రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 9, 2021

1060 : రివ్యూ


 దర్శకత్వం : క్రిష్

తారాగణం : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, నాజర్, సాయిచంద్, రవిప్రకాష్, అన్నపూర్ణ, హేమ తదితరులు
కథ
, మాటలు : సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, స్క్రీన్ ప్లే : క్రిష్, సంగీతం : ఎంఎం కీరవాణి; పాటలు : సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కీరవాణి; ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : జాగర్లమూడి సాయిబాబు
, రాజీవ్ రెడ్డి.
విడుదల :  అక్టోబర్ 8
,2021
***

    రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు తర్వాత దర్శకుడు క్రిష్ కొండపొలం తో ఈవారం తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో సవాలుగా తీసుకుని నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పుడప్పుడే ఉప్పెన లో నటిస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ ని కథా నాయకుడుగా తీసుకున్నారు. ఇటీవల హిందీలో బిజీ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ని కథా నాయకిగా తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ గొర్రె కాపరుల జీవితాల్ని చూపించే వాస్తవిక సినిమా అన్న అభిప్రాయం కల్గించాయి. వాస్తవిక సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  కొండపొలం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.

కథ

    రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) ఢిల్లీలో యుపిఎస్ సి ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ఐ‌ఏఎస్ తీసుకోకుండా ఐఎఫ్ఎస్ ఎందుకు కోరుకుంటున్నావని ఇంటర్వ్యూలో అడిగితే, ఆత్మవిశ్వాసమంటే ఏమిటో అడవి నేర్పిందున ఫారెస్ట్ ఆఫీసర్ అవుదామనుకున్నట్టు చెప్తాడు. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడో గతాన్ని చెప్పుకొస్తాడు...

    రాయలసీమ లోని గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించించిన రవీంద్ర, తండ్రి గొర్రెలమ్మి సంపాదించిన డబ్బుతో బీటెక్ చేసి, జాబ్ ఇంటర్వ్యూల్లో ఫెయిలవుతూ వుంటాడు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇంగ్లీషు రాకపోవడం వంటి కారణాలతో ఉద్యోగం సంపాదించుకోలేక ఇంటికొస్తాడు. అప్పుడు తాత (కోట శ్రీనివాసరావు) ఒక సలహా ఇస్తాడు. తండ్రితోబాటు గొర్రెల్ని మేపడానికి అడవి కెళ్ళి, అక్కడ అడవి నేర్పే పాఠాలు నేర్చుకుంటే తప్పకుండా ఉద్యోగం సంపాదించుకునే తెలివి వస్తుందంటాడు.

    రవీంద్ర తండ్రి (సాయిచంద్) తో గొర్రెల్ని తీసుకుని అడవికి బయల్దేరతాడు, వాళ్ళతో తన గొర్రెల్ని తీసుకుని ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సిం), మరో ముగ్గురు నల్గురు కూడా నల్లమల అడవికి బయల్దేరతారు. నీరు లేక, గ్రాసం లేక కరువు కాటకాలతో గొర్రెలు మలమల మాడుతూంటే, వర్షాలు పడే వరకూ అడవిలో గొర్రెల్ని మేపి తీసుకు రావడాన్ని, ఇలా వెళ్ళి నెలన్నర అడవిలో గడిపి రావడాన్ని కొండపొలం అంటారు.

    ఇలా మొదటిసారి అడవి కెళ్లిన రవీంద్రకి వూహించని అనుభవాలు ఎదురవుతాయి. అతడి అధైర్యానికి ఓబులమ్మ ఆటలు పట్టిస్తూంటుంది. మరోవైపు గొర్రెల మీద పడే పులి, ఇంకోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు, ఇంకా శుంకాలు వసూలు చేసేవాళ్ళూ - ఇలా రకరకాల సమస్యల్ని చూస్తాడు. దీంతో ఓబులమ్మ చెప్పే పాఠాలతో బాటు, ఈ ఎదురయ్యే సమస్యల్ని కూడా జయించే ఆత్మవిశ్వాసం పొందే యువకుడుగా మారడం ఈ కథ. 
  
ఎలా వుంది కథ

     ‘తానా నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న 'కొండపొలం' నవల ఈ సినిమా కాధారమని సమాచారం. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి. ఈ నవల 2019 లో వెలువడింది. నల్లమల అడవుల్లో గొర్రెల కాపరుల కుటుంబాల జీవన పోరాటాన్ని చిత్రించిన ఈ నవలలో లేని ఓబులమ్మ పాత్రని, ఆమెతో ప్రేమ కథనీ   సినిమా కోసం సృష్టించారు. రవీంద్ర యాదవ్ పాత్ర యధాతథం. కానీ సినిమా మాత్రం హైదారాబాద్ సమీపంలోని వికారాబాద్ లో తీశారు. అందుకని నల్లమల నేటివిటీ లేదు. నల్లమలలోని రకరకాల చెట్లు, కాయలు పళ్ళూ, వాగులూ వంకలూ గురించిన సమాచారం నవల్లో వివరంగా వున్నట్టు నవల మీద వెలువడ్డ సమీక్ష ద్వారా తెలుస్తోంది. ఈ సహజత్వమంతా సినిమాలో వుండదు.  

     ఇక రవీంద్ర అడవిలో నేర్చుకునే జీవిత పాఠాలు ఈ సినిమా థీమ్ అయినప్పుడు ఈ థీమ్ తో అతను మమేకం కాలేక పోవడమనే క్యారక్టరైజేషన్ లోపం స్పష్టంగా కనబడుతుంది. కనీసం ఆకులో ఆకుగా, మానులో మానుగా అడవిని ఆవాహన చేసుకోకపోతే, మొదటిసారి అడవికెళ్ళిన తను అక్కడి దృశ్యాలకి వండర్ అవకపోతే, అడవిని మధించకపోతే, ఏం నేర్చుకున్నట్టు? రకరకాల సంఘటనలు, ప్రమాదాలూ వంటి భయపెట్టే అంశాలే నేర్చుకునే సాధనా లన్నట్టు వుంటాయి - తడవకోసారి పులితో తలపడే దృశ్యాలు సహా.

     ఇవి తప్ప హృదయాల్ని కదిలించే అనుభవాలు లేకపోవడంతో ఎమోషనల్ కనెక్ట్ కనపడదు. దీంతో ఆత్మవిశ్వాసం పొందే ముగింపు రాణించకుండా పోయింది. కథలో కండబలంతో బాటు హృదయ స్పందన కూడా వుంటే సమగ్రంగా వుండేది. నవలని సినిమాగా మార్చడంలో జరిగిన లోపమిది. లాక్ డౌన్ కోవిడ్ గురించే గానీ, నవల గురించి కాదుగా?


      ఈ సినిమా చూస్తూంటే మృణాల్ సేన్ హిందీ క్లాసిక్ 'భువన్ షోమ్', ధ్యానేష్ మోఘే  కొంకణిలో తీసిన 'దిగంత్' మెదులుతాయి. ఈ రెండు సినిమాల్ని దర్శకుడు క్రిష్ స్టడీ చేసి వుంటే బావుండేది. 'భువన్ షోమ్ లో మానవత్వం లేని రైల్వే ఆఫీసర్ ఉత్పల్ దత్ అడవికి షికారుకెళ్ళి, అడవి పిల్ల సుహాసినీ మూలేతో మానవత్వమంటే ఏమిటో నేర్చుకుని, మారిన మనిషిగా తిరిగి వచ్చే కథ ఒక క్యారక్టర్ స్టడీగా నిల్చిపోయింది. ఫ్రెంచి న్యూవేవ్ సినిమా శైలిని తొలిసారిగా భారతీయ తెరమీదికి  'భువన్ షోమ్' గా మార్చి సంచలనం సృష్టించాడు మృణాల్ సేన్.

     అలాగే కొంకణి దర్శకుడు ధ్యానేష్ మోఘే 'దిగంత్' లో ఇక 'కొండపొలం' లోని గొర్రెల కాపరుల జీవితమే కన్పిస్తుంది. కాకపోతే ఇందులో కథా నాయకుడికి తండ్రితో బాధ వేరు. చదువుకున్న కథానాయకుడు సిటీలో రియల్ ఎస్టేట్ ఉద్యోగంలో చేరాలని పట్టుదల. తండ్రికి తమ కులం అస్థిత్వం గురించిన బాధ. అడవిలోనే ఇంత స్వేచ్ఛా, భద్రతా వుంటే ఇంకెక్కడో వెతుక్కొనవసరం లేదనే మంకుపట్టు. ఈ కథ ఒక వర్తమాన సామాజిక పరిశీలనగా గుర్తుండి పోతుంది. ఇలాటివి 'కొండపొలం' తీయడానికి రిఫరెన్సులుగా వున్నాయి.

నటనలు సాంకేతికాలు

    'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరో యాదవ పాత్రలో ఒదిగిపోయాడు అనే రొటీన్ మాట అవసరం లేదుగానీ, ఫర్వాలేదు. కాకపోతే ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాక్కొస్తాడు. అతడి కళ్ళు ఆకర్షించాయన్నాడు దర్శకుడు. దీంతో అతను కనిపించినప్పుడల్లా మన దృష్టి కళ్ళ మీదికే పోతుంది. కళ్ళల్లో అంత శక్తివుంటే ఆత్మవిశ్వాసం నేర్చుకునే పనే లేదుగా? పాత్రకి తగ్గట్టు కళ్ళున్నాయి.

     కాకపోతే రియలిస్టిక్ సినిమాలో రియలిస్టిక్ పాత్రని చూపిస్తే బావుంటుంది. మొదటి యూపీఎస్సీ ఇంటర్వ్యూ సీన్లోనే ఇది లోపించింది. యూపీఎస్సీ  ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయో మాక్ ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో బోలెడున్నాయి. అభ్యర్ధులు ఎంత మృదువుగా, చక్కగా సమాధానాలు చెప్తారు. బాడీ లాంగ్వేజ్ ఎంత బావుంటుంది. వైష్ణవ్ తేజ్ ఈ వీడియోలు చూసి వాస్తవికతని, విశ్వసనీయతనీ ఈ సీన్లో ప్రదర్శించాల్సింది. 'రిపబ్లిక్' లో యూపీ ఎస్సీ ఇంటర్వ్యూని ఇంకో పై లెవెల్ కి తీసి కెళ్ళారు. హీరో దగ్గరగా, టేబుల్ మీద చేతులు పెట్టుకుని కూర్చుని, ఎమోషనల్ లెక్చర్ దంచేస్తూంటాడు!

    ఆత్మ విశ్వాసం నేర్చుకునే పాత్రపరంగా వైష్ణవ్ తేజ్ డీలా పడ్డానికి తగిన ఎమోషనల్ త్రెడ్ లేకపోవడం కారణం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో లేకపోతే ఇంతే. స్క్రీన్ ప్లే అంటే పాత్రకి ఒక సమస్య, ఒక సంఘర్షణ అనే సూత్రం పాటించకపోతే పాత్ర ఇలాగే బలహీనంగా తయారవుతుంది. ఫార్ములా పాత్రలకి భిన్నంగా ప్రయోగాలు చేస్తున్న వైష్ణవ్ తేజ్ ఇవి దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

      ఇక ఓబులమ్మ పాత్రలో సహజంగానే రకుల్ ప్రీత్ సింగ్ నేటివిటీకి దూరంగా వుంది. పాత్రకి వున్న చలాకీతనంతో ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ తనకి కూడా వైష్ణవ్ కి లాగే ఎమోషనల్ సీన్లు లేవు. ఎమోషన్లనేవి ఒకే ఒక్క సమస్యతో పోరాడుతున్నప్పుడు మాత్రమే క్యారీ అవుతాయి. తడవకో సమస్యతో కాదు.

    మూడో పాత్ర తండ్రి పాత్రలో సాయిచంద్ చాలా బాగా నటించాడు. గొర్రెలకి నీరు పెట్టలేని అశక్తతతో వాటిమీద విరుచుకు పడే సన్నివేశం ఈ సినిమాకి హైలైట్. 'సొంత ఊరు' లో ఎల్బీ శ్రీరామ్ గుర్తొస్తాడు. ఇంకో పాత్రలో ఫార్ములా సినిమాల రవిప్రకాష్ సహజ నటన ప్రదర్శించాడు. ఐతే భార్యతో గోడు వెళ్ళబోసుకునే అంత లాంగ్ ఫోన్ సంభాషణ అనవసరమన్పించేదే. కథకీ పాత్రకీ ఉపయోగం లేదు. అసలే వేగంగా కదలని కథకి ఇదొక స్పీడ్ బ్రేకు. సహనపరీక్షగా వుంది.

    జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణంలో అరణ్య దృశ్యాలు అత్యంత రమణీయంగా వున్నాయి. కానీ తాగడానిక్కూడా నీళ్ళు దొరకని ఎండా కాలపు అరణ్యం అంత పచ్చగా వుండదేమో. ఇంత అద్భుతంగా చూపించిన అడవిని దాన్నొక హీరో నేర్చుకునే పాత్రగా, పాఠంగా చేసి అనువణువు విప్పి చూపించాలి అసలుకి. క్లోజప్స్ తో కట్టి పడేయాలి. నవలలో చిత్రీకరణకి సాధ్యమైన వర్ణనలున్నాయి. ‘సాక్షి’ లో ప్రచురించిన జంపాల చౌదరి ముందు మాట చదివితే అర్ధమవుతుంది.

    కీరవాణి సంగీతం హెవీగా వుంది. అయితే క్యాచీగా పాటలున్నాయి. అసలే బిక్కుబిక్కుమంటూ నేర్చుకోవడానికి వచ్చిన హీరో పాత్రకి ఇంత హెవీ సౌండ్ అవసరం లేదేమో. ఈ సినిమా హీరో కళ్ళతో చూస్తున్న బయస్కోప్ అన్నది దృష్టిలో పెట్టుకుంటే కథా కథనాలూ, సంగీతం అన్నీ శృతిలో వుండే అవకాశముంది.

చివరికేమిటి

     నవలా రచన  చేసిన సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డియే మాటలు రాయడం ఈ సినిమాకి సహజత్వం. సినిమా రచయితలు రాసివుంటే టెంప్లెట్, కృతక సీమ లాంగ్వేజీ వుండేది. రామిరెడ్డి రాసిన మాటల వల్ల చాలా సన్నివేశాలు రక్తి కట్టాయి. అయితే నవలకి దర్శకుడి స్క్రీన్ ప్లే ఒక్కటే అన్ని సమస్యలకి కారణమైంది. స్క్రీన్ ప్లేకో దశ, దిశ కన్పించవు. దీంతో చాలా సీన్లు రిపీటవుతూంటాయి. పైగా కథనానికో ప్లానింగ్ లేదు. మొదటిసారిగా అడవిలోకి ప్రవేశించిన హీరోకి పులి భయం పెట్టేశారు. అతను కనీసం మొదటిసారి అడవిని చూస్తున్న ఆనందాన్ని కలగనీయకుండా చేశారు. అడవిని పరిచయం చేసుకునే, ప్రేమించే అవకాశం కూడా లేకపోయింది. పులిని గురించిన మాటలతో పులి భయం... పులి భయం...

     40 వ నిమిషంలో పులి దాడి చేసేసరికి అతను పూర్తిగా బెదిరిపోతాడు. నిజానికి ఇక్కడే కథ ప్రారంభం కావాలి. అన్నిసార్లు పులిని గురించి వింటున్నప్పుడు, పులి కన్పిస్తే దాంతో తేల్చుకునే ధైర్యం నింపుకుని సిద్ధంగా వుండాలి. అది దాడి చేయగానే ఎదుర్కొనే పోరాటం ప్రకటించేస్తే, కథ ప్రారంభైపోయి గొడవ వదిలిపోయేది.

     ఈ నలభై నిమిషాలూ గొర్రెల కాపరుల రిపీటయ్యే కష్టాలు, హీరోయిన్ తో ప్రేమ ప్రారంభం కాని ఏవో దృశ్యాలూ వచ్చి పోతూంటాయి. పులి దాడిని అతను ఆత్మవిశ్వాసం పొందే మార్గంగా నిర్ణయించుకుని పోరాటం ప్రకటించి వుంటే థీమ్ ని ఎస్టాబ్లిష్ చేసే మలుపుగా వుంటూ కథ ప్రారంభమై పోయేది. ఈ గోల్ ప్రారంభం కాక, హీరోయిన్ తో ప్రేమా ప్రారంభం కాక, ఇంకేదో ఎర్ర చందనం స్మగ్లర్ల ఎపిసోడ్ వస్తుంది. దీని మీదే ఇంటర్వెల్ పడుతుంది. ఇప్పుడు కథేమిటంటే ఏమీ చెప్పలేని పరిస్థితి.

     సెకండాఫ్ లో ఇంకో రెండు సార్లు పులి దాడి చేస్తుంది. మొదటి దాడిని ఎదుర్కొంటాడు. కానీ ఇది ఆత్మవిశ్వాసం పొంది, ఉద్యోగం సాధించుకునే గోల్ కోసమని స్పష్టంగా ఇప్పుడైనా కథ ఎస్టాబ్లిష్ కాదు. ఇక ప్రేమ విషయాని కొస్తే ఇంకో ముప్పావు గంటకి గానీ ప్రేమలో పడరు. పడ్డాక దీని మీద కూడా వుండరు. ఇంకో పావుగంటకి విడిపోతారు. అంటే ప్రేమ విషయంగా చివరి అరగంట సమయంలో గానీ ప్రేమలో పడడం, కాన్ఫ్లిక్ట్ ప్రాంభమవడం జరగవన్న మాట. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. హీరో గోల్ కథ కూడా మిడిల్ మటాషే.

    నవలలో లేని హీరోయిన్ పాత్ర, దాంతో ప్రేమ కథ సినిమాలో కల్పించడంలో కన్ఫ్యూజన్ వల్ల ఈ పరిస్థితి. కేవలం ఆత్మ విశ్వాసం కథ చెప్పాలనుకుని ప్రేమ కథని వెనక్కి తోసేయడంతో రెండూ నష్టపోయాయి. ఫస్టాఫ్ లోనే ప్రేమ కథ ప్రారంభిస్తే అది షుగర్ కోటింగ్ లా వుండేది. దాని మాటున అంతర్లీనంగా ఆత్మవిశ్వాసం కథ చెప్తే సమస్యలన్నీ తీరేవి. హీరోయిన్ పాత్ర కూడా అర్ధవంతంగా వుండేది.

 సికిందర్  

(Published in telugurajyam.com,
 a US based website)

Monday, September 27, 2021

1059 : మూవీ నోట్స్

     కోవిడ్ కట్టడిలో చాలా కాలంగా వూరిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మొత్తానికి చెర లోంచి బయటపడి థియేటర్స్ లోనే విడుదలైంది. కోవిడ్ పరిణామాలతో ప్రేక్షకులు - ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల టికెట్లు ఏ మాత్రం తెగుతాయన్న సందేహాలని తీర్చేస్తూ బాక్సాఫీసు హిట్టయ్యింది. శేఖర్ కమ్ములతో బాటు నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధానాకర్షణ అయి, హౌస్ ఫుల్స్ తో ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్ళని రాబట్టింది. సినిమాలకి కుటుంబ ప్రేక్షకులు ఎంత అవసరమో దీన్ని బట్టి తేలింది. ఇదే మునుపు రెండు వారాల్లో విడుదలైన సీటీమార్’, గల్లీ రౌడీ అనే రెండు మాస్ సినిమాలు మాస్ ప్రేక్షకుల్నిథియేటర్లకి రప్పించడంలో విఫల మయ్యాయి. థియేటర్లు మూతబడ్డాక ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకుల్లో మాస్ సమూహం దాదాపు లేదు. అయినా థియేటర్లు తెరిచాక వాళ్ళ మార్కు సీటీమార్’, గల్లీ రౌడీ అనే మాస్ సినిమాలు వచ్చినా బుకింగ్స్ దగ్గర బారులు తీరలేదు. దీన్ని బట్టి మాస్ సినిమాలని ఇంకా అదే మూసలో కాకుండా కాస్త ఆధునీకరించిన బాలీవుడ్ రోహిత్ శెట్టి శైలిలో తీయాలేమో పునరాలోచించాలి. మాస్ సినిమాలు ఎప్పటికీ అవసరమే. కానీ చార్మినార్ సిగరెట్టు ఇప్పుడు లేదు, కొత్త కొత్త మాస్ సిగరెట్లు వచ్చాయి. ఇంకా చార్మినార్ కాలపు మాస్ సినిమాలు తీస్తూంటే లాభం లేదు.

        ప్రేమ సినిమాల్లో కులాంతర ప్రేమలు కూడా చార్మినార్ కాలం నాటివే వస్తున్నాయి. గత నెల్లోనే శ్రీదేవి సోడా సెంటర్ అనే కులాంతర ప్రేమ చార్మినార్ కాలం నాటిదే. ఇంకా చెప్పాలంటే గోలీ సోడాలున్న చార్మినార్ కాలం నాటిది. దీని పీరియెడ్ ని సూచిస్తున్నట్టు సినిమాలో కూడా ఇప్పుడు లేని గోలీ సోడానే చూపించారు. కాకపోతే ఈ కులాంతరానికి ఈ కాలపు వార్తల్ని సృష్టిస్తున్న ఆనర్ కిల్లింగ్ అనే ఆవేశం తోడయ్యింది. దీనికి ముందొచ్చిన ఉప్పెన అనే ఇంకో కులాంతరంలో ఇంకో ఆవేశం తొడయ్యింది. ఇక ఇప్పుడొచ్చిన లవ్ స్టోరీ లో ఈ ఆవేశాలకి భిన్నంగా కాస్త ఇంకేదో ఆవేశం సృష్టించానుకున్నట్టుంది కమ్ముల. దీంతో కులాంతర సమస్య తో శేఖర్ కమ్ముల దృక్కోణంలోంచి ఆశించిన ఆయన స్టోరీ ఐడియానే లేకుండా పోయింది.

     చైల్డ్ ఎబ్యూజ్ మీద హిందీలో ఈ మధ్య రెండు విడుదలయ్యాయి :  కహానీ- 2 (2016), హైవే (2014). వీటికి పూర్వం ఇండిపెండెంట్ దర్శకురాళ్ళ సినిమాలు రెండు వచ్చాయి. దీపా మెహతా 2005 లో తీసిన వాటర్’, మీరా నాయర్ 2001 లో తీసిన మాన్సూన్ వెడ్డింగ్ అన్నవి. మొదటి రెండూ చైల్డ్ ఎబ్యూజ్ తో వేరే కథలు. మూడోది వాటర్ 1938 నాటి పీరియెడ్ కథా నేపథ్యం. నాల్గోది మాన్సూన్ వెడ్డింగ్ లో ఎన్నారై లంతా ఒక చోట కూడే పెళ్ళి వేడుకల కథ. ఈ పెళ్ళి వేడుకల కథలోంచి సెకండాఫ్ లో చైల్డ్ ఎబ్యూజ్ కథ బయటపడుతుంది.

        ఇందులో ఇంకో వేరే పాయింటు లేదు. నాల్గు రోజుల పెళ్ళి వేడుకల్లో సెకండాఫ్ లో చిన్నప్పుడు చైల్డ్ ఎబ్యూజ్ నెదుర్కొన్న షెఫాలీ షా పాత్ర, అది బయటపెట్టి అలజడి సృష్టించే ఒకే పాయింటు తప్ప. దీనికి పరిష్కారంగా పెళ్ళి కూతురి తండ్రి పాత్ర నసీరుద్దీన్ షా, చైల్డ్ ఎబ్యూజ్ కి పాల్పడ్డ తోడల్లుడు రజత్ కపూర్ ని పెళ్ళి వేడుకల్లోంచి బహిష్కరిస్తాడు.

        లవ్ స్టోరీ లో కులాంతర ప్రేమ కథగా నడుస్తూంటుంది. దీనికి హీరోయిన్ బాబాయి పాత్ర అడ్డుపడాలి నిజానికి. కానీ మళ్ళీ ఇది పాత కాలపు కథై పోతుందనేమో, బాబాయికి హీరోయిన్ తో చైల్డ్ ఎబ్యూజ్ విలనీ సృష్టించారు. దీంతో బాబాయి హీరోయిన్ మీద అదే కాంక్షతో వేధిస్తూంటాడే తప్ప, ఆమెకి హీరోతో వున్న కులాంతర ప్రేమ గురించి కాదు. చివరికి సెకండాఫ్ లో పెళ్ళి సందర్భంగా హీరోయిన్ ఇది బయట పెట్టినప్పుడు, హీరో దీని తాలూకు కసితోనే బాబాయిని చంపేస్తాడు. ఇందులో కులాంతరం సమస్య ఎక్కడుంది. లేనప్పుడు కులాంతర ప్రేమ కథ ఎందుకు.  

        కులాంతరమే కాదు ఇంకా లింగ వివక్ష, జీవన పోరాటం పాయింట్లు కూడా కథలో నడుస్తూంటాయి. ఒక ఇంటర్వ్యూలో - అన్ని పాయింట్లూ కలిపేసిన కిచిడీ ఈ కథ - అని కమ్ములే స్వయంగా అన్నట్టు, ఇది ప్రేక్షకులకి నచ్చి హిట్ చేశారు. కులాంతర ప్రేమ కథలు ఏదో రకంగా, వంకరగా కూడా, చావులతోనే ముగుస్తాయన్న మాట.

సికిందర్

 

Thursday, September 16, 2021

'పాలపిట్ట' మాసపత్రిక 'విస్మృత సినిమా' ఆర్టికల్ - 724


         తెలుగు ప్రేక్షకుల సినిమాభిరుచి అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహాలో తీర్చిదిద్దుకు న్నట్టుంది. సినిమాలు పక్కా వినోదాత్మకంగా వుండాలన్నదే మెజారిటీ వర్గం ప్రేక్షకులు శిలాశాసనం రాసుకున్న ఏకైక అభిరుచేమో. స్టాంపు వేసిన ఈ అభిరుచి ప్రకారం సినిమాలు వుండకపోతే  విషయం లేని సినిమాల కింద మరణశాసనం రాసేస్తారు. బలమైన కథ వుందంటే, ఇక విషయం లేనట్టేనని తీర్పు ఇచ్చేస్తారు. ఈ వర్గం ప్రేక్షకులు కాలగర్భంలో కలిపేసిన సినిమాలన్నీ విస్మృత సినిమాలు కావు. తగిన కథాబలమూ, కథా ప్రయోజనమూ వుండి, వాళ్ళ అభిరుచికి దూరంగా వుండిపోయినవే విస్మృత సినిమాలన్పించుకుంటాయి. వాళ్ళ దృష్టిలో వీటికి వినోదాత్మక విలువ వుండదు. వినోదాత్మక విలువలు లేని సినిమాలు ఇతర భాషల్లో హిట్టయి చరిత్రలో నిల్చిపోతే, అవే తెలుగులో పునర్నిర్మించినప్పుడు ఫ్లాపయి పౌరసత్వాన్ని కోల్పోతాయి. ఇలాటిదే ఇంకో విస్మృత సినిమా ‘మనసే మందిరం’. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్టయి, విచిత్రంగా తెలుగులో టైటిల్ మాత్రమే పాపులరైంది. 


          
మిళ మాతృక నుంచి ఈ రీమేకులన్నీ జరిగాయి. వినోదాత్మక విలువలు లేని, పూర్తి శోక రసమయమైన ఈ మాతృకని, ఎలా ఇన్ని భాషల్లో రీమేక్ చేయడానికి సాహసించారనేది జవాబు దొరకని ప్రశ్న. బహుశా కథని నమ్మడం వల్ల, కథకిచ్చిన ముగింపుకి దాసోహమై పోవడం వల్ల. ఇంతకంటే కారణాలు కన్పించవు. అదింకా 1960 ల నాటి కాలం. ట్రాజడీలని ఆదరిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో సి.వి. శ్రీధర్ అనే నిర్మాత, దర్శకుడు, రచయిత ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే విషాదాంత ప్రేమాయణం తీశాడు. సి.వి. శ్రీధర్ ( చిత్తమూర్ విజయ రాఘవులు రెడ్డియార్ శ్రీధర్, 1933 – 2008) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరున్నదర్శకుడు.1954 లో 21 వ యేట దర్శకుడైన శ్రీధర్, 1991 వరకూ 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో 66 సినిమాలు తీశాడు. వీటిలో 47 తమిళం, 10 తెలుగు, 9 హిందీ వున్నాయి. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, రాజ్ కపూర్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, శశికపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మీనాకుమారి, వైజయంతీ మాలా, రాజశ్రీ, హేమమాలిని, ముంతాజ్, సావిత్రి, కృష్ణకుమారి, బి. సరోజా దేవి, దేవిక...ఇలా కనువిందు చేసే అగ్ర తారాతోరణంతో ఆయన సినిమాలు కళకళ లాడేయి. 

         ఐతే 1962 లో రాసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మనసే మందిరం’ మాతృక ‘నెంజిల్ ఒరు ఆలయం’ మహోజ్వల చిత్రరాజం నాటికి అతడేమీ వయసుమీరిన అనుభవశాలి కాదు. అప్పటికింకా 29 ఏళ్ళే! దీనికి పాపులర్ హీరోని తీసుకోక కన్నడ, తమిళ హీరో కళ్యాణ్ కుమార్ ని తీసుకున్నాడు. దేవిక కథానాయిక. ఆర్. ముత్తు రామన్ సహాయపాత్ర. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. విలువలు గుర్తించిన మనుషులు స్వార్ధానికి పోరనీ, విలువల కోసం త్యాగాలు చేస్తారనీ, ప్రాణత్యాగానికి సైతం వెరవరనీ నీతిని ప్రకటిస్తూ ఇది సంచలన విజయం సాధించడమే గాక, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది.

          వెంటనే 1963 లో హిందీలో రీమేక్ చేశాడు. అప్పుడు బొటాబొటీ ముప్ఫై
 ఏళ్ళే!  రాజేంద్ర కుమార్, మీనా కుమారి, రాజ్ కుమార్ లాంటి ఉద్దండులతో  ‘దిల్ యేక్ మందిర్’. తీశాడు. శంకర్ – జైకిషన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. ఇది 175 రోజులు ఆడి భారీ విజయం సాధించింది (అప్పట్లో కోటీ పది లక్షలు). ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. రాజ్ కుమార్ కి ఫిలిం ఫేర్ సహాయ పాత్రధారి  అవార్డు లభించింది. 1966 లో తెలుగులో ‘మనసే మందిరం’ గా ఇంకో రీమేక్ చేశాడు. అప్పుడు 33 ఏళ్ళు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటీనటులు. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, బాలు ఛాయాగ్రహణం.  

          1976 లో మలయాళంలో ‘హృదయం ఒరు క్షేత్రం’ గా, 1977 లో కన్నడలో ‘కుంకుమ రక్షే’ గా అక్కడి నిర్మాతలు, దర్శకులు రీమేక్స్ చేశారు. ఇలా మాతృకతో కలుపుకుని మొత్తం ఐదు సినిమాలయ్యాయి. తెలుగులో తప్ప అన్నీ హిట్టయ్యాయి. ఒక్క   శ్రీధర్ తీసిన తమిళ, హిందీ, తెలుగు రీమేకులు తెలుపు – నలుపులో అయితే; మలయాళ, కన్నడ రీమేకులు రంగుల్లో తీశారు. హాలీవుడ్ నుంచి జగ్ ముంద్రా దీన్ని ఇంగ్లీషులో రీమేక్ చేయాలనీ కూడా విఫలయత్నం చేశాడు.

జరిగేదంతా లోపలే 
      ‘మనసేమందిరం’ తెలుగు రీమేక్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలతో బాటు, గుమ్మడి, నాగభూషణం, రేలంగి, చలం, శాంతా కుమారిలు నటించారు. సంభాషణలు, పాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఒక పాట కార్తీక్ రాశారు. ఘంటసాల, పి. సుశీల, ఎల్లారీశ్వరి, పిబి శ్రీనివాస్ లు గానం చేశారు. ‘అల్లారు ముద్దు కదే అపరంజి ముద్ద కదే’ (పి. సుశీల), ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ (పిబి శ్రీనివాస్) పాటలు రెండూ ఇప్పటికీ హిట్టేనని తెలిసిందే. 

          మాతృకతో బాటు రీమేకులన్నీ పూర్తిగా హాస్పిటల్లో తీసినవే. ఒక ప్రేమ సన్నివేశం, హిందీలో ఒక పాట తప్ప, హాస్పిటల్ దాటి బయటికి రాని ఇండోర్ కథా కథనాలతో తీశారు. మొదటి సీనుతో హస్పిటల్లోకి వెళ్ళే కెమెరా, చివరి సీనులో మాత్రమే హాస్పిటల్ దాటి బయటి దృశ్యాని కొస్తుంది. ఈ రెండున్నర గంటల ఇండోర్ డ్రామా 30 రోజుల్లో తీశారు. తెలుగులో సారధి స్టూడియోలో తీశారు. పాటల విషయాని కొస్తే, హిందీలో ఎక్కువ హిట్టయిన వెంటాడే పాటలున్నాయి : ‘యహా కోయీ నహీ తేరే మేరే సివా’ (రఫీ), ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’ (లత), ‘యాద్ న జాయే భీతే దినోకీ (రఫీ), రుక్ జా రాత్ ఠెహర్ జారే చందా’ (లత),  ‘దిల్ యేక్ మందిర్ హై’ (రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్).

రెండు వారాల కథ 
      10 వ తేదీన క్యాలెండర్లో కాగితం చినగడంతో ప్రారంభమయ్యే కథ, క్యాలెండర్లో 24 వ తేదీతో ముగుస్తుంది. ఇది టైం లాక్ కథా సంవిధానం. డాక్టర్ రఘు (అక్కినేని నాగేశ్వర రావు) ఆపరేషన్ కి ప్రకటించే రెండు వారాల గడువులోపల జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. ఈ టైంలాక్ చేయడంవల్ల, డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ ఏం జరగబోతోందన్న సస్పెన్స్ వెంటాడుతూంటుంది. డాక్టర్ రఘు చేతిలో ఆపరేషన్ సక్సెస్సా, ఫెయిలా? ఉత్కంఠ రేపే ఈ సస్పెన్స్ తో కూడిన కథనం ప్రతీదృశ్యాన్నీ విడువకుండా చూసేలా చేస్తుంది.   క్యాలెండర్లో లెక్కపెట్టి ఒక్కో తేదీ మారుతూంటే, ఆపరేషన్ ఫెయిలయ్యే ముందస్తు సూచనలే, పరిణామాలే (కుక్క ఏడ్పు, బాలిక మరణం లాంటివి) ఆందోళన పరుస్తూంటాయి. ఆపరేషన్ ఫెయిలయితే డాక్టర్ రఘు తీవ్ర ప్రమాదంలో పడిపోయే గండం పొంచి వుంటుంది. అప్పుడతను జీవించినా మరణించినట్టే లెక్క. ‘ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకు’ గా విశ్వసనీయత కోల్పోయి పతనమై పోతాడు. అయినా ఈ భారీ మూల్యం చెల్లించుకునే రిస్కుకే  సిద్ధపడతాడు. ఇలా కథలో ఒక పాత్రగా క్యాలెండర్ అనే ప్లాట్ డివైస్, కథనంలో సస్పెన్స్ అనే ఎలిమెంట్, క్యారెక్టర్ కి అధిక రిస్కుతో కూడిన గోల్ – ఈ మూడూ బలమైన ప్రధాన పనిముట్లుగా కుదిరి, ఈ ప్రేమకథ స్క్రీన్ ప్లేతో ఎప్పుడో అరవై ఏళ్ల నాడే, నూతన దృక్పథంతో  అత్యత్భుత కథన చాతుర్యాన్ని కనబర్చాడు యంగ్ శ్రీధర్. ఇందుకే జగ్ ముంద్రా ఇంగ్లీషులో రీమేక్ చేయాలనుకుని వుంటాడు.  

          హాస్పిటల్లో నవంబర్ తొమ్మిదవ తేదీ క్యాలెండర్ కాగితం చించి రోజు ప్రారంభిస్తాడు డాక్టర్ రఘు (ఏఎన్నార్). తల్లి (శాంత కుమారి) వచ్చి,  ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే వుండిపోతున్నావు, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది. తనకి హస్పిటలే జీవితమంటాడు. హాస్పిటల్ కి సీత (సావిత్రి) వస్తుంది. ఆమెని చూసి ఖిన్నుడవుతాడు రఘు. ఆమె కూడా అతణ్ణి చూసి కంగారు పడుతుంది. ఇద్దరూ గతంలో ప్రేమికులు. ఆమె కూడా భర్త వుంటాడు. అతడి ముందు బయటపడకుండా జాగ్రత్తపడతారు. భర్త రాము (జగ్గయ్య) కి క్యాన్సర్ వుందనీ, చికిత్స కోసం తీసుకు వచ్చాననీ అంటుంది. 

          డాక్టర్ రఘు వైద్య విద్య కోసం విదేశాల కెళ్ళినప్పుడు, తను ప్రేమిస్తున్న సీతకి ధనికుడైన రాముతో బలవంతపు పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి. ఇది తెలుసుకున్న రఘు మానసికంగా దెబ్బతిని, ఇక పెళ్ళే చేసుకోనని, హాస్పిటల్ కి అంకితమై పోతాడు. 

          ఇప్పుడామె భర్తకి క్యాన్సర్. ఆమె సందిగ్ధంలో పడుతుంది. ఈ హాస్పిటల్ రఘుదని తెలీక వచ్చేసింది. ఇప్పుడు భర్తని ఇతడి చేతిలో పెడితే నయం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడా? రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడని రఘు అనేస్తాడు. ఆమె భర్తని కాపాడాలనే తప్ప అతడి మనసులో ఇంకే ఉద్దేశాలూ వుండవు. రాముకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. అతను అర్ధం జేసుకుని, ఆపరేషన్ లో తను మరణిస్తే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్మానిస్తాడు. సీతకి ఇది జీర్ణంకాక రామూని బతికించుకోవాలని తీవ్ర సంఘర్షణ ప్రారంభిస్తుంది. రాము మాటలతో రఘు ధైర్యం కోల్పోతాడు. ఆపరేషన్ ఏ మాత్రం విఫలమైనా అది సీత తన సొంతమవుతుందన్న ఆశతోనే చేశాడని అందరూ అనుకుంటారు. ఇది భరించలేడు. దీంతో ఆపరేషన్ మీది బెంగతో నిద్రాహారాలు మాని, సర్జరీ శాస్త్రాలన్నీ తిరగేస్తూ పిచ్చివాడై పోతాడు. చివరికి ఆపరేషన్ రోజు రానే వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి కుప్పకూలి మరణిస్తాడు డాక్టర్ రఘు.

విశిష్ట కథనం, పాత్రచిత్రణలు 
       పైన చెప్పుకున్నట్టు ఈ కథనానికి సస్పెన్స్ ప్రాణమై నిల్చింది. ఇప్పటి తెలుగు సినిమా ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అనే ఎలిమెంటే వుండడం లేదు. అదేదో మిస్టరీ, క్రైం, యాక్షన్ కథల వ్యహారమనుకునే దురవగాహనతో వుంటున్నారు. పైగా గత రెండు దశాబ్దాలుగా తెలుగులో అవే రోమాంటిక్ కామెడీలూ, లేదంటే అవే మాస్ యాక్షన్లూ మాత్రమే చూస్తూ పెరిగిన కొత్తతరం దర్శకులు ఇంకో కళాప్రక్రియని  వూహించలేక పోతున్నారు. ఎప్పుడైనా కుటుంబ కథ తీస్తే ఆ పాత్రల జీవితాల్లో థ్రిల్లే వుండదు, సస్పెన్సే వుండదు. పాసివ్ పాత్రలతో చప్పగా పాసివ్ కథనాలు చేసి చేతులు దులుపు కుంటున్నారు.

          ‘మనసే మందిరం’ ముఖ్య పాత్రలు మూడూ పాసివ్ పాత్రలు కాదు. ఈ కథ ట్రాజడీయే అయినా తలరాతని విధికే వదిలేసి ఏడుస్తూ కూర్చునే పాసివ్ పాత్రలు కావు. తలరాతని మార్చుకోవడానికి పరిస్థితులతో సంఘర్షించే, లక్ష్యమున్న యాక్టివ్ పాత్రలు. డాక్టర్ రఘు పాత్రలో ఏఎన్నార్ కి ఆపరేషన్ విజయవంతం చేయాలన్న లక్ష్యం, దాంతో సంఘర్షణ;  సీత పాత్రలో సావిత్రికి మృత్యు ముఖం లోంచి భర్తని కాపాడుకోవాలన్న లక్ష్యం, దాని తాలూకు సంఘర్షణ; క్యాన్సర్ రోగి రాము పాత్రలో జగ్గయ్యకి వాళ్ళిద్దర్నీ కలపాలన్న లక్ష్యం, దీని తాలూకు సంఘర్షణ. లక్ష్యం మాటల్లో వుంటే చాలదు, అది చర్యల్లో విజువల్ గా కన్పించాలి. జగ్గయ్య వాళ్ళిద్దరికీ కలిపి వీలునామా కూడా రాసేసి లక్ష్య శుద్ధిని చాటుకుంటాడు. 

          ఈ కథనంలో ఆలస్యం చేయకుండా రెండో సీన్లోనే కథ ప్రారంభించేస్తాడు దర్శకుడు. మొదటి సీనులో తల్లి వచ్చి, ఇంటికి రమ్మని ఏఎన్నార్ తో చెప్పి వెళ్ళాక,  రెండో సీన్లోనే సావిత్రి జగ్గయ్యతో వచ్చేస్తుంది. జగ్గయ్యకి క్యాన్సర్. ఏఎన్నార్ కి ఎదుట వున్న సావిత్రితో పాత జ్ఞాపకాల తూఫాను, సావిత్రికి ఏఎన్నార్ మీద అనుమానం, వ్యతిరేకత. ఇలా కథకి ప్రధాన పాత్ర ఏఎన్నార్ అయితే, వ్యతిరేకించే ఎదుటి పాత్రగా సావిత్రి, వీళ్ళిద్దరి మధ్య గార్డియన్ పాత్రగా జగ్గయ్య. ఇలా బలాబలాల సమీకరణ పూర్తయ్యింది ఇక సంఘర్షణ అనే కథనరంగానికి. 

          ఈ రెండో సీన్లోనే ఎక్స్ రే చూస్తున్నప్పుడు, ఏఎన్నార్ కి సావిత్రితో గతం తాలూకు ఒక దృశ్యం మెదులుతుంది. వీళ్ళిద్దరూ పూర్వ  ప్రేమికులని దృశ్యపరంగా క్లుప్తంగా చెప్పడం. ఈ సంక్షిప్త దృశ్యంలో పెళ్లెప్పుడని సావిత్రితో ఏఎన్నార్ అంటాడు. తండ్రితో మాట్లాడతానని ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకి మించి వీళ్ళిద్దరి పూర్వ ప్రేమ సన్నివేశాలు కథనంలో మరెక్కడా రావు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే సూత్రమొకటుంది :  కథనంలో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి అని. 

          ఇలా ఈ వొక సీనులో వాళ్ళ ప్రేమని అరకొరగా చూపించేసి, మనకి పూర్తిగా చూడాలన్పించే డిమాండ్ ని సృష్టించాడు దర్శకుడు. కానీ మరెక్కడా ఏఎన్నార్ – సావిత్రి హిట్ రోమాంటిక్ జంటతో మనకి చూడాలన్పించే ఆ పూర్తి  ప్రేమ తాలూకు నులి వెచ్చని సన్నివేశాలని సరఫరా చేసి,  డిమాండ్ ని తీర్చే పాపాన పోడు దర్శకుడు. కవితాత్మకంగా వూహకే వదిలేశాడు. దీంతో ఈ కథన భంగం (సీనస్ ఇంటరప్టస్) ఒక తియ్యటి బాధలా మిగిలిపోతుంది మనకి. ఇలాటి తియ్యటి బాధల్ని సృష్టించడం గొప్ప దర్శకుల వల్లే అవుతుంది. సినిమా ద్వితీయార్ధంలో ఒక చోట సావిత్రే తానెందుకు జగ్గయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్తుంది. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ వేయలేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. అది కథవదు. కనుక మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. దాన్నే ఫ్లాష్ బ్యాకువేసి చూపిస్తూ పోతే,  అది ప్రధాన కథ స్క్రీన్ టైముని తినేసి, అదే ప్రధాన కథ అన్నట్టుగా తయారవుతుంది. 

       ఒకసారి ఇప్పుడొస్తున్న దర్శకుల సినిమాల సరళిలో ఈ కథనాన్ని పెట్టి చూస్తే, తమాషాగా ఇలా వుంటుంది – సావిత్రి జగ్గయ్యతో వచ్చి క్యాన్సర్ అని ఏఎన్నార్ తో చెప్తుంది. ఏఎన్నార్ ఎక్స్ రే చూస్తూ సావిత్రిని వూహించుకుంటాడు. అంతే,  ఫ్లాష్ బ్యాక్ తన్నుకొచ్చేస్తుంది. కాలేజీలో వాళ్ళిద్దరి చదువులు, ప్రేమలు, వాళ్ళిద్దరి కుటుంబ పరిస్థితులు, యుగళ గీతాలు, విద్య కోసం ఏఎన్నార్ విదేశీ యానం, సావిత్రి కి తండ్రి వల్ల జగ్గయ్యతో బలవంతపు పరిణయం, ఏఎన్నార్ స్వదేశాగమనం, ఇక ప్రేమంతా మంటగలిసిందని వైద్య సేవల్లో కలిసిపోవడం. 

          ఇలా రొడ్డకొట్టుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి జగ్గయ్య ఆపరేషన్ గురించిన అసలు కథ. ఏ కథైనా ఈ చట్రంలోనే వేసి రంగులరాట్నం తిప్పడం. రెండు మాటల్లో చెప్తే పోయే పాత పురాణాన్ని సగం సినిమా ఫ్లాష్ బ్యాకుగా వేసి, అది కూడా  ప్రధాన కథే అన్నట్టుగా విన్యాసాలు చేయడం. ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలుండవన్న ఇంగిత జ్ఞానంలేక. ఉన్న ప్రధాన కథ లోతుపాతుల్లోకి వెళ్ళడం తెలీక, ఎత్తుకున్న ప్రధాన కథ నడపడమూ తెలీకా, ఇలా ఇంటర్వెల్ వరకూ వృధా కాలక్షేపం చేయడం. కథని వీలయినంత తక్కువ స్క్రీన్ టైముకి కుదిస్తూ, సెకండాఫ్ లో ఏదో కథ చెప్పేసి, బయటికి దూకెయ్యడం. ఆ వికృత సినిమాల్ని ప్రేక్షకుల చేతిలో పెట్టడం. 

          కానీ శ్రీధర్ ప్రధాన కథ రెండో సీన్లో వెంటనే ప్రారంభమయింది మొదలు, చివరంటా రెండున్నర గంటలూ  ఎడతెగని బిగితో ఆద్యంతం జ్వలిస్తూ సాగుతుంది ఫ్లాష్ బ్యాక్ ని ఎగేస్తూ. ఇందులో ఏఎన్నార్ – సావిత్రిల పూర్వ ప్రేమ కథని నామమాత్రం చేయడంలో ఇంకో ఉద్దేశం కూడా వుండొచ్చు. దర్శకుడు దీన్ని పూర్తి స్థాయి సస్పెన్స్ కథగా చెప్పాలనుకున్నాడు. పూర్వ ప్రేమ తాలూకు ఏ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వేసినా, నడుస్తున్న ప్రధాన కథ తాలూకు సస్పెన్స్ ధార చెదిరిపోతుంది. కథనిండా మేట వేసిన శోక రసాన్ని మరిపించడానికి సస్పెన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు – ‘ముత్యాల ముగ్గు’ లో బాపు - రమణలు కథా మూలంలో వున్న శోక రసాన్ని మరిపించే, అద్భుత రసపు షుగర్ కోటింగుతో హుషారైన కథ చెప్పినట్టు. శ్రీధర్ కూడా ఈ షుగర్ కోటింగ్ ని కాపాడుకునే కథనమే చేశాడు సస్పెన్సు అనే ఏకసూత్రతని కాపాడుకుంటూ.

రెండు విడతల సస్పెన్స్ 
       రెండో సీన్లోనే జగ్గయ్యకి ఆపరేషన్ అనీ, అది రెండు వారాల్లోననీ ఒక టైం లాక్ తో సమస్య నేర్పాటు చేశాక, నడిపే కథనంలో సస్పెన్సు రెండు విడతలుగా కన్పిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఆపరేషన్, దీని తాలూకు పరిణామాలతో కూడిన సస్పెన్సుతో ఏర్పడే సెన్సాఫ్ డేంజర్ ని ఇప్పట్నుంచే ఫీలవ్వం మనం. ఇది మొదలవడానికింకా టైముంది. దీనికంటే ముందు ఇంకో సెన్సాఫ్ డేంజర్ ప్రారంభించిన కథలోనే తోస్తోంది మనకి. అది ఏఎన్నార్ - సావిత్రిలు జగ్గయ్య ముందు దాచిపెడుతున్న పూర్వ ప్రేమాయణం. ఇది బయటపడే ప్రమాదం పొంచి వుంది. ఇలా ప్రస్తుతం ఈ సెన్సాఫ్ డేంజర్ ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడేంటి? ఎప్పుడో జరిగే ఆపరేషన్ సంగతి సరే, ఇప్పుడున్న వీళ్ళ రహస్యం మాటేమిటి? దాచి పెడుతున్నది బయట పడక తప్పదు. అప్పుడేం జరుగుతుంది? ఇది ముందు తేల్చడం ఈ కథ ముందుకు సాగడానికి అవసరం. కాబట్టి అనివార్యంగా ముందు చేపట్టాల్సిన కథనం దీనికి సంబంధించిందే అయింది. 

          ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ లో సమస్యల్ని డీల్ చేసే విధానముంటుంది. ప్రతీ సమస్యా ఓ గతంతో ముడిపడి వుంటుంది. ఆ గతాన్ని సరిచేస్తే సమస్య  పరిష్కారమైపోతుంది. పాలకులు సరి చేయరు. వాళ్లకి కాష్ఠం రగులుతూ వుండాలి. రచయితలు సరి చేయాల్సి వుంటుంది. రచయితలు కూడా పాలకుల పాలెగాళ్ళయితే చెయ్యరు. అది వేరే సంగతి. ఆపరేషన్ సమస్యతో ఏఎన్నార్, సావిత్రిల పరస్పర భయసందేహాలు తీరి పరిష్కారమవాలంటే, వాళ్ళ గత సంబంధాన్ని తేల్చెయ్యాలి. అంటే గార్డియన్ పాత్రగా వున్న జగ్గయ్యకి ఈ వ్యవహారం తెలిసిపోయి, అతనో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆపరేషన్ తో సమస్య పరిష్కారమవుతుంది. అంటే కథనం జగ్గయ్యకి తెలిసే ముందు, తెలిసిన తర్వాతా అనే ద్విముఖాలుగా వుండాలి. తెలిసేముందు రిలేషన్ షిప్ తో ఒక సస్పెన్స్, తెలిశాక ఆపరేషన్ తో ఇంకో సస్పెన్స్. ఇలా రెండు విడతల సస్పెస్ తో కథాపథకం. ఈ స్పష్టత, ఈ విభజన, ఈ ప్లానింగ్ లేకపోతే  ఏం కథ చేస్తున్నామో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మాటల్లో సినిమా కథంటే సైకో థెరఫీయే.

తొలి విడత సస్పెన్స్ 
        రెండు వారాల్లో ఆపరేషన్ చేయాలనీ నిర్ణయించాక,  జగ్గయ్య హాస్పిటల్లో అడ్మిటవుతాడు. సావిత్రి కూడా అక్కడే వుండిపోతుంది, బట్టలూ అవీ తెప్పించుకుని. ఏఎన్నార్ నివాసం ఎలాగూ అక్కడే. ఒక రాత్రి పూట సావిత్రితో దిగిన పాత  ఫోటో చూసుకుంటూ పాటలోకెళ్ళి పోతాడు. ఆ పాటలో సుమంగళిగా ఆమె సుఖాన్నే కోరుకుంటాడు. పాట పూర్తయ్యాక జగ్గయ్య వచ్చేస్తాడు. కంగారుపడి ఫోటోని పత్రికలో దాచేస్తాడు ఏఎన్నార్. చదువు కోవడానికి ఏమైనా పుస్తకాలుంటే ఇమ్మని పత్రిక తీసేసుకుంటాడు జగ్గయ్య. ఏఎన్నార్ గుండె ఢామ్మంటుంది. ఏం చేసే లోగా పత్రికతో వెళ్ళిపోతాడు జగ్గయ్య. పత్రిక తిరగేస్తోంటే ఆ ఫోటో జారి కింద పడుతుంది. ఇది చూసి సావిత్రి గుండె ఢామ్మంటుంది.  ఎలాగో జగ్గయ్యని లోపలికి పంపి ఆ ఫోటో తీసెయ్యబోతే, ఏఎన్నార్ తీసుకుని వెళ్ళిపోతూంటాడు గబగబా.

          ఈ గండం గడిచాక మరో గండం ఎదురవుతుంది. ఏఎన్నార్ తల్లి హాస్పిటల్ కొస్తుంది. ఆమె కొడుకు జీవితం గురించి సావిత్రి, జగ్గయ్యల ముందు వాపోతుంది, “ఎవరో ఒకమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకర్ని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరిగిపోయి పెళ్ళే చేసుకోలేదు” అని.

          ఇక్కడున్న సావిత్రియే కొడుకు ప్రేమించినమ్మాయని ఆమెకి తెలీదు. ఇదెక్కడ బయటపడుతుందోనని సావిత్రికి ఒకటే ఆందోళన. జగ్గయ్య అంతా విని నిర్వేదంగా, “ఈ రోజుల్లో ప్రేమించడం సరదా అయిపోయింది. దీనివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఎవ్వరూ వూహించడం లేదు. నేనూ సీతా మీ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాం” అంటాడు. 

          ఆమె వెళ్ళిపోయాక సావిత్రితో అంటాడు, “చూశావా సీతా, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకర్ని, పెళ్ళాడింది ఒకర్ని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తె అయి వుండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ గురించే. ఇంత చదువూ తెలివీ వుండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూశావా?”

          సావిత్రికి గుండె పగిలిపోతూంటుంది తనని ఇంతింత మాటలంటూంటే, “ ఏమో ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం?”  అనేస్తుంది. అందుకు జగ్గయ్య, “మంచిదెలా అవుతుంది సీతా? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి వుంటే, తర్వాత ఆ భర్తకి మనసెలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్ల నిజాయితీగా వుంటే, డాక్టర్ తో ఆమె ప్రేమంతా నాటకమే కదా?” అని.  ఆమె తట్టుకోలేక భోరుమంటుంది.

         ఇక్కడ కథాపరమైన తొలి విడత సస్పెన్స్ నిర్వహణతో బాటు, పాత్రచిత్రణల వికాసం కూడా వుంది. ఏఎన్నార్ తల్లి రాకతో జగ్గయ్యకి ఏఎన్నార్ విషయం తెలిసి అతడి పెళ్లి ఆలోచన స్ఫురించింది. ఇది మున్ముందు కథలో ఏఎన్నార్ కి పెళ్లి అనే చర్య తీసుకోవడానికి దారి తీస్తుంది. రెండోది, సావిత్రికి తన రహస్యం ఎక్కడ బయట పడుతుందోనన్న భయాందోళనలతో బాటు, పైకి చెప్పుకోలేని తన నిర్దోషిత్వం గురించిన భావోద్వేగాలు అనుభవించడం. తను మోసగత్తె కాదని ఎలా చెప్పుకోవాలి? అసలేం జరిగిందో ఎలా చెప్పుకుంటుంది? చెప్పుకోవడానికి మొహం చెల్లకే ఏఎన్నార్ తో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు కథాపరమైన మొదటి విడత సస్పెన్సుకి తోడు అసలు గతంలో ఏం జరిగి ఏఎన్నార్ నుంచి సావిత్రి విడిపోయిందన్న అనుబంధ సస్పెన్సుని ప్రేక్షకుల మీద రుద్దాడు దర్శకుడు. ఇప్పుడు మనకి వాళ్ళ రోమాంటిక్ గతం తెలుసుకోవాలన్న డిమాండ్ పక్కకి వెళ్ళిపోయి, ఆ ట్రాజిక్ గతమేంటో తెలుసుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. దీన్నె ప్పుడు సరఫరా చేస్తాడు దర్శకుడు? ఇది అనుబంధ సస్పెన్స్. 

          దీంతో అయిపోలేదు. సావిత్రీ ఏఎన్నార్ లకి జగ్గయ్యతో ఇంకో గండం. సావిత్రి ముందు ఏఎన్నార్ కి కౌన్సెలింగ్ చేస్తాడు జగ్గయ్య. ఏఎన్నార్ పాత ప్రేమని తోడుతాడు. ఆ ప్రియురాలిని నిందిస్తాడు. ఈ ప్రేమలు ఒట్టి కబుర్లనీ, బతకడానికి తెలియని వాళ్ళే వీటిని పట్టుకుని ప్రాకులాడతారనీ, దీన్నుంచి తేరుకుని పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టమనీ అంటాడు.

          తర్వాత ఏఎన్నార్ సావిత్రిని ఏకాంతంలో కలిసి మాట్లాడుతూండడంతో వినేస్తాడు జగ్గయ్య. ఈ సందర్భంగా సీత అంటుంది, “నా భర్త నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని తెలిస్తే వారి హృదయం బద్దలై పోతుంది. అందువల్ల ఏర్పడే విపరీత పరిణామాలకు మీరు కారణం కాకూడదనే నా కోరిక”  అని. 


      ఏఎన్నార్ మాటిస్తాడు, అసలు తను తెలిసినట్టు కూడా ప్రవర్తించనంటాడు. అయితే ఒక్క సందేహం తీర్చి మనశ్శాంతి కల్గించమంటాడు. ఇందుకామె, “డాక్టర్, మీకు కొంచెమైనా మనశ్శాంతి కల్గించడం నాకు చేతనైతే నేను చేసిన పాపానికి అదే ప్రాయశ్చిత్తం, చెప్పండి?”  అంటుంది.  అసలెందుకు విడిపోయావని అడుగుతాడు. 

          ఆమె చెప్పుకొస్తుంది. ఆమె తండ్రి బ్యాంకు క్యాషియర్. యాభై వేలు పోయిన నేరం మీద పడింది. బ్యాంక్ డైరెక్టర్ ని కలిసి చెప్పుకుంటే, జైలుకెళ్ళకుండా  వుండాలంటే తన కొడుక్కి కూతుర్నివ్వా లన్నాడు డైరెక్టర్. కూతురికి చెప్పుకుంటే, తను ఏఎన్నార్ ని  ప్రేమించానని చెప్పుకుని ససేమిరా అంది. “నీ సుఖం కోసం జైలు పాలవ్వాలా నేనూ? ఈ ఇంటికోసం ప్రేమని త్యాగం చేయలేవా?’ అని నిలదీశాడు తండ్రి. తను జైలుకెళ్తే తల్లి గుండాగి చస్తుందని కూడా అన్నాడు. ఇక విధిలేక జగ్గయ్యని చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది అతడికి క్యాన్సర్ అని. జగ్గయ్య తండ్రి ఇది దాచిపెట్టి తనకి తాళి కట్టించాడని అర్ధమైంది...

          ఇలా  సావిత్రి చెప్పేసరికి ఏఎన్నార్ ఆమె పరిస్థితికి కదిలిపోతాడు. అటు చాటుగా వుండి  వింటున్న జగ్గయ్య ఛాతీ పట్టుకుని ఉక్కిబిక్కిరైపోతాడు. అసలే గుండెకి ముదిరిన క్యాన్సర్. అందులో ఇలాటి అగ్నిపర్వతం బద్ధలవడం... దీంతో ఏఎన్నార్ – సావిత్రిల తాలూకు రహస్యం కొలిక్కి వచ్చింది. ఇప్పుడు బంతి జగ్గయ్య కోర్టులో పడింది. మనకీ గతం తాలూకు అనుబంధ సస్పన్స్ తీరిపోయింది.  

          సావిత్రి ఇలా చెప్పేసి ఆగదు. ఆ ఫోటో ఇచ్చెయ్యమంటుంది. అదొక్కటే తను సాంత్వన పొందడానికి మిగిలిన ఆధారమంటాడతను. ప్రేమని మర్చిపోలేనంటాడు. మానవ జీవిత పరమార్ధం వలచి విలపించడం కాదంటుంది. అతడి వృత్తి, పేరు ప్రతిష్టలు తన మూలంగా నాశనమై, తానో సమాజ ద్రోహిగా నిలబడ లేనంటుంది. ఇక మర్చి పొమ్మంటుంది. చేసేది లేక ఫోటో చించేస్తాడు. 

          కథనంలోఈ తొలి  విడత సస్పెన్స్ విభాగంలో, రాబోయే మలి విడత సస్పన్స్ విభాగపు కథనానికి అడ్డు పడకుండా కొన్నిసమస్యల్ని పరిష్కరిస్తున్నాడు దర్శకుడు. ప్రేమని అతను మర్చిపోకపోతే చేయబోయే ఆపరేషన్ కి అది అడ్డుపడుతుంది. కానీ చేయబోయే ఆపరేషన్ కి జగ్గయ్య ప్రకటించే నిర్ణయం అడ్డుపడబోతోంది. అందువల్ల రెండు కారణాలు అడ్డుపడితే గజిబిజి అవుతుందని, మొదటి కారణమైన ప్రేమ ని క్లియర్ చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు వీళ్ళ పూర్వ ప్రేమ తెలిసిపోయిన నేపధ్యంలో, జగ్గయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడనే మలి విడత సస్పెన్స్ తో కథనం మొదలు.
  జగ్గయ్యకి తెలియక ముందు కథనం పూర్తయి, తెలిసింతర్వాత కథనం ఇక మొదలవుతోంది.

మలి విడత సస్పెన్స్ 
       “డాక్టర్ మీరు నాకో సహాయం చేయాలి. ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానంటారా? నేను పిరికి వాణ్ణి కాను, మీ మనసులో వున్న నిజాన్ని ధైర్యంగా చెప్పండి. చచ్చిపోతానని నేను భయపడ్డం లేదు. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకూ నా జీవితంలో నాకెలాటి కొరతా కలగలేదు. ఐశ్వర్యం లోపుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను. ఆనందంగా జీవించాను. అందం, గుణం వున్న పిల్లనే చేసుకున్నాను. ఈ క్షణం వరకూ ఆమెకే లోటూ రానివ్వకుండా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను. అన్నివిధాలా అందరికీ అసూయ కల్గించే జీవితాన్ని నేననుభవించాను...”
          “ఇక ముందు కూడా మీకిలాగే జరుగుతుంది”
          “మీరు చెప్తున్నది జ్యోతిషం, నేను చెప్తున్నది నిజం... మీరొక వాగ్దానం చెయ్యాలి. నేను చనిపోతే ఆమెకి మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది...”

          ఏఎన్నార్ నెత్తిన పిడుగులు పడతాయి. ససేమిరా అంటాడు జగ్గయ్య. సరే, ఆమె అంగీకరిస్తే తన వాగ్దానం తప్పక నేరవేరుస్తానంటాడు ఏఎన్నార్. ఇక్కడ జగ్గయ్య వ్యూహాత్మకంగా నేరుగా ఆమెని పెళ్లి చేసుకోమనడం లేదు. సావిత్రితో కూడా ఇలాగే వ్యూహాత్మకంగా అంటాడు. నేరుగా చెప్పేసి షాకివ్వదల్చుకోలేదు. ఇప్పుడు సావిత్రి, ఏ ఎన్నార్ లకి జగ్గయ్య చావుబతుకుల సమస్య ముఖ్యమైపోతుంది. పూలూ పసుపూ తెప్పించుకుని సుమంగళిలా అలంకరించుకుని పూజలు చేస్తుంది. ఇంతలో ఓ ఐదేళ్ళ బాలికకి ఏఎన్నార్ చేసిన ఆపరేషన్ విఫలమై చనిపోతుంది. దీంతో సావిత్రికి ఏఎన్నార్ సామర్ధ్యం మీద నమ్మకం పోతుంది. జగ్గయ్యని ఇక్కడ్నించి తీసికెళ్ళి పోతానంటుంది. 

          “డాక్టర్, ఏదైనా జరిగితే మీరు కారణం కాకూడదని నా కోరిక. మీరు నా హృదయంలో శాశ్వతంగా వుండాలంటే నా భర్త ఇక్కడ చచ్చిపోకూడదు. నన్ను ప్రేమించి విఫలమయ్యారని మీరు కక్ష సాధించారని నేనేనాడూ అనుకోకూడదు”

          జగ్గయ్యకి కూడా చెప్పేస్తుంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని. ఏఎన్నార్ ని అవమానించడం తగదంటాడు అతను. దీంతో ఉద్రిక్తత సడలుతుంది. మళ్ళీ పెట్రేగుతుంది. ఈసారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని జగ్గయ్య నేరుగా చివరి కోరిక వెల్లడించడంతో. ఇద్దర్నీ ఏడ్పిస్తాడు. ఇద్దరూ నిరసిస్తారు. అయినా చేసేది చేసుకుపోతాడు జగ్గయ్య. లాయర్ ని పిలిపించుకుని ఇద్దరికీ తన ఆస్తి వీలునామా రాసేస్తాడు. ఇక లాభం లేక సావిత్రి తన నిర్ణయం తానూ తీసుకుంటుంది. 

          సరీగ్గా రెండు వారాల గడువు పూర్తయి ఆపరేషన్ మొదలవుతూంటే, గదిలో కెళ్ళి తలుపులు బిడాయించుకుంటుంది. ఏఎన్నార్ చేతిలో భర్త మరణ వార్త వింటే, అదే క్షణం తన చావూ జరిగిపోవాలని గదిలో వుండి పోతుంది.

          ఏఎన్నార్ పరిస్థితి కొన్ని రోజుల ముందునుంచే దారుణంగా వుంటుంది. ఆపరేషన్ చేయగలుగుతాడా అన్న గొప్ప ఆత్మనూన్యతా భావానికి లోనవుతాడు. ఒక ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకుగా నీతో ఎలాటి స్వార్ధానికీ పోనని అన్నా కూడా ఆమె నమ్మదు. కన్న తల్లిని సాక్ష్యంగా చేసి చెప్పడం కన్నా ఉత్కృష్ట  నివేదన ఇంకేం వుంటుంది. ఆమె నమ్మదు. ఆమె పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె కూడా నమ్మనప్పుడు డాక్టర్ గా తన సామర్ధ్యం పట్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది. తిండి మానేసి, నిద్ర మానేసి, శస్త్ర చికిత్స పుస్తకాలు చదివేస్తూంటాడు.  ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి...

          నిరూపించుకుంటాడు. కానీ అది యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది. జగ్గయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయిందని తలుపు కొట్టి కొట్టి సావిత్రిని పిల్చి, ఆమె తలుపు తీశాక శుభవార్త చెప్పేసి కుప్పకూలి మరణించి పోతాడు.      

లోటు తీర్చే ప్రయత్నాలు 
       సంక్లిష్ట కథా కథనాలు, సంక్లిష్ట పాత్ర చిత్రణలు. 29 ఏళ్ల శ్రీధర్ విరచిత విన్యాసాలు. నటత్రయం అభినయ వైశిష్ట్యాలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యల గురించి చెప్పుకోవాలంటే వాక్యాలందవు. చూసి తరించాల్సిందే. ఏ వొకరి ముఖంలోనూ సంతోషం పలకని గూడు కట్టిన విషాదమే. అభిమాన తారలు ఇంత విషాదంతో వుండిపోతే ప్రేక్షకులకి ఇబ్బందే. అక్కినేని ఎక్స్ రే చూస్తూ తలచుకున్నప్పుడు సావిత్రితో ఒక సంక్షిప్త ప్రేమ సన్నివేశం తప్ప,  ఇంకే రిలీఫ్ కూడా వుండదు. ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు కూడా వాళ్ళ గతం తాలూకు రోమాంటిక్ మాంటేజీలు పడవు. దీనికి భిన్నంగా హిందీ రీమేక్ లో వుంది. రాజేంద్రకుమార్ ఎక్స్ రే చూస్తున్నప్పుడు మీనా కుమారితో పాటలోకి వెళ్ళిపోతాడు (తేరే మేరే సివా యహా కోయీ నహీ). ఇది సినిమాకి మాంచి యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తుంది. తర్వాత ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు (యాద్ న జాయే భీతే దినోకీ) విరివిగా వచ్చే వాళ్ళ పూర్వ ప్రేమ తాలూకు మాంటేజీలు మరోసారి యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తాయి. ముందంతా విషాదమే చూపిస్తున్నప్పుడు ప్రారంభంలో ఈ మాత్రమైనా వినోదపర్చాలి. తమిళ మాతృక తర్వాత హిందీ రీమేక్ అయింది. దీని తర్వాత తెలుగు రీమేక్. కానీ ఎందుకనో అప్డేట్ చేసిన హిందీ రీమేక్ ని తెలుగుకి అనుసరించలేదు. తమిళ మాతృకనే ఫాలో అయ్యారు.  హిందీలో పత్రికలోంచి ఫోటో బయటపడే సీన్లో థ్రిల్, సస్పెన్సుల పోషణ  భలే వుంటుంది. బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో ఛాయాగ్రహణం కూడా ఉన్నత ప్రమాణాలతో వుంటుంది. ఇక అన్నిపాటలూ ప్రజాదరణ పొందాయి. తెలుగులో రెండే (అపరంజి బొమ్మ, తలచినదే) హిట్టయ్యాయి. ఈ విషాద కథ హిందీలో మ్యూజికల్ హిట్టయితే, తెలుగులో అది కూడా కాలేదు.  మూడు సార్లు తీసిందే తీస్తూ అలసిపోయి వుంటాడు శ్రీధర్. 

          కథ పూర్తి విషాదం కాబట్టి కామెడీ ట్రాకు పెట్టారు. చలం – గిరిజ – రేలంగిలు వేసుకునే కామెడీ వేషాలు కథతో సంబంధం లేకుండా హాస్పిటల్లో ఓ పక్క వచ్చి పోతూంటాయి. వినోదం లేని లోటు ఇలా తీర్చినట్టున్నాడు. కానీ వినోదం ప్రధాన పాత్రలతో కూడా కాస్త వుండాలి. ఇక హాస్పిటల్లో కొందరి పేషంట్లతో సబ్ ప్లాట్స్ (ఉపకథలు) వుంటాయి. ఇవి ప్రధాన కథలో సంఘర్షిస్తున్న ఏఎన్నార్, సావిత్రి, జగ్గయ్య పాత్రల ప్రవర్తనల్ని నియంత్రించే దిశగా వుంటాయి. సబ్ ప్లాట్స్ లో ఉత్పన్నమయ్యే అర్థాలు మెయిన్ ప్లాట్స్ లో ప్రతిఫలిస్తూంటాయి. ఇలా ఇన్ని పొరలుగా కథ వున్నప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనే ఇంకో పొర కల్పిస్తే ఎక్కువైపోయే మాట నిజమే. అందుకని ఫ్లాష్ బ్యాక్ ని పరిహరించడం మేలే చేసింది. 

            దర్శకుడితో బాటు తెరవెనుక ఆత్రేయ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన మాటల మాంత్రికుడు కాదు. మాయ చేయడు. జీవితాలు పలికే పలుకులనే నిరాడంబరంగా స్వచ్ఛంగా పలికిస్తాడు. సంభాషణల బలం ఈ ట్రాజడీకి  ప్రధాన ఆకర్షణ. 

          ఐతే ఈ కథలో దర్శకుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న వొకటుంది. ఈ ప్రశ్న వేస్తే  కథేమవుతుందో, పాత్రలేమై పోతాయో తెలీదు. సినిమా కూడా వుండే అవకాశమందో లేదో తెలీదు. కానీ మన బుద్ధికి ఇలా తోస్తుంది : జగ్గయ్య తాను చనిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నాడు. చనిపోకపోతే? ముగ్గురూ ఇలాగే సిగపట్లు పడుతూ వుండిపోతారా ముగింపు లేకుండా? దేవుడు జోక్యం చేసుకుని ఏఎన్నార్ ని తప్పించడం జగ్గయ్య అదృష్టమే!

సికిందర్

1.8.2019

         

Wednesday, September 15, 2021

 


Tuesday, January 17, 2017

సినిమా కథ రాయడానికి చక్కగా కూర్చుని, కాగితం పై భాగాన రాముడో కృష్ణుడో, ముత్యాలమ్మో మైసమ్మో ఇష్టదైవ నామ స్మరణం చేసుకుని, రాయడం మొదలెట్టినప్పుడు, ఆ స్మరించుకున్న దైవాలు ఎక్కడ్నించో కాదు- ఆ రాసుకున్న కాగితం పై భాగం అక్షరాల్లోంచే తొంగి తొంగి చూస్తూంటారు-  మనోడు ఏం రాస్తున్నాడని కాదు, ఎలా రాస్తున్నాడని. వీణ్ణి ఎలా ఎక్కడ సెట్ చేయవచ్చా అని. ఓం నమఃశ్శివాయ అని శ్రీకారం చుట్టి ఆ దేవుణ్ణి మర్చిపోతే కాదు- దేవుళ్ళకో ప్రోగ్రాం ఇచ్చేశాక వాళ్ళు పని మొదలెట్టేసుకుంటారు. కోటి రూపాయల సినిమాకి వీణ్ణి అడ్జెస్ట్ చేస్తే సరిపోతుందా, చిరంజీవి 151వ రేంజికి  సెట్ చేయాలా అని గమనిస్తూంటారు. కాబట్టి గిల్లుకున్నాక ఈ రాడార్ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేరు. ముందే తాము ఏ తరగతికి చెందుతారో నిర్ణయించుకుని ఆ తర్వాత గిల్లుకుంటే  ఏ ఇలవేల్పులైనా  ఇంప్రెస్ అవుతారు. 

         తరగతులు మూడు-  సెల్ఫ్ స్టార్టర్, కిక్ స్టార్టర్, క్లిక్ స్టార్టర్ అన్నవి. ఏ తరగతికి చెందితే ఆ తరగతికే కట్టుబడి వుండాలి. ఈ తరగతిలోంచి ఆ తరగతి గదిలోకి, ఆ తరగతి లోంచి ఈ తరగతి గదిలోకీ రాకపోకలు సాగిస్తే  అవన్నీ కలిసి ఏ తరగతీ కాకుండా చేస్తాయి.

          ఒక్కో తరగతిని చూద్దాం : 
సెల్ఫ్ స్టార్టర్ – దీనికి పెద్దగా రచనా జ్ఞానం అవసరం లేదు. ఈ విధానంలో కథకి ఓ పాయింటు దొరుకుతుంది గానీ, పూర్తి కథ వుండదు. ఎలా చేసుకోవాలో తెలీదు. ఆ పాయింటుని  పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి సీన్లు రాసుకుంటూ పోతూంటే కథ అదేవస్తుంది. అప్పుడప్పుడు పాయింటు ఆగుతూంటే వేరే సీన్లతో భర్తీ చేసుకోవచ్చు. బారెడు  కామెడీ సీన్లో, లవ్ సీన్లో, ఫైట్సో పెట్టుకోవచ్చు. 

     ఏది ఎలా తోస్తే అలా రాసుకుంటూ పోవడమే ఈ సెల్ఫ్ స్టార్టర్ విధానం. చివరి సీనుకి వచ్చేటప్పటికి పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు. అక్కడ కథని తేల్చి చెప్పామా లేదా అన్నదే స్క్రీన్ ప్లే. End justifies the means అనడం లాంటిదన్న మాట. హైదరాబాదు నుంచి ఒక రూటులో బెజవాడ వెళ్లకపోయినా, డొంక దారులు పట్టుకునైనా బెజవాడ ముంగిట వాలామా లేదా  అని దబాయించడం లాంటిదన్న మాట. పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు, ఎలా చేరామన్నది కాదు. ఇందుకు ఉదాహరణ కావాలంటే ‘నందినీ నర్సింగ్ హోం’ లాంటివి కన్పిస్తాయి. 

          ఉపయోగాలు :  కథ లేకుండా కథ రాసుకోచ్చు. ప్లాట్ పాయింట్స్ తో పని లేదు, క్యారక్టర్ డెవలప్ మెంట్ అవసరం లేదు. సొంత ధోరణిలో రాసుకుపోతూ  ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడా ఆలోచలనకి పదును పెట్టుకునే శ్రమ వుండదు. చాలా ఫన్నీగానూ ఈజీగానూ వుంటుంది స్క్రిప్ట్ రైటింగ్. ఎడమ పక్క బ్రెయిన్ మొత్తుకునే లాజిక్ తో, విశ్లేషణలతో  పని లేకుండా,  రైట్ బ్రెయిన్ చెప్పినట్టూ బోలెడు ఫీలింగ్స్ తో సెంటిమెంటల్ గా, సగం బుర్ర వాడుకుని  రాసుకుపోవచ్చు. స్ట్రక్చర్ తో పనిలేకుండా కేవలం క్రియేటివిటీనే  చూపించుకుంటూ రాసుకోవచ్చు.

          మొత్తం రాసేసి చదువుకుంటే అప్పుడు కథేమిటో, ఏం చెప్పాలనుకున్నారో అర్ధమవుతుంది. ఈ విధానంలో ఎన్నెన్నో  ఐడియాలతో ఏవేవో సీన్లు పడిపోతాయి. కథకి పని వచ్చే వరకే వాటిని ఎడిట్ చేసుకుని, మిగిలిన వాటిని డేటా బ్యాంకులో భద్రపర్చు కోవచ్చు  భవిష్యత్ అవసరాల కోసం.

          సమస్యలు : ఈ విధానం సెల్ఫ్ గా రాసుకున్న రచయిత ఆలోచనాధార ( చైతన్య స్రవంతి- స్ట్రీమ్  ఆఫ్ కాన్షస్ నెస్) కాబట్టి చాలా ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఎన్నోసార్లు తిరగరాసుకోవాల్సి వస్తుంది. సంతృప్తి అనేది వుండదు. ఎక్కడో తేడా కొడుతున్నట్టు అన్పిస్తుంది, అదేమిటో తెలీదు. తెలిస్తే అసంతృప్తి తీరిపోయే దిద్దుబాటు చేసుకోవచ్చు. తెలీదు కాబట్టి సెట్లో కూడా అసంతృప్తితో  ఏదో మార్చి మార్చి రాసుకునే పరిస్థితి.

          ఈ విధానంలో కథలో సస్పెన్స్ అనేది వుండదు. ముందు జరగబోయే దాన్ని సూచనాప్రాయంగా చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే రచయితకి ముందు చూపువుండాలి. రాస్తున్నప్పుడు చేతిలో కథే వుండదు కాబట్టి ముందు చూపు వుండే అవకాశం లేదు. అలాగే పాత్ర పాసివ్ గా వస్తుంది.

          కథకి స్ట్రక్చర్ వుండదు. కచ్చితంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే వస్తుంది. కథలో చాలా ఎలిమెంట్స్  మిస్సయి సినిమా కథలా వుండదు. అనుభవమున్న రచయిత సాయం కోరితే సరిదిద్దడం దుస్సాధ్యంగా  మారిపోతుంది. పాయింటుని కూడా సంస్కరించి, మొత్తం సరికొత్తగా రాసుకు రావాల్సి వుంటుంది. ఈ ‘కూల్చు మరల కట్టు’ పద్ధతికి సెల్ఫ్ స్టార్టర్ రచయిత గుండె పగులుతుంది. అది తన రచనా సామర్ధ్యానికే అవమానంగా తోచి ఒప్పుకోకపోవచ్చు.

          చేయకూడనివి:  రచయిత తనని తాను గట్టిగా నమ్ముకుని  సెల్ఫ్ స్టార్టర్ కే బద్ధుడయ్యాక, మరింకో వైపు కన్నెత్తి చూడకూడదు. అంటే అహాన్ని చంపుకుని ఇతర సినిమాల కథలెలా వున్నాయి, వాటి నడక ఎలా వుందీ, ఆ నడకని బట్టి లైన్ ఆర్డర్ వేసుకుందామా, ఆ సీన్లని మార్చి పెట్టుకుందామా- లాంటి చోరకళకి పాల్పడకూడదు. అప్పుడు తన సరుకుతో ఆ సరుకులూ  కలిసిపోయి మొత్తం గజిబిజి అయిపోతుంది.  సెల్ఫ్ స్టార్ట్ కే నమ్మి కట్టుబడ్డాక ఇక వేరే  కిక్ స్టారర్, క్లిక్ స్టార్టర్ తరగతుల్లోకి తొంగి చూడకూడదు. ఆ విధానాలని తెచ్చి కలుపుకోకూడదు. కల్తీ చేసుకోకూడదు.

           ఫలితం :  ‘ఒక మనసు’, లేదా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాంటిది తెర కెక్కుతుంది.

          కర్తవ్యం :  ఇప్పటి కాలంలో పాపులరవుతున్న ఇండీ (ఇండిపెండెంట్) ఫిలిమ్స్ కిందికి ఈ స్క్రిప్టు  వస్తుంది. సందీప్ కిషన్ నటించిన తమిళ డబ్బింగ్ ‘రన్’  లాగా ఇండీ ఫిలిం అని ముందే చెప్పుకుని నిర్మాతలని ప్రయత్నించాలి. అంతేగానీ  కమర్షియల్ గా కలరిచ్చి మభ్య పెట్ట కూడదు. ఈ సిన్సియారిటీని మెచ్చి, మొదటి పేజీ పైభాగంలో ఆనాడు స్మరించుకున్న దేవుడే ఓకే చేయిస్తాడు. లేదూ కమర్షియల్ అనే మభ్య పెట్టదల్చుకుంటే, స్మరించుకున్న దేవుణ్ణి కొట్టేసి ఇంకో దేవుణ్ణి రాసుకున్నా లాభముండదు. దేవుళ్ళంతా  ఒకే దర్బారులో వుంటారు, తెలిసిపోతుంది. కాబట్టి ఓ డాన్ పేరు రాసుకుంటే సరిపోతుంది. ఎలాటి పనికి అలాటి వాడు. అవసరమైతే నిర్మాతకి డాన్ ఫోన్ చేస్తాడు.

          ఇండీ ఫిలిం అని ముందే  ప్రమోట్ చేసుకోవడంలో జరిగే ఇంకో మేలు ఏమిటంటే, రివ్యూ రైటర్లు దాన్ని ఇండీ ఫిలిం దృష్టితోనే చూసి, ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకుండా  ఆ మేరకే  అందమైన రివ్యూలు రాసిచ్చేసే వీలుంటుంది. లేకపోతే కమర్షియల్ ఇలా తీశాడేమిటని ఆ ప్రకారం వేరే రివ్యూలు ఇచ్చేసే ప్రమాదముంది- అప్పుడు బాధపడి, విరుచుకుపడి ప్రయోజనముండదు. 

          ఈ తరగతికి ఎంట్రీ లెవెల్ రచయితలే కాదు, ఎంటరై చక్రం తిప్పుతున్న వాళ్ళూ చెంది వుంటారు. వీళ్ళు 90 కి అటు వైపా, ఇటు వైపా రాయడానికి శ్రీకారం చుట్టే ముందే తేల్చుకోవాలి. 90 అంటే ప్రతీ ఏటా ఇస్తున్న 90 శాతం ఫ్లాపులన్న మాట.
                                                   ***

          కిక్ స్టార్టర్:  దీనికి రచనా సామర్ధ్యం బాగా అవసరమే. ఇదివరకు వచ్చిన సినిమాలే ఈ విధానంలో మార్గదర్శకాలుగా వుంటాయి. భారీ కమర్షియల్స్ ఆదర్శంగా వుంటాయి. వాటిని కిక్ కొట్టి వాటిలోంచే కథల్ని స్టార్ట్ చేయొచ్చు. వాటిని అనుసరించే కథనాలు చేసుకోవచ్చు. ఒకేలాంటి కథలు, ఒకేలా వుండే కథనాలతో సులభంగా రాసెయ్యొచ్చు. స్టార్ వేల్యూతో అవే నడిచిపోతాయి.

          ఉపయోగాలు : సాంప్రదాయంగా, సెంటి మెంటుగా, పాత స్కూలుగా  వస్తున్న ఈ పద్ధతికే ఎక్కువ డిమాండ్ వుంటుంది- ఫ్లాపులే ఎక్కువ ఇచ్చినా సరే, ఆత్మవిమర్శ చేసుకుని పధ్ధతి మార్చుకునే, ఎడ్యుకేట్ అయ్యే పనే వుండదు. ఇది పక్కా కమర్షియల్ – మూస ఫార్ములా విధానం. ఈ విధానంలో స్ట్రక్చర్ తో పనుండదు, ఈ విధానం స్ట్రక్చర్ ని దగ్గరికి రానివ్వదు. కొత్తది నేర్చుకునే శ్రమా వుండదు. అప్డేట్ అయ్యే అవసరముండదు.  స్ట్రక్చర్ కి దూరంగా దేవుడి మీద భారం వేసి  కేవలం క్రియేటివిటీనే నమ్ముకుని రాసుకోవచ్చు. పాసివ్ గా వచ్చిన సినిమాలనే టెంప్లెట్స్ గా పెట్టుకుని రాయల్ గా రాసెయ్యొచ్చు. ఫీలింగ్స్ , ఎమోషన్స్ తో కూడిన కుడి  బ్రెయిన్ ని ధారాళంగా వాడుతూనే, అప్పుడప్పుడు కామన్ సెన్స్ ని, సమయస్ఫూర్తినీ  గుర్తు చేసే ఎడమ  బ్రెయిన్ ని పొదుపుగా వుండీ లేనట్టుగా వాడవచ్చు. అంటే సగం పైచిలుకు బుర్ర ఉపయోగంలోకి వస్తుందన్న మాట.

          సమస్యలు : ఈ కిక్ స్టార్ట్ లో తప్పులున్న సినిమాలనే కిక్ కొట్టి అవే తప్పులతో స్టార్ట్ చేసుకుని రాయడం వల్ల పాసివ్ పాత్రల విడిది  కేంద్రాలుగా వుంటాయి. ప్రతీ యేటా పెద్ద  స్టార్స్ ని  పాసివ్ క్యారక్టర్స్ గా మార్చేసే కార్ఖానాలుగా వుంటాయి. అదృష్టం మీద ఆధారపడి హిట్టవుతూంటాయి. ఈ విధానంలో స్ట్రక్చర్ వుంటుంది గానీ, అది శాస్త్రీయంగా లేక, అంకాలు ఒకదాని మీద ఒకటి స్వారీ చేస్తూంటాయి. అందుకని కథ ఇంటర్వెల్ లోపు మొదలుకాని పరిస్థితి వుంటుంది. శాస్త్రీయత, స్ట్రక్చారాస్యత అనే వాటికి  దూరం కాబట్టి  పాసివ్ పాత్రలతో బాటు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సిండ్రోంలవంటి భారీ తూఫాను గండాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎన్నో వెర్షన్లు రాయిస్తూంటారు. అయినా సమస్యలు అలాగే వుంటాయి. పాత  స్కూలు పథికులు కావడం చేత పైన చెప్పుకున్న సమస్యలతో బాటు ఇంకా ఎన్నో లోపాల్ని కనిపెట్టలేరు.

          చేయకూడనివి:  చిన్న తరహా సెల్ఫ్ స్టార్టర్  విధానం వైపు చూసే స్థాయి కాదు కాబట్టి, అలాగే క్లిక్ స్టార్టర్  విధానం వైపూ చూసేందుకు ఆ  స్ట్రక్చర్ కి బద్ధవ్యతిరేకం కాబట్టీ,  ఈ కిక్ స్టార్టర్ రాయల్ విధానంతో అలాటి పనులు జరగవు. అంటే ఈ విధానం జడమైనది కాబట్టి ఇతర తరగతుల్లోకి తొంగి చూసే పని ఎలాగూ వుండదు. 

          ఫలితం :  ‘సమరసింహా రెడ్డి’ దగ్గర్నుంచీ ‘శతమానం భవతి’ వరకూ హిట్ ఫ్లాప్ భారీ కమర్షియల్స్ అన్నీ.

          కర్తవ్యం :  మభ్య పెట్టడాలు వుండవు- తామే రాజీ పడడాలు వుంటుంది. స్మరించుకున్న దేవుడు కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. క్షమించమని వేడుకోవాల్సి వుంటుంది. నీ ఖర్మలే ఫో- అనేస్తాడు  దేవుడు చేతులు దులుపుకుని. 90 కి అటా ఇటా అని ఆందోళన మొదలవుతుంది.
                                                            
***
క్లిక్ స్టార్టర్  
      ఒక్క క్లిక్ తో స్క్రీన్ ప్లే అంతా  కళ్ళ ముందు పర్చుకుంటుంది  బ్లూ ప్రింట్ లా. ఇది శాస్త్రీయ స్ట్రక్చర్ సహిత విధానం. ఈ తరగతి  రచయిత వేరే తరగతి గదులవైపు, కన్నాల వైపూ చూడడు తస్కరణావకాశాల కోసం - అంత స్వావలంబనతో, ఒరిజినాలిటీతో, వృత్తితత్వంతో వుంటాడు. ఇది పాశ్చాత్య  సిడ్నీ ఆల్విన్  ఫీల్డ్ (సిడ్ ఫీల్డ్), రాబర్ట్ మెక్ కీ, జాన్ ట్రూబీ, క్రిస్ ఓల్గర్ ల వంటి ఆధునిక స్కూలు కమర్షియల్ విధానం. ‘శివ’ రచనా విధానం ఈ స్కూలుకే  చెందుతుంది. కొన్ని వందల సినిమాల్ని పరిశీలించిన అనుభవంతో స్క్రీన్ ప్లే మోడల్ కో స్ట్రక్చర్ ని ఏర్పరచారు. ఈ స్ట్రక్చర్ తో  కథలో ఏది ఎక్కడ ఎలా వుండాలో బ్లూప్రింట్ అంతా  వుంటుంది. అయితే ముందుగా కథని  అన్ని కోణాల్లో, అని విధాలా రీసెర్చి చేసుకోకుండా  ఈ విధానంలో ఒక్క సీను కూడా రాయడం సాధ్యం కాదు. ఒక్కో మెట్టులో ఐడియా, సినాప్సిస్, లైన్ ఆర్డర్ విస్పష్టంగా, నిర్దుష్టంగా వర్కౌట్ చేసుకున్నాక,  వారం  రోజుల్లో  రఫ్ కాపీ రాసెయ్యొచ్చు. 

          
ఉపయోగాలు : అవే కథలు కొత్త భాష్యం చెప్పుకుంటాయి. పైగా పాసివ్ పాత్రలు  సహా ఎలాటి లోపాలూ, బోరూ  ఇందులో చొరబడే అవకాశం వుండదు. ఇందులో స్ట్రక్చర్- క్రియేటివిటీ రెండూ విడదీయరానంతగా కలగలిసిపోయి వుంటాయి. ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ సమాన నిష్పత్తిలో పనిలోకి వస్తాయి. అంటే  తుప్పు పట్టకుండా పూర్తి బుర్ర మేకిన్ ఇండియాగా అమల్లోకి వస్తుందన్న మాట. ఇలా విమర్శనాత్మక, విశ్లేషణాత్మక, కళాత్మక  దృష్టితో స్క్రీన్ ప్లే తయారవుతుంది కాబట్టి – ఇలా రాసుకున్న కథ ఒకవేళ కాన్సెప్ట్ పరంగా ఎవరికైనా నచ్చకపోయినా,  వీడి దగ్గర విషయముందని గుర్తించే అవకాశం వుంటుంది. 

          సమస్యలు :  ఈ  విధానంలో మొట్ట మొదట ఎదురయ్యే సమస్య, నేను స్ట్రక్చరాస్యుణ్ణని రచయిత పెద్ద ఫోజు పెడితే గేట్లు ధడాల్న పడిపోవడం. కాబట్టి అఆలైనా నేర్చుకున్నట్టు తెలియకుండా మేనేజ్ చేయాలి. పాత స్కూల్లోనే నలుగుతున్నట్టు ఫీలింగ్ నివ్వాలి. ఎప్పుడూ ప్లాట్ పాయింట్, పాసివ్  క్యారక్టర్, త్రీయాక్ట్ స్ట్రక్చర్ అంటూ కొత్త స్కూలు పదాలేవీ వాడకూడదు. ఏ స్క్రీన్ ప్లే పుస్తకాలూ తీసికెళ్ళి చూపించ కూడదు, ఏ స్క్రీన్ ప్లే పండితుణ్ణీ ప్రస్తావించ కూడదు. డిస్కషన్స్ లో ఫస్ట్ టర్నింగ్, సెకండ్ టర్నింగ్, వీక్ క్యారక్టర్, పవర్ఫుల్  క్యారక్టర్ ... ఇలా సాంప్రదాయ పదకోశాన్నే వాడాలి. అవతలి వ్యక్తి  సేమ్ స్కూలైతే ఈ సమస్యలేవీ వుండవు- అదొక హనీమూన్ లా గడిచిపోతుంది. 

     ఈ విధానంలో ఇంకో సమస్య ఏమిటంటే, అంత  కచ్చితమైన కొలత లేసుకుని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుండడంతో,  కథా కథనాలు  కృతకంగా అన్పిస్తాయి. అందుకని  ప్లాట్  పాయింట్స్, పించ్ పాయింట్స్, మిడ్ పాయింట్ - వీటన్నిటినీ క్రియేటివ్ అవుట్ లుక్ తో,  స్ట్రక్చర్ వున్నట్టే అన్పించకుండా పూత పూసేయాలి. స్ట్రక్చర్ అనేది కేవలం కథని నిలబెట్టే ఆస్థి పంజరం మాత్రమే. ఈ ఆస్థి పంజరానికి క్రియేటివిటీ అనే డ్రామాతో రక్తమాంసాలద్దినప్పుడే  స్క్రీన్ ప్లే ఒక రోబోలా అన్పించకుండా, నడిచి వస్తున్న రోమన్ వీరుడులా వుంటుంది. ఉదా : ‘దంగల్’, ‘భజరంగీ భాయిజాన్’. 

          చేయకూడనివి: మూస ఫార్ములా పాత్రలూ కథనాలూ ఇందులో చేయకూడదు. అయితే సెల్ఫ్ స్టార్టర్ , కిక్ స్టార్టర్  తరగతులు  రెండూ క్లిక్ స్టార్టర్  కి ఫ్రెండ్లీ తరగతులే. అన్ని తరగతులూ ఫ్రెండ్లీ తరగతులే ఇన్ స్పైర్ అవడానికి, అప్ డేట్ అవడానికీ. కిక్ స్టార్టర్  కి కాపీ కొట్టే ఖర్మ వుండదు గాబట్టి- ఎడ్యుకేషన్ మాత్రంగా పనికి రావొచ్చు ఇతర తరగతులు. న్యూస్ ఛానెల్స్ లో కొన్ని వార్తా కథనాలు కూడా కథానికి సంబంధించిన టెక్నిక్కుల్ని అందిస్తాయి.  

          ఫలితం :  ‘శివ’, ‘మనం’, ‘క్షణం’ మొదలైనవి...

          కర్తవ్యం:  స్ట్రక్చర్ తో రాజీ పడకూడదు. స్ట్రక్చర్ పైన క్యారక్టర్ ప్లే విషయంలో పాసివ్ పాలబడనంత వరకూ పట్టువిడుపులు తప్పవు. ఇవి కూడా మరీ గాడి తప్పితే తప్పుకోవడానికే సిద్ధపడాలి. దేవుడి విషయానికొస్తే, వీడికి  (శాస్త్రీయ) జ్ఞానం వుండీ దాస్తున్నాడే అనే జాలిపడతాడు. ఇంకో చోట సెట్ చేయడానికి బిజీ అయిపోతాడు. 90 కి ఎటువైపు వుండాలన్న విషయంలో మాత్రం సొంతవ్యక్తిత్వంతో నిశ్చితాభిప్రాయంతో వుంటాడు ఈ టైపు రచయిత.


-సికిందర్

Tuesday, January 17, 2017