యాక్షన్ డైరెక్టర్. యాక్షన్ డైరెక్టర్
కుట్ర తెలియక ఆ విండో దగ్గరే కూర్చున్నాడు దొంగ! మొత్తం మీద అమ్మవారి దయవలన ధర్మం బస్సు
నాల్గు చక్రాల మీద నిలబడింది.
సిద్ధని గురుకుల మహా విద్యాలయం విద్యార్థి గానూ పరిచయం
చేసి, సహ విద్యార్ధిగా బసవని చూపించారు. ఇక్కడ ఇద్దరి కుస్తీ
చూపిస్తూ, ధర్మం పట్ల ఇద్దరి వ్యతిరేక భావాలతో సమస్యకి దారి
తీసే పరిస్థితుల కల్పన ప్రారంభించారు.
ఆ తర్వాత సిద్ధ
ప్రేమికురాలిగా ఇంకో పాత్ర నీలాంబరి (పూజా
హెగ్డే) ని పరిచయం చేశార ఈమెని ఫస్టాఫ్ లో పూజారి కూతురుగా పరిచయం చేశారు.
ఇప్పుడు సిద్ధ ప్రియురాలు. దీని తర్వాత సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన తీవ్రత
పెంచుతూ మైనింగ్ మాఫియా రాథోడ్ తమ్ముడు (సౌరవ్
లోకేష్ ) ని పరిచయం చేశారు పరిశ్రమ పెట్టాలన్న ప్రతిపాదనతో. దీన్ని ధర్మస్థలి
పెద్ద ఆదన్న (నాజర్) తిరస్కరించడంతో, రాథోడ్
తమ్ముడితో బసవ చేతులు కలపడాన్నీ, తవ్వకాలు జరపడాన్నీ చూపించి
మొత్తానికి సమస్యని ఏర్పాటు చేశారు. ఈ సమస్యని ఎదుర్కొనే సిద్ధతో ప్లాట్ పాయింట్ -
1 కొచ్చి, సిద్ధకి మాఫియాల్ని ఎదుర్కొనే గోల్ ని ఏర్పాటు
చేసి - ఫస్ట్ యాక్ట్ ని ముగించారు. విచిత్రమేమిటంటే ఇలా ఈ ఫస్ట్ యాక్ట్ తో ఇక్కడ
కన్పిస్తున్న స్ట్రక్చర్,
ఫస్టాఫ్ లో ఆచార్య పాత్రతో ప్రధాన కథకి లేదు. ఇది గమనించాం.
కానీ సడలిన సెకెండ్ యాక్ట్
ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ యాక్ట్
స్ట్రక్చర్ లో వుంటే, ఇక సెకెండ్ యాక్ట్ తో మళ్ళీ స్ట్రక్చర్
సమస్య. ఆస్కార్ విన్నర్ ‘దేర్ విల్ బి బ్లడ్’ సెకెండ్ యాక్ట్ -2 లో ఒక సీనుంటుంది. కథానాయకుడు డానీ తన మిత్రుడ్ని
చంపేసి పాతి పెట్టాక, తెల్లారి అడవిలో సేద దీరుతున్న అతడి
దగ్గరికి విలియం బాండీ అనే వృద్ధుడు వచ్చే సీను. క్లోజప్స్ తో ఎక్సెలెంట్ సీను.
తను డానీ చేసిన హత్యని చూశాడు. దాంతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చాడు.
డానీ నాస్తికుడుగా వుంటూ మతాన్ని ఎలా పడితే అలా అవమానిస్తున్నాడు. ‘ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి మతాన్ని
ఒప్పుకుని పాపినని క్షమాపణ వేడుకుంటావా, లేక జైలుకి పోతావా?’ అని బ్లాక్ మెయిల్ చేస్తాడు బాండీ. నాస్తిక ఆస్తిక
సంఘర్షణలో డానీని స్ట్రాంగ్ గా ఇరకాటంలో పెట్టేసే సీను.
దీని ప్రస్తావన ఇక్కడెందుకంటే, పైన చెప్పుకున్న సిద్ధ పాత్ర ఫస్ట్ యాక్ట్ ముగిసి, సెకండ్ యాక్ట్ ప్రారంభ దృశ్యంలో, ఇలాగే అడవిలో విశ్రమించిన రాథోడ్ తమ్ముడి దగ్గరికి వస్తాడు.
‘టెంపుల్ దగ్గరే అర్ధమయ్యేలా చెప్పాం. నీకు అర్ధమయ్యేవరకూ చెప్పడం నా
ధర్మం. ఆపదొస్తే దాన్నీ ఎదుర్కొంటాం’ అంటాడు. ఇంతే సీను.
అనేసి వెళ్ళిపోతాడు. ఈ సీనుతో ఏం సాధించినట్టు? ఈ సీన్లో మరి
రాథోడ్ తమ్ముడి రియాక్షన్ ఏమిటో చూపించలేదు. ఇతడి సజెషన్ లో సిద్ధని లాంగ్ షాట్ లో
నించోబెట్టి షాట్ తీశారు.
తీసిన షాట్ పాత్ర మానసిక స్థితిని
బయటపెడుతుంది. సిద్ధని లాంగ్ షాట్ లో అలా చూపించారంటే, అతను
కమిట్ మెంట్ లేక, రాథోడ్ తమ్ముడికి దూరం దూరంగా ఏదో చెప్పేసి
వెళ్లిళ్ళిపోవడానికి వచ్చిన తేలిక అర్ధాన్ని తెలుపుతుంది ఈ షాట్. అదే బలమైన
సంకల్పంతో వచ్చుంటే, రాథోడ్ తమ్ముడికి దగ్గరగా, క్లోజప్ లో కొచ్చి- కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ మాట్లాడేవాడు పౌరుషంతో.
ఇది ప్రేక్షకులపైన ఇంపాక్ట్ చూపిస్తుంది.
అసలు ఈ సీను కథని ముందుకు ఏం
నడిపించింది? ధర్మం గురించి మాట్లాడే సిద్ధ సీనుకుండే ధర్మాన్ని
ఎలా మర్చిపోయాడు? – పేజీకి 90 లక్షలు ఖర్చు పెట్టిస్తున్నావు, ఇలా వచ్చి ఓ మాట చెప్పేసి నేను వెళ్ళిపోయే సీనుతో ఏం
సాధిద్దామని? సీను కథని ముందుకు నడిపించే విషయంతో నైనా వుండాలి, లేకపోతే పాత్ర గురించి కొత్త విషయం చెప్పడానికైనా వుండాలి
కదా? రెండూ లేకపోతే ఈ సీనుని బయ్యర్ కెలా
అమ్ముదామనుకుంటున్నావు? ముందు సీను ధర్మం పాటించి తర్వాత ఎదుటి
వాడికి ధర్మం గురించి చెప్పు- అని
తప్పకుండా సిద్ధ తనని సృష్టించిన కథకుడితో అనాలనుకుని వుంటాడు.
ఫస్ట్ యాక్ట్ ని బాగానే నిర్మించి, సెకెండ్ యాక్ట్ ప్రారంభంలోనే కథకుడు దారి
తప్పాడు. టెంపుల్ దగ్గర చెప్పిన విషయమే
చెప్పడానికి ఈ మరో సీనెందుకు? సెకెండ్ యాక్ట్ ధర్మం ప్రకారం ఏర్పాటైన సమస్య
గురించి హీరో విలన్ల మధ్య సంఘర్షణ తీవ్రత పెరుగుతూ వుండాలిగా? అలాటి సీన్లు పడాలిగా?
‘దేర్ విల్ బి బ్లడ్’ లో
వెనుకటి హత్య జరిగిన సీను పరిణామాలతో ఎలా కొత్త సీను కథని ముందుకు నడిపించింది?
ఇప్పుడు డానీ గనుక మతాన్ని ఒప్పుకోకపోతే, వూచలు
లెక్కెట్టే లాక్ వేశాడు బాండీ బ్లాక్ మెయిల్ చేస్తూ. ఇలాటిదేదో రాథోడ్ తమ్ముడికి
సిద్ధ ఎందుకు చేయకూడదు? భూ కబ్జాలతో ముందు కెళ్ళ కుండా రాథోడ్
తమ్ముడ్ని స్ట్రాంగ్ గా ఇరకాటంలో పెట్టేసే సీనెందుకు కాకూడదిది?
పరస్పరం హీరో విలన్లు ఎత్తుగడలతో దెబ్బతీసుకునే యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరమేగా
సెకెండ్ యాక్ట్ బిజినెస్ అంటే?
ఈ ఫ్లాష్ బ్యాక్ సెకెండ్ యాక్ట్ నైనా దాని డ్యూటీ ప్రకారం
జరగనిచ్చివుంటే, ఫస్టాఫ్ నిరాశ నుంచి తేరుకో గలరు ప్రేక్షకులు. ఎంతో కొంత సక్సెస్ అయ్యేది కూడా సినిమా. ఇక
సిద్ధ- రాథోడ్ తమ్ముడి సీను తర్వాత - ధర్మస్థలి ప్రజా బలమంతా ఘట్టమ్మ ఆలయమేనని
రాథోడ్ నమ్మి, బుల్డోజర్ తో ఆలయాన్ని కూల్చే సీను
వస్తుంది. చాలా మంచి కథనం. స రీగ్గా ఉపయోగించుకుంటే కమర్షియల్ గా బలంగా హైలైట్
అవగల సీను. సినిమా ప్రారంభంలో ప్రిన్స్ మహేష్ బాబు వాయిసోవర్ ప్రకారం - పూర్వ
కాలంలో సిద్ధవనంలో ఓ రాక్షస మూక దండెత్తి వస్తే, యోగుల తపో
బలంతో ఘట్టమ్మ వారు ప్రత్యక్షమై ఆ రాక్షస మూకని సంహరించిందని గుర్తుండే వుంటుంది.
ఇప్పుడా ఘట్టమ్మవారు ఏమైంది? చరిత్ర రిపీటవుతున్నట్టు ఇప్పుడు రాక్షస మూకగా మైనింగ్ మాఫియా వచ్చి
పడితే, అదీ ఆలయాన్ని కూల్చడానికి తన మీదికే బుల్డోజర్ తో
దండెత్తి వస్తే, ఏం చేస్తోంది అమ్మవారు? తన రక్షణ ప్రజలకి వదిలేసి ఎందుకు వూరుకుంది? తన
శక్తులు చూపించి- ఆ బుల్డోజర్ ని ముక్కలు చేసి, మళ్ళీ ఎవరూ
బుల్డోజర్ పేరెత్తకుండా, కన్నెత్తి చూడకుండా, బ్రిటిష్ ప్రధాని ఇండియా వస్తే బుల్డోజర్ ఎక్కి ఫోజులు కొట్టకుండా -
ఎత్తి అవతలికి విసిరి పారేయదా? హాల్లో ఈలలూ చప్పట్లూ
మోగించుకోదా? నో కమర్షియల్ జోష్, నో?
‘ది ఎమరాల్డ్
ఫారెస్ట్’ లో చూద్దాం :
ఇందులో అడవిని నరుక్కుంటూ బుల్డోజర్ వస్తూంటే, భయంతో దూరంగా
నక్కి చూస్తున్న గిరిజనుల్లోంచి పిల్లవాడు - అదేంటని అడిగితే - మనమేదో పాపం చేశామని దేవుడు దెయ్యాన్ని పంపుతున్నాడని
అమాయకంగా అంటాడు గిరిజనుడు. అది బుల్డోజర్ అని అతడికి తెలీదు. దాన్నెప్పుడూ అతను
చూడలేదు. అతను చెప్పే ఈ డైలాగ్ వైరల్
అయ్యిందానాడు.
‘రైడర్స్ ఆఫ్
ది లాస్ట్ ఆర్క్’ లో
దివ్య శక్తులున్న ఆర్క్ ని దోచుకుందామని చూసే జర్మన్ నాజీల కేం గతి
పట్టింది చివరికి? కాబట్టి
అమ్మవారితో వొక సూపర్ నేచురల్ హై పవర్ యాక్షన్ సీను కాగల కమర్షియల్
సందర్భాన్ని చేజార్చుకున్నారు. స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదు, థింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ ‘హై’ వచ్చేస్తూ వుండాలి.
ఇలా కాకుండా ఆలయం మీద బుల్డోజర్ తో రొటీన్
గా మాఫియాల దాడి, దాన్ని రొటీన్ గా ప్రజలెదుర్కోవడం, ఆ రొటీన్ పోరాటంలో సిద్ధ నదిలో పది కొట్టుకు పోవడం... వల్ల ఒనగూడిన
నాటకీయ ప్రయోజనం కూడా లేదు. మాఫియాల్ని చిత్తు చేసి అమ్మవారు సిద్ధని నదిలో విసిరి
పారేస్తే అర్ధముంటుంది. నీ పని ఇక్కడ కాదు, ఇంకో చోట నీ
అవసరముందన్న అర్ధంలో.
ఈ కీలక యాక్షన్ సీసులో ఎమోషనల్
బ్యాకప్ లేకపోగా ఫీల్ కూడా లేకపోవడం గమనించవచ్చు. రాత్రి పూట సడెన్ గా బుల్డోజర్
తో ఎటాక్ జరుగుతుంది. ఇలా కాకుండా అడవిలో దూరం నుంచి ఏదో వస్తున్న ఇంజన్ శబ్దం, అది వింటున్న ప్రజలు అప్రమత్తమవడం, రానురాను ఆ
శబ్దం దగ్గరవుతూ టెర్రర్... టెర్రర్ ఫీలింగ్... చూస్తే చీకట్లో రాక్షసిలా బుల్డోజర్! ఇలాటి మైక్రో లెవెల్
థింకింగ్ మేకర్ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.
సార్, నేను
పెట్టే ప్రతి కోటికీ సినిమాలో పది రూపాయలు లాభం వచ్చేట్టు సీన్లు రాయండి సార్-
ఒక్కో సీను ఒక్కో సినిమా అనుకోండి సార్ -అని బయ్యర్ బాధతో లేఖ రాసే పరిస్థితి రాకూడదు.
సినిమా అనేది స్టార్ కోసం, మేకర్ కోసం,
నిర్మాత కోసం, ప్రేక్షకుల కోసమూ కాదు- బయ్యర్ కోసం. సినిమాల
సీరియల్ బాధితుడు అతనే.
ఇంటర్నల్ ట్రబుల్
ఇప్పుడు ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ సంగతి.
ఇక సిద్ధ ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో నదిలో కొట్టు కొచ్చి దళానికి దొరికాక ఇంటర్నల్
ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో సిద్ధ నక్సల్ శంకరన్న కొడుకనీ, పోలీసు కాల్పుల్లో తల్లిదండ్రులు చనిపోయారనీ, దాంతో
కామ్రేడ్ ఆచార్య పాదఘట్టం తీసికెళ్ళి అదన్న కప్పగించాడనీ, సిద్ధ అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడనీ ఫ్లాట్ గా
సీన్లు చెప్తాయి.
ఈ సీన్లు ఫస్ట్ పర్సన్ లో సిద్ధ పాయింటాఫ్
వ్యూలో అతను గుర్తు చేసుకుంటున్న తన జన్మ రహస్యంగా వుండి వుంటే సీన్లకి డెప్త్ తో, షాక్ ఎలిమెంట్ తోడయ్యేది. తనెవరు?- అని మొదట్నుంచీ వెంటాడుతున్న
ప్రశ్నని రేకెత్తెస్తూ వచ్చి వుంటే, ఆ సెటప్ చేసిన ప్రశ్న ఇలా
పవర్ఫుల్ గా, ఎమోషనల్ గా పే ఆఫ్ అయ్యేది. ఒక రహస్యం బయటపెట్టినప్పుడు
అది కదిలించకపోతే రహస్యమే కాదు. ఈ ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవిని
సీజీతో ముప్ఫైలలో వున్న యువకుడుగా చూపించారు.
ఇక తిరిగి మెయిన్ ఫ్లాష్ బ్యాక్ కి వచ్చినప్పుడు, ఆచార్య- సిద్ధల మధ్య బాండింగ్ కూడా బలహీనంగా వుంది. ఇప్పుడు సిద్ధ మానక స్థితి
ఏమిటి? తన జన్మరహస్యం తెలుసుకోవడంతో అన్ని చింతల నుంచీ విముక్తి
పొంది వుంటాడు. కొత్త సిద్ధగా ప్రకాశిస్తాడు. తనేదో ధర్మ స్థలిలో అక్కడేదో ధర్మం కోసమంటూ
అల్ప విషయాలకి ప్రాధాన్యమిస్తూ జీవితాన్ని
అంకితం చేశాడు. కానీ తన తల్లిదండ్రులు అంతకన్నా
విశాల దృక్పథంతో నక్సలైట్లుగా ప్రాణాలర్పించడం తెలిశాక, మెలోడ్రామా
పెంచుతూ- తన తల్లిదండ్రులు వాడిన తుపాకులు అడుగుతాడు- ఆ తుపాకులు పట్టుకుని, రాథోడ్ తో మిగిలున్న తల్లిదండ్రుల ఆశయాన్ని పూర్తి చేయడానికి దళాన్ని లీడ్
చేస్తూ దండెత్తుతాడు... ఈ తరహాలో సిద్ధ పాత్ర సాగవచ్చు.
అంతేగానీ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక, ఆచార్య సిద్ధని దళంలో చేర్చుకోవడం కాదు. ఇలా చేస్తే సిద్ధ పాసివ్ క్యారక్టరై
పోతాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ సిద్ధ కథ మాత్రమే. అతనే కథా నాయకుడు. యాక్టివ్ క్యారెక్టర్
గానే వుండాల్సి వుంటుంది. ఆచార్య చేర్చుకోవడం కాదు, తనే దళంలో
చేరి, వద్దని వారిస్తున్నా ఆచార్య సహా దళాన్ని తానే లీడ్ చేస్తే
యాక్టివ్ క్యారక్టర్ గా వుంటాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ కి ఫస్ట్ యాక్ట్ ముగిస్తే-
ఇక సెకెండ్ యాక్ట్ లో సిద్ధ చేస్తున్న
సాహసం ఆచార్యకి ఇగో సమస్యలు తేవచ్చు. దీంతో ఘర్షణ వైఖరి. సిద్ధని పట్టుకుని కొట్ట వచ్చు
కూడా. సిద్ధ ఆగడు. డ్రామా ఇంకా రగిలి పతాకస్థాయికి చేరుతుంది. చివరికి రాథోడ్ గ్యాంగ్
చేతిలో ప్రాణాలు కోల్పోతాడు సిద్ధ. ఇలా సెకెండ్ యాక్ట్ ముగిస్తే-
ఇప్పుడు ఇక్కడ సిద్ధ చావుకి రాథోడ్ మీద
ఆచార్యకి యాక్షన్ తో పగ రగలడమే గానీ మరోటి కాదు! ఇది ఫ్లాష్ బ్యాక్ కి థర్డ్ యాక్ట్.
దీంతో ముగింపు.
ఆచార్య ఇలా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాక, ఇప్పుడు ప్రధాన కథ సెకెండ్ యాక్ట్ -2, థర్డ్ యాక్ట్
కలిసిపోయి వస్తాయి. ఆచార్యతో కలిసి ప్రజలు రాధోడ్ నీ, బసవనీ, వాళ్ళ ముఠానీ దంచి కొట్టి చావగొట్టడమే!
ఫస్టాఫ్ లో ఫస్ట్ యాక్ట్, సెకెండ్ యాక్ట్ -1 స్క్రీన్ ప్లేని
అన్ ప్రొఫెషనల్ గా తయారుచేస్తే, సెకండాఫ్ లో ప్రధాన కథ సెకెండ్ యాక్ట్ - 2 నే లేకుండా చేశారు. పోనీ ఫ్లాష్
బ్యాక్ నీ స్ట్రక్చర్ లోపెట్టి బలీయం చేయలేదు సెకెండాఫ్ సక్సెస్ కి. కూలంకషమైన సినాప్సిస్ తయారుచేసుకుంటూ
లోపాల్ని సవరించుకోకుండా, ఏకంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తే ఇంతకి
మించి ఏమీ జరగదు.
—సికిందర్